Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కల్పతరువు Part - 15
#15
కల్పతరువు - పార్ట్ 7




అనుకున్న రోజు రానే వచ్చింది. అంతా ప్లాన్ ప్రకారం టాక్సీలో ఉదయం ఆరింటికి బయలుదేరారు. విద్య, ధనం, సంస్కారం కల్గిన స్త్రీతో తన ప్రియురాలి పరిచయం కాబోతున్న ఊహ పిచ్చి సంబరంగా, ఆకాశ వీధిలో రెక్కలు లేకపోయినా ఎగిరే శక్తివంతంగా వున్నది త్యాగి పరిస్థితి. 



రమ్యమైన ప్రకృతి. ఆకుపచ్చ కొండలతో కరచాలన స్నేహం చేయాలనే తపన కల్గిన మబ్బులు. చల్లగా, హాయిగా శరీరాన్ని స్పృశిస్తున్న గాలి. 



‘హిమగిరి సొగసులు, చిగురించు మనసులు’ అంటూ కవి సి. నారాయణరెడ్డిగారి సినిమా పాట గుర్తొచ్చింది. సహజమైన సృష్టి అందాల అనుభూతులను ఆస్వాదిస్తు, కంప్యూటర్ అనలిస్ట్ తన భర్త లేని లోటును స్మరించుకుంది. 



జీవితంలో మలుపు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీత్యా గోచరిస్తుంది. 



అన్ని వేళల పనులతో నిమగ్నమైన అచల ఇంట్లోనే ఖాళీగా వున్నది. అందరికంటే ఎక్కువ ఆతృత, ఆందోళన కల్గినా, సత్యలీలపై నమ్మకం వున్నా, ఎద స్పందన హెచ్చుతూ యేమీ తోచని స్థితిలో వున్నది. 



సిమ్లా చేరుకున్నారు. విశ్వంతో హానీమూన్ వచ్చినపుడు మంచు కురుస్తుండినది. 



‘విశ్వం, ఎందుకని నన్ను వదిలి పోయావు?’



 ఎంత వద్దనుకున్నా కళ్లలో కన్నీరు సుళ్ళు తిరుగుతున్నాయి. 



అక్టోబర్ నెలలో మంచు లేదు. ఈ సారి సిమ్లా అందంగా లేదు. అంటే ప్రయాణికులకు ఇది సీజన్ కాదు. ఎండాకాలంలో సిమ్లా రావాలని ఎందరో యాత్రికులు ప్రయాస పడతారు. అలాటి వారికి కొంత నిరాశే! కురిసే మంచుతోనే ఎంజాయ్మెంట్!



సాయంత్రం చీకటి పడే వేళ మనాలి చేరుకున్నారు. “హైదరాబాద్ మేడమ్జీ" అంటూ పరిచయం చేశాడు జస్ప్రీత్ ప్రియుడు త్యాగిసోనీ. జస్ప్రీత్ కళ గల వర్చస్సు, పుష్టిగల శరీరం, చెరగని చిరునవ్వు. 



ఆవు నేతితో రొట్టెలు, ఛోలే బట్టురే, ఆలుమట్టర్ కూరతో రాత్రి భోజనం ముగిసింది. రాత్రి వేళలో చలిగా పెరిగింది. పాప సత్యలీలను అంటుకునే వుంది. బాబు మాత్రం జస్ప్రీత్ ఇంట్లో ఫ్రీగా తిరుగుతున్నాడు, తండ్రి రెగ్యులర్గా జస్ప్రీత్ వద్దకు తెస్తాడేమో మరి. 



జస్ప్రీత్ తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటిపని పూర్తిచేసి పడుకోడానికి పక్కలు సర్దింది. కన్నవారిని కాదని వివాహితుడితో లేచిపోయి వచ్చింది. పాపం జస్ప్రీత్! ఎన్ని మాయమాటలు చెప్పాడో, సునాయాసంగా బుట్టలో పడ్డది. 



జస్ప్రీత్ కు హిందీ రాదు. అయినా సైగలతో ఏదో చెబుతానే వుంది. 



ఆమాటా-ఈమాటా తర్వాత, “మీ యిద్దరి జంట బావుంది. మీరు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుండండి. ”



“సంఘం పెళ్ళికాని జంటను ఒప్పుకోదు, ఇద్దరి భార్యల పోషణ నాకు భారమే. ” మోయరాని బరువు ప్రకటించాడు. 



“మీ యిద్దరి భార్యల్లో ఎవరు కావాలో తేల్చుకోండి, మీ కష్టానికి నేను సలహా ఇవ్వగలను. ”



“సెకండ్ హ్యాండ్ అని తెలసి కూడా బలవంతంగా, అయిష్టంగా అచలను పెళ్లి చేసుకున్నాను. అమాయకురాలు జస్ప్రీత్ నన్ను నమ్ముకుంది. ”



జస్ప్రీత్ కళ్లు తుడుచుకున్నది. “పిల్లల్ని ఏంచేయాలని?” సత్యలీల ప్రశ్న. 



“ఏమో తెలియదు. ” త్యాగి జవాబు. 



జస్ప్రీత్ చాలా బాధగా హర్యాని భాషలో మాట్లాడింది. ఎవరికి వారే మౌనంగా వున్నారు. 



“నేనొక సలహా ఇస్తాను, వింటారా?” 



శ్రోతలిద్దరూ వింటామని తల వూపారు. 



“అచలకు విడాకులు ఇవ్వండి, పాపను తల్లి దగ్గరే వుండనీ, బాబును మీరు పెంచుకోండి. జస్ప్రీత్ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ధైర్యంగా జీవించండి. ”
 
“అచల వాళ్ళ బంధువులు వూరుకుంటారా?” త్యాగి అనుమానం. 



“ఆ భయం మీకు అనవసరం, మీ విషయం చూడండి. జీవితంలో దొంగలా బ్రతకొద్దు. స్వేచ్ఛగా, శాంతియుతంగా, ఎవరిని మోసాగించకుండా బ్రతకాలి. ”



“అనుకున్నంత సుళువు కాదు మేడమ్ జీ, అచలతో విడాకులు తీసుకుంటే నేను వాళ్ళ భవిష్యత్ పోషణకై కోర్టు నిర్ణయించిన భరణం చెల్లించాలి. నా వల్ల కాని పని. నేను మామూలు మనిషిని. ”



“అవునా? మంచి లాయర్ని సంప్రదించి, ఒక నిర్ణయం తీసుకుందాము. ”



“సరే, మేడమ్ జీ. ” జరిగిన సంభాషణ జస్ప్రీత్ కు అర్థమైనట్టుగా చెప్పాడు. పిరికి జంట మౌనంగా ఆలోచించసాగారు. 



“ఎంతో కొంత భరణం ఇస్తేనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. నేను ఇన్నాళ్ళూ బ్రతకలేక బ్రతుకుతున్నా, నేను ఒక్క పైసా కూడా అచలకు ఇవ్వను. ” రెట్టింపు గొంతుతో అన్నాడు. 



సత్యలీల మనసులో అసహ్యం పేరుకుంది, ఏం మనిషి? అచల ఆస్తి నాశనం చేసి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నాడు. 



“సరే, మ్యూచువల్ డివోర్స్ పెడదాము. మరి లాయర్ ఖర్చులకు డబ్బులు జమ చేయండి. మనకు అనువుగా వున్న లాయర్ని చూద్దాం. ”



>>>>>>>>>> 



“మన కోసం ఒక ఇల్లు కొనలేక పోయారు, ఎంతసేపు బిజినెస్, లాభాలు. ఎన్నాళ్లు కిరాయి ఇల్లు?”



ప్రమీల కోరిక నెరవేరే దారి లేక పోయింది. స్వంత ఇంటి కల నెరవేరాలని సమయావకాశం చూసి, “కేశవగారు, మా ఆయన అనుకున్నవన్నీ అంటే ప్రజ్ఞ ఆరోగ్యం, చదువు అన్నీ సాధించారు. కానీ ఎందుకో ఇల్లు కొందాము అంటే మాట దాటేస్తారు. ” 



ప్రమీల ఇచ్చిన కాఫీ తాగి, కప్పు ప్రక్కనే వున్న బల్ల పైన పెట్టి “నారాయణ తన వంతుగా జీతం తీసుకుంటున్నాడు కానీ వచ్చే లాభాల్లో వంతు తీసుకోక అంతా బిజినెస్ అభివృద్ధి కార్యక్రమంలోనే వెచ్చిస్తున్నాడు. నేనూ నామమాత్రంగానే వున్నాను. ”



“అదే మాట నాతో చెప్పాలి కదా. నా మనసు కుదుట పడేది. ”



“ప్రజ్ఞ పెళ్లి విషయంలో బాగా దెబ్బ తిన్నాడు. అందుకేనేమో ప్రతీ పనిలో పట్టుదల రెట్టింపైంది. ” స్నేహితుడికి మద్ధతు పలికాడు కేశవరెడ్డి. 



“అవును, మా వారి పట్టింపు సరే, ప్రజ్ఞ చాలా వరకు కోలుకున్నది. ఈ మార్పునే మేము ఆశించాము. ”



“ప్రమీలమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి, మీరు అన్యధా అనకోవద్దు. ”



“ఫరవాలేదు చెప్పండి. ” ప్రమీలకు ఆసక్తి పెరిగింది. 



“నారాయణతో ముందే అన్నాను కానీ ఒప్పుకోవటం లేదమ్మా, నాకు సంతానం లేరు. నేను ఒక్కడినే, ఎంత నౌకర్లు వున్నా, ఇల్లు కళ తప్పినట్టే వుంది. మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి మా ఇంట్లోకి మారితే, నాకు తృప్తిగా వుంటుంది. "



“రెడ్డీ సేఠ్! నేను కొత్త ఇల్లు కొనాలని అనుకున్న మాటను మీరు అపార్థం చేసుకున్నారు. ” నొచ్చుకుంది ప్రమీల. 



“అమ్మ! అమ్మా! నాది సదుద్దేశ్యం, మీరు అన్యధా అనుకోకండి. నా మాటలను వెనక్కి తీసుకుంటాను. నారాయణ నాకు తోబుట్టువు లాంటి వాడు, ప్రజ్ఞకు నేను పెదనాన్నగా భావిస్తాను. ఇంత వరకు మా వ్యాపారంలో మాకు ఎటు వంటి పొరపొచ్చలు లేవు. వుండవు కూడా.. ” సంజాయిషీ ఇచ్చుకున్నాడు కేశవరెడ్డి. 



ప్రమీల తనలో తానే ఇబ్బందిగా “ఫర్వాలేదు, ఇట్లాంటి విషయాలు నాకు తెలియవు, మీరు ఆయన్ను సంప్రదిస్తే మంచిది. ” మారు మాట్లాడక వెళ్ళి పోయాడు కేశవరెడ్డి. 



రాత్రి భోజనాల సమయంలో ప్రమీల నారాయణతో జరిగిన సంఘటన చెప్పింది. 



నారాయణ జవాబు యింకా రానేలేదు, ప్రజ్ఞకు తొందర హెచ్చింది. 



“అమ్మా, కేశవరెడ్డి గారు నిజంగానే నాకు పెదనాన్న వలెనే అనిపిస్తారు. వారి మాటలను పెడార్థం తీసుకోవద్దు. వారికి మాత్రం ఎవరున్నారు? మనం అందరమూ కలసి ఒకే ఇంట్లో వుంటే తప్పేంటి?”



“నేనేమన్నాను, పెద్ద నిర్ణయాలు ఇంటి పెద్ద వాళ్లు ఆలోచించాలి, నాన్న సమాధానం చెప్పాలి, నేను కాదు. ”



“ఎంత స్నేహితుడైనా లిఖిత పూర్వకంగా ఒప్పందం కుదిరిన తరువాత మనం నిర్ణయం తీసుకుందాం. ” నారాయణ చెప్పాడు. 



“నాన్నా, కేశవరెడ్డి గారు చాలా మంచి వారు. మనను ఆపదలో ఆదుకున్నారు. అలాటి మిత్రులు చాలా అరుదు. ఒంటరితనం భరించలేక మనని సాయం కోరుతున్నారు. ”



“అందరూ మంచి వాళ్ళే, కానీ పరిస్తితులు మనిషిని కలుషితము చేయవచ్చును. ” 



చాలా సేపు మౌనంగానే గడిచింది. కాని అందరి మనసుల్లో ప్రశ్నాజవాబుల పరంపర నడుస్తూనే వుంది. 
====================================================================
ఇంకా వుంది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
కల్పతరువు Part - 15 - by k3vv3 - 04-05-2024, 02:15 PM
RE: కల్పతరువు - by sri7869 - 04-05-2024, 10:20 PM
RE: కల్పతరువు - by k3vv3 - 10-05-2024, 02:25 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 04:51 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 05:29 PM
RE: కల్పతరువు Part - 7 - by k3vv3 - 09-07-2024, 03:54 PM



Users browsing this thread: 1 Guest(s)