Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
ఘోర కలి అరాచకాలు  - 2
కపాలిని దేవి ఆలయం
 
ఘోర కలికి రక్షక భటుడి నుండి పిలుపొచ్చింది. కపాలిని దేవి ఉండే చోటు నుండి కబురొచ్చిందని భటుడు వణుకుతూ ఘోర కలికి  చెప్పాడు. రోజు సాయంత్రమే తన సామ్రాజ్యంలో పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లను తన రూపంలోకి మార్చే ప్రక్రియ మొదలవ్వబోతుంది. అది జరిగేటప్పుడు తను అక్కడ వుండకూడదు. ప్రక్రియ తంత్రం ద్వారా జరుగుతుంది.
ఘోర కలి తంత్ర విద్యలను అర్థం చేసుకున్న వైద్య బృందం అక్కడుంది. వారికి ఆజ్ఞ రాగానే పదిహేను మందిని అచ్చు గుద్దినట్టు ఘోర కలిలా మార్చేస్తారు. వారికి ఆజ్ఞ ఇవ్వటానికి రాయబారిగా ఘోర కలికి బాగా నమ్మకస్తుడైన  సురా  ను నియమించాడుసురా ఘోర కలికి బాగా దగ్గరైన వ్యక్తి. బాల్యం నుండి మిత్రుడే. ఘోర కలి ఎక్కడుంటే  సురా అక్కడుంటాడు. వారి స్నేహం అలాంటిదిసురా   తంత్రంతో సిద్ధించిన యంత్రాన్ని తీసుకొచ్చి వైద్య బృందానికి అందిస్తాడు. అప్పుడు వారు అచేతనంగా అక్కడ ఉన్న పదిహేను మందిపై యంత్రాన్ని ఉంచుతారు. ఘోర కలి అనుకునే లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు అన్నీ యంత్రం ద్వారా పదిహేను మందిలో నరనరాన నిండిపోయాక వైద్య బృందం ఘోర కలిలా వారి బాహ్యరూపాల్ని కూడా మార్చేస్తుంది.
 
 
నాగమణితో, తంత్రంతో ఘోర కలి కపాలిని దేవి సాక్షాత్కారము పొందుతాడు. దేవి మంత్రాన్ని ప్రసాదిస్తుంది. మంత్రాన్ని ఘోర కలి అక్కడి నుండే పఠిస్తాడు.సూరాకు తను ఇచ్చి పంపే యంత్రంతో తన సామ్రాజ్యంలో ఉన్న పదిహేను మందిని తన రూపంలోకి మార్చేస్తారు వైద్య బృందం. దేవి ఇచ్చిన మంత్రంతో కఠోర దీక్షతో సాధన పూర్తయ్యాక పరిపూర్ణమైన కామరూపధారిగా మారిపోతాడు ఘోర కలి. తను అనుకున్నట్టే ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.
 
ఇది ఘోర కలి ప్రణాళిక.
 
ప్రపంచంపై తను సాధించబోయే ఆధిపత్యాన్ని గుర్తుచేసుకుంటూ, తన ఇన్ని యుగాల నిరీక్షణను గుర్తుచేసుకుంటూ ఒక పక్క వికృతంగా నవ్వుతూనే మరో పక్క కంటి నిండా నీరు నిండిపోయి ఉండగా ఒక్క నిమిషం ఆగి మంచి నీళ్లు తాగి ముందుకు కదిలాడు. తన చీకటి సామ్రాజ్యం నుండి కపాలిని దేవి ఉండే స్థలానికి బయలుదేరాడు.
 
ఘోర కలి తన దగ్గరున్న నాగమణిని వెంట తీసుకెళుతూ
 కాళీ.
 కపాలిని.
 శూలిని..
జగజ్జనని..
అని అమ్మవారి నామాలను పదే పదే గట్టిగా బయటికి వినబడేలా ఘోషిస్తూ వెళుతున్నాడు.
 
కపాలిని దేవి ఆలయాన్ని సమీపిస్తున్నాడు. చీకటి తెరలు తెరలుగా కమ్ముకొంటోంది. చిన్న వెలుగు రేఖ కూడా దరిదాపుల్లో కనబడనంత దూరం అయిపోతోంది. ఘోర కలిని సైతం వణికించే పెను చీకటిలా ఉందది.
 
బాహ్యప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నట్టుంది. మనకు కనిపించే వెలుగు ప్రపంచంలోనే కనబడని అంధకారం ఇంత దాగుందా అనిపించేలా ఉంది కపాలిని దేవి ఆలయ ప్రాంగణం. గాలి వల్ల, వాసన వల్ల, గుళ్లోని గంటల చప్పుడు వల్ల మాత్రమే ఘోర కలి అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ దారి తెలిసి కాదు.
 
మెల్లిగా పసిపాపల ఏడుపులు మొదలయ్యాయి. ఘోర కలి ఘోషలు ఆగిపోయాయి. పసిపాల ఏడుపులు ఇంకా ఇంకా ఎక్కువయ్యాయి. ఒకరు ఇద్దరు ముగ్గురు అలా కొన్ని వేల, లక్షల, కోట్ల ఏడుపులు పసిపాపల ఏడుపులు తీవ్రతరం దాల్చాయి. ఘోర కలి కంట నీరు తిరిగింది. ఘోర కలికి ఏడుపంటేనే అసహ్యం. పసిపిల్లలు ఏడిస్తే తన బాల్యం గుర్తుకొచ్చి కోపం తెచ్చేసుకుంటాడు. అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. అలాంటిది రోజు అన్ని ఏడుపులు ఒకేసారి ఎలా విన్నాడో, విని ఎలా తట్టుకున్నాడో కూడా తెలియట్లేదు. ఒంట్లోని ప్రతి కణం స్పందించినట్టు అనిపించింది. కొన్ని సంవత్సరాల, దశాబ్దాల, శతాబ్దాల బాధ కన్నీటి సంద్రమై ఎగసెగసి పడ్డట్టు అనిపించింది. కన్నీరు ధారలా ప్రవహించింది. వానలా ఎడతెరపి లేకుండా కురిసింది.
 
ఇన్నాళ్లూ తన అంతరంగం ఎండిపోయిన ఎడారి అనుకున్నాడు. ఇవ్వాళే తెలిసింది. తనను కూడా ఏడిపించగల శక్తి ఒకటుందని. అది కపాలిని దేవి ఆలయంలోనే ఉంటుందని మాత్రం కలలో కూడా కల కనలేదు. కపాలిని దేవిని ఇప్పుడు చూడాలంటేనే భయంగా అనిపించేలా ఉంది పసిపాపల రోదన.
 
ఘోర కలికి ఏమీ పాలుపోవట్లేదు. అంతు చిక్కట్లేదు. ఏడుపు ఎప్పుడాగిపోతుందో తెలియట్లేదు. కపాలిని దేవి కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. కనిపించినా కరుణిస్తుందో లేదో తెలియదు. తన చీకటి సామ్రాజ్యం నుండి ధైర్యంగా బయలుదేరిన ఘోర కలి ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడుకాళీ....కపాలిని....శూలిని....జగజ్జనని  అంటూ ఊగిపోతూ వచ్చిన ఘోర కలికి ఇప్పుడు నోరు పెగలట్లేదు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1 - by k3vv3 - 15-06-2024, 02:50 PM



Users browsing this thread: 6 Guest(s)