Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజం
#1
నిజం
 - Sattenapalli Anand
 
అరణ్యాల్లో ఒక్క కౄర మృగాలే కాదు మృగాల్లాంటి మనుషులు కూడా తిరుగుతుంటారు .వీరు అటవీ సంపదను మృగ సంపదను కొల్లగొడతారు, వేటాడుతారు. మనము ఈ రోజు చెప్పుకొనేది వాటిల్లో ఒకటైన ఎర్ర చందనం మాఫియా. ఈ మాఫియా ప్రభుత్వాలకన్నా ఎంతో బలమైనవి, ప్రమాదకరమైనవి. ఎన్నో వందల కుటుంబాలు ఈ మాఫియా మీద ఆధారపడి జీవిస్తున్నారంటే , నమ్ముతారా ! .ఆంధ్ర ప్రదేశ్ లోని కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, నల్లమల్ల అరణ్యాల్లో దొరికే సహజ ఎర్ర చందన కలపకు చైనా , జపాన్లో మంచి డిమాండ్ ఉంది. దానితో వారు ఫర్నిచర్ తయారు చేస్తారు, అది అక్కడ హోదాకి గుర్తింపు. టన్ను నాణ్యతను బట్టి 50 లక్షల నుండి 2 కోట్ల వరకు పలుకుతుంది. ఇంతటి బంగారాన్ని , అరుదైన, విలువైన ఎర్ర చందనాన్ని కాపాడే పటిష్టమైన ప్రభుత్వ వ్యవస్థే కరువయింది. చిన్నా పెద్ద ఎందరో ఎర్ర చందన అక్రమ రవాణాలో భాగదారులు.చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, ఎర్రావారిపాలెం , కే వీ పల్లె , దేవరకొండ ఇంకా శేషాచల అరణ్యాని ఆనుకొని వున్న తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని కొన్ని ఊళ్లు , జవాది కొండల్లోని వెల్లూర్ , తిరువణ్ణామలై జిల్లాల్లోని కలప చెక్కేవాళ్ళు ఈ అక్రమ వ్యాపారంలో సిద్ధహస్తులు . కలపను నరికే వాళ్ళు కొందరు అయితే, రవాణా చేసేవాళ్ళు, మధ్యవర్తులు , దీన్ని నడిపించే వారు వేరు .ఈ మాఫియా ఆంధ్ర ప్రదేశ్ కి సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా వ్యాపించింది . అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణకి దుబాయ్ లో కూడా వేళ్ళు ఉన్నాయి. ఒక చేతి నుండి మరొక చేతికి మారేటప్పుడు లక్షలు మారతాయి . అరణ్యంలో చెట్టుని నరికిన దగ్గరనుండి ఓడల దగ్గరకు చేరేవరకు ఎన్నో రవాణా వాహనాలు మారతాయి. సెక్యూరిటీ ఆఫీసర్ల, అరణ్య అధికారుల కంట పడకుండా మాఫియా సరుకుని రవాణా చేస్తుంది.ఈ మాఫియా లో మునిగిన చిన్న పనివాడునుండి పెదబాబుల వరకు, వారి జీవన విధానం గమనిస్తే మనం నోరు వెళ్ళపెట్టాల్సిందే , ఊహించలేనంత విలాసవంతమయినది. బార్లు , పబ్బులు, బంగార ఆభరణాలు , కార్లు వీరికి సర్వ సాధారణమయినవి . చాలా మంది కుటుంబ సభ్యులకు వాళ్ళ కొడుకులు ఏం పని చేస్తున్నారో తెలీదు, బాగా సంపాదిస్తున్నాడన్న మాత్రం తెలుసు. సినిమా పక్కీలో తిరుపతి , కడప హోటళ్లలో కూర్చొని యంత్రాంగాన్ని నడిపిస్తారు.ఎన్నో వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం దేశం దాటేసింది , ఇంకా పోతూనే ఉన్నది. ఇంత పెద్ద కుంభకోణం లో అసలు పాత్రధారులు ఎవరు ? సెక్యూరిటీ ఆఫీసర్లా ? అరణ్య అధికారులా ? రాజకీయ నేతలా ? విదేశాల్లో ఉన్న డాన్ లా? ఎవరు ? . ఇది ఆగేదెన్నడు ? సంపదతో పాటు పర్యావరణానికి హాని జరుగుతుంటే చూస్తూ ఊరుకోటమేనా ?.......................................”ఆ విధంగా లాప్ టాప్ లో ఏకాగ్రతతో టైపు చేసుకొంటూ పోతున్నది జనహిత పరిశోధనా పత్రకారి సుఖి. జనహిత టీవీ ఛానల్ దేశంలోకెల్లా అధిక రేటింగ్తో నడుస్తున్న మీడియా. ప్రత్యేకించి జనహిత పరిశోధనా విభాగమంటే అందరికి దడే .చీఫ్ ఎడిటర్ కళ్యాణ్ బాబు అంటే అందరికి గౌరవం , దానికి తగ్గట్టే అయన ఎవరికీ భయపడడు . ఆ ఛానల్ లోని వార్తలకి ప్రజలలో ఒక ప్రత్యేక గుర్తింపు.ఆరు సంవత్సరాల నుండి పనిచేస్తున్న సీనియర్ పత్రకారి సుఖి అంటే కళ్యాణ్ బాబుకి ఎంతో అభిమానం. ఇచ్చిన పనిని ఎంతో పరిపూర్ణతతో చేస్తుంది, అందుకే ఆమె అంటే ఆయనకు స్పెషల్ . ఇంతకముందు ఇచ్చిన పనులకంటే ఈ సారి ఇచ్చిన పనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది , అంతే కాదు ఇది ఎంతో ప్రమాదకరమయినది కూడా ....అదే ఎర్రచందన మాఫియా. అన్నీ వివరించాకే , తన ఇష్టంతోనే పరిశోధన లోకి దిగింది సుఖి.చెప్పాల్సిన కథనం అంతా టైపు చేసింది. ఇక వీడియో క్లిప్పింగ్స్ , ఫోటోలు లాప్ టాప్ లోకి మొబైల్ ఫోన్ నుండి అప్లోడ్ చేస్తున్నది. టైపు చేసిన మేటర్ , అటాచ్ చేసిన వీడియో, ఫోటోలు ఒకసారి పూర్తిగా చూసుకొని కళ్యాణ్ బాబుకి ఇమెయిల్ చేసింది. అనుకొన్న పని పూర్తి కావటంతో తృప్తిగా శ్వాస తీసుకొంటూ సోఫాలో కునికిపాట్లు పడుతున్న అసిస్టెంట్ గిరిని కదిపింది …… అప్పుడు తెల్లవారు ఝాము 3 అవుతున్నది. గిరి ఉలిక్కి పడి లేస్తూ "ఏమిటి మేడం, కాఫీ పెట్టనా " అన్నాడు. అప్పటికే అయిదు సార్లు తాగినా సుఖికి వద్దనడం చేత కాలేదు, సరే నంటూ తలూపింది . గిరి వెంటనే లేచి కిచెన్ లోకి వెళ్ళాడు . సుఖి ఒక్కతే ఆ ఫ్లాట్ లో ఉంటుంది. గిరితో పాటు ఫీల్డ్ వర్క్ చేసికొని నాలుగు రోజులు తరువాత ఇంటికొచ్చింది ……..ఇంటికొచ్చేటప్పటికల్లా రాత్రి పది .....గిరి ఏదో వండి పెట్టాడు.... వెంటనే పనిలోకి దిగింది. గిరి రెండు కప్పుల కాఫీతో వచ్చి సోఫాలో కూలబడిన సుఖికి ఒక కప్ ఇచ్చి రెండో కప్ ని పట్టుకొని ఎదురుగా వున్న కంప్యూటర్ కుర్చీలో కూర్చొన్నాడు."గిరి, పనయిపోయింది , సర్ కి మెయిల్ పెట్టేసాను " అన్నది నవ్వుతూ."మీరు తలచుకొంటూ కానిదేముంది మేడం “ గిరి మెచ్చుకోలుగా .“ నీవు ఫీల్డ్ లో చాలా హెల్ప్ చేసావు, థాంక్ యూ ""బలే వారే మేడం, అందుకే కదా సర్ నన్ను పంపించింది "దేవరకొండ, కే వీ పల్లెలో జరిగిన విషయాలు మాట్లాడుకొంటూ కాఫీ తాగారు ."గిరి ఇక నీవు ఇంటికి వెళ్ళు, కార్ తీసుకెళ్ళు , రేపు పదింటికల్లా వచ్చేయి , ఆఫీస్ కి వెల్దాము “ అంటూ చేయి కలిపి బై చెప్పింది. గిరి ఇంటికి బయల్దేరాడు.డోర్ లాక్ చేసి అలసిన కళ్ళతో , శరీరంతో బెడ్ మీద వాలిపోయింది . ************
మర్నాడు పదింటికల్లా జనహిత టీవీ ఛానెల్లో ఎర్ర చందన మాఫియా రసవత్తరంగా ప్రసారమవుతున్నది . ఎడిటర్ కిషోర్ వర్మ స్వయంగా ప్రోగ్రామ్ని నడుపుతున్నాడు . కథనం, వీడియోలు , ఫోటోలు రాష్ట్రమంతా కలకలం రేపాయి . ఒక్క పేర్లు తప్ప మిగితా సమాచారమంతా కళ్ళకు కట్టినట్లుగా ప్రసారమవుతున్నది……..ఇన్ని వేల కోట్ల కుంభకోణమని ప్రజలకు తెలీదు. సామాన్య ప్రజల్లోనే కాదు, సెక్యూరిటీ ఆఫీసర్ల్లో , అటవీ విభాగంలో , మాఫియాలో చేయి వున్న ప్రతి ఒక్కరికి, అధికార పక్ష నేతలకి , ఇంకా ఎంతోమంది బడా బాబులకు గుబులు మొదలయింది. విపక్షాలకు కావాల్సినంత మేత దొరికింది . గిరి కోసం ఎదురు చూస్తూ సుఖి టీవీ ప్రోగ్రాం చూస్తున్నది. తన శ్రమకి తగ్గట్లుగా నాణ్యమైన ప్రసారం అవుతున్నది. పొద్దునే చీఫ్ ఎడిటర్ కళ్యాణ్ బాబు మెయిల్ ద్వారా అభినందనలు తెలిపాడు . ప్రోగ్రాం రాజకీయ దుమారం లేపటం ఖాయమని తెలుస్తున్నది . కళ్యాణ్ బాబుఎన్నో దాడులను ఎదుర్కోవలసి వస్తుందని సుఖికి తెలుసు. తనంటే అజ్ఞాతవాసి , తన ఉనికి ఒక రహస్యంగా ఉంటుంది. బయట వారికే కాదు, ఆఫీస్ లోపలి వారికి కూడా తనకు అప్పగించే పనులపట్ల అవగాహన లేదు. తనకి చీఫ్ ఎడిటర్ కి మధ్య మూడో మనిషే లేడు. పరిశోధన పని లేనప్పుడు మిగితా సాధారణమయిన వార్తల ఎడిటింగ్ చేస్తుంది.కాలింగ్ బెల్ మోగటంతో వచ్చింది గిరేనని తెలిసుకొని టీవీ ఆఫ్ చేసి డోర్ తెరిచింది . ఇద్దరూ కలిసి ఆఫీస్ కి బయల్దేరారు. ప్రతీక్ టవర్స్ లో వున్న జనహిత ఆఫీస్ ఎంతో హుందాగా అలంకరించి ఉంటుంది. సెల్లార్లో కార్ పార్క్ చేసి ఐదవ అంతస్థులో ఉన్న కార్పొరేట్ ఆఫీసు లో పనిచేస్తుంది సుఖి. అందరికి విష్ చేస్తూ తన సీట్ లోకి వెళ్లి కూర్చొంది. ఎదురుగా గోడకి పెట్టివున్న టీవీలో ప్రసారం చూస్తూ వుంది, కిషోర్ వర్మ కామెంటరీతో ఎర్ర చందన మాఫియా ప్రోగ్రాం అందరిని ఆకట్టుకొంటుంది . మరలా ఇంకొన్ని నిజాలతో మీ ముందుకొస్తామంటూ ఈ రోజుకి ఆ ప్రోగ్రాం కి కామా పెట్టాడు.చీఫ్ ఎడిటర్ ఇంటర్ కామ్ ఫోన్లో సుఖిని తన ఛాంబర్ కి రమ్మనటంతో సుఖి లేచి వెళ్ళింది. సుఖిని చూస్తూనే “ కం సుఖి, యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ , కంగ్రాట్స్ " అంటూ మెచ్చుకున్నాడు . బదులుగా సుఖి థాంక్స్ చెప్పింది."నీవు అక్కడ ఎవరికి నీ అసలు వివరాలు చెప్పలేదుగా ""లేదు సార్, దేవరకొండలో లింగరాజు అందరికన్నా ఎక్కువ ఇంటరెస్ట్చూపించాడు , అలాగే వెల్లూరులో శ్రీనివాస్ కూడా బాగా సపోర్ట్ చేసాడు. వీళ్లద్దరికి అటవీ సంపద విదేశీయులు కొల్లగొడుతున్నారని ఆవేదన ఉంది, తమ ఫ్రెండ్స్ లో కొంతమంది ఈ వృత్తిలోకి దిగటం వాళ్ళని బాధిస్తోంది “"అందుకే నేనంటాను మంచి పనులు చేసేవాళ్ళు, మార్పు కోరుకొనేవాళ్ళు చాలామంది ఉన్నారు, మన పని ఇలాంటివి హైలైట్ చేసి సమాజాన్ని అప్రమత్తత చేయటం , ఓకే " అంటూ మరొకసారి కంగ్రాట్స్ చెప్పాడు.సుఖి తిరిగివచ్చి తన సీట్ లో కూర్చొని పని చేసుకొంటుంది . **********
జనహిత టీవీ చేసిన ప్రసారం రాజకీయ కల్లోలం సృష్టించింది . ఒక్క రాష్ట్రం లోనే కాదు కేంద్రంలో కూడా ప్రకంపనలు పుట్టించాయి . అన్ని టీవీ చానెల్స్ లో చర్చలు, ఇంటర్వ్యూలు , మానవ సంఘాల నిరసనలతో రాష్ట్రం వేడెక్కింది . రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు దీనిలో భాగిదారులని , ప్రభుత్వాన్ని రద్దు చేయాలని టీవిలో, పేపర్లలో , ర్యాలీలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి . అరణ్యాల్లో టాస్క్ ఫోర్స్ , రిజర్వు సెక్యూరిటీ ఆఫీసర్ల నిఘా పెరిగింది. కలప నరికేవాళ్ళని , పోగేసిన ఎర్ర చందన దుంగల్ని సెక్యూరిటీ ఆఫీసర్లు స్వాధీనం చేసికొన్నారు, ఎంతోమంది ని అరెస్ట్ చేసారు, అరణ్యాల్లో దాదాపుగా కలప దొంగల సెక్యూరిటీ ఆఫీసర్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది , మధ్య మధ్య సెక్యూరిటీ ఆఫీసర్ల కాల్పులు కలప దొంగల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి . సెక్యూరిటీ ఆఫీసర్ల ఉన్నత అధికారులతో ముఖ్య మంత్రి ఎప్పుడూ టచ్ లో వున్నారు. కలప అక్రమ రవాణానికి బ్రేక్ పడింది. మాఫియా కొద్దిగా తగ్గింది .రక్తం మరిగిన పులి ఊరుకొంటోందా , కోపంతో రగిలి పోతుంది మాఫియా. తమ రోజువారీ ఆదాయానికి గండి పడిందని కూలీలకు కూడా కోపంగా ఉంది. మధ్యవర్తులకు, చక్రం తిప్పే బడా బాబులకు మింగుడు పడటం లేదు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. అడ్వాన్స్ ఇచ్చిన పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయి.తామంటే భయం లేకుండా పోయిందని మాఫియాకి ఆలోచన వచ్చేసింది. దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే , వ్యాపారానికి మొదటికే దెబ్బని భావించింది . అసలు దీనికి కారకులెవరో అన్నదాని మీద దృష్టి పెట్టింది. *********
మూడు రోజులు గడిచిపోయాయి , రాజకీయ వాతావరణం ఇంకా వేడిగానే వుంది.సండే అవటం వలన సుఖి ఇంట్లోనే ఉండి తన ఫ్రెండ్స్ అందరికి , వూళ్ళోవున్న తల్లితండ్రులకు ఫోన్ చేస్తూ కాలం గడిపేస్తుంది . టీవీ పెడితే ఏదో ఒక ఛానెల్లో ఎర్రచందన మాఫియా ప్రోగ్రాం నడుస్తోంది. కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీస్తే ఎదురుగుండా కొరియర్ బాయ్ ఏదో కవర్ డెలివరీ చేసి వెళ్ళిపోయాడు . డోర్ వేసి కవర్ తీసి చూస్తే ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ లీఫ్ లెట్. వీళ్ళు కొరియర్ ని కూడా వాడుకొంటున్నారా అనుకొంటుండంగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది .ఈ సారి వచ్చింది పక్క ఫ్లాట్ జ్యోతి , జ్యోతిని చూసి “ రా లోపలికి “ అంటూ పిలిచింది . జ్యోతిని కూర్చొంటూనే "ఈ మధ్య ఎక్కడికి వెళ్ళావు , కలుద్దామంటే లేవు “ . పని మీద బయటకు వెళ్లానంటూ కాసేపు కబుర్లు చెప్పుకొన్నాక , సుఖి ఇద్దరికి టీ తీసుకొచ్చింది. టీ తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకొన్నారు. జ్యోతి వెళ్లిపోయిన తరువాత కొద్దిసేపు పడుకొందామని సోఫాలో సర్దుకుంటుండగా , మొబైల్ ఫోన్ మోగింది. ఫోన్లో నంబర్ రాలేదు, అది ప్రైవేట్ నంబర్ కాల్ .. ఎవరి ఫోన్ అయివుంటుందని అయిష్టంగానే ఫోన్ ఆన్ చేసి హలో అన్నది . అవతలివైపు నుండి “ మాతోనే పెట్టుకున్నావు , తొందరలో పోతావ్ , మీ బాస్ కి కూడా చెప్పు , మాకు అడ్డొస్తే ఎవ్వరూ బతకరు “ . వెంటనే ఫోన్ కట్ అయింది. సుఖికి అంతా అయోమయంగా ఉంది, ఏదన్నా రాంగ్ నంబర్ కాలా, ప్రైవేట్ నంబర్ నుండి చేసారు.. అరచేతిలో నుదుట మీద చెమట పట్టింది.. నిద్ర మత్తు వదిలి పోయింది. దీన్ని అంత తేలికగా తీసికోగూడదని వెంటనే బాస్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. భయపడద్దని, తాను కమీషనర్ తో మాట్లాడతానని కళ్యాణ్ బాబు ధైర్యం చెప్పాడు…….సుఖి స్వరం వణుకుతున్నదని అర్థం చేసికొన్నాడు . నోటి తడి ఆరిపోటంతో నీళ్లు తాగటానికి సోఫా నుండి కష్టంగా లేచింది .ఒక అరగంట తరువాత సర్కిల్ ఇన్స్పెక్టర్ సుఖి కి ఫోన్ చేసాడు.ఫోన్ రిసీవ్ చేసుకొన్నది సుఖి అని తెలిసిన తరువాత. ” నేను సీ ఐ మోహన్ ఠాకూర్ మాట్లాడుతున్నాను. మీరు ఏమీ వర్రీ కాకండి, మేము చూసు కొంటాము , ప్రైవేట్ నంబర్ కాల్ ఏ టైం కి వచ్చింది, ఎగ్జాక్ట్ ఏమి మాట్లాడు “ అని అడిగాడు. సుఖి అతను మాట్లాడిన టైం చెబుతూ, అతని మాటలను మళ్ళీ చెప్పింది, కానీ నా నంబర్ అతనకి ఎలా తెలిసిందో అర్థం కావటంలేదు అన్నది. "మేడం మాఫియా నడిపే వాళ్ళు మీ నంబర్ తెలుసుకోలేరా, ఏదో విధంగా సంపాదించి ఉంటారు, మీ నంబర్ ఎవరెవరికి తెలుసో చెప్పగలరా ""మా చీఫ్ ఎడిటర్ గారికి, నా ముగ్గురు ఫ్రెండ్స్ కి, మా పేరెంట్స్ కి తప్ప ఇంకెవరికి తెలీదు.""ఈ మధ్య మీరు బయటకు వెళ్ళారుగా, అక్కడ ఎవరికైనా ఇచ్చారా ""లేదు ఎవ్వరికి ఇవ్వలేదు .కానీ కానీ నాకిప్పుడు గుర్తుకొస్తుంది , పొద్దున్న కొరియర్ బాయ్ వచ్చి కవర్ డెలివరీ చేసి నా నంబర్ నోట్ చేసికొన్నాడు, నేనంత దూరం ఆలోచించ లేదు “" వాడు ఖచ్చితంగా వాళ్ళ మనిషే అయ్యుంటాడు , మీకు ఇంటిదగ్గర ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ ని ఏర్పాటు చేస్తాము , మీరు నిశ్చంతగా వుండండి , ఒకసారి రేపు మీరు మా ఆఫీసుకి రండి , వచ్చేటప్పుడు కొరియర్ కవర్ కూడా తీసుకురండి ““ఓకే అలాగే వస్తాను “ అనటంతో సీ ఐ ఫోన్ కట్ చేసాడు. మొదటిసారి ఒక్కతే ఇంట్లో ఉండటానికి భయంగా ఉన్నది. **********
రాత్రి అంతా కలత నిద్ర పోయింది. మళ్ళీ ఫోన్ రాకపోవటంతో అది రాంగ్ నంబర్ కాల్ అయివుండొచ్చని కాసేపు సమాధాన పరుచుకొంది. 9 గంటలకల్లా ఆఫీస్ కి బయల్దేరింది, బ్రేక్ ఫాస్ట్ తినబుద్ధి కాలేదు, కాఫీతోనే సరిపుచ్చుకొంది . మధ్యలో గుర్తుకు రావటంతో సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి కార్ ని తిప్పింది. సీ ఐ సుఖి ని చూసి గుర్తుపట్టినట్లుగా సుఖిగారా అన్నాడు , అవుననటంతో కూర్చోమని సీట్ చూపించాడు. “ మళ్ళీ ఫోన్ వచ్చిందా “ . సుఖి రాలేదని చెప్పింది. “ మీరు పరిశోధన కోసం ఏ ఏ ప్లేసులకు వెళ్లారు, ఎవరెవర్ని కలిశారు , వీడియో , ఫోటోలు తీశారు కదా , అందులో ఎవరెవరు వున్నారు , అంతా చెబుతారా “ అనటంతో సుఖి అన్ని వివరాలు విశదీకరించి చెప్పింది. " మీ అసిస్టెంట్ గిరి గురుంచి చెప్పలేదే “ సీ ఐ" అతన్ని గురుంచి చెప్పటానికి ఏమీ లేదు, నాకు సహాయంగా ఉంటాడని బాస్ నాతో పంపించారు “ అంటూ కొరియర్ కవర్ ని సీ ఐ కి ఇచ్చింది." దీనిమీద మీ పేరు అడ్రస్ తప్ప , ఎవరు పంపింది లేదు, ఈ కవర్ ని చూస్తే మీకు కొత్తగా అనిపించలేదా “"నేను అంతగా పట్టించుకోలేదు , ఇప్పుడు ఏమి చేయాలి ““ఈ విషయం ఎవరికీ చెప్పకండి , మీతో పాటు ఉండటానికి మేము ఒక లేడీ కాన్స్టేబుల్ ని పంపుతాను “" ఇలా ఎంతకాలం "" భయపడకండి , కొద్ది రోజుల పాటు మీరు ఒంటరిగా ఎక్కడా ఉండొద్దు, త్వరలోనే వాళ్ళని పట్టుకొంటాము, ఇక మీరు వెళ్ళవచ్చు “ అంటూ సుఖి కి ధైర్యం చెప్పాడు.సుఖి సెల్ ఫోన్ తీసికొని చెక్ చేసి ఇచ్చాడు.ఆఫీస్ కి చేరిన సుఖి కి చీఫ్ ఎడిటర్ కాల్ రావటంతో అయన ఛాంబర్ కి వెళ్ళింది.సుఖిని చూస్తూనే కళ్యాణ్ బాబు నవ్వుతూ కూర్చోమని సీట్ చూపించాడు." టెన్షన్ గా వుందా “ కళ్యాణ్ బాబుఅవునన్నట్లుగా సుఖి నవ్వటంతో నాకు ఇలాంటివి కొత్త కాదు, ఎందరో నన్ను బెదిరించారు , నేను సెక్యూరిటీ ఆఫీసర్లకు తప్ప ఎవ్వరికీ చెప్పలేదు , మొదటిసారి నా స్టాఫ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని కళ్యాణ్ బాబు అన్నాడు."నాకు మొదటిసారి ఫ్లాట్ లో ఉండటానికి భయమేసింది సర్, సీ.ఐ ని కలసి వస్తున్నాను , ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని ఉంచుతామని అన్నారు ““ వెరీ గుడ్, ఎక్కువుగా ఇలాంటివి బెదిరింపుల వరకే పరిమితమయి ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉంటే చాలు, సీ ఐ చెప్పినట్టే చేయి, ఇంకేమన్నా కావాలంటే నాకు చెప్పు “కళ్యాణ్ బాబుతో మీటింగ్ ముగిసాక సుఖి తన సీట్ లోకి వచ్చి కూర్చొంది. ఆఫీస్ లో అందరూ బిజిగా వున్నారు. మెదడులో ఎన్నో ఆలోచనలు, అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు, ఇలాంటి పని చేయటమెందుకనే ఆలోచన రాకపోలేదు . మళ్ళీ అంతలోనే మిగితా వేలమంది దేశంలోని జర్నలిస్టులు ఎలా పని పని చేస్తున్నారనే ప్రశ్న ముందు తన భయం అర్థంలేనిదిగా అనిపించసాగింది .తన సీట్ లో కూర్చోలేక , కొలీగ్ శ్రీరామ్ దగ్గరకెళ్ళి హయ్ చెప్పింది. తలదించుకుని సీరియస్ గా పని చేసుకొంటున్న శ్రీరామ్ సుఖి వంక చూసి " అయ్య బాబోయ్, సూర్యుడు ఈ రోజు ఎటు ఉదయించాడో "" ఎప్పుడు లాగానే తూర్పు వైపే “ అన్నది సుఖి నవ్వుతూఎప్పుడూ పిలిచినా రానిదానివి , ఈరోజేంటీ పిలవకుండానే వచ్చి కటింగులు ఇస్తున్నావు " అన్నాడు శ్రీరామ్ పకపకా నవ్వుతూ. సుఖి కూడా నవ్వులో జత కలిపింది."ఏమీ లేదు, చాలా బోర్ కొడుతున్నది ""అందుకే అప్పుడప్పుడు బయటకు వెళుతుండాలి ""బయట లంచ్ చేద్దామా ""ఓకే డన్, ఇంకో గంటాగి బయల్దేరుదాము, కొద్దిగా పని వుంది, దాన్ని ఫినిష్ చేస్తా “. సరేనని సుఖి తన సీట్ లోకి వచ్చింది. శ్రీరామ్ తాను ఒకేసారి జాయిన్ అయ్యారు, అప్పటి నుండి మంచి ఫ్రెండ్స్.బయట లంచ్, శ్రీరాంతో చాలా కబుర్లు చెప్పిన తరువాత సుఖి మనసు కొంత తేలికపడింది . ***********
అయిదు రోజులు గడచిపోయాయి , ఇంటికి కాన్స్టేబుల్ కూడా రావటంలేదు . సుఖి తన పనిలో బిజీ అయిపోయింది. ఒకరోజు తన కొలీగ్ సుశీల బర్త్ డే పార్టీ ఆఫీసులోనే పెట్టారు. ఆఫీస్ టైమ్ అయిపోయిన తరువాత 7 గంటలకి పార్టీ మొదలయి రాత్రి 9 గంటలదాకా నడిచింది . అందరూ చీఫ్ ఎడిటర్ తో సహా చాలా సంతోషంగా పాల్గొన్నారు . పార్టీ అయిపోయిన తరువాత ఒక్కొక్కరే ఇళ్లకు బయలుదేరుతున్నారు . సుఖి లిఫ్ట్ లో నుండి కార్ పార్క్ చేసిన చేసిన సెల్లార్ కి వచ్చింది. అంతా నిశ్శబ్దంగా ఉంది, అక్కడక్కడ లైట్లు వెలుగుతున్నాయి , భుజానికి తగిలించుకున్న బాగ్ నుండి కార్ కీస్ తీసి పట్టుకొని కార్ దగ్గరకు నడుచుకొంటూ వెళుతున్నది . ఎవరో తన వెనుక వస్తున్నారనిపించింది , వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. దూరంగా ఇంకెవరో వాళ్ళ కార్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ అక్కడ లేడు. కార్ దగ్గరకు చేరగానే , సుఖి అన్న పిలుపుకి వెనక్కి తిరిగింది , స్థంభం చాటున దాగిన ఆగంతకుడు ఒక్కసారిగా సుఖి ముందు నిల్చొన్నాడు . చేతిలో గన్ తో మూడు సార్లు ఫైర్ చేసాడు , సుఖి శరీరంలోకి బుల్లెట్లు దింపాడు . సుఖికి అరిచే శక్తి కూడా లేదు, కుప్ప కూలి పోయింది. ఆగంతకుడు వెంటనే సెల్లార్ మెట్లు మీదనుండి పైకి పరుగెత్తాడు . గన్ ఫైరింగ్ చప్పుడుకి సెల్లార్ రాంప్ బయట వున్న సెక్యూరిటీ గార్డ్, అప్పుడే కార్ స్టార్ట్ చేయబోతున్న మరొకతను పరుగెత్తుకొంటూ ఘటనాస్థలానికి చేరారు. ఇద్దరూ రక్తపు మడుగులో పడివున్న సుఖిని చూసారు . సెక్యూరిటీ గార్డ్ సుఖిని గుర్తు పట్టాడు.
***************
కేర్ హాస్పిటల్ లో ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్ లో సుఖి , బయట కొంతమంది ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ ఆఫీసర్లు, చీఫ్ ఎడిటర్ వున్నారు. ఆపరేషన్ అయిపోయింది, బుల్లెట్లు బయటకు తీశారు, రక్తం చాలా పోవటం వలన బ్రతికే ఛాన్స్ తక్కువని చెప్పారు. సుఖిని ICU కి షిఫ్ట్ చేసారు. ఎవరు చేశారన్నది సెక్యూరిటీ ఆఫీసర్లకి, చీఫ్ ఎడిటర్ కి మాత్రమే తెలుసు. పేరెంట్స్ కి కబురు చేసారు. జనహిత టీం అంతా దుఃఖంలో ఉంది. కళ్యాణ్ బాబు కి గుండెని పిండేంత బాధగా ఉంది, తన వల్లే ఈ రోజు సుఖి మరణానికి చేరువలో ఉన్నదనే భావన అతన్ని కలచివేస్తుంది . సుఖిని ఒక్కొక్కరుగా చూసి వచ్చారు .గంటలు గడుస్తున్నాయి, సుఖిలో ఏ మార్పు లేదు. తెల్లవారింది .సుఖి తల్లితండ్రులు హాస్పిటల్ చేరుకొన్నారు. కూతురు విషమ పరిస్థితికి వారు తల్లడిల్లిపోతున్నారు . తల్లితండ్రులు, చీఫ్ ఎడిటర్, ఆఫీస్ స్టాఫ్ అంతా సుఖిని బ్రతికించమని దేవుణ్ణి లోలోపల వేడుకొంటున్నారు. తల్లి అయితే తన కూతురు బదులుగా తనని తీసికెళ్ళమని, ఇంకా ఎన్నో విధాల వెంకన్నని వేడుకొంటుంది .ఓ భగవంతుడా నిజం చెబితే ఈ విధంగా శిక్ష పడుతుందా అని చీఫ్ ఎడిటర్ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు . సుఖి నెమ్మదిగా కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తున్నది , కనురెప్పల సందుల్లోంచి వెలుతురుని చూసింది. దేవుడు అందరి ప్రార్థనలను మన్నించాడు .
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నిజం - by k3vv3 - 08-07-2023, 07:19 PM
RE: నిజం - by sri7869 - 23-07-2023, 11:32 PM



Users browsing this thread: 1 Guest(s)