Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జిహ్వచాపల్యం
#10
జిహ్వచాపల్యం
రచన నీరజ హరి ప్రభల


[Image: image-2024-09-06-190048955.png]
విశ్వనాథం గారు లెక్చరర్ గా చేసి రిటైరయి భార్య జానకమ్మ తో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎప్పటి నుండో రమ్మంటున్న కొడుకు పిలుపు మేరకు తొలిసారిగా అమెరికాకు పయనమయారు విశ్వనాధం దంపతులు. అక్కడ ఎయిర్ పోర్టుకు కొడుకు రవి, కోడలు సుథ వీళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళారు. స్నాన పాన భోజన కార్యక్రమాలయ్యాక వాళ్ళకోసం తెచ్చిన బట్టలు, వస్తువులు, పచ్చళ్ళు మొ.. వాళ్ళకు ఇచ్చి ప్రయాణ బడలిక తో విశ్రాంతి తీసుకున్నారు విశ్వనాథం దంపతులు. 



సుధ సాయంత్రం అత్తగారికి వంట ఇంటి సరుకులు ఎక్కడ, ఏమున్నాయో చూపించి, స్టవ్, ఒవెన్, ఎలా వాడాలో వివరించింది. వీళ్ళకోసం ఆరోగ్యానికి మంచిదని బ్రౌన్ రైస్ తెప్పించింది సుధ. మరుసటి రోజు ఉదయమే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తిని యథావిధిగా రవి, సుథలు ఆఫీసులకు వెళ్ళారు. జానకమ్మ ఉప్మా చేసి భర్తకు పెట్టి తనూ తిని, వంటచేసే కార్యక్రమంలో పడింది. భోజనాలయ్యాక తెలుగు టీవీ ఛానెల్స్ లో ఏవో ప్రోగ్రామ్ లు చూస్తూ పొద్దు గడిపి సాయంత్రం రవి వాళ్ళు రాగానే వాళ్ళతో కబుర్లలో పడ్డారు. 



జెట్ లాగ్ తో రెండు రోజు లు ఇట్టే గడిచాయి. విశ్వనాథం గారికి ఏమీ తోచక, చేసే పని ఏమీ లేక, ఇరుగుపొరుగు మాట్లాడే వాళ్ళు లేక బోర్ కొట్టటం మొదలయింది. 
"తన ఊరిలో అయితే సాయంత్రం అరుగుల మీద ఇరుగుపొరుగుతో చేరి పిచ్చాపాటి కబుర్లు, లోకాభి రామాయణం తో హాయిగా గడిపేవాణ్ణి" అనుకోసాగాడు. వీకెండ్స్ కు వీళ్ళని బయటకు తీసుకెళ్లి అమెరికా చూపించేవాళ్ళు రవివాళ్ళు. 



రవి, సుధ ఆరోగ్య సూత్రాలు ఎక్కువ పాటిస్తారు. రోజూ కూరగాయల ముక్కలు, బ్రొకోలీ ఆకులు, బ్రెడ్, సూప్స్, సలాడ్స్, పాలు, పళ్ళు, జ్యూస్ లు తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ గా వీళ్ళకు కూడా అదే. జానకమ్మ వంట వీళ్ళిద్దరికే. స్వీట్లు, జంతికలూ, కారప్పూస లాంటి చిరుతిళ్ళు తినటం విశ్వనాథంకు అలవాటు. ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో పంటికింద నలుగుతూ ఉండాలి. ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్, చిరుతిళ్ళు చాటుగా దాచుకుని తినేవాడు. అవి అయిపోయాయి. ఇహ భార్యను పిండి వంటలు చేయమని సణుగుతూనే ఉన్నాడు. 



పాపం ఆవిడ కోడలితో చెపితే 'పిండి వంటలు అనారోగ్యము' అని డ్రైఫ్రూట్సు తెప్పించింది సుధ. విశ్వనాథానికి అవి ఏమూలకూ ఆనేవి కావు. జిహ్వ చాపల్యం ఎక్కువ. కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తుంటే అందరూ నిద్రలోకి జారాక నెమ్మదిగా అర్థరాత్రి కిచెన్ లో డబ్బాలు వెతుక్కుని తినేవాడు. భర్త ప్రవర్తనకు జానకమ్మ సిగ్గుతో కుంచించుకు పోతూ కోడలికంట ఎక్కడ పడుతుందో అని భయపడేది. 



కిచెన్ లో ఏదో అలికిడి అయితే సుధ కిచెన్ లోకి రాగానే మామగారు డబ్బాలు వెతుక్కుని తింటున్న ద్రృశ్యం కంటబడి ఇంతవయస్సు వచ్చినా ఈయనకు ఇంకా జిహ్వచాపల్యం ఏమిటి? అనుకుని విషయం మరునాడు రవితో చెప్పింది. 



"నాన్నా! పరిమితమయిన డైట్ ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ ఏదన్నా అనారోగ్యం వస్తే మెడికల్ వసతి ఉండదు. ట్రీట్మెంట్ చాలా ఖరీదు. పైగా ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా వెంటనే చూడరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి" అని పెద్ద లెక్చలిచ్చాడు రవి తండ్రికి. అలా చెప్పటం విశ్వనాథానికి అవమానకరంగా అనిపించింది. అప్పుడు ఏమీ అనలేక మిన్నకున్నాడు. 



మర్నాడు వాళ్లు ఆఫీసుకి వెళ్ళాక "రాను, రాను అంటే నువ్వే అమెరికా, అమెరికా అంటూ ఎగేసుకుంటూ బయలుదేర దీశావు. నీతో పాటు నన్ను కూడా రమ్మని ప్రాణం తీశావు చూడు, ఇప్పుడేమయ్యిందో, ఇదంతా నీ వలననే" అని భార్య మీద విరుచుకుపడ్డాడు. భార్యే కదా లోకువ. 



"బావుంది ఇది మరీ చోద్యం. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు తప్పు మీ వద్ద ఉంచుకుని నన్ను అంటారెందుకు? అయినా రవి చెప్పిన దాంట్లో తప్పేముంది? మీ మంచికే కదా వాడు చెప్పింది. మీ తిండి యావ తగ్గించుకోవచ్చుగా. కోడలి పిల్ల ముందు సిగ్గుతో చస్తున్నాను" అంది జానకమ్మ. 



"ఇంక ఇక్కడ ఇలా కడుపు మాడ్చుకుంటూ బ్రౌన్ రైస్, బ్రెడ్, ఆకులూ, అలాలూ, కీరాలు, డ్రైఫ్రూట్సు తింటూ, మాట్లాడే వాళ్లు లేక జైలులో ఉండలేను. రవితో ఏదో సాకు చెప్పి టికెట్ మార్చుకుని వెళతాను. నీవు వస్తే రా. లేకపోతే ఇంకా నాలుగు నెలలు ఇక్కడే ఊరేగు" అన్నాడు విశ్వనాథం



ఒకరోజున రవితో "ఒంట్లో కొంచెం నలతగా ఉంది. ఇంటి మీద బెంగ గా ఉంది. ఇండియాకు వెళ్తామురా" అని రవిని అతికష్టం మీద ఒప్పించి బయలు దేరారు విశ్వనాథం గారు. ప్రయాణం ఇష్టం లేక పోయినా భర్త వెంట బయలు దేరింది జానకమ్మ. 



తన ఊరిని, తన ఇల్లును చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయి ఇల్లంతా చిన్న పిల్లాడిలా తిరిగాడు విశ్వనాథం. వీళ్ళు వచ్చారని గమనించి ప్రక్కింటి పార్వతమ్మ వచ్చి "ఏం వదినా! అమెరికా వెళ్ళి ఆర్నెల్లు ఉంటానని అప్పుడే రెండు నెలలకే వచ్చేశారేం? అని అడిగింది. 



" ఏం లేదు వదినా! నీకు తెలుసుగా. ఇల్లన్నా, ఊరన్నా, మాకెంత ప్రాణమో! ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇంటి మీద బెంగ వచ్చి రవి వాళ్ళను ఒప్పించి బయలుదేరి వచ్చేశాము" అన్న భార్య సమయస్ఫూర్తి మాటలను విని మనసులో మెచ్చుకుంటూ, పేపరు చదువు కుంటున్న విశ్వనాథం గారు నవ్వుతూ, భార్య తన నవ్వును ఎక్కడ పసిగడుతుందోనని గుబురు మీసాల చాటున దాచే ప్రయత్నం జానకమ్మ దృష్టిని దాటిపోలేదు. 



"ఎంతైనా మగమహారాజు. భార్యను అంత తేలికగా మెచ్చుకోరు " అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది జానకమ్మ. 



.. సమాప్తం .. 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
జిహ్వచాపల్యం - by k3vv3 - 07-08-2024, 12:08 PM
RE: అచ్చిరాని అతితెలివి - by k3vv3 - 06-09-2024, 07:02 PM



Users browsing this thread: 2 Guest(s)