Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#39
అనిరుద్ర H/o అనిమిష - 11వ భాగం

బాత్రూంలో నుండి బయటకు వచ్చి అడిగాడు అనిరుద్ర. “ముగ్గు గిన్నె ఎక్కడ?” అని.

“ఎందుకు?” అడిగింది అనిమిష.

“ఎందుకేమిటీ... డ్యూటీ ఎక్కడానికి... వాకిలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టాలిగా... డ్యూటీలో జాయిన్ అయిపోతాను”

“వద్దోద్దు... బయట మా బాస్ ఉన్నారు. ఈ ఒక్కరోజు నేనే చేస్తాను” అంది అనిమిష.

“నా జీతంలో కట్ చేస్తే ఊర్కోను” అన్నాడు అనిరుద్ర.

“చేయను...”

“సరే... అన్నట్టు ఈవేళ కూరేం చేయాలి” అడిగాడు అనిరుద్ర..

“ఈ రోజు ఆఫీసులో మా బాస్ పార్టీ ఇస్తున్నారు. నాతోపాటు మీరూ రావాలి”

“బస్సులో అయితే రాను.. ఎట్లీస్ట్ ఆటోలో అయితేనే వస్తాను”

“సరే” అంది అప్పటికా గండం తప్పించుకోవాలని.

****

ఆ వేళ మధ్యాహ్నం శోభరాజ్ ఓ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు అనిమిష దంపతులకు. అనిమిష అనిరుద్రలకు కలిపి ఓ చెక్ వున్న కవర్ ఇచ్చి చెప్పాడు, “ఇంటికి వెళ్లాక చూసుకోవాలి. అప్పటివరకు సస్పెన్స్” అని. అంతా భోజనాలు చేస్తున్నారు. శోభరాజ్ అనిరుద్రతో అన్నాడు.

“మిస్టర్ అనిరుద్ర... మీరు లక్కీ.. అనిమిషలాంటి అమ్మాయి మీకు భార్యగా దొరికినందుకు”

నవ్వాడు అనిరుద్ర. శోభరాజ్ కొనసాగించాడు.

“నిజం చెప్పాలంటే... టుబీ ఫ్రాంక్ నేను అనిమిషను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. పెళ్లి ప్రపోజల్ కూడా చేశాను. అయినా అనిమిష ధైర్యంగా సిన్సియర్గా నాకు ‘నో’ చెప్పింది. మీరు లక్కీ అని ఎందుకు అన్నానంటే... ఏ అమ్మాయి అయినా డబ్బుకన్నా కీర్తిప్రతిష్టలకన్నా ఎవరు ముఖ్యం అని భావిస్తుందో ఆ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడే. ఆ విధంగా నన్ను రిజెక్ట్ చేసి మిమ్మల్ని సెలక్ట్ చేసుకుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ జంటను

ఆశీర్వదిస్తున్నాను”

అనిమిష మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్. తను మోసం చేసిందా... అన్న గిల్టీ కాన్షియసనెస్.

"ఫ్ అంతా గిఫ్ట్లు ఇచ్చారు. కొందరు క్యాష్ చెక్లు ఇచ్చారు. ద్విముఖ ఓ కవర్లో చెక్ పెట్టి అనిమిషకు ఇచ్చింది. అనిరుద్రకు ఓ కార్డు మీద, 'కలిసి వుంటే కలదు సుఖం' అని క్యాప్షన్ రాసి కవర్లో పెట్టి ఇచ్చింది.

***

ద్విముఖ మరో ఫ్రెండింటికి షిఫ్ట్ అయ్యింది. ఆ రాత్రి అనిరుద్ర, అనిమిష గిఫ్ట్ ప్యాకెట్లు, సర్దుతున్నారు. అనిమిష తన పేరు మీద వచ్చిన కవర్లు ఓ పక్కన పెట్టింది. అందులో వున్న ద్విముఖ కవర్ తీసింది. చెక్ లో అమౌంట్ చూసి షాకయ్యింది. వెంటనే ద్విముఖకు ఫోన్ చేసింది.

“నా బ్యాంక్లో వున్న అమౌంట్... నిజానికి ఇంకా పెద్ద మొత్తమే ఇద్దామనుకున్నాను. నీ కథ విన్నాక, నేను ఇచ్చింది చిన్న మొత్తమే అనిపిస్తోంది. జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ వుంది కాబట్టి ఆ మొత్తం ఇచ్చాను. ప్లీజ్ అపార్ధం చేసుకోవద్దు” ద్విముఖ మాట్లాడుతుంటే అనిమిష కళ్లల్లో సన్నటి కన్నీటి పొర.

“అనిమిషా... మీ ప్రేమకు రిటైర్మెంట్ వుండకూడదనే నా కోరిక” అంది ఫోన్ పెట్టేసే ముందు. .

****

“మీ బాస్ చెక్ ఇది” అన్నాడు శోభరాజ్ ఇచ్చిన చెక్ అనిమిషకు ఇస్తూ. చెక్ అమౌంట్ చూసి మరోసారి షాక్ తింది. పాతిక వేల చెక్ అది... కొత్త సంసారంలో సామాను కొనుక్కోవడానికి... చిన్న కానుక" అన్న అక్షరాలు వున్న కాగితం వుంది ఆ కవర్లో.

“మీ బాస్ బాసాసురుడు కాదు... బాసురుడే... అన్నట్టు ఇందులో పన్నెండున్నర వేలు నావి. ఎందుకంటే... గిఫ్ట్ మనిద్దరి పేరు మీద వుంది” అనిరుద్ర అన్నాడు.

“అదేం కుదర్దు... నా బాస్... కాబట్టి గిఫ్ట్ అమౌంట్ నాదే...” అంది అనిమిష.

“మీ బాస్ ఫోన్ నెంబర్ ఉందా?” అడిగాడు అనిరుద్ర “ఎందుకు?”

“మన లెక్క సెటిల్ చేసుకుందాం. నిజాయితీగా ఎవరి గిఫ్ట్లు వారికే చెందాలి. నువ్వు చీట్ చేస్తే ఊర్కోను”

“ఛీఛీ... గిఫ్ట్ లో కూడా కక్కుర్తేనా?” అంది అనిమిష. “కక్కుర్తి... దాని కజిన్ చీకుర్తి నీదే...” అన్నాడు అనిరుద్ర.

“పోనీ నేను ఇరవై వేలు తీసుకుంటాను. నువ్వు అయిదు తీసుకో “అదేం కుదర్దు... ఫిఫ్టీ... ఫిఫ్టీ... దట్సాలంతే” అన్నాడు.

కోపంగా అతని వంక చూసి, “ఛఛ... కాసింత మానవత్వం కూడా లేదు” అంది.

“అంతా మనీ తత్వమే... నో... మానవత్వం...” అన్నాడు అనిరుద్ర ఆవులిస్తూ.

****

“నాకు నిద్రిస్తోంది” అంది అనిమిష.

“నాకూ వస్తోంది... నిద్ర...” అన్నాడు అనిరుద్ర. . “అయితే గుడ్ నైట్...” అంది అనిమిష.

“గుడ్ నైట్” అన్నాడు అక్కడి నుండి కదలకుండానే.

“మీరెల్తే నేను పడుకోవాలి”

“ఎక్కడికి?” అడిగాడు అనిరుద్ర.

“ఎక్కడికేమిటి... మీ గదిలోకి...” అని ఓ క్షణం ఆగి, “ఓహో... మీ గది ఇంకా ఫిక్స్ చేయలేదు కదా...” అంటూ లేచి అనిరుద్రను పక్క గదిలోకి తీసుకెళ్లి, “ఇది ఇవాల్టి నుండి మీ

గది” అంది.

“నేను ఎక్కడ పడుకోవాలి?” అడిగాడు అనిరుద్ర.

. “ఈ గదిలోనే” అంది అనిమిష.

“నేల మీద పడుకునే క్యారెక్టర్ కాదు నాది..”

“షిట్” అంది నుదురు మీద చేత్తో కొట్టుకుంటూ అనిమిష. “షిట్ అంటే బురద అని అర్ధముంది” అన్నాడు అనిరుధ్ర.

“నా బ్రతుకు బురదలో ఇరుక్కుపోయిన...” అని ఎలా పోల్చాలో అర్ధంకాలేదు అనిమిషకు. .

“సామెతలు రానప్పుడు సైలెంటైపోవాలి. ఎగేసుకొని మాట్లాడ్డం కాదు” అన్నాడు అనిరుద్ర.

“సామెతలు తమరికొచ్చేమిటి... అయినా అందంగా పోల్చడం ఓ కళ...” అంది అనిమిష.

“అవునవును... బురదను అందంగా పోల్చు చూద్దాం”

“అంటే...” .

“బురదతో కలిపి... అందంగా నిన్ను నువ్వు పోల్చుకో” అనిమిషకు ఏం మాట్లాడాలో తోచలేదు.

“వెళ్లు... వెళ్లి పడుకో” అన్నాడు అనిరుద్ర.

అనిమిష వెళ్తుంటే మనసులో అనుకున్నాడు, “బురదలో కమలానివి నువ్వు” అని.

***

సడన్గా మెలకువ వచ్చి కళ్లు తెరిచింది. నిద్రలో ఓ కల. అనిరుద్ర గళ్ల లుంగీతో, పెట్టుడు మీసాలతో తన గదిలోకి వచ్చి తన మీద పడ్డట్టు... వికటాట్టహాసం చేసినట్టు... వెంటనే అది... తలుపు వేసి, అనిరుద్ర గదివైపు వెళ్లింది. ఒకవేళ అర్ధరాత్రి తన గదిలోకి వస్తే... బోల్టు దొంగతనంగా తీస్తే...

ఆ ఆలోచన రావడంతోనే భయమేసింది. ఏం చేస్తే బావుంటుందో... ఆలోచించగా ఓ ఐడియా వచ్చింది. వెంటనే గదికి బయట్నుంచి తాళం వేసింది. తాళం చెవిని హ్యాండ్ బాగ్ లో వేసి, రేపొద్దున్నే అతను నిద్రలేవక ముందే తీస్తే సరి” అనుకుంది. హాయిగా కళ్లు మూసుకుంది.

***

అర్ధరాత్రి ఒంటి గంటకు మెలకువ వచ్చింది. అదీ ఆమెకు అనిరుద్ర కలలో రావడం వల్లనే. మళ్లీ అనిరుద్ర కలలోకి వచ్చాడు. ఈసారి జీన్స్ ప్యాంట్తో కలలోకి వచ్చాడు. తన మీదికి వంగి వికృతంగా నవ్వి... రేప్ చేస్తా... అన్నట్లు వచ్చిన కల అది. ఇప్పుడు అనిరుద్ర ఎం చేస్తున్నాడు... జీన్స్ ప్యాంటు వేసుకొని కత్తి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకొని రావడం లేదు కదా..

పోనీ ద్విముఖకు ఫోన్ చేస్తే, తనని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. లాభం లేదు. తనే చెక్ చేసుకోవాలి. వెంటనే హ్యాండ్ బ్యాగ్ లో నుండి అనిరుద్ర గదికి వేసిన తాళం తాలూకు తాళం చెవిని తీసుకొని అనిరుద్ర పడుకున్న గదివైపు వచ్చింది. తాళం తీసి మెల్లగా తలుపు తీసి షాకయ్యింది. లోపల అనిరుద్ర లేడు. ఆమె గుండె కొట్టుకోవడం క్షణకాలం ఆగినట్టనిపించింది.
'ఇదెలా సాధ్యం? అంటే... తనకు కలొచ్చినట్టుగానే...' ఆమె గుండె వేగం పెరిగింది. గబగబా కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు తరిగే చాకు తీసుకుంది. మెల్లిగా హాలులోకొచ్చింది. అనిరుద్ర పడుకున్న గది మొత్తం వెతికింది. తర్వాత తన గదిలోకి వచ్చి షాకైంది. బాత్రూంలో నుండి నీళ్ల శబ్దం.

తన బాత్రూంలో ఎవరున్నారు? ఏ దొంగ వెధవైనా వచ్చాడా? అసలీ అనిరుద్ర ఎక్కడికి " వెళ్లాడు?

మెల్లిగా గొంతు తగ్గించి, “ఏమండీ... ఏమండీ... ఉన్నారండీ” అని పిలిచింది.

అప్పుడే బాత్రూమ్ డోర్ తెరుచుకుంది. చాకును కుడిచేతిలో బిగించి పట్టుకుంది. అయినా చెయ్యి వణుకుతోంది. బాత్రూమ్ పక్కనే నక్కింది. ఆగంతకుడు బయటకు రాగానే ఒక్క పోటు పొడవాలని డిసైడైపోయింది. బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన శాల్తీని చూసి మరోసారి షాకయ్యింది. ఆ వ్యక్తి అనిరుద్ర.

చాకుతో పొడవబోయి ఆగిపోయి…

“మీరా... నువ్వా?” అని అడిగింది.

“మీరా... నువ్వా... రెండూ కాదు.. ఒక్కటి నేనే” అన్నాడు అనిరుద్ర.

“పడగ్గది బయట తాళం వేస్తే ఎలా వచ్చారు? పైగా నా గదిలోకి?” అడిగింది అనిమిష.

“నీకసలు బుద్ది ఉందా? మెదడు తక్కువ మొద్దు... ఇంకా నయం... గదిలో నేను లేనప్పుడు తాళం వేశావు. అయినా నీకింత అనుమానం అయితే ఎలానే...” టపటపా నాలుగు దులిపేశాడు. అనిమిషకు ఏడుపొక్కటే తక్కువ.

అది గమనించి కాస్త తగ్గి, “ఈ ఇల్లేమైనా మైసూరు ప్యాలెస్ అనుకున్నావా? ఉన్నది ఒక్క బాత్రూమ్. అదీ అటాచ్డ్... అదీ నీ గదిలోనే వుంది. రాత్రి మెలకువ వచ్చి చూస్తే నువ్వు పడుకున్నావు. డిస్ట్రబ్ చేయడం ఎందుకని... బయటకు వెళ్తే... దిక్కుమాలిన సంత... బాత్రూమ్లు లేవు దరిదాపుల్లో, తిరిగొచ్చి చూసేసరికి నా గదికి తాళం ఉంది. నీ గది ఓపెన్ చేసి ఉంది. అర్జంటు కదానని బాత్రూమ్ కి వెళ్లాను. ఇదిగో ఇదే లాస్ట్ వార్నింగ్. నా గదిలో అటాచ్డ్ బాత్రూమ్ అయినా కట్టించు... రాత్రి నీ గది తలుపులు తెరిచైనా ఉంచు” అంటూ తన గదివైపు వెళ్లబోయాడు. మళ్లీ ఆగి, “బయట నుండి తాళం వేసే బిజినెస్ మానెయ్” అన్నాడు.

****

పొద్దున్నే నిద్రలేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకొని బయటకు వచ్చి షాకైంది అనిమిష - అనిరుద్ర వాకిలి ముందు ముగ్గు వేస్తున్నాడు. చుట్టపక్కల వాళ్లంతా 'షో' చూస్తున్నారు.

“ఇదేంటి... అంతా రివర్స్... జంబలకిడి పంబలా ఉందే” అని ఒకావిడ.

“పెళ్లాం అంటే ఎంత ప్రేముంటే మాత్రం... ఇలా వాకిలి ఊడ్చి, కడిగి ముగ్గు పెట్టడమేమిటి?” అని ఇంకొకావిడ.

"ఈ ఐడియా బాగానే వుంది... మా ఆయనో నేనూ ముగ్గులేయిస్తాను” అని ఓ ఫెమినిస్టావిడ. సూటిగా ఎవరికి వారు కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అనిరుద్ర మాత్రం ఇవేమీ

పట్టించుకోకుండా ముగ్గుల పుస్తకం చేతిలో పట్టుకొని అది చూస్తూ చుక్కలు పెట్టకుండానే ముగ్గు ' వేస్తున్నాడు... ఆర్టిస్టు బొమ్మ గీసినట్టు.

అనిమిష బయటకు రావడం చూసి ఎదురింటి బామ్మ, “ఏంటమ్మాయ్... ఎంత కొత్తగా పెళ్లి కూతురివి అయితే మాత్రం... మొగుడితో ముగ్గేయించడమేమిటమ్మా.. చోద్యం కాకపోతే...” అంది. సరిగ్గా అప్పుడే ఆటో దిగిన ద్విముఖ అనిరుద్ర ముగ్గు వేస్తున్న దృశ్యం చూడనే చూసింది.

అనిరుద్ర ముగ్గు వేసి... దాని కింద 'ఏ ముగ్గు డిజైన్ బై అనిరుద్ర' అని ముగ్గుపిండితో రాసి, డేట్ వేశాడు టైమ్తో సహా..

అనిరుద్ర ముగ్గు గిన్నెతో లోపలికి అడుగు పెట్టడంతోనే అనిమిష గయ్మంది. “మీకసలు బుద్ధి ఉందా? పొద్దున్నే ఎవడు ముగ్గు వేయమన్నాడు” అంది.
“సో... మధ్యాహ్నమో రాత్రో వేయమంటావా? అయినా ముగ్గు ఎప్పుడు వేయాలో చెప్పు... బుద్ధి ఉందా అని తిడితే దానికి ఎక్స్స్ట్రా ఛార్జి చేయాల్సి వస్తుంది” అన్నాడు అనిరుద్ర.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 10:29 AM



Users browsing this thread: 1 Guest(s)