Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్వేచ్ఛా సమరం
#1
స్వేచ్ఛా సమరం
-  Kolla Malleswar
 
బ్రేకింగ్ న్యూస్......
 
"గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నగరంలో వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండు హత్యలు చోటు చేసుకున్నాయి. వారిలో ఒకతను ఆటో డ్రైవర్ కాగా మరొకతను పద్దెనిమిదేళ్ల విద్యార్థి. వీరిద్దరినీ గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా చంపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఫోరెన్సిక్ నిపుణులు ఇద్దరినీ చంపింది ఒకరే అని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు హంతకుడు ఎవరు? అతనెందుకిలా చంపుతున్నాడు? ఈ హత్యలు వెనుక కారణం ఏంటి అన్న విషయాలు తేలాల్సి ఉంది. ఈ కేసును ఎసిపి భార్గవ్ చంద్ర గారు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి......" అని మాటలతో దూసుకుపోతోంది టీవీలో న్యూస్ రీడర్
 
అప్పటి వరకూ హాల్లో కుటుంబ సభ్యులతో కూర్చుని టీవీ చూస్తున్న స్వేచ్ఛ చిన్నగా నవ్వుకుంటూ బయటకు వెళ్లడానికి పైకి లేచింది.....
 
"ఎక్కడికెళ్తున్నావే ఈ టైంలో? అసలే బయట వర్షం పడేలా ఉంది" అడిగింది వాళ్లమ్మ మాలతి
 
"చిన్న పనుంది అమ్మా త్వరగా వచ్చేస్తాను" అంటూ హ్యాంగర్ కి వేలాడించిన రెయిన్ కోట్ తీసుకుని బయటకు నడిచింది స్వేచ్ఛ
 
"ఏంటండీ మీరేం మాట్లాడరు అమ్మాయి ఈ టైంలో బయటకు వెళ్తుంటే? అసలే రోజులు బాలేవు. పైగా నగరంలో హత్యలు కూడా జరుగుతున్నాయంట. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడం అవసరమా? అంత పనులేమున్నాయి దానికి?" అంది మాలతి కొంచెం కోపంతో కూడిన గొంతుతో
 
"మాలతి..... మన అమ్మాయేం చిన్నపిల్ల కాదు తప్పిపోవడానికి. తను క్షేమంగా ఇంటికి వస్తుంది. నువ్వేం కంగారు పడకు" అన్నాడు ప్రకాష్ ధైర్యం చెబుతూ
 
"అదికాదండీ. ప్రతిరోజూ టీవీలో ఎన్ని చూడట్లేదు ఆడపిల్లల మీద అఘాయిత్యాల గురించి. ఇలాంటి సమయంలో అది ఒంటరిగా వెళ్లడం అవసరమా. దానికేమైనా జరిగితే మనమందరం ఏమైపోవాలి?" అంది మాలతి
 
"చూడు మాలతి. నేను నా కూతురికి స్వేచ్ఛ అని పేరు పెట్టింది ఎందుకనుకున్నావు? తన పేరులో ఉన్న స్వేచ్ఛ తన జీవితంలో కూడా ఉండాలని. ఆడపిల్లలకి స్వేచ్ఛను ఇవ్వాలి మాలతి. అప్పుడే వాళ్లు ఆకాశంలో విహరించే పక్షుల్లా తమ ఆశయాలను సాధించుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు. అయినా మన అమ్మాయి ధైర్యవంతురాలు. ఎలాంటి సమయంలో అయినా ధైర్యంగా ముందుకు దూసుకెళ్లగలదు. ఆ నమ్మకం నాకుంది" అన్నాడు ప్రకాష్ గర్వంగా
 
"సరిపోయింది. మీ కూతురు తానా అంటే మీరు తందానా అనేరకం. మొన్నటికి మొన్న అది కాలేజీకని వెళ్లి రాత్రంతా ఇంటికి రాలేదు. మరుసటి రోజు సాయంత్రం వచ్చి వర్షం వల్ల ఫ్రెండ్ ఇంటిలో ఆగిపోయా అని చెప్పింది. ఆడపిల్ల సాయంత్రానికి ఇంటికి రాకపోతే ఎంత భయంగా ఉంటుంది. అదేమో పేరుకు తగ్గట్టు స్వేచ్ఛగా బయట తిరగటం, మీరేమో దానికి వంత పాడటం. నా మాట వినిపించుకునేవాళ్లే లేరు ఈ ఇంట్లో " అంది మాలతి నిష్ఠూరంగా
 
తల్లి మనసును అర్థం చేసుకున్న ప్రకాష్ మౌనంగా ఉండిపోయాడు......
 
స్వేచ్ఛ వేగంగా స్కూటీ నడుపుతోంది. తన స్కూటీ వేగం కన్నా మనసులో ఆలోచనల వేగం ఎక్కువైంది. రోడ్డుపై ఒక్కో మీటరు దాటే కొద్దీ తనకు రెండు రోజుల క్రితం జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి.....
 
రెండు రోజుల క్రితం.....
 
సమయం సాయంత్రం అయిదు గంటలు.......
 
బయట ఒకటే హోరుగా కురుస్తోంది వర్షం......
 
ఆకాశం నల్లటి దుప్పటి కప్పుకున్నట్టు మహా గంభీరంగా ఉంది.......
 
గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలితో, అరగంట నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.....
 
అలాంటి సమయంలో ప్రకృతితో తీవ్ర పోరాటం చేస్తున్నట్టుగా ముక్కుతూ మూలుగుతూ కదులుతున్న ఆటోలో, ఇరువైపుల నుంచి ఈడ్చుకొస్తున్న ఈదురు గాలికి గజగజ వణికిపోతూ, విసుగ్గా ఒకవైపుకి ముడుచుకొని కూర్చుంది స్వేచ్ఛ......
 
తన విసుగుకు కారణం ఇందాక కాలేజీలో జరిగిన సంఘటన......
 
సరిగ్గా గంట క్రితం....
 
అప్పుడే కాలేజ్ వదలడంతో ఇంటికి వెళ్లడానికి ఆటో స్టాండ్ దగ్గరకు నడుస్తోంది స్వేచ్ఛ.....
 
ఇంతలో చేతిలో రోజా పువ్వుతో తన ముందుకు వచ్చి నిలబడ్డాడు తన క్లాస్మేట్ అయిన కిషోర్......
 
అతన్ని చూడగానే అతనెందుకు వచ్చాడో, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అర్థమైన స్వేచ్ఛ మౌనంగా తన తీక్షణమైన కళ్లతో చూసింది అతని వైపు......
 
తన మౌనాన్ని అర్ధాంగీకారంగా తీసుకున్నాడేమో వెంటనే మోకాళ్లపై కూర్చుని "స్వేచ్ఛ.... ఎన్నో రోజుల నుంచి నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇష్టం కలగగానే పరిచయం పెంచుకుని పోయే మనస్తత్వం కాదు నాది. బాగా ఆలోచించిన తర్వాతే ఏ పనైనా చేస్తాను. నీతో నాకు పరిచయం, పలకరింపులు లేకపోయినా నన్ను రోజూ క్లాస్ రూమ్లో చూసుంటారు. ఈపాటికే నా మీద మీకొక అభిప్రాయం ఏర్పడి ఉండాలి. నువ్వు నాకు బాగా నచ్చావు. నీక్కూడా నేనంటే ఇష్టమయితే మీ ఇంట్లో మాట్లాడుతాను. ఏమంటావ్? "అన్నాడతను
 
అది విని స్వేచ్ఛ సింపుల్ గా " నో " అని చెప్పి ముందుకు కదిలింది.....
 
"ఎందుకు కాదంటున్నావో కారణం తెలుసుకోవచ్చా?" అడిగాడతను తన వెంటే నడుస్తూ
 
"ఇలాంటి ప్రేమ సంబంధిత విషయాల్లో నాకు ఆసక్తి లేదు. నా ఆలోచనలు, ఆశలు, ఆశయాలు వేరు. దయచేసి నన్ను డిస్టర్బ్ చెయ్యకండి " అంది స్వేచ్ఛ ధృడంగా
 
అది విని తన రంగుల కలలన్నీ చెదిరిపోయినట్టు అనిపించింది కిషోర్ కి. బాధతో అక్కడే ఉండిపోయాడు......
 
ఇక కిషోర్ తో మాట్లాడాల్సింది ఏమీ లేనట్టుగా అక్కడి నుంచి ఆటో స్టాండ్ దగ్గరకు వస్తుండగా వర్షం మొదలవడంతో త్వరత్వరగా ఆటో ఎక్కి ఇంటికి ప్రయాణమయ్యింది స్వేచ్ఛ.......
 
జరిగినదంతా తల్చుకుంటున్న స్వేచ్ఛ మనసులో తనలా కిషోర్ ని తిరస్కరించి ఉండాల్సింది కాదు అని అనిపించింది....
 
వెంటనే ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుని బయటకు చూసిన స్వేచ్ఛకు ఆటో ఆగిపోయి కనిపించింది...
 
అది చూసి "ఏమైంది భయ్యా?" అడిగింది స్వేచ్ఛ చలికి వణుకుతూ
 
అయినా డ్రైవర్ పలకలేదు.....
 
దాంతో అసహనంగా రోడ్ వైపు చూసిన స్వేచ్ఛ ఆటో ఎదురుగా నిలబడి ఉన్న ముగ్గురిని చూసి మనసులో అనుమానం మొదలవగా వెంటనే ఆటో దిగి పారిపోవడానికి ప్రయత్నించింది........
 
వెంటనే ఆ ముగ్గురూ తనని చుట్టుముట్టేసారు ఎటూ కదలకుండా......
 
తన అనుమానం నిజమవడంతో భయంతో గట్టిగా కేక వేసింది స్వేచ్ఛ.....
 
కానీ గొంతు దాటి కూత బయటకు రాకముందే ఆ ఆటో డ్రైవర్ స్వేచ్ఛ ముక్కుకు క్లోరోఫామ్ అద్దిన కర్ఛీఫ్ తాకించగానే మతిలేనిదానిలా స్పృహ తప్పింది స్వేచ్ఛ........
 
వెంటనే ఆ నలుగురు ఎవరికీ అనుమానం రాకుండా స్వేచ్ఛను ఒక కారులో బంధించి ఊరి చివరన ఇలాంటి అక్రమాలకు పాల్పడేందుకు అణువుగా ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లారు.........
 
మరుసటి రోజు ఉదయం పది గంటలకు కళ్లు తెరిచిన స్వేచ్ఛకు తన కళ్ల ముందు ఈ ప్రపంచం ముందులా కనిపించడం లేదు......
 
అసలు ప్రపంచం ఉన్నట్లే అనిపించడం లేదు....
 
ఎందుకంటే తను ఇన్నాళ్లు చూసిన ప్రపంచం ఇలా లేదు. తన ప్రపంచంలో ఎన్నో ఆశలు, ఆశయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడవన్నీ పటాపంచలయ్యాయి......
 
తన జీవితం ఆ కామాంధుల చేతిలో బలైపోయింది. తనకోసం రాత్రి ఆ నలుగురు నువ్వా నేనా అని కొట్లాడుకున్నారు. అది గుర్తు రాగానే ముఖం అర చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది స్వేచ్ఛ......
 
అలా ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్లు ఇంకిపోయాయి. ఇప్పుడు తన కళ్లల్లో కన్నీళ్లు రావడం లేదు ఏడవటానికి. మౌనంగా మోకాళ్లపై చేతులు పెట్టుకుని దీనంగా ఆకాశం వైపు చూస్తోంది స్వేచ్ఛ......
 
ఎన్నో ఆలోచనలు తన మనసులో ఒకదానితో మరొకటి పోటీ పడుతూ పరిగెడుతున్నాయి. అన్ని ఆలోచనల్లో తన మెదడును కొన్ని ప్రశ్నలు తొలిచేస్తున్నాయి...
 
"ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్లాలి? నాకు జరిగింది తెలిస్తే ఇంట్లో వాళ్లు చేరదీస్తారేమో కానీ ఈ సమాజం నన్ను చేరదీస్తుందా? మునుపటిలా నా స్నేహితులు నాతో కలివిడిగా మాట్లాడుతారా? రోజూ కాలేజీకి వెళ్లే ముందు నవ్వుతూ బాయ్ చెప్పే ఇరుగుపొరుగు అమ్మలక్కలు రేపటి నుంచి నన్ను చూసి గుసగుసలు మొదలు పెట్టి మాటలతో పొడుస్తారేమో? రోజూ ఆఫీసులో తన కొలీగ్స్ అందరూ నన్ను పొగుడుతుంటే గర్వంతో ఇంట్లోకి అడుగు పెట్టే నాన్న రేపటి నుంచి వాళ్ల మాటలకు మనసులో వ్యథతో ఇంటికి చేరుకుంటాడేమో ? ఈ ప్రశ్నలన్నింటికీ పరిష్కారం ఏది?" అని ఆలోచిస్తున్న స్వేచ్ఛ మనసులో ఒక ఆలోచన వచ్చింది.....
 
వెంటనే "అవును. వీటన్నింటికీ చావే పరిష్కారం. నేను చావాలి. వెంటనే చచ్చిపోవాలి" అని దిగ్గున పైకి లేచింది స్వేచ్ఛ
 
తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించింది. కానీ ఎంతసేపటికీ తనెక్కడుందో అర్థం కాలేదు. మెల్లగా నడక ప్రారంభించింది. ఒంట్లోని శక్తినంతా ఎవరో లాగేసినట్టు కాళ్లు ముందుకు సాగడం లేదు. కొద్ది దూరం నడిచాక దూరంగా ఏదో ఇల్లు కనిపిస్తే అక్కడెవరైనా ఉన్నారేమోనని అటువైపు కదిలింది.....
 
కొద్దిసేపటికి ఆ ఇంటిని చేరుకుంది. అదొక పాడుబడిన బిల్డింగ్. అక్కడెవరూ లేరు. అప్పటికే కాళ్లు పీక్కుపోతుండటంతో ఇక ఓపిక లేక ఒక స్తంభానికి జారబడి కూర్చుంది స్వేచ్ఛ.......
 
దూరంగా పగిలిన బీరు సీసాలు కనిపించాయి....
 
ఆ రాత్రి అక్కడే వాళ్లు తన చేతులు, కాళ్లు కట్టేసి తమ పైశాచికత్వాన్ని చూపించిన తర్వాత నలుగురు కూర్చుని బీరు తాగుతూ తాము పొందిన అనుభవం గురించి అసభ్యంగా మాట్లాడుకోసాగారు......
 
వాళ్ల మాటలన్నీ గుర్తు రాగానే కోపంతో ఊగిపోయింది స్వేచ్ఛ. పిడికిలి బిగించింది. కోపం వల్ల తన ముఖం మరింత ఎర్రబడింది.....
 
"రేపు తనలా ఇంకో అమ్మాయి వాళ్లకు బలైతే?" అన్న ఆలోచన మనసులో మొదలవగానే నిలువునా కంపించిపోయింది స్వేచ్ఛ....
 
"ఇంకెవరికీ నాలా జరగకూడదు. ఏ ఆడపిల్ల నాలా బాధ పడకూడదు. అంటే ఏం చెయ్యాలి? నేను బ్రతకాలి. అవును చావకూడదు" అని ధృడంగా నిశ్చయించుకుంది. ఆ ఆలోచన తనలో ఏదో తెలీని శక్తిని నింపింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
స్వేచ్ఛా సమరం - by k3vv3 - 28-06-2023, 09:13 AM



Users browsing this thread: 1 Guest(s)