Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ చెప్పిన కథ
#12
చాలా సమయం తరువాత మెల్లిగా, బరువుగా శివలీల కళ్ళు తెరుస్తుంటే ఆతృతగా తననే చూస్తున్న ఇద్దరు దంపతులు,ఇంచుమించు ఒకే పొలికల్తో వున్న వేరువేరు శరీర ఛాయలలో వున్న ఏడుగురు పురుషులు కనిపిస్తారు.
 
తను ఎక్కడ ఉందొ తెలియక గదికి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ "నేను ఎక్కడ వున్నాను?మీరంతా ఎవరూ?" అని తల పట్టుకొని అడుగుతుంది శివలీల.
 
"ఈమె నా అర్ధాంగి నాగరాణి, వీళ్లు నా కొడుకులు పెద్దవాడు తెల్ల నాగు అబోయి పాల సముద్రుడు అని చెప్పి మిగత ఐదుగురిని పరిచయం చేసి ...చివరన ఉన్నది నల్లన్నా అయిన కాలశేషుడు" అని అందరిని పరిచయం చేసి నేను శేషాద్రి" అని పరిచయం చేసుకొని "ఒక సంఘటన వల్ల నువ్వు మా గృహంలో వున్నావు" అని "నువ్వెలా ఆ మూటలోకి వచ్చావు పుత్రి?"అని అడిగేసరికి "ఏడుస్తూ జరిగింది చెప్తుంది శివలీల" అంత విన్నాక శేషాద్రి కోపంతో ముక్కుపుటలు ఎగరేస్తుంటే నాగరాణి అతన్ని శాంతిప జేసీ "ఎడవకమ్మ నీకు మేము వున్నాం"అని "మమ్మల్నే నీ తల్లిదండ్రులు అనుకో ఇదిగో వీళ్లే నీ అన్నదమ్ములు ఇప్పటినుండి" అని అందరిని చూపించి "ఇతనితో జాగ్రత్త , అస్సలు కోపం తెప్పించకూ డదు తనకి. అందరి కన్నా చిన్నవాడు, నీకు చిన్నన్న, కోపం ఎక్కువ తనకి" అని మరి మరి చెప్పి "నీకు ఇల్లు చూపిస్తా రా"అని వాళ్ళు ఉన్న ఇంటిని మొత్తం తిప్పి తిప్పి చూపించింది.
 
శివలీల ఇంటిని చూస్తూ అన్ని గమనిస్తుంటే "ఇల్లు మొత్తం నాగుల ఆకారాలతో వాటి విగ్రహలతో ,ఒక దగ్గర పెద్ద లింగం,కింద జత నాగుల విగ్రహలు కూడా ఉన్నాయి,ఎక్కడ చూసిన ప్రతి దానిలో సర్పాకారం కనిపిస్తుంది శివలీలకి.
 
రాజకోటలో రాజుగారు, రాణిగారు చూపించిన ప్రేమ కంటే వీళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తుండడంతో శివలీలకి సొంత వాళ్లే ప్రాణాలు తీయాలని చూస్తుంటే బాధ, పరాయివాళ్ళు ప్రాణంగా ప్రేమిస్తున్నారని సంతోషం, వీళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్న భర్త గుర్తుకువస్తుండడంతో ఎప్పుడూ ముభావంగా ఉండేది,నాగరాణి ఎన్నిసార్లు కారణం అడిగిన చెప్పకపోయేది.
 
ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత యుద్ధం సజావుగా ముగిసి వారు ఇచ్చిన అతిధ్యాన్ని స్వీకరించి అక్కడ నుండి వచ్చేసరికి విజయరుద్రకి మాసం రోజులు పట్టింది. అక్కడి నుండి తిరిగి వచ్చిన విజయరుద్ర శివలీల కోసం నేరుగా శివలీల పుట్టింటికీ వెళ్తాడు. యువరాజు వస్తున్నట్టు సమాచారం అందగానే శివలీల బట్టలు, నగలు, మంగళసూత్రం అన్ని మందరకి వేసి మందరని శివలీలలా అలంకరించి దేవుడి గదిలో కూర్చోబెడుతుంది.
 
యువరాజు రాగానే అతనికి సత్కారాలు చేసి కుశలప్రశ్నలుఅడుగుతుంటే "శివలీల ఎక్కడ వచ్చినప్పటి తను బయటికి రాలేదు" అని యువరాజు అడిగితే "శివలీల ఇప్పుడు పూజలో ఉంది" అని భానుమతి చెప్పగానే "పూజనా?" అని అంటాడు"."అవును యువరాజ, తను ఇరవై ఒక్క దినముల వ్రతం నోచుకుంది, అది పూర్తి అవ్వనిదే మీరు తనని చూడడానికి వీలులేదు తను చేసే వ్రతం కనుక భగ్నం అయితే మీరు తనని ఎప్పటికి నేరుగా చూడకూడదు" అని చెప్తుంది. భానుమతి చెప్పినదానిలో నిజం లేదని "శివలీల ని చూడకుండా ఉండటమ?"అని అడుగుతాడు. దానికి భానుమతి "మేలిముసుగుతో చూడవచ్చు" అని తన ఉపాయాన్ని చెప్తుంది. విజయరుద్రకి అనుమానం వచ్చిన వేచిచూడాలి అనుకోని "కొన్ని రోజులు ఇక్కడే వుంటాను" అని అక్కడే వుంటాడు. మరుసటి రోజు ఉదయము మాటలు వినిపించి లేచి చూసేసరికి భానుమతి, మందర చాటుగా మాట్లాడుకోవడం వినిపించి శివలీల కోసం ఇల్లంతా చూస్తాడు,కానీ ఎక్కడ కూడా మూడో ఆడ మనిషి ఉనికి తెలియకపోడాంతో శివలీల అక్కడ లేదని అర్ధం అవుతుంది.
 
ఉదయ అల్పాహారం కూడ భానుమతి నే చూసుకోడంతో "శివలీలతో పాటు మందర కూడా వ్రతం నోచుకుందా? ఎక్కడ కనిపించటం లేదు" అని అడుగుతాడు. మందర ప్రస్తావన ఊహించని భానుమతి కొంచెము భయపడుతూ" ఆమె ..ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది"అని అబద్ధం చెప్తుంది. భానుమతి తడబడుతు చెప్పేసరికి తన అనుమానం నిజమేనని అయితే శివలీలని పిలవండి అంటాడు. ఆమె ఏదో చెప్పేలోపు గట్టిగా శివలీల బయటికిరా అంటాడు. శివలీల ముసుగులో ఉన్న మందర మేలిముసుగు ధరించి ఏమి మాట్లాడకుండా మెల్లిగా వచ్చి వాళ్ళ ముందు నిలబడుతుంది.
 
"ఎందుకు కుంటుతూ నడుస్తున్నావ్?" అని యువరాజు అడిగితే "కాలు బెణికింది అందుకే అమ్మాయి అలా నడుస్తుంది" అని మందర తరపున భానుమతి సమాధానము చెప్తుంది. శివలీల ఆభరణాలని,బట్టలని ధరించి మేలిముసుగులో వున్న ఆమెని చూడగానే అర్ధం అయింది ఆమె శివలీల కాదని. విజయరుద్ర ఆమెని పరీక్షగా చూసి దగ్గరికి వెళ్లి "శివలీల ని ఏం చేసావ్?" అని గొంతు పట్టుకొని అడుగుతాడు. మందరకి ఊపిరి ఆడక "అమ్మ..అమ్మ" అని పిలుస్తుంటే భానుమతి భయంగా "నా కూతురిని వదిలేయండి యువరాజ! మీకు అంతా చెప్తాను" అని ఏదో చెప్పబోతుంటే "నాకు నిజం మాత్రమే కావాలి!!" అని గద్ధిస్తాడు.
 
యువరాజు చేతిలో మందర ప్రాణాల్ని చూసి తల్లికూతుర్లు కలిసి చేసిన పని మొత్తం వివరిస్తుంది. అంత విన్న యువరాజు వీళ్లని అసహ్యించుకొని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయి శివలీల గురించి వెతకటం మొదలుపెడతాడు. వేగులని , గూఢచారులని పంపించి వెతికించినా కుడా ఆమె జాడ దొరకకపోడంతో రాజదంపతులు ఆమె మరణించి ఉండవచ్చనే సందేహాన్ని వెలిబుచ్చుతారు. అది విన్న యువరాజు తీవ్రమనస్తాపం చెంది రాజకోట నుండి వెళ్ళిపోతాడు, ఎన్ని చోట్లని వెతికిన ఆమె ఆచూకీ లభించక అలసిపోయి ఒక చెట్టుకింద పడుకుంటాడు.
 
అతనికి పూర్వం స్వప్నం వచ్చిన్నట్టు మళ్ళీ నిద్రలో శివలీల మోహం కనిపిస్తుంది, ఒక వైపు సంతోషంగా కనిపిస్తు మరోవైపు బాధపడుతున్నాట్టుగా ఉంది. నిద్రలో నుండి లేచి ఏదో స్ఫురించినట్టు గురాన్ని తీసుకొని మారువేషంలో రాజ్యం మొత్తం తిరుగుతాడు. ఒక రోజు బట్టలు అమ్మేవాడిగా వెళ్తే , మరొక రోజు పట్టుకుచ్చులు అమ్మేవాడిలాగా వెళ్ళేవాడు ఇలా ఎదో ఒకటి అమ్ముతున్నట్టు రాజ్యం లో ఉన్న అన్ని ప్రదేశాలు తిరుగుతుంటే అతనికి ఒక చోటు విచిత్రంగా కనిపిస్తుంది.
 
అతను అంతకు ముందు రోజు అక్కడికి వెళ్లినప్పుడు బావి కనిపిస్తే ఇప్పుడు అది ఒక ఇల్లులా కనిపిస్తుంది. అదే అతనికి విచిత్రాన్ని కలిగించింది. తరువాతి రోజు వెళ్లి చూడగా ఇల్లు లాగానే కనిపిస్తుంది, ఈ ఇంటికి వెళ్ళలేదు అని ఆ ఇంటి ముందుకి వెళ్లి "గాజులమ్మ,గాజులు...రంగు రంగుల మట్టి గాజులు"అని గట్టి గట్టిగా గాజులు అమ్మేవారిలా అరుస్తాడు.
 
బయటి నుండి వినిపిస్తున్నా గాజుల వాడి అరుపులు విని ఇంట్లో ఉన్న శివలీల "నాన్న...నాకు మట్టి గాజులు కావాలి" అని శేషాద్రిని అడుగుతుంది." ఎందుకు అమ్మ !!" అని అడిగితే "నాకు మట్టి గాజులాంటే చాలా ఇష్టం" అని చెప్పి తన భర్తతో గడిపిన సమయములో తనకి మట్టి గాజులంటే ఇష్టమని తెలుసుకొని ఆమె కోసం ప్రత్యేకంగా తెచ్చి అతనే ఆమె చేతులకు తొడిగింది గుర్తుకొచ్చి కన్నీళ్లు కారుస్తుంది. అది చూసిన శేషాద్రి "ఏడవకమ్మ గాజులే కదా " అని "రాణి....మనమ్మాయికి గాజులు తీసుకోవాలి, వెళ్లి ఆ గాజులత్తాన్ని పిలిచి అమ్మాయికి గాజులు వేయించు" అనగానే "అమ్మయి కోసం జున్ను చేస్తున్నాను, క్షణంలో వచ్చేస్తాను" అని లోపలి నుండే చెప్తుంది.
 
"పర్వాలేదు నాన్న ....నేను పిలుస్తానులే" అని గుమ్మం లోపలి నుండే "ఓ గాజులయన ఇటురా" అని చప్పట్లు కొట్టి పిలుస్తుంది. గాజులు అమ్మేవాడి వేషంలో ఉన్న యువరాజుకి ఆమె పిలుపు విని "ఈ స్వరం నాకు బాగా చిరపరిచీతం అయిన స్వరం" అని ముందుకు వెళ్తాడు. అతను వచ్చి "ఇక్కడ గాజులకోసం పిలిచారు ఎవరూ లేరే !!"అని అంటే "నేను తెరచాటు వెనకనే వున్నాను, మీరు అక్కడ నుండే గాజులు వేయండి" అని గుమ్మంకి అనుకోని కూర్చుంటుంది.
 
"సరే...మీ ఇష్టప్రకారమే వేస్తాను" అని చేయి ఇవ్వమంటాడు విజయరుద్ర. ఆమె తన చేతిని బయట పెట్టగానే ఆమె చేయిని చూసి గబుక్కున తన చేతిలోకి తీసుకొని ఒక క్షణం ఆగి ఆమెని అతను ముందుకు లాగుతాడు.ఆ హఠాత్పరినామనికి కంగారుగా ఆమె
"అమ్మ...."అని అరుస్తుంది. ఆమె పిలుపు వినిపించగనే నాగరాణి, శేషాద్రి ఆరుగురు అన్నదమ్ములు ఆమె ముందు వాలుతారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆమె అతన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది.ఆ దృశ్యం చూడగనే కోపోద్రుక్తుడైనా శేషాద్రి సర్పముల మారి అతని పైకి వెళ్తుంటే "నాన్నగారు ఆగండి...ఇతను నా భర్త"అని శేషాద్రిని శాంతిపజేస్తుంది.
 
మనిషిల ఉన్న అతను ఒక్కసారిగా పెద్ద సర్పమయి తనపైకి బుసలుకొడుతూ రావటం, అంత పెద్ద సర్పాన్ని చూస్తూ నాన్న అని పిలవటం ఆశ్చర్యంగా ఉన్న, సర్పాన్ని చూసేసరికి భయం వేసింది విజయరుద్ర కి, అతని పరిస్థితిని అంచనా వేసిన శివలీల తన సవతితల్లి, చెల్లి తనకి చేసిన ద్రోహంతో పాటు దేవుడి దయవల్ల పొందిన అమ్మ,నాన్న అని నాగరాణి,శేషాద్రిని చూపించి అన్నలని అక్కడున్న ఆరుగురు నాగులని పరిచయం చేస్తుంది.
 
అది సరే వీళ్ళు సర్పాలని నికెప్పుడు తెలిసింది అని యువరాజు ఆమె వెనకాలే ఆమె గదిలోకి వెళుతు అడిగాడు. శివలీల నవ్వి "ఒకరోజు ఏమి తోచక గదిలోనే అటు ఇటూ పచార్లు వేస్తుంటే నాన్నగారు తన నిజరూపంలో బయటికి వెళ్లడం చూసాను, నాన్న వెనకాలే మా అన్నలు కూడా సర్పల్లాగా మారి నాన్న తో పాటె వెళ్ళిపోయారు,అప్పుడు తెలిసింది నన్నూ కాపాడి , సొంత కూతురిలా చూసుకుంటున్నది సామాన్యమైన మానవ కుటుంభం కాదు ఒక పవిత్రమైన శేషకుటుంభం అని" అతనికి వివరిస్తుంది.
 
"మరి నీకు భయం వేయలేద" అని అడిగితే మనిషిరూపంలో ఉండి విషాన్ని చిమ్మే , విషసమానం అయిన కుటుంభం నుండి వచ్చిన నాకు ,ప్రేమ బంధాలు మాత్రమే చూపించే వీళ్ళని చూస్తే భయం వేయలేదు" అని సమాధానము ఇస్తుంది.
 
శివలీలతో పాటు శివలీల భర్త అయిన విజయరుద్రని కూడా ప్రేమతో అల్లుడు అనే గౌరవంతో చూసుకుంటారు. ఇలా చివరికి శుభం జరిగి అందరూ సంతోషంగా ఉండగా ఒక రోజు విజయరుద్ర శేషాద్రి, నాగరాణి తో "శివలీల,నేను సురక్షితంగా వున్నాము అని, త్వరలో వస్తాము అని రాజ కోటలో ఉన్న మా తల్లిదండ్రులు కు వర్తమానం పంపించాను" అని వారితో చెప్పగానే సంతోషం వాళ్ళ మొహాలలో కనపడిన ఆ వెంటనే బాధ కూడా కనిపించింది యువరాజుకి.
 
"ఇంత తొందరగా వెళ్ళవలసిన అవసరం ఏముంది అల్లుడుగారు" అని శేషాద్రి భారంగా అంటాడు."మా తండ్రిగారి వయస్సు మళ్ళుతున్నది, నేను రాజుగా బాధ్యతలు తీసుకోవలసి ఉంది, ఇది అసలు ముందుగానే నిర్ణయించబడిన నా దేశాటన, శివలీలతో వివాహము, పిదప యుద్ధ సహాయము, ఆ తరువాత శివలీల అదృశ్యం ....ఇక జరిగింది అంత మీకు కూడా అనుభవమే" అని ముగించాడు యువరాజు.
 
శేషాద్రి కూడా యువరాజు చెప్పింది సబబుగా అనిపించినా కూతురిని పంపించాలంటే మనసు భారంగా మారింది. నాగ రాణినే శేషాద్రి కి నచ్చచెప్పి వాళ్ళు వెళ్ళడానికి అనుమతి ఇస్తుంది.
 
చూస్తుండగానే వాళ్ళు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. వారి ఇంటి ముందు ఏడు బండ్లు నిలిపి ఉన్నాయి,వాటిలో వజ్ర వైడూర్యలు,ముత్యాలు,కెంపులు,బంగారము,ఏడూవారాల నగలు,.....ఇలా చాలా సంపదని ఆ ఏడూ బండ్లలో నింపి ఒక్కో బండిని ఒక్కో సోదరుడి బహుమతిగా తమ చెల్లెలికి పుట్టింటి వారి సారె అని రాజకోటకి పంపడానికి సిద్ధంగా ఉంచారు.
శివలీల వారిని విడిచి వేళ్ళలేక ఏడుస్తూ తన ఏడుగురి అన్నల గడపలకి పసుపు రాస్తూ చివరి గడప అయిన చిన్న అన్న అయిన నల్లన్నా గది గుమ్మానికి పసుపు పెడుతు " అమ్మ ...చిన్నన్న కి చెప్పండి నేను అత్తవారింటికి వెళ్లినట్టు, అలాగే చెప్పకుండా వెళ్తున్నందుకు క్షమించమని అడిగానని చెప్పండి" అని నాగరాణి ని పట్టుకొని ఏడుస్తుంది.
 
నాగరాణి శేషాద్రిని చూడగా "రాణి మనము, చిన్నవాడికి అర్ధముఅయ్యేలా నచ్చచెపుతాము, జామాత మాటని తిరస్కరించిన మన పుత్రికకే బాధ. ఆమె ఇప్పటికే గర్భవతి , భర్తకి దూరమయి చాలా బాధలు పడింది. ఇప్పుడు మనము జమాతతో పాటూ మన కూతురిని కూడా కోటకి పంపిచాలి" అని శేషాద్రి తమ చివరి పుత్రుడు అయిన నల్లనాగు గురించి భయపడుతూన్నా నాగరాణికి చెప్పి యువరాజుని శివలీల ని సాగనంపుతాడు.
 
అక్కడి నుండి వెళ్లినా కొద్దీ కాలానికే శివలీలకి పండంటి మగ పిల్లాడు పుడతాడు,శివలీల కష్టాలు తిరిపోయి ఇప్పుడూ తన భర్త, కుమారుడితో సంతోషంగా ఉంది"
 
"అమ్మో.....చాలా పెద్ద కథ మమ్మీ" కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది ఆశీ.
 
"అప్పుడే అయిపోలేదు అమ్మడు"అని ఆశీని తన ఒళ్ళోకి తీసుకుంటుంది మానస.
 
"ఇంకా ఉందా..!! కంప్లీట్ చెయ్ మమ్మీ" అని మానస మెడ మీద చేతులు వేస్తూ అంది.
 
"చెప్తాలే గాని,నీకు నిద్రరావటం లేదా?" అని ఆశీని అడిగితే "రావటం లేదు మమ్మీ..నువ్ స్టోరీ కంటిన్యూ చెయ్ మమ్మీ"అని మళ్ళీ అడుగుతుంది.
 
"సరే...." అని " హ..ఎక్కడి వరకి వచ్చాము "అని అడగ్గానే "అంటీ అంకల్, బేబీతో హ్యాపీగా వున్నారు" అని ఆశీ చెప్తే "హ..మై బేబీ ఇస్ టూ షార్ప్" అని మానస అంటే "అందుకే ఎనిమిదేళ్ళకె థర్డ్ క్లాస్ లో ఉంది" అని కనిష్క్ అనేసారికి "నో డాడీ ఐ ఆమ్ ఎయిట్ అండ్ హాఫ్ " అని ఎనిమిది వెళ్లు చూపిస్తూ ఒక వేలుని సగం మడిచింది. "ఇది బంగారం...." అని ఆశీ ని ముద్దుపెట్టుకొని మళ్ళీ కొనసాగిస్తుంది మానస.
 
"బాబు పుట్టిన ఇరవైఒక్కరోజున నామకరణం చేయాలని రాజా దంపతులు అందరికి ఆహ్వానం పంపిస్తారు,యువరాజు నాగ దంపతుల గురించి ముందే చెప్పి ఉండటం వలన వాళ్ళకి కూడా ఆహ్వానంపంపిస్తారు. చెల్లి కోసము తపస్సుకని వెళ్లిన ఆఖరి నాగైన నల్లనాగు ఇంటికి వచ్చి చూసేసరికి శివలీల ఎక్కడ కనిపించకపొగ తల్లిదండ్రులని అడుగుతాడు. శేషాద్రి నల్లనాగుని కూర్చోబెట్టుకొని శివలీల భర్త అయిన యువరాజు విజయరుద్రరావటం వాళ్ళతో కలిసి కొన్ని రోజులు ఉండటం, తమ అనుమతితో శివలీలని రాజాకోటకి తీసుకువెళ్ళటం చెప్పి, ఆమె తన భర్తతో ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు నల్లనాగు కోసం పడ్డ మనోవేదనని కూడా చెప్తారు,అయిన ఇవేవి పట్టించుకోకుండా కేవలం తను రాకముందే తన కోసం ఆగకుండా ,చెప్పకుండా వెళ్లిపోయిందని క్రోధంతో బుసలు కొడుతూ సర్పంల మారి రాజకోటకి బయలుదేరుతాడు నల్ల నాగు".
 
ఇరవైఒక్క రోజున బాబుని బంగారు ఊయలలో వేసి నామకరణనికి వేచివుంటారు. ఎంతకీ శివలీల బాబు దగ్గరికి రాకుండా బయటి వైపే చూస్తుండాడంతో ఏమైందని శివలీలని విజయారుద్ర అడిగితే "నేను వచ్చేటప్పుడు చిన్నన్న కి చెప్పకుండానే వచ్చాను, ఇప్పుడు అన్నయ్య లేకుండా బాబు నామకరణానికి మనసు ఒప్పటం లేదు"అని బాధపడుతుంది. శివలీల బాధ చూడలేక "మీ అన్నయ్యతో నేనే బలవంతంగా తీసుకువచ్చాను అని మాట్లాడతాను నువ్వు బాధపడకుండా రా" అని అంటే "లేదు మా అన్నయ్యకి కోపం ఎక్కువైనా నా కోసం మన బాబు కోసం తప్పకుండా వస్తాడు" అని అలాగే ఎదురుచూస్తుంది.
 
శివలీల, విజయరుద్రల మాటలను అక్కడే ఉన్న ఉయ్యాలా పై భాగంలో అల్లుకొని సమయం దొరికినప్పుడు బాబుని కాటు వేయడానికని ఉన్న నల్ల నాగు ముద్దు గా బోసి నవ్వులు నవ్వుతున్న బాబుని చూడగానే అంత మర్చిపోయి బాబుని చూస్తూ వాళ్ళ మాటలు వింటాడు. వారి మాటలు విన్నాక తను ఎంత మూర్ఖంగా ఆలోచించాడో అని పశ్చత్తాపం చెంది శివలీల విజయరుద్రల ముద్దుల బాబుని ఆశీర్వదించాడనికని మెల్లిగా కిందకి దిగి ఉయ్యాల నలువైపులా చుట్టుకొని బాబుని చూస్తూ ఉంటాడు.
 
అప్పుడే అటు వైపుగా వచ్చిన పరిచారికలు నల్లగా చుట్ట చుట్టూకొని బాబు పైనా ఉన్న నల్ల నాగుని చూసి భయంతో కేకలు పెడుతు పరుగులు తీస్తారు,కేకలని విన్న శివలీల , విజయారుద్ర, రాజ దంపతులు అక్కడికి వచ్చి చూడగా ఉయ్యాలలో ఉన్న బాబు నవ్వుతూ నల్ల నాగుని చూస్తూ ఉంటాడు, అది చూసిన రాజదంపతులు సర్పం, సర్పం అని అరిస్తే శివలీల "రాజమాత అతను మా చిన్న అన్నయ్య , భయం లేదు"అని బాబు దగ్గరికి వెళ్లి "నా మీద కోపం లేదా అన్నయ్య !!"అని అడిగితే
"చెల్లెలి మీద కోపం అరక్షణము, అయిన చెల్లెలి మీద కోపం తెచ్చుకునేవాళ్లు మూర్ఖులు,పాపాత్ములు" అంటూ మనిషిగా మారి ఆమెని దగ్గరికి తీసుకుంటాడు.
 
విజయరుద్ర ఉయ్యాలలో ఉన్న బాబుని ఎత్తుకొని "మీ మేనల్లుడు" అని నల్ల నాగుకి ఇస్తాడు. అతను బాబుని ముద్దుచేస్తూ "మీ అమ్మ కోసమని తపస్సుకు వెళ్లి వచ్చేసరికి నువ్వూ పుట్టావు" అని కళ్ళు మూసుకొని అతని చేతిని చాపగానే ఒక తంత్రం లాంటి తాయత్తు అతని చేతిలో ప్రత్యక్షమవుతుంది, అది తీసుకొని బాబుకి కట్టి "అజేయుడివై చిరకాలం కీర్తి ప్రతిష్టలతో రాజ్యన్ని పరిపాలించు" అని ఆశీర్వదించి ఇక అక్కడ ఉండటం సరికాదని శివలీల విజయరుద్రలకి చెప్పి వెళ్లిపోతాడు.
 
అదే రోజు యువరాజు అయిన విజయారుద్ర కి మహారాజుగా పట్టాభిషేకం జరిపించి మహారాజుని చేస్తారు. నామకరణం, పట్టాభిషేకం సందర్భంగా రాజ్యంలో ఉన్న అందరికి ఆ రోజు నాణేలని, బహుమానాలని, అన్నప్రసాదాలను వచ్చిన వారికి కాదనకుండా పంచి పెడతారు. అలా ఆ రోజు రాజ్యంలో అందరూ ఆనందంగా, సంతోషంగా వుంటే "ఆకలిగా ఉంది,కొంచెం అన్నం పెట్టండి" అని నడివయస్సు ఉన్న ఒక స్త్రీ చిరిగి దుమ్ముకొట్టుకుపోయిన దుస్తులతో తన కూతురిని చూపిస్తూ అడుక్కుంటుంటే,వాళ్ళకి దూరంగా ఒక మధ్యవయస్సు ఉన్న పురుషుడు కూడా అన్నప్రసాదాల వైపు దీనంగా చూస్తూవున్నాడు.
 
వీళ్లని చూసిన రాజదాసులు వెళ్లిపోమంటూ నెట్టుతుంటే గోడవేంట కోటమీద నుండి చూసిన శివలీలకి తన తండ్రి , పినతల్లి, చెల్లి కనబడతారు. తనకి ద్రోహం, అన్యాయం చేసిన వాళ్లు తన వాళ్ళెనని భావించి వాళ్ళని లోపలికి పంపించామని దాసీకి చెప్పి పంపిస్తుంది. వాళ్ళు భయ భయంగా లోపలకి వస్తుంటే కిందకి వచ్చిన శివలీల "ఎలా వున్నారు నాన్నగారు?"అని అడిగితే ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకోవడానికి కిందకి వంగుతుంటే "వీళ్ళకి అన్నపానీయాలు, కొంత ధనం ఇచ్చి దూరంగా పంపివేయండి" అని కోపంగా అంటాడు మహారాజు అయినా శివలీల భర్త.
 
"స్వామి వారు నా కుటుంబ సభ్యులు,వాళ్ళని దూరంగా ఎలా పంపిస్తారు?" అని వాళ్ళని చూపిస్తూ శివలీల అడిగితే "దుష్టులు దూరంగా ఉండటమే అందరికి మంచిది"అని గంభీరంగా అంటాడు. భర్త ఎంత చెప్పినను వినక పోవడంతో ఏమి చేసేది లేక వాళ్ళకి ధనం, ఆహార పానీయాలు సమకూర్చి బాధతో వెనుదిరుగుతుంది.
 
శివలీల తండ్రి శివలీలని చూస్తూ "నన్నూ క్షమించు అమ్మ, నేను చేసిన తప్పే నన్ను ఇలా ఈ పరిస్థితికి తెచ్చింది"అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు అతనితో పాటు భానుమతి, మందర కూడా తల దించుకొని వెళ్ళిపోతారు.

సశేషం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అమ్మ చెప్పిన కథ - by k3vv3 - 26-02-2023, 12:45 PM



Users browsing this thread: