07-08-2024, 12:08 PM
(This post was last modified: 06-09-2024, 07:05 PM by k3vv3. Edited 4 times in total. Edited 4 times in total.)
పద్మనాభం - పదవీ ‘త్యాగం’
చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
పద్మనాభం ఓ మోస్తరు ప్రభుత్వాధికారి. ఒక రోజు పొద్దున్నలేస్తూనే అతడన్న మాటకి చప్పున క్యాలెండర్ వేపు చూసింది శ్రీలక్ష్మి. ''ఇవ్వాళ ఏప్రిల్ ఒకటి అని చూస్తున్నావేమో.. సీరియస్ గానే చెప్తున్నాను. ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నాను', చివరి మాటగా మళ్ళీ చెప్పాడు పద్మనాభం.
''చేసేసి..'', ప్రశ్నర్ధకంగా చూసింది శ్రీలక్ష్మి.
సమాధానం లేక మొహం చిన్నబుచ్చుకున్నాడు పద్మనాభం.
''ఉన్న ఉద్యోగం వదిలేసి వెంటనే మరోచోట వెతుక్కోటానికి మీరేం సాఫ్ట్ వేర్ వాళ్ళు కాదు. ఆర్ట్స్ డిగ్రీ గాళ్ళు. ఏదో ప్రభుత్వ ఉద్యోగం ఉందని మా నాన్న మీకు కట్టబెట్టారు. ఈ ఉద్యోగం మానేస్తే మీరు హాయిగా రోడ్ల వెంబడి తిరుగుదురు గాని... మరి నేనూ, మనవాడూ ఏమైపోవాలి?” అంది. అటుపక్క మౌనం జవాబయ్యింది. “మీ వెర్రి మొర్రి ఆలోచనలూ మీరూనూ.. ఉండండి అవతల బోల్డు పనుంది. పిల్లాడిని కాలేజ్‌కి పంపించాలి..'' అతడి బాధేమిటో పట్టించుకోకుండానే వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి.
గంట తరువాత తయారయ్యి వచ్చి నీరసంగా టిఫిన్ దగ్గర కూర్చున్నాడు పద్మనాభం. టిఫిన్ పెడుతూ అతడి వాలకం చూసి ''ఏవిఁటి నిజంగానే అంటున్నారా..'', అడిగింది శ్రీలక్ష్మి.
''అసలు ఆదిశంకరుల వారు ఏం చెప్పారు?'' తన ధోరణిలో అన్నాడు పద్మనాభం.
''ఏ విషయంలో..'', తికమకగా అంది శ్రీలక్ష్మి.
''కంపెనీ గురించి'', అన్నాడు పద్మనాభం.
''ఆ రోజుల్లో కంపెనీలు గట్రా లేవు కదండీ'', మరింత తికమక పడుతూ అంది శ్రీలక్ష్మి.
''’సత్సంగత్వే నిస్సంగత్వం’ అనలేదూ'', అన్నాడు పద్మనాభం.
''అర్ధమయ్యేట్టు చెప్పండి',' అంది శ్రీలక్ష్మి.
''ఆఫీసులో అంతా పొగరుబోతులు, లేదా లంచగొండి గాళ్ళు. మొదటి రకం వాళ్ళకి పని చేతకాదు కానీ మిడిసిపాటు ఎక్కువ. సెలెబ్రెటీల్లాగా ఆటోగ్రాఫ్ లు చేసి జీతాలు తీసుకునే రకాలు. దేనికి ఎవరి అప్రూవల్ కావాలో ఒక్కడికీ కోట్ చెయ్యడం తెలీదు. ప్రజాధనం దుర్వినియోగం చెయ్యబడుతున్నా ఎవ్వడికీ లెక్కలేదు. అలాంటి వాళ్ళతో గడిపితే మోక్షం ఎలా వస్తుంది. అందుకే సత్సాంగత్యం కోసం..'' పద్మనాభం పూర్తి చేయకుండానే శ్రీలక్ష్మి అందుకుంటూ, "ఉద్యోగానికి రాజీనామా చేసి సన్యాసుల్లో కలుస్తానంటారు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీ నాన్న మీకు ‘సన్యాసిరావు’ అని పేరు పెట్టాల్సింది. గడ్డి తినటం ఎటూ రాదు. బుద్దిగా ఉద్యోగం చేసుకోమని దేవుడు ఓ దారి చూపిస్తే మీరు చేసే నిర్వాకం ఇదా.. దీనికి మీరన్న ఆదిశంకరులు కూడా హర్షించరు'', అని బుజ్జగించి ఆఫీసుకి పంపింది శ్రీలక్ష్మి.
*** ఆఫీసులో పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది పద్మనాభంకి. ఎప్పుడూ సిన్సియర్ అని పేరుండే అతడు ఆ రోజు పనిని మందకోడిగా చెయ్యడం ఆఫీసు మొత్తం గమనించింది. అతని పై ఆఫీసర్ సంగతి కనుక్కుందామని పిలిచాడు. పద్మనాభం మాత్రం గంభీరంగా మొహం పెట్టుకుని, తనయోచనని బహిర్గతం చేశాడు. పై ఆఫీసర్ వెంటనే కంగారు పడిపోయి, టేబుల్ కి ఇటు పక్కకి వచ్చి, పద్మనాభంని ఓదార్చే నిమిత్తం భుజం మీద చెయ్యి వేసి, “ఎలాంటి ఆలోచన చేస్తున్నారు పద్మనాభం గారూ! ఆ పని వెంటనే మానేస్తే మంచిది”, అన్నాడు. తనని, తన ముక్కు సూటి పద్ధతిని ఇష్టపడేవాడున్నాడని సంతోషించబోయాడు పద్మనాభం. కానీ, ఆఫీసర్, “మీలాంటి ‘గడ్డివాము కాడి కుక్క’లుండబట్టే నాలాంటి వాళ్ళకి గీతం ఎక్కువొస్తోందండోయ్. మీరు ఉద్యోగం మానేస్తే ఎలా?” అన్నాడు.
పద్మనాభం అవాక్కయ్యాడు. ‘గడ్డి వాము కాడి కుక్క- అంటే ఆఫీసర్ తనని మెచ్చుకుంటున్నాడా, తిడుతున్నాడా?’ అని ఆలోచిస్తున్న అతని సందిగ్ధాన్ని దూరం చేస్తూ, “అదేనండీ, మీలాంటి వాళ్ళు మా కింద ఉంటే, మాకో ప్రయోజనం ఉంటుంది. నన్ను ఎవరైనా ఫేవర్ అడిగితే, ‘నా కింది ఆఫీసర్ చాలా ముక్కుసూటి మనిషి, ఆయన్ని ఒప్పించడానికి ఎక్కువ శ్రమపడాలి. అందుకని ఎక్కువ ఖర్చౌద్ది’, అని నా వసూళ్లు పెంచుకోవచ్చు. మీరిప్పుడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోతానంటే ఎలా? మీ రిలీవర్ మీబోటివాడు కాకపోతే నా కలెక్షన్లు పడతాయ్”, అంటూ, పద్మనాభం చేతులు పట్టుకుని, “బాబ్బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి.... ఇద్దరాడపిల్లల తండ్రిని. ఈ రోజుల్లో తలమాసిన వెధవలే బోలెడంత కట్నమడుగుతున్నారు. మంచి సంబంధం తేవాలంటే ఖర్చెక్కువ. ఉండండి బాబూ, మీ రాజీనామా ఐడియాని గాలికొదిలేయ్యండి. పైగా, ఇంకో రెండేళ్ళలో నాకు రిటైర్మెంటు కూడా”, అన్నాడు.
పద్మనాభానికి మండిపోయింది. తాను నిజాయితీగా ఉంటూ, తన కింద వారిని నిజాయితీపరులుగా ఉండమని ప్రోత్సహిస్తూ వుంటే, తన పై ఆఫీసర్ దాన్ని తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. ఏది ఏమైనా సరే, మంచి రోజు చూసుకుని రాజీనామా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాడు.
**************** “ఏవండీ! మీ ఆఫీసులో రాజీనామా కబుర్లేమైనా చెప్పారా?” మర్నాడు సాయంత్రం ఇంటికి వెళ్ళీ వెళ్ళకుండానే శ్రీలక్ష్మి కోపపు మాట.
“నిన్న మా పై ఆఫీసర్ కి చెప్పాను. ఏం జరిగింది?” అడిగాడు.
“ఇవ్వాళ మా కిట్టీలో వాళ్ళావిడ నన్ను కించపరిచింది. ‘భగవంతుడు పూర్వ జన్మ సుకృతం వల్ల సర్కారీ ఉద్యోగం ప్రసాదిస్తే, దాన్ని తట్టుకోలేక విడిచిపెట్టే పిరికిపంద’, అని మిమ్మల్ని పరోక్షంగా వెక్కిరించింది. లేడీస్ లో నా పరువు మీ వల్ల పోయేటట్టుంది. మీ ఐడియా వదులుకోండి బాబూ”, అని ఎప్పుడూ లేనిది, చేతులెత్తి నమస్కరించింది.
పద్మనాభం షాక్ తిన్నాడు. పదవీత్యాగం చేద్దామనుకుంటే వీళ్ళు తనకి పిరికిపందీయం అంటగడుతున్నారేమిటో! “నేను ఇప్పుడు ఇంటికొచ్చే ముందు రాజీనామాకి మూడు నెల్ల నోటీసిచ్చాను”, అనే సరికి శ్రీలక్ష్మి తోకతొక్కిన తాచులా చాలా సేపు బుసగొడుతూ, ఆడిపోసుకుంటూ గడిపేసింది. డిన్నర్ వడ్డించేటపుడు భర్తని ముష్టివాడికన్నా నీచంగా చూసింది. అదే సమయంలో పుండు మీద కారం జల్లినట్టు, ఏదో పాటలోని చరణం, ‘పవరు పోయాక పాలేరైనా పలకరించడురా నిన్ను..’ అన్న మాటలు ఆలపించింది. విసుగ్గా టేబుల్ నుంచి లేచి లోపలికెళ్ళాడు పద్మనాభం.
*** ఆ పై నెల పద్మనాభం ఆఫీసులో ఒకాయన రిటైరయ్యారు. ఆ విందులో తరువాత విందు ఎవరిదీ అన్న చర్చ మొదలైంది. పద్మనాభం ఆ గుంపులో లేడు గనుక వాళ్ళలో వాళ్ళు, “ఇంకెవరిది? మన సన్నాసి గారిది”, అని ఒకరంటే, “హుష్... ఇటొస్తే ఈ మాట ఆయన చెవిని పడచ్చు. కానీ, మీరన్నది రైటే. బంగారంలాంటి ఉద్యోగం వదులుకుంటారా? అలాంటి ఆయన్ని సన్నాసి అనడమే సబబు”, అని మరొకరన్నారు.
ఈ మాట ఆ నోటా, ఈ నోటా పద్మనాభం చెవిన పడ్డాయి. ఇక చూడాలి, పద్మనాభం తెగ మథన పడిపోయాడు. తను త్యాగం అనుకుని గొప్పగా ఫీల్ అవుతున్న విషయాన్ని మిగిలిన వాళ్ళు చేతకానితనం లాగ అనుకుని, తనని పనికిమాలినవాడిలా చులకన చేస్తున్నారు. ఎంతటి అవమానం! త్యాగాన్ని, దానికి కావలసిన ధైర్యాన్ని మెచ్చుకునే రోజులు కావివి!
ఏది ఏమైనా, తను చేయబోయిన త్యాగాన్ని అందరూ తూలనాడుతుంటే పాపం, పద్మనాభం డీలా పడిపోయాడు. తను ఎందుకు ఆ త్యాగం చేస్తున్నాడో మరచిపోయి, తను చేస్తున్న ఘనకార్యాన్ని ఎవరూ గుర్తించనందుకు తెగ బాధ పడిపోయాడు. కంటి నిండా కునుకు లేక, నోటినిండా తిండి సహించక రోగిలా తయారయ్యాడు.
*** ఇలాగే మరో నెల గడిచింది. అప్పుడే చాతుర్మాస్యం ముగించుకుని తన ఆధ్యాత్మిక గురువు, బుద్బుదానంద స్వాములవారు, వాళ్ళ ఊరికొచ్చారు. తన గోడు చెప్పుకుందామని వెళ్ళి కలిసి భోరుమన్నాడు పద్మనాభం. ఆయనంతా విని, “ఓరి బాలకా, నీలో ఇంత స్వార్థం దాగుందని నేనెరుగలేదే! నువ్వు నా శిష్యుడనిపించుకునే అర్హత కోల్పోయావు”, అన్నారు. ముందు ఖంగుతిన్నా, వెంటనే ఆయన కాళ్ళ మీద పడి, తన తప్పేమిటో విశదీకరించమని కోరాడు పద్మనాభం.
“చూడు నాయనా! నువ్వు ప్రభుత్వాధికారివి అయిన వెంటనే నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకునే హక్కు కోల్పోతావు. ఇంతకీ, నిజాయితీగానే పని చేస్తున్నావు కదూ?” అని అడిగారు. “సర్వజ్ఞులు, తమకు తెలియనిదేముంది?” అన్నాడు పద్మనాభం.
స్వాములవారు కాస్సేపు అలోచించి, “నాకు తెలుసు, నువ్వు నిజాయితీపరుడివని. నిన్ను పరీక్షించానంతే! కానీ నీ విషయమే నీకు తెలియటం లేదు. నీకు దేవుడిచ్చిన తెలివితేటలు ప్రజల సేవ చేసే నిమిత్తం ఓ పదవిని దక్కించాయి. దాన్ని వదిలేస్తే, ఆ దైవాన్ని, నీ తెలివిని తిరస్కరించి, ధిక్కరించి, కించపరచినట్టే కదూ”, అన్నారు. ఆలోచిస్తూ తలూపాడు పద్మనాభం.
“రెండవ విషయం- అవినీతి పెరిగిపోతున్న ఈ రోజుల్లో నువ్వు పదవీత్యాగం చేస్తే, ఒక నిజాయితీపరుడు పోయి, ఒక లంచగొండి పదవిలోకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందుకని, నువ్వు త్యాగమే గనుక చెయ్యదలచుకుంటే, నీ భావోద్వేగాలను త్యాగం చేసి, ఎన్ని కష్టాలొచ్చినా బాధపడకుండా, నిజాయితీని వదులుకోకుండా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకు. అదే నువ్వు లోకానికి చేసే పెద్ద త్యాగం అవుతుంది”, అని సెలవిచ్చారు స్వాములవారు.
*** ఇవ్విధంబుగా పదవీ త్యాగమునకు నిజమైన అర్థమును తెలుసుకున్న పద్మనాభం, మరుసటి రోజే తన రాజీనామాపై రాజీపడి, రాజీనామా పత్రమును ఉపసంహరించుకున్నాడు. ఇది జరిగిన ఆరు నెలలకి కరోనా వ్యాధి ప్రబలింది. ఎక్కువ మండి వ్యాధిగ్రస్తులున్న జిల్లాకి అతణ్ణి వ్యాధి నిరోధకాధికారిగా పోస్ట్ చేశారు ప్రభుత్వం వారు. కేరళలోని తన స్నేహితుడి సహాయం వల్ల అక్కడ ఎలాంటి నిరోధక చర్యలు తీసుకోబడ్డాయో, ఆ జిల్లాలో అదే పని చేశాడు పద్మనాభం.
అంతే! రెండే రెండు వారాల్లో వాళ్ళ జిల్లా కోవిడ్ రేఖలోని గూనిని పోగొట్టి, ఇంచుమించు సరళ రేఖలా తయారు చేశాడు. ఇంకేముంది, మరి కొద్ది రోజుల్లో రాష్ట్రనికే కోవిడ్ నివారణాధికారిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ మహమ్మారిని పోగొట్టేది మందులకన్నా వ్యాధి నిరోధక శక్తి అని తనకి తెలుసు కనుక మంచి నాణ్యత ఉన్న మందులు తెప్పించి పేదలకి, శక్తి హీనులకి ఇప్పించాడు. డాక్టర్లకి మంచి పిపిఈలు కొనిపించాడు.
ప్రజల్లో క్రమశిక్షణ అలవరచి, సామాజిక ఎడం పాటించడంలో రాష్ట్రం ఉన్నతంగా ఉండేటట్టు చూసుకున్నాడు. 2021వ సంవత్సరంలో ‘ఉత్తమ కోవిడ్ నిరోధకాధికారి’ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. అనుకోకుండా ఓ రెండేళ్ళ క్రితం తనకు వచ్చిన ‘త్యాగ’పు ఆలోచన గిర్తొచ్చి, తన ముఖం మీద చిరునవ్వు తెచ్చిపెట్టింది.
గురువు గారు చెప్పిన మాటలు అప్పుడు అర్థమైనట్టున్నా, దేవుడు తన ద్వారా తలపెట్టిన సత్కార్యాలకి అడ్డు తగులకూడదని గుర్తించిన పద్మనాభం, ఎన్ని కష్టములెదురైనను, చిరునవ్వుతోనూ, నిజాయితీతోను ఉద్యోగమును చేయుచూ ఆనందముగా బ్రతుకనెంచి, తన జన్మను సార్థకము చేసికొనెను.
************
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ