Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Inspiration పీత కష్టాలు పీతవి
#3
అశోక వనంలో దిగులుగా కూర్చున్న సీత వద్దకు వెళ్ళింది త్రిజట.
" త్రిజటా! నా రాముడు ఎప్పుడొస్తాడో నీకేమైనా తెలిసిందా? రాముడు లంకలో అడుగు పెట్టాడన్న శుభవార్త ముందుగా నీనోట వినాలని ఎదురు చూస్తున్నాను. నీ ఓదార్పు మాటలే నా ప్రాణం ఇంతవరకు నిలిచేలా చేశాయి. భూజాతనైన నాకు మాతృ వాత్సల్యాన్ని పంచిన దానివి నువ్వు" అంది సీత త్రిజట వంక చూస్తూ.



" అమ్మా! లోకానికే తల్లివి నువ్వు. నీతో నాలుగు మంచి మాటలు మాట్లాడిన అదృష్టం నాది. ఇక విషయం చెబుతాను విను. వంద కోట్ల వానర సైన్యం, యాభై కోట్ల భల్లూక సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రాక్షస సంహారం చేద్దామా అని వారందరూ ఉవ్విళ్లూరుతున్నారు. వారధి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. మొదలు పెడితే ఐదే రోజుల్లో పూర్తి అవుతుంది. తరువాత రావణ సంహారం తథ్యం " సీతను ఓదారుస్తూ చెప్పింది త్రిజట.
" ఐతే ఆ వారధి నిర్మాణం తొందరగా జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తాను. ఇక్కడ ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతున్నాను." అంది సీత.
 
" మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ..." ఏదో చెప్పబోయి ఆగింది త్రిజట.
"నీ సంకోచం నాకు ఆందోళన కలిగిస్తోంది. వారధి నిర్మాణానికి ఆటంకాలేమైనా ఉన్నాయా?" ఆందోళన నిండిన స్వరంతో ప్రశ్నించింది సీత.
 
" తల్లీ! ఇది చెప్పదగ్గ విషయం కాదు. కానీ మీ వద్ద నేనేదీ దాచను. వారధి నిర్మాణం ఆలస్యం కావాలని సముద్ర తీరంలోని పీతలు రేపు సమావేశమై సామూహికంగా దేవుడిని ప్రార్ధిస్తున్నాయట" చెప్పింది త్రిజట.



ఆశ్చర్యపోయింది సీత. " పీతలు వారథి ఆలస్యం కావాలని ప్రార్ధిస్తున్నాయా? ఎందుకు వాటికి నా పైన కక్ష? ఈ సృష్టిలో సకల జీవరాశులు రామకార్యానికి సహకరిస్తాయంటారే! నన్ను కాపాడటానికి పక్షీంద్రుడైన జటాయువు తన ప్రాణాలను అర్పించాడే! పర్ణశాలలో ఉన్నప్పుడు క్రూర మృగాలు సైతం హాని తలపెట్టలేదే! వానర వీరులు, భల్లూక యోధులు తమ ప్రాణాలకు తెగించి కౄరులైన రాక్షసులతో యుద్ధానికి సిద్ధమయ్యారే! మరి ఈ పీతలకు దీనురాలైన ఈ సీతమీద కక్ష ఎందుకో?” ఆవేదనతో పలికింది సీత.
" అమ్మా! లక్షలాది పీతలు సముద్ర తీరంలో గుడ్లను పొదుగుతున్నాయి. ప్రస్తుతం అవి కదిలే పరిస్థితిలో లేవు. వారధి నిర్మాణం కాస్త ఆలస్యం అయితే వాటి పని పూర్తి అవుతుంది. తరువాత అవి వేరొక చోటికి వెళ్లిపోవచ్చు. అందు కోసం రేపు పీతలన్నీ కలిసి దేవుడిని వేడుకుంటాయట. పీత కష్టాలు పీతవి. అయినా సాక్షాత్తు దైవ స్వరూపుడైన రామకార్యాన్ని, పీతల కోసం ఏ దేవుడు మాత్రం ఆపగలడు? " అంది త్రిజట ఈసడింపుగా.



కళ్ళు మూసుకొని తీక్షణంగా ఆలోచించింది లోక పావని. గుడ్లను పొదుగుతున్న లక్షలాది పీతలు వానరుల పాదాల క్రింద పడి నలిగిపోవడం ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఆ దృశ్యాన్ని చూడలేక వెంటనే కళ్ళు తెరిచింది.
 
" త్రిజటా! నా రాముడి కోసం ఎన్నో రోజులు యుగాల్లా గడిపాను. మరి కొన్ని యుగాలైనా ఎదురు చూస్తాను. ఆ అల్ప ప్రాణులు నాకోసం బలి కాకూడదు. వాటి కోసం నేను కూడా ప్రార్థిస్తాను." దృఢ నిశ్చయంతో చెప్పింది భూజాత.

త్రిజట కళ్ళు చెమ్మగిల్లాయి. "ఆ రాముడికి తగ్గ సతివి నువ్వు. మానవులుగా పుట్టి దైవత్వం కలిగినవారు దేవతలకన్నా గొప్పవారు. మరి ఆ దేవుడి నిర్ణయం ఎలావుంటుందో వేచి చూడాలి" సీతకు భక్తితో నమస్కరిస్తూ చెప్పింది త్రిజట.

***

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పీత కష్టాలు పీతవి - by k3vv3 - 17-04-2024, 09:41 PM



Users browsing this thread: 1 Guest(s)