Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#75
శంభల రాజ్యానికి పయనం – 3
సంకల్ప బలానికి శల్య పరీక్ష
రాముడు చెప్పినట్టే వాయవ్య దిశగా వెళ్లగా ఒక యోజనము దూరం అనగా 8 /10 మైళ్ళ దూరం లేదా 16 కిలోమీటర్ల దూరం నడిచాక వారికి సీతా నది కనిపించినది. నది దర్శనం చేసుకున్న తర్వాత వారు అక్కడే కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. అంతలో అక్కడికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. సిద్ధపురుషునికి అభివాదం చేసి సంజయ్, అభిజిత్, అంకితలను ఒకసారి తీక్షణంగా చూసాడు.
"మీలో అచంచలమైన దీక్ష, పట్టుదలలు మెండుగా ఉన్నవి. మీకు సిద్ధపురుషుని సాంగత్యం దొరకటం ఒక వరం. ఎంత గొప్ప శిష్యుడికైనా సరైన గురువు దొరికినప్పుడే తను నేర్చుకునే విద్యకు సార్థకత చేకూరుతుంది. అలానే ఇన్ని కష్టనష్టాలు అనుభవిస్తూ మీరు చేస్తున్న ప్రయాణం  సిద్ధపురుషుని వల్లే గమ్యం దిశగా చేరుకుంటోంది. మీకు మహానుభావుడి వల్లే రామలక్ష్మణుల దర్శన భాగ్యం కలిగింది. ఇదంతా మీకు చెప్పటానికి ఒక బలమైన కారణం ఉన్నది. సీతా నదిని దాటిన తర్వాత మీకు ఎదురయ్యే ప్రతీ ఒక్కరు మీ నమ్మకాలను, విశ్వాసాలను చాలా లోతుగా పరీక్షిస్తారు. ఎక్కడ చిన్న లోపం ఉన్నట్టు వారికి అనిపించినా మీ ఉనికినే దెబ్బ తీయ్యాలని ప్రయత్నిస్తారు. లంకిని లాంటి రాక్షస స్త్రీలు, శంఖినీ జాతి స్త్రీలు, శాకిని, డాకిని లాంటి పిశాచ స్త్రీలు మీకు కనబడతారు. శంఖినీ స్త్రీలు చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. వారి పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వారు పురుషుణ్ణి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. శంభల రాజ్యానికి మీరు వెళ్ళాలి అంటే కఠిన పరీక్షల్ని ఎదుర్కోక తప్పదు. ఆడవారికి రాక్షస స్త్రీలు తారసపడతారు. మగవారికి శంఖినీ జాతి స్త్రీలు ఎదురవుతారు. శృంగార భావనలని ప్రేరేపిస్తారు. పిశాచ స్త్రీలు ఆడవారికి, మగవారికి ఎదురవుతారు. ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఒక్క విషయం మాత్రం మనసులో స్థిరంగా గుర్తు పెట్టుకోండి. మన భావనకు చాలా బలమున్నది. మనసుయందు మహాశివుణ్ణే నెలకొల్పి మీరు అడుగు ముందుకేస్తూ ఉంటే చాలు మిగతాది ఆయనే చూసుకుంటాడు. హంస దేవత వివేకాన్ని ఇచ్చి చీకట్లను పారద్రోలుతుంది. అందుకే మీకు  
హంస గాయత్రి
మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను.
 
 
ఓం 
హంస హంసాయ విద్మహే 
పరమ హంసాయ ధీమహి 
తన్నో హంసః ప్రచోదయాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః 
 
ఏదైనా ఉపద్రవము వచ్చినప్పుడు మంత్రాన్ని మూడు సార్లు మననం చేసుకోండి. మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది.
 
ఓం నమః శివాయ
", అనేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు మునీశ్వరుడు.
"మనల్ని గెలిపించటానికి గొప్ప గొప్పవాళ్ళు దారి పొడుగునా తారసపడుతూ జ్ఞానోపదేశం చేస్తున్నారు కదా!" అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు సిద్ధపురుషుడు.
మౌనదీక్షలో ఉండటంతో సంజయ్, అభిజిత్, అంకితలు ఏం మాట్లాడలేకపోయారు. వారి కళ్ళల్లో మాత్రం కృతజ్ఞతా భావం కనబడింది. మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేస్తూ గడిపారు కాసేపు.
 
తర్వాత రాముడు చెప్పినట్టుగానే సీతా నదికి వాయవ్య దిశగా బయలుదేరారు.
కొంత దూరం వెళ్ళగానే వెలుగు అమాంతం తగ్గిపోయింది. తగ్గిపోవటం కాదు అస్సలు లేకుండా పోయింది. సంజయ్, అభిజిత్, అంకితలు ఎవరు ఎక్కడున్నారో వారికే తెలియట్లేదిప్పుడు. మౌనదీక్షలో ఉన్నారు కాబట్టి బయటికి గట్టిగా మాట్లాడలేరు. సిద్ధపురుషుడు ఎక్కడున్నాడో కూడా వారికి తెలీదు. సిద్ధపురుషుడు ఏదైనా మాట్లాడతాడేమో అని లోలోపల ఆశతో ఎదురుచూస్తూ ముందుకెళ్తున్నారు చీకట్లోనే. అది అలాంటి ఇలాంటి చీకటి కాదు. చుట్టూ చీకటి. కింద, పైన చీకటి. నిశీథినీ సముద్రంలా అనిపించింది వారికి.
శబ్దమూ లేదు. అలికిడి లేదు. అంత సేపు మౌనదీక్షలో ఉన్నా కూడా అనుభవించనంత నిశ్శబ్దాన్ని వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు. కానీ అది ఆనందాన్ని ఇచ్చే నిశ్శబ్దంలా అనిపించట్లేదు. భయాన్ని పెంచి పోషించే క్రూరమైన నిశ్శబ్దంలా అనిపిస్తోంది. నిశ్శబ్దంలో, చీకట్ల సాగరంలో, భయాందోళనలో సంజయ్, అభిజిత్, అంకితలకు వారిలో ఉన్న నిజమైన ధైర్య, సాహసాలేంటో తెలిసొచ్చాయి. ఇదంతా దేని కోసం చేస్తున్నాం అన్న ప్రశ్న మొదలైంది వారిలో. చాలా ముఖ్యమైన ప్రశ్న అది. జీవితంలో మనం పనినైనా విజయవంతంగా చెయ్యాలంటే ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే చాలు. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది.
అశుతోష్ ని కాపాడటానికి ఇంత రిస్క్ చేశారా?
ప్రపంచాన్ని ఘోర కలి నుండి కాపాడటానికా?
సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో ఆయన ఏది చెప్తే అది చేశారా?
ఇవేవి కావు. ముగ్గురికీ ఒక్కటే అనిపించింది. శంభల రాజ్యానికి వెళ్ళటం అన్నది విధి లిఖితం. ఎలాగైనా సరే అది జరిగే తీరుతుంది అని అనిపించింది క్షణంలో సంజయ్, అభిజిత్, అంకితలకు. ఏదైతే విధి లిఖితమో దాన్ని ధైర్యంగా ఎదుర్కోవటమే ముందున్న లక్ష్యం అని ఎవరో హితబోధ చేసినట్టుగా అనిపించింది ముగ్గురికీ. వెంటనే వాళ్లలో ఉన్న సంశయాలన్నీ పటాపంచలు అయ్యాయి. ధైర్యంగా అడుగేస్తూ ముందుకెళ్లారు చీకట్లలోనే.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 09-01-2024, 07:00 PM



Users browsing this thread: 6 Guest(s)