09-10-2024, 09:56 AM
(This post was last modified: 10-10-2024, 08:43 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇప్పుడు కళ్ళ ముందు కత్తుల వలయం ఉంది. ఆ వలయంలో అడుగుపెడితే కత్తుల మీదే నడక. ఒక్క ఘడియ అయినా అవి కత్తులు అన్న స్పృహ కలిగితే ఆ మరుక్షణమే చచ్చినట్టు లెక్క. నొప్పి తెలిస్తే నడక ఆగిపోతుంది. నొప్పి తెలిసేలోపు వలయం ఆగిపోవాలనుకున్నాడు విక్రమసింహుడు. పరుగులో వేగం కాలాన్ని సైతం ఓడిస్తుంది. విక్రమసింహుడి దగ్గర మాత్రమే ఉన్న నైపుణ్యం ఇది. అలాంటి పరుగు అతనిది. లిప్తకాలంలో జయించుకు రాగలడు. కత్తులు తోరణాలలా, బాటలలా, గోడలలా చుట్టూ ఉన్న వలయంలోకి ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో తెలియని వేగంతో పరిగెత్తాడు. సింహాలు గర్జిస్తూ వెళ్లాయి. ఏనుగులలా ఘీంకరిస్తూ బయట పడ్డాయి. కత్తుల వలయం పోయి శబ్దారావం మొదలయింది.
ధ్వని యోధుడి దృష్టిని మార్చేస్తుంది. ఈ శబ్దారావంలోకి అడుగుపెడితే మాత్రం రకరకాల భావనలు కలిగించే శబ్దాలు మార్మోగుతుంటాయి. అవి కొంతసేపు మాత్రమే. అసలైన ప్రమాదం ముందున్నది. నిషాదం మొదలయ్యిందంటే ముందు ఏడుపొస్తుంది ఆ తర్వాత బాధ ఆ తర్వాత మనో వ్యథ ఆ తర్వాత బలహీనపడిపోయి అనంతమైన విషాదంలోకి మనల్ని ఎవరో నెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. నిషాదం అనగా ఏనుగు ఘీంకారం. ఆ తర్వాత గాంధార, మధ్యమ, రిషభ, దైవత రాగాలు మొదలవుతాయి. వీటిని ఉపయోగించి ఏమైనా చెయ్యొచ్చు. అంతటి శక్తి కలిగిన సంగీతం ఉంది వీటిలో. బాధనే ఆయుధంగా చేసుకున్న ఈ శబ్దారావంలోకి ఏ బాధ లేకుండా అడుగు పెట్టాడు విక్రమసింహుడు. అన్నీ క్షణికాలే అన్న స్పృహతో ఎల్లప్పుడూ బతికే వాడు, దాన్ని బలంగా నమ్మేవాడు నిజమైన యోధుడు. ఒక యోధుడు భావోద్వేగాలకు లోనవ్వడు. వాటికి అతీతమైన వాడే. ఎన్నో దాటొచ్చిన వాడు. ఈ ధైర్యంతోనే విక్రమసింహుడు కదిలాడు.
సింహాలు కదిలాయి.
శబ్దారావం దాటేసరికి విక్రమసింహుడికి కన్నీళ్లు వచ్చేసాయి. బాధతో కడుపులో మెలి తిప్పినట్టయ్యింది. గతంలోని బాధంతా బయటికొచ్చేసింది. ఓడిపోయానేమోనని ఆగిపోయాడు అక్కడే.
సమవర్తి ప్రత్యక్షం అయ్యాడు. తలదించుకున్న విక్రమసింహుడి వైపు చూస్తూ ఇలా మాట్లాడాడు.
"బాధనెప్పుడూ జయించలేవు విక్రమా...బాధ అనేది ఎప్పుడూ మనతో ఉండిపోయే గాయమే.
కాలం మాత్రమే ఆ బాధను తీసివెయ్యగలదు. మన చేతుల్లో లేనిదది. నీ బాధకు కాలమే పరిష్కారం చూపిస్తుంది. నువ్వు ఓటమి అని దేన్నైతే అనుకుంటున్నావో అది నీలో ఉన్న బాధ మాత్రమే. బాధ కలగటం ఎప్పుడూ ఓటమి కాదు. అసలు ఓటమి అన్నదే నీకు కలగకపోతే అప్పుడు నిజంగా బాధపడాలి. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఓడిపోకుండా గెలిచిన యోధుడే లేడు. ఓటమి లేదంటే గెలుపు లేనట్టే", అనేసి అంతర్ధానం అయిపోయాడు.
జటిలలో మూసివున్న సింహ ద్వారం తెరుచుకుంది.
అంకిత, సంజయ్ అలెర్ట్ అయ్యారు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ