Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Inspiration ఎల్లమ్మవ్వ చెంబు
#1
ఎల్లమ్మవ్వ చెంబు

-     Kasa Ramesh

ఎల్లమ్మవ్వంటే మా గేర్ల అందర్కంటే పాతముసల్ది. ఎనభై ఏండ్లుంటయేమో సరిగ తెల్వది గాని, బాగనే చూసింది జిందగిల. గంత ముసల్దైన ఇప్పట్కి కట్టె లేకుండనే నడుస్తది. కండ్లే జరంత మొబ్బు మొబ్బు ఐనవట్టిండె. ఏమవ్వ డాక్టర్త పోవొద్దా నళ్ళద్దాలిస్తడంటే, ఏంరా అప్పుడే నన్ను గుడ్డి దాన్ని చేస్తున్నరా అంటది నవ్వుకుంట. అట్ల నవ్వినపుడు నోట్లె మిగిల్న నాల్గైదు పండ్లు రంగువోని ఒరిజినల్ ముత్యాల్లెక్కనే కనిపిస్తయి.
 
ఎల్లమ్మవ్వ చేతుల ఎప్పట్కి ఒక పాత చెంబు ఉంటుండె. గదే చెంబుల నీళ్లు తాగుడు, ఎప్పుడన్న జరంత కల్లు తాగుడు. ఎవలింటికాడన్న కూసున్నప్పుడు ఇంత చాయబొట్టు పోస్తె తాగి, చెంబులకింత నీల్లడ్కొని అంగ్లంలనె గిలాస కడ్గిస్తుండె. ఎల్లమ్మవ్వ మొగున్నైతె ఎప్పుడు సూడలేదు గాని,  బిడ్డె అళ్ళుడు ఆమెతోన్నె ఉంటున్నరు నాకు ఎర్కున్నప్పట్నుంచి. ఆప్పట్ల శేన్లల్ల పనికి పోతుండె, ఇప్పుడైతే చిన్న మనుమన్ని పట్కొని గుడి కట్టమీద ఆడ్పిస్కుంట కూసుంటది. పిలగానికి దూపైతె గాచెంబుల నీళ్లే తాపి, తానింత తాగి జరంత కట్టమీదనె మాపటేల దాక అడ్డపడ్తది.
 
ఇయ్యాల బుదారం సంతకు పొయ్యొస్తున్న నేను. దుకాణంకి కావల్సిన సామాను బైకుకి ఎంట కట్కొని తీస్కొస్త. తెంతు క్లాసు ఐనంక, సెకండియర్ల సబ్జెక్ట్లు అట్లే కూసున్నై. నియ్యమ్మ, ఇట్లైతె కాదని ఐనకాడికి ఒక్కొక్కటే బాకి తీస్తున్న. అప్పట్కే ఊల్లె చానమంది పనిపాట లేనోల్లు బీడు పడ్డరు. వాల్ల సంగంల సభ్యున్నైతే నా పరువేం కావాలె, అందుకే చిన్న కిరాణ దుకాణం తెరుస్కున్న.
 
గేటుకాడ బండాపి సామాను దింపుతుంటె ఇంట్లకెల్లి ఎవరో ముసలోల్లు ఏడ్సిన సప్పుడైతున్నది. ఇంట్లకు పోతే ఎల్లమ్మవ్వ, అమ్మతాన కూసొని ఏడుస్తున్నది. దీనికేం కష్టమొచ్చెనో కదరా అనుకున్న. ఏడ్వకవ్వ అని అమ్మ సముదాయిస్తున్నది.
 
సంతకెల్లి తెచ్చిన సామానంత లోపట దింపి అవ్వతోనికొచ్చి కూసున్న. ఏమైందవ్వ ఏమిట్కేడుస్తున్నవ్ అని అడ్గిన, ఏంచెప్పాలె కొడ్కా నా చెంబెవడొ ఎత్కపోయిండు అన్నది ఏడుస్కుంట. నీ చెంబు ఎవడెత్కపోతడే, ఐనా గా సొట్టల చెంబుతోని నీకేంపని? కొత్తది కొనిస్తపో అన్న. గా మాటనుడ్తోటే గయ్యిన లేశింది  నామీదికి. ఏంరా నాకే నీతుల్ చెప్తున్నవ్, నీకేం తెల్సు నాచెంబు సంగతి. గా చెంబు ఎవ్వని చేతులన్న కనపడాలే, వోని బొక్కల్ సాఫ్ చేస్త అని మల్ల ఏడ్సుడు షురూ చేసింది.
 
ఇదిట్ల ఒడ్వది గాని, నీయవ్వ గా చెంబుకేందే ఇంత లొల్లి అని మల్లొక మాటిడ్సిన. ఈసారి గయ్యిన లెవ్వలే, నీకు గిదంత ఇప్పుడు తెల్వదు కాని, పెండ్లైనంక తెలుస్తదిపో అన్నది. నీయవ్వ మల్ల గదే అనవడ్తివి, చెంబుకు పెండ్లికి జతేందే అన్న. అవ్వ కండ్లల్ల నీళ్లు ఎక్కువైతున్నయి, మ్యాటర్ సీరియస్ ఐనట్లున్నది, ఊకెనే గెల్కినకదరా అనుకున్న మనసుల. ఊకొనే అవ్వ నేను నింకి తీస్కొస్తగాని, చెంబు సంగతి నాకిడ్సిపెట్టు నువ్వింక ఇంటికిపో, ఏడ్వకుండ పండుకో అన్న. మాటైతే అన్నగాని, ఈమాట యాదికున్నదో లేదో, శివాలయం బాయిల నా ఉంగ్రం పడేవరకు మల్ల చెంబు సంగతి యాదికిరాలె.
 
ఆరోజు ఐతారం, చియ్యలకూర తిన్నోల్లంత మెల్లెగ బైటికొచ్చి, గుడి కట్టల మీదనో లేకుంటె శివాలయం బాయి కట్టమీదనో జరంత అడ్డపడుడు ఏండ్లనుంచున్న రివాజు. ఐతారమైతే దుకాణం మూతవెట్టి నేనుగూడ బాయికట్టమీదికి పొయ్యి జెర టైంపాస్ చేస్త. శివాలయం బాయంటే ఉట్టి బాయి కాదు, పెద్ద కోనేరు. బాయిలకు దిగనింకె ఎంతలేదన్న మూడు మీటర్లు పొడువున్న పెద్ద పెద్ద రాతి మెట్లుంటై సుట్టుత. అంచులమీద పెద్ద పెద్ద రాతి కట్టలుంటై. గాన్నే ఒక మూలకు పత్తలాడెటోల్లు పత్తలాడ్తరు, బడికి శెలువున్న పిల్లలు ఈతాడినింకొస్తరు. గాన్నే కట్టమీద పత్తలాడెటోల్ల ముచ్చట ఇనుకుంట జరంత కూర్కువడ్డ.
 
ఎక్కసేపు గూడ కాలె, ఐదో పదో నిముషాలు, పక్కల గొయ్యిన పత్తలాట లొల్లికి అప్పుడే తెలివొచ్చింది. కట్టల పక్కకి పెద్దపెద్ద పాత శింతచెట్లుంటై మూడు. మధ్యానంపూట ఊల్లె దొర్కని మొగోల్లంత కట్టలమీదనే ఉంటరు. ఎంతపెద్ద ఎండన్నకాని శెట్టు కిందికొస్తె సూర్యుడుగూడ మాయమైతడు. లేశి మీదవడ్డ చింతాకుల్ని దుల్పుకుంటున్న.
 
గంతే ఎప్పుడు లూజయిన్నదోగాని నా ఏలుకున్న ఉంగ్రం జారి మెట్ల మీద్కెల్లి తిర్గుకుంట పొయ్యి అంచుపోడ్తి నీళ్లల్ల పడ్డది. నా పానం ఎగిరినట్లైంది ఒక నిముషంకి. కట్టమీదికెల్లి లేశి సీద కిందికుర్కి ఏమిసూడకుండ బాయిల దుంకిన. నిమిషమన్న ఐందో లేదో దమ్మొచ్చింది బాగ, నీనొక్కొన్నే నింకితె రెండురోజులైన గూడ దొర్కదిది. ఏంజెయ్యాల్నో తెల్వక మెట్లమీద కూసున్న. అప్పట్కే బాయిల తోడెం మంది పిల్లలు ఈతాడ్తున్నరు. గాపిల్లల్ని పిల్చిన, అరే గిప్పుడే మీదికెల్లి నాఉంగ్రం బాయిల పడ్డది జెర మీరుగూడ నింకుర్రా అన్న.
 
నీనడ్గుడుతోటె బాయిలున్న పిల్లలంత నింకుడు షురూచేసిండ్రు. నీళ్లల్ల కస్ర శానున్నది, ఇండ్ల నాఉంగ్రం దొర్కుడు కష్టమే. మీద కింద ఉన్న పిల్లలందర్కి చెప్పిన, మీరు నాఉంగ్రం దొర్కబడ్తె నా దుకాణంల ఏంకావాల్నంటె అది తీస్కపోర్రా బై అన్న. మీదున్న పిల్లలుగూడ ఉర్కీతొచ్చిండ్రు. ఫస్టు కస్ర తీస్తున్నం, మెల్లెమెల్లెగ బాయిలకెల్లి పాతసామాన్లు బైటపడ్తున్నై. పాతచెప్పులు, బకిట్లు, మునిగిపోయిన టెంకాయలు ఇంకేమేమో. పొద్దువోతున్నది, శీకటైతది అన్న సోయి గూడలేదు, ఉంగ్రం దొర్కితె సాలన్నట్లున్నది పరిస్థితి. లాస్టుకి చిన్నమల్లిగానికి ఉంగ్రం దొర్కింది. నీవు దేవుడవ్రా మల్లిగా అని, ఒక్కసారి వాన్ని ఎదకు అదుముకున్న. ఉంగ్రం సూడుడ్తోటె రెండుబొట్లు కండ్లకెల్లి కారినై. ప్రేమలవడ్డ ఎవ్వర్కన్న ఆక్షణంల నాబాధ ఈజిగ అర్థమైతది. మొన్న పట్నంకెల్లి లలిత నాకోసం పట్కొచ్చిన గిఫ్టిది. లలిత బడి పంతులు నర్సిములు బిడ్డె. ఎందుకో, ఎప్పుడో, ఎట్లయ్యిందో తెల్వదుగాని లలితంటే చాన ఇష్టం నాకు. తెంతు వరకు ఒక్క రోజు గూడ మానకుండ బడికి పొయ్యింది లలిత కోసమే. ఇంటర్ చేసుడు ఇష్టం లేకున్న లలిత కోసమె కాలేజ్ జాయినైన. టైమై బస్సు పోతున్న గూడ లలిత కనిపిస్తెనే కాలేజికి బస్సెక్కెటోన్ని.
 
లలిత నాలాక కాదు పంతులు మంచిగ పెంచిండు, మంచిగ సదువుతది, శానతెల్వున్నది. నేనెప్పుడు బస్సెక్కిన లలితకు సీటు పడ్తుంటి. నేను సీటుపడ్తె అది ఎవరి కోసమో లలితతోపాటు బస్సులెక్కిన ఊరోల్లందర్కి ఎర్కే. కాని లలిత ఎప్పుడు పల్లెత్తు మాటగూడ అనలే, గదే నా ధైర్యమంత. కాలేజిల లలిత పక్కకి ఈగె గూడ రాకుండ చూస్కునెటోన్ని. ఆనోట్లె ఈనోట్లె పడి ఈసంగతి పంతులుకి ఎర్కయ్యింది.
 
పంతులు పెద్దమనిషి, నల్గుట్ల నాయం చెప్పెటోడు, అసొంటిది పంతులు బిడ్డెకే లైనేస్తవ నిన్నిడ్సిపెట్టడు పోరా అన్నరు దోస్తులంత. పంతులు ఏంజేస్తడో అని లోపట భయమున్నగూడ, ఇప్పటి వరకు లలిత నన్నేమనలేదుగద అని ధైర్నంతోనున్న. పంతులు నన్నింటికి పిల్పిచ్చిండు. ఏంరా, నీకు సక్కగ సదువబ్బలే, నా బిడ్డెనేమో సరస్వతి, ఏంచూసి దానెంట పడ్తున్నవ్? రేపట్నాడు నీకు పెండ్లైతె నీపెండ్లమ్ని ఏంపెట్టి పొశిస్తవ్? ఈవయసుల ఇసొంటి ఆకర్షణలు ఎవ్వనికన్న కల్గుతై అది తప్పుగాదు, కాని భవిష్యత్ మీద ఆలోచనున్నోడే గెలుస్తడు. ముందు ఏమన్న బతుకు దెరువు చూస్కో అదే ముంగట నిన్ను సుఖపెడ్తది. నాబిడ్డె తెలివిగలది, దానికేం గావాల్నో అదే డిసైడ్ చేస్తది, నేనట్లనే పెంచిన దాన్ని. అదింతవరకు నీమీద కంప్లేంట్ ఇయ్యలే, అందుకే నిన్నేమనకుండ ఇడ్సిపెడ్తున్న. పైచదువులకి పట్నం పంపిస్తున్న లలితని, దాని సదువైనంక అదినిన్ను మనసుపడితే నీకే ఇచ్చి చేస్త. ఇప్పుడు పో, పొయ్యి ఏమన్న పనిచూస్కో అన్నడు.
 
పంతులు తోటి మాట్లాడినంక ఊర్లె అందరు నన్ను మొనగాడివిరా అన్నరు. ఇంటర్ ఐనంక లలిత పట్నం పొయ్యింది. పంతులు చెప్పింది నూరు శాతం కరెక్టనిపించి దుకాణం తెరుస్కున్న నేను. కొన్నొద్దులైనంక సెలువులకి ఇంటికొచ్చింది లలిత. ఆ రోజైతే బూమ్మీద కాలునిల్వలే నాకు, కాని పంతులు మాట యాదికొచ్చి గమ్మున కూసున్న. మాపటేల ఇంక జెరసేపైతె దుకాణం మూస్తననంగ, చీకట్లకెల్లి నడుస్కుంట సీద దుకాణం కాడికొచ్చింది లలిత.
శాన రోజుల తర్వాత అట్ల లలితను చూస్తుంటె నేను దుకాణంల ఉన్నసంగతే మర్చిపోయిన. అట్ల ఇద్దరం మొకాలు చూస్కుంట నిలబడ్డం. నిజంగ లలిత మనసుల నాగురించి ఏమున్నదో, ఆరోజుదాక తెల్వదు నాకు. "ఇన్నిరోజులు నన్నుసూడకుండ బాగనే ఉన్నవ్ కదా" అన్నది లలిత. నిన్ను సూడకుండ నేనెట్లుంట? రెండు మూడు సార్లు పట్నమొచ్చిన నీకోసమే. మీ కాలేజ్ కాడికొచ్చి దూరం నుంచే నిన్ను చూసిపొయిన అన్న నేను. "ఈసారొచ్చినప్పుడు దగ్గెరికొచ్చి మాట్లాడు దూరం నుంచే చూసిపోకు అని, ఒక చిన్న గిఫ్టుడబ్బ నాముంగట పెట్టి నేను చెప్పిందినకుండనే నడుస్కుంట పొయ్యింది లలిత.
 
గా డబ్బలున్నదే గీ ఉంగ్రం, నా ప్రేమకు గుర్తిది. ఆరోజు పెట్కున్న ఉంగ్రం ఎప్పుడు తియ్యలేదు. నీళ్లల్ల పడ్డ ఉంగ్రం మల్ల నా చేతులకొచ్చెటోల్లకు నాపాణం నిమ్మలమైంది. “అరే గీ సొట్టలచెంబు ఎల్లమ్మవ్వదిరా బాయిలెట్లపడ్డది అన్నడెవడో.” అరేయ్ ఆ చెంబు ఇకడియ్యిర్రా, ఎల్లమ్మవ్వ శాన నింకుతున్నది దీనికోసం అని పిల్లల చేతులకెల్లి చెంబుతీస్కొని నిమ్మలంగ ఇంటి దారి పట్టిన.
 
జరంత చాయతాగి ఎల్లమ్మవ్వని కుష్ చేద్దమని చెంబుతీస్కొని రోడుమీదికొచ్చిన. పొద్దుమాపైన గూడ ఇంటికి పొయినట్ల లేదు గుడి కట్ట మీదనే కనపడ్డది అవ్వ. ఏమవ్వో ఇంత చాయబొట్టన్న తాగినవా లేద, పొద్దుమాపైంది ఇంగగీన్నే కూసున్నవేంది, ఇంటికి పోవా అన్న. ఏంచెప్దు కొడ్కా గాచెంబు పొయినప్పట్నుంచి నాసోయి సోయిల లేదు అన్నది. నీయవ్వ, నీలొల్లికి దండమే ఇగో పట్కచ్చిన సూడు అని అవ్వచేతుల చెంబువెట్టిన. చేతులున్న చెంబు సూడుడ్తోటె అవ్వకండ్లల్ల నీళ్లు నిండి బొటబొట కారినై. రెండు నిమిషాలు అట్లే ఒడిశినై, అవ్వని చూస్కుంట కూసున్న నేను. అవ్వ కండ్లు తుడుస్కున్నది. నా చేతుని ఆమె చేతులకు తీస్కొని మెత్తగ ఒత్తి పట్కున్నది. నాకండ్లల్లకి ఒకసారి చూశింది.
 
నీను పెద్దమనిషి కాక ముందే, పెండ్లంటే ఏందో తెల్వకముందే మాయమ్మోల్లు నా పెండ్లి చేశిండ్రు. మా అత్తగారింట్లనే మూలకు కూసున్న నీను. ఇంటికి పెద్దకొడుకు నా మొగుడు, నస్కులపోతె మాపటేలకొచ్చెటోడు చేను కాడ్నించి. నేను లేవంగనే అల్కిముగ్గేశి, రోట్లె ఒడ్లుదంచి మాయత్తకిచ్చి, జొన్నరొట్టెలు కొట్టనింకె కూసుంటె రెండు గంపలు నిండేడ్దాక లెవ్వకుంటి. ఎప్పుడన్న నా మొగుడొచ్చి నా రొట్టెల పొయ్యికాడ కూసొని నావొంకనే చూసెటోడు. అట్ల నామొగుడు కూసున్నప్పుడల్ల రొట్టెలే సరిగొచ్చేటివి కాదు, భయంల పిండి ఎట్లంటట్లే పిస్కుడుతోని రొట్టెలన్ని చెక్కలైతుండె.  పెండ్లైనంక రెండుమూడేండ్లు అత్తగారింట్లనే ఉన్నగూడ, నేను పెద్దమనిషయ్యేటి వరకు నీనెవరో తెల్వనట్లనే ఉండెటోడు నా మొగుడు.
 
ఒకరోజు మాయత్త, ఇప్పట్నుంచి నీ మొగున్కి సద్ది తీస్క పొయ్యి శేనుకాన్నే తినవెట్టు అంజెప్పి సద్దిగంప చేతులవెట్టి తోలింది. భయపడ్కుంటనే పొయ్యిన శేనుకాడ్కి. నన్నుపేరువెట్టి గారోజే పిల్చిండు నా మొగుడు. ఏం ఎల్లమ్మ శేనుకాడ్కి ఎందుకొచ్చినవ్, అనడ్గిండు. అత్త సద్ది పంపిచ్చింది తీస్కొచ్చిన అన్న. అత్త పంపిస్తె ఒచ్చినవా కూసో, బువ్వ తిన్నవా అన్నడు. ఇంట్ల తినొచ్చిన, నువ్వుతింటే గంప తీస్కొని ఇంటికి పోతఅన్న. గట్లనే మెల్లెమెల్లెగ నా మొగుడంటే భయం పొయ్యి మర్యాద పెర్గింది. ఐతే మాఅత్త మాత్రం పెండ్లై ఇన్నిరోజులాయె, పిల్లలు జెల్లలు కావాల్నా ఒద్దా, మనుమన్ని ఎప్పుడిస్తవ్ అని రోజు పోరు వెడ్తుండె ఇంట్ల. గిదేమాట నామొగున్కి చెప్పిన శేనుకాడ. ఒకసారి పండ్లికిలించి నీకు పిల్లల్గావాల్నా అనడ్గిండు. ఇదంత నాకేంతెల్సు, అత్త రోజు గిదేముచ్చట తీస్తది ఇంటికాడ అన్న.
ఏపనికన్నా తగ్గ సమయ మొస్తెనే అవి మంచిగైతయ్. మా అక్కకుగూడ నీ లెక్కనే చిన్నగున్నప్పుడే పెండ్లి చేశిండ్రు. పెండ్లంటే ఏందో తెల్శే లోపే నీళ్లోసుకొని కాన్పుకు ఇంటికొచ్చింది. నువ్వు మామవైతవురా అని అందరంటుంటె మస్తు కుశైన నేను. కాని వాల్లెవ్వల్లన్నట్ల మామకాలే నేను. అక్కకి నొప్పు లొచ్చినప్పుడు అది భరించలేక ఎంత సమవడ్డదో నా కండ్లల్ల చూశిన. ఆడుకునే ఆడిపిల్లకు పురిటినొప్పులేం తెలుస్తయి. కాన్పుకోసం మంత్రసాని ఎంకమవ్వని తీస్కొచ్చిండ్రు. అమ్మనేమో అన్నిదేవుండ్లకి మొక్కుతున్నది, కాన్పు మంచిగైతే మొక్కు తీరుస్కుంటాని. జెరసేపైనంక ఎంకమవ్వ ఏడుస్కుంట బైటి కొచ్చింది, బిడ్డె అడ్డం తిర్గిందిరా, తల్లీ బిడ్డె ఇద్దరు పానాలిడ్సిండ్రాని మొత్తుకొని ఏడుస్తున్నది. ఏడుస్కుంట లోపల్కి ఉర్కిన, పానంలేని ల్యాగదూడలెక్క మంచమ్మీద పడ్డది అక్క. నొప్పులు వడలేక ఏడ్శి ఏడ్శి దాని మొకమంత పచ్చిగైంది. అప్పట్కి దానివయసు పదమూడేండ్లె. అప్పట్కి పిలగాన్ని నేను, ఇదేమర్థంగాక శానదినాలు అక్కనే యాదిచేస్కొని ఏడ్శెటోన్ని.
 
కొన్నిదినాలైనంక దవఖానల ఎర్కైంది నాకు, చిన్నవయసుల పిల్లల్ని కనుడు తల్లి పానాలకు ప్రమాదమని. అప్పుడే అనుకున్న సరైన వయసులనే నా పెండ్లం పిల్లలు కనాల్నని. అసలు చిన్నపిల్లతోన పెండ్లే ఒద్దే అని మొత్తుకున్న, కాని అమ్మ పోరు పడలేక నీతోన పెండ్లికి ఒప్పుకున్న. ఎవరెన్నిచెప్పిన ఇననట్లుండు. ముంగట ముంగట నీకే తెలుస్తయిపో అన్నడు నామొగుడు.
 
నా మొగునికంట్లె అప్పుడు సూశిన నీళ్లు మల్లెప్పుడు సూడలే. నాకు తొల్చూరు కాన్పుల ఆడిపిల్ల పుట్టింది. నన్ను సూడనింకొచ్చిన మొగుడు గీ చెంబు పట్కొచ్చిండు అప్పట్ల. ఏందే పిల్లకు బొమ్మ పట్కరాక చెంబు తెచ్చినవేంది అంటే, చెంబు పిల్ల కోసం కాదే నీకోసం, నువ్వు రోజు ఈ చెంబెడు పాలు తాగాలే. నీవు బాగుంటెనే నా పిల్ల బాగుంటది అన్నడు. నా మొగుడు మనుసున్నోడు, నీతి నియ్యతి తెలిశినోడు. ఎవ్వని జోలికి పోలే, గొడ్డులాక కష్టపడుడొక్కటే తెల్సు వాన్కి. నా మొగుడు పొయ్యినంక నాకు మిల్గింది గీ చెంబే. ఇండ్ల ఎప్పుడు నీళ్లు పోశినా నామొగుని మొకమే కనిపిస్తది నాకు. మీకందర్కి గిది సొట్టలచెంబే కావొచ్చు, నాకిది నా మొగుని గుర్తురా అని, కట్ట మీదికెల్లి లేశి నడుస్కుంట పొయ్యింది. నా చేతుకున్న ఉంగ్రాన్ని ఒకసారి భద్రంగ తడుముకున్న, నాకు తెల్వకుండనే కండ్లల్ల నీల్లొచ్చినై.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఎల్లమ్మవ్వ చెంబు - by k3vv3 - 08-01-2023, 12:34 PM



Users browsing this thread: 1 Guest(s)