Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అహం తుభ్యం ప్రణయామి
#3
అమ్మాయి వేసుకున్న చీరకు మ్యాచ్ అయ్యేలా వైట్ షర్ట్, ఇంకా క్రీమ్ ప్యాంట్ వేసుకున్నా. సింపుల్ గా వున్నా, అమ్మాయి వేసుకున్న బంగారు బార్డర్ వున్న తెల్ల చీరకు బాగా మ్యాచ్ అవుతుంది.
మా నాన్న అప్పటికే కేకలు పెడుతున్నాడు. హా..! నాన్న, వస్తున్నా...నా రాకతో ఇక అందరూ కదిలారు.
"ఇక్కడ మనకు ముఖ్యంగా నాలుగు దేవాలయాలున్నాయి. రామాలయము, శివాలయము, లక్ష్మీ కేశవాలయము, సోమేశ్వరాలయము. ఒక్కొక్కటిగా దర్శించుకుంటూ వెళ్దాం.", హరిశ్చంద్ర గారు మాకు వివరించారు.
*****
రామాలయము దర్శించుకున్నాము. ఇక శివాలయము... పద్ధతులు, మంత్రాలు, మహా హారతి నన్ను ఒక్కసారిగా దైవత్వానికి దగ్గర చేశాయి. ఎక్కడా నేను అలాంటి పూజా నిర్వహణను చూడలేదు
'ఓం నమః శివాయ'
అని అందరూ అంటుంటే నా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. ఇంతలో నా పక్కగా తెల్లని చీర నామీదుగా వెళ్ళింది. సరిగ్గా నా ముందర నిల్చుంది. భక్తిలో మునిగి, సరిగ్గా ముక్తిని పొందేటప్పుడు... ఎవరో చేయి పట్టుకుని వెనక్కిలాగి...ఇంకా జీవితంలో చాలా చూసేవున్నాయి అని చెప్పినట్లనిపించింది. నా ముక్తి మార్గానికి అడ్డుకట్ట వేసింది. నేను గుళ్ళో వున్న విషయంకూడా మర్చిపోయాను. తననే చూస్తున్నా...చూస్తూనే వున్నా...
ఎంతో మంది మునులు, మహర్షులు రంభ...ఊర్వశి...మేనకలను చూడగానే తపోభంగం ఎందుకయ్యేదో నాకప్పుడు అర్థమయింది. ఎంతో నిష్ఠగా చేస్తే గానీ వీలయ్యేది కాదు. వాళ్ళ ముందు నేనెంత. వెర్రి కుంకని.
 'ఓం నమః శివాయ'
బదులు నా మది...
 'ఓహో మేఘమాలా...నీలాల మేఘమాల. చల్లగ రావేలా... మెల్లగ రావేలా...'
 అని పాడసాగింది.
"ఎమోయ్ భలే రాముడు...తీర్థం పుచ్చుకోవయ్యా. మరీ అంత భక్తిలో మునిగి తేలుతున్నావు. నీ కోరిక భగవంతుడు నెరవేర్చుగాక", పంతులు నన్ను భలే రాముడనేందుకు పిలిచాడో అస్సలంతుచిక్కలేదు.
గుడిలో వున్నానని కూడా లేకుండా నా మది అమ్మాయి గురించి ఇన్ని విధాలుగా ఆలోచిస్తుంది. కానీ నేను ఏం చేయలేకున్నా. మనసు మాట వినకుంది.
*****
గుళ్ళన్నీ దర్శించుకున్నాం. ఇక ఇంట్లో భోజన కార్యక్రమం.
అసలు సిసలైన బ్రాహ్మణ భోజనం. వర్ణనాతీతం. అందుకేనేమో ఒకసారైనా బ్రాహ్మణుడి ఇంట్లో భోంచేయాలంటారు. చక్కగా ఆరగించి అందరూ కొంచెంసేపు తల వాల్చారు.
*****
"మనం సంస్కృత భాష గురించి ఎంతచెప్పినా తక్కువే.. భాష నేర్చుకోడం చాలా సులువు. రేపు ఉదయాన్నే గ్రామ పాఠశాలకు వెళదాం.", హరిశ్చంద్ర గారు వివరిస్తుంటే అందరూ ఆయన చుట్టూ కూర్చున్నారు.
తాతయ్య నేను అలా బయటకెళ్లొస్తా. క్లైమేట్ని ఎంజాయ్ చేస్తా...
*****
ఏడుగంటలైంది.అప్పుడే చీకటయిపోయింది. చల్లటి గాలి వీస్తుంది. చెప్పుల్లేకుండా నేలపై నడుస్తుంటే...ఐసు ముక్కలపై నడిచినట్లనిపిస్తుంది. నావెనక చిన్నగా మొదలైన గజ్జెల శబ్దం పెద్దగా వినిపించసాగింది. తిరిగి చూస్తే...ఇంకెవరు, తనే...
"నన్ను కూడా పిలవచ్చుగా. నేనూ వచ్చేదాన్ని."
పిలవచ్చు. కానీ మనకంత పరిచయం లేదుగా..బాగోదనీ...
"మరీ అంత నటించకు...అస్సలు అమ్మాయిలే తెలియనట్లు. ఏం పర్లేదు మాట్లాడొచ్చు."
యూ ఆర్ సో కూల్.
"థాంక్స్. మనం రొటీన్ గా కాకుండా కొంచెం వేరేవేమన్నా మాట్లాడుదామా? లేకుంటే బోర్ కొట్టేస్తుంది."
మధ్యాహ్నం మనం తిన్న మిరియాల రసంలో కాస్త ఉప్పు తక్కువయ్యింది. నీకేమన్నా అలా అనిపించిందా?
"అమ్మో మరీ ఇంత డిఫరెంటుగానా...వద్దులే మహాప్రభు."
ఈరోజు ముందు వరకు నా జీవితంలో చూడని అమ్మాయితో ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు. బట్, నీతో మాట్లాడిన తరువాత చెప్పినా తప్పు కాదనిపిస్తుంది.
"ఓహో...అలా అయితే చెప్పు. నేను చూడటానికి బాగున్నాననేగా?"
నువ్వు బాగుంటావని నీకు తెలియదా...నేను మరీ చెప్పాలా. కానీ ఇది తప్పక చెప్పి తీరాలి . తెల్లటి పట్టు చీరలో... పండు వెన్నెలను కూడా డామినేట్ చేస్తున్నావ్. నిజంగా చాలా చాలా బాగున్నావ్. పెళ్లి చూపుల్లో నిన్ను చూస్తే...వద్దనే వాడు ఉండడేమో. నీ చీరకు మ్యాచ్ అవుతుందని, నేను కూడా వైట్ షర్ట్ వేసుకున్నా.
"ఓహ్...బానే మాట్లాడుతున్నావుగా. కవిత్వం కూడా బాగుంది. సినిమాల్లో ట్రై చేయి. అయినా నువ్వు ఓపెన్ గా చెప్పిన విధానం నాకు నచ్చింది."
తను అన్ని చెబుతుంది కానీ నా పేరు మాత్రం పలకట్లేదు. పిలిపు కోసమే ఎదురుచూస్తున్నా.
తన వెనుక తల నుంచి ఒక జ్ఞాన జ్యోతి పైకి ఎగిరింది. దేవత తన జ్ఞానాన్ని ఇంకొకరికి పంపిస్తున్నట్లుగా...
హేయ్... అది జ్ఞాన జ్యోతి కాదు. దూరంగా ఎవరో కార్తీక మాసం కావడం చేత తుంగా నదిలో దీపం వదులుతున్నారు. అది సరిగ్గా మేఘా తల వెనుకే జరిగింది.
నదిలో దీపాలు ముందరికి సాగుతున్నాయి. దీపాల కాంతి పెరగసాగింది.
"నేను కూడా కార్తీక దీపాన్ని నదిలో వదులుతాను."
ఇంతవరకూ చీకటిలో కేవలం ఆమె స్వర మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్న నాకు దీప కాంతిలో తన మోము దర్శనమిచ్చింది. ఈసారి మరింత తేజోవంతంగా...
జగత్తుకు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడికి మనసులోనే పాదాభివందనం చేసుకున్నాను. ఆయనకు భూమిపై గుడి లేనందుకు ఎంతో బాధ పడ్డాను. ఒకవేళ కట్టిస్తే, పని నేనే చేయాలి. మనకు తెలిసిన సుందరాంగులు రంభ, ఊర్వశి, మేనకా, తిలోత్తమ. తర్వాత విష్ణువు మోహినీ అవతారం దాల్చాడు. బ్రహ్మ వీళ్లందరూ ఈర్ష్య పడేలా అహల్యను సృష్టించాడు. నా కంటి ముందున్న మేఘాను చూస్తే అహల్య ఈర్ష్య పడుతుందనడంలో నేను మాత్రం సందేహించను.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఎందుకంటారో నాకిప్పుడర్థమైంది. అలాంటి వ్యక్తులను చూస్తుంటే...వారిలోని శక్తి మనవరకూ చేరుతుంది. నాలో ఇప్పుడు అదే శక్తి ఉంది. వారి శక్తిని ఐస్కాంతపు ముక్కతో పోల్చవచ్చు. నేనో ఇనుప ముక్కలాంటి వాణ్ణి. ఎక్కడ ఆకర్షణ శక్తి వుంటే వైపుగా వెళ్లి అతుక్కుని పోతాను. తనకి ఎవరూ సాటిరారు. రెప్ప వేయకుండా అలాగే చూస్తున్నా.
"హలో..! ఏంటో తదేకంగా ఆలోచిస్తున్నావు.", అని మేఘా అన్న మాటలకు శక్తి కాస్త రెట్టింపయింది. గొంతులోని మాధుర్యం అలాంటిది.
నువ్వు పాట పాడితే వినాలనుంది.
సిగ్గు పడి కొంత దూరం నడిచింది.
"నీవు కూడా జత కట్టాలి.
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో..."
 
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో...
 
"ఎందుకో విందుకో ఎవరితో పొందుకో..."
 
 "మంచు కురిసే వేళలో.....
 
అభిమన్యు, మధ్యాహ్నం మనం తిన్న మిరియాల రసంలో కాస్త ఉప్పు తక్కువయ్యింది. నాకు కూడా అలానే అనిపించింది."
నా పేరు అంత బాగుంటుందని తను పిలిచేవరకు నాకు తెలీలేదు. ......భి............న్యూ........
రచ్చహ...రచ్చస్య...రచ్చోభ్యహ అనిపించింది.
*****
పాఠశాలలో పిల్లలు గ్రాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తున్నారు. హరిశ్చంద్ర గారు అక్కడి ఉపాధ్యాయులను పరిచయం చేస్తున్నారు. పాఠశాలలో అన్నీ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు. మన సిటీ స్కూళ్లకంటే బాగున్నాయి.
అమ్మ, నాన్న మిగతవాళ్ళందరూ కూడా విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలంతో వున్నారు.
"తనే మనోఙ్ఞ. ఇక్కడే పిల్లలకు సంస్కృత పాఠాలను బోధిస్తారు. ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చినా...వాటిని వద్దని చాలా కాలంగా ఇక్కడే వుండి తన సేవలను అందిస్తున్నారు."
అందరం కూడా ఆమె తరగతి గదిలో కూర్చున్నాం. ఆమె చెప్పినవన్నీ విన్నాం. తనలో అమోఘమైన ప్రతిభ వుంది. మా నానమ్మ అయితే తనని తెగ పొగిడేస్తుంది. ఇక రాత్రి తిరుగు ప్రయాణం చేయాలి. నా సెలవులయిపోయాయి. ఈసారి తప్పకుండా వచ్చి ఇరవై రోజులుండి, సంస్కృతం నేర్చుకునే వెళ్తాను. మా నానమ్మ అప్పుడే ఇరవై రోజుల కార్యక్రమం గురించి తెగ సంబరపడిపోతుంది. మరో సారి కూడా అందరం వస్తాం. మేఘా వాళ్ళు కూడా ఈరోజు రాత్రే బయల్దేరుతున్నారు.
*****
"నమో నమః! మమ నామ మేఘమాల. భవతః నామ కిమ్?"
మమ నామ అభిమన్యుః.
"భవాన్ కథమస్తి?"
అహం సమ్యక్ అస్మి.
"మేలనేన బహు సంతోషహ"
ధన్యవాదః, శీఘ్రం మిలయామహా...శుభరాత్రి..నమో నమః
వెళ్లిపోయేముందు మేఘా, నేనూ మాట్లాడుకున్న మాటలివే. మొత్తానికి ఆకొంత సంస్కృతం నేర్చుకున్నాం. మరీ ఎప్పుడు కలుస్తామో. తనని వీడి పోవడం ఖచ్చితంగా బాధాకరం.
*****

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అహం తుభ్యం ప్రణయామి - by k3vv3 - 31-12-2023, 04:07 PM



Users browsing this thread: 1 Guest(s)