Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తిలాపాపం...!
#1
తిలాపాపం...!
-  kottapalli udayababu
సరిగ్గా సాయంత్రం 6 గంటలైంది. అంతవరకూ వేరే దారిలేక కనిపించిన పరిచయస్తు లందరితోను ఇంటి సంగతులనుంచి రాజకీయాలవరకు అన్ని మాట్లాడుకుంటున్న వాళ్ళమంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాము.
స్పాట్ వాల్యుఎషన్ రెండవరోజు. కొత్తగా వచ్చిన విద్యా శాఖాధికారి పరమ స్ట్రిక్ట్ అని చెప్పుకుంటున్నారు అంతా. అది నిజమే అన్నట్టు తనచేతుల్లోని “తాళంచెవి” అనే వజ్రాయుధం తో ఎంతోమంది మేధావుల్ని నిలువరించిన ‘ఇంద్రుడి’లా వచ్చిన గేటు వాచ్ మన్ ను చూస్తూనే కొందరు హడావుడి గాళ్ళు ‘ పక్కకి జరగండి ...అతనికి దారి ఇవ్వండి ‘ అనడంతో నేనూ పక్కకి జరుగుతూనే గేటు వైపు నడిచాను.అప్పటికే స్టార్ట్ చేసిన బైక్ హారన్లతో ఆ ప్రదేశం మార్మోగి పోయింది,
“నీకెన్ని పేపర్లు ఇచ్చారే? ‘ నడుస్తూనే అడుగుతున్న ఒకామేకి మరో ఆమె “సరిగ్గా అందరికి 4౦ పేపర్లే ఇచ్చాడే మా చీఫ్ ...మిగతావి వాడే దిద్దుకుంటాడట. పిసినారోడు..సరే పద పద,,’అంటూ ముందుకు సాగింది.
నేను నవ్వుకుంటూ గేటు బయటకు వచ్చాను.
‘వస్తారా మాస్టారూ...కాంప్లెక్స్ లో దింపేస్తాను.?’అడిగాడు రామచంద్రం.అతనో పరిచయస్తుడు.
‘సరే’ అని అతని బైక్ ఎక్కాను.
కాంప్లెక్స్ లో ఇసుకవేస్తే రాలనంత జనం.నేను ఎక్కవలసిన బస్సు నిండా జనమే..’రండి మాస్టారూ. మీకోసమే సీటు ఉంచాను’ అన్నాడు భగవాన్. ఇతను మరోపరిచయస్తుడు. ‘బ్రతుకు జీవుడా’అనుకుని జనాన్ని తోసుకుంటూ వెళ్లి సీటులో కూలబడ్డాను.’ కృతజ్ఞతలు బాబు’ అన్నాను మర్యాదపూర్వకంగా..భగవాన్ ఒట్టి వాగుడు కాయి.అతని సందడితో ప్రయాణం తేలికగా జరిగి ఇంటికోచ్చాను.
రేపు ఎన్నికల పోలింగ్ అనగా ఈ రాత్రి అన్ని రాజకీయపార్టీల వారు అందించిన బహుమతులతో గుండెలనిండా సంబరం నింపుకున్న సదరు ఓటరు లా చింపిరి చాటంత ముఖం తో ఎదురోచ్చింది నా భార్య వసుంధర. కాళ్ళు కడుక్కుని కుర్చీలో వాలాను...ఎదో సంతోషకర వార్త నాతొ తక్షణం పంచుకోవాలన్న ఉత్సుకత ఆమెలో కనిపిస్తోంది...’ఏమిటోయ్..అంత ఆనందంగా ఉన్నావ్?’ అడిగాను.
“మీరు నన్ను తిట్టను అని మాట ఇవ్వండి ముందు.” అంది వేడి వేడి కాఫి నా చేతుల్లో పెట్టి.
“ ఉహూ...మీరు నన్ను తిట్టడానికి వీలు లేదు. తిడితే ఊరుకోను నేను.మీవల్ల ఒక సాయం కావాలి. అది ఖచ్చితంగా మీవల్లే అవుతుంది. ముందు ఒట్టు వెయ్యండి.” అని తనే నా ఎడమ చేతిని తన కుడి అరచేతిలో బలంగా పట్టుకుంది.
‘సరే తిట్టనులే...ఏమిటో చెప్పు’ అన్నాను .
అదే చేయి అలాగే పట్టుకుని నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళింది.అక్కడ నా బెడ్ కి ఎదురుగ గోడకి ౩2 ఇంచెస్ ఎల్.సి.డి. టీవీ రాచ ఠీవి ఒలకబోస్తూ నన్ను వెక్కిరిస్తున్నట్టుగా నిలబడి ఉంది.
“ చూసారుగా..ఎన్నాళ్ళనుంచో తీరని నా కోరిక ఇన్నాళ్ళకు తీరింది...ఇపుడు ప్రశాంతం మాట్లాడతాను.మీరు ప్రశాంతంగా వినండి.మీచేతులలో ఉన్న చిన్న సాయం చెయ్యండి చాలు.” అంది .నన్నుహాల్లో కుర్చీలో కూలేసి నెమ్మదిగా నొప్పులుగా ఉన్న పాదాలను వోత్తసాగింది.
“ఎవరికీ సాయం చెయ్యాలి?’ ప్రశాంతంగానే అడిగాను.
“ అదేనండీ..ఎదురింటి డాక్టర్ గారి అబ్బాయి సాగర్ లేడూ? మన ఇంటికి క్రిందటి సంవత్సరం ట్యూషన్ కి వచ్చాడుగా..అతను గుంటూరులో ఒక ప్రైవేటు కాన్వెంట్ లో చదువుతున్నాడట. ఈసారి ఆ కాన్వెంట్ వాళ్ళ సైన్స్ పేపర్లు మీరు దిద్దుతున్న సెంటర్ కే వచ్చాయట.మీరూ బయాలొజీ పేపర్లేగా దిద్దుతున్నారు. ఆ గుంటూర్ కాన్వెంట్ ప్రిన్సిపాల్ గారు, డాక్టర్ గారూ ఇందాకా స్వయంగా మన ఇంటికి వచ్చారు.వస్తూ ఆ బహుమతి మీకు అందజేసి సాగర్ రిజిస్టర్ నెంబర్ ఇచ్చి వెళ్లారు. మీరు మీ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి ఆ నెంబర్ ఉన్న పేపర్ వస్తే మంచి మార్కులు వేయమనండి. సాగర్ని ఇంటర్ లో బై.ఫై.సి.లో చేర్పించుకుని తరువాత తనలాగా ఎం.బి.బి.ఎస్.లో చేర్పించుకుంటారట...తప్పక మీ ఆయనతో చెప్పి ‘ఈ సాయం చెయ్యండి..గతం లో నేను అన్న మాటలు పట్టించుకోవద్దు అని చెప్పండి ..ఇవి చేతులు కావు’ అన్నారండి..నా మనసంతా అదోలా అయిపొయింది.మీచేత తప్పక చేయిస్తా అని మాట ఇచ్చాను.ప్లీజ్ అండి.మీరు చేస్తున్నారు చేస్తున్నారు...చేస్తున్నారు..అంతే.” అని నన్ను హిప్నటైజ్ చేసినట్టు మూడు సార్లు అనేసి రివ్వునలేచి..వంటింట్లోకి వెళ్ళిపోయింది.
తను వెళ్లినవైపు చూస్తూనే నా దవడ కండరం బిగుసుకుంది..ఒక్క క్షణం సమాజం లో ఉపాధ్యాయులకిస్తున్న గౌరవం గుర్తొచ్చి బాధేసింది...గతం గుర్తొచ్చింది.
నేనుంటున్న అపార్ట్ మెంట్ ఎదురుగా స్థిరపడిన డాక్టర్ లివింగ్ స్టన్ గారి కి ఒక అబ్బాయి...ఒక అమ్మాయి..నా గురించి తెలిసి తమ పిల్లవాడికి బయాలజీ ప్రైవేటు చెప్పమని తనకోడుకుని తనలాగే డాక్టర్ ని చేయ్యోలన్నది తన ధ్యేయమని చెబుతూ...సాగర్ చాలా పెంకి వాడని ఒకటికి పది సార్లు చెప్పాలని ఎంత ఫీజు కావలిస్తే అంతా ఇస్తానని చివరగా...అన్ని సార్లు చెప్పినా వినకపోతే...దండించమని...ఒక వేళా గట్టి దెబ్బలు తగిలితే తానూ తన కొడుకుకు వైద్యం చేయించు కుంటానని నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అంటే.. 5౦౦౦ రూపాయలు నా చేతిలో పెట్టి నమస్కరించి వెళ్ళిపోయారు ఆయన.
మరునాడు కూడా ఆయనే స్వయంగా వచ్చి సాగర్ని నాకు పరిచయం చేసి మళ్ళీ నాకే జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు.
నేను అతనికి ట్యూషన్ ప్రారంభించాను. నేను ఒక అరగంట పాటం చెప్పాను. మధ్య మధ్య లో అతని ముఖ భావాలు గమనిస్తూనే ఉన్నాను.చూపులు నాపైనే ఉన్నా దృష్టి ఎక్కడో ఉందనిపించింది.
నేను అప్పటి వరకు చెప్పిన దాంట్లో ప్రశ్న లడిగాను. “అర్ధం కాలేదు సర్”. అన్నాడు... మళ్ళీ మరో అరగంట చెప్పి మరుసటి రోజు చదువుకు రమ్మన్నాను. మొక్కుబడిగా ఎన్నో తప్పులతో అప్పగించేసాడు.గాని చిన్న చిన్న ప్రశ్నలు వేస్తె సమాధానం లేదు...ఇలా ఏంతో ఓపిక గా మూడు నెలల పాటు చెప్పాను.ప్రతీ నేలా 5౦౦౦ ఫీజు క్రమం తప్పకుండా పంపేవారు డాక్టర్. అయితే సాగర్ ప్రవర్తనలో క్రమంగా మార్పు రాసాగింది. సాగర్ ఎం చేస్తున్నాడో అపుడప్పుడు తెలుసుకునేటందుకు డాక్టర్ గారూ అతనికి ఒక సెల్ ఫోన్ ఇచ్చారు.
నేను పాఠాలు మొదలు పెట్టాక ఫోన్ రావడం...’వన్ మినిట్ సర్ ‘ అని బయటకు వెళ్ళడం అరగంట తర్వాత లోపలి రావడం...పాఠాలు ఎక్కడంలేదనే సాకు తో వెళ్ళిపోవడం...తరచుగా మొదలెట్టాడు.ఒకరోజు అలాగే చెయ్యబోతే ఫోన్ లాక్కున్నాను. ‘నా ఫోన్ లాక్కోవడానికి మీరెవరు?’ అన్నాడు.
‘నువ్విక్కడ నేర్చుకోవడానికి వచ్చావా? ఫోన్ మాట్లాడటానికి వచ్చావా’ అన్నాను కోపంగా.
‘మీరు డబ్బుకోసం నాకు ఇష్టం లేకపోయినా పాఠాలు చెబుతారు...ఆయన ఇస్తాడు...మధ్యలో ఈ తల నొప్పి నాకా?’ అన్నాడు...
‘అయితే వెళ్ళిపో ఇంకెప్పుడూ రాకు...’ అన్నాను మరింత కోపంగా...
‘ఫోన్ ఇవ్వండి వెళ్తాను’ అన్నాడు.
‘నీ సంగతి మీ ఫాదర్ తో మాట్లాడి ఇస్తాను వెళ్ళు...ఆయన్ను తీసుకురా..’
అంతలో ఫోన్ మోగింది..’అనిత’ అనే నేమ్ డిస్ప్లే లో కనబడింది.నేనూహించనంత వేగం గా వచ్చి ఫోన్ లాక్కోబోయాడు సాగర్. ఒక్క తోపు తోసాను. నాతొ కలబడ్డాడు..నాకు పిచ్చి కోపం వచ్చేసింది...’యూ రాస్కెల్ ‘ అని అందుబాటులో ఉన్న చెక్క స్కేల్ తో మోచేతులమీద, మోకాళ్లమీద కొట్టాను. స్కేల్ విరిగిపోయింది.ఆ అదను లో ఫోన్ తీసుకుని తన టెక్స్ట్ బుక్ విసిరిపడేసి...’మానాన్నతోనే వస్తాను’ అనేసి వెళ్ళిపోయాడు.
ఆ మరునాడు డాక్టర్ నాకు ఫోన్ చేసారు. ‘ ఏంటి సర్...భయం చెప్పమంటే అలా కొట్టేసారు? రాత్రి వాడికి 1౦5 డిగ్రీలు జ్వరం వచ్చింది...పిల్లవాడికేమయినా జరిగితే ఎవరిదీ బాధ్యత?”తీవ్రంగా అన్నాడు.
నేను జరిగిందంతా చెప్పాను...’అయినా సరే సర్...పిల్లవాడు తప్పు చేస్తే క్షమాగుణం ఉండాలి...మీరు ఉపాధ్యాయులు.పిల్లవాడు రేపటినుంచి రాడు.నేను మంచి వాడిని కాబట్టి మీమీద సెక్యూరిటీ అధికారి కేస్ పెట్టకుండా వదిలేస్తున్నా..’అని ఫోన్ పెట్టేసాడు.
ఆ సాయంత్రమే ఆయన ౩ నెలలుగా ఇచ్చిన పదిహేను వేలు ఫీజు డాక్టర్ గారికి అందేలా ఏర్పాటు చేసేసాను.
డబ్బైతే కుదరదని ఇపుడు వస్తువుతో వచ్చి ...అదీ వసుంధర ద్వారా నన్ను సాధించే ప్రయత్నమన్నమాట.
నేను కాదంటే ఇప్పుడు పెద్ద సీన్ చేయడానికి వెనుకాడని మనస్త్వత్వం వసుంధర ది. అయినా సాగర్ రాసిన పేపెర్ మా దగ్గరకి రావాలిగా...అనుకున్నాను.
మరుసటి రోజునుంచి మొదలైంది నాకు వసుంధరతో నస..వెళ్లబోతుంటే చెప్పింది. సాయంత్రం వస్తూనే అడిగింది. ఇక గతి లేక అందరు ఇంచుమించు నాకు స్నేహితులు కావడం తో అందరికి సాగర్ నెంబర్ ఇచ్చి సాధ్యమైనంత సాయం చేయమన్నాను. 5 వ రాజున ఆ పేపర్ నా ముందు చీఫ్ దగ్గర పేపర్లు దిద్దుతున్న చైతన్యరాజ్ దగ్గరకొచ్చిందట...ఆ సాయంత్రం బయటకు వస్తూ ‘ చాలా థాంక్స్ గురు..మంచి సమయానికి మంచి సహాయం చేసావ్’ అన్నాడు.
‘ అదేంటి?’ అన్నాను...’బిట్ పేపర్ రెండు బిట్లు రాసి మెయిన్ కి రెండు ఖాళీ అడిషనల్స్ కట్టి వదిలేసాడు..మొత్తం అన్ని నేనే ఆన్సర్ చేసేసి 48 మార్కులు వేసాను.పదివేలు ఇచ్చారు.’
నేను చేయనన్న అనుమానంతో అటునుంచి నరుక్కోచ్చారన్నమాట అనుకున్నాను. మళ్ళీ అటువంటి సంఘటన నా ఉపాధ్యాయ జీవితం లో పునరావృతం కాలేదు. ఆ తర్వాత రెండేళ్లకే ప్రభుత్వం బార్ కోడింగ్ విధానం మొదలుపెట్టింది.
***
సుమారు 17 సంవత్సరాల తర్వాత నేను తిరిగి అదే వూరికి ఇక మూడు సంవత్సరాలు మాత్రమె సర్వీసు ఉండగా ప్రదానోపాద్యాయునిగా బదిలీ అయ్యాను.

స్టాఫ్ అందరూ కుర్రవాళ్ళు...హుషారుగా వారి వారి బాధ్యత చక్కగా నిర్వర్తించేవారు దొరికారని మొదటి మూడు రోజుల్లోనే అర్ధమైంది నాకు.

నేను చేరిన నాల్గవ రోజున ఆ ముందు మూడు రోజులు సెలవు పెట్టిన ఆఫీస్ సబార్డినేట్ ‘నాగరాజు’ డ్యూటీ లో చేరడానికి వచ్చాడు. వస్తూనే ‘ సార్..మీరు ఈ పాఠశాలలో ఇదివరకు పని చేసారట కదా సర్...అందరూ మీగురించి చెప్పారు సర్...నాపేరు నాగ రాజు సర్.నా భార్యకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది సర్..నాకు ఇద్దరు మగ పిల్లలు సర్ .అయిదవతరగతి...ఏడవ తరగతి చదువుతున్నారు సర్. అందుకే సెలవు పెట్టాను సర్...మన్నించండి సర్.తమరు వచ్చేసరికి నేను డ్యూటీ లో లేను.’ అన్నాడు నమస్కరిస్తూ...
‘పర్వాలేదు లే..సంతకం పెట్టు.’ అన్నాను.

‘పెట్టలేను సర్...నేను గుడ్డివాడిని అని స్టాఫ్ ఎవరూ చెప్పలేదా సర్...’ అన్నాడు..

‘అటెండర్ ఏడి అంటే సెలవు పెట్టాడు..అన్నారే గాని ఏమీ ఎవరూ ఏమీ చెప్పలేదయ్యా..’అన్నాను.నేను స్ట్రిక్ట్ అని గమనించి అతని పని కూడా వాళ్ళే షేర్ చేసుకున్నారన్నమాట.

నాకు అనుమానం వచ్చింది..’నువ్ కాలేజ్లో ఎం పని చేయ్యగలవని పోస్ట్ ఇచ్చారయ్యా?’ అడిగాను

‘మీరు ఏ పని చెప్పినా చేస్తానయ్య...చెప్పి చూడండి...మరొక్క మాట సర్..నేను పుట్టుకతో గుడ్డివాడిని కాను సర్.

నా దురదృష్టం అంతే సర్. హాజరు పట్టీలు తరగతి గదులలో ఇచ్చి వస్తానయ్యా...’అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండా హాజరు పట్టీలు ఉన్న రాక్ దగ్గరకు వెళ్లి వాటిని తీసుకుని చేతులతో తడుముకుంటూ ఎంతో చాకచక్యం గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.ఆ తర్వాత అన్ని పనులలోను నాకు అతను తలలో నాలుకలా అయిపోయాడు.ఏ ఫైల్ తీసి ఇమ్మన్నా ఆ ఫైల్ పైన అక్షరాలను చేతితో స్పృశించి అదే ఫైల్ నాకు తీసి ఇచ్చేవాడు.ఏడవ తరగతి చదువుతున్న పెద్ద కొడుకు ఉదయమే తండ్రితో నా ఇంటికి వచ్చి కాలేజ్ తాళాలు తీసుకుని అతనిని కాలేజ్ దగ్గర దింపి వెళ్ళిపోయేవాడు.సాయంత్రం పాఠశాల పూర్తయ్యాక గేటు తాళాలు వేసి నాకు అందచేసి నేను కదిలిన తర్వాతనే...తండ్రిని తీసుకు వెళ్ళేవాడు.

ఒక ఆది వారం ఉదయమే మా ఇంటికి వచ్చాడు నాగరాజు. వస్తూనే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నేను తల్లడిల్లిపోయాను.’ ఏమైంది నాగరాజు...?’ అడిగాను. వసుంధర మా అమ్మయిగారింటికి వెళ్ళింది. అది నా అదృష్టం.

‘మా శ్రీమతి మూడు నెలల కన్నా ఇక బతకదంట సర్...ఒక పాతిక వేలు సర్దగలరా సర్...ప్రతీనెలా జీతం లో తీసేసుకోండి సర్...మళ్ళీ ఏదో పరీక్ష చెయ్యాలట సర్..ప్లీజ్ సర్...”నా కాళ్ళు పట్టుకోబోయాడు.

‘అలాగే...తప్పకుండా...నువ్వు ఏమీ అనుకోనంటే ఒక్క మాట అడగవచ్చా..’అన్నాను.
‘మీరేం అడుగుతారో నాకు తెలుసు సార్. నేను పుట్టు గుడ్డి వాడిని కాదు సర్.నేను ఈవూల్లోనే పుట్టి పెరిగాను సర్.పదవతరగతి వరకు బాగా చదువుకుని కాలేజ్ ఫస్ట్ వచ్చాను సర్. వేసవి సెలవులలో కంప్యూటర్ కోర్సు లో చేరాను సర్..ఒక నెల గడిచాక కుడి కన్నుసరిగా కనిపించడం మానేసింది సర్.డాక్టర్ దగ్గరకు వెళ్తే కంటి లో పువ్వేసిందని రోజూ హాస్పిటల్ కు వచ్చి మందు వేయించుకొమ్మని చెప్పారు సర్.ఆ మందు పవర్ కో ఏమో ఆ కన్ను చీము పట్టి...లోపలినుంచి ఎడమ కన్నుకు కూడా వ్యాపించింది సర్. ఈసారి రెండు కళ్ళల్లోను మందు వేసారు సర్. చీము తగ్గిపోయి విచిత్రంగా రెండు కళ్ళు పూర్తిగా కనిపించడం మానేశాయి సర్.

నా భవిష్యత్తు ఏమిటో నాకు అర్ధమైపోయింది సర్.ఒక ఏడాది చదవడం మానేసి...బ్లైండ్ సర్టిఫికేట్ సంపాదించుకుని బ్రెయిలీ కాలేజ్ లో చేరాను సర్..ఇంటర్, డిగ్రీ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను సర్...ఈలోగా మా మేనకోడలితో పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు పుట్టారు సర్...ఎందరెందరో కాళ్ళు పట్టుకుంటే చివరకు జడ్.పి. లో ఈ పోస్ట్ లో చేరాను సర్...కాని నా దురదృష్టమేమో...నా భార్యకు తగని రోగం పట్టుకుంది సర్... మిమ్మల్ని ఒక్క కోరరాని కోరిక కోరనా సర్..” అన్నాడు ఆర్ద్రతగా..

నాకు మనసు ద్రవించి పోగా...కళ్ళు చెమర్చాయి. ‘అడుగు రాజు’ అన్నాను గాద్గదికంగా...
‘నాకంటూ ఎవ్వరూ లేరు సర్.ఒకరిద్దరున్నా నాకే సాయం చెయ్యాల్సి వస్తుందో అని బంధుత్వం తెంచుకుని వెళ్ళిపోయారు సర్.ఒకవేళ నా భార్యకు గాని నాకు గాని ఏమైనా అయితే నా పిల్లలిద్దరిని డిగ్రీలవరకు ఉచితంగా చదువుచెప్పే ఆశ్రమం లో చేర్పించండి చాలు సర్.అదోక్కటే ఈ జీవితానికి మిగిలిన కోరిక సర్...” నాగరాజు దోసిలిలో ముఖం దాచుకుని బావురుమన్నాడు. నాకూ కన్నీళ్ళాగలేదు.

మౌనం గా కళ్ళు తుడుచుకుని రాజు రెండు భుజాలు అదిమి పట్టి అన్నాను. ‘ రాజూ..నీకేం కాదు రాజు...నీ బిడ్డలు చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తారు.అది నువ్ కళ్ళారా చూస్తావ్.నీకళ్ళు నేను బాగు చేయిస్తాను..నాదీ పూచీ ‘ అన్నాను.
నాగరాజు విరక్తిగా నవ్వాడు. “ లేదు సర్...వాడు చేసిన ట్రీట్మెంట్ కు కళ్ళల్లో సున్నితమైన నరాలన్నీ ఏనాడో చచ్సిపోయాయట సర్.ఇక నాకు కళ్ళు వచ్చే అవకాశం లేదు సర్...ఈ డబ్బున్న ఎదవలు ఎండుకు చదువుతారో తెలీదు...మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీయడానికి...వాడే డబ్బు పిశాచి డాక్టర్ అనుకుంటే , వాడి కొడుకును కూడా డాక్టర్ ని చేసి ఊరిమీదకు వదిలాడు సర్...వాళ్ళని అనుకుని ఏం లాభం సర్...మా ఖర్మలిలా కాలాకా...అనవసరంగా ఏదేదో చెప్పి మీ మనసు పాడు చేసాను సర్...నన్ను మన్నించండి సర్. ప్లీజ్..” ఈ సారి నాగరాజు నాకాళ్ళ మీద వాలిపోయాడు.
“అయాం వెరీ వెరీ సారీ నాగరాజు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా కాపాడుతాడు.నీకు నేను తోడుంటాను.నీ పిల్లలకు బాసటగా ఉంటానని మాట ఇస్తున్నాను.ఉండు . డబ్బు తెస్తాను..” అని నాగరాజును పైకి లేపి కుర్చీలో కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చాను. అతను అడిగిన పాతిక వేలు ఇచ్చాను.

‘ మీవంటి మంచి ఉపాధ్యాయులు ఇప్పటికీ ఉన్నారు కాబట్టే మంచి విద్యార్ధులు తయారవుతున్నారు.అది వారి అదృష్టం.ఇది నా దురదృష్టం సర్.” అన్నాడు డబ్బు జాగ్రత్తగా చేతి సంచీలో పెట్టుకుంటూ..
“ అల అనుకొవద్దన్నానా...అది సరే గాని నిన్ను ఈ దుర్దశ కు తీసుకు వచ్చిన ఆ డాక్టర్ గారి పేరు?”
వెళ్ళబోతున్న నాగారాజుని అడిగాను.

“ ఉన్నాడులెండి..డాక్టర్ సాగర్ అని...అక్షరం ముక్కరాని నిష్ఠ దరిద్రుడు. ఆడు డాక్టర్ ఏంటి బాబు. వీడు పరీక్షకి కూచుంటాడు...ఆడి బాబు డబ్బిచ్చి పాస్ చేయిస్తాడు..ఎవడి ఉసురో పోసుకుని ఎప్పుడో పోతాడు.’నాగరాజు శపిస్తూ వెళ్లి పోయాడు.
అవాక్కయ్యాను.’

"ఎంతపని జరిగిందయ్యా...నీ వ్యధకు నేనూ కారకుడినే..రాజూ..” అంతు లేని బాధతో పశ్చాత్తాప పడుతూ కళ్ళుమూసుకున్నాను.

సమాప్తం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
తిలాపాపం...! - by k3vv3 - 27-04-2023, 01:55 PM
RE: తిలాపాపం...! - by sri7869 - 20-08-2023, 09:16 PM



Users browsing this thread: 1 Guest(s)