Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్వేచ్ఛా సమరం
#4
అందరి మౌనంతోనే తనకు సమాధానం దొరకడంతో స్వేచ్ఛ భగవద్గీత మీద చెయ్యి పెట్టి అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసింది........
 
"ఏం జరిగిందో చెప్పమ్మా" అన్నారు జడ్జి గారు ఆయనకు తెలిసినా మరోసారి కనుక్కోవాలనే ఉద్దేశ్యంతో......
 
జరిగినదంతా పూసగుచ్చినట్టు మరోసారి వివరించింది స్వేచ్ఛ.......
 
ఈసారి అందరి కళ్లతో పాటు జడ్జిగారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. కానీ ఆయన దాన్ని కనపడనీయకుండా "నీ మీద అఘాయిత్యం జరిగితే సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ చెయ్యాలి కానీ వాళ్లని చంపేస్తావా?" అన్నారు గంభీరంగా
 
"నేను సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసుంటే ఏం జరిగేది సర్?"  అడిగింది స్వేచ్ఛ
 
"వాళ్లకు తగిన శిక్షను న్యాయస్థానం విధించేది" అన్నారాయన
 
అది విని స్వేచ్ఛ జీవం లేని నవ్వు నవ్వుతూ "తగిన శిక్ష విధిస్తారా? అంటే ఏం శిక్ష విధిస్తారు సర్. వీలైతే ఏడు సంవత్సరాల జైలు శిక్ష, లేదా పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, అదీ కాకపోతే ఉరి తీస్తారు అంతేగా. ఇది సరైన శిక్ష అని మీరు అనుకుంటున్నారా? కానీ నాకలా అనిపించలేదు సర్. ఎందుకంటే మీరు వాళ్లకి జైలు శిక్ష విధిస్తే ఏడేళ్లో లేక పద్నాలుగేళ్లో మీరు జైల్లో ఆదివారం పెట్టే బిర్యానీలు, గురువారం పెట్టే చపాతీలు తింటూ గడిపేస్తారు. కానీ ఆ తర్వాత బయటకొచ్చి ఆడదంటే విలువ లేని అలాంటి నీచులు కూడా మరో ఆడదానితో కాపురం చేసి ఆడపిల్లలని కంటారు. ఇదేనా వారికి తగిన శిక్ష?" అంది
 
ఆ ప్రశ్నకు జడ్జి గారు ఏం మాట్లాడలేకపోయారు.......
 
"మీకు కొన్ని విషయాలు చెప్పొచ్చా సర్?" అడిగింది స్వేచ్ఛ
 
"చెప్పమ్మా....." అన్నారాయన
 
"ఈ సమాజంలో కామాంధుల చేతిలో బలైపోయిన ఆడదాని పరిస్థితి, మనస్థితి, దుస్థితి ఎలా ఉంటుందో మీకు తెలీదు సర్. ఎందుకంటే మీది మగ జన్మ కాబట్టి. కానీ మగాడి చేతిలో బలైపోయిన ఆడదంటే ఈ సమాజంలో అందరికీ చులకనే. తనను చూస్తే గడ్డం, మీసం మొలవని వాడికి కూడా తనో మగాడినని గుర్తుకు వస్తుంది. మా లాంటి సగటు ఆడపిల్లే కదా అన్న ఆలోచన కూడా లేకుండా మిగిలిన ఆడవాళ్లు అసహ్యంగా చూస్తారు. కొందరు మగాళ్లు ఆశగా చూస్తుంటారు. కానీ ఎవ్వరూ కూడా ఆడవాళ్లని హింసించే దుర్మార్గులను అసహ్యించుకోరు. పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తూ లోపల చెడు పనులు చేసేవాళ్లను అసహ్యించుకోరు.
 
అఘాయిత్యానికి గురైన ఆడది దేనికీ పనికిరానట్టు చూస్తారు. బయటకు వెళ్తే చాలు వెనకాల గుసగుసలు మొదలు పెడతారు. ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటారు కొందరు. పోనీ అన్యాయం జరిగిందని కోర్టుకు వస్తే ఇక్కడ అందరి ముందు లాయర్లు ఎలా జరిగింది? ఎవరేం చేసారు? అప్పుడు నువ్వేం చేసావు? అంటూ ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు మా మనసును ఎంత చిత్రవధకు గురి చేస్తాయో ఎవరికీ తెలీదు. కానీ న్యాయం జరుగుతుందనే చిన్న ఆశతో నోరు తెరిచి జరిగింది చెప్పుకుంటాం. అప్పటికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు" అంది స్వేచ్ఛ
 
"మీకోసమే కదమ్మా నిర్భయ చట్టం, దిశ చట్టం అని రకరకాల చట్టాలు తీసుకువచ్చింది ప్రభుత్వం. అయినా కూడా మీకు న్యాయం జరగదని ఎందుకు అనుకుంటారు?" అన్నారు జడ్జి గారు
 
అది విని స్వేచ్ఛ ఒక నవ్వు నవ్వి "నిర్భయ చట్టమా.......
 
కూనలను తన్నుకుపోయే గద్దలు.....
 
మాటలతో పొడిచే కాకులు......
 
బతికుండగానే పీక్కుతినే రాబందులు.....
 
కపట గుంట నక్కలు......
 
మాటు వేసి వేటాడే పులులు.....
 
"లేడి"లను కాటేసే కాలకూష విషనాగులు.......
 
అన్నీ అరణ్యములోని మృగాలే......
 
పొలిమేర అవతల ఒక అరణ్యం......
 
పొలిమేర ఇవతల ఒక అరణ్యం......
 
ఆ అరణ్యంలో మాటలు రాని మృగాలు ఉంటే.....
 
ఈ అరణ్యంలో (మానవారణ్యంలో) మాటలు నేర్చిన మృగాలు ఉన్నాయి......
 
అంతే సర్. మీరు చెప్పినట్లు చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ చట్టాలు వచ్చాక ఒక ఆడపిల్ల మీద కూడా అఘాయిత్యం జరగలేదని మీ మనసు మీద ప్రమాణం చేసి చెప్పండి సర్. చెప్పలేరు. ఎందుకంటే మీక్కూడా తెలుసు. ఈ దేశంలో డబ్బు, పరపతికి ఇచ్చినంత విలువ ఆడదాని శీలానికి ఉండదు. పైకి మాత్రం ఆడవాళ్లను దేవతలతో పోలుస్తారు. ఈ లోకంలో ఎవరూ దేవతలను కామంతో చూడరు. మరి వాళ్లతో సమానంగా పోల్చే ఆడవాళ్లను మాత్రం ఎందుకు కామంతో చూస్తారు? అసలు ఇక్కడ నేరం ఎవరిది సర్?
 
ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? లేక నన్ను ఆడపిల్లగా సృష్టించిన ఆ దేవుడిది నేరమా? లేక ఆడపిల్లలని గౌరవంగా చూడాలని అలాంటి నీచులకు నేర్పించనటువంటి తల్లిదండ్రులది నేరమా? ఎవరూ తమది నేరం అని ఒప్పుకోరు......
 
కానీ అందరూ అబలగా మారిన ఆడదాన్ని మాత్రం నేరం చేసినదానిలా వేలెత్తి చూపిస్తారు. ఇలాంటి వాటికి భయపడి ఎందరో ఆడవాళ్లు బయటకు చెప్పుకోలేక మనసులో దాచుకోలేక బతికున్న శవాలుగా జీవిస్తున్నారు.
 
చెదిరిపోయిన తమ కన్నె కలల పంటకు తమను తాము నిందించుకుంటున్నారు....
 
కూలి ధ్వంసమైన తమ స్వప్న సౌధాలకి క్రుంగి కృశిస్తున్నారు.....
 
అందుకే నేను వాళ్లను చంపేసాను....కసితీరా చంపేసాను" అంది స్వేచ్ఛ తనను కబళించిన ఆ చీకటి రాత్రి గుర్తుకు రాగా కసిగా
 
"అంటే నువ్వు చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటున్నావా?" అడిగారు జడ్జి గారు
 
"నేను సమర్థించుకోవడం లేదు సర్. కానీ నేను చేసిన పని వల్ల ఈ సమాజంలో ఆడపిల్లల మీద కొన్నైనా అఘాయిత్యాలు తప్పుతాయని భావించాను. అందుకే చంపేసాను" అంది స్వేచ్ఛ
 
"ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవారిని చంపడమే ఈ సమస్యకు పరిష్కారం అంటావా?" అడిగారు జడ్జి గారు
 
"ఈ సమాజంలో మనమెంత చేసినా ఇంకా నిర్మూలించాల్సింది మిగిలే ఉంటుంది. చంపడమే పరిష్కారం అని నేను అనట్లేదు సర్. కానీ చంపడం వల్ల ఇంకోసారి ఆడదాన్ని చెడు దృష్టితో చూసే ముందు మగాళ్లు నన్ను తలచుకుని జంకేలా వాళ్ల గుండెల్లో నిద్రపోయాను. దీని వల్ల కొన్నైనా అఘాయిత్యాలు జరగకుండా ఉండొచ్చు. లేదా మరో ఆడపిల్ల ధైర్యంగా తన మీద జరిగే అఘాయిత్యాన్ని అడ్డుకోవచ్చు....." అంది స్వేచ్ఛ
 
"కానీ నువ్వు నలుగురిని హత్య చేసావు. దీనికి నువ్వు చట్టరీత్యా శిక్ష అనుభవించాలి" అన్నారు జడ్జి గారు
 
ఆ మాట వినగానే మాలతి,ప్రకాష్ ఇద్దరూ కొయ్యబారిపోయారు. ఏడుస్తూ స్వేచ్ఛను చూడసాగారు.....
 
కానీ స్వేచ్ఛ ముఖంలో ఎలాంటి భయమూ లేదు. ఆయన మాటలకు తిరిగి "ఈ ప్రపంచంలో ఏ చట్టమైనా శారీరక పరమైన హింసకు మాత్రమే శిక్షిస్తుంది సర్. కానీ  ఒక వ్యక్తిని మానసికంగా హింసకు గురిచేసిన వారిని శిక్షించదు. ఎందుకు సర్ ? వాళ్లు నలుగురు కలిసి నా మనసును హత్య చేసారు. దానికి శిక్ష నేను జీవితాంతం అనుభవించాలి. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను సర్...." అంటూ స్వేచ్ఛ తన గుండెపై చెయ్యి పెట్టుకుని
 
"ఇక్కడ ఎంత నొప్పిగా ఉందో మీకెవరికైనా తెలుసా సర్. మూడు రోజుల ముందు వరకు నేను చూసిన ప్రపంచం వేరు. ఆ ప్రపంచంలో నేను ఎన్నో ఆశలు, ఆశయాల సౌధాలను నిర్మించుకున్నాను. కానీ ఒక్క రాత్రితో అవన్నీ కూలిపోయాయి. రేపటి నుంచి నేను చూడబోయే ప్రపంచం వేరు. ఈ ప్రపంచంలో నేను ప్రతి క్షణం ఎన్నో ఈసడింపులు, ఎన్నో అసహ్యమైన చూపులను ఎదుర్కోవాలి. అడుగడుగునా ఈ సమాజం నా కాళ్లకు సంకెళ్లను బిగిస్తుంది. వాటన్నింటినీ తెంచుకుని స్వేచ్ఛగా బ్రతకాలని ఉంది నాకు. కానీ ఈ సమాజం నన్ను స్వేచ్ఛగా బ్రతకనిస్తుందా సర్. అసలు నేనేం తప్పు చేసానని నాకు ఈ శిక్ష. నా జీవితాన్ని కబళించిన వాళ్లు ఇంకెవరి జీవితాన్ని కబళించకూడదనే ఉద్దేశ్యంతో వారిని నేను అంతమొందించడం తప్పైతే మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ కన్నీళ్లతో ఇక మాట్లాడే ఓపిక లేక దైన్యంగా చేతులు జోడించింది స్వేచ్ఛ.......
 
స్వేచ్ఛను అలా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.......
 
ఇంతలో జడ్జి గారు ఆఖరి తీర్పు చెప్పడానికన్నట్టు గొంతు సవరించుకున్నారు.....
 
ఆయనేం చెప్తాడోనని అందరూ ఊపిరి బిగబట్టి ఎదురు చూడసాగారు.....
 
జడ్జి గారు మౌనంగా పైకి లేచి స్వేచ్ఛ ముందుకు వచ్చి నిలబడి చేతులు జోడించి దైన్యంగా కన్నీళ్లతో నిలుచున్న స్వేచ్ఛ కన్నీళ్లను తుడిచారు......
 
స్వేచ్ఛ ఆయన వైపు చూస్తుంటే ఆయన చేతులెత్తి స్వేచ్ఛకు నమస్కరిస్తూ " అమ్మా స్వేచ్ఛ..... చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలని ఉందమ్మా. మన పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మీ అని ఎందుకు చెప్పారో నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది. ఎక్కడైతే ఆడవాళ్లు ధైర్యంగా తమ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా సాహసంగా ఎదుర్కొంటారో వాళ్లు దేవతలతో సమానులు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే నీ మానసిక ధైర్యం ఎంత గట్టిదో తెలుస్తోంది. ప్రతి ఆడపిల్ల నీలా ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటే ఈ సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు జరగవు తల్లీ......." అన్నారు
 
ఆ మాటలు విని అందరి ముఖాల్లో ఆనందాశ్చర్యాలు తాండవం చేసాయి......
 
అయినా స్వేచ్ఛ కన్నీరు ఆగట్లేదు. ఇన్నిరోజుల తన మానసిక సంఘర్షణను కన్నీళ్ల రూపంలో తీర్చుకుంటోంది......
 
అది చూసి జడ్జి గారు "చూడమ్మా స్వేచ్ఛ. నువ్వు ఇలా ఏడవకు. జరిగినదాంట్లో నీ నేరం ఏమీ లేదు. నీ శరీరం మలినమైందని నువ్వు బాధ పడుతున్నావు. కానీ నీ మనసు ఎంత పవిత్రమైనదో ఈ దేశానికి నువ్వు ఈరోజు నిరూపించావు. నీ శరీరానికి అంటిన మలినాన్ని నీ కన్నీళ్లతో ఎప్పుడో ప్రక్షాళన చేసేసావు అమ్మా. ఇక దేనికీ బాధ పడకు. ఇదే ధైర్యంతో నీ ఆశలను, ఆశయాలను సాధించు. నీ బంగారు భవిష్యత్తుకి సంకెళ్లు వేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు" అన్నారు
 
ఆ తర్వాత జడ్జి గారు ప్రజలను ఉద్దేశించి " ఎక్కడైతే స్త్రీలు స్వేచ్ఛతో, సుఖసంతోషాలతో ఉంటారో అదే నిజమైన మానవ సమాజము మరియు నిజమైన ప్రపంచమని నమ్ముతూ, అఘాయిత్యాలకు గురైన ఆడవాళ్లు అనుభవించే శిక్ష ముందు కామాంధులకు చావు కూడా చిన్నదే. కాబట్టి స్వేచ్ఛ చేసింది ముమ్మాటికీ సరైనదేనని భావిస్తూ తనని నిర్దోషిగా భావించి ఈ కేసును ఇంతటితో క్లోజ్ చెయ్యడం జరిగినది....." అన్నారు
 
ఆ మాటతో కోర్ట్ హాలు మొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయింది......
 
మాలతి, ప్రకాష్ ఇద్దరూ ప్రేమగా స్వేచ్ఛను చుట్టేసారు......
 
అది చూసి భార్గవ్ చంద్ర మనస్పూర్తిగా నవ్వాడు.....
 
దేశం మొత్తం స్వేచ్ఛకు అభిమానులైపోయారు. ప్రతి ఇంట్లోనూ స్వేచ్ఛ ధైర్య సాహసాలను కొనియాడారు...
 
స్వేచ్ఛ తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.......
 
ఎంతో మంది తనను కలవడానికి ఇంటికి వెళ్లేవారు. ఒక్కసారి తమ ఛానెల్లో ఇంటర్వ్యూ ఇవ్వమని ప్రాధేయపడ్డారు. కానీ స్వేచ్ఛ దేనినీ అంగీకరించలేదు.....
 
కారణం తనకు కావాల్సింది పాపులారిటీ కాదు. సమాజంలో మార్పు......
 
స్వేచ్ఛ జరిగినదాని నుంచి కోలుకునేవరకు మాలతి, ప్రకాష్ లు కంటికి రెప్పలా చూసుకున్నారు......
 
వారి ప్రేమాప్యాయతలతో కొద్ది రోజుల్లోనే శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకుంది స్వేచ్ఛ.....
 
మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి బయలుదేరింది...
 
మాలతికి మనసులో భయంగానే ఉన్నా ప్రకాష్ ధైర్యం చెప్పడంతో ఒప్పుకోక తప్పలేదు.......
 
ఇంటి నుంచి బయటకు రాగానే ఎప్పటిలాగే ఇరుగుపొరుగు వారు బాయ్ చెప్పారు కానీ తన వెనుక గుసగుసగా మాట్లాడుకోలేదు.....
 
కాలేజీలో అడుగు పెట్టిన స్వేచ్ఛకు గేట్ దగ్గరే ఎదురయ్యాడు కిషోర్......
 
కానీ చూడనట్టు క్లాస్ రూమ్లోకి వెళ్లిపోయింది. వెళ్లగానే తన స్నేహితులంతా చుట్టుముట్టేసారు ప్రేమగా......
 
వారందరి కళ్లలో తను ఊహించిన మార్పులు లేవు. ముందు తనతో ఎలా మెలిగేవారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు......
 
కానీ జరిగింది గుర్తొచ్చి ఒక్కసారిగా తలవంచుకుని మౌనంగా ఉండిపోయింది స్వేచ్ఛ.....
 
అప్పటి వరకు తననే గమనిస్తూ కూర్చున్న కిషోర్ స్వేచ్ఛ డల్ అయిపోవడంతో తన దగ్గరకు వచ్చి తనను నవ్వించడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు. కానీ అవేవీ ఫలించలేదు.....
 
దానితో లేచి స్వేచ్ఛ పక్కన కూర్చున్నాడు కిషోర్.....
 
"స్వేచ్ఛ..... ఇటు తిరుగు. ఒకసారి నా కళ్లలోకి చూడు" అన్నాడు కిషోర్
 
అయినా స్వేచ్ఛ తలెత్తలేదు.....
 
"నన్ను ఇంకా నిరసిస్తున్నావా స్వేచ్ఛ?" అడిగాడు కిషోర్
 
చివాలున తలెత్తి కిషోర్ కళ్లలోకి చూసింది స్వేచ్ఛ.....
 
ఆ కళ్లల్లో తన మీద అభిమానం, ఆరాధన స్పష్టంగా కనిపిస్తున్నాయి......
 
అది చూసి వెంటనే తల తిప్పేసింది స్వేచ్ఛ......
 
"స్వేచ్ఛ.... ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. నీ గుండెల్లో నాకు చోటుందని చిన్నమాట చెప్పు చాలు. నీ ప్రతి ఆశలోనూ,ఆశయంలోనూ నీకు తోడుగా ఉంటాను. నాకు నీ శరీరంతో పనిలేదు స్వేచ్ఛ. నాతో స్నేహంగా ఉండు చాలు" అన్నాడు కిషోర్
 
అవేవీ స్వేచ్ఛ తలకు ఎక్కట్లేదు. తన ఇరుగుపొరుగు వారి అదే అభిమానపు మాటలు, ఎప్పటిలాగే తన స్నేహితులు తన మీద చూపే ప్రేమ, కిషోర్ కళ్లల్లో ఎప్పుడూ కనిపించే తనపై ఆరాధన దగ్గరే ఆగిపోయాయి తన ఆలోచనలు......
 
అన్నీ తలచుకున్న స్వేచ్ఛ మనసులో "ఇదే కదా నేను కోరుకున్న సమాజం" అని చాలా రోజుల తర్వాత మనస్పూర్తిగా నవ్వింది......
 
స్వేచ్ఛ మాట కోసమే ఎదురు చూస్తున్న కిషోర్ తన నవ్వుని అర్ధాంగీకారంగా భావించి స్వేచ్ఛ నవ్వుతో శ్రుతి కలిపాడు.........
 
సమాప్తం***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
స్వేచ్ఛా సమరం - by k3vv3 - 28-06-2023, 09:13 AM
RE: స్వేచ్ఛా సమరం - by k3vv3 - 28-06-2023, 09:17 AM



Users browsing this thread: 1 Guest(s)