Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#9
4.                  మనోళ్ళు
 

 
సిటీకి ఒచ్చి రెండు నెలలు అయితాంది. ఊర్ల నడిపిన కారే గాని జెర సిటీ ట్రాఫిక్ ల చెయ్యి సాఫ్ గానీకె శంకరన్నని పక్కన కూసొవెట్టుకొని, ఆయన కార్ల రెండు రోజులు నడిపిన. అంత బానే ఉన్నది, పెద్ద కష్టం గాలే. ఎవరి దెగ్గరన్న డ్రైవర్ లెక్క కుదురుకునే ముంగల అక్కడక్కడ ఒకటి, రోజు రెండు రోజులు పొయ్యే పని ఉంటే చెప్తా అన్నడు శంకరన్న.
నిన్న ఫోను చేసి చెప్పిండు, కృష్ణమూర్తి సార్ అని ఉన్నడంట. వాళ్ళ పిల్లగాని పెండ్లికి ఒక రెండు వారాలు వాళ్ళింట్ల డ్రైవర్ లెక్క ఉండమన్నడు. రోజుకి అయిదు వందల రూపాలు బత్తా. సరేనని చెప్పిన.
పొద్దున్నే ఏడింటికి లేసి, దబ దబ స్నానం చేసి సార్ ఇంటికి ఒచ్చిన. దిల్షుఖ్నగర్ కోణార్క్ థియేటర్ ఎనకాల ఇల్లు.
ఇంకా పెండ్లి సందడి లేదు ఇంట్ల. పొయ్యేసరికి ముంగట డోర్ తెరిచే ఉన్నది. సార్ కొడుకనుకుంటా, సోఫా మీన కూర్చొని ఉన్నడు. ఏదో పని మీద ఉన్నట్టున్నడు,. కంప్యూటర్ పైన.
బయటనుండే పిలిచిన.
నమస్తే సార్. నేను శీను.... డ్రైవర్ను. శంకరన్న పంపించిండు.. కృష్ణమూర్తి సార్ చెప్పిన్రంట.”
ఓకే. లోపలికి రా.. కూర్చో అన్నడు నా దిక్కు సరిగ్గ సూడకుండా.
లోపలికి పొయ్యి అట్లనే నిల్చున్న.
కూర్చోవయ్యా అన్నడు.
సార్ కూర్చున్న సోఫా ఒక్కటే ఉన్నది. చానా ఖరీదుంటది. పక్కన ప్లాస్టిక్ కుర్చీలసుంటివి ఏమీ లేవు. ఏడ కూసోవాల్నో అర్ధం కాలే.
ఏం అర్ధం కానట్టు నా దిక్కు చూశిండు ఆయన.
ఏం పరవాలేదు సార్. నేను బయట ఉంట.” అని చెప్తున్న. అంతలోకే లోపల్నించి కృష్ణమూర్తి సార్ ఒచ్చిండు.
ఆ నువ్వేనా శీనువి?”
అవును సార్.”
మంచిగ నడుపుతవా కారు.”
ఆ.. నడిపిస్త సార్.”
చూడు. మొన్ననే కొడుకు అమెరికా నుండి ఒచ్చిండు. సడన్ గ పెండ్లి కుదిరింది. రెండు వారలల్ల పెండ్లి. ముందు, తరవాత ఫంక్షన్లు ఉన్నయి. పని చానా ఉన్నదీ. ఏ టైంల అంటే ఆ టైంల రావాలె, ఏ ఊరు అంటే ఆ ఊరు పోవాలె. తిండి తిప్పలు అంతా ఈడనే. మొత్తం నెల అయినంక ఒకటే సారి సెటిల్ జేస్త. ఏమంటవు?” అని ఖుల్లం ఖుల్ల చెప్పేశిండు సార్.
సరే సార్. మీ ఇష్టం.” అన్న.
ఇంగో బండి తాళాలు. పొయ్యి తుడువు. ఇయ్యాలా రేపు హైదరాబాద్ అంతా తిరగాలే. పత్రికలు పంచేడిది ఉన్నది.” అని తాళాలు ఇచ్చిండు.
సరే మీ ఇష్టం అని చెప్పి బయటికి ఒచ్చేస్తున్నా.
ఎక్కడ కూర్చోవాలో చెప్పకుండ కూర్చో కూర్చో అంటే వాడెక్కడ కూర్చుంటడు రా.” కృష్ణమూర్తి సార్ కొడుకిని అడిగిండు.
కారు కొత్తగా ఉన్నది. ఎక్కువ వాడనట్టున్నది. బకెట్ల నీళ్ళు తెచ్చి మంచిగ కడిగిన. బట్ట తెచ్చి సాఫ్ చేశ్న. ఇంతటికల్ల పిలిచిండు సార్.
చాయ్ తాగు. పావు గంటల పోదాం.” అని చెప్పి లోపలికి ఎళ్ళిపోయిండు.
పనిమనిషి ఒచ్చి చాయ్ ఇచ్చింది. చిన్న సార్ ఇంకా ఆడనే కూసున్నడు.
మేడం ఒచ్చింది.
చూడు బాబు. నువ్వేనా డ్రైవర్ వి. సిటీల చానా జాగ్రత్తగా నడపాలే. నాకస్సలే భయ్యం. సరేనా.” అని చెప్పి. నన్ను మాట్లాడనియ్యకుండానే జాగ్రత్తలన్నీ చెప్పింది.
ఎందుకమ్మా ఇంత కష్టం. పెళ్ళికి ఇష్టం ఉన్నోళ్ళని, ఇష్టం లేనోళ్ళని ఎందుకు పిలవాలి. వందలమందిని పిలిచి ఇంత ఖర్చు పెట్టేకన్నా మనకు కావాల్సిన వాళ్ళని పిలిచి చిన్నగా చేస్కోవచ్చు కదా.” ఏందో కొత్తగ చెప్తుండు చిన్న సార్.
మేడం ఏమీ ఆనలే.
అవేం మాటలు రా. ఈ అమెరికా బుద్ధులు ఈడ పనికిరావు. పెండ్లి అంటే నలుగురు రావాలె, తినాలె, పిల్లని పిల్లగాడిని ఆశీర్వదించాలె.” సార్ పత్రికలూ తీస్కోని ఒచ్చిండు.
కాని మనకి అస్సలు ఇంపార్టెంట్ కాని వాళ్ళు. మనకు నచ్చని వాళ్ళు కూడా ఒచ్చి ఏం లాభo. వాళ్ళెంత చుట్టరికంలో దెగ్గరోళ్ళయినా కాని.”
మనకి పడినా పడకున్నా, దెగ్గరోళ్ళు దెగ్గరోళ్ళె. అందరినీ పిలవొద్దు అంటడు వీడెక్కడోడే.!?. బజార్ల ఇజ్జత్ ఉంటదా?” సార్ పత్రికలన్నీ సంచిల పెట్టి మేడంకి ఇచ్చిండు.
సరే పోనీలెండి. ఇంగ పోదాం పదండి. లేట్ అయితుంది. కార్ తియ్యవయ్యా.” అన్నది మేడం నన్ను చూసి.
* * *
రోడ్డెక్కినం.
చూడు శీను. ఇయ్యాల ముఖ్యమైన చుట్టాలింట్లల్ల పంచేసేయ్యాల. ఇట్ల ఎనక నుంచి పద. ఓల్డ్ సిటీ నించి. ఆడ ఇచ్చేస్కోని మల్ల మెహదిపట్నం నించి బంజార హిల్స్ పొయ్యి అట్ల సిటీ చుట్టేసి ఒద్దాం.” అన్నడు సార్.
సార్ ఏమనుకోకున్రి. నాకు సిటీల రూట్లు తెల్వయి. మొన్ననే ఒచ్చిన. మీరు చెప్పున్రి. ఎటంటే అటు తీస్కపోత.”
సరే అట్లనే కాని. ఇంతకి ఎప్పుడొచ్చినవు? ఏ ఊరు?”
జనగాం సార్ మాది. ఒచ్చి రెండు మూడు నెలలయితాంది.”
ఆదివారం పూట కాబట్టి ట్రాఫిక్ జెర తక్కువ ఉన్నది రోడ్డు మీన. ముందుగాల ఓల్డ్ సిటీ మీద పడ్డం.
పెండ్లి గురించి,వియ్యంకుల ఖర్చుల గురించి, చిన్న సార్ గురించి మాట్లాడుకుంటున్నరు సారోళ్ళు.
ఈడ చాంద్రాయణగుట్టల ఒక ఇల్లు ఉంది ముందు ఆడికి పోదాం.” అన్నడు సార్.
మనమొస్తున్నట్లు ఫోన్ చేశినవానే నిన్న?” మేడంని అడిగిండు.
ఆ చేశ్న.” చెప్పింది మేడం.
ఏమన్నరు?”
ఏమంటరు. ఆదివారమే కదా. ఇంట్లనే ఉంటం రండి అన్నది.”
ఎవరు? సునీత ఎత్తిందా? శేఖర్ లేకుండే పక్కన?”
ఉండే. కాని ఏo మాట్లాడలే వాడు.”
ఉండక ఏం చేస్తడు. అసలు వాడు ఏం చేస్తడో నాకిప్పటికీ అర్ధం కాదు. బేకార్ గాడు.”
ఏదో ఒకటి చేసి సంసారం నడుపుతుండు కదా. తప్పు పని అయితే చేస్తలేడు కదా.”
అబ్బా... నడుపుతుండు సంసారం. వానితో మొదలుపెట్టినోల్లు ఎక్కడున్నరు? వీడెక్కడ ఉన్నడు.” అని ఒక నిమిషం ఆపి, “శీను. ఆ ముంగట రైట్ తీస్కో. జెర ముందుకు పొయినంక చౌరస్తా ఒస్తది. అక్కడ లెఫ్ట్.” అని నాతో అని మల్ల మేడంతో “ఆ రోజోచ్చి పదివేలు తీస్కపోయిండు. ఇచ్చిండా ?” అన్నడు. జెర గట్టిగనే అన్నడు.
లేదు.” అన్నది మేడం.
వానితో పనిచేశేటోల్లకి పదివేలు సంపాదించుడు గంటసేపు పని. వీడు? ఆరునెల్లాయే. పది వేలు జమ చెయ్యలేకపోయిండు.”
ఇస్తడు లెండి. తెల్సు కదా. వాడికేవో కొన్ని రూల్సు. దాని ప్రకారమే చేస్తడు ఏం చేసినా. పైకెల్లి సునీతకి బాగుంటలేదంట ఈ మధ్య.”
ఎహే. చేతగాని మాటలు అవన్నీ.”
ఒక రెండు నిమిషాలు మేడం ఏం మాట్లాడలె. సార్ గూడ ఊకున్నడు.
ఈ ఏరియా తెల్సా శీను నీకు?” అన్నడు నాతోని.
తెల్వదు సార్.”
ఓల్డ్ సిటీ. మేము ముందు ఈడనే ఉండేది. పెరిగిందంత ఈడనే.”
అవునా సార్.”
ఆ..ఆ పక్కన ఎర్ర బిల్డింగ్ దెగ్గర ఆపు. అదే ఇల్లు. అగో పిల్లలు బయటనే ఉన్నరు.”
ఉన్నది చిన్న రోడ్డు...అందులనే ఒక పక్కకు ఆపిన. సారోళ్ళు దిగి ఎల్లిపోయిన్రు.
ఒక పది ఇరవై నిమిషాలు ఐతదని అన్నరు... సరే ఆని అట్ల పక్క గల్లీలకి పొయిన. గోడ సాటుంగ మూత్రం పొయ్యి, పక్కన కేఫ్ ఉంటే ఒక చాయ్ జెప్పిన.
జెరాగి బండి దగ్గరికి పొయిన. అప్పటికే సారోల్లు బయిటికొచ్చి నాకోసం చూస్తున్నరు.
ఏడికి పోయినవ్? నీ నెంబర్ కూడ లేదు మా దెగ్గర?” కోపంగా ఉన్నడు సార్. పక్కన మేడం కూడ అట్లనే ఉంది. ఆ ఇంటోల్లనుకుంట, వాళ్ళు కూడ బయిటికి ఒచ్చి నిలబడ్డరు.
మీకు పది నిమిషాలు ఐతదన్నరు కదా అని చాయ్ తాగుదాం అని పోయిన సార్
తరవాత పోతం కదా చాయ్ కి. ఏడన్న ఉండమంటే ఆడనే ఉండాలే. అర్ధమయ్యిందా? బండి రివర్స్ చేస్కో తొందరగా.” అన్నడు.
ఆయింత గల్లీల రివర్స్ చేస్కునుడు కష్టమే. అట్లనే ముందు గల్లీకి పోదామా అని అడుగుదామనుకున్నా. ఎందుకులే అని అటు జేశి ఇటు జేశి యూ గొట్టిన.
కారెక్కినంక సప్పుడు జెయ్యక కూసున్నరు ఇద్దరు.
ఎంతయినా కావల్సిన వాళ్ళు. అట్ల పెళ్ళి పిలుపుకని ఒచ్చి, కోపంతోటి బయిటికొస్తే వాళ్ళకి ఎట్లుంటది.” అన్నది మేడం. గొంతు జీరబోతుంది పాపం. ఏడుపొస్తున్నట్టుంది..
రాదా మల్ల? అయినా నన్నంటవేంది?ఆ శేఖర్ గాడు అట్ల మాట్లాడుడు బాగుందా? నా ముంగట పుట్టినోడు. నాతోని మాట్లాడే పద్ధతి తెలుసా వానికి?”
ఏదో వాడు చిన్నప్పటినించి అంతనే.ఒకలాగ ఉంటడు. ఇదేమన్నా కొత్తనా?. ఆడికి నేను, సునీత పోనియ్యండి అంటనే ఉన్నం ఇద్దరినీ.”
ఎందుకు పోనియ్యాలే? నన్ను సూటి పోటి మాటలంటే? నేను పైసల కోసం ఒప్పుకున్నానా ఈ సంబంధానికి? ఎవడు చెప్పిండు వానికి? ఎదో పిలగాడు అమెరికాల ఉంటడు, పిల్ల మంచిది, నచ్చిందన్నడు అని నేను ఆలోచిస్తుంటే...”
వాడట్ల అనలేదంటే. వాని సంగతి తెల్సు కదా. డొంక తిరుగుడు మాటలు రావు వానికి. మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ కదా అన్నడు అమ్మాయి వాళ్ళది. అంతే.”
ఊకోవే. నాకు తెల్వదా. పైసాకి గతిలేదు కాని పొగరుకి మాత్రం తక్కువ లేదు.”
· * *
ఓల్డ్ సిటీల ఇంగొకటి, రెండు ఇండ్లల్ల తొందరగా పత్రికలు పంచేశిన్రు. ఆడికి మధ్యాహ్నమయ్యింది.
ఈడినించి మెహదిపట్నం పోవాలె ఇప్పుడు. నేను చూపిస్తా పద. అక్కడ ఒక్క ఇంట్ల చెప్పినంక ఎక్కడన్నా తిందాం.” అన్నడు సార్.
జెర ఇక్కడనన్న ఏమనకున్రి ప్లీజ్" అన్నది మేడం.
జూపార్క్, జియా గుడా మీదంగ మెహదిపట్నం పోయినం. పొయ్యేసరికే గంటయ్యింది.
మంచి ఏరియా లాగానే ఉన్నది ఆడ, విజయ్ నగర్ కాలనీ అంట. సార్ వాళ్ళ చుట్టలోల్ల ఇల్లు కూడ బాగున్నది.
బండి ఒక చెట్టు కింద పెట్టిన, సార్, మేడం లోపలికి పోయిండ్రు. ఎండ బాగ ఉంది కాని చెట్టు గాలి సల్లగ కొడుతుంది. అద్దం కిందకి దించి ఒరిగిన. ఆకలయితుంది... కాని కన్ను మలిగింది.
ఏయ్ శీను. లెవ్వు.” అరిచిండు సార్.
ఒక్కసారి లేశి సీట్ సక్కగా చేశ్న. కార్ స్టార్ట్ చేసి పక్కకి తీస్తున్న.
ఎంత సేపయ్యిందో నిద్ర పట్టి. అయినా పండుకుంటే ఇంత కోపం ఐతుండు ఎందుకో సారు.
చెట్టు కింద పెట్టేటప్పుడు చూస్కోవద్దారా? నువ్వు పన్నవు. పిట్టలన్ని కారు ఖరాబ్ చేసినయి. ఇట్లనే తిరగాల్నా ఇయ్యాలంత?”
ఈ డ్రైవర్ పనిల ఇదే లొల్లి. బయట ఏదో అయితది. అదే మనసుల పెట్టుకొని కారెక్కుతరు. అది మనపైన తీస్తరు. ఆ కోపం మన వల్ల అని అనుకోవద్దు అని జెప్పిండు శంకరన్న. అసుంటిదేనేమో ఇది గూడ.
కాని నిజమే..కారు పైన రెట్టలు పడ్డయి.
ఒక్క రెండు నిమిషాలల్ల తుడిచేస్త సార్.”
ఇనిపించుకోలె సార్. ఎక్కి డోర్ పెట్టుకున్రు. బయిటికి ఒచ్చిన ఇంట్లోల్లకి టాటా చెప్తుంది మేడం. సార్ మాత్రం అటు దిక్కు చూస్తలేడు. బండి తుడిచేసి కారు తీశ్న.
గల్లీ దాటింది.
అన్ని సార్లు తినమంటే అంత ఖచ్చితంగా ఒద్దు అంటరేందండి? మొఖం ఒక లాగ పెట్టిన్రు వాళ్ళు.” అడిగింది మేడం.
నాకు తినబుద్ధి కాలే ఆడ.”
మల్ల ఏదో అయ్యింది ఈ ఇంట్ల కూడా సార్ కి అనుకున్న.
అదే ఎందుకు? వీళ్ళేమన్నరు మల్ల?” అడిగింది మేడం.
అంటే ఏందే నేనే అందరితోని గొడవలు పెట్టుకుంటనా? నాకేం పట్టింది?”
అట్ల కాదండి. నేను వంటింట్ల ఉంటిని. బయట మీ మొగోల్ల మధ్యన ఏమన్న మాటొచ్చిందా అని.”
ఏముంటది. ఇట్లనే. వాడి సంగతి తెల్సు కదా. వాని కొడుకు గురించి గొప్పలు చెప్తుంటడు.”
చెప్పుకోనియ్యండి వాడి కొడుకు వాడిష్టం. మనకేంది?”
పిచ్చి దానా... నీకేం తెల్వదు. మనోడు కూడా వాని తోటోడే కద. ప్రతి విషయంల వాని కొడుకే గొప్ప అని చెప్పుకోవాలె అని తాపత్రయo.”
ఇప్పుడేమన్నడు?” బాటిల్ తీసి సార్ కి నీళ్ళు ఇచ్చింది మేడం.
ఏమంటడు? వాని కొడుకు ఇట్ల చెయ్యడoట. ఎవ్వరిని చూపిస్తే వాళ్ళని చేస్కుంటడంట. మొన్న ఫోన్ ల చెప్పిండంట. మీరెవ్వరినంటే వాళ్ళని చూడండి డాడీ, ముహూర్తం పెట్టి చెప్తే టికెట్ చూస్కొని, ఒచ్చి, పెళ్ళి చేస్కొని ఎల్లిపోతడoట. మనోడు ఏదో తప్పు చేసినట్టు. ఇదే వాని కొడుకు లవ్ మ్యారేజ్ చేస్కొని ఉంటే వాడు అదే గొప్ప అని చెప్పేటోడు.”
మనోడు మాత్రం ఏం చేశిండు. మనం ఒప్పుకుంటేనే కదా పెళ్ళి చేసుకుంటుండు.” అన్నది మేడం. కొడుకుని అంటే మేడం కి కూడా కోపం ఒచ్చినట్టుంది.
అదంతా వానికేందుకే? ఎదో ఒక మాట అనాలే. మనోనికంటే వాని కొడుకు గొప్ప అని చూపించుకోవాలే. అయినా వాడెంత హౌలే గాడే! ఈ కాలంల, అమెరికాల ఉండుకుంట, పిల్లని చూడనైనా చూడకుంట పెళ్ళి చేస్కుంట అనేటోడు.”
మేడం ఏమనలే.
అసలు మనం వాణ్ణి కాని, వాని కొడుకుని గాని ఎప్పుడన్న ఏమన్న అన్నమా? అసలు వాని గురించే ఆలోచించం మనం. వాడే ఎప్పుడు మనోనితో కంపేర్ చేస్కుంటడు, ఏదో ఒకటి అంటడు. అందుకే అనేది, మనిషికి కుళ్ళు ఉండొద్దు అని. మనం ఎంత సుఖంగున్నా, పక్కనోడి సుఖం మాత్రం సైసదు.”
సరే లెండి. ఆకలయితుంది. ఎక్కడన్న ఆపమని చెప్పండి.” అన్నది మేడం.
హమ్మయ్య అనుకున్న నేను.
ఏం శీను తిందామా ఎక్కడన్నా?” అడిగిండు సార్.
మీ ఇష్టం సార్.”
చికెన్ మటన్ తింటవు కదా?”
ఆ తింట సార్.”
అయితే ఒక్క పని చెయ్యి. ఆ ముంగట పొయినంక మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఒస్తది. దాని కింద నుంచి లెఫ్ట్ తీస్కో. ముంగట పొయినంక ఎక్కడన్న ఆపు. సరేనా?”
సరే సార్.”
ఈ ఒక్క సిగ్నల్ దాటనీకెనే అర్ధ గంట అయ్యింది. మొత్తానికి పొయినం.
ఒక హోటల్ కాడ ఆగినం. సావారితోని బైటికి పొయినప్పుడు మధ్యాహ్నం అన్నం తినొద్దు అన్నడు శంకరన్న, నిద్ర ఒస్తది అని. అందుకనే చపాతీలు తిన్న. సారోళ్ళు లోపల తిన్నరు.
జల్ది జల్ది తినేశి కొన్ని నీళ్ళు తీస్కోని కార్ పైన పడిన రెట్టలు తుడిచేశ్న.
నిద్ర ఒస్తదని జెర అటు ఇటు తిరిగిన. సారోళ్ళు మెల్లగ ఒచ్చిన్రు.
· * *
మల్ల రోడ్డెక్కినం. ఆడాడనే సారోల్ల దోస్తుల ఇండ్లు ఉన్నాయంట. అవన్నీ తిరిగేటప్పటికి రాత్రి ఏడు కొడ్తుంది. పొద్దున్నించి తిరిగిన్రు కదా సారోళ్ళు కూడా అలిసిపోయిన్రు. నేను గూడ అంతే.
అలిసిపోయిన, ఇంక పోదాం పదండి. మల్ల రేపు చూస్కుందాం.” అన్నది మేడం.
సరే, ఇంత దూరం ఒచ్చినం కదా. మల్ల రేపెల్లుండి ఇటు సైడు రామేమో. ఒక్కసారి మీ వెంకటేశ్వరావు అన్నోల్లని కనుక్కో. ఇంట్ల ఉన్నారో లేదో! అసలే వాళ్ళకి టైం ఉండదు.” అన్నడు సార్.
వాళ్ళు లేకుంటే ఏందీ? ఇంటి నిండ పనోళ్ళు. కార్డు ఇచ్చేసి ఒచ్చేద్దాం. ఊకే వాళ్ళని ఇంట్ల ఉన్నావా అని అడిగి ఇబ్బంది పెట్టుడు ఎందుకు?” విసుక్కుంది మేడం.
లే. ఉన్నప్పుడే పోదాం. ఒకసారి కలుద్దాం. మీ అన్న తో మాట్లాడ్తా. ఎమన్నా కొత్త బిజినెస్ ఎమన్నా పెట్టిండేమో తెలుస్తది. నాలుగు విషయాలు తెలుస్తయి.”
ఆ అన్న...! మా సొంత అన్నదమ్ములతో మాట్లాడరు కాని పెదనాయన కొడుకుతోని ఏముంది?”
వీళ్ళంటే పనికిరానోళ్ళు. కాని ఈయన వేరే కదా. ఓసారి ఫోన్ కొట్టి చూడు. ఇంట్ల ఉన్నరేమో.”
మేడం ఫోన్ చేశింది.
ఆ అన్నయ్యా. బాగున్నరా... అవునన్నయ్యా... మొన్ననే ఒచ్చిండు అమెరికానించి. అదే పెండ్లి కుదిరింది. మీరు ఇంట్ల ఉన్నరేమో అని... ఆ మంచిదన్నయ్యా.... ఇక్కడనే ఉన్నం జెర సేపట్ల ఒస్తం.”
ఉన్నారంట. పాండి పోదాం మరి.”
చూశ్నవా. అనవసరంగ మిస్ అయితుండే.......చలో శీను. బంజారాహిల్స్ పోనీ... ఇందాక ఫ్లైఓవర్ కిందనించి ఒచ్చినం కదా. అక్కడినించే...”
వేరే రూట్ ఏం లేదా సార్. ఆడ చానా ట్రాఫిక్ ఉంది.” అన్న నేను మెల్లగా.
లేదు. ఎటునుంచి పోయినా అట్లనే ఉంటది పదా.” పొద్దున్నించి లేని జోష్ ఇప్పుడె ఒచ్చింది సార్ కు.
అయ్యో పాపం. అలిసిపోయినట్టున్నడండి.. పొద్దున్నించి తిప్పుతున్నం.” మేడంకి అర్ధం అయ్యింది నా బాధ.
ఎహే. వాళ్ళు డ్రైవర్లు.. అలవాటే ఉంటది.” నవ్విండు సార్.
నేను కూడా నవ్విన కొంచెం..
పైనించి మన శీను ఊర్ల పుట్టి పెరిగినోడు. గట్టోడు... “
అందరం నవ్వినం.
ఈడినించి ఈడకు పోయినట్టే ఉంది, దానికే అర్ధ గంట పట్టింది. బంజారాహిల్స్ ఒచ్చినంక జెర తగ్గింది ట్రాఫిక్. కాని లోపల ఎక్కడనో ఉన్నది ఇల్లు. పెద్ద పెద్ద రోడ్లు. దూరంగ దూరంగ ఇండ్లు. మస్తున్నయి. తప్పిపొయ్యేటట్టే ఉన్నయి రోడ్లు. అన్నీ ఒకటే లెక్క.
ఒక పెద్దింటి ముందుకు ఆగినం. ముంగట గేటు దెగ్గర వాచ్ మాన్ కి చెప్పిండు సార్. ఆయన లోపలోల్లకి కనుక్కొని గేటు తీశిండు.
ఇంటి ముంగట జాగా... ఆడనే కారు పెట్టినం. సార్ వాళ్ళు దిగి లోపలి పోయిన్రు. ఈ ట్రాఫిక్ ల బేజార్ ఒచ్చింది, కాళ్ళు గుంజుతున్నయి. నేను గూడ దిగి అటు ఇటు నడుస్తున్న. సిగరెట్ ముట్టించ బుద్ధయ్యింది. ఇక్కడెందుకులే అని గేటు బయటికి పోతున్న..
బాబు... డ్రైవర్..”ఇంట్ల పనాయిన లాగుండు, నన్ను పిలుస్తుండు.
నువ్వేనా కృష్ణమూర్తి సారోల్లతో ఒచ్చింది?”
అవును.”
మరి అట్ల పోతున్నవు? తిందువు దా లోపలికి.” అని తీస్కపొయ్యిండు.
ఎనకనించి ఇంట్లకి తీస్కపోయిండు. లోపల మంచిగ చికెన్ కూరతోటి అన్నం పెట్టినరు. తినొద్దనుకున్న, కాని తినేశ్న కడుపునిండా...హాయిగా ఉండే.
సల్లగ గాలికి బయిటికి ఒచ్చి ఒక సిగరెట్ ముట్టించిన. కార్ అద్దాలు దించి కూర్చున్న. సుఖంగున్నది.
కొంచెం సేపాగి సారోళ్ళు ఒచ్చిన్రు.
చలో శీను. ఇంక ఇంటికే... ఏడికి లేదు.” అనుకుంట ఎక్కిండు సార్.
అవును. పొద్దున్నించి ఎండలో తిరిగినం. నాకు ఓపిక లేదు ఇంకా.” నిద్రొస్తున్న గొంతుతో అన్నది మేడం.
దెగ్గర దెగ్గర పది ఐతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది... తినేది లేకుండే.... నిద్రొస్తుంది బాగా... రేడియో పెట్టిన....సార్ సౌండ్ తగ్గియ్యమన్నడు.
మీ అన్న ఏదో సాఫ్ట్వేర్ ల పైసలు పెడుతుండoట?”
అవునా.” నిద్రల అన్నది మేడం.
అడిగితే సక్కగా చెప్పలేదు. మనోడు కూడ చిన్న కంపెనీ పెట్టుకున్నా అన్నడు కదా అమెరికాల. ఏమన్నా హెల్ప్ ఐతదేమో అని అడుగుతుండే..” ఈసారి కోపం లేదు సార్ గొంతులో..
హ్మ్.. అడిగితే.. చెయ్యనన్నడా?” సగం నిద్రల అడిగింది మేడం.
అసలేమన్న చెప్తే కదా. నేనెన్ని సార్లు అడిగినా మాట మార్చేస్తుండు.”
మేడం ఏం ఆనలే.
అమెరికాలనే ఏదో ప్రాజెక్ట్ అంట. చెయ్యడానికి మనుషులు వెతుకుతున్నం అదీ ఇదీ అన్నడు. మనోడు అదే చేస్తున్నడు. మనుషులు ఉన్నరు ఏవన్న ప్రాజెక్ట్లు ఎతుకుతున్నడు అన్జెప్పిన.”
హ్మ్.”
అసలు మాట వరసకైనా ఎవరు ఏంది అనో.. సరే చూస్త అనో చెప్పాలె.”
మేడం పడుకుంది.
ఎవడన్న ఎదిగితే మనోళ్ళకి సాయం చెయ్యాలని చూడాలి శీను. కాని ఈ చుట్టాలున్నరు చూశ్నవా! ఎవడో మనకి తెల్వనోనికి, జీవితంలో ఎప్పుడు చూడనోనికి చేస్తరు.. పొరపాటున మనకి చేస్తే ఎక్కడ మనం ఎదిగిపోతమో అని భయం.”
మేడం పడుకుంది అని నాకు చెప్పుడు షురు చేశిండు సార్. నేనుట్టిగ ఇంటున్న. అసలే నిద్రొస్తుంది.
అయినా వీళ్ళు పుట్టినప్పటినించే ఇంత పెద్దోళ్ళు ఏం కారు. మంచి సంబంధం దొరికింది. అత్తగారి ఆస్తి కలిసొచ్చింది. వాళ్ళ దోస్తులని కలుపుకొని ఏదో బిజినెస్ పెట్టిండు. అంతే దశ తిరిగిపోయింది. ఇప్పుడు చూడు. బంజారా హిల్సు, కార్లు, నౌకర్లు... అబ్బో
నాకేం అనాలో అర్ధం కాలే. “అవును సార్. ఇల్లు చానా బాగున్నది.” అన్న.
అబ్బా. పోనీ లెండి. మీరేమన్నరో ఆయన ఏమన్నడో.” మేడం లేచే ఉంది.
సరే ఇప్పటి ముచ్చట కాదు కదా. మనం ఎన్ని సార్లు ఏదన్న బిజినెస్ చేద్దాం అన్నాపెద్ద పట్టించుకోడు. సరే... ఎవరికుండేది వాళ్లకుంటది. ఎల్లకాలం అందరు ఒకటే లాగ ఉండరు కదా.”
ఇంక ఎదో మాట్లాడుతుండు సార్. నేను పట్టించుకోలే. జాగ్రత్తగ నడుపుతున్న బండి.
కొంచం సేపటికి ఇద్దరు నిద్రపోయిన్రు. అబిడ్స్ దాంక ఒచ్చేశ్నం కాబట్టి నాకు రస్తా తెల్సు.
బ్యాంక్ స్ట్రీట్ దెగ్గర వన్ వే మీద పోతున్న. ముంగట బస్సోడు మెల్లగ పోతుండు. తిక్క లేశి ఓవర్ టేక్ చేద్దామని రైట్ సైడుకు కొట్టిన. ఒక్కసారిగ అవుతల నుంచి అప్పర్ లైట్లు ఏస్కొని బండొస్తుంది. సడన్ బ్రేక్ కొట్టిన...సరిపోదు..బండి రైట్ కు తిప్పిన... అయినా ఆ కారొచ్చి మా ఎనక డోర్ కి కొట్టింది. అటు సైడ్ సార్ కూర్చుండు. కారు గుద్దగానె గట్టిగ అరిసిండు.డోర్ లోపలికి ఒచ్చి కాలుకి కొట్టింది అని తరవాత తెలిసింది.
· * *
సార్ హాస్పిటల్ల ఉన్నడని చూద్దామని పొయిన మరుసటి రోజు. కాలు ఫ్రాక్చర్ అయ్యిందంట. నాకు చానా బాధగ అనిపించింది. అసలే పెండ్లిల్లు. ఎమన్నా అయ్యుంటే...? అమ్మో ఆలోచించనీకెనే భయమయితుంది.
నేను పొయ్యేటప్పటికే సార్ వాళ్ళ చుట్టాలందరూ ఉన్నరు. మొన్న ఓల్డ్ సిటీలోళ్ళు, మెహదిపట్నమోళ్ళు , బంజర హిల్స్ డబ్బున్నోళ్ళు...అందరు ఉన్నరు. వాళ్ళు వెళ్ళే దాంక ఆగుదాం అని బయటనే ఉన్న.
ఏం చేస్తం లే బావా. అదృష్టం ఏందంటే పెద్ద దేబ్బలేం తగలలే. ఫ్రాక్చర్ తోనె సరిపోయింది. అదే ఇంకేమన్నయ్యుంటే..ఏదో పుణ్యం కాపాడింది.”
అసలు ఆ కొత్త డ్రైవర్ని ఎందుకు పెట్టుకున్నరు? చెప్పుంటే నేనే ఎవరినన్నా పంపిస్తుండే కదా.”
ఇంట్ల పెండ్లి పెట్టుకొని ఇట్ల అయితె ఎట్లనో! ఇప్పుడేం చెయ్యాలే?” మేడం గొంతు గుర్తుపట్టిన.
అదేందక్కా అంత మాటంటవు? మేమందరం లేనప్పుడు ఆ మాట అనాలె.. ఎట్లైనా రేపో ఎల్లుండో మేమే ఒచ్చి పెండ్లి పనులు చూస్కునేటోళ్ళం. ఇప్పుడు ఏం అయ్యిందని? రెండు రోజులల్ల లేస్తడు బావ. మేము చూస్కుంటం కదా. నువ్వేం పరేషాన్ గాకు.”
ఇంకా జెర సేపుండి చుట్టాలందరూ వెళ్ళిపోయిన్రు. లోపలికి పోదాం అనుకున్న. ఇంకెవరన్న ఉన్నరేమో అని ఆగిన.
లోపల్నించి సార్ గొంతు ఇనపడ్డది.
చూశ్నవానే.. అందరు ఒక్కసారి ఒచ్చి నేనున్న, నేనున్న అని ముందు నిలబడ్డరు. సరే ఏదో మధ్య మధ్యల మాటలు అనుకున్నా.. ఎంతైనా మనోళ్ళు మనోళ్ళే.”
అవునండి. ఎన్నేoడ్లాయే...ఇట్ల అందరం మంచిగ మాట్లాడుకొని... ఎమన్నా అనుకున్నా.. చేశ్నా.... కష్టం ఒచ్చిందంటే ఎవ్వరు ఎనకాడరు. మంచిగ పెండ్లిలనే కలుస్తుండే. ఆ డ్రైవర్ గాని వల్ల ఈ హాస్పిటల్ల పడాల్సి ఒచ్చింది.”
ఇంకా ఎదో మాట్లాడుకుంటున్నరు. నాకింక అప్పుడు వాల్లని కలవబుద్ది కాలే. అక్కణ్ణించి ఒచ్చేశ్న.
· * *
ఒక వారం రోజులాగి సార్ ఇంటికొచ్చిండు అని తెలిసింది. సరే తిడితే తిట్టిన్రులే ఒక్కసారన్న కలవాలే అని ఇంటికి పొయిన.
సార్ కాలుకు పట్టీ ఉంది. కట్టె పట్టుకొని నడుస్తుండు. గుండెల కలుక్ మన్నది చూడంగనే. సార్ మంచోడు. ఒక్క మాట గూడ ఆనలే.
పోనీ లేరా.. నువ్వేమన్న కావాలని చేశ్నవా..! అవుతలి సైడు నుంచి వాడొస్తే నువ్వేం చేస్తవు.” అని ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడిండు. మనసు అల్కగ అనిపించింది.
జెర సేపు ఉండి ఒచ్చేస్తుంటే మల్ల పిలిచిండు సార్.
శీను. రేపు ఒకసారి శంకర్ ని రమ్మను, పనుంది. మేడం ని బాబుని బయటికి తీస్కపోవాలె.” అన్నడు.
సరే అని పోతున్న. అంతల మేడంతోని అంటుండు సార్ “మొన్న హాస్పిటల్ కి ఒచ్చినప్పుడు ఒకొక్కడు ఎంత మాట్లాడిండు. మేమే చూస్కుంటo అంతా. అసలు మీరు అక్షింతలు ఏస్తే చాలు... అది ఇది అని. ఇప్పుడేరి? మనమే ఫోన్ చేశి అడుక్కోవాలె. అది చేశి పెట్టున్రి ఇది చేశి పెట్టున్రి అని....సరే ఏం చేస్తం. మన పని మనం చేస్కోవాలె.”
· * *

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 19-08-2023, 04:39 PM



Users browsing this thread: 1 Guest(s)