Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కల్పతరువు Part - 15
#3
కల్పతరువు - పార్ట్ 3

ఆదివారం నాడు అచల తన భర్త త్యాగిసోనీని పరిచయం చేసింది. సినిమా హీరోలా వున్నాడు. “నమస్తే మేడమ్ జీ” ఎంతో వినయంగా నమస్కరించాడు. మురుకులు, టీ తెచ్చి టేబల్ పైన పెట్టింది. 



అచల చెప్పింది తన భర్తకు కంప్యూటర్ నేర్చుకోవాలని వుంది అని. త్యాగిజీని వుద్దేశించి అతని చదువు గూర్చిన వివరాలు తెలుసుకున్నది. 



త్యాగి కాలేజ్ ఫైనల్ తప్పాడు. పైగా ఇంట్లో పీసీ లేదు. అతన్ని నిరుత్సాహ పర్చక “కొన్ని రోజులు ఆగండి పీసీ కొన్నాక నేర్చుకుందురుగాని” సత్యలీల చెప్పింది. 



“మీ ల్యాప్టాప్లో నేర్చుకుంటాను”. 



“నో, పీసీలోనే నేర్పిస్తాను. ” ఆమాట, ఈమాటలతో పొద్దుగడిచింది. 



రెండు రోజుల తరువాత మళ్ళీ అచల ఎంతో రేలాక్సేడ్ గా వచ్చింది. 



“సత్యాజీ! ఈ రోజు మా వారు బాబుని తీసుకొని ఊరువెళ్లారు. రేపు సాయంత్రo గాని రారు. పాప ఎదురింట్లో ఆడుకుంటున్నది. నాకోసం ఒకరోజు చుట్టి పెట్టండి. ” 



“సెలవు పెట్టి చేసే పనేమున్నది?”



“నా గురించి విని, నాకు సలహా ఇవ్వండి. ”



“నేను నీ జీవితం గూర్చి సలహా ఇచ్చేంత పెద్ద మనిషిని కాదు. ”



“మీలో ఆత్మవిశ్వాసము, ధైర్యము వున్నై, నాకు మీలాంటి వారి స్నేహం, సలహా కావాలి, ప్లీజ్ కాదనకండి. ”



“సరే, సెలవు తీసుకుంటాను, కానీ నీ జీవిత సమస్య గూర్చి నువ్వే బాగా ఆలోచించి దారి వెతుక్కోవాలి, అప్పుడే నీకు తృప్తి వుంటుంది లేకుంటే నీ మనసు మాటిమాటికీ వేరేవాళ్ళని నిందిస్తుంది. ”



“నేను బీద కుటుంబంలో పుట్టి పెరిగాను. చదువు లేకపోయినా కుట్లు, అల్లికలు నేర్చుకున్నాను. నేను అందంగా వున్నానని మా వారు నన్ను ఇష్టపడి, పెళ్లి ఖర్చులన్నీ భరించి వివాహం చేసుకున్నారు. అత్తవారింట్లో నేను సుఖంగానే వున్నాను. డబ్బు చెలామణి తెలియని దాన్ని కాబోలు అవసరానికి మించి ఖర్చులు చూసేసరికి నాకు చాలా ఇబ్బందిగా వుండేది. 



పగలు-రాత్రీ కష్టపడి బిజినెస్ చూసేదీ మా వారు, కానీ డబ్బు విలువ తెలియక ఖర్చు చేసేవారు మా అత్తా, మామా, మరిది. ఇదేమాట ఒకసారి మావారితో చెబితే “ఈ వ్యాపారం మా తరాల నాటిది. అమ్మా నాన్నలను ప్రశ్నించే హక్కు లేదు. తమ్ముడు చేసేవి వృధా ఖర్చులు. ఎంత చెప్పినా వినడు. వాడికి పెళ్లి జరిగితే మారుతాడేమో” అని సర్ది చెప్పేవారు. 



మా మరిది అందగాడు. చదువు అబ్బలేదు. బిజినెస్లో ఏకాగ్రత లేదు. సినిమా హీరో వేషం కోసం కాలాన్ని, డబ్బుని వృధా చేసేవాడు. అప్పుడప్పుడు నాతో వదినా, నా ప్రక్కన నువ్వు సరిపడే జోడీ! నువ్వు హీరోయిన్, నేను హీరో, అన్నయ్య ప్రొడ్యూసర్ అని పగటి కలలు కనే వాడు. 



పాప పుట్టింది. మావారు పాపతో ఆడుకోవాలని ఇంటికి తొందరగా వచ్చేవారు. జ్వాలాదేవి అని ముద్దుగా పిలిచేవారు. బిజినెస్లో లాభాలు పెరిగాయి. స్టిరఆస్తులు పెంచారు. అత్తగారు మరిదికి పెళ్లి చేసి వేరే కాపురం పెట్టించాలి అన్నారు. 



శ్రీమంతుల అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. 



నా ఖర్మ కాలింది. మావారు మొదటిసారి వచ్చిన గుండెపోటు దెబ్బకే ప్రాణాలు కోల్పోయారు. సంపాదించే దిక్కు పోయింది. మరిది పెళ్లి ఆగిపోయింది. 



అందరూ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళమే, రోజురోజుకూ దిగజారి పోతున్నాము. 



సడన్ గా ఒకరోజు మా అత్తగారు పంచాయితీ పెట్టించారు. ఆస్తి కాపాడుకోవాలంటే నాకు మరిదితో పునర్వివాహం జరపాలని, ఆస్తి విభజన కాదని ఆమె నమ్మకం. 



స్వతంత్రంగా నిల్చి నేనూ, పాప బ్రతికే మార్గాలు ఆలోచించాను. నేను అరిచి గీపెట్టినా నా గోడు వినేవారు లేరు. మా పుట్టింట్టి వాళ్ళు కూడా నాకు యిష్టం లేని మళ్లీ పెళ్ళికి వంత పలికారు. 



బంధువులను, మిత్రులను పిలిచి మా అత్తగారు “జగ్రాత” జరిపించారు అంటే జగన్మాత పేరిట పూజలు. రాత్రంతా పాటలు, భజనలు. వచ్చిన వారంతా నా కాబోయే మళ్ళీ పెళ్ళికి శుభాకాంక్షలు చెప్పడమే. మా మరిది అంటే త్యాగిసోనీ నా కోసం, పాప కోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు ప్రచారం చేశారు. 



నన్ను ఏ దేవతలు శపించారో, ఏ దరిద్రం నా నెత్తి మీద తిష్ట వేసిందో.. నేను ఒప్పుకున్నాను. 



ఇద్దరి అన్నదమ్ముల సంభోగంలో ఎవరి వలన ఎక్కువ సుఖంగా వుంది అని చవక బారు జోకులతో మానసికంగా, శారీరకంగా హింసించేవాడు త్యాగి. చదువు లేదు, సంస్కారం లేదు, సంపాదన లేదు. కానీ సేవలకు, సుఖానికి భార్య కావాలి. 



అన్నగారు ఆస్తిని గుణించి కూడబెట్టే వారు. తమ్ముడు ఆస్తిని భాగహరించి తీసీ వేస్తున్నాడు. ”



>>>>>>>>>> 



ప్రజ్ఞ జ్వరంతో టౌన్ ఆసుపత్రిలో వుంది. తగ్గు ముఖమే లేదు. టైఫాయిడ్ అని నిర్దారించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సూచన మేరకు హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. 



నారాయణ బాల్య స్నేహితుడు కేశవరెడ్డి సహాయంతో హాస్పిటల్ దగ్గరలోని లాడ్జ్ లో బస కుదిరింది. అన్ని రకాల విషజ్వరాలకు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రి; హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్. 



రూమ్ దొరకనందుకు జనరల్ వార్డులోనే కూతురి చికిత్స; నిద్రను దూరం చేసుకొని తల్లి దగ్గరుండి సేవలు; గేటు బయట తండ్రి మానసిక ఆవేదన; సాయంత్రం విసిటింగ్ టైమ్లోనే చికిత్స పొందే వారిని చూడవచ్చును. 



పది రోజులకు విషజ్వరం ప్రజ్ఞను చాలా బలహీనతకులోను చేసి వదిలి పెట్టింది. డిశ్చార్జ్ తీసుకొని లాడ్జ్ కు వెళ్లారు. స్నానం చేసి ఇడ్లీ తిని నిద్దర పోయింది. అలసి పోయిన తల్లి కూడా కూతురుతో పాటు నడుం వాల్చింది. 



మధ్యాన్నం మూడు కావస్తుంది. కళ్ళు మండుతున్నా, నారాయణకు నిద్ర రావటం లేదు. ఇంటి పెద్దగా ఏదయినా చేయాలి. వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే.. గొప్ప ప్రజ్ఞావంతురాలు కావాలి నా బిడ్డ. 



మరి వూళ్ళో ఇల్లు, పొలము, తోటలు?.. 



అమ్మేసి, హైదరాబాద్కు మకాం మారితే సరి.. 



ఆలోచిస్తూనే తల పైన తిరగే సీలింగ్ ఫ్యాన్ ని చూశాడు. ఇంట్లో నాలుగు రెక్కలున్న ఫ్యాన్ వుంది, కానీ ఈ లాడ్జ్ లో ఫ్యాన్ మూడు రెక్కలున్నా గిర గిరా తిరుగుతూ చల్లని గాలి వీస్తూంది. 



అవును, జీవితమూ అంతే, ఎక్కడైన, ఎప్పుడైన అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగక పోతే చింతించాల్సిన పని లేదు. వేరే మార్గంలో గమ్యం వెతుక్కోవాలి. 



మనసు శాంతించింది. కునుకు పట్టినట్టుగా వుంది. 



ఏదో కీచు గొంతు అదే పనిగా అరుస్తుంది. గాఢ నిద్ర పారిపోయింది. 



మంచం మీద ప్రజ్ఞ నాలుక కొరుక్కొని అరస్తూ నోట్లో నుండి నురగ బయటకు తీస్తుంది. ప్రమీల వులిక్కిపడిలేచి చివుక్కున తాళంచెవి గుత్తి ప్రజ్ఞ అరచేతిలో పెట్టి, తలను లేవనెత్తి భర్త వైపు బేలగా చూసింది. 



“ఇది ఫిట్స్, నేను టాక్సీ తెస్తాను” గబాల్న లాడ్జ్ రిసెప్షన్ సహాయంతో, ముగ్గురూ టాక్సీలో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళటమూ, ఎమర్జెన్సీగా అడ్మిట్ అవ్వటమూ వెంట వెంటనే జరిగి పోయాయి. 



రెండు రోజుల తరువాత ప్రజ్ఞకు స్పృహ వచ్చింది. పళ్ళతో గట్టిగా కొరుక్కున్న నాలుక పైన గ్లిజరిన్ పూసింది ప్రమీల. సలైన్ మాత్రమే ఆధారం. 



డ్యూటి డాక్టర్, నర్సులు క్రమం తప్పకుండా వార్డ్ పేషెంట్లను పరిశీలిస్తున్నారు. 



డిస్చార్జ్ రోజున డాక్టర్ కౌన్సిలింగ్: “మీ పేరెంట్స్ కు నువ్వు ఒక్క దానివే సంతానం, మనం రోజూ జరిగే విషయాల్లో మనకు నచ్చనివి, మనకు అనుకూలించని వాటిని వదిలేయాలి, అంతేకాని అవే మనసులో పెట్టుకుని, ఆలోచించి, బాధ పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నువ్వు బాగుంటేనే మీ పేరెంట్స్ ఆనందంగా వుండగలుగుతారు. గారాల ముద్దుల కూతురిగా నీ బాధ్యత ఏమిటి?”



నాలుక కొరుక్కున్న నొప్పి వలన జవాబు ఇవ్వలేక పోతున్నది. 



“చూడమ్మాయి ప్రజ్ఞా, నేను చెప్పిన మాటలు విను, పూర్తిగా ఆరోగ్యం కోలుకున్న తరువాత నీకు ఇష్టమయిన హాబీని అభివృద్ది చేస్కో. ” 



“అంటే, ” కళ్ళతోనే ప్రశ్నించింది. 



“కుట్లు-అల్లికలు, డ్రాయింగ్, పెయింటింగ్, తోటపని, మ్యూజిక్, డాన్స్, వంటా-వార్పూ లేకపోతే ఏదయినా వృత్తి విద్య, ఏదో ఒక సబ్జెక్ట్ లో శిక్షణ తీసుకొని సాధన చేయి. నీ పేరును సార్థకం చేసుకో, అంతే గానీ అన్నీ కోల్పోయానని చింతించకు. చింత చితికి దగ్గర అవుతుంది. 



మనం సంతోషపడుతూ మన వాళ్ళని సంతశ పెట్టాలి. సరేనా. ” డాక్టర్ మాటలకు సరే అని తల వూపింది ప్రజ్ఞ. 



“అమ్మా, మీ పాప మంచిగా అయిపోతుంది, వర్రీ లేదు. మూడు సంవత్సరాలు తప్పకుండా మందులు వాడాలి. ఒక సంవత్సరం వరకు నెలకొక సారి చెక్ చేయించు కోవాలి, అంటే పేషెంట్ ఆసుపత్రికి రావాలి. ”



“అలాగే డాక్టర్” అంటూ ప్రమీల చేతులు జోడించి వినయంగా నమస్కరించింది. 
====================================================================ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
కల్పతరువు Part - 15 - by k3vv3 - 04-05-2024, 02:15 PM
RE: కల్పతరువు - by sri7869 - 04-05-2024, 10:20 PM
RE: కల్పతరువు - by k3vv3 - 10-05-2024, 02:25 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 04:51 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 05:29 PM



Users browsing this thread: 2 Guest(s)