Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పెళ్ళాం ఎప్పుడు వస్తుందో..
#1
పెళ్ళాం ఎప్పుడు వస్తుందో..
రచనతాత మోహనకృష్ణ
 



జీవితంలో పెళ్ళి అనేది అందరికీ చాలా అందమైన కల. అంతే కాదు, తొందరగా పెళ్ళి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి, హ్యాపీ గా ఉండాలని అందరికీ ఉంటుంది. వచ్చే పెళ్ళాం, అందంగా ఉండాలని మొక్కని దేవుడు ఉండడేమో! ఇదే నా కోరిక కూడా.. 



నా పేరు భాస్కర్. మా అమ్మ నాన్నలకు ఒక్కడినే. మా అమ్మ హౌస్ వైఫ్ అండ్ నాన్న రిటైర్డ్ కాలేజ్ మాస్టర్. మా నాన్న కు ఉద్యోగం తొందరగా రావడం.. నాకు ఇంకా పెళ్ళి కాకపోవడం చేత.. నా పెళ్ళి కన్నా, మా నాన్న రిటైర్మెంట్ తొందరగా వచ్చేసింది. నా కన్నా.. మా అమ్మకే తనకు రాబోయే కోడలు అందంగా ఉండాలని ఎక్కువ కోరిక. కట్నం మాత్రం మస్ట్!



"ఏమండీ! అబ్బాయికి పాతిక సంవత్సరాలు నిండాయి. వాడికి ఉద్యోగం కుడా ఉంది.. "



"అయితే.. ఏమంటావు జానకి.. ?"



"పెళ్ళి చేసెద్దాం.. ఇప్పటినుంచే పెళ్ళి సంబంధాలు చూడండి.. "



"ఇప్పటినుంచి ఎందుకు? ఇంకా చిన్నవాడే కదా.. నాకే ముప్పై కి పెళ్లైంది.. "



ముప్పై కి నాకు పెళ్ళి సంబంధాల వేట మొదలు పెట్టాడు తండ్రి రామారావు. ఇలాగ, ఇంకో పది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నా వయసు నలభై దాటుతోంది.. ఇంకా పెళ్ళి కాలేదు.. 



మర్నాడు.. ఇంటికి మ్యారేజ్ బ్రోకర్ వచ్చాడు. 



"ఇప్పటికి.. మీ అబ్బాయి డబుల్ సెంచరీ కుడా చేసాడు.. అన్నిపెళ్ళిసంబంధాలు చూపించాను మరి! మీకు ఏదీ నచ్చలేదు. నాకేమీ అర్ధం కావట్లేదు.. కొన్ని మీ అబ్బాయికి నచ్చలేదు, కొన్నేమో.. అమ్మగారికి నచ్చలేదు. ప్రతి సంవత్సరం మీరు మాకు ఫీజు అయితే కడుతున్నారు.. కానీ ఇంక మా దగ్గర చూపించడానికి.. మీ అబ్బాయికి తగ్గ సంబంధాలు లేవు. ఇంక పెళ్ళిసంబంధాలు రావడం కుడా కష్టమే!.. ఆలోచించుకోండి. ఇంక నేను ఉంటాను.. మీ అబ్బాయి తొందరగా ఒక ఇంటివాడు అవ్వాలని కోరుకుంటూ.. సెలవు తీసుకుంటున్నాను.. " అన్నాడు మ్యారేజ్ బ్రోకర్



ఇదండీ.. నా పరిస్థితి.. 



ఇప్పటివరకు ఆ మ్యారేజ్ బ్రోకర్.. పాపం రెండు వందల పెళ్ళిసంబంధాలు తెచ్చాడు. అందులో ఎక్కువ గా నేనే అమ్మాయికి నచ్చలేదు. అమ్మాయిలు తక్కువగా ఉండడం ఒక కారణం. మొదట్లో.. కొంచం బెటర్.. కొంత మంది ఒప్పుకున్నారు.. నాకో, మా అమ్మకో అమ్మాయి నచ్చేది కాదు. అందం ఉంటే, చదువు లేదు.. రెండు ఉంటే, కట్నం రాదు.. దానికి మా అమ్మ ఒప్పుకోదు. ఇప్పుడైతే.. అసలు అంతా కరువే!



మొన్నటికి మొన్న పెళ్ళిచూపులలో అమ్మాయి తో విడిగా మాట్లాడుతుంటే, నెలకు మీకు వచ్చే జీతం మనకి ఏం సరిపోతుంది?.. నా కన్నీ హై కోరికలు ఉన్నాయి.. కనీసం నెలకు ఒక రెండు లక్షలు జీతం అయినా ఉండాలి అని నా ముఖం మీద చెప్పేసింది. ఇంకో పెళ్ళి చూపులలో అయితే, పెళ్ళిచూపులు ఎవరికీ?.. మీ తమ్ముడికా? అని అడిగింది అమ్మాయి. ఇంకా.. కొంత మందైతే, మీతో ఫారిన్ వెళ్ళే ఛాన్స్ మాకు ఇక రానట్టే.. వద్దని చెప్పేశారు. 



అప్పటివరకు, 'అన్నా' అని సంభోదించే కాలనీ లో పిల్లలు.. ఇప్పుడు 'అంకుల్'.. 'అంకుల్' అంటూ ఉంటే, ఆఫీస్ లో ఆడవారు అందరూ పై నుంచి కిందివరకు ఏదో లాగ చూస్తుంటే, పక్కింటి బామ్మగారు.. ముదిరిన బెండకాయలు నా వైపు చూపించి, చెత్తబుట్ట లో పడేస్తూ.. ఉంటే, చెప్పలేని ఆ బాధ.. నాకు మాత్రమే తెలుసు. 



ఇంటికి ఎవరైనా పెళ్ళికి పిలవడానికి వచ్చి శుభలేఖ ఇస్తే, నా పెళ్ళి గురించి ఇంట్లో డిస్కషన్ వచ్చి.. గోల గోల అయితే, బయట లవర్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, ఆఫీస్ బాయ్ కి క్కూడా కత్రినా లాంటి అమ్మాయి సెట్ అయి.. నన్ను పెళ్ళికి పిలిస్తే.. ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్ పిల్లలు.. "అంకుల్!.. ఆంటీ ఎక్కడ.. ?" అన్నప్పుడు, నడి నెత్తిమీద వెంట్రుకలు అదే పనిగా రాలిపోతూ ఉన్నప్పుడు.. ఆ బాధ నాకే తెలుసు.. 



ఇంకా దారుణం ఏమిటంటే.. మొన్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆమె పక్కనే, 'అమ్మా!' అంటూ కొడుకు అల్లరి చేస్తున్నాడు. సడన్ గా ఆ అమ్మాయి నా ముందుకు వచ్చి.. 



"నన్ను గుర్తుపట్టారా?.. పది సంవత్సరాల కింద నన్ను పెళ్ళిచూపులు చూడడానికి మీరు మా ఊరు వచ్చారు. నా పేరు జయ. ఆ రోజు మీరు మా సంబంధం వద్దనుకున్నారు. తర్వాత వెంటనే నాకు నెక్స్ట్ సంబంధం ఓకే అయి, పెళ్ళి కుడా అయింది. మీది చాలా గొప్ప లెగ్ అండి. ఇంతకీ మీకు పెళ్ళి అయ్యిందా.. ? ఇదిగోండి మా అబ్బాయి.. ఇప్పుడు ఐదవ క్లాసు.. మీ నాన్నగారు లెక్కలు బాగా చెబుతారు అంట కదా! ట్యూషన్ చెబుతారేమో అడుగుతారా?.. "



ఆ మాటలు విన్న నాకు నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు. పోనీ, ఏ రైలు కిందో తల పెట్టి పడుకుందామంటే, అలాంటి పనులు చెయొద్దని మా అమ్మ నా దగ్గర ముందే మాట తీసుకుంది.. ఏం చెయ్యను? 



ప్రేమించి పెళ్ళి చేసుకోడానికి ఇప్పుడు ఏజ్ బార్.. నో ఛాన్స్. అప్పట్లో స్టైల్ గా ఉండి.. ఇంకా అందమైన అమ్మాయి వస్తుందేమో నని పెళ్ళిసంబంధం ఓకే చెయ్యకుండా, బాగా ఓవర్ చేసాను.. ఇప్పుడు అనుభవిస్తున్నాను!



ఇంక లాభం లేదని.. డబ్బులు ఎక్కువైనా, ఒక ఫేమస్ పెళ్ళిళ్ళ బ్రోకర్ ని కలవాలని, నేను.. నాన్న డిసైడ్ చేసుకున్నాము. ఎవరికైనా పెళ్ళి సంబంధం సెట్ చెయ్యడంలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అని పేరు. అది విన్నాక, నాకు కొంచం ఆశ కలిగింది. అవసరమైతే, పర్సనల్ లోన్ పెట్టైనా.. వాళ్ళకి ఫీజు కట్టడానికి రెడీ అయ్యాను. ఆల్రెడీ అయిపోయిన రెండు వందల పెళ్లిచూపుల కోసం ఒక లోన్ రన్నింగ్ లో ఉండనే ఉంది.. 



మర్నాడు ఆ ఫేమస్ బ్రోకర్ ని కలిసిన తర్వాత.. నా జాతకం, నా డీటెయిల్స్ అన్నీ అతను చూసిన తర్వాత.. 



"మీ అబ్బాయి అప్పుడు పుట్టాడా? ఇంతవరుకు ఎందుకు పెళ్ళి కాలేదో? ఇప్పుడు మీకు ఎలాంటి అమ్మాయి కావాలో నేను అడగను.. ఎందుకంటే, నలభై లో ఇంక నో ఛాయస్.. వచ్చే ఏ అవకాశాన్నైనా ప్రసాదం అనుకుని స్వీకరించడమే. ఇంకా మీరు అమ్మాయి ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అని అంటే, ఇక పెళ్ళి ఆశ వదిలేసుకోవలసిందే! మా దగ్గర, ఇప్పుడు మీకు సూట్ అయ్యేవి.. కొన్ని సంబంధాలు మాత్రమే ఉన్నాయి.. డైవర్స్, విడో లు ఉన్నారు. అమ్మాయిలు మాత్రం చాలా బాగుంటారు సుమీ! మీకు కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కట్నం కుడా ఇస్తారు. ఎలాగోలా పెళ్ళి సెట్ చెయ్యడమే మా పని.. "



"వద్దు లెండి బాబు! మీకో దణ్ణం.. ఇంకా ఇక్కడే ఉంటే, పిల్లల తల్లి ని చుపిస్తారేమో".. పదరా అబ్బాయి అన్నాడు రామారావు



"ఇంక మన అబ్బాయికి అమ్మాయిలు దొరికినా.. వయసు ముప్పై కి పైనే వస్తారేమో.. వాళ్ళు కుడా ఇప్పుడు దొరక్కట్లేదు.. అదే విచిత్రం! వాళ్ళు ఏ డబ్బున్న సంబంధామో చూసుకుంటారు.. అమ్మాయిలకు డిమాండ్ అలా ఉంది.. ఏమంటావు జానకి?.. "



"ఏమోనండి!.. చూద్దాం. అమ్మాయి మాత్రం అందంగా ఉండాలి.. కట్నం తేవాలి.. గుర్తు పెట్టుకోండి.. "



ఒక వారం పోయాక.. బయటకు వెళ్ళిన నాన్న ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బయటకు వెళ్ళిన మనిషి, ఇలా వస్తున్నాడు ఏమిటా అని జానకి ఆశ్చర్యపడింది.. 



"లాటరీ ఏమైనా తగిలిందా అండి!.. " అడిగింది జానకి 



"అలాంటిదే అనుకో.. మన అబ్బాయి ఎక్కడ?.. "
"పిలుస్తాను ఉండండి.. "



ఇందాకల మార్కెట్ లో నా ఫ్రెండ్ లేడు.. అదే మన్మధరావు.. వాడు కలిసాడు.. వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదంటా.. అప్పట్లో మన అబ్బాయిని అడగడానికి ఆలోచించాడు, కానీ ఇప్పుడు ధైర్యంగా అడిగేసాడు.. మన పరిస్టితి చూసి.. 



"ఎవరు.. ఆ మన్మధరావు కూతురా.. ?" ఆశ్చర్యంగా అడిగింది అమ్మ. 



"మనం నూట యాభై పెళ్ళి చూపులకు వెళ్ళాం కదా.. ఆ అమ్మాయికి పెదమ్మ కూతురే అంటా.. ఈ పెళ్ళికూతురు. అమ్మాయి వయసు కొంచం ఎక్కువే మరి.. కంగారు పడకు.. జానకి"



"ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది కదా! కట్నం కుడా ఇచ్చుకునే స్టాయి లో లేరు వాళ్ళు.. " అంది అమ్మ. 



"అమ్మా! ఇంకేమి ఆలోచించకు.. పెళ్ళి ఖాయం చెయ్యండి. ఈ సంబంధం కుడా వదిలేస్తే.. నాకు జీవితం లో ఇక పెళ్ళి కాదు.. 'నాన్న' అవకుండానే 'తాత' అవుతాను అప్పుడు.. " అని రెండు చేతులు జోడించి వేడుకున్నాను నేను.. 



*****
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
పెళ్ళాం ఎప్పుడు వస్తుందో.. - by k3vv3 - 10-07-2024, 12:14 PM



Users browsing this thread: 1 Guest(s)