Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ చెప్పిన కథ
#1
అమ్మ చెప్పిన కథ
-    
"తాతయ్యా... తాతయ్యా... ఒక కథ చెప్పండి" అప్పుడే రాత్రి భోజనం కానిచ్చేసి బయట రెస్టింగ్ చైర్లో కూర్చున్నా తాతయ్యతో అంది ఎనిమిదేళ్ల ఆస్తిక.
 
"కథ చెప్పాలా ఆశీ...!"
 
"అవును తాతయ్యా..... మీరు మమ్మీ చిన్నప్పుడు చాలా కథలు చెప్పారంటగా ఇప్పుడు నాకు చెప్పండి" అతని పక్కనే కూర్చుంటూ అంది.
 
"హ్మ్..... సరే కథలే కదా కావాలి, మీ అమ్మను చెప్పమను చాలా బాగా చెప్తుంది" భుక్తాయాసం తీర్చుకుంటు చెప్పాడు.
 
"మమ్మీ......మమ్మీ...." అంటూ కిచెన్ లో గిన్నెలు కడుగుతున్న మానసని పిలిచింది.
 
"ఏమిటి....?"
 
"మమ్మీ... తాతయ్యా మీరు చిన్నగా వున్నప్పుడు చాలా కథలు చెప్పేవారంట కదా, ఇప్పుడు నువ్ వాటిలో నుండి ఒక కథ చెప్పాలి"
 
"కథలు చెప్పాలా!!!...సరే చెప్తాను, ఫస్ట్ నువ్వెళ్లి ఇన్కంప్లీట్ గా వున్న నీ హోమ్ వర్క్ చెయ్, అప్పటి వరకు కిచెన్ క్లీన్ చేసి వస్తాను,సరేనా" కడుగుతూనే చెప్పింది మానస.
 
"హ్మ్... ఒకే మమ్మీ,హోమ్ వర్క్ కంప్లీట్ చేస్తాను ,కానీ నువ్ కథ నిజంగా చెప్పాలి" మోహం సీరియస్ గా పెట్టి వేలు చూపిస్తూ చెప్పింది ఆశీ.
 
"ఒకే గుడ్ గర్ల్ ..." అని ఆశీ కి సబ్బు నురగ ముక్కు పై అంటించింది.
 
"మమ్మీ......" అంటూ ముక్కు తుడుచుకొని వెళ్లిపోయింది ఆశీ.
 
"ఎంటోయ్... మాకు చెప్పవ కథలు " అంటూ కిచెన్ లోకి వచ్చాడు కనిష్క్.
 
"చెప్తా... ఎందుకు చెప్పను, మీరు కూడా ఆశీల మీ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయండి అప్పుడు చెప్తాను" అంది.
 
"నేను ఆఫీస్ వర్క్ ఆఫిస్ లోనే చేస్తాను.....ఇంటి వర్క్ ఇంట్లోనే చేస్తాను,ఏది పెండింగ్ పెట్టుకొను" అంటూ మానస కడిగిన గిన్నెలని వాటి ప్లేస్ లో సర్దుతూ అన్నాడు.
 
"వెరీ గుడ్.... మీరు కూడా ఆశీ తో బయట కూర్చోండి మీకు కూడా చెప్తాను" చేతులు శుభ్రం చేసుకుంటూ చెప్పింది.
 
"ఉహు... నాకు అలా బయట కూర్చొని చెప్పుకొని కథలు వద్దు, మనం నువ్వు నేను మాత్రమే లోపల చెప్పుకొనే కబుర్లు" అంటూ ఆమెని వెనక నుండి హత్తుకొని ఆమెతో పాటు అతని చేతులు నీళ్లలో తడిపాడు.
 
"మీకు.. కొంచెం కూడా సిగ్గు,బుద్ధి లేదు ఇంట్లో కూతురు బయట మామయ్య గారు వున్నారు, కొంచెం అదుపులో వుండండి" అంటూ అతనిని విడిపించుకొని పాలని గిన్నెలో పోసి స్టవ్ పై పెట్టింది.
 
"ఇందులో సిగ్గు ఎందుకు... హ బుద్ధి మాత్రం ఉండాలి" అంటూ పసుపు ,శొంఠి ,మిరియాల పొడులను గ్లాస్ లో వేసాడు.
 
"ఇంకాస్త వేయండి ఆశీ కి ఇంకా జలుబు, దగ్గు తగ్గలేదు" అన్న మానసతో "ఆశీ....ఇంకా చిన్నపిల్లే తగ్గలేదని మనం ఎక్కవ వేయకూడదు. నిదానంగా తగ్గినా పర్వాలేదు,ఇది సరిపోతుంది" అన్నాడు.
 
"అలా అయితే ఎలా,ఆశీ కి వచ్చే వారంలో ఎక్సమ్స్ ఉన్నాయి. తగ్గక పోతే ఎక్సమ్స్ ఎలా రాస్తుంది.!!"
 
"హలో టీచరమ్మ..... మన పాపా చదివేది థర్డ్ క్లాస్ దానికి నువ్వు అదేదో ఎమ్ బి బి ఏస్, ఐ ఏ ఎస్ , డిఫెన్స్ కి రాసే కాంపిటెటివ్ ఎక్సమ్స్ లా పెద్ద అది చేస్తున్నావ్. ఇప్పటి నుండే వాళ్ళకి ప్రెషర్ ఇవ్వకూడదు" అని ఆమె తల మీద చిన్నగా కొట్టాడు.
 
"అబ్బా...." అంటూ తల రుద్దుకొని చిరు కోపంగా చూసింది.
 
"నన్నూ మన రూమ్ లో తీరిగ్గా చూద్దువు గాని ముందు బాబాయ్కి ఈ గ్లాస్ ఇచ్చేసి రా" అని పాలగ్లాస్ లో త్రిఫల చూర్ణం కలిపి ఇచ్చాడు.
 
"ఇవ్వండి...." అని తీసుకు వెళ్తుంటే "తొందరగా వచ్చేయ్.... నీతో పని ఉంది" అని మెల్లిగా అన్నాడు.
 
మానస వెనక్కి తిరిగి కోపంగా చూడడంతో "సరే.. సరే...ఎప్పుడైన రావచ్చు ..మీ ఇష్టం మేడం" అనగానే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
 
"డాడీ.....డాడీ... నా హోమ్ వర్క్ అయిపోయిందోచ్" అని కిచెన్ లో ఉన్న కనిష్క్ దగ్గరికి వెళ్ళింది ఆస్తిక.
 
"ఓహ్ థాట్స్ మై గర్ల్....సరే మరి ఇప్పుడేంటి!!" అని మోకాళ్ళ మీద వంగి ఆలోచిస్తున్నట్టుగా మోహం పెట్టాడు.
 
"ఇట్స్ స్టోరీ టైం...." అని కనిష్క్ చెవిలో గట్టిగా అరిచింది.
 
"ఆహ్..... మెల్లిగా తల్లి" అని చెవి రుద్దుకుంటు అన్నాడు.
 
"సొరి డాడీ " అన కనిష్క్ చెంప మీద ముద్దు పెట్టింది.
 
"నా డైమండ్ ఇది...." అంటూ ఆశీ తలపై ముద్దు పెట్టాడు.
 
"డాడీ... మమ్మీ ఎక్కడ, నాకు స్టోరీ చెప్పాలి" అనగానే "మమ్మీ తాతయ్యా దగ్గర ఉంది ....పద వెళ్దాం " అన్నాడు.
 
"ఆశీ ఇంకా పడుకోలేదా మను .."అని పాల గ్లాస్ అందుకున్నాడు కనిష్క్ వాళ్ళ బాబాయి.
 
"లేదు మామయ్య.... హోమ్ వర్క్ చేస్తుంది" అని చెప్తుండగానే కనిష్క్ ఆస్తిక ని ఎత్తుకొని వచ్చాడు.
 
"తాతయ్యా నా హోమ్ వర్క్ అయిపోయింది.... మమ్మీ కి చెప్పండి నాకు కథ చెప్పమని" అని కనిష్క్ పై నుండి దిగి తాతయ్యా దగ్గరికి వెళ్ళింది.
 
"తాతయ్య దగ్గర ఈ వీక్ పోయెమ్ చెప్పించుకున్నవా?" అని మానస ఆశీ ని అడగటం తో లేదన్నట్టు తల ఊపింది.
 
"ఫస్ట్ పోయెమ్ తరువాతే స్టోరీ" అంది మానస.
 
"ఒకే మమ్మీ " అనేసి "తాతయ్య పోయెమ్ చెప్పు, పోయమ్ వినేదాక నో స్టోరీ అంట" బుంగ మూతి పెట్టి అంది ఆశీ.
 
"పద్యమె కదా ,నేను చెప్తాను రా" అని పక్కన కూర్చో బెట్టుకొని సులువుగా ఉన్న పద్యం చెప్తాను విను అని చెప్పాడు.
 
"అన్ని దానములందు అన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనులు లేరు
ఎన్నగురుని కన్న నెక్కుడు లేడయా
విశ్వదాభిరామ! వినుర వేమ!!"
 
పద్యం చెప్పి ఆపగానే మీనింగ్ ఏంటి తాతయ్య అంది. దానికి బదులుగా "మనం చేసే దానాలలో అంటే డొనేషన్ లో అన్న దానం గొప్పది. ఆకలిగా వున్నవాడికి పెట్టె అన్నం చాలా విలువైనదని, మనల్ని తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన తల్లి కి ఎవరు సాటి రారు, ఈ ప్రపంచంలో ఆమె కన్నా గొప్ప వాళ్ళు లేరని, మనకి విద్య నేర్పిన గురువు కన్నా ఎక్కువ ఎవరు కారని ఈ పద్యభావం" అన్నాడు.
 
"అంటే నా బర్త్ డే మమ్మి చేస్తుంది కాబట్టి గ్రేట్, నాకు రీడింగ్, రైటింగ్, డిసిప్లిన్...చెప్తున్నందుకు మా కాలేజ్ టీచర్స్ గ్రేట్,ఆకలి గా ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం గ్రేట్ ఇవే కదా మీరు చెప్పింది తాతయ్య " అంటూ ఆలోచిస్తున్నాట్టుగా మోహం పెట్టింది.
 
"అంతే తల్లి!" అనగానే "మమ్మీ ఇప్పుడు స్టోరీ" అంది.
 
"సరే చెప్తాను, కానీ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు" వార్నింగ్ ఇస్తున్నట్టుగా అంది.
 
కనిష్క్ వైపు చూసెసరికి కనిష్క్ "సరే " అన్నట్టు తల ఉపడంతో "సరే మమ్మీ ....డౌట్స్ అడగను,పెద్ద .....కథ చెప్పండి" అంటూ రెండు చేతులూ మొత్తం చాచి చూపించింది.
 
"నా డైమండ్...." అంటూ ఆశీని ఒళ్ళో కూర్చో బెట్టుకున్నాడు.
 
"హ్మ్... మీ డైమెండేలె" అంది ఆశీ,కనిష్క్ లని చూస్తూ.
 
"మమ్మీ.... స్టోరీ...." అని మళ్ళీ గట్టిగా అరిచింది.
 
"ఏమి కథ చెప్పాలి!!"అని మానస ఆలోచిస్తుంటే "సోల్జర్,సెక్యూరిటీ అధికారి,డాక్టర్, ఫైటర్ స్టోరీస్ కాకుండా ఓల్డ్ వి...ఓల్డ్ స్టోరీస్ చెప్పు,తాతయ్యా మీకు చెప్పినవి" అంది ఆశీ.
 
"చిట్టి రాక్షసి...." అని "తాతయ్యా నాకు కథలు చెప్పలేదు నా ఫ్రెండ్ కి చెప్పాడు....సరే కథ చెప్తున్నా అందరూ వినండి" అని మానస కథ చెప్పటం మొదలు పెట్టింది.
 
"అది ఒక చిన్న రాజ్యం..... ఆ రాజ్యం లో ఒక చిన్న కుటుంబం...ఆ కుటుంబం లో ఒక చిన్న పాప,ఆ పాప తండ్రి ఉండేవాళ్ళు."
 
"అన్ని చిన్నవేన..." అని ఆశీ మోహం చిన్నగా పెట్టి అడగ్గానే కనిష్క్ ,కనిష్క్ బాబాయ్ ఇద్దరు ఒకటే సారి నవ్వారు.
 
వాళ్ళని కోపంగా చూసి "ఆశీ.....నో డౌట్స్, నో డిస్టర్బెన్స్" అంది.
 
"సరే.. సరే" అంటూ ఆశీ నోటి మీద వేలు పెట్టుకునేసరికి
"గుడ్..." అనిమానస తిరిగి చెప్పటం మొదలుపెట్టింది.
 
"ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఒక పాపా పుట్టింది, పాపా పుట్టగానే వాళ్ల అమ్మ చనిపోయింది. భార్య చనిపోవడంతో అతను వాళ్ళ పాపతో ఒంటరిగా వుండేవాడు.ఆ పాప శివలీల చిన్నప్పటి నుండే చిన్న చిన్న పాత్రలలో వంట చేయటం,మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఇంట్లో పనులన్నీ చేయటం నేర్చుకుంది అలా ఆ పాప చిన్నప్పటి నుండే వాళ్ళ నాన్నకి,ఆమెకి వంట చేసేది. అయితే ఒక రోజు శివలీల తండ్రి బోజనమ్ చేస్తుంటే అన్నంలో రాళ్లు వస్తాయి. అప్పుడూ అతను చిన్నపిల్ల చూడకుండా వంట చేసి వుంటుందని ఆ రోజుకి భోజనము కానిచ్చేసి అతని పని మీద బయటకు వెళ్ళిపోతాడు. ఇలా రెండో రోజు ,మూడో రోజు కూడా అవ్వడంతో "శివలీల ....!!" అని గట్టిగా పిలిచి "ఇదేంటని ఆమెకి చూపిస్తే "తెలీదు నాన్నగారు ,నేను రోజు బియ్యంలో రాళ్లు తీసే వంట చేస్తున్నాను" అని చెప్తుంది. అది వినకుండా వాళ్ళ నాన్న విసురుగా బయటికి వెళ్ళిపోతాడు.
 
మరుసటి రోజు ఉదయమే "శివలీల ....నాకు పని ఉంది భోజనం సమాయనికి వచ్చేస్తాను,నువ్ జాగ్రత్త "అని చెప్పి వెళ్ళిపోతాడు. శివలీల తండ్రి అలా వెళ్ళగానే పొరుగింట్లో వుండే భానుమతి శివలీల దగ్గరికి వచ్చి "అమ్మ శివలీల కాస్త బెల్లం వుంటే ఇవ్వు" అని అడిగేసారికి "వుండండి,ఇప్పుడే తెస్తాను" అని శివలీల లోపలికి వెళ్తుంది. అలా శివలీల అటు లోపలకి వెళ్ళగానే తన కొంగులో దాచిన రాళ్లని చేతిలోకి తీసుకొని పొయ్యి మీద ఉన్న బియ్యంలో వేయడానికి వెళ్తుంటే, అప్పుడే శివలీల తండ్రి ఇంటి పైకప్పు నుండి దూకి ఆమె చేయిని పట్టుకొని "ఏమిటిది?ఎందుకిలా చేస్తున్నావ్" అని భానుమతి ని కోపంగా అడుగుతాడు. అప్పుడు బయటికి వెళ్లిపోయారు కదా అని భానుమతి అడగటంతో "ఎప్పుడు నా కూతురు వంట చేసిన రాని రాళ్లు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి,కారణం ఏంటో తెలుసుకోవలనే బయటికి వెళ్లినట్టు చేసి పై కప్పు మీద నుండి అంత చూస్తున్నాను" అని చెప్పి "ఇకనైనా చెప్పు ,ఎందుకిలా చేస్తున్నావ్ ?" అని గద్ధిస్తాడు.
 
"శివలీల కోసం...." అని ఆమె చెప్పగానే "శివలీల కోసమా ,ఎలా?"అని ఆశ్చర్యం గా అడుగుతాడు.
 
"అవును, శివలీల కోసమే, తాను ఇంకా చిన్న పిల్ల ఇప్పటి నుండే ఆమెకి ఇన్ని పనులు ఎందుకు ,హాయిగా తన తోటి పిల్లలతో ఆడుకునే వయస్సు తనది తల్లి లేక ఎంత ఇబ్బందులు,కష్టలు పడుతుందో నా కన్నా మీకే బాగా తెలుసు" అని కొంగుతో ముక్కు తుడుచుకుంది.
 
శివలీల తండ్రి "అవును నీవు చెప్పింది అక్షరాల సత్యం కానీ నేను ఏమి చేయగలను నాకు బయట పనులు ఉంటాయి" అని చెప్పేసరికి "మీరు అన్నది కూడా వాస్తవమే,అందుకే ఆమె ఆలనా పాలన చూసుకోడానికి తల్లిలాంటి ఒక ఆడది కావాలి" అని చెప్తుంది.
 
"తనని అలా ఎలా ఎవరూ చూసుకుంటారు?" అని దిగాలుగా అనేసరికి "మీకు అభ్యంతరం లేకపోతే నేను చూసుకుంటాను" అని తలా దించుకొని చెప్తుంది.
 
కాసేపు ఆలోచించి "శివలీలని నువ్వు చూసుకుంటాను అంటే అంతకంటే భాగ్యం లేదు"అని "మరి మీ పెద్దవాళ్లని" అని ఆగిపోతాడు.
 
"మా పెద్దలని నేను ఒప్పిస్తాను మీరు శివలీల కి అర్ధం అయ్యేలా చెప్పండి" అని సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది.
 
ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే శివలీల తండ్రికి,భానుమతికి వివాహం జరిగింది. అంతవరకు బాగానే ఉన్న భానుమతి నిజ స్వరూపం వివాహమైనా కొద్దీ రోజుల్లోనే బయట పడింది. శివలీల తండ్రి ఉన్నంతవరకి శివలీలని బాగా చూసుకుంటున్నట్టు నటించి అతను వెళ్ళగానే అసలు గుణం బయట పెట్టేది.
 
ఇంటి పని మొత్తం శివలీలతో చేయించి శివలీల తండ్రి రాగానే తానే అంత చేసినట్టు ,నొప్పులని బాధ పడుతూన్నట్టు నటించేది,భానుమతి ని చూసిన శివలీల తండ్రి "శివలీల అమ్మకి కాస్త సహాయంగా వుండు అన్ని పనులు ఒక్కతే చేసుకోలేకపోతుంది" అని తిరిగి శివలీలకె చెప్పేవాడు.
సవతి తల్లి సవతి తల్లేనని శివలీల కి తొందరగానే తెలిసొచ్చింది. అయినా శివలీల తన తండ్రి ముందు నోరు విప్పి చెప్పేది కాదు.
 
ఒక మగవాడి జీవితం అతను పెళ్లి చేసుకునే ముందువరకు తల్లి పై పెళ్లితరవుత తన భార్య పై మొత్తానికి ఒక స్త్రీ పైనే ఆధారపడి ఉంటుంది.
 
భానుమతి వారి జీవితంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే శివలీల తండ్రి మారిపోయాడు ఎంతలా అంటే భార్య ఏమి చెప్తే అది చేసేలా,వినేల. ఇక శివలీలని పట్టించుకోవడమే మానేశాడు.
 
రోజులు గడుస్తున్నా కొద్దీ శివలీల పరిస్థితి మరి దారుణం అయింది. ఇద్దరి మనుషుల చాకిరి కాస్త ముగ్గురిది అయింది. భానుమతి కి శివలీల తండ్రికి ఒక పాపా పుట్టింది. భానుమతి కూతురు అంటే భానుమతి నొట్లొ నుండి పుట్టింది అని చెప్పుకోవాలి. శివలీల కి తన తల్లి పోలికలు వచ్చి కుందనపు బొమ్మల వుంటే, మందరకి తన తల్లీ భానుమతి పోలికలైన నలుపు రంగే కాకుండా వంకర కాలు కూడా వచ్చింది,ఆమె నడిచినపుడల్లా కాలు కుంటుతూ నడుస్తుండేది.
 
శివలీల ని చూసినప్పుడల్లా తన కూతురు మందర శివలీల లా అందగా లేదని శివలీల నే తిట్టేది. తన తల్లి భానుమతి ఆస్తులు,గుణాలు అయిన కోపము,ద్వేషం,అసూయ ,ఈర్ష్య ఇవన్నీ మందరతో పాటు పెరుగుతూ వచ్చాయి.
 
చూస్తుండగానే ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. మందర తన కన్నా పెద్దది అయిన శివలీలని ఒక సోదరిగా కంటే ఎక్కువగా పని మనిషిగానే చూసేది.
 
వీళ్ళ వుండే రాజ్యపు రాజుకి ఒక్కగానొక్క కొడుకు. రాజుగారి వయసు పైబడటంతో రాజ్యభారం రాకుమారుడి పైన వేసి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు రాజు. ఇదే విషయం రాకుమారుడు అయిన విజయ రుద్ర కి చెప్పగా అతను "తండ్రి మాకు అనుభవం లేనందున దేశాటన కొరకు కొంత సమయం కావలెను," అని చెప్పి ఇంకేదో చెప్పడానికి సంకోచిస్తుండగా "చెప్పు రాకుమార మీ మదిలో ఉన్నది" అని రాజు గారు అడిగేసారికి "తండ్రి...కొన్ని రోజుల నుండి నాకు ఒక స్వప్నం వస్తుంది అందులో ఒక అందమైన అమ్మాయి నన్నే పిలుస్తూ ఏడుస్తుంది" అని చెప్పేసరికి " ఆమె ఎవరో నీకు తెలుసా రాకుమార ?"అని రాజు గారు అడిగేసారికి "ఆమె ఎవరో తెలియదు తండ్రి కానీ చాలా విచారంగా ఉంది,నాకు వచ్చింది స్వప్నమే అయిన ఆమె దుఃఖిస్తు వుంటే చూడలేకున్నాను తండ్రి" అని బాధపడతాడు. సరే ఆమె మొహమైన గుర్తు ఉన్నదా?అని ఆడిగితే నేను కళ్లు మూసుకుంటే కనిపిస్తుంది కళ్ళు తెరిస్తే మాయం అవుతుంది అంటాడు. అది విన్న రాజుగారికి రాకుమారుడికి వివాహ సమయం ఆసన్నమైంది అందుకే సుందరిమణుల కలలు కంటున్నాడు" అనుకోని నవ్వుతూ "మీ దేశాటనకు ఆరు నెలల సమయం ఇస్తున్నాను,ఆ లోపు నీ స్వప్న సుందరి కనిపిస్తే ఆలోచిద్దాము లేదంటే ఆమె గురించి మరచిపోయి మేము నిర్ణయించిన మగువనే నీవు వివాహమడాలి" అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
విజయరుద్ర అతని స్నేహితుడు ఇద్దరు కలిసి దేశాటన కై అన్ని రాజ్యాలు తిరిగి చివరన వారి రాజ్యానికి వచ్చి రాజకోటకి వెళ్లకుండా రాజ్యం లో ఉన్న పూటకుళ్ల పెద్దమ్మ ఇంట్లో బస చేస్తారు. ప్రయాణం చేసి అలసిపోయి వుండడంతో ఆ రేయి తొందరగా పడు కుండిపోతారు. విజయరుద్ర స్నేహితుడు ఆదమరిచి నిద్రపోగావిజయరుద్ర కి కల చెదిరి నట్టుగా నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు.
 
కళ్ళు తెరిచిన కలలో వచ్చిన అమ్మాయి మొహమే కనిపిస్తుంది అతనికి. కొద్దీ సేపు ఆరు బయట వుందాం అని పూటకుళ్ల పెద్దమ్మ దగ్గరకి వెళ్తాడు.

ఇంకా ఉంది...
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అమ్మ చెప్పిన కథ - by k3vv3 - 22-02-2023, 02:56 PM



Users browsing this thread: 1 Guest(s)