Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#20
ఇంక తప్పక రాత్రికి ఇంటికి చేరాను. అమ్మ గుమ్మo దెగ్గర కూర్చుంది. చాలా సేపు ఏడిచినట్టుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
ఫోన్ కూడా తీసుకెళ్ళకుండా ఎక్కడికెళ్ళావ్ అన్నయ్యా? అమ్మ ఎంత కంగారుపడిందో తెల్సా?” అరిచాడు చిన్ను గాడు.
అమ్మ వైపు చూసాను. కాని అమ్మ నన్ను చూడలేదు. లేచి వెళ్ళిపోయింది. నాకు అన్నం పెట్టడానికి అన్నీ తెస్తుంది అని అర్ధం అయ్యింది.
నాకు ఆకలిగా లేదు.” అని బెడ్ రూమ్ వైపు నడిచాను.
కోపం ఏదన్నా ఉంటే నా మీద చూపించు. అన్నం మీద కాదు. నీకు దండం పెడతా. అన్నo తిను. నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నేను ఇక్కడినించి వెళ్ళిపోతాను. కాని నువ్వు తినను అనకు.” అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయింది.
నాకు తినబుద్ధి కాకున్నా మళ్ళీ అమ్మ గొడవ చేస్తుందని కొంచెం తిన్నాను. అమ్మ స్నానం అయ్యేలోపు పడుకున్నాను. కనీసం కళ్ళు మూసుకొని పడుకున్నట్టు నటించాను.
కాని పడుకునే ముందు ఒక పేపర్ తీసిరేపు హాస్టల్ కి వెళ్తున్నాను.’ అని రాసి, దిండు పక్కన పెట్టి పడుకున్నాను.
అమ్మ ఏమనుకుందో కాని ఏమీ మాట్లాడలేదు. చిన్నుకి అన్నం పెట్టి పడుకోబెట్టింది. తను తిన్నట్టు శబ్దం మాత్రం రాలేదు. నేను మాత్రం దుప్పట్లోనుంచి కదలలేదు. కళ్ళు తెరవలేదు. లేచి అమ్మను తినమని చెప్పాలనిపించింది, కాని చెప్పలేదు.
అస్సలు నిద్ర పట్టలేదు. అటు ఇటు కదులుతూనే ఉన్నాను. అమ్మ బెడ్ రూమ్ నుంచి అలికిడి అవుతుంది. తను కూడా పడుకున్నట్టు లేదు.
లేచి కూర్చున్నాను. ఏడిచాను.... చాలా.
అర్ధరాత్రి అమ్మ నా బట్టలు సర్ది పెట్టింది. నేను ప్రతీసారీ తీసుకెళ్ళే పిండివంటలు కూడా. అన్ని సర్ది, పక్కన డబ్బులు కూడా పెట్టింది. నా చీటీ చూసిందన్నమాట. దుఃఖం ఇంకా ఎక్కువయ్యింది.
బెడ్ రూమ్ దెగ్గరికి వెళ్ళాను. డోర్ దెగ్గరే ఆగాను. లోపలి చూడలేదు.
అమ్మా..... నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నావా?”
సమాధానం లేదు, ఏడుపు మాత్రం వినిపించింది.
ఎప్పుడు తెల్లారుతుంది అని ఎదురు చూస్తూ కూర్చున్నాను.
పొద్దున్నే ఆరింటికి బస్సు ఉంటుంది. లేచి స్నానం చేసాను. నేను వెళ్ళిపోతే చిన్ను ఎలా ఒస్తాడో అనిపించింది. వాడిని వదిలిపెట్టి పోబుద్ధి కాలేదు, కానీ తప్పదు. ఇంకో పది రోజులు వాడు ఇక్కడే హాయిగా ఉంటాడు. కావాలంటే అమ్మ తీసుకొస్తుందిలే అనుకున్నాను.
నేను స్నానం చేసేవరకు అమ్మ లేచి టిఫిన్ చేసింది. అమ్మతో మాట్లాడకుండా ఇవన్నీ చేయించుకోవడం నచ్చలేదు నాకు. ఏదో తప్పు చేస్తున్నాననే భావన. మళ్ళీ అమ్మ చేసిన పని... ఇవన్నీ గుర్తొస్తున్నాయి మాటిమాటికీ.
నాకు టిఫిన్ అక్ఖర్లేదు. బయట తింటా.” అని చెప్పి బాగ్ తీసుకొని ఒచ్చేశాను.
ఆరింటి బస్సు ఎక్కితే రాత్రికి దిగుతాను.ఎప్పుడూ రాత్రి బస్సు ఎక్కడమే అలవాటు. పొదున్నకల్లా దిగిపోవచ్చు. కాని ఇప్పుడు రాత్రి వరకు ఆగడం నా వల్ల కాదు. కాని ఇంట్లోంచి ఒచ్చేసినా తేడా ఏమీ లేదు. మనసంతా ఏదో మెలి పెట్టి తిప్పేస్తున్నట్టుగా ఉంది. ఫీలింగ్ ఎప్పుడు పోతుందో ఏమో! చచ్చిపోవాలనికూడా అనిపించింది. కనీసం అమ్మ పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పినా బాగుండేది. ఎక్కడో మూలలో ఆశ ఉండింది నాలో. కాని ఇప్పుడు అది కూడా లేదు. కోపమో, బాధో ఇంకేంటో తెలియదు.
 అమ్మతో మాట్లాడకూడదు ఇంకా అనుకున్నా. కాని కాలేజీ, తిండీ, బట్ట అన్ని అమ్మ పెట్టేవే. అందుకే చావు గుర్తొచ్చింది. నాన్న గుర్తొచ్చారు. ఆయన ఉంటే ఎంత బాగుండేది. చివర్లో ట్రీట్మెంట్ వల్ల మనిషి మనిషిలో లేరు ఆయన, ఏమీ గుర్తుండకపోయేది, తడబడేవారు. కాని అలాగే ఉన్నా బాగుండు. పోకుండా.
ప్రీతికి ఫోన్ చేశాను, ఎత్తలేదు. ఎక్కడో చుట్టాలింట్లో ఉన్నా, మాట్లాడటం కుదరదు అని మెసేజ్ ఇచ్చింది. రాత్రికి ఒస్తున్నా, వీలైతే రేపు కలవమని రిప్లై చేశాను. చాలా హ్యాపీ, ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పింది. తనతో మాట్లాడినా కాస్త రిలీఫ్ గా ఉండేది. తన లోకంలోకి నన్ను లాక్కెళ్ళిపోయేది..
మధ్యలో లంచ్ కి బస్సాపారు. నేను దిగలేదు, తినలేదు.
డైరెక్ట్ గా రాత్రి ఊళ్ళో దిగి హాస్టల్ కి వెళ్ళాను. నా రూంలో ఎవ్వరూ లేరు. హాలిడేస్ ఉండగా ఇంకా ఎవరూ రారు కదా.
బెడ్ మీద పడ్డాను. ఆకలవుతుంది. ఇక్కడ తినాలనిపించలేదు. పక్కన హోటల్లో ఏమైనా తెచ్చుకుందాం అని లేచాను. జేబులో చూస్తే అమ్మ ఎప్పటికంటే ఎక్కువ డబ్బులే పెట్టింది. కాని దానితోపాటు ఒక కాగితం కూడా ఉంది. పొద్దున్నించి ఉందా? నేను గమనించనే లేదు.
అమ్మ రాసి పెట్టింది, ఉత్తరం.
భార్గవా,
రోజు ఎప్పుడో ఒకప్పుడు ఒస్తుందని నాకు తెలుసు. తెలిసినా ఇది ఎంత ఆలస్యంగా ఒస్తే అంత బాగుండు అని దాటవేస్తూ వచ్చాను. ఎందుకంటే ఈరోజు తరవాత నా జీవితం ఎలా ఉంటుందో, అసలు ఉంటుందో ఉండదో నాకు అంతుబట్టేది కాదు. కాని నాకు దాని మీద చింత లేదు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి. నేను చెప్పేది వినాలంటే, విని అర్ధం చేసుకోవాలంటే నీ మనసు కూడా పెద్దది చేసుకోవాలి.
నా వయసు 18 ఉన్నప్పుడు నాకు పెళ్ళయ్యింది. ఆరోజు నుంచి మీ నాన్నే నాకు లోకo. వేరే అయినవాళ్ళెవరూ లేరు. మీరు పుట్టేవరకూ ఆయనే నా ప్రపంచం, తరవాత మీరిద్దరూ. ఇంకెవరూ అక్ఖరలేదనుకున్నాను. నీకు గుర్తుండే ఉంటుంది, మన చిన్న ప్రపంచం మనకెంత హాయిగా ఉండేదో. మీ నాన్న జీతం ఎంతుందో అంతలోనే మన ఇల్లు హాయిగా నడిచేది. ఎప్పుడయినా ఇబ్బందయినా అందులోనే సర్దుకునేవాళ్ళం. ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే మీ నాన్న ఉన్నప్పుడు దాచింది ఏమీ లేదు, ఆనందం తప్ప.
అలాంటి సమయంలో అనుకోకుండా ఆయన కాన్సర్ బారిన పడ్డారు. మీరింకా చిన్న పిల్లలు అప్పటికి,. ఒచ్చిన నాడే డాక్టర్ చెప్పారు ఒక సంవత్సరం కంటే మీ నాన్న ఎక్కువ ఉండే అవకాశం లేదు అని. అది వినగానే సగం చచ్చాను నేను. ట్రీట్మెంట్ కోసం చాలా కష్టపడ్డాం. మనది అనేది ఏదైనా విలువ ఉన్న వస్తువుంటే అదప్పుడు కరిగిపోయింది. డబ్బు ఎక్కడినించి ఒస్తుంది? తరవాత మనం ఎలా బతకాలి అని నేను ఏనాడు ఆలోచించలేదు. మీ నాన్న వీలయినన్ని రోజులు మనతో ఉండాలి. అదొక్కటే ఆలోచించాను అంతే.
అది తప్పో, ఒప్పో నాకు తెలియదు. నువ్వే చెప్పాలి. ఎంత కష్టపడ్డా ఆయన ఒక ఏడాదికి పోయారు. ముందే తెలుసు ..అయినా నేను తట్టుకోలేకపోయాను. మీకోసం తేరుకొని చూసేసరికి చేతిలో రూపాయి లేదు. ఒక నాలుగు లక్షలు అప్పు కూడా అయ్యింది. అదంతా చలపతిరావుగారు చూసుకున్నారు. మీ నాన్న పోయాక నాకు చెప్పారు డబ్బంతా ఆయనే కట్టారు అని. మీ చదువులు, అవసరాలు అన్నీ ముందున్నాయి.
నాకు భయం వేసింది. నేను హై కాలేజీ కూడా సరిగ్గా పాసు కాలేదు. నాకు ఉద్యోగం ఎవరిస్తారు? డబ్బు ఇవ్వకుండా ఆయనకు నమస్కారం పెట్టి, మిమ్మల్ని తీసుకొని ఊరికయినా వెళ్ళిపోదాం అనుకున్నా. కాని ఎక్కడికెళ్ళినా చిన్న పని చేసో బతకాలి. బతకోచ్చేమో.... కాని మీ భవిష్యత్తు? మిమ్మల్ని కూడా నాలా ఏదో సగం చదువులతో సరిపెడితే మీ నాన్నగారి కోరిక తీరదు అనిపించింది. మీరు కూడా నా వల్ల జీవితాంతం కష్టపడతారు అనిపించింది. మీరు పుట్టినప్పటినించి మీ నాన్న అనేది ఒక్కటే.. మీరు బాగా చదవాలని.... అదే నా చెవుల్లో మార్మోగింది. కాని ఎలా.... ? మిమ్మల్ని చదివించడానికి మార్గం ఏది. మాట్లాడడానికి కాని, ఒక సహాయం అడగడానికి కూడా ఎవరూ లేరు. ఒక్కదాన్ని నేను..
అలాంటి సమయంలో చలపతిరావుగారు ఒచ్చారు. తన బాకీ మొత్తం మాఫీ చేస్తా అన్నారు. మీరు జీవితంలో ఎంత చదువుతారో, ఒక మంచి జీవితానికి మీకేం అవసరం అవుతుందో ఆయనే చూసుకుంటా అన్నారు. అలా అని నోటు మీద రాసిచ్చారు. కాని నన్ను ఆయనతో ఉండమన్నారు.
విషయం రాయడానికి ఎంత నరక యాతన అనుభవిస్తున్నానో ఆయన మాట అన్నప్పుడు అంతకు వెయ్యింతలు అనుభవించాను. ఆయన మంచివాడో, చెడ్డవాడో నాకు తెలియదు. కాని నా కళ్ళముందు మీరిద్దరే ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే చాలీ చాలని చదువుతో జీవితాంతం కష్టపడే మీరు, ఇంకో నిర్ణయం తీసుకుంటే కావాల్సింది చదువుకొని జీవితంలో స్థిరపడే మీరు. దీనికి నేను నా జీవితంలో నుంచీ ఒక పదేళ్ళు ఆహుతివ్వాలి.
కాని అది నన్ను బతికినన్నాళ్ళూ వెంటాడుతుంది. కొన్ని రోజులు ఉద్యోగం చేద్దామని ప్రయత్నించాను. మీరనుకున్నట్టు నాన్న గారి ఆఫీసులో నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ఆయా పని. కాని నెల తిరిగేసరికి మీ కాలేజ్లో ఫీసు కట్టమని, కట్టకపోతే తీసేస్తామని చెప్పారు. నా ఆయా జీతం మీ ఫీసుకే సరిపోలేదు. రోజే చలపతిరావు దెగ్గర నోటు మీద రాయించుకున్నాను. కాని మీరు ఇక్కడుంటే నా విషం మీకు అంటుకుంటుంది అని మిమ్మల్ని హాస్టల్ కి పంపేసాను.
నేను చేసింది నీచమయిన పని అని నీకు అనిపించొచ్చు. అది నిజం, నేను ఒప్పుకుంటున్నాను. నేను చేసినది క్షమించారాని నేరం. కాని దానికి నిన్ను నువ్వు శిక్షించుకోకు... నన్ను శిక్షించు..నాతో మాట్లాడకు, నన్ను తిట్టు, కాని నా గురించి ఎక్కువగా ఆలోచించకు. కేవలం చదువుకో. నువ్వు ఒక మంచి స్థితికి చేరుకున్నాక అప్పుడు కావాలంటే నన్ను నీతో తీసుకుపో. ఒద్దనుకుంటే ఇంకా మంచిది. నీ తమ్ముడిని బాగా చూసుకో. మీరిద్దరూ కలిసుండాలి ఎప్పటికీ. మీతో నేను లేకుంటే ఏమీ ఫరవాలేదు. నా గురించి నాకు పట్టింపు లేదు.
ఇది నువ్వు నన్ను అర్ధం చేసుకోవాలని కాదు. నీ దృష్టి నీ చదువు మీద, నీ జీవితం మీద మాత్రమే ఉండాలని. వేరే బాధా నిన్ను దారి తప్పించొద్దని. అదే మీ నాన్న ఆఖరి కోరిక. నా ఆఖరి కోరిక కూడా.
- అమ్మ.’
ఇది చదివాక నా మీద నాకే అసహ్యం వేసిoది. చదువుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ కావాలి అనిపించింది. కాని ఫోన్ చేసే ధైర్యం చెయ్యలేకపోయా. నేరుగా వెళ్లి అమ్మ కాళ్ళ మీద పడిపోవాలి.
టైం చూశా. రాత్రి బస్సు పట్టుకోవచ్చు. పొద్దున్నే హైదరాబాదులో దింపేస్తుంది.
· * *
బస్సెక్కాను. మనసు కొంచం ప్రశాంతంగా అనిపించింది. అమ్మని కలుస్తున్నాను అని అనుకుంటా. రాత్రి హాయిగా నిద్ర పట్టింది, అమ్మ నన్ను క్షమిస్తుంది అని నమ్మకమేమో!
పొద్దున్న లేచి ఫోన్ చూసుకున్నాను. అమ్మ దెగ్గర నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కాని కాల్ చెయ్యలేదు. నేను అమ్మని నేరుగా చూడాలి.
ప్రీతి దెగ్గరనుంచీ కాల్స్ ఉన్నాయి. మెసేజెస్ ఉన్నాయి. తనకు ఫోన్ చేశా.
ఏయ్. ఇవ్వాళ కలుస్తా అన్నావ్ కదా. ఎప్పుడు? ఎక్కడ?” అంది ఫోన్ ఎత్తగానే.
సారీ ప్రీతి. నేను హాస్టల్ కి ఒచ్చాను. కాని మళ్ళి హైదరాబాద్ వెళ్తున్నా. ఒచ్చేవారం కలుద్దాం.”
అదేంటి.? ఎందుకొచ్చావ్? ఎందుకు వెళ్తున్నావ్?”
ఊరికే
ఊరికే ఏంటి? పిచ్చా? అంత దూరం నుంచి ఒచ్చి మళ్ళి వెళ్ళడం ఏంటి?”
ఒచ్చాను. కాని మా అమ్మకి సప్రైస్ ఇద్దాం అనిపించింది. అందుకే.”
సప్రైసా.. ఎందుకు?”
ఎందుకేంటి? ఎప్పుడూ చెప్తుంటా కదా అందుకే.”
ఏం చెప్తుoటావ్?”
అదే....మా అమ్మ దేవత.....నిజంగా

***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 21-09-2023, 06:50 PM



Users browsing this thread: 1 Guest(s)