Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
ముముక్షువు వేణు గానం చేస్తున్నంత సేపూ ప్రాంగణం అంతా కృష్ణమయం అయిపోయింది. అభిజిత్, అంకిత, సంజయ్ లు ఏదో తెలియని దివ్యానుభూతికి లోనయ్యారు. శ్రీకృష్ణుడి దర్శనం కోసం వాళ్లలో కలుగుతున్న తహతహ అది అని గ్రహించలేని స్థితికి వెళ్లిపోయారు
 
వేణుగానం ముగిసిన వెంటనే ముముక్షువు వారి వద్దకు వచ్చాడు. వేణుగానం చేస్తున్నంత సేపూ తాదాత్మ్య స్థితిలో ఉన్న వారిని చూసాక ముముక్షువుకు వేణుగానం వెనుకనున్న శ్రీకృష్ణుని మహిమ గురించి చెప్పాలనిపించి ఇలా చెప్పాడు.
 
శ్రీకృష్ణుడి దర్శనభాగ్యం దొరకటం అంత సులువు కాదు. సిద్ధపురుషుడి సాంగత్యం చేత మీకు రాముడు కనిపించాడు. ఆయన మార్గదర్శిలా మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించాడు. మీ పూర్వీకుల రామభక్తి చేత మీకు రామలక్ష్మణుల దర్శనం దొరికింది. శ్రీకృష్ణుడిని దర్శించుకోవటం ఎందరో యోగీశ్వరులకు సైతం సాధ్యపడని విషయం. శంభలలోని సమరవిజయ రాముడికొక్కడికే అది సాధ్యపడినది. శంభలలో శ్రీకృష్ణుడు ఉన్నన్ని రోజులూ ఆయనని ఒక్కసారైనా చూడాలని ఎందరో యోగులు పరితపించిపోయేవారు. సాయం సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేసేవాడు. వేణుగానం విని ఎందరో యోగులు శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ అభయః ప్రాకారానికి వచ్చేవారు. కానీ ఆయన వీరికి కనబడేవారు కాదు. అయినా సరే గానాన్నే విని ఆస్వాదిస్తూ ఆయన ధ్యానంలో, నామ జపంలో గడిపేవారు యోగులు. వేదాలనే వేణువు ద్వారా గానం చేసిన ఆయన స్థాయిని వేణునాద విద్వాంసుడూ అందుకోలేడు. అభయః ప్రాకారం చేసుకున్న పుణ్యం అలాంటిది. ఆయన ఇక్కడున్నన్ని రోజులూ వేణువు ద్వారా వేదగానం చేశారు.
 
వేణుగాన వేద ఘోష ఇప్పటికీ అభయః ప్రాకారంలో నిక్షిప్తమై ఉన్నది. నేను చేసిన వేణుగానం కూడా అలాంటిదే. శ్రీకృష్ణుడు అభయః ప్రాకారానికి ఇచ్చిన వేణుగాన జ్ఞాన సంపద వల్లే నేను వేణువును ఆలపించాను. ఇందులో నా ప్రతిభ కంటే శ్రీకృష్ణుని ప్రభే మీకు కనబడుతుంది.”
 
"స్వామి రాముని దర్శన భాగ్యం మాకు దొరికిందన్న విషయం మీకెలా తెలిసింది?" అని అడిగాడు సంజయ్
 
"మోక్ష సాధనలో ఉన్న వాడినే ముముక్షువు అంటారు. ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారు అభ్యసించేది కూడా విద్యే కదా. విద్య ఎక్కడుంటుందో స్పర్ధ అక్కడుంటుంది. స్పర్ధ ఎక్కడుంటుందో అక్కడ అన్ని విషయాలూ తెలిసిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా దైవానుగ్రహం ఎవరికి దక్కింది అన్న రహస్యాలు. మీకు రాముని అనుగ్రహం దొరకటం ఎంత విలువైనదో మీకిప్పుడు అర్థం కాదు. మోక్ష సాధనలోకి మీరు అడుగుపెట్టిన రోజున మీరెంత అదృష్టవంతులో మీకర్థం అవుతుంది", అన్నాడు ముముక్షువు.
 
ముముక్షువు నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు. సిద్ధపురుషుడు తన జపమును ముగించుకుని ధ్యాన స్థితిని వీడి వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లని చూడగానే వారితో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇలా ప్రస్తావించాడు.
 
"వేణు గానాన్ని విని మీరు చాలా మంచిపని చేశారు. నేనే స్వయంగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళదాం అనుకున్నాను. రోజుతో మీలోని పాషండ భావాలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఇక మీరు శంభల రాజ్యంలోని సకల విద్యలూ నేర్చుకోవటానికి సంసిద్ధులు అయినట్టే లెక్క", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"పాషండ భావాలంటే ఏవి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"వేదాలకి విరుద్ధమైన భావాలు. కలిదోషం వల్ల మానవులలో కలిగే వికారాలు ఇవి. మీరు గోమాతను దర్శించి, సేవించి ఎంతో శ్రేష్ఠమైన పని చేశారు. గోవును మన సనాతన ధర్మదేవతగా వేదాలు అభివర్ణించాయి. మీరు సాక్షాత్తు కామధేనువు నుండి వచ్చిన కపిల గోవులను అనగా దేవతలనే సేవించుకున్నారు. ఇలాంటి అదృష్టం మీకు దక్కిందంటే మీకు దైవబలం తోడుగా ఉందని అర్థం. ప్రపంచాన్ని వినాశనం చేయాలనుకునే ఘోరకలిని అంతం చెయ్యటం కోసం అడుగు అడుగునా మిమ్మల్ని స్వాగతిస్తూ మీలోని అంతర్గత శక్తిని జాగృతం చేస్తున్నారు దేవతలు. ఘోరకలి అంతం అవ్వాలని, భూలోకం సురక్షితంగా ఉండాలని దేవతలు బలంగా కోరుకుంటున్నారని దానర్థం", అన్నాడు సిద్ధపురుషుడు.
 
" పాషండ భావాలు మాలో నుండి ఎలా పోయాయి స్వామి?" అడిగాడు సంజయ్
 
"శ్రీకృష్ణుడు శంభల కిచ్చిన వరం   వేణుగాన నాద శాస్త్రం. శాస్త్రాన్ని అనుసరించి చేసిన వేణుగానాన్నే మీరు విన్నారు. వేద విరుద్ధమైన భావాలు మీలో నుండి మాయమైపోయే గానమది. వేదాలని స్మృతి చేతనే గుర్తుపెట్టుకుని, పదే పదే మననం చేసుకునేవారు మన ఋషులు. ఇంద్రియాలలో ముఖ్యమైనది శ్రవణ శక్తి. కలియుగంలో శక్తి దుర్వినియోగం అవుతోందని చెప్పక తప్పదు. వినకూడని శబ్దాలు ఎన్నింటినో మీరు వినటం చేత మీలోకి పాషండ భావాలు చొరబడ్డాయి. ఒక్క చెవులకే కాదు మన జ్ఞానేంద్రియాలు అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇంద్రియాలకు నియమం అంటూ లేకపోతే మాత్రం విష్ణు నామం ఉచ్ఛరించటానికి కూడా మనస్కరించని దుస్థితికి వెళ్ళిపోతాడు మనిషి. తనకు దేవుడిచ్చిన ఇంద్రియ శక్తిని ఉపయోగించుకోకపోయినా పోయేదేంలేదు కానీ దుర్వినియోగం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే దేహమే దేవాలయం అన్నారు. దేవాలయం లాంటి దేహంలో ఉన్న ఇంద్రియాలు గుడి తలుపుల లాంటివి. పవిత్రమైన దేవాలయంలోకి ఎవరిని అనుమతించాలి అన్న విజ్ఞత ఉండాల్సింది మనిషికే కదా, అంటూ చెప్పటం ముగించాడు.
 
"స్వామి నాదొక చివరి ప్రశ్న", అడిగింది అంకిత.
అదేమిటో అడుగు అన్నట్టు చూసాడా సిద్ధపురుషుడు.
 
" ప్రాకారానికి  అభయః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చింది?" అని అడిగింది అంకిత.
 
"కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి వైరాగ్యం కలిగినప్పుడు జ్ఞానబోధను చేసి తిరిగి తనని కార్యోన్ముఖుడిని చేశాడా కృష్ణ పరమాత్మ. తద్వారా లోకానికి  భగవద్గీత  దొరికింది. కష్టం వచ్చిన ప్రతీ సారి మనకు అభయాన్ని ఇచ్చేది శ్రీకృష్ణుడేనమ్మా. అలాంటి శ్రీ కృష్ణుడు ధ్యానించిన చోటిది. ఆయనే లలితాదేవిని ఉపాసన చేసిన స్థలమిది. అనగా ఆయనకు  అభయాన్ని ఇచ్చే ఆది పరాశక్తిని ధ్యానించాడిక్కడ. అలాంటి ప్రాకారం   అభయః ప్రాకారం కాక మరేం అవుతుంది" అంటూ మరొక్క మారు శ్రీకృష్ణుడిని తలచుకున్నాడా సిద్ధపురుషుడు.
 
"తరువాత వచ్చే ప్రాకారం ఏది?" అని అక్కడున్న ఇద్దరు సైనికులను సిద్ధపురుషుడు అడిగాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 20-04-2024, 02:16 PM



Users browsing this thread: 7 Guest(s)