Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#5
మరో అయిదేళ్ళ తరవాత మళ్ళీ అదే ఇల్లు, అదే మనుషులు.
రాజు అప్పుడే ఒచ్చాడు. అయిదేళ్ళ తరవాత అదే ఆ ఇంటికి రావటం. ఇల్లు పూర్తిగా కళ తప్పింది. అయిదేళ్ళ తరవాతే అయినా కృష్ణవేణిని చూస్తే ఇరవయ్యేళ్ళు అయినట్టుంది. అప్పుడే ముసలితనం వచ్చేసిందా అన్నట్టుంది. ఒక్క క్షణం గుండెల్లో కలుక్కుమంది. పైగా రెండు రోజులనుంచీ ఏడుస్తున్నట్టుంది, మొఖం అంతా పీక్కుపోయి, జుట్టు రేగిపోయి ఉంది. తన కళ్ళనుండి నీళ్ళు ఎప్పుడొచ్చాయో కూడా గమనించలేదు రాజు. ఏదో ముక్తసరిగా వచ్చి, అవసరమైన పని చూస్కొని వెళ్ళిపోదాం అనుకున్నవాడు అదంతా మరిచిపోయాడు. కృష్ణవేణిని దెగ్గర తీస్కున్నాడు.
“ఏంటక్కా ఇది. ఇలా అయిపోయావేంటి? అసలు ఇదంతా జరుగుతుంటే చెప్పొచ్చు కదా. నేనేం చచ్చాననుకున్నావా? చెప్పు. అసలు ఎమన్నా తిన్నావా మొన్నటినుంచి?”
కృష్ణవేణి ఏం మాట్లాడలేదు.
అటు ఇటు చూశాడు. సందీప్ టీవీ ముందు కూర్చున్నాడు. రాజుని చూసి దెగ్గరికి ఒచ్చాడు.
“సందీప్... బాగున్నావా రా?” అని సందీప్ ని దెగ్గరకి తీస్కున్నాడు.
“ఏమైయినా తిన్నావా సందీప్.?”
“లేదు మామయ్యా” . చిన్నప్పుడు ఎప్పుడో మామయ్యని చూసిన జ్ఞాపకం ఉంది వాడికి.
“ఇంద. ఈ డబ్బు తీస్కోని ఇడ్లి, దోసె తినిరా. వచ్చేటప్పుడు అమ్మకు కూడా తీస్కొని రా. సరేనా?” అని డబ్బిచ్చి పంపించాడు.
కృష్ణవేణి పక్కన కూర్చున్నాడు. కనకదుర్గ గుడి నుంచి తెచ్చిన ప్రసాదం తీసి ఇచ్చాడు.
“చెప్పక్కా. ఇంత జరుగుతుంటే నాకు చెప్పలేదేందుకు?”
కృష్ణవేణి కళ్ళు తుడుచుకుంది. ఎక్కడ మొదలు పెట్టాలో అర్ధం కాలేదు. కాని తప్పదు.
“ఏం చెప్పమంటావు రా. అప్పుడు నీ దెగ్గర డబ్బు తీసుకున్నందుకే సగం చచ్చాను. ఇంకోసారి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు.”
“పిచ్చిదానిలా మాట్లాడకు. డబ్బిచ్చాను అని నేను ఎప్పుడయినా అన్నానా? అసలు ఆ మాట ఎత్తానా? రక్త సంబంధం అక్కా. ఇలాంటప్పుడు కూడా ఆదుకోకుంటే ఇంకెందుకు?”
“సరే చెప్పు. బావకి ఏమయింది ఎందుకు ఇలా చేస్తున్నాడు?”
“అంతా నా ఖర్మ రా. ఏదో దుర్ముహూర్తంలో పుట్టుంటాను. లేదా పూర్వ జన్మలో ఏదో పాపం చేసుంటాను.”
“చేసింది బావ అయితే నిన్ను నువ్వు ఎందుకు అనుకుంటావు. సరే అసలు ఏమయిందో చెప్పు. ఇప్పుడేం చెయ్యాలో అలోచిద్దాం.”
కృష్ణవేణి కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
“పోయినసారి నువ్వు డబ్బు పంపినాక కొన్ని రోజులు బాగానే గడిచింది...ఒక సంవత్సరం దాకా... షాపుని కష్టపడి మళ్ళీ కాస్త నిలబెట్టాం. ఆయనకి తెలిసి కొంతా, తెలియకుండా కొంతా, నీకు ఇవ్వాలని డబ్బు కూడా దాచడం మొదలయ్యింది. ఇప్పటికయినా మా కష్టాలు తీరుతున్నాయని, ఆయన తిన్నగా ఉంటున్నారని సంతోషించాను. కాని లోలోపల గుబులుగా ఉండేది. అలవాటు లేని సుఖం కదా. కొన్ని రోజులకి నేను అనుకున్నదే నిజం అయింది. ఆ అప్పులాళ్ళు మళ్ళీ ఒచ్చారు. కనుక్కుంటే తెలిసింది కదా నువ్విచ్చిన డబ్బు మొత్తం ఆయన వాళ్లకి కట్టలేదంట. ఎంతో కొంత కట్టి మిగితాది మెల్ల మెల్లగా షాపు నిలబడ్డాక కడతాను అని చెప్పారంట. వాళ్ళు కూడా అప్పుడప్పుడు కనుక్కుంటూనే ఉన్నారంట. ఈయనేమో ఇప్పుడిస్తా అప్పుడిస్తా అని బండి లాక్కొచ్చారు.
ఆ గొడవ పెరిగి పెరిగి ఒకరోజు వాళ్ళంతా ఒచ్చి మా దెగ్గర ఉన్నదంతా లాక్కుపొయ్యారు. దాచుకున్న డబ్బుతో వేసిన చీటీలు, షాపులో సామాన్లు మొత్తం. ఆయనతో ఘర్షణ కూడా పడ్డారు. ఆ మరుసటిరోజు ఆయన నీకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పమన్నారు. కాని నేను చెయ్యలేదు. దానికే పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. ఓ నెల్లాళ్ళు ఎక్కడికెళ్ళారో తెలియదు.
నేనూ, వాడు ఎట్లా గడిపామో మాకే తెలుసు. ఒక్కదాన్నే రాత్రుళ్ళు ఎడ్చేదాన్ని. ఇంట్లో తిండి గింజలకు కూడా కష్టం అయిపోయింది. ఇక చేసేదేంలేక ఈ పక్కింట్లో ఒకావిడ చెప్తే ఓ సూపర్ మార్కెట్లో పని చెయ్యటానికి కుదురుకున్నాను. పప్పులు అవ్వీ శుభ్రం చేసి ప్యాక్ చెయ్యాలి. సందీప్ చిన్న పిల్లవాడు, స్కూలు నుంచి ఒచ్చి ఒక్కడే ఉంటాడు. అదో బాధ.
నెల్లాళ్ళకు ఆయన ఒకసారి ఫోన్ చేశారు. ఎక్కడున్నారో చెప్పలేదు కాని, ఇంటికి రావొచ్చా? అప్పులవాళ్ళు ఒస్తున్నారా? అని అడిగారు. లేదని చెప్పాను. రెండు మూడు రోజలకు ఒచ్చారు.
ఒచ్చినరోజు నుంచి ఇంట్లో గొడవ. ఆయన ఏ ఉద్యోగం చెయ్యనని, వ్యాపారం చేస్తానని. నీ పేరు తియ్యలేదు కాని నిన్ను నేను అడగాలనే ఆయన అభిప్రాయo. నేనూ మొండిగానే ఉన్నాను. ఇక చేసేదేంలేక ఆయన కూడా మా సూపర్ మార్కెట్ పక్కన ఉన్న బట్టల షాపులో పనికి కుదిరారు.
కొన్ని రోజులు ఉండి, పని నేర్చుకొని, ఎవరితోనైనా పార్టనర్షిప్ లో మనమే ఒక షాపు పెట్టుకుందాం అని నాకు చెప్పారు. నేను అవేవి పట్టించుకోలేదు. ఆయన ఏదో ఒక పని చెయ్యడమే నాకు కావాల్సింది. ఆయన నాకిచ్చే డబ్బుతోనే ఇల్లు నడిపి నేను సంపాదించిన దానితో ఒక చీటీ వేశాను.
ఏదో ఒక దారిన పడ్డాం అనుకునేసరికి మళ్ళీ మొన్నే ఆయన బుర్రలో ఏం పుట్టిందో ఏమో, ఈ పని చేశారు. నా చీటీ డబ్బు కూడా పట్టుకుపోయారు.” అని ఆపేసింది కృష్ణవేణి.
రాజు మౌనంగా కూర్చుని విన్నాడు. అతని కోపం మాత్రం అతని కళ్ళల్లో కనిపిస్తుంది.
“అసలు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా మరి?” కథ ఇంకా పూర్తి అవలేదు కదా అన్నట్టు అడిగాడు రాజు.
“ఎవరో ముదరష్టంది. ఆయన తోటే ఆ బట్టల షాపులో పని చేస్తుంది.”
“వాళ్ళిద్దరి మధ్యా పరిచయం ఉన్నట్టు నీకు తెలియదా?”
“అస్సలు తెలియదు రా. నాకు అనుమానమే రాలేదు. మామూలుగానే షాపుకి వెళ్లి వస్తుండేవారు.అదేo మాయ చేసిందో ఎప్పుడు వల్లో వేసుకుందో. ఇలా నన్ను, వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.”
“ఇంత జరిగాక ఈ మాట అంటున్నానని ఏమీ అనుకోకక్కా. మన బంగారం మంచిది కానప్పుడు పరాయి వాళ్ళని అనుకొని ఏమీ ప్రయోజనం లేదు. అదెవరో లేచిపోదాం అన్నదే అనుకో, ఈయనకి ఉండొద్దా? ఇప్పుడు సందీప్ కూడా చిన్నపిల్లవాడేo కాదు. వాడికీ రేపు ఇవన్నీ గుర్తుంటాయి. పెద్దయ్యాక వాడు తండ్రిని గౌరవంగా చూడగలడా?”
కొంచంతో పచ్చిగా మాట్లాడినందుకు రాజుకు సిగ్గుగా అనిపించింది.
ఈ ప్రశ్నలకి కృష్ణవేణి దెగ్గర సమాధానం లేకుండా పోయింది, ఏడుపు తప్ప.
“ఇంతకీ వెళ్ళేటప్పుడు ఏం తీస్కెళ్ళాడు?”
“మా చీటీ ఎత్తి మొత్తం డబ్బు తీస్కెళ్ళారు. వాళ్ళ షాపు ఓనర్ దెగ్గర పని ఉందని చెప్పి ఒక ఇరవయి వేలు అప్పు చేశారంట. ఆయనకి కూడా తెలియదు ఇంత జరుగుతుంది ఆయన షాపులోనే అని.”
“ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలిసిందా?”
“లేదు. అస్సలు తెలియదు.”
“సరే... నేను కనుక్కుంటాను. అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కుంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారో అర్ధం అవుతుంది.”
“అదేదో తెలుసుకోరా... చచ్చి నీ కడుపున పుడతాను. నలుగురి మధ్యలో తల ఎత్తుకోలేకున్నాను. అందరూ దీని గురించే అడుగుతున్నారు. మొగుడు ఒదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎంత చులకన..!”
ఒక వారం రోజులు రాజు హైదరాబాదులోనే ఉన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ గురించి వాకబు చెయ్యడం, ఎవరినో కనుక్కోవడం, వాళ్ళు ఎక్కడో ఉన్నారని చెబితే అక్కడికి వెళ్ళడం. ఇదే పని, కానీ దొరకలేదు.
ఇక తనకి కూడా విసుగు పుట్టింది. విజయవాడలో తన పనులు కూడా ఆగిపోయాయి. కాస్త గాలి మారుతుంది అని చెప్పి క్రిష్ణవేణిని, సందీప్ ని తీస్కొని ఊరు బయలుదేరాడు.
· * *
విజయవాడలో ఒక మూడు నాలుగు నెలలు ఉన్నారు కృష్ణవేణి వాళ్ళు. అక్కడ రాజు భార్య, పిల్లలు అందరు బాగానే ఉన్నారు కాని కృష్ణవేణికే ఇబ్బందిగా, అవమానంగా ఉండేది. వాళ్ళ కాపురంలో తను ఒక బరువుగా అనిపించింది. మళ్ళీ హైదరాబాదు ఒచ్చేసి అదే ఉద్యోగం చేద్దాం అనుకుంది. కాని మొగ తోడు లేకుండా ఒక్కతే ఎలా ఉండడం అన్న సందేహం ఆమెను పీడిస్తుంది.
ఒకసారి కొండ మీదికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాo అని సందీప్ ని తీసుకొని వెళ్ళింది. తన జీవితం, తన కొడుకు జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇంటికొచ్చి చూసేసరికి రాజు, దామోదరం ఎదురెదురుగా కూర్చున్నారు. అది చూడగానే కృష్ణవేణి మనసులో పిడుగు పడినట్టయ్యింది. అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది. లోపలికి వెళ్ళి తలుపు చాటునుంచి చూసింది.
“ఏం కృష్ణవేణి బాగున్నావా?” దామోదరం పలుకరించాడు.
ఆమెకి ఏమీ మాట్లాడబుద్ధి కాలేదు. అలాగే మౌనంగా ఉండిపోయింది. అతను ఇంకో అయిదు నిముషాలు రాజుతో మాట్లాడి వెళ్ళిపోయాడు. తరవాత రాజు కృష్ణవేణి గదిలోకి ఒచ్చాడు.
“బావ మళ్ళీ ఇంటికి ఒస్తాను అంటున్నాడక్కా. నువ్వేమంటావ్?”
కృష్ణవేణికి ఏమనాలో అర్ధం కాలేదు. వెయ్యి ప్రశ్నలు మనస్సులో...కాని ఒక్కటే అడగగలిగింది. “ఆమె ఏమయింది?” అని.
“ఏమో. వాళ్ళిద్దరికి పడట్లేదంట. ఆవిడ వెళ్ళిపోయిందoట. మోసపోయాను, డబ్బంతా తీసుకుంది...అదీ ఇదీ అంటున్నాడు. ఇక ఆమెతో మాత్రం అతనికి సంబంధం ఉండదట. అది మాత్రo చెప్తున్నాడు.”
“ఒక్క మాట నిజం చెప్పు రాజు.. పొరపాటు చేశాను అనే పశ్చాత్తాపం ఆయనలో ఏమయినా కనపడిందా నీకు?”
ఒక్క సెకను ఆలోచించాడు రాజు.
“ప్చ్”,..“మరేమంటావ్ అక్కా? ఒక్కటి మాత్రం చెప్తున్నాను విను. నాకు నువ్వు ఎప్పటికి బరువు కాదు. సందీప్ ని కూడా చదివిస్తా. ఆ బాధ్యత నాది. వాడికి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక మార్గం చూపిస్తా. ఇక నీ ఇష్టం. బాగా ఆలోచించుకో. తొందరేం లేదు” అని వెళ్ళిపోయాడు.
ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ ఒచ్చాడు రాజు.
“బావ నీతో చెప్పొద్దు అన్నాడు...కాని నాకే దాచబుద్ధి కాలేదు... ఆవిడ తన జీవితం బావ వల్ల పాడయిపోయిందని, ఇక ఎలా బతకాలి అంటుందoట... అందుకోసమని ఒక యాభయి వేలు అడుగుతుందట. లేకపోతే సెక్యూరిటీ అధికారి కేసు పెడతాను అని బెదిరిస్తుందట”
“అయితే...” కృష్ణవేణికి తరవాత ఒచ్చే మాట అర్ధం అయింది. ఆయినా ఆపుకోలేక అడిగింది.
“అయితే ఆ డబ్బు నిన్ను ఇవ్వమంటున్నారా?” అడిగేసింది.
“అవును.”
“ఒకవేళ ఇవ్వకపోతే నన్ను తీసుకెళ్ళను అంటున్నారా?”
“ఇంచు మించుగా.”
కాని డబ్బు గురించి ఆలోచించొద్దని, తనకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడు రాజు.
కృష్ణవేణికి చాలా తక్కువగా, హీనంగా అనిపించింది దామోదరం ప్రవర్తన. వెళ్ళకూడదు అనుకుంది. పొద్దున్న లేచి రాజుకి అదే విషయం చెబుదాం అనుకుంది.
కాని రాత్రి రాజు గదిలోంచి అతని భార్య గొంతు వినిపించింది. ఆ యాభై వేలేవో ఇచ్చేస్తే ఆమె వెళ్ళిపోతుందని. ఎలాగో వాళ్ళకి ఆస్తి పంపకాలు కాలేదు కాబట్టి దీనితో అదీ అయిపోతుందని. కృష్ణవేణి జీవితానికి ఒక మార్గం దొరుకుతుందని అన్నది ఆమె. రాజు గొంతు మాత్రం వినపడలేదు.
మర్నాడు ఉదయమే లేచి తన సామాన్లన్నీ సర్దుకుంది కృష్ణవేణి. రాజు దెగ్గరికి వెళ్ళింది.
“తమ్ముడూ. నేను వెళ్ళిపోతాను రా. ఆయన మీద నమ్మకంతో కాదు... వెళ్ళాలి కదా తప్పదు. ఈ ఒక్కసారి, చివరిసారిగా ఆ యాభయి వేలు ఇచ్చేయి. నేను సంతకం పెట్టేస్తాను. ఇక నాకు ఆస్తితో సంబంధం లేదు అని. ఏమీ అనుకోకు రా” అని తను చెప్పాలనుకున్నదంతా చెప్పేసింది.
“నీ ఇష్టం అక్కా. కాని ఇప్పుడు సంతకాల గోల ఎందుకు. నేను అడగలేదే.”
రాజు ఎంత చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. సంతకం పెట్టేసింది. సాయిని తీసుకొని బయలు దేరింది. రాజు డబ్బులు తీసుకొని ఒక వారంలో ఒస్తాను అని చెప్పాడు. దామోదరానికి ఫోను చేసి వీళ్ళు ఒస్తున్నట్టు చెప్పాడు.
· * *
కృష్ణవేణి ఆలోచనల్లోంచి బయటికి ఒచ్చింది.. ఇరవయ్యేళ్ళు దాటినా ఇంకా ఆ సంఘటనలు మొన్న జరిగినట్టు గురతున్నాయి... ఇల్లు చేరింది. సందీప్ ఇంకా పడుకొని ఉన్నాడు. రాత్రంతా కాల్ సెంటర్ లో పని. నెల రోజులనుంచి ఉదయమే అతని నిద్ర. తన కష్టాల్లో సాయిని సరిగ్గా చదివించలేకపోయింది. గవర్నమెంట్ కాలేజీలో చదివి కూడా ఇంగ్లీషు బాగా మాట్లాడడం వలన అతనికి ఈ ఉద్యోగం ఒచ్చింది.
సందీప్ హైస్కూలు అయ్యేనాటికి దామోదరం మళ్ళీ ఇంటి నుండి పోట్లాడి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి దాచుకున్న డబ్బు ఇవ్వను అనడమే అందుక్కారణం. ఈసారి కృష్ణవేణి ఎవరికీ చెప్పలేదు.
ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో సరిగ్గా తెలియదు. అప్పుడప్పుడు తనకు, సందీప్ కి ఫోను చేస్తుంటాడు. కాని ఒచ్చి వాళ్లతో ఉంటాను అని అనలేదు. ఆవిడ కూడా అడగలేదు.
ఈ మధ్య ఒక ఆరు నెలలుగా చెయ్యలేదు. సందీప్ కి ఉద్యోగం ఒచ్చింది అని చెబితే మళ్ళీ డబ్బు అడుగుతాడేమో అని భయం.
కొంచెంసేపు ఆగి సందీప్ ని లేపింది. బద్ధకించాడు. పాపం... జాలేసింది.
“కాసేపు పడుకో నాన్నా. ఇవ్వాళ బయటికి ఒద్దులే. తరవాత చూద్దాం. అరగంటలో వంట చేసేస్తా" అన్నది.
“ఒద్దమ్మా. నేను చెప్పాను కదా. ఇవ్వాళ వెళ్ళాల్సిందే. నువ్వు త్వరగా రెడీ అవు. అరగంటలో బయలుదేరాలి.” అని తొందరపెట్టాడు.
ఆటోలో ప్రసాద్ థియేటర్ చేరారు. మాల్ అంతా చాలా అందంగా ఉంది. కాని లోపలికి వెళ్ళగానే కృష్ణవేణికి ముందుగా కనిపించింది ఎస్కలేటర్. గుండె గడగడా కొట్టుకుంది.
“అరేయ్ సందీప్... మనం మెట్లమీది నుంచి వెళ్దాం రా. ఇదంటే నాకు చచ్చేంత భయం.” అంది సందీప్ చెయ్యి పట్టుకొని.
“నువ్వు మరీ చేస్తావమ్మా. నేను ఉన్నానుగా. నా చెయ్యి గట్టిగా పట్టుకో. కాని అంతకు ముందు మనం ఒకరిని కలవాలి. ఇటు రా.”
“ఎవరిని రా?”
“నువ్వు ఏమీ అనను అంటే చెప్తా అమ్మా.”
“చెప్పు రా. నువ్వు ఏం చేసినా నేను ఏమీ అనుకోను తెలుసు కదా.”
“నాన్నని రమ్మన్నానమ్మా.”
కృష్ణవేణికి మతిపోయింది. ఆలోచనలు అతి వేగంగా ఒక్కసారి తన్ను చుట్టుముట్టాయి. కొడుకు చేజారిపోతాడేమో అనేంత దాకా...
ఆమె ఏమీ మాట్లాడలేదు.
“తప్పుగా అనుకోకమ్మా. నాకు నాన్న కావాలని ఎప్పుడూ అనిపించలేదు. కాని చిన్నప్పటి నుంచీ నిన్ను చూస్తున్నాను. ఇంత కష్టపడ్డావు. నాన్న ఎప్పుడు ఒచ్చినా నువ్వు కాదనలేదు. ఇప్పుడయినా నిన్ను ఆనందంగా చూసుకోవడం నా బాధ్యత కదా.”
ఆమె కళ్ళల్లో నీళ్ళు చూశాడు.
“నేను నాన్నతో మాట్లాడానమ్మా... ఆయన నిన్ను డబ్బు అడగరు. ఆయనకీ కావాల్సిన డబ్బు నెలకి నేనే ఇస్తాను అని చెప్పాను. నీతో గొడవ పడరు. నిన్ను ఏమీ అనరు. నువ్వు హాయిగా ఉంటే, మీరు కలిసుంటే నాకదే చాలు.”
కృష్ణవేణికి బాధేసింది. కాని తన కొడుకు తన గురించే ఆలోచిస్తున్నాడని, తన సుఖం దమోదరంతో ఉంటేనే అని అనుకుంటున్నాడని అర్ధం అయ్యింది. అది తన తప్పే. జీవితంలో మోసపోయిన ప్రతిసారీ తను దామోదరం చేసిన పని మరిచిపోయి మళ్ళి అతను కావాలనే చెప్పింది. బహుశా సందీప్ కి అదే గుర్తు ఉండి ఉంటుంది ఆ వయసు నుంచీ.
ఇంతలో దామోదరం కనిపించాడు. సందీప్ ఎదురు వెళ్లి అతన్ని తీసుకొచ్చాడు.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సందీప్ మాత్రం ఉత్సాహంగా ఉన్నాడు.
దామోదరం ఏదో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంచంసేపు అటూ ఇటూ తిరిగారు.. సందీప్ ఉద్యోగం గురించి అంతా కనుక్కున్నాడు దామోదరం... కృష్ణవేణికి మనసు మనసులో లేదు. ఏదో పెద్ద షాక్ తగిలినట్టుంది. సందీప్ రెండు మూడు సార్లు మాట్లాడించడానికి ప్రయత్నించాడు. కాని ఆమె పలుకలేదు.
ఒక పది నిముషాల తరవాత కృష్ణవేణి సందీప్ వైపు తిరిగి, “ మనం వెళ్ళిపోదాం పద. మనకి ఎవరూ అక్ఖర్లేదు. మనo కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా సుఖం ఒచ్చినప్పుడు ఒచ్చినవాళ్లు అసలే అక్ఖర్లేదు.” అన్నది...సందీప్ కి పూర్తిగా అర్ధమయ్యేలోపు చెయ్యి పట్టుకు లాక్కెళ్ళిపోయింది.సాయి కూడా మారు మాట్లాడకుండా ఒచ్చేశాడు.
ఆ వెంటనే భయం లేకుండా, సందీప్ చెయ్యి పట్టుకోకుండా ధైర్యంగానే ఎస్కలేటర్ ఎక్కింది... దిగింది....
· * *
ఒక రెండు రోజుల తరవాత సందీప్ దామోదరానికి ఫోను చేసి ఏం ఫరవాలేదని, అమ్మ తో మాట్లాడి మెల్లగా తండ్రి ఇంట్లోకి రావటానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం విన్నది. కాని దాని గురించి సందీప్ తో ఏమీ మాట్లాడలేదు.
కృష్ణవేణి ఉద్యోగం మానలేదు.....

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 09-08-2023, 09:14 AM



Users browsing this thread: 1 Guest(s)