Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#10
5.                  జ్ఞాపకం
 
టేబుల్ మీద ఉన్న ఫోను బర్ర్ బర్ర్ మని మోగుతూ చప్పుడు చేస్తోంది, వైబ్రేషన్ మోడ్ లో.... కంప్యూటర్ స్క్రీన్ లో తలదూర్చేసి ఎదో చూస్తున్న మురళి దృష్టి మరలుస్తూ....నీరసంగా దాని వైపు చూశాడు. ఒక్కసారిగా చెయ్యాల్సిన పని గుర్తొచ్చింది.. ఉదయం ఆఫీసుకు బయలుదేరేటప్పుడు మరీ మరీ చెప్పింది రమ్య, ఈ రోజు మధ్యాహ్నం నుంచే వచ్చేయమని. పనిలో పడి ఆ సంగతే మరిచిపోయాడు. ఇప్పుడు తనే ఫోన్ చేస్తోంది. టైం చూశాడు. మరీ అంత ఆలస్యం అవ్వలేదు.
"హలో...చూస్కున్నా టైం.. గుర్తుంది. ఇదిగో బయలుదేరుతున్నా.." అన్నాడు ఫోన్ ఎత్తి.
"ఛా..నీకు గుర్తుంది అంటే నేను నమ్మను..." కనిపెట్టేసింది రమ్య.
"ఓవరాక్షన్ ఆపి ముందు బయల్దేరు. నీ డ్రైవింగ్ స్పీడుకి నువ్వు ఇప్పుడు బయలుదేరితే అక్కడికి చేరేసరికి రేపవుతుంది." అనేసి, నవ్వి ఫోన్ పెట్టేసింది. పెళ్ళయి మూడు నెలలు అయ్యింది. అయినా రమ్య నవ్వు తనకి ఎప్పటికప్పుడు కొత్తగా వినిపిస్తుంటుంది.
మురళి కారు చాలా మెల్లిగా నడుపుతాడని, చూసి చూసి చాలా జగ్రత్తగా నడుపుతాడని, బాగా తడబడతాడని, భయపడతాడని తన ఫ్రెండ్స్ అందరూ వెక్కిరిస్తూంటారు. రెండు మూడు సార్లు రమ్య ఉన్నప్పుడుకూడా అలాగే అన్నారు. వాళ్ళతో రమ్య కూడా మాట కలిపి అవునవును అనడం మొదలు పెట్టింది. అది మురళికి నచ్చకపోయినా ఎమీ అనడు పాపం.
అసలు ఈరోజు రమ్య త్వరగా రమ్మన్నది హాస్పిటల్ కి వెళ్ళటానికి. ఈ మధ్య మురళికి నడుము నొప్పిగా ఉంటుంది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల అనీ, ఏం ఫరవాలేదని మురళి చెప్పినా వినలేదు రమ్య. డాక్టర్ దెగ్గరికి వెళ్ళాల్సిందేనని పట్టు పట్టింది. తనే ఫొన్ చేసి అప్పాయింట్మెంట్ తీసుకుంది. అబిడ్స్ లోని క్లినిక్ అది. చాలా పేరుంది కానీ గంటలు గంటలు వెయిట్ చెయ్యాలి. మీ టైంకి ముందొచ్చినా, తరవాత ఒచ్చినా, వెయిటింగ్ మాత్రం తప్పదు. అది తనకి చిరాకు. కాని ఏం చేస్తాడు, రమ్య వినట్లేదు. నిమిషాల్లో బయలుదేరాడు. తన పంథాలోనే కారు నడుపాడు, రమ్య మాటలు ఏం పట్టించుకోలేదు.
మిట్ట మధ్యాహ్నం సిటీలో గచ్చిబౌలి నుంచి అబిడ్స్ ఒచ్చేసరికి మురళి తల ప్రాణం తోకకి ఒచ్చింది. పార్కింగ్ దొరుకుతుందో లేదో అనుకుంటూ మెల్లిగా లోపలికి పోనిచ్చాడు. రమ్య అక్కడే నవ్వుతూ నిల్చుంది. "మొత్తానికి వచ్చావన్న మాట. రేపటి వరకు ఇక్కడే వెయిట్ చెయ్యాలేమో అనుకున్నా." అన్నది మురళి కారు దిగగానే.
"ఏడిశావు. నేను కాదు, మైకెల్ షూమాకర్ నడిపినా ఇదే టైం కి వచ్చేవాడు. హైదరాబాద్ ట్రాఫికా? మజాకా?"
"ఆయన సంగతి ఎందుకులే? మనం మాత్రం ట్రాఫిక్ ఉన్నా లేకున్నా ఒకేలా ఒస్తాం కదా!" అని నవ్వింది.
తను కూడా నవ్వి, రమ్య తలపైన ఒక్క మొట్టికాయ వేసాడు.
* * *
రిసెప్షన్ లో పేరు రాయించి కూర్చున్నారు. గంట దాటింది వాళ్ళకిచ్చిన అప్పాయింట్మెంట్ టైం దాటి. అయినా పిలవరు. "అసలు టైం పాటించనప్పుడు ఈ అప్పాయింట్మెంట్లు ఎందుకు? మనకేం పని లేదనుకున్నారా?" చిరాకు పడ్డాడు మురళి.
"తప్పదు మరి. చాలా పేరున్న డాక్టరు. అయినా వాళ్ళేం చేస్తారు పాపం? ఎవరో ఒకరు లేట్ అయినప్పుడు తరవాత వాళ్ళందరూ లేట్ అయిపోతారు." సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది రమ్య.
"మళ్ళీ ఎప్పుడయినా వద్దాం లే. ఇప్పుడు వెళ్ళిపోదాం ప్లీజ్?"
"నేనే ప్లీజ్ మురళి. కొంచెం సేపు చూద్దాం. మళ్ళీ ఎప్పటికయ్యేనో ఏమో!" అని అనునయించింది.
"మొండిదానా." అని నిట్టూర్చాడు.
"సరే. అంతవరకు ఏమన్నా చెప్పు,.. సరదాగా" అని మురళి భుజం పైన పడుకుంది.
"ఏం చెప్పను? నాకు బోరు కొడుతుంది. నువ్వే చెప్పు."
"సరే ఆగు. నాకు దాహంగా ఉంది. పక్కన ఏదన్నా షాపుంటే తాగటానికి ఏమన్నా తెస్తా." అని వెళ్ళాడు మురళి.
రెండు నిమిషాల తరువాత ఒక గొంతు వినపడింది.
"అమ్మా. ఈ ఫారం జెర నింపిస్తరా?" అని. ఒక ముసలాయన చేతిలో పేపర్, పెన్ పట్టుకొని అడుగుతున్నాడు. పంచెకట్టు, అదీ చూస్తే హైదరాబాద్ మనిషిలా లేడు.
"నింపుతా, ఇటియ్యి తాతా." అని తీస్కుంది రమ్య. తనకి కొత్తా, పాతా లేదు. అందరినీ చొరవతో కలిపేసుకుంటుంది. అందుకే ఈయనని కూడా తాతా అని వరస కలిపేసింది. అన్ని విషయాలు అడగటం మొదలుపెట్టింది.
"ఇంతకీ ఎక్కడినుంచి తాతా? హైదరాబాదు కాదా?"
"హయత్ నగరు. ఇప్పుడంత హైదరాబాదుల కలిసిపాయె." అని నవ్వాడు.
"అంత దూరం నించొచ్చావా? ఎవరినైనా తోడు తీసుకొని రావొద్దా?"
"ఒచ్చిండమ్మా నా మనుమడు. ఏదో పనుంటే నన్నీడ దింపి పొయ్యిండు. మల్లొస్తా అన్నడు జెర సేపట్ల."
ఓపిగ్గా ఫార్మ్లో వివరాలన్నీ నింపింది రమ్య.
"ఏమైంది తాతా నీకు?"
"ఏముంటదమ్మా? చూస్తున్నవు కదా. ఈ కుర్చీ ల కూలబడ్డ కదా. ఎవరన్న లేపుతేగాని లేవలేను. అగో ఆ సంక కర్రలు లేకుంటే నడువలేను. పోనీ అట్లనే కుంటి బతుకు బతుకుదామంటే, ఈ నడుం నొప్పి. ఊపిరి సలపనియ్యదు. అయిదేండ్లనించి డాక్టర్ల సుట్టు తిరుగుతున్న."
"అయ్యో. మరేమంటున్నరు డాక్టర్లు?"
"వాళ్ళేమంటరు? నా ఖర్మట్ల కాలవడ్డది. ఆపరేషన్ జేస్తే ప్రమాదముంది. అట్లనే భరించుకోమంటరు. పట్టీలు పెట్టినా, నూనె మాలిష్లు చేసినా, ఏం జేసినా నొప్పి మాత్రం తగ్గుతలేదు."
"ఏం జేస్తవు తాతా నువ్వు?"
" మా ఊర్లె చిన్న దుక్నం ఉన్నది. అందులనే కూసుంటున్న ఇరవైయ్యెండ్ల నించి. నా అదృష్టం బాగలేక ఇట్ల జరిగింది."
"ఏమైంది?"
ముసలాయన ఒకసారి గట్టిగా నిట్టూర్చి చెప్పాడు.
"అయిదేండ్ల కింద ఓరోజు దుక్నం బంజేశ్న... రాత్రి పది కొట్టంగ... నా సైకిల్ మీద పోతున్న. ఎప్పటిలెక్క అయితే గల్లీల నించే పోతుంటి, కాని మల్లేశంగాని చెల్లె పెండ్లికి గల్లీల పందిరేశింరు. అందరుర్రు ఆడ. మల్ల పట్టుకుంటే కూసొవెడ్తరు, తాగుకుంట పొద్దుగూకుతది. అసలే ఇది ఇంటికాడ జెరం తోని పండుకుంది. కొడుకు వేరయిపొయ్యి అప్పతికి ఆరు నెల్లు. అందుకనె మెయిన్ రోడ్డెక్కిన. పక్కపొంటి ఒస్తుంటె ఏక్ దమ్మున ఒక బండొచ్చి ఎనకంగల గుద్దింది. గుద్దెపట్టికె ఎగిరి కరెంట్ స్థంభం మీదికి పడ్డ. దెబ్బలు బానే తగిలినయ్. ఏదో ఫ్రాక్చర్ అన్నరు. ఎన్నుపూసల చిన్న బొక్కలు కదిలినయ్ అన్నరు. ఇగో... ఈ చెయ్యి కూడ ఇరిగిండె. కాని మల్ల అతుక్కుంది. అన్ని దెబ్బలు మానినయ్. ఈ ఎన్నుపూసొక్కటే సతాయిస్తనే ఉంది. వేలకువేలు ఖర్సయ్యింది. ఇంటిది పోయినేడాది పొయ్యింది. ఇంగ ఉన్నొక్కిల్లు అమ్మేశి నా కొడుకు దెగ్గరనే ఉంటున్న."
"అసలు గుద్దింది ఎవరో? ఏ కారో చూడలేదా ఎవ్వరూ?"
"లేదు బిడ్డా. పడంగనే ఏం సమజ్గాలే నాకు. నల్ల కారు. ఎవరో ఒకరిద్దరు ఒచ్చి నన్ను చూశింరు, ఏదో మాట్లాడిండ్రు, ఎల్లిపోయిండ్రు. అయ్యేం ఇనిపియ్యలే నాకు. ఇంగ రెండు నిమిషాలకి బేహోష్ అయిపోయిన. సుట్టు పక్కనోల్లు కూడ యెవ్వరు లేకుండె. అంతా నా ప్రాప్తం."
రమ్యకి ఏమనాలో అర్ధం కాలేదు. పాపం అనిపించింది. రిపోర్ట్స్ తీసి చూడడం మొదలు పెట్టింది.
డ్రింక్స్ తీసుకొని మురళి ఒచ్చాడు.
"మురళి, ఈ తాతయ్యని చూడు. ఎవరో ఎప్పుడో కారుతో గుద్దేసి వెళ్ళిపోయారంట. పాపం అప్పటినించీ ఇలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారంట."
మురళి ఏం మాట్లాడలేదు. రమ్య కథంతా చెప్పేసింది. రిపోర్ట్స్ చూపించింది.
"మరిప్పుడు ఈ డాక్టరు ఏమంటున్నడు తాతా?" తనే అడిగింది.
"ఈయనొక్కడు ఆపరేషన్ చెయ్యొచ్చు అంటున్నడమ్మా. కాళ్ళు ఒచ్చినా, రాకపోయినా నొప్పి మాత్రం తగ్గుతది అన్నడు. కాని మస్తుగ పైసలు అయితయి. నాకా షాపు లేకపాయె ఇప్పుడు. కొడుకు కూడ ఎంతకని పెడ్తడు?"
"ఏంతవుతయంట తాతా?" మురళి అడిగాడు.
"అయిదారు లక్షలు అయితయంట బిడ్డా. నా మనుమడు ఈ రెండేండ్లల్ల ఓ మూడు లక్షలు జమ చేశిండు. వానికి నేనంటె పాపం శానా ఇది. కొలువు చేస్తడు. చెయ్యి, నోరు కట్టుకొని జమ చేశిండు బిడ్డ." ....తాత కళ్ళల్లో తడి.
రెండు నిమిషాలు నిశ్శబ్దం.
"తాతా. నువ్వు ఏమనుకోనంటే ఆ రెండు లక్షలు మేమిస్తం. తీసుకుంటావా?" మురళి సూటిగా అడిగాడు.
రమ్య నిర్ఘాంతపోయింది. వాళ్ళిద్దరిలో ఇలాంటి పనులు చేసేది రమ్య, వద్దని తిట్టేది మురళి. మనకున్న దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలని రమ్య అభిమతం. మురళి సరే అనేవాడే కానీ ఎప్పుడూ ఈ పని జరగలేదు. ఇప్పుడు ఇంత సడెన్ గా ఇంత అమౌంట్ కి కమిట్ అయ్యాడు.
తాతకి సహాయం చేస్తున్నందుకు రమ్యకి ఆనందంగానే ఉన్నా అంతకుమించి మురళిలో ఈ మార్పుకి ఆశ్చర్యం ఎక్కువగా ఉంది.
మురళి రమ్యవైపు చూశాడు.
"సారీ... నిన్నడగకుండా ఆఫర్ చేశాను. ఏమంటావు? ఓకె కదా. నువ్వూ అంటుంటావు కదా. ఎవరికైనా, ఏదైనా చెయాలి అని. మనం యుఎస్ ట్రిప్ కి సేవ్ చేసుకున్న డబ్బు ఉంది కదా. అది ఇచ్చేద్దాం. మళ్ళీ నాలుగయిదు నెలల్లో మన డబ్బు మనమ్ సేవ్ చేసుకోవచ్చు. ఏమంటావ్ చెప్పు?" అనునయంగా అడిగాడు.
రమ్య నోట మాట రాలేదు. ఇంత పెద్ద పని తనవల్ల కూడా అయ్యేది కాదు. తన మొగుడిపైన చాలా గర్వంగా అనిపించింది.
"ష్యూర్. ష్యూర్. పాపం తాత. అలాగే ఇచ్చేద్దాం. ఏం తాతా. సరిపోతుందా? హాస్పిటల్లో మేమే కట్టేస్తాం." అన్నది.
"ఒద్దమ్మా..మీరంత మాటన్నరు. అదే పదివేలు. ఏదో నా బతుకు ఇట్ల తగలబడ్డది. నాకోసం మీరు కష్టపడకుండ్రి బిడ్డా." అని చేతులు జోడించాడు.
రమ్య చటుక్కున తాత చేతులు పట్టుకుంది. " ఏం కాదు తాతా. మనిషికి మనిషే సాయం. ఉండు. మేమే డాక్టరుతో మాట్లాడతాం. ఆపరేషన్ ఎలాగో, ఎంతవుతుందో అన్నీ కనుక్కుంటాం. సరేనా?" అన్నది.
తాత చాలా ఇబ్బంది పడ్డాడు. ఏదో ఇక్కడ కలిసినందుకు కష్టం చెప్పుకున్నాను కానీ డబ్బొద్దు అన్నాడు. రమ్య ఒప్పుకోలేదు. మురళి మాత్రం ఏం మాట్లాడలేదు.
* * *
తాత నెంబర్ కానీ, తమ నెంబర్ కానీ ఇంకా రాలేదు.
తాత కోసం ఒకాయన ఒచ్చాడు.
"వీడే నా మనుమడమ్మా. సిటీల కొలువు చేస్తుండు."
"ఆరేయ్. ఈ సారోళ్ళు నా ఆపరేషన్ పైసలు కడ్తం అంటుండ్రురా" అని మనవడితో చెప్పాడు.
"అవునా.. చాలా సంతోషం సార్. మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. నేను అట్లిట్ల చేసి కొన్ని పైసలు జమ చేశ్న. మొన్ననే ఉద్యోగం పోయింది. తాత ఈ నొప్పి తట్టుకోలేకపోతుండు. అప్పిచ్చే నాథుడు కూడా లేడు. మీరు సహాయం చేస్తే అంతకంటే ఏముంటది సార్."
ఒకరి తరవాత ఒకరికి పిలుపొచ్చింది డాక్టర్ దెగ్గరినించి. మురళికి ఏం ప్రాబ్లెం లేదని, ఎక్సర్సైజ్ చెయ్యమని డాక్టర్ చెప్పాడు. తాత గురించి డాక్టర్ తో మొత్తం కనుక్కుంది రమ్య.
ఆ ఇచ్చేదేదో ఇవ్వాళే ఇచ్చేద్దాం అని పట్టుపట్టాడు మురళి. ఒక గంటలో హాస్పిటల్లో ఆపరేషన్ కి చెక్కు ఇవ్వడం జరిగిపోయింది.
అక్కడినుంచి బయలుదేరేసరికి రాత్రి అయ్యింది.
* * *
కారులో మురళి ఎమీ మాట్లాడలేదు.
" ఈరోజు నీ డెడికేషన్ చూసి నాకు ముచ్చటేసింది మురళి. తెలుసుకోగానే మాటిచ్చావు. ఆ మాట ఇవ్వాళే నిలబొట్టుకున్నావు కూడా."
కాస్సేపాగి మళ్ళీ తనే కదిపింది.
"చెప్పాలంటే ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడేది నేను. కానీ తాత మాటలు వినగానే నువ్వు స్పందించావు చూడు. అంత గొప్పగా నేను ఆలోచించలేకపోయాను. నిజంగా నువ్వు గ్రేట్ మురళి."
మురళి ఏమీ మాట్లాడకపోయేసరికి తన ధోరణిలోకి ఒచ్చేసింది.
"ఓయ్. అప్పటినించి నిన్ను పొగుడుతుంటే ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు.పొగరా?"
మురళి నవ్వలేదు.
"ఏమైంది మురళి. ఎందుకలా ఉన్నావు? చెప్పు ప్లీజ్."
చాలా కష్టంగా మాట్లాడాడు మురళి.
"రమ్యా నీకో విషయం చెప్పాలి. అది నన్ను లోపల్లోపల తినేస్తుంది. అందుకే త్వరగా చెప్పేస్తా.
నీకు తెలుసు కదా, నేను కారు మెల్లిగా నడుపుతానని అందరూ వెక్కిరిస్తారు. దానికో కారణం ఉంది. నేను ఇంజినీరింగ్ అయ్యాక కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా కదా. అప్పట్లో ఒకరోజు రాత్రి రాజుగాడి కార్లో మేము ముగ్గురం ఫ్రెండ్స్ వాళ్ళ ఫాం హౌజ్ కి వెళుతున్నాం. నేనే నడుపుతున్నా కొత్త కారు. రాజుగాడు తొందర పెడుతున్నాడు. కొత్త కారు కదా 140 మీద వెళితే చూడాలనుంది అని నానిగాడు గొడవ చేస్తున్నాడు. ఆ తికమకలో కారుని పరిగెత్తించాను.. 140 రీచ్ అయ్యాం.
రోడ్డు మీద ఒక దెగ్గర సడెన్ గా ఒక ఎడ్లబండి కంపించింది. టెయిల్ లైట్లుండవు కదా, స్టిక్కర్లు కూడా లేవు. సో ముందునుంచీ కనిపించలేదు. ఒక్కసారిగా అది ఎదురుగా ఉందని కనిపించింది. బ్రేక్ వేస్తే సరిపోదు, గుద్దేస్తాం. బండి పక్కకి తిప్పేశా.....హమ్మయ్య అనుకుంటుండగానే అక్కడ వెళ్తున్న ఒక సైకిల్ ని గుద్దేశా.
బండి ఆగింది. అందరం దిగి సైకిల్ దెగ్గరికి పరిగెత్తాం. ఒక ముసలాయన పడిపోయి ఉన్నాడు. పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. చేతికి మాత్రం తగిలినట్టుంది. హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నాను. కానీ ఆయనకి ఏమీ జరగలేదు కదా, ఏం ఫరవాలేదు, ఎవరైనా ఒస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పి నన్ను అక్కడినుంచి తీస్కెళ్ళారు."
మురళి ఆపేశాడు.
ఆ తరవాత ప్రశ్న అడగటానికి రమ్యకి ధైర్యం సరిపోలేదు. కానీ ధైర్యం అంతా కూడగట్టుకొని మురళియే సమాధానం చెప్పాడు.
"ఆ ముసలాయన ఈయనే."
"మరి తాత నిన్ను గుర్తుపట్టలేదేంటి?"
"ఏమో గుర్తు లేదనుకుంటా? కానీ నాకు మాత్రం జ్ఞాపకం ఉంది. అది తాతే.."
* * *
తాతా మనవడు ఇంటికి బయలుదేరారు.
"పాపం. వాళ్ళెంత మంచోళ్ళు తాతా. నీకు ముందే తెల్సా? లేదంటే ఇక్కడనే కలిశినవా?"
" అవును. పెట్టే చెయ్యి పాపం. నా సంగతి చెప్పంగనే తన్లాడిపొయ్యింది బిడ్డ. ఆమెని ఇప్పుడే చూశుడు. ఆ సార్ ని మట్టుకు ఒక్కసారి చూశ్న జ్ఞాపకం ఉంది."
"చూశ్నవా? ఎక్కడ తాతా?"
"నాకు యాక్సిడెంట్ అయినప్పుడు."
* * *

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 26-08-2023, 05:40 PM



Users browsing this thread: 1 Guest(s)