Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కధలు
#13
క్రూర మృగాలు
ఆదోని బాషా
‘‘మేడమ్‌, ఇక్కడి నుంచి దట్టమైన అరణ్యం మొదలవుతుంది. అడవిలో క్రూరమృగాలు స్వేచ్ఛగా తిరుగాడుతుంటాయి. ఇంకా ముందుకెళ్ళటం ప్రమాదం’’ రీటాని హెచ్చరించాడు గైడ్‌. ఆ మాటల్ని పట్టించుకోకుండా టాప్‌ లేని ఆ జీపులో నిల్చుని బైనాక్యులర్స్‌తో అడవిని వీక్షిస్తోంది రీటా.మనోహర దృశ్యమది! ఆకాశాన్ని కమ్మేసినట్టు ఎత్తయిన వృక్షాలు, భూమిని కప్పేస్తూ అల్లుకు పోయిన తీగలు - ఎటు చూసినా పచ్చదనంతో సృష్టికర్త గీసిన పెయింటింగ్‌లా వుందది. చెట్లపై కిలకిల రావాలతో స్వాగతం పలుకుతున్న వివిధ రకాల పక్షుల్ని చూసి రీటాలో ఉత్సాహం వురకలేసింది.‘‘ఎస్‌. నేను వెదుకుతున్న అడవి ఇదే! నాక్కావల్సిన పక్షి, కీటక జాతులు ఇక్కడ కన్పించే అవకాశముంది. ఇంకాస్త ముందుకెళతావా?’’ రీటా మాటలు విన్న డ్రైవర్‌ ఆమెను ఎగాదిగా చూశాడు.‘‘మేడమ్‌, ముందు దారి లేదు. బలవంతంగా వెళితే చెట్లమధ్య ఇరుక్కుపోతాం. అప్పుడు వాపసు వెళ్ళటానికి జీపు తిప్పుకోవాలన్నా సాధ్యం కాదు’’ అన్నాడు. డ్రైవర్‌ చెప్పింది నిజమే! అడవి లోపలికి మనుషులు వెళ్ళగలిగే స్థలం కూడా లేదు. జీపు ఎలా వెళ్ళగలదు?‘‘ఓ.కె. మీరిక్కడే వుండండి. నేను అడవిలో కెళ్ళి నా పని చేసుకొస్తాను. సాయంత్రం కల్లా తిరిగొస్తాను’’ అంటూ రెండు బ్యాగుల్ని తీసుకుని జీపు దిగింది రీటా. జీపు డ్రైవర్‌, గైడ్‌ ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు ఆశ్చర్యంగా చూశారు.‘‘మేడమ్‌, ఈ అడవిలోకి వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అడవిలో అడుగు పెట్టగానే మీరు తప్పిపోతారు. అడవిలో దారి అంటూ వుండదు.
ఎక్కడ చూసినా చెట్లే కన్పిస్తాయి. దాంతో మీరు వెళ్ళిన దారిలోనే వెళుతూ అక్కడే తిరుగుతూ ఉండిపోతారు. ఈ అడవి క్రూరమృగాలకు నిలయం. ఒంటరి మనిషిని చూడగానే అవి దాడి చేస్తాయి. పైగా అడవుల్లో హఠాత్తుగా వర్షం కురుస్తుంది. కుంభవృష్టి కురిస్తే మీకు తల దాచుకునే చోటు కూడా దొరకదు. ఇక్కడ సెల్‌ఫోన్లు కూడా పని చెయ్యవు’’ గైడ్‌ రీటాకి వివరంగా చెప్పాడు.‘‘థ్యాంక్స్‌ ఫర్‌ యువర్‌ కైండ్‌ ఇన్ఫర్మేషన్‌. ఇంతకన్నా ప్రమాదకరమైన ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌లో రీసెర్చి చేసిన అనుభవం నాకుంది. నేను పుట్టి పెరిగిందే అమేజాన్‌ అడవుల్లో. నా బాల్యమంతా జంతువుల సహవాసంలోనే గడిచింది. కాబట్టి మీరు నా గురించి బెంగపడొద్దు. నేను అడవిలోంచి తిరిగొస్తాను. ఒక వేళ చీకటి పడేలోగా నేను రాకపోతే మీరు వాపసు వెళ్ళిపోండి’’ అంటూ రీటా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి బ్యాగులు మోసుకుని అడవిలోకి దూరి క్షణాల్లో మాయమైంది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ వారిద్దరూ నిశ్చేష్ఠులై పోయారు. అప్పుడు సమయం ఉదయం పది కావస్తోంది.
రీటాకి పాతికేళ్ళుంటాయి. తల్లి బ్రెజిలియన్‌. తండ్రి ఇండియన్‌. యూరప్‌లో చదువుకుంది. ఆమెకు బాల్యంనుంచీ అడవులన్నా, వన్య మృగాలన్నా ఇష్టం. అందుకే ఆమె చదువంతా బయాలజీలోనే కొనసాగింది. పి.జి అయ్యాక జీవ వైవిధ్యంపై రీసెర్చి చేస్తూ ప్రపంచంలోని పలురకాల అడవుల్లో గల జంతుజాలంపై పరిశోధనలు సాగిస్తోంది. శీతల, సమశీతోష్ణ, ఉష్ణమండల అడవుల తర్వాత రుతుపవన అడవుల రీసెర్చి కోసం తండ్రి జన్మస్థానమైన ఇండియా కొచ్చింది. తూర్పు కనుమల్లోని దండకారణ్యాన్ని తన పరిశోధనకు అనువైన ప్రదేశంగా ఎన్నుకుంది. ఆమెకు తోడుగా ఆమె కజిన్‌ రాబర్ట్‌ కూడా ఇండియాకి వచ్చాడు. కాని రెండ్రోజులుగా అతను వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. అందువల్ల రీటా వెంట రాలేకపోయాడు. చివరికి ఆమె ఒంటరిగానే అడవిలోకి అడుగు పెట్టింది.రీటా భుజాలకు వేలాడుతున్న రెండు బ్యాగుల్లో ఒకదాంట్లో ఆమెకు అడవిలో ఉపయోగపడే పలురకాల వస్తువులున్నాయి. రెండో బ్యాగులో ఆమె రీసెర్చికి అవసరమైన కెమెరా, ల్యాప్‌టాప్‌, కంపాస్‌ తదితర పరికరాలున్నాయి. అడవిలోకి ప్రవేశించగానే ఆమె బ్యాగులోంచి ఒక పరికరం తీసింది. బటన్‌ ఎత్తగానే ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్కర్లను అతికించే పరికరమది. ఆ స్టిక్కర్లపై రేడియం పూతతో సీరియల్‌ నంబర్లు ముద్రించి వుంటాయి.
రీటా తను నడుస్తున్న మార్గంలో ప్రధానమైన చెట్ల కాండాలకు ఆ స్టిక్కర్లను అతికిస్తూ ముందుకు సాగుతోంది. తిరిగొచ్చేటప్పుడు ఇవే స్టిక్కర్లు అడవిలోంచి బయటపడే మార్గం చూపిస్తాయి. ఒకవేళ చీకటిగా వుంటే టార్చి వేస్తే రేడియం పూత వల్ల అవి మెరుస్తాయి.స్టిక్కర్ల ధ్యాసలో పడి రీటా నేలపై ఆకుల కింద దాగివున్న ఓ పాము తోకని తొక్కేసింది. ఆ పాము బుస్సుమంటూ లేచి ఆమె పాదాన్ని కరిచి పారిపోయింది. అయితే రీటా మోకాళ్ళ వరకూ రక్షణ నిచ్చే జంగిల్‌ షూస్‌ ధరించి వుండటంతో ఆమెకేం కాలేదు. ఇలా మరోసారి జరక్కూడదని ఆమె బ్యాగులోంచి ఓ వస్తువుని బయటకు తీసింది. జానెడు పొడవున్న ఫోల్డింగ్‌ స్టిక్‌ అది. దాని లాక్‌ తియ్యగానే అది నాలుగడుగుల వాకింగ్‌ స్టిక్‌లా మారిపోయింది. దానితో నేలపై చప్పుడు చేస్తూ ముందుకు సాగింది.సుమారు మూడు గంటల అన్వేషణ తర్వాత రీటా వెదుకుతున్న అరుదైన పక్షి ఆమె కంటపడింది. ఇంతకుముందు ఇలాంటి పక్షిని ఆమె అమేజాన్‌ అడవుల్లో మాత్రమే చూసింది. దాంతో ఇది అంతరిస్తున్న జాతి పక్షిగా భావించింది. ఇప్పుడది భారత అడవుల్లో కన్పించటంతో ఆమెకెంతో ఆనందం కలిగింది. ఆ పక్షిని పలుకోణాల్లో ఫొటోలు తీసి ముందుకు కదిలింది. మరో చోట ఇంకో అరుదైన పక్షి కన్పించింది. తర్వాత రెండు కొత్తజాతి కీటకాలు దర్శనమిచ్చాయి. వాటిని ఆమె ఇంకెక్కడా చూడలేదు. ఆమె ఉత్సాహంగా వాటన్నిటి ఫొటోలు తీసి ల్యాప్‌ట్యాప్‌లో వివరాలు నమోదు చేసింది.
అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయాక ఇక వెనుదిరగాలనుకుంది. ఆకలిగా వుంటే ఓ చెట్టు కింద కూర్చుని బ్యాగులోంచి డ్రై ఫ్రూట్స్‌ తీసి తిని మినరల్‌ వాటర్‌ తాగింది. అంతలో చెట్టు వెనక నుంచి ఓ నల్లటి ఆకారం తనని గమనించటం చూసింది. నిప్పురవ్వల్లాంటి దాని కళ్ళను చూడగానే అది ఎలుగుబంటి అని ఇట్టే పసిగట్టింది. రీటా బెదరలేదు. ఎలుగుబంట్లని చూడ్డం ఆమెకిదే కొత్త కాదు. తెల్లటి ధృవపు ఎలుగుబంట్లు, గోధుమరంగులో వుండే అలస్కా ఎలుగుబంట్లని దగ్గరినుంచి చూసిన అనుభవముంది. అయితే నల్ల ఎలుగుబంటి కళ్ళని చూడగానే అది బాగా ఆకలిమీద వుందని అర్థమైంది. ఈ స్థితిలో అది తనపై దాడి చేసే అవకాశం ఉండటంతో వెంటనే బ్యాగుల్ని తీసుకుని అక్కడ్నుంచి కదిలింది. ఎలుగుబంటి ఆమె వెంటపడింది.రీటా భయంతో పారిపోలేదు. అలా చేస్తే అది మరింత ధైర్యంగా దాడి చేస్తుంది. తన ప్రత్యర్థి బలశాలి అనీ, ఎదురుదాడి చెయ్యగలదనీ దాన్ని నమ్మించాలి. అప్పుడది వెనక్కి తగ్గుతుంది. రీటా ఇదే సూత్రం పాటిస్తూ గట్టిగా అరిచి ఎదురుదాడి చేస్తున్నట్టు నటించింది. ఎలుగుబంటి ఒక్క క్షణం వెనకడుగు వేసింది. తర్వాత హఠాత్తుగా రీటాపైకి దూసుకొచ్చింది. అందుకు సిద్ధంగా వున్న రీటా మెరుపులా పక్కకి జరిగి చేతిలోని బ్యాగుతో దాని మూతిపై గట్టిగా బాదింది. అది తేరుకునేలోగా బ్యాగులోంచి ఓ బాటిల్‌ తీసి ఎలుగుబంటి మూతిపై పడేలా స్ర్పే చేసింది. దానివల్ల కళ్ళు మండటంతో ఎలుగుబంటి కీచుగా అరుస్తూ చిందులేసింది. దాని శరీరం తగిలి రీటా చేతిలోని బాటిల్‌ ఎక్కడో పడిపోయింది.
ఆ కెమికల్‌ ప్రభావం తగ్గేలోగా ఎలుగుబంటికి దూరంగా వెళ్ళిపోవాలని రీటా వెంటనే పరుగు లంకించుకుంది. కాస్సేపు పరిగెత్తాక ఆమెకు స్టిక్కర్ల సంగతి గుర్తుకొచ్చింది. తను స్టిక్కర్లు అంటించిన చెట్లకు దూరంగా వచ్చేసిందని ఆమెకు అర్థమైంది. ఇప్పుడీ అడవిలో తానొచ్చిన దారి వెతుక్కోవటమంటే గడ్డి వాములో సూదిని వెదకటం లాంటిదే. స్టిక్కర్‌ వేసిన ఒక్క చెట్టు కనపడినా చాలు దాని సీరియల్‌ నంబర్‌ని బట్టి దారి కనుక్కోవచ్చు. కాని వేల సంఖ్యలో వున్న చెట్ల మధ్య స్టిక్కర్‌ వేసిన చెట్టు కన్పిస్తుందన్న నమ్మకం లేదు. దాన్ని వెతకటం కన్నా వేరే మార్గంలో అడవినుంచి బయటపడే ప్రయత్నం చెయ్యటం మేలనుకుంది రీటా.అప్పుడే తన భుజం దగ్గర మంటగా అన్పించి చేత్తో తడిమి చూసింది. ఎలుగుబంటి దాడి చేసినప్పుడు దాని గోళ్ళు తగిలి భుజం మీది చర్మం గీరుకుపోయింది. ఆమె వెంటనే తన బ్యాగులోంచి మెడికల్‌ కిట్‌ తీసి గాయాలకు మందు పూసి టేప్‌ అతికించింది. యాంటీ సెప్టిక్‌ మాత్రలు వేసుకొని మళ్ళీ నడక మొదలెట్టింది.
్‌్‌్‌రీటా సాయంత్రం వరకూ నడిచినా అడవినుంచి బయటపడలేదు. బయల్దేరిన చోటికే తిరిగి వస్తున్నట్టనిపించింది. ఇక ఆ రాత్రి అడవిలోనే గడపక తప్పదనుకుంది.చీకటి పడకముందే అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలి. అడవిలో త్వరగా చీకటి పడుతుంది. అందుక్కారణం ఆకాశం కనపడకుండా దట్టంగా చెట్లు ఉండటమే. చీకటి పడగానే క్రూరమృగాలు వేటకు బయల్దేరతాయి. విష సర్పాలు, పురుగు, పుట్ర స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉంటాయి. వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది.వీటన్నిటి నుంచీ రక్షణ నిచ్చే వస్తువును తన బ్యాగుంలోంచి బయటికి తీసింది రీటా. ఓ ఇటుక అంత చిన్నగా మడిచి ఉన్న ఓ ప్లాస్టిక్‌ గుడారమది. దీనికున్న పైపులోకి గాలి వూదితే పది నిమిషాల్లో ఓ మనిషికి సరిపోయే చిన్న గుడారంగా మారుతుంది. కింది భాగం మెత్తటి పరుపులా వుంటుంది. దీనికి నాలుగువైపులా ఉండే ట్వైన్‌ దారాలతో దీన్ని కదలకుండా చెట్లకు కట్టొచ్చు. లోపలికి దూరి దీని జిప్‌ వేసేస్తే పురుగు పుట్రా లోపలికొచ్చే అవకాశమే ఉండదు. గాలి ఆడటానికి చిన్న చిన్న రంధ్రాలుంటాయి.రీటా అడవిలో రెండు చెట్ల మధ్య ఎత్తుగా వున్న ఓ ప్రదేశం చూసి ఈ గుడారం వేసింది. మరోసారి డ్రైఫ్రూట్స్‌తో కడుపు నింపుకుని బ్యాగులతో సహా టెంట్‌లోకి దూరి నిద్రకు ఉపక్రమించింది. తీవ్రమైన అలసట వల్ల పడుకోగానే ఆమెకు నిద్ర పట్టింది.అర్థరాత్రి వేళ హఠాత్తుగా మేల్కొంది. ఉరుములు, మెరుపులతో కుండపోత కురుస్తోంది. టార్చి వెలిగించి చూసింది. టెంట్‌కి అటుపక్క వర్షపు నీళ్ళు వరదలా పారుతున్నాయి. టెంట్‌ మిట్ట మీద కాకుండా పల్లంలో వేసి వుంటే ఈపాటికి వరదలో కొట్టుకు పోయేది.
అంతలో అనూహ్యంగా ఆమె పక్కన గల చెట్టుపై పిడుగు పడి చెట్టుకి నిప్పంటుకుంది. ఆ వేడికి గుడారం మైనంలా కరిగిపోయింది. క్షణాల్లో రీటా తడిసి ముద్దయింది.అదృష్టవశాత్తూ కాస్సేపట్లోనే వర్షం ఆగిపోయింది. అయితే ఓ పక్క చలి, మరో పక్క పురుగు పుట్రా రీటాని రాత్రంతా ఇబ్బంది పెట్టాయి. తెల్లవారగానే తడి బట్టలు విప్పేసి బ్యాగులోని పొడి బట్టల్ని ధరించింది, ఆకలేస్తుంటే మిగిలిన డ్రైఫ్రూట్స్‌ తినేసి బయల్దేరింది. దారిలో చూస్కోకుండా ఓ చెట్టు కొమ్మను తాకటంతో దానిపై చుట్ట చుట్టుకొని వున్న నాగుపాము కాటేసింది. నొప్పి తాళలేక చెయ్యి పట్టుకుని వున్నచోటనే కూలబడింది. వెంటనే మెడికల్‌ కిట్‌ తీసి యాంటీ వీనమ్‌ మందుని బాడీలోకి ఇంజెక్ట్‌ చేసుకుంది. కాస్సేపటి తర్వాత నొప్పి తగ్గింది. మెల్లగా లేచి నడక మొదలెట్టింది.ఆకలేస్తే తినటానికి తిండి లేదు. చీకటి పడితే పడుకోవటానికి టెంట్‌ లేదు. అందువల్ల ఎలాగైనా ఆ రోజు అడవిలోంచి బయటపడాలనుకుంది. కాని సాయంత్రం వరకూ నడిచినా నిరాశే మిగిలింది. ఇక మరోరాత్రి అడవిలోనే గడపక తప్పదనిపించింది రీటాకి.
ఆకలికి తట్టుకోలేక ఓ చెట్టుకు కాసిన అడవి పళ్ళు భుజించింది. అవి చేదుగా వున్నా ఎలాగోలా కడుపు నిండింది. ఓ సెలయేటి నీళ్ళు తాగింది. చీకటి పడేలోగా పడుకునే ఏర్పాట్లు కూడా చేసుకుంది. బ్యాగులో వున్న కత్తితో చిన్న చెట్ల కొమ్మలు నరికి ఓ మిట్టమీద చిన్న గుడిసె లాంటిది కట్టుకుంది. వర్షపు నీరు కిందికి జారిపోయేలా పైభాగాన్ని ఆకులతో కప్పేసింది. జంతువులు, పురుగు పుట్రా దగ్గరికి రాకుండా, గుడిసె ముందు ఎండు కట్టెలతో మంట వేసింది. మంట మండుతుంటే ధైర్యంగా గుడిసెలో నడుం వాల్చింది.అర్థరాత్రి తర్వాత వర్షం పడటం వల్ల రీటా మేల్కొంది. మంట ఆరిపోయింది. వర్షం ఆగాక ఆమె మళ్ళీ మంట పెట్టాలని బయటికి రాబోయి హఠాత్తుగా ఆగిపోయింది. ఎవరో మెల్లగా అడుగులేస్తూ గుడిసెను సమీపిస్తున్నారు. ఆమె గుండె దడదడలాడింది. గుడిసెలోంచి తొంగి చూసింది. చీకట్లో రెండు కళ్ళు మెరిశాయి. ఆ కళ్ళు చిరుతపులివని ఇట్టే గ్రహించింది. వెంటనే టార్చి అందుకుని వెలిగించింది. హఠాత్తుగా వెలుతురు చూసిన చిరుత ఓ అడుగు వెనక్కేసింది. తన పాచిక పారినందుకు సంతోషిస్తూ రీటా వెలుతురు సూటిగా చిరుత కళ్ళపై పడేలా టార్చిని పట్టుకుంది. అడవి జంతువులు సామాన్యంగా రాత్రిపూట వెలుతురు చూసి భయపడతాయి. ఇప్పుడూ అదే జరిగింది. చిరుత దూరంగా వెళ్ళిపోయింది. కాని టార్చి ఆర్పేస్తే అది మళ్ళీ వస్తుందని రీటాకి తెలుసు. అందువల్ల మళ్ళీ మంట పెట్టాలనుకుంది. కాని కట్టెలు బాగా తడిసి పోవటం వల్ల లైటర్‌తో మండించినా అంటుకోలేదు.
రీటా గత్యంతరం లేక టార్చిని అలాగే ఉంచింది.ఓ గంట తర్వాత బ్యాటరీ డౌన్‌ కావటంతో టార్చి ఆరిపోయింది. కాస్సేపటి తర్వాత చిరుత మళ్ళీ వచ్చింది. రీటాకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అంతలోనే ఆమె తలలో ఫ్లాష్‌ వెలిగింది. వెంటనే కెమెరా తీసుకుని చిరుతపై ఫోకస్‌ చేసి చకచకా క్లిక్‌ చెయ్యసాగింది. జిగేల్మంటున్న ఫ్లాష్‌ కె మెరా మెరుపులకి బెదిరిన చిరుత అక్కడినుంచి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగిరాలేదు. రీటా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అయినా ఆ రాత్రి మళ్ళీ పడుకోలేదు.తెల్లవారక ముందే మరో ఆపద ముంచుకొచ్చింది. దగ్గిర్లోంచి పులి గాండ్రింపు వినపడింది. దాంతో అడవిలో కలకలం రేగింది. ఒక్కసారిగా జంతువులన్నీ చెరో దిక్కుకు పరుగెత్తసాగాయి. పులి తను వున్న వైపే వస్తోందని రీటాకి అర్థమైంది. ఒక్కక్షణం ఆలస్యం చెయ్యకుండా అన్నీ వదిలేసి తనూ ఓ జంతువులా చీకట్లో గుడ్డిగా పరుగు దీసింది. దాంతో కాళ్ళకు తీగలు అడ్డుపడటంతో నేలపై పడిపోయింది. అక్కడ భూమి ఏటవాలుగా వుండటంతో దొర్లుకుంటూ ఓ లోయలోకి జారిపోయింది. భయంతో ఆమెకు స్పృహ తప్పింది.
్‌్‌్‌ముఖం మీద ఎండ పడి చురుక్కుమనేసరికి స్పృహలోకి వచ్చింది రీటా. అదొక చిన్న లోయ. ఎదురుగా ఓ కాలువ ప్రవహిస్తోంది. రీటా లోయలోకి జారిన దారి అంతటా మెత్తటి గడ్డి మొలిచి వుండటంతో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. తాత్కాలికంగా పులి ప్రమాదం నుంచి బయట పడినా తనింకా అడవిలోనే వుంది, అడవి నుంచి బయటపడితేనే తనకు మోక్షం అనుకుంది.ఇప్పుడామెకు ఆకలితో కడుపు నకనకలాడుతోంది. కాలువ వొడ్డున పలురకాల పురుగులు, కీటకాలు కన్పించాయి. ఆమె సహచరులైతే ఇలాంటి స్థితిలో ఆ పురుగుల్ని చంపి పచ్చిగానే తినేసి ప్రాణం నిలబెట్టుకుంటారు. కాని రీటా శాఖాహారి. జీవహింసను ఇష్టపడదు. పైగా ఆమె తండ్రి ఓ సాంప్రదాయవాది. ఆమెపై తండ్రి ప్రభావం కూడా ఉంది. కానీ ఇప్పుడున్న స్థితిలో ఆమె బతికి వుండాలంటే ఏదో ఒకటి తినక తప్పదు. ఆమె అడవిపళ్ళు కోసం వెదికింది. కాని అక్కడ అలాంటి చెట్లేవీ కనపడలేదు. చివరికి కాలువ ఒడ్డున మొలచిన ఓ రకం గడ్డిని సేకరించింది. దాన్ని నీళ్ళతో శుభ్రంగా కడిగి తినేసింది. అక్కడ వున్న ఓ రకం ఆకుల్ని కూడా భుజించింది.ఎలాగోలా కడుపు నింపుకున్నాక కర్తవ్యం గురించి ఆలోచించింది. జేబులు తడుముకుంటే వెనక జేబులో లైటర్‌ వుందని తెలిసింది. ఒంటిమీది బట్టలు కాకుండా ఇప్పుడామె వద్ద మిగిలివున్న వస్తువు అదొక్కటే.
ఆమె వెంటనే లేచి కాలువ ప్రవహిస్తున్న దిక్కులో నడక మొదలెట్టింది. ప్రతి కాలువ ఏదో ఒక నదిలో కలుస్తుంది. నది వెంబడి ప్రయాణిస్తే అడవి దాటవచ్చు. ఇదే ఆశతో ఆమె వడివడిగా నడుస్తూ మధ్యాహ్నానికి నది దగ్గరికి చేరుకుంది. కాని ఆ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డు కూడా ఎత్తుగా ఉంది. నదిలో మొసళ్ళు తిరుగాడుతున్నాయి. ఆ నదిలో ఈదటమంటే కొరివితో తల గోక్కోవటమే అన్పించింది.రీటా నిరాశగా వెనుదిరిగి ఓ చెట్టు కింద కూర్చుని విరక్తిగా ఆకాశం కేసి చూడసాగింది. అప్పుడే ఆకాశంలో ఓ విమానం వెళుతూ కన్పించింది. వెంటనే ఆమెకొక విషయం స్ఫురించింది. తను అడవిలో తప్పిపోయి రెండ్రోజులైంది. ఈపాటికి తనకోసం అన్వేషణ మొదలై వుంటుంది. ఏదైనా హెలికాప్టర్‌ తనని అన్వేషిస్తూ ఇటువైపు రావచ్చు. తను ఇక్కడున్న సంగతి వాళ్ళకు తెలియాలంటే తను ఏదో ఒక రకంగా వాళ్ళ దృష్టి నాకర్షించాలి. ఈ ఆలోచన రాగానే రీటా లేచి ఎండుపుల్లలు, కట్టెల్ని సేకరించి కుప్పగా పోసి లైటర్‌తో నిప్పంటించింది. తర్వాత ఆ మంటపై పచ్చి ఆకుల్ని కప్పింది. దాంతో పెద్ద ఎత్తున పొగ లేచి ఆకాశం వైపు సాగిపోయింది. దట్టమైన అడవులు, నిర్జన దీవులు, కొండలు, ఎడారుల్లో తప్పిపోయిన వారు ఇలాగే చేస్తారు. హెలికాప్టర్లలో, బైనాక్యులర్స్‌ ద్వారా అన్వేషిస్తున్న వారికి ఎంతో దూరం నుంచి ఈ పొగ కనబడుతుంది. ఇప్పుడు రీటా కూడా అదే ఆశతో పొగబెట్టి హెలికాప్టర్‌ కోసం ఆశగా ఎదురు చూడసాగింది.
హెలికాప్టర్‌ రాలేదు. చీకటి పడేవరకూ ఆమె పొగబెడుతూనే ఉంది. ఆమెలో ఓపిక నశించింది. మరో ఆలోచన లేకుండా ఉన్నచోటనే పడుకుని నిద్రపోయింది. రాత్రంతా దోమలు కుట్టాయి. పురుగులూ, కీటకాలు సతాయించాయి. అడవిలోని జంతువులు అరుపులు, నక్కల ఊళలు, పులి గాండ్రింపులు విన్పించాయి. అయినా ఆమె భయపడలేదు. దేవునిపై భారం వేసి అలాగే పడుకుంది. అర్థరాత్రి దాటాక నిద్ర పట్టింది. తెల్లవారినా మెలకువ రాలేదు.ఎవరో ఎండుటాకులపై నడుస్తున్న చప్పుడు విన్పిస్తే మేల్కొంది రీటా. తనని రక్షించటానికి ఎవరో వస్తున్నారని ఆశగా కళ్ళు తెరిచి చూసింది. కాని వస్తున్నది మనిషి కాదు, ఓ పెద్ద పులి!రీటా గుండె ఆగినంత పనయింది. పారిపోయే అవకాశం లేదు. పులిని ఎదుర్కోవటం అసాధ్యం. కనీసం దాన్ని భయపెట్టే చిన్న ఆయుధం కూడా తనవద్ద లేదు. అడవిలోకి ప్రవేశించకముందే తన రివాల్వర్‌ని అధికారులకు అప్పగించింది. ఇప్పుడు తన పని ముగిసినట్లే. ఇంతా చేసి చివరికి తనొక పులికి ఆహారం కాబోతోంది. ఆమెకు తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. రాబర్ట్‌ గుర్తొచ్చాడు. తన గురువు గుర్తొచ్చాడు. ఆయన మాటలు గుర్తొచ్చాయి. ‘క్రూర జంతువులు ఆహారం కోసం లేదా రక్షణ కోసం మాత్రమే దాడి చేస్తాయి, మనిషిలాగ వినోదం కోసం దాడి చెయ్యవు. చలనం లేని మనిషిని సామాన్యంగా అవి ముట్టుకోవు’రీటా చప్పున కళ్ళు మూసుకుంది. ఊపిరి బిగబట్టి నిశ్చలంగా వుండిపోయింది. పులి ఆమెను సమీపించి వాసన చూసింది. ఆమెలో కదలిక లేకపోవటంతో తన కాళ్ళతో ఆమె శరీరాన్ని తట్టింది. పక్కకి దొర్లించింది. అయినా రీటా కదల్లేదు. పులికి ఏమనిపించిందో గాని ఆమెకి కొద్దిదూరంలో నేలపై కూర్చుంది.
అటూ ఇటూ చూస్తూ మధ్యలో రీటాని గమనిస్తోంది. కనురెప్పల సందుల్లోంచి ఇదంతా చూసిన రీటాకి తను ఏమాత్రం కదిలినా పులి తనమీద దాడి చేస్తుందని అర్థమైంది.సరిగ్గా అప్పుడే ఆకాశంలో హెలికాప్టర్‌ ఎగురుతున్న చప్పుడు వినిపించింది. ఉద్వేగంతో రీటా గుండె వేగంగా కొట్టుకుంది. అది ఖచ్చితంగా తనని అన్వేషిస్తున్న హెలికాప్టరే. అది అడవిపై చక్కర్లు కొడుతోంది. కాని తనొక చెట్టుకింద వున్నందువల్ల హెలికాప్టర్‌లోని వారికి కన్పించదు. తను ఇక్కడున్న సంగతి వారికి తెలియాలంటే ఆకాశంలోకి లేచేలా మళ్ళీ పొగబెట్టాలి. నిన్న పెట్టిన మంట ఆరిపోయింది. మళ్ళీ పెట్టాలి. కాని తను కదిల్తే చాలు పులి కబళించటానికి సిద్ధంగా వుంది. ఇప్పుడెలా? తన పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. ఈ పులి త్వరగా వెళ్ళిపోతే బావుణ్ణు అని రీటా మనసులోనే దేవుణ్ణి వేడుకుంది.
ఆమె మొర దేవుడు విన్నాడు. హెలికాప్టర్‌ శబ్దానికి విసుగు పుట్టిందేమో పులి లేచి మెల్లగా అడవి లోపలికి వెళ్ళిపోయింది. కాని అదే సమయంలో హెలికాప్టర్‌ కూడా వెనుదిరిగింది. అది గమనించిన రీటా దిగ్గున లేచి నిల్చుంది. హెలికాప్టర్‌లోని వారి దృష్టి నాకర్షించాలని వెంటనే తను ధరించిన చొక్కా విప్పి గాలిలో వూపుతూ గట్టిగా అరిచింది.‘‘హెల్ప్‌... హెల్ప్‌... ఐయామ్‌ హియర్‌... నన్ను కాపాడండి’’ అంటూ ఆమె పిచ్చి పట్టినట్టు అరుస్తున్నా హెలికాప్టర్‌లోని వ్యక్తులు ఆమెను చూడలేదు. అయితే ఆ కేకలకు అడవిలో కెళ్ళిన పులి మాత్రం తిరిగొచ్చింది. రీటాని చూసి భీకరంగా గాండ్రించింది.రీటా ఇక ఆలోచించలేదు. చావో రేవో తేల్చుకోవాలని పులికి వ్యతిరేక దిశలో వేగంగా పరుగు తీసింది. పులి ఆమెను వెంటాడింది. స్వతహాగా రన్నింగ్‌ ఛాంపియన్‌ అయిన రీటా తన శక్తినంతా కూడదీసుకుని పరిగెడుతోంది. ఆమెకీ పులికీ మధ్య దూరం క్షణక్షణానికీ తగ్గుతోంది. ఇక పులి తనను దొరకబుచ్చుకుంటుందన్న క్షణంలో ఆమె హఠాత్తుగా యు టర్న్‌ తీసుకొని వెనక్కి మళ్ళింది. పులులు వున్నఫలాన వెనక్కి మళ్ళలేవని ఆమెకు తెలుసు. ఆమెలాగ వేగాన్ని నియంత్రించి వెనక్కి మళ్ళలేకపోయిన పులి బ్యాలెన్స్‌ తప్పి ఓ చెట్టుకు గుద్దుకుంది.పులుల కన్నా వేగంగా పరుగెత్తలేని కుందేళ్ళు ఇలా హ ఠాత్తుగా వెనుదిరిగి పులిని బోల్తా కొట్టిస్తాయి. బ్రెజిల్‌లో తన గురువు వద్ద నేర్చుకున్న ఈ విద్య ఇప్పుడు రీటాకి ఉపయోగపడింది. కాని ఇంకా గండం గడవలేదు. ఖంగుతిన్న పులి భీకరంగా గాండ్రిస్తూ రీటామీదికి దూసుకొచ్చింది. అయితే అప్పటికే నది ఒడ్డుకు చేరుకున్న రీటా పులి తనని అందుకునేలోగా నదిలోకి దూకేసింది.
ఆ నదిలోకి దూకటమంటే పెనం మీంచి పొయ్యిలోకి దూకటమేనని రీటాకి తెలుసు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నది నుంచి ఒడ్డుకు చేరటం కష్టం. పైగా అందులో ప్రమాదకరమైన మొసళ్ళున్నాయి. అయినా రీటాకి మరో దారిలేదు. చావో రేవో ఆ నదిలోనే తేలిపోవాలి. ఆమె ఈదటానికి ఎంత ప్రయత్నించినా తన ప్రమేయం లేకుండా వరదలో కొట్టుకు పోసాగింది. అది చాలదన్నట్టు ఓ మొసలి ఆమె వెంట పడింది. అది రీటాని పట్టుకోబోయినప్పుడల్లా ప్రవాహ ఉధృతి ఆమెను దాని నోటికి చిక్కకుండా చేస్తోంది. అయితే ఇలా ఎంతోసేపు తను సురక్షితంగా వుండలేనని రీటాకి తెలుసు. అంతలో ఆమె భయపడిందే జరిగింది. మొసలి ఆమె ఎడం కాలును పట్టుకుంది. రీటా తన శక్తినంతా కూడదీసుకుని కుడికాలితో దాని మూతిమీద కొట్టింది. మొసలి పట్టు వదిలింది. అప్పుడే ఓ పెద్ద అల రీటాని ఒడ్డుకి దగ్గరగా విసిరేసింది. ఆమె వెనకనే మొసలి వుంది. ఆ ప్రవాహంలో ఒడ్డెక్కటం అసాధ్యం. కాని ఒడ్డుమీంచి నదిలోకి వంగి ఉన్న ఓ చెట్టు కొమ్మ రీటాకి కన్పడింది. ప్రాణాలతో బయటపడడానికి ఆమెకదే చివరి ఆధారం. కొమ్మ దగ్గరికి రాగానే తనలో మిగిలి వున్న శక్తినంతా వుపయోగించి నీటిలో నుంచి కొమ్మవైపు ఎగిరింది. ఆమెను అందుకోవటానికి మొసలి కూడా ఎగిరింది. అరక్షణం తేడాలో మొసలి గురి తప్పింది. రీటా కొమ్మని పట్టుకోగలిగింది. వెంటనే ఉత్సాహంగా కొమ్మనుండి చెట్టుపైకి కోతిలా ఎగబాకింది. తర్వాత మెల్లగా చెట్టు దిగి నేలపైౖ కాలు మోపింది. కాని మొసలి ఎడమకాలుని గాయపర్చినందువల్ల నేలపై నిలబడలేక పాక్కుంటూ ముందుకు వెళ్ళసాగింది.
అరగంట అలా పాక్కుంటూ వెళ్ళాక ఓ చోట ఆమె చేతులకు మట్టిరోడ్డు తగిలింది. సంతోషంతో ఆమెకు ఎగిరి గంతెయ్యాలన్పించింది. అక్కడ రోడ్డు వుందంటే అది అడివి కాదు, మనుషులు తిరుగాడే ప్రాంతం. తను అడవి నుంచి బయటపడింది. ఇక తన ప్రాణాలకేం ముప్పులేదు అని నిశ్చింతగా గాలి పీల్చుకుంది.అప్పుడే దూరం నుండి ఎవరివో మాటలు విన్పించాయి. మనుషుల గొంతు వినపడగానే ఆమెలో వుత్సాహం వురకలేసింది. వెంటనే మోకాళ్ళపై లేచి నిల్చుని ‘‘హలో.. ఐయామ్‌ హియర్‌... నన్ను రక్షించండి’’ అంటూ కేకలేసింది. అది విని ముగ్గురు వ్యక్తులు అక్కడికొచ్చారు. దుస్తుల్ని బట్టి వాళ్ళు అటవీ శాఖకు చెందినవారని తెలుస్తోంది. వాళ్ళామెను ఆశ్చర్యంగా చూశారు
. రీటా సంతోషం పట్టలేక ఏడుస్తూ తను ఎలా క్రూరమృగాలతో పోరాడి అడవి నుంచి బయటపడిందో వారికి వివరించసాగింది. కాని వాళ్ళు ఆమె మాటల్ని వినకుండా ఆమెకేసి ఆకలిగా చూడసాగారు. వాళ్ళ చూపులు ఎక్కడున్నాయో గ్రహించిన రీటా రెండు చేతుల్తో తన ఎదను కప్పుకుంది. ప్రాణాలతో బయట పడ్డాననే సంతోషంలో తన ఒంటిపై చొక్కా లేదనే సంగతి కూడా ఆమె మర్చిపోయింది. లోపల ధరించిన బనియను సైతం చిరిగిపోయింది.ఆ ముగ్గురు యువకులు ఒకరివైపొకరు చూసుకుని వెకిలిగా నవ్వుకున్నారు. వాళ్ళ ధోరణి రీటాకి అంతుబట్టలేదు. ముగ్గురూ ఆమెను సమీపించారు.
వారేం చెయ్యబోతున్నారో రీటా అర్థం చేసుకునేలోగానే ఇద్దరు ఆమె రెండు చేతుల్ని ఒడిసి పట్టుకున్నారు. మూడోవాడు ఆమె ఎదపై మిగిలివున్న బనియన్‌ని లాగి దాన్ని ఆమె నోట్లో కుక్కేశాడు. తర్వాత ముగ్గురూ ఆమెపై విరుచుకు పడ్డారు. రీటా పెనుగులాడింది. ఒకేసారి తనపై ఎలుగుబంటి, పులి, మొసలి కలిసి దాడి చేసినట్టు విలవిల్లాడింది. మొదటిసారి ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజల రాలాయి. నోరు లేని క్రూర జంతువులతో పోరాడి గెలిచిన ఆ ధీర వనిత నోరున్న క్రూరమృగాల చేతిలో బలైపోయింది. తమ పాశవిక వాంఛల్ని తీర్చుకున్న తర్వాత ఆ ముగ్గురు దుర్మార్గులు ఆమె మెడలో వున్న బంగారం చైను గుంజుకున్నారు. చేతి వేలికున్న డైమండ్‌ రింగ్‌ బయటికి రాకపోతే వేలు నరికి తీసుకున్నారు. ఆమె ప్రాణాలతో వుంటే తమ బండారం బయట పెడుతుందని ఆమెను గొంతు పిసికి చంపేశారు. తర్వాత ఆమె ఆనవాళ్ళు కూడా చిక్కకూడదని రీటా శరీరాన్ని నదిలోని మొసళ్ళకి ఆహారంగా పడేశారు.తర్వాత అన్వేషకులకు ఆమె అవశేషాలు కూడా చిక్కలేదు. ఆమె అడవిలోని క్రూరమృగాలకు బలై వుంటుందనుకున్నారంతా.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 29-08-2022, 07:46 PM
RE: ఆకాశంలో సగం - by Pallaki - 02-09-2022, 08:27 PM
RE: ఆకాశంలో సగం - by Tammu - 02-09-2022, 08:39 PM
RE: ఆకాశంలో సగం - by Manoj1 - 02-09-2022, 11:36 PM
RE: ఆకాశంలో సగం - by Chutki - 03-09-2022, 07:20 AM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:32 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:46 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:47 PM
RE: నేను చదివిన కధలు - by k3vv3 - 07-09-2022, 06:36 PM



Users browsing this thread: 2 Guest(s)