Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కధలు
#12
జ్ఞాపిక
చిరంజీవి వర్మ
వారానికి ఒకటి రెండు సార్లయినా మా ఫ్రెండ్ ప్రశంస వాళ్లింటికి వెళ్తుంటాను. కానీ వాళ్ల డాడీ గదిలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. సంక్రాంతి దగ్గరపడుతోంది. ఆంటీ ఫ్లాటంతా దులిపి శుభ్రం చేసుకుంటూ వుండడంతో, ఇన్నాళ్ళకి నాకు ఈ అవకాశం దొరికింది.
టెరేస్ మీది ఆ విశాలమైన గదిలో ఓ పెద్ద రాతబల్ల. దానివెనక గిర్రున తిరిగే కుర్చీ. బల్లమీద ఓ లేప్‌టాప్. దాని పక్కనే కొట్టొచ్చినట్టు కనపడుతోంది ‘అది’! చూడ్డానికి సగం కోసేసిన ప్లవర్ వాజ్‌లా వుంది. దాని నిండా రకరకాల సైజుల్లో చెక్కేసిన రంగురంగుల పెన్సిళ్ళు, బ్లాక్ కలర్ క్రేయాన్స్ వున్నాయి. అది నలుపా? లేక నాచు రంగా? అదీ కాకపోతే ముదురాకుపచ్చా? ఇదీ అని చెప్పలేని అదేదో రంగుతో వున్న ‘దాన్ని’ ముందు ఏదో పింగాణీ వస్తువు అనుకున్నాను. చేతిలోకి తీసుకొనేటప్పటికి చాలా తేలికగా వుంది. వేలితో కొట్టి చూస్తే దృఢంగా వుండి టంగ్ టంగ్‌మంటోంది. అది ఏ లోహమో నాకు అర్థం కాలేదు.
గదిలో, ఎత్తయిన తెల్లటి గోడలనిండా చిన్నపిల్లలు గీసినట్టు నాలుగు వైపులా నల్లటి అల్లిబిల్లి బొమ్మలు.
“ఇదేంటే, ఈ పిచ్చి పిచ్చి బొమ్మలు! నువ్వూ మీ అన్నయ్యా చిన్నప్పుడు పోటీపడి గీసి పారేశారా?”
“ష్ ఇవి, మా డాడీ గీసుకున్న భావ చిత్రాలు!” చెప్పింది ప్రశంస లేప్‌టాప్ ఆన్ చేస్తూ.
“చిత్రాల్లో బావచిత్రాలు, మరదలిచిత్రాలు కూడా వుంటాయా?”
“నీ మొహం! బావ చిత్రాలు కాదు, భావ చిత్రాలు. బా-ని వత్తి పలుకు
ఏ యాంగిల్లోంచి చూసినా నాకు ఆ భావచిత్రాలు అభావంగానే కనిపిస్తున్నాయి.
“నేనింకా మేధావినవ్వలేదేమోనే. అందుకే ఈ ఆర్టేంటో అర్థంకావడంలేదు. ఇదేదో ఇది కొంచెం కొబ్బరిచెట్టులా కనిపిస్తోందే!” అన్నా, ఓ బొమ్మ దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తూ.
“అవును. అది గోదావరి గట్టున కొబ్బరిచెట్టు. గోదావరి ఆ గోడవతలవుంది. నిజంగానే వుందనుకొని వెళ్ళేవు గనక, జారిపడి చస్తావు!”
“బాప్‌రే! ఇదేంటిది? ఈ తెల్ల సున్నాలో నల్ల మచ్చ!”
“అదా ఓహ్! అది గైడీమపాసాగారి పిల్లి గెడ్డం. అలా చూడు నీ వెనక తుపాకీలా వుంది. అది అదెవరబ్బా? కథయ్యేలోపు గోడమీది తుపాకీ పేలాలంటారు చూడు, ఆయన. ఇదిగో ఈ షేడ్ కింద కొశ్చన్ మార్క్‌లా కనపడుతోందే? ఈ బొమ్మ! ఈయనేమో ఓ’హెన్రీ గారు. ఒక్కొక్క మహానుభావున్నీ ఇలా వెతుక్కోవాలన్నమాట!”
“ఏంటే, గారూ గీరూ అంటూ అంత మర్యాద? వాళ్ళేదో మీ తాతయ్యో మావయ్యో అయ్యినట్టు!”
“ఇదే రాజుల మర్యాదంటే! మా డాడీని మన్నించకపోయినా ఫర్వాలేదు. కానీ, వారిని అలా గౌరవించకపోతే ఆయనకి మహా మండుద్ది!”
“అమ్మో! ఈ మర్యాదలు గిర్యాదలు మన వల్లకాదు. బుర్ర బద్దలైపోతుంది” చేతిలో వున్న’దాని’తో నెత్తి మీద సరదాగా కొట్టుకున్నా. ‘టంగ్’మంది. ఒకటే నొప్పి. బొప్పి కూడా కట్టినట్టుంది.
“ఇదేంటిది? అల్లాద్దీన్ అద్భుతదీపంలా వుంది!” అడుగుతూ నా చేతిలో వున్న ‘దాన్ని’ టేబుల్ మీద పెట్టాను.
“ఒకలా చెప్పాలంటే అలాంటిదే
“అవునా! ఆం బ్రూం బిష్ ” అంటూ మళ్ళీ దాన్ని చేతిలోకి తీసుకొని, నోటికొచ్చిన మంత్రం చదివాను.
“మనం మంత్రం చదివితే రాడు అల్లాద్దీన్, చదివేవాళ్ళు చదవాలి
“ఇంతకీ ఏం మెటీరియలే ఇది? దీని షేప్ ఏంటీ ఇలా వుంది? ఎక్కడ కొన్నారిది? బాగుంది!”
“కొన్నది కాదది. తయారుచేసింది. చెప్పాలంటే అదో పెద్ద కథ. దాని వెనక అంతులేని ఆవేదన వుంది. హృదయాంతరాలలో అది ఘనీభవించి, ఎప్పటికీ పొంగని లావాలా కుతకుతలాడిపోతా వుంది!” ప్రింటర్‌లో అడ్డుపడ్డ పేపర్ని తీస్తూ నాటకీయంగా చెప్పింది ప్రశంస.
“అర్థమయ్యేలా చెబుదూ వెధవ బోడి కవిత్వం నువ్వూనూ!”
“మెంతిబుట్ట అంటారు దీన్ని!”
“యాం బ్బుటా? మెం.తిబు..టా!”
“యస్! మెంతిబుట్ట.”
“ఏదోసారి గూగుల్ చెయ్యి.”
“దాని తయారీ, గూగుల్‌కి కూడా తెలియని ఓ నిగూఢ రహస్యం!”
ఇటీవలే చిరంజీవి ఐదోతరగతి ఉత్తీర్ణుడయాడు. ఊరిలో వున్న ఏకోపాధ్యాయ పాఠశాలతో వాడికి ఋణం తీరిపోయింది. ఉన్నత విద్యనభ్యసించడానికి అతగాడు గ్రామాంతరమవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయి. మేడిశెట్టి చంటిగాడు, బీర రామచంద్రంగాడిలాంటి అనుంగుమిత్రులొచ్చి ‘చినరారు’ కొచ్చిన ఈ హైస్కూల్ అగత్యం గురించి రోజుకోసారైనా వగచుచున్నారు. ‘అంతా దైవ సంకల్పం! విధి విలాసాన్ని ఎవ్వరు తప్పించగలర’ని బరువైన డైలాగులు చెప్పుకుంటూ కళ్లూ ముక్కూ కంబైండ్‌గా తుడుచుకుంటున్నారు.
“బావుగారు తోడు లేకుండా నేనొక్కన్నే బళ్ళోకెలా ఎల్లగలన్రా? అందుకే నేను బడి మానేత్తనాను!” తీవ్రనిర్ణయం తీసుకొని త్యాగానికొడిగట్టేడు చంటిగాడు. ఆ బండెదవ రెండో తరగతి మూడో సంవత్సరం చదువుతున్నాడు.
“అదే మంచిదండి చంటిగారు. ఇక్కడొక మేట్టారి మొట్టికాయలతోనే తల పులిసిపోతంది. ఐసుకూలులో ఐతే రోజుకైదారుగురు మేట్టార్లు వళ్లంతా చీరేత్తారు. అందులో ఒకలో ఇద్దరో పంతులమ్మలు కూడా ఉంటారంట. ఆళ్లకి కోపం వత్తే మంచేత పేలు కూడా చూబించేసుకుంటారంట. బాబుగారెలా తట్టుకుంటారో పాపం! మా బాబొప్పుకోడు కానీ లేపోతే నేనూ బడి మానేసి ఇంచక్కా దూళ్ళు మేపుకుందును.” చంటిగాడికున్న స్వతంత్రం తనకి లేనందుకు చింతించాడు రాంగాడు. ఆ బక్క సన్నాసి, బళ్లో తక్కువా గోళీలాటదగ్గర ఎక్కువా సంచరిస్తుంటాడు.
“అన్నీ ఇంటనాను. ఇచారించింది చాలుకానీ, సిరంజీబారు మీరా డిటేటివు ఉగందర్నందుకోండి. నిన్న సగం సదివొదిలేసారు. ఆ మడ్డరెవరు చేసారో ఏటాని రాత్రి నిద్రోలేదు!” అన్నాడు బొంతు సూరిగాడు అరుగుమీద కూర్చుంటూ.
“బేగా తెండి బాబూ తెండి. మేవూ అందుకోసవే వచ్చేం!” అన్నారు రాంగాడూ చంటిగాడూ ముక్తకంఠంతో.
చిరంజీవి, కొమ్మూరి సాంబశివరావు ‘ప్రాక్టికల్ జోకర్’ పుస్తకం తెచ్చి పైకి గట్టిగా చదవడం మొదలెట్టాడు.
వాళ్ళతో పాటూ దారంటా పోయేవాళ్ళంతా ఆగి, మైమరచిపోయి మరీ వింటున్నారు. ఇంక ఆ పుస్తకం అయిపోయీదాకా వాళ్లు మరి కదలరు.
‘కావ్కావ్
పెరట్లో కరివేపాకు చెట్టుమీద వాలిన కాకి అదే పనిగా అరుస్తోంది.
నాలుగూళ్ళూ తిరిగి, వేసవి సెలవలని ఎంజాయ్ చేసొచ్చిన చిరంజీవి అరుగు మీదనుంచి కాకి అరుపుని సొగబుగా వింటున్నాడు. పెదలంకలో కాకిభాష వాడికి తెలిసినట్టు ఇంకొకడికి తెలీదు.
కాకికి ఆకలేస్తే ‘కావో కావో’ అని, దాహమేస్తే ‘కాహో కాహో’ అని, దానికేదన్నా యాతనొస్తే ‘కేవ్ కేవ్’ అని, అదేమన్నా మనకి చెప్పాలనుకుంటే ‘కకాక్ క్కాక్’ అని, అరుస్తూ వుంటుంది. ఇలా సందర్భాన్నిబట్టి దాని స్లాంగూ, మాడ్యులేషన్నీ మారుస్తూ వుంటుంది. ప్రస్తుతం ఆ వాయసరాజం ‘కకాక్ క్కాక్, కకాక్ క్కాక్’ అని అరవడం చిరంజీవి గమనించాడు. అంటే ఈ కాకి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటోందన్నమాట! కామన్‌గా కాకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ చుట్టాలొస్తారనే. అందుకే, దాన్నే కన్ఫర్మ్ చేసుకున్నాడు.
“అమ్మమ్మా ఎసరెట్టేసారా? ఇంకో సోలడు బియ్యం ఎక్కువ పొయ్యండి. చుట్టాలొస్తున్నారు. మళ్ళీ అప్పటికప్పుడు వండిపెట్టాలంటే మీకే యాతన!” విజయచిత్రలో వర్ధమాన నటుడు చిరంజీవి బొమ్మని ఆరాధనగా చూస్తూ, చెప్పాడు.
“జానకమ్మా, ఇంకో తలగొట్టి తవ్వెడు బియ్యం కడుగు!” బంగారమ్మగారు చిరంజీవి మాటకి విలువిచ్చి పనిమనిషికి పురమాయించారు.
చుట్టాలొచ్చారంటే భలే సరదా చిరంజీవికి. వుట్టి చేతులతో కాకుండా వస్తా వస్తా ఏదో మిఠాయి పొట్లాం తెచ్చి చేతిలో పెడతారు.
ఇప్పుడు చుట్టాలొస్తే ఎవరొస్తారంటావు? కత్తిపూడి నుంచి తాతయ్యా? రాచపల్లి నుంచి హరిగాడా? భూపాలపట్నం నుంచి పెద్దమ్మమ్మా? ఇలా పరిపరివిధాల ఆలోచిస్తున్న వాడు, రామచంద్రపురం నుంచి వెంకన్నయ్యొస్తే బాగున్ను అనుకున్నాడు.
వెంకన్నయ్యొస్తే, పొట్లాలతోపాటూ బోలెడు పుస్తకాలు తెస్తాడు. అదీ వాడి ఆశ. కానీ వెంకన్నయ్య చుట్టం కాదే! ఇంట్లో వాళ్ళు కూడా చాలాకాలం తర్వాత వస్తే చుట్టాలకిందే లెక్క, అని సరిపెట్టేసుకోవడమే కాకుండా వచ్చేది వెంకన్నయ్యేనని గట్టిగా తీర్మానించేసుకున్నాడు కూడా.
“వెంకన్నయ్యొస్తున్నాడు. చిట్టొడియాలూ కోడిగ్రుడ్లూ కూరొండండి. నేనలా తోట చివరకెళ్ళి ములక్కాడలు కోసుకొస్తాను,” చెప్పేడు చిరంజీవి పుస్తకం మూసేసి.
“అలాగని నీకుత్తరం రాసి పడేశాడా? నీకు తినాలనుందని చెప్పొచ్చుగా పోరంబోకని
“ఉట్టిదయితే చూడండి” అని చెప్పి తోటలోకి పోయాడు వాడు.
“సరే. నువ్వు చెట్టెక్కకు. ములగ చెట్టసలే అల్పం, ఉట్టినే విరిగిపోద్ది!” వెనకనుంచి హెచ్చరించారు బంగారమ్మగారు.
కోసుకొచ్చిన ములక్కాడలు వంటపాకలో పడేసిన చిరంజీవి, అబ్బడంగా ఏరుకొచ్చిన తాటిపువ్వారాన్ని మాత్రం వసారాగదిలోకి పట్టుకుపోయాడు. బల్లమీదున్న పిల్లంక పెట్టెల్లోంచి పుస్తకాలని ఒబ్బిడిగా తీసి, ఏ రకానికారకం పొందికగా పేర్చాడు. అవి వాడి క్లాసు పుస్తకాలు కాదు. వెంకన్నయ్య ఊరినుంచి వచ్చినప్పుడల్లా ఇక్కడి వాళ్ళ కాలక్షేపం కోసం తెచ్చిపడేసిన పుస్తకాలు. సినిమారంగం, విజయచిత్ర లాంటి సినిమా పత్రిలతోపాటూ రకరకాల వార, పక్ష, మాస పత్రికలు, కథలు, కవిత్వం, నవలల కలగాపులగం. ఎక్కువగా కొమ్మూరి, కృష్ణమోహన్, టెంపోరావు, భయంకర్, కొవ్వలి, జంపన, గిరిజశ్రీభగవాన్ వంటి వారి డిటెక్టివ్ నవలలే. అన్నిటికీ మించి వాడికిష్టమైన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటివి వందా నూటేభై దాకా వున్నాయి. అన్నిటినీ ఓపిగ్గా తెరచి, అందులో వున్న నెమలి ఫింఛాలకి తాటిపువ్వారాన్ని ప్రేమగా వడ్డించాడు. నెమలి ఫింఛాలేమన్నా పిల్లలని పెట్టాయేమోనని ఆసక్తిగా పరిశీలించి, ఒక పిల్లా పుట్టకపోవడంతో నిరాశతో పుస్తకాలన్నీ మళ్ళీ పెట్టెల్లో సర్దేశాడు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడే ఆ చివర్నుంచి ఈ చివరికి వాడెప్పుడో చదివేశాడు.
జాడీల్లోవున్న ఆవకాయ తీయటానికి ఆ గదిలోకి గిన్నెపట్టుకొని వచ్చిన బంగారమ్మగారు, “ఆ పుస్తకాలన్నీ నియ్యేనేట్రా?” అని ఆశ్చర్యంగా అడిగారు, జాడీకి కట్టున్న గుడ్డని విప్పుతూ.
“నాయీ పూర్ణయ్యీ రామన్నయ్యీ వెంకన్నయ్యీ నర్సిమూర్తియ్యీ, అందరియ్యీని. రెండో మూడో మియ్యి కూడా వున్నాయి లెండి. కార్తీకపురాణం, లలితాసహస్రనామం లాటియ్యి.”
“ఊఁహూఁ. ఎలకలు కొట్టేస్తా ఎక్కడపడితే అక్కడే దొళ్ళీయి. ఏమయిపోయాయా అనుకున్నాను. పెట్టెల్లో పదిలంగానే దాచేవురా ఎదవ సన్నాసని!” అభినందనగా అన్నారావిడ.
ఇంతలోకీ, వీధిలోంచి “సిరంజిబారు, ఆ జగజ్జాన్నిలా పట్రండే మతోగొట్టేత్తంది!” అరిచాడు బొంతు సూరిగాడు.
అది పట్టుకొని సూరిగాడితో పాటూ లంకలోకి పోయిన చిరంజీవికి వెంకన్నయ్య ఇంటికి రావడం తెలియదు.
పొద్దోయాకా ఇంటికొచ్చిన చిరంజీవికి వాకిట్లో కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సుబ్బన్నయ్య, రామన్నయ్య, వెంకన్నయ్యలు కనిపించారు. వెంకన్నయ్యనీ వెంకన్నయ్య ఎప్పట్లాగే తెచ్చిన పుస్తకాలనీ చూసి ఎగిరి గంతేశాడు.
అందరి మాటల మధ్యా రాంపురం రాజగోపాల్ థియేటర్లో వర్ధమాన నటుడు చిరంజీవి నటించిన మనవూరిపాండవులు సినిమా ఆడుతోందని తెలిసి, మర్నాడు వెంకన్నయ్య కూడా రామచంద్రపురం బయలుదేరి పోవటానికి బట్టలు సర్దేసుకున్నాడు.
ఆ ప్రయాణం తనకి అంతులేని వేదనని మిగులుస్తుందని, ఆ క్షణం వాడికి తెలియదు.
అదే కనుక తెలిస్తే ఈ కథే వుండేదికాదు. అవును. నిజంగాన్నిజ్జం!
బంగారమ్మగారి ఆదేశాల మేరకి ఉదయం ఆరుగంటలకే జానకమ్మ, ఇంకో మనిషిని తోడు తీసుకొని వచ్చేసింది. గత రాత్రే పంచలో వున్న చింతపిక్కల బస్తా విప్పి వాటిని నీటిలో నానబెట్టేశారు. జానకమ్మా దాని అసిస్టెంటూ కలిసి, బంగారమ్మగారు చూపించిన పిల్లంక పెట్టెల్లోని పుస్తకాలన్నీ తీసి, వాటిని ఏ పేజీకి ఆ పేజీ పీకి పాకంపెట్టి పిన్నులన్నీ ఏరిపారేశారు.
ఆ పుస్తకాల్లో కనపడ్డ కార్తీకపురాణం, లలితా విష్ణు సహస్రనామాలని తీసుకొని బంగారమ్మగారు భద్రపరుచుకున్నారు.
“అట్టలన్నీ తీసి పక్కన పెట్టండే” బంగారమ్మగారు డైరెక్షన్ ఇచ్చారు.
రంగురంగుల అట్టలని పక్కన పెట్టి, ఇద్దరూ కాగితాలని ఖండ ఖండాలుగా చేసేసి రెండు బకెట్లలో నానబెట్టేశారు. ఇద్దరూ చెరో రుబ్బురోలు దగ్గరికీ పోయి ఒకళ్ళు కాగితం ముక్కలనీ, ఇంకొకళ్లు చింతపిక్కలనీ శుభ్రంగా రుబ్బి పారేశారు. బంగారమ్మగారు వంటపనిలో మునిగి తేలుతూ, మధ్యమధ్యలో వాళ్ళని అజమాయిషీ చేస్తూ, వాయకోసారి ఆ రోట్లో గుప్పెడూ ఈ రోట్లో గుప్పెడూ మెంతులు వేస్తూ వచ్చిన జిగురుని పరీక్షిస్తున్నారు. విడివిడిగా రుబ్బుడు పని ముగిశాక ఆ రెండు ముద్దలనీ కలిపి, చెరో రోట్లోనూ వేసి ఇంకోసారి కసాపిసా రాచిరంపాన పెట్టేశారు.
“హమ్మయ్య, సగం పనైపోయింది!” హాయిగా ఊపిరి పీల్చుకున్న బంగారమ్మగారు, కాసేపు వాళ్ళకి విరామం ప్రసాదించారు.
నాలుగేసి రొట్టిముక్కలు తేనెపాకంలో ముంచుకొని ముగ్గురూ దొబ్బి తినేశారు. తీపి ఇరగడానికి ఒకో మాగాయ పెచ్చు నమిలేసి, కాసిన్ని టీ నీళ్లతో వేడివేడిగా గొంతు తడుపుకొని, కొత్త శక్తిని పుంజుకొని రెండో అంకానికి తెరలేపారు.
ఓ బిందెని బోర్లించి, దాని చుట్టూ చింతపిక్కా కాగితంముక్కా మెంతుల మిశ్రమాన్ని అమరశిల్పి జక్కమ్మల్లాగా దట్టంగా మెత్తడం మొదలుపెట్టారు.
అదయ్యాకా, ఓ బుట్టకీ ఇంకో తట్టకీ మరో కూర దాకకీ మొత్తం మెత్తేసి, నకళ్ళు తీసేసి, వాటిని ఎండలో ఆరబెట్టేశారు. అసలే రోహిణి కార్తె ఎండలవడంతో మెంతి బుట్టలు వెంటవెంటనే ఆరడం మొదలెట్టాయి.
“అమ్మగారు, మరా అట్ట కాయింతాలేం చేద్దావండే” అడిగింది జానకమ్మ.
“ఓ సోలడు చింతపిక్కలు, గిద్దడు మెంతులూ ఏసి మెత్తగా రుబ్బెయ్యి. సిరంజీబాబు కనికిలూ పెన్నులూ పెట్టుకోడానికి చిన్న బుట్టేసి పారేద్దాం. సంబరపడతాడు ఎర్రెధవ.”
ఆ పాళ్ళు రడీ అయ్యేటప్పటికి బంగారమ్మగారు లోపలనుంచి ఓ మరచెంబు తెచ్చి సిద్దంగా వుంచారు.
అసలే ఆ అట్టలు త్రివర్ణ వర్ణ చిత్రాలేమో, ఆ మిశ్రమం కూడా వింత వర్ణంతో దిగింది. దానితో మెంతి మరచెంబు కడు సుందరంగా ముస్తాబయ్యింది.
“హమ్మయ్య తొందరగానే తెమిలిపోయిందే పని. చేతులు కడుక్కుని రండి. భోజనాలు చేసి కాస్సేపు నడుంవాలుద్దురుగాని.” అలసిన ఆ ఇద్దరు కళాకారిణుల మీదా కరుణ చూపించారు బంగారమ్మగారు.
రెండురోజులు తిరిగేసరికి, మెంతిబుట్టలు దట్టంగానూ దిట్టంగానూ బంగారురంగులో మెరిసిపోతూ వాటికవే ఊడొచ్చేశాయి.
వారంరోజులపాటూ రామచంద్రపురాన్ని ఉద్ధరించిన చిరంజీవి, వన్ ఫైన్ మార్నింగ్ ఊరిలోకి దిగాడు. ఇంటికి వస్తూ వస్తూ దారిలోనే కాస్త తాటిపువ్వారం ఏరుకొచ్చి, సరాసరి వసారాగది లోకి పోయాడు. విచిత్రమైన కంపేదో ముక్కుని పలకరించింది. అదేమీ పట్టించుకోకుండా, పిల్లంకపెట్టి తెరిచి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆందోళనగా ఇంకో పెట్టీ ఇంకోపెట్టీ తెరిచి కొయ్యబారిపోయాడు. గుండె ఆగినంత పనయ్యింది. పుస్తకం కాదు కదా! చిన్నకాగితం ముక్కకూడా కనిపించకపోవడంతో కాళ్ళకింద భూమి కృంగినట్టూ, ఆకాశం విరిగి మీదపడినట్టూ తల్లడిల్లాడు. అసంకల్పిత ప్రతీకార చర్యలాగా వాడి నోటినుంచి అమ్మమ్మా!! అన్న ఓ ఆక్రందన వెలువడింది. అది తోటంతా ప్రకంపించింది.
“తుళ్లిపడ్డాను! ఆ కేకలేంటి? తేలేమన్నా కుట్టిందా?” అంటూ అక్కడకి వచ్చారు బంగారమ్మగారు.
“నా పుస్తకాలేం అయ్యాయి?” పాపం ఏడుపొక్కటే తక్కువ వాడికి.
“అయ్యా! వాటితో ఇంచక్కా కాగితం బుట్టలేయించాను. ఇక్కడే వున్నాయి. చూడెంతందంగా వున్నాయో!” సంబరంగా చెప్పారు.
ఆ బుట్టలని చూసిన వాడు నిలువునా నీరయిపోయాడు. ఒకవేళ ఎక్కడన్నా పెట్టారేమో? ఆప్యాయంగా కళ్ళారా చూసుకుందామన్న వాడిలోని ఆశ ఆవిరైపోయింది.
“ఎదవ కంపూ ఇయ్యీ వీటికోసం బంగారం లాంటి నా పుస్తకాలు నాశనం చేస్తారా? నాకు నా పుస్తకాలు కావాలి. ఏంజేత్తారో నాకనవసరం.”
కోపంతో చిరంజీవి మొహం కందగడ్డలా మారింది. కాలితో విసురుగా ఆ బుట్టలని ఒక్క తన్ను తన్నాడు. ఓ మూలకెళ్ళి పడిందోబుట్ట. వాడికంత కోపం వస్తుందని బంగారమ్మగారు అస్సలు ఊహించలేదు. ఎలా అనునయించాలో తెలీక నోటమాటరాక నిలబడిపోయారు. వాడి ఆవేదనని గ్రహించి అక్కడనుంచి మెల్లగా నిష్క్రమించారు.
కాస్సేపటికి కొంచెం తెప్పరిల్లిన చిరంజీవి, ఆ బుట్టలని ఓసారి చేత్తో తడిమి చూసుకున్నాడు. వీటిలో కొమ్మూరి ఎక్కడున్నారో? కొవ్వలి ఎక్కడున్నారో? చలం ఎక్కడ? చాసో ఎక్కడ? శ్రీశ్రీ ఎక్కడ? ఎంతోమంది నేరస్తులని ఒంటి చేత్తో మట్టికరిపించిన ఆ డిటెక్టివ్ యుగంధర్ రుబ్బురోట్లో నలిగిపోతుంటే పాపం ఎంత యమయాతన పడ్డాడో! అయ్యో అయ్యో ఆ క్రిజ్లర్ కారు ఎలా పచ్చడయిపోయిందో! విక్రమార్కుడి భుజంమీది ఆ భేతాళుడన్నా చెట్టెక్కి తప్పించుకున్నాడా! లేకపోతే వాడూ రోట్లో పడి పచ్చడయిపోయేడా! ఇలా ప్రతి రచయితనీ ప్రతి పాత్రనీ తలుచుకొని తలుచుకొని కాస్సేపు కుమిలిపోయాడు. మంచం మీదపడి వెక్కి వెక్కి ఏడ్చాడు.
“అదీ జరిగింది.” చెప్పింది ప్రశంస.
విన్న నా హృదయం బరువెక్కింది. ‘అది’ నా కంటికి నిజంగానే ఓ అద్భుతంలా కనిపించింది.
“కాకి భాషని కూడా కంఠతాపట్టిన అంకుల్, అమ్మమ్మ ఆలోచనలని పసిగట్టలేకపోవడం చాలా పిటీ కదా! తర్వాతేమయ్యింది?” ఆత్రంగా అడిగాను.
“ఏమవుతుంది? కాలమే అన్ని గాయాలనీ మానిపింది. ఒకట్రెండురోజులు విలపించి విలపించి తైలవర్ణ చిత్రాలతో తనకోసం కళాత్మకంగా తయారైన ఈ మెంతి మరచెంబులో ఆ రచయితలనీ ఆ పాత్రలనీ ఆ సాహిత్యాన్నీ చూసుకుంటూ గుండెని బండ చేసుకొన్నారు. ఆ తర్వాత మెంతి బుట్టతోపాటూ హైస్కూల్లో చేరడానికి ఇంకో ఊరు వెళ్లిపోయారు.” చెప్పిన ప్రశంస మరో వైపు తిరిగింది.
అదే అదనుగా నేను వెంటనే ‘దాన్ని’, అదే ఆ మెంతిబుట్టని, గుట్టు చప్పుడు కాకుండా నా షోల్డర్ బ్యాగ్‌లోకి తోసేశాను. అంతా నన్ను దొంగముండ అని అనుకుంటే అనుకోనీ అంతగా తెచ్చిమ్మని అడిగితే, అప్పుడు చూసుకుందాంలే అనుకున్నా.
ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ జ్ఞాపిక! ప్రశంస వాళ్ళ డాడీ పేరేమో చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు. పెద్ద పేరున్న రచయిత! కావాలంటే ఆ పేరులో వున్న అక్షరాలు లెక్కేసుకోండి. ఏకంగా ఇరవై ఒక్కటి!

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 29-08-2022, 07:46 PM
RE: ఆకాశంలో సగం - by Tammu - 02-09-2022, 08:39 PM
RE: ఆకాశంలో సగం - by Manoj1 - 02-09-2022, 11:36 PM
RE: ఆకాశంలో సగం - by Chutki - 03-09-2022, 07:20 AM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:32 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:46 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:47 PM
RE: నేను చదివిన కధలు - by k3vv3 - 05-09-2022, 07:39 PM



Users browsing this thread: 1 Guest(s)