Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - ప్రాప్తం
#3
చూపు - డా. ఎం. హరికిషన్
[Image: image-2024-08-19-182537330.png]
క్యారియరు బ్యాగు భుజానికి తగిలించుకొని ఎయిట్ సీటర్ ఆటోలో డ్రైవరు పక్కన ముందు సీటులో కష్టపడి సర్దుకున్నా. వెనిక సీట్లన్నీ లేడీ స్టాఫ్ తో నిండిపోయి ఉన్నాయి. ఆటో దడదడదడ శబ్దం చేస్తూ ముందుకు పోసాగింది. కూర్చోవడం కష్టంగా ఉంది. ఒక్క డ్రైవర్ మాత్రమే కూర్చునే సీట్లో నలుగురుం ఇరుకున్నాం.

దాదాపు ప్రతిరోజు ఇలాగే గంట ప్రయాణం చేయాలి. బస్సెక్కితే మెయిన్ రోడ్డు మీద దించెళతాది. అక్కణ్ణించి ఊరు చేరడానికి మూడు కిలోమీటర్లు మట్టిరోడ్డు మీద నడిచి వెళ్ళాలి. ఇది చాతగాకపోతే ఆటోనే గతి. ఆ దడదడలలోనే ఆటోలోని తెప్ రికార్డు 'ఓలమ్మీ తిక్కరేగిందా... ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా' అంటూ తన శక్తినంతా ప్రయోగిస్తూ ప్రయాణీకులను మైమరపించడానికి ప్రయత్నిస్తుంది. ఎదురుగా వాహనాలు వస్తున్నాయి. బస్సులు, జీపులు, లారీలు, ఆటోలు, కార్లు దూసుకుపోతున్నాయి. వెనకనుంచి ఎర్రటికారు మమ్మల్ని దాటుకుంటూ ముందుకు పోయింది.

దానిని చూడగానే మా తమ్ముడి కారు కళ్ళముందు మెదిలింది. మళ్ళీ మనసంతా అవే ఆలోచనలు. వద్దనుకున్నా కమ్ముకుంటూ...

వారం రోజులుగా ఎవరికీ చెప్పుకోలేక, లోలోపలే కుమిలిపోతూ, వాడితో నన్ను పోల్చుకుంటూ, గిల్టీగా ఫీలవుతూ, నా అశక్తతను గుర్తుచేసుకుంటూ మనసుని అదుపులో ఉంచుకోలేక పడుతున్న బాధ... ఎవరి మీద చూపించాలో తెలీని కోపం... అసహనం.

తమ్ముడి కొడుకు మొదటి పుట్టినరోజుకి హైదరాబాదుకి పోయినప్పటి సంఘటనలన్నీ వద్దనుకున్నా పదేపదే గుర్తుకురాసాగాయి.

-----------

"అన్నా... ఎలా ఉన్నాయి అరేంజ్ మెంట్స్" అన్నాడు కిరణ్ హోటల్ కింద ఫ్లోర్ లో ఉన్న రెస్టారెంట్లో ఫంక్షన్ ఏర్పాట్లను చూపిస్తూ.

"బాగున్నాయిరా... మీల్సెంత?" చుట్టూ చూస్తూ అడిగాను. "ప్లేట్ టూట్వంటీ రూపీస్. డ్రింక్స్ సపరేట్."

"ఎక్కువ కదరా."

"సిటీలో అంతేన్నా. అదీగాక ఐటమ్స్ ఫిష్ నుండి కూల్ డ్రింక్స్ వరకూ దాదాపు ఫార్టీ వెరైటీలు ఉన్నాయి కదా."

"ఎంతమంది రావచ్చు."

"దాదాపు ఒన్ ఫిఫ్టీదాకా ఎక్స్ పెక్ట్ చేస్తున్నా."

"స్థలం సరిపోతుందా" చుట్టూ పరిశీలిస్తూ అడిగాను.

"సరిపోతాదిలే. అదీగాక అందరూ ఒకేసారి రారుగదా. వచ్చేవారు వస్తుంటారు. డిన్నర్ చేసి పోయేవారు పోతుంటారు."

"అంతేలే... తొందరగా రావాలన్నా ఈ ట్రాఫిక్ జాముల్లో ఎవరు ఎప్పుడొస్తారో" నవ్వుతూ అన్నాను.

"అన్నా... మనవాళ్ళు ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకుంటుండు. మా కొలీగ్స్ ఇంకా రాలేదు. ఎక్కడున్నారో కనుక్కుంటా. వస్తూనే మొదలుపెడదాం."

కిరణ్ గేటువైపు కదిలాడు.

నేను చివరలో ఒక చోట కూర్చుని చూడసాగాను.

పచ్చటి మెత్తని లాన్ మధ్యలో చిన్న స్టేజ్. స్టేజి మీద అమర్చిన టేబుల్ పైన ఎర్రటి వెల్వెట్ క్లాత్. దానిపై పెద్ద కేక్. ఆ కేక్ పైన "హ్యాపీ బర్త్ డే అఖిల్" అనే అక్షరాలు. కేక్ మధ్యలో అంటించడానికి సిద్ధంగా ఉన్న కొవ్వొత్తి. పక్కన పిల్లలకు పంచడానికి తెచ్చిన క్యాట్ బరీ చాక్లెట్లు, చిన్న చిన్న బహుమతులు.

స్టేజ్ ముందు వరుసగా మెత్తని కుర్చీలు వేయబడి ఉన్నాయి. కుడివైపు డిన్నర్ కి ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, డ్రింక్స్... అన్నీ ప్రత్యేక కౌంటర్లలో. ఒకదాని పక్కన ఒకటి ఎదురుచూస్తూ ఉన్నాయి.

ఆహుతుల్లో చాలామంది ఖరీదయిన కార్లలో వస్తున్నారు. దాదాపు అందరిదీ ఒకే వయసు. ఇరవై అయిదు, ముఫ్ఫై అయిదు మధ్యలో ఉన్నారు. విలువైన బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల్లో, బంగారు చైన్లు, ఉంగరాలు, బ్రాస్ లెట్స్ వేసుకుని, ఖరీదైన సెల్ ఫోన్లు చేతుల్లో పట్టుకుని 'హాయ్ హాయ్' అంటూ పలకరించుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు.

వాళ్ళందర్నీ పరిశీలనగా చూస్తుండగానే నా భార్య వచ్చింది.

"గిఫ్ట్ ఇస్తావా..."

జేబులోంచి బంగారు గొలుసున్న చిన్న ఫ్లాస్టిక్ డబ్బా తీసి అందించాను.

"ఇచ్చేటప్పుడు పిలుస్తాను. రా..." అంది.

"ఫరవాలేదులే. నువ్విచ్చేయ్" అన్నాను.

నా భార్య దాన్ని హ్యాండ్ బ్యాగ్ లో భద్రపరచుకుంటూ కోపంగా చూసి వెళ్ళిపోయింది.

అంతకు ముందు మూడు రోజుల కిందట, ఆ గొలుసు కోసం చిన్న గొడవ జరిగింది.

"నీకేమి మొగోనివి. తోడికోడలి ముందు, వాళ్ళ బంధువుల ముందు తలదించుకోవాల్సిందీ, మాటపడాల్సిందీ నేనే. మొన్న పాప నామకారణానికి ఇంతలావు గొలుసు మెడలో వేసినాడు. అంతకుముందు బాబు పుట్టెంట్రుకలు తీసినపుడు పదివేలు వాని చేతిలో పెట్టినాడు. దానికితోడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఖరీదయినవి పిల్లలకి తెచ్చిస్తూనే ఉన్నాడు. తోసుకోవడమే గాదు ఇవ్వడం కూడా ఉండాల. లేదంటే అలుసయిపోతాం..."

"అదికాదే... వాడంటే సాఫ్ట్ వేర్ ఇంజనీరు. వానికీ మనకూ పోలికా... మరో రెండు నెలల్లో చిన్నదాన్ని బళ్ళో వేయడానికి డొనేషన్ కావాలి. ఇప్పుడు ఖరీదయినవంటే కష్టంగదా. ఏదయినా ఒక బొమ్మనో, బట్టనో పెడ్తే సరిపోదూ... వాడు ఏమీ అనుకోడులే."

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - by k3vv3 - 19-08-2024, 06:26 PM



Users browsing this thread: 4 Guest(s)