Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సరైన నిర్ణయం by Sai Arpita
#1
అది ఒక త్రీ స్టార్ రెస్టారెంట్. అప్పుడు సమయం రాత్రి 8 గంటలయ్యింది. అప్పుడే అభినవ్, సారిక ఆ రెస్టారెంట్ లోకి అడుగు పెట్టారు. వాళ్ళ ఆఫీస్ నుండి ఆ రెస్టారెంట్ కి మధ్య ఉన్న దూరం కేవలం అయిదు కిలోమీటర్లు మాత్రమే. మాములు గా అయితే పదిహేను నిమిషాలలో రెస్టారెంట్ కి రావొచ్చు కాని వాళ్ళు బయల్దేరిన సమయం అందరూ ఇళ్ళకి వెళ్ళే సమయం కావడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఆఫీస్ నుండి ఇక్కడికి రావడానికి దాదాపు అరగంట కన్నా ఎక్కువ సమయమే పట్టింది. వాళ్ళిద్దరూ ఆఫీస్ నుండి బైక్ పైన రెస్టారెంట్ కి వచ్చారు.సారిక కి ఆ బైక్ జర్నీ చాలా చిరాగ్గా ఉంది. ఆమెకి బైక్ కన్నా కార్ లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. అభినవ్ కి ఎన్నో సార్లు చెప్పింది ఒక మంచి కార్ కొనమని. ఎన్ని సార్లు చెప్పిన చిరునవ్వే సమధానంగా నవ్వేవాడు. ఎప్పుడెప్పుడు రెస్టారెంట్ కి వెళ్దామా అని ఉంది. ఆమెకి అలా అనిపించిన పావుగంట తర్వాత బైక్ రెస్టారెంట్ ముందు ఆగింది. అభినవ్ బైక్ పార్క్ చేసి వచ్చాడు. ఇద్దరు కలిసి రెస్టారెంట్ లోకి అడుగు పెట్టారు.
రెస్టారెంట్ లోకి అడుగు పెట్టగానే ఆ చల్లటి వాతవరణానికి మనసుకి కొంచం ప్రశాంతం గా ఉనట్టు అనిపించింది సారిక కి. "రా సారిక అక్కడ టేబుల్ ఖాళీ గా ఉంది అక్కడ కుర్చుందాం" అంటూ ఒక మూలగా ఉన్న టబుల్ దగ్గరికి నడిచాడు అభినవ్. సారిక అభినవ్ ని అనుసరించింది. ఇద్దరు కూర్చుని కావల్సిన పదార్ధాలు ఆర్డర్ ఇచ్చారు.
సారిక చూడడానికి చాలా అందం గా ఉంటుంది. ఒక్కసారి ఆమె ని చూసిన వారెవరు అంత తొందరగా కళ్ళు తిప్పుకోలేరు. సారిక ది గుండ్రటి మొహం, పెద్ద కళ్ళు, చిన్న నోరు, తెల్లని మేని ఛాయ. పరిశీలించి చూస్తే ఆ కళ్ళలో ఆత్మ విశ్వాసం తో పాటు ఒక రకమైన అహంకారం కూడా కనిపిస్తుంది. కాని దాన్ని అంత తొందరగా ఎవరు గమనించలేరు చాలా నిశిత ద్రుశ్టితో ఆమె కళ్ళలోకి చూస్తే తప్ప దాన్ని ఎవరు గమనించలేరు. సారిక డిగ్రీ అంతా చెన్నై లో జరిగింది. చదువయిపోయాక హైదరాబాద్ లో అభినవ్ పనిచేస్తున్న కంపని లోనే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కూడా అభినవ్ వల్లే వచ్చింది. అభినవ్ వాళ్ళ ప్రాజెక్ట్ తరపున ఫ్రెషెర్స్ ని ఇంటర్వ్యూ చేయడానికి చెన్నై వెళ్ళాడు. అక్కడ ఒక్కక్కళ్ళని ఇంటర్వ్యు చేస్తున్నాడు. ఇంతలో సారిక వంతు వచింది. సారిక వచ్చి అతని ఎదురుగా కూర్చుంది. అప్పుడే మొదటి సారిగా సారిక ని చూసాడు. ఎవరో అప్సరస స్వర్గ లోకం నుండి పొరపాటున భూలోకం లోకి వచ్చిందా అని అనిపించింది అభినవ్ కి సారిక ని చూడగానే. అప్పుడే తన మనసు వశం తప్పింది. ఆమె అందం అతన్ని కళ్ళు తిప్పుకోనివ్వలేదు. ఆమె ని చూస్తు ఒక రెండు నిమిషాలపాటు అలాగే ఉండిపోయాడు. సారిక ఆ విషయం గమనించింది. ఆమె కి ఆమె అందం మీద చాలా గర్వం. అలాంటి చూపులు ఆమెకి కొత్తేమి కాదు. కాలేజీలో చాలా మందినే చూసింది అలా చూసేవాళ్ళని. ఒక్క నిమిషం ఆమె పెదాల పైన నవ్వు విరిసింది. ఒక రెండు నిమిషాల తరువాత కూడా అభినవ్ లో ఏ మార్పు లేకపోవడంతో తనే పలకరించింది. "గుడ్ మార్నింగ్" అని. ఆ పలకరింపు తో అతను స్ప్రుహ లోకి వచ్చాడు. అతను ఇంటర్వ్యు లో ఏం ప్రశ్నలడిగాడో దానికి ఆమె ఏం సమాధానాలిచ్చిందో అతనికి ఏమి అర్ధం కాలేదు. ఆమెని చూడగానే అనుకున్నాడు ఈమెకి ఎలాగైనా ఉద్యోగం ఇచ్చేయాలని. అందుకే ఆమె చెప్పే సమాధానాలలో తప్పులున్నా వాటిని ఏమాత్రం పట్టించు కోకుండా తనకి ఉద్యోగం ఇచ్చి వాళ్ల ప్రొజెక్ట్ లోనే పని చేసేలాగ చూసుకున్నాడు.
ఆమె ఆ కంపనీ లో చేరి ఇప్పటికి రెండు సంవత్సరాలవుతోంది. అభినవ్ సారిక ని అప్పటినుండి రెండేళ్ళుగా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆర్నెల్ల క్రితం సారిక తో తన ప్రేమ విషయం చెప్పాడు. అభినవ్ తనని ప్రేమిస్తున్నాడన్న విషయం సారిక కి తెలియనిదేమి కాదు. ఆఫీస్ లో అభినవ్ ప్రతి చిన్న విషయం లో తన మీద చూపే శ్రద్ధ చూసాక సారిక కి ఆ విషయం అర్ధం అయ్యింది. కాని సారిక కి అభినవ్ మీద అంత ప్రత్యేకమయిన అభిమానం గాని అతని మీద అంత ప్రత్యేకమయిన అభిప్రాయం కాని ఏమి లేవు. అభినవ్ చూడడానికి ఆరడుగుల అందగాడు కాకపోయిన అంత అనాకారి ఏమి కాడు. ఛామనఛాయ రంగులో చూడడానికి చాలా మాములుగా ఉంటాడు. కాని అతనికి తను చేసే పని మీద పట్టు చాలా ఉంది. సారికి చేయాల్సిన పనిలో సారిక చేసేదానికన్న అభినవ్ చేసేదే చాలా ఎక్కువ. ఆ విషయం సారిక కి తెలుసు అంతే కాదు తను చేరిన రెండేళ్ళలోనే తనకి ఉద్యోగం లో ప్రమోషొన్ వచ్చిందంటే దానికి అతని సహాయం చాలా ఉంది. అందుకే అతనంటే ఇష్టం లేకపోయిన ఆ విషయం ఎప్పుడు బయటపడలేదు.
అభినవ్ ది మధ్య తరగతి కుటుంబం. తల్లి తండ్రులకి ఒక్కడే కొడుకు. అతని తండ్రి రిటైర్ అయ్యేటప్పటికి ఒక సొంత ఇల్లు తప్ప ఇంకేమి ఆస్తులు జమ చేయలేదు. సారిక ప్రపంచం వేరు. ఆమె ది కూడా మధ్య తరగతి కుటుంబం అయినప్పటికి తనని పెళ్ళి చేసుకునే వాడి గురించి ఆమె చాలా కలలే కనింది. ఆమె పెళ్లి తరువాత జీవితాన్ని చాలా గొప్పగా ఊహించుకుంది. పెళ్ళి చేసుకునేవాడికి తక్కువలో తక్కువగా కనీసం రెండు బంగళ్ళాలన్న ఉండాలి. పెళ్ళి చేసాక తను ఉద్యోగం చేయదు. తనకోంటూ ఒక కార్ ఉండాలి. ఇంటి నిండా నౌకర్లు ఉండాలి. ఆరు నెలలకి ఒక్కసారైన విదేశాలకి వెళ్ళి అక్కడ సరదాగ పదిహేను రోజులైనా గడిపి రావాలి. ఆమె కి తెలుసు తన తండ్రి తనకి అట్లాంటి సంబందం తేలేడు అని. అతను తెచ్చిన మధ్య తరగతి సంబంధమే తెస్తాడు గాని తన ఆశలకి అనుకూలంగా అలాంటి సంబంధం తేవడం తన తండ్రికి తలకి మించిన భారం అని తనకి తెలుసు. కాని సారిక కి తన అందం మీద చాలా గొప్ప నమ్మకం. తన అందం చూసి ఎవరైనా గొప్పవాడు వచ్చి తనని పెళ్ళి చేసుకుంటాడనే అభిప్రాయం తనకి బలంగా ఉంది.
బేరర్ కి ఆర్డర్ ఇచ్చాక అభినవ్ అడిగాడు సారిక ని "సారిక నా అభిప్రాయం నీకు చెప్పి ఇప్పటికే ఆరు నెలలవుతోంది. నువు దానికి ఇంతవరకు నాకు కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. ఇంతకి నేను అడిగిన దానికి నీ సమాధానం ఏంటి. నేనంటే నీకూ ఇష్టమే కద మరి ఎందుకు ఇన్ని రోజులు తీసుకుంటున్నావ్ నా ప్రేమని అంగీకరించడానికి."
"అది కాదు అభినవ్ నాకు ఇంకా కొన్ని రోజులు సమయం కావాలి. నేనింకా కొంచం ఆలోచించుకోవాలి"
"ఇప్పటికి ఆరు నెలల నుండి ఆలోచిస్తున్నావ్. ఇంకా ఎన్ని రోజులు ఆగమంటావ్. ఇవాళ నీకు నా మేద ఉన్న అభిప్రాయమేంటో నువ్వు చెప్పి తీరాలి"
"అభినవ్ ప్లీస్ నువ్వు నన్ను అర్ధం చేసుకో ఇదేమి చిన్న విషయం కాదు జీవితానికి సంబంధించింది మనం అంత తొందరగా ఏ విషయం నిర్ణయించుకోకూడదు"
"ఇన్ని రోజుల నుండి నేను నిన్ను తొందర పెట్టలేదు కాని ఇప్పటికే చాలా రోజులయ్యింది. మా ఇంట్లో నాకు పెళ్ళి గురించి ఒత్తిడి పెరుగుతోంది. నువ్వు ఒప్పుకుంటే నేను మా ఇంట్లో చెప్పి నిన్ను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నా"
సారిక కి అభినవ్ అడిగిన దానికి ఏమని సమధానం ఇవ్వాలో అర్ధం కావట్లేదు. ఆమెకి అతన్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు కాని అలా అని ఆ విషయాన్ని వెంటనే చెప్పలేదు. తను కాదంటే రేపటినుండి అభినవ్ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలీదు. అభినవ్ సహాయం లేకుండా ఆ ప్రాజెక్ట్ లో పని చేయ్యాలంటే సారిక కి అది చాలా కష్టం. ఇప్పటి దాక తనకి ఉన్న మంచి పేరు పోతుంది. ఎలాగైన ఇంకొక్క సంవత్సరం ఆగితే తనకి ప్రాజెక్ట్ పని మీద విదేశాలకి వెళ్లే అవకాశం ఉంది. అలా వెళ్లాలంటే దానికి అభినవ్ సహకారం చాలా అవసరం. అభినవే ప్రాజెక్ట్ లేడ్ గా తన పేరు ప్రపోజ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు తను కాదంటే ఆ అవకాశం ఉంటుందో ఉండదో తనకి తెలీదు. అందుకే అభినవ్ మనస్సు నొప్పించకుండా ఎమని సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తోంది.
"అభినవ్ ఇన్ని రోజులు అగావ్ నాకు ఇంకో రెండు నెలలు టైం ఇవ్వు ప్లీజ్ ఈలోగా నా నిర్ణయం చెప్తా"
"ఇంకా రెండు నెలలా అసలు అంత ఆలోచించాల్సిన అవసరం ఏం ఉందో నాకేం అర్ధం కావట్లేదు . నేను నిన్ను పువ్వులో పెట్టి చుసుకుంటాను. నీకు ఎలాంటి కష్టం కలగనివ్వను. నీకు పెళ్ళి గురించి ఎమైనా భయాలు ఉంటే నాకు చెప్పు మనిద్దరం కలిసి ఆలోచించుకుందాం. నీకు మా అమ్మ నన్నాల గురించి కూడా భయం అక్కర్లేదు వాళ్ళు నిన్ను సొంత కూతురిలా చూసుకుంటారు. నీకు నా గురించి గాని మా కుటుంబం గురించి గాని ఏమైన్నా అనుమానాలున్న, ఎమైనా భయాలు ఉన్నా నన్ను నిరభ్యంతరంగా అడగొచ్చు. నీ మనసులో ఉంచుకొని బాధ పడాల్సిన అవసరం లేదు."
"ఛ ఛ అదేం లేదు. నాకు కొంచం టైం ఇవ్వు"
అభినవ్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు ఇప్పటికే వాళ్ళ ఇంట్లో తనని పెళ్ళి చెసుకోమని ఒత్తిడి పెరుగుతోంది. ఇన్ని రోజుల నుండి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. అప్పటికి వాళ్ళు చాలా సార్లు అడిగారు తనని పోని నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని, అలా ఉంటే చెప్పు మేము వాళ్ళతో మాట్లాడి పెళ్ళి ఏర్పాట్లు చేస్తాం అని .సారిక తన ప్రేమని ఒప్పుకోకుండా ఇంట్లో సారిక విషయం చెప్పడం అతనికి ఇష్టం లేదు. ఈ రోజు పెళ్ళి విషయం లో ఇంట్లో చాల పెద్ద గొడవే జరిగింది. తనని ఎన్ని సార్లు అడిగినా పెళ్ళి విషయం వాయిదా వేస్తుండడంతో తనకి చెప్పకుండానే పెళ్ళి చూపులకి ఈ శనివారం వస్తున్నట్టు అమ్మాయి వాళ్ళకి చెప్పెసారు. ఆ విషయం తనకి ఉదయమే చెప్పారు. దాంతో ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. వాళ్ల అమ్మకి బి.పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆవిడకి ఎక్కువగా కోపం తెప్పించద్దని అనవసరంగా స్ట్రైన్ అవనివద్దని చెప్పారు డాక్టర్. వాళ్ళ నాన్న అభినవ్ ని బతిమిలాడాడు అమ్మ కోసం కనీసం పెళ్ళి చూపులకైనా వెళ్ళి వద్దామని. ఆ తరువాత నెమ్మదిగా అమ్మ కి నచ్చ చెప్పొచ్చని అన్నాడు. అభినవ్ ఏం మాట్లాడలేక పోయాడు. ఎలాగైన ఇవాళ సారిక తో తన ప్రేమ విషయం తేల్చుకోవాలని ఆ రోజు సాయంత్రం రెస్టారెంట్ కి తీసుకొని వచ్చాడు. కాని సారిక సమాధానం అతన్ని నిరాశ పరిచింది. ఇంకేం మాట్లాడలేక పోయాడు. ఇద్దరూ డిన్నర్ చేసి బయలుదేరారు. సారిక ని హాస్టల్ లో దింపేసి తన బైక్ పైన ఇంటి దారి పట్టాడు. ఎందుకో ఇవాళ జరిగిన సంభాషణ అతని మనసులో అలజడి రేపింది.
ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. అమ్మకి ఒంట్లో బాగుండకపోయిన అంత సేపు ఇంకా మెలుకొని ఉండడం అతనికి బాధగా అనిపించింది. వాళ్ళిద్దరు అతని కోసమే ఎదురు చూస్తున్నారని అతనికి అర్ధం అయ్యింది. ఆ భావం కనపడనీయకుండా అడిగాడు
"ఏంటమ్మా నీకసలే ఒంట్లో బాగోలేదు ఇంకా పడుకోలేదా?"
"లేదురా నీతో మాట్లాడాలి అందుకే నీ గురించి ఎదురు చూస్తూ కుర్చున్నాం. ముందు వెళ్ళి స్నానం చేసి రా భోజనం అయ్యాక మాట్లాడుకుందాం"
"నా భోజనం అయిపోయిందమ్మా తినేసే వచ్చాను. మీరు తిన్నారా?"
"ఆ అయ్యింది. సరే అయితే స్నానం చేసి రా కొంచం ఫ్రెష్ గా ఉంటుంది."
"సరే. ఒక పది నిమిషాల్లో వస్తాను" అని గది కి వెళ్ళాదు.
అతనికి అర్ధం అయ్యింది వాళ్ళేం మాట్లాడాలనుకుంటున్నారో. కాని దానికి తన స్పందనే తనకి అర్ధం కావట్లేదు. స్నానం చేసి హాల్ లోకి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు.
"చెప్పమ్మా ఎదో మాట్లాడాలన్నారు". అడిగాడే గాని అతనికి తెలుసు వాళ్ళు ఏ విషయాన్ని ప్రస్తావిస్తారో
"మేము చెప్పాల్సింది చెప్పాం ఇంక నువ్వే చెప్పాలి నీ నిర్ణయాన్ని"
"ఏం నిర్ణయించుకున్నావ్"
అతనికి పొద్దున్న జరిగిన విషయం గుర్తుకు వచ్చింది. వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. అలా అని పెళ్లి చూపులకి వెళ్ళడానికి మనసు అంగీకరించట్లేదు. అతనికి ఏం చెప్పడానికి పాలు పోవట్లేదు. అందుకే ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు.
"చెప్పరా" ఈ సారి కొంచం స్వరం పెంచి అడిగాడు వాళ్ళ నాన్న.
మనం ఈ శనివారం పిల్ల ని చూడడానికి వెళ్తున్నాం" అన్నాడు మళ్ళీ తనే అభినవ్ ఏం మాట్లాడకపోయేటప్పటికి.
"అది కాదు నాన్న నాకు ఇంకొంచం టైం కావాలి" అంటూ నసిగాడు
"ఏంట్రా పొద్దున్న అంత జరిగాక కూడా నువ్విలా మాట్లాడడం ఏం బాలేదు. అసలు నువ్వెందుకు అంతలా వయిదా వేస్తున్నావో మాకర్దం కావట్లేదు. మనం ఈ శనివారం బయలుదేరి వెళ్తున్నాం అంతే. ఆ అమ్మయి ని ఒక్కసారి చుడరా. చాలా బాగుంది. వాళ్ళ కుటుంబ వివరాలు, సాంప్రదాయాలు, మాటతీరు అన్నీ చాలా బావున్నాయిరా. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. మేము చూసిన చాలా సంబంధాలలో ఇంతకన్నా మంచి సంబంధం ఏది లేదు అని ఖచితంగా చెప్పగలను. ఒక్కసారి అక్కడికి వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది"
వాళ్ళు అంత అనునయంగా మాట్లాడుతుంటే తనకి ఎదురు చెప్పడానికి మనసొప్పట్లేదు. ఇంక చేసేదెం లేక అమ్మాయిని చుడడానికి ఒప్పుకున్నాడు.
ఆ రోజు శనివారం. అభినవ్ వాళ్ళంతా పిల్లని చుడడానికి బయలుదేరారు. అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ పొలిమేరలలో. అభినవ్ వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి గంట సేపు పట్టింది. వీళ్ళు వెళ్లేటప్పటికే అమ్మాయి వళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఆహ్వానం పలకడానికి అందరూ గుమ్మం లోనే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కార్ దిగగానే కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చి లోపలికి ఆహ్వానించారు.
అభినవ్ ఆ ఇంట్లో అడుగుపెడుతూ ఇంటిని మొత్తం చుస్తున్నాడు. అమ్మాయి వాళ్ళు ఉండేది ఊరి పొలిమేరలలో కావడంతో అక్కడంతా ప్రశాంతంగా ఉంది. సిటి లో ఉండే రణగొణ ధ్వని లేదు. వాళ్ళది ఇండిపెండెంట్ ఇల్లు. ఇంటికి నాలుగు వైపులా కొంత జాగ వదిలేసి ఉంది ప్రహారి వరకు. వీధిలో పెద్ద అరుగు సాయంకాలం కుర్చోవడానికి దానికి బాగుంది. చుట్టుపక్కల రకరకాల పూల మొక్కలు కంకాంబరాలు, మల్లేలు, మందారాలు, రోజా పూలు అలా చాలా రకాల పూల చెట్లు ఒక వైపు ఉన్నయి. ఇంకో వైపు దానిమ్మ, జామ మావిడి మొక్కలు కూడా వున్నాయి. అభినవ్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. ఇంటి జాగ ఎక్కువే ఉన్నా చాలా భాగం ఖాళీ స్థలం వదిలేయడం తో ఇల్లు చుడడానికి చిన్నదిగా కనిపిస్తుంది. ఇల్లు చిన్నదే అయినా అన్ని పొందిక గా అమర్చి ఉన్నాయి.
అభినవ్ వాళ్ళు హాల్ లో కూర్చున్నారు. కాఫీ లు అవి అయిన తర్వాత అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి రాగానే అందరి కళ్ళు అటువైపు కి తిరిగాయి. ఆ అమ్మాయి పేరు శరణ్య. చూడగానే కళ్ళు తిప్పుకుకోలేనంత అందగత్తె కాకపోయిన చూడ గా చూడ గా బావుంది అనిపించేంత అందం ఆ అమ్మాయిది. కనకాంబరం రంగు చీరలో ఉండి చుడడానికి బావుంది. అప్పటిదాకా అమ్మాయిని చూడని అభినవ్ వాళ్ళ అమ్మా నాన్నా అడిగిన ప్రశ్నలకి జావాబులు చెప్తున్నప్పుడు అనుకున్నాడు అభినవ్ అమ్మాయి గొంతు బావుందని అనుకున్నాడు. ఒక పది నిమిషాలు మాట్లాడిన తరువాత అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోమని పక్క గదికి పంపించారు.
తప్పనిసరై అమ్మాయితో పాటు వెళ్ళాడు అభినవ్. వెళ్ళడమైతే వెళ్లాడు గాని ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలనిపించట్లేదు అతనికి. అభినవ్ ఏమైనా మాట్లాడతాడేమో నని చాలా సేపె ఎదురు చూసింది శరణ్య. అతను ఏం మాట్లాడకపోయేటప్పటికి ఆమె కి చాలా నిరుత్సాహంగా అనిపించింది. చాలా సేపు ఎదురు చూసి ఇంక తనే మాటలు మొదలు పెట్టింది.
"హాయి నా పేరు శరణ్య"
"హాయి"
"మీ గురించి ఏమైనా చెప్పండి"
"చెప్పడానికి అంత ఏముంది నా పేరు అభినవ్ నేను ఒక సాఫ్ట్ వేర్ కంపనీ లో పనిచేస్తున్నాను."
అతని జవాబుకి ఆమెకి చాలా నిరాశ కలిగించింది. శరణ్య కి అభినవ్ అతని ఫొటో చూడగానే నచ్చాడు. అమ్మా వాళ్ళు ఈ శనివారం తనకి పెళ్లి చూపులని అబ్బాయిని చూడమని ఫోటో ఇచ్చారు. ఆ ఫొటో చూడగానే తనకి అభినవ్ నచ్చాడు. ఆ తరువాత అబ్బయి గురించి, వళ్ళ కుటుంబం గురించి అమ్మా వాళ్ళు తనతో చెప్పినప్పుడు ఆ అబ్బాయి తో జీవితం పంచుకోవడానికి తనకి పెద్దగా అభ్యంతరం అనిపించలేదు కాని అతను మాట్లాడే తీరు చూస్తుంటే అసలు ఈ పెళ్ళి చూపులు తనకి ఇష్టమేనా అనే అనుమానం కలుగుతోంది.
వాళ్ళిదరి మధ్య అంతకు మించి వేరే మాటలేమి జరగలేదు. ఒక గంట సేపు కూర్చుని పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేసి చెప్తామన్నరు. అదే విషయం భోజనాలయ్యాక శరణ్య వళ్ళ నాన్నా శరణ్య తో చెప్పారు. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావమ్మా నాకెందుకో ఈ సంబంధం ఖాయమనిపిస్తోంది.
"ఏమో నాన్న నాకేం అంత నమ్మకం లేదు. అభినవ్ కి ఈ పెళ్ళి ఇష్టం లేదెమో నాన్న" ఆ మాట అంటున్నప్పుడు ఆమె కి చాలా బాధ కలిగింది.
"అదెంటమ్మా అలా అంటున్నావ్"
"మా ఇద్దరి మధ్య అంతగా మాటలేం జరగలేదు. అతని మాటలన్ని చాలా పొడి పొడి గా ఉన్నాయి"
"అదెం ఉండదులెమ్మా కొంత మందికి కొత్త వారితో మాట్లాడాలంటే కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. అంత మాత్రానికే మనం అలా అనుకోకూడదు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా మాట్లాడారో తెలుసా. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావ్"
ఆయన అంతగా చెప్తుంటే శరణ్య ఇంక గట్టిగా ఏం మాట్లాడలేకపోయింది. కాని తనకెందుకో అబ్బాయికి ఈ పెళ్ళి చూపులు ఇష్టం లేదని గట్టిగా అనిపోస్తోంది. కాని ఒకవేళ్ల నాన్న చెప్పేది నిజం అయితే తన కన్నా అద్రుష్టవంతురాలు ఇంకెవరూ లేరనుకుంది.
ఇంటికి వెళ్ళాక అడిగారు అభినవ్ ని "ఏరా ఎలా ఉంది అమ్మాయి" అని
అభినవ్ నుండి ఏం సమాధానం రాలేదు.
"ఏంట్రా ఏం మాట్లాడవ్"
"నాకు నచ్చలేదమ్మా"
"నచ్చలేదా! నచ్చక పోవడం ఏంటి రా అమ్మాయి ఎంత బాగుంది. అంతే కాదు తను చాలా నిదానస్తురాలు మీ ఇద్దరి జోడి బావుంటుంది రా."
"లేదమ్మా నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. మీ మాట కాదనలేక పెళ్ళి చూపుల కి వచ్చానే కాని నాకస్సలు ఆ అమ్మాయి నచ్చలేదు. మీరు ఇంకా బలవంత పెడితే నేనేం చేయలేను."
ఆ మాట తో ఇంకేం మాట్లాడలేకపోయారు. ఒక రెండు రోజుల తర్వాత నిదానంగా నచ్చచెబుదాం అనుకున్నారు. అందుకే అమ్మాయి వాళ్లకి ఏ కబురు చేయలేదు.
అది రెండు రోజులు కాదు, రెండు నెలలు కాదు మూడు నెలలైనా ఆ విషయం ఏం తేలలేదు. అటు వైపు నుండి అమ్మాయి వాళ్ళు ఇప్పటికి చాల సార్లు ఫోన్ చేసారు ప్రతి సారి ఏదో ఒక సాకు చెప్పుకొస్తున్నారు తప్ప అసలు విషయం చెప్పడం లేదు. వాళ్ళకి శరణ్య బాగ నచ్చింది ఎలాగైనా ఆ సంబంధం కుదుర్చుకోవాలని ఉంది. కాని అభినవ్ కొంచం కూడా అనుకూలంగా స్పందించడంలేదు.
ఈలోగా రెండు నెలలు దాటి చాలా రోజులు అవ్వడం తో అభినవ్ సారిక ని అడుగుదామనుకున్నాడు తన ప్రేమ విషయం. అందుకే సారిక ని సాయంత్రం డిన్నర్ కి రమ్మని పిలుద్దామనుకున్నాడు కాని ఈలోగా సారికే అతనితో మాట్లాడాలని సాయంత్రం అలా పార్క్ కి వెళ్దామని ఆహ్వానించింది. దాంతో అతనికి తన ప్రేమ ఫలించినంత సంబర పడిపోయాడు.
సాయత్రం కలిసిన సారిక అతని తన పెళ్ళి కార్డ్ ఇచ్చింది. వచ్చే నెలలో పెళ్ళి అని తనని తప్పకుండా రమ్మని ఆహ్వానించింది. ఆ మాట విన్నప్పుడు అతని నవనాడులు కుంగిపోయాయి. ఆ శుభలేఖ చేత్తో అందుకుంటుంటే అతని చేతులు వణకడం అతనికే తెలుస్తోంది. అతనికి చాలా కోపం వచ్చింది.
"ఏంటిది సారిక. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు అయినా నువ్వు ఇలా"
"సారి అభినవ్ నేను మన విషయం ఇంట్లో చెప్పాను కాని మా నాన్న ఒప్పుకోలేదు. తను చూసిన సంబంధం చేసుకోకపోతే చనిపోతానని బెదిరించాడు. అప్పటికి నేను చాలా చెప్పాను మా నానకి మన గురించి కాని తను ఒప్పుకోవట్లేదు."
"పోని నేను వచ్చి మాట్లాడనా మే నాన్నతో"
ఆ మాటతో సారిక కంగారు పడింది "వద్దు వద్దు ఈ క్షణం లో మళ్ళి ఈ విషయాలు అన్ని బయటకి వస్తే మా నాన్న ఆరోగ్యం దెబ్బ తింటుంది. దయ చేసి ఈ విషయం ఇక్కడితో మర్చిపో. వెరే ఎవరినైనా పెళ్ళి చేసుకొని సుఖంగా ఉండు" అని చెప్పి వేరె మాటకి ఆస్కారం ఇవ్వకుండా వెళ్లిపోయింది.
నిజానికి సారిక ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పలేదు ఆమెకి అభినవ్ ని చేసుకోవడం ఇష్టం లేదు. ఈలోపు వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం తనకి అన్ని విధాలా నచ్చింది. అంత గొప్ప సంబంధం వాళ్ళ నాన్న తనకి తేలేడనుకుంది. కాని అబ్బాయి వాళ్ళ నాన్న, తన నాన్న చిన్నప్పుడు మంచి స్నేహితులు కావడనంతో సారిక ని వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకొని ఆ స్నేహాన్ని బంధం గా కొనసాగించాలి అనుకున్నారు. ఆ అబ్బాయి వాళ్ళకి ఆస్తి చాలా ఉంది. అంతే కాకుండా అతను ఫారెన్ లో ఉంటాడు. అక్కడే స్థిరపడిపోవాలనే ఆలొచనలో ఉన్నాడు. ఈ సంబంధం వదులుకోవడం ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ విషయం అభినవ్ కి తెలిస్తే అతని స్పందన ఎలా ఉంటుందో తెలీదు. అందుకే తన ప్రమ విషయం ఇంట్లో చెప్పినట్టు దానికి వాళ్ల నాన్న ఒప్పుకోనట్టు చెప్పింది.
అభినవ్ చాలా రోజులు బాధ పడ్డాడు. అతని పరిస్థితి వాళ్ళ తెలియకూడదని జాగ్రత్త పడ్డాడు. కాని అతని ప్రయత్నం ఫలించలేదు. అభినవ్ ఎందుకంత ముభావంగా ఉంటున్నాడో, ఎందుకు తనలో తనే కుములిపోతున్నాడో వాళ్ళకి అర్ధం కాలేదు. ఈ పరిస్థితుల్లో శరణ్య విషయం కదిలించడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు.
అభినవ్ సారిక పెళ్ళికి వెళ్ళకూడదని అనుకున్నాడు.కాని వాళ్ల ఆఫీస్ వాళ్ళందరు పెళ్లికి వెళ్ళడంతో అతనికి వెళ్ళక తప్పలేదు. అక్కడ సారిక ని చూసిన తనకి సారిక ఈ పెళ్ళికి బలవంతంగా ఒప్పుకుందని అనిపించలేదు. తను చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలోని ఆనందం అంతా తన కాళ్ల దగ్గరే ఉంది అనంత ధీమాగా ఉంది. చుట్టుపక్కలవాళ్ళు పెళ్ళి కొడుకు గురించి మాట్లాడుకుంటుంటే వింటున్నాడు అతను చాలా ఆస్తి పరుడని, పెళ్లి చేసుకొని అమ్మాయిని అమెరికా తీసుకెళ్ళిపోతాడని, ఈ సంబంధం గురించి తెలియగానే అమ్మాయి మారు మాట్లాడకుండా ఒప్పుకుందని తెలిసింది.దాంతో సారిక తనని ప్రేమించడం లేదని, తనని అవసరం కోసమే వాడుకుందని తెలిసి తన మేద తనకే జాలి కలిగింది. తరచి తరచి చూసుకుంటే ఆ అమ్మాయి ప్రవర్తన లో ఎక్కడ తన మీద ప్రేమ కనబడలేదు. తనే ఆ అమ్మాయి ప్రవర్తనకి, ఆ అమ్మాయి చేసే పనులకి తన మీద ఇష్టం ఉంది అనుకొని సంబరపడిపోయాడు. కాని అదంత తన ఊహె అని అతనికి అనిపించింది. అలాంటి అమ్మాయినా నేను ప్రేమించింది అలాంటి అమ్మాయి కోసమా అమ్మా నాన్నలని అంతగా బాధ పెట్టింది అని అనిపించింది. సారిక విషయం తను చాలా ఘోరంగా దెబ్బ తిన్నాడు. కాని తను పెళ్ళి కి రావడం మంచిదే సారిక నిజ స్వరూపం తనకి తెలిసింది.లేకపోతె సారిక కి బలవంతంగా పెళ్ళి చేసారని, తను ఈ పెళ్ళి తో సుఖంగా లేదనే అభిప్రాయం లోనే ఉండేవాడు.
పెళ్ళి నుండి వచ్చాక కొడుకు ప్రవర్తనలో మార్పుకి వాళ్ల అమ్మా నాన్నా చాలా సంతోషించారు. అంతకు ముందు ఉండే ముభావం అతనిలో కొంచమైనా లేదు. ఇప్పుడు కొత్త అభినవ్ కనిపిస్తున్నాడు. అందుకే వీలు చూసుకొని శరణ్య గురించి కదిలించారు.
ఇప్పటికే సారిక విషయం లో వాళ్లని చాలా బాధ పెట్టాడు. ఇంకా బాధ పెట్టడం అనవసరమనిపించింది. శరణ్య గురించి వాళ్ళ అమ్మా నాన్నా చాలా గొప్పగా చెప్పారు కాని అప్పుడు సారిక మీద ఉన్న ప్రేమతో అతనికి ఆమె తప్ప ఇంకెవరు గుర్తుకు రాలేదు. ఇప్పుడు వాళ్ళు మళ్ళి శరణ్య మీద అభిప్రాయం అడిగేసరికి మరో మాట లేకుండా పెళ్ళి కి ఒప్పుకున్నాడు. కొడుకు పెళ్లి కి ఒప్పుకోగానే వాళ్ళకి చాల సంతోషం అనిపించింది. ఈ విషయం శరణ్య వాళ్లకి చెప్పడానికి వాళ్ల నాన్న గారికి ఫోన్ చేసారు. కాని అప్పటికే శరణ్య కి పెళ్ళి అయిపోయి నెల దాటిపోయిందని తెలిసింది. రెండు నెలల దాక వాళ్ళ అభిప్రాయం గురించి తెలిసుకోవడానికి వాళ్ళు చాలా ఆరాట పడ్డారు. కాని రెండు నెలల తరువాత కూడ వాళ్ల నుండి ఏ కబురు రాకపోవడంతో అభినవ్ వాళ్ళకి ఈ సంబంధం ఇష్టం లేదని ఆ మాట చెప్పడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారెమో అని అనుకొని వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు.
ఈ విషయం తెలుసుకొని అభినవ్, వాళ్ళ అమ్మా, నాన్న చాలా బాధ పడ్డారు. వాళ్లకి శరణ్య ని ఆ ఇంటి కోడలిగా చేసుకోవాలని చాల ఉంది. అభినవ్ ఈ విషయం లో చాలా బాధ పడ్డాడు. పెళ్ళి చూపులప్పుడు శరణ్య తనతో మాట్లాడడానికి ప్రయత్నించడం, తన అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతనికి అనిపించింది ఆ అమ్మాయికి తను నచ్చాడు అని. కాని తను సారిక ని పెళ్ళి చేసుకోవాలనుకోవడంతో దాని గురించి ఎక్కువ గా ఆలోచించలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసి చాలా బాధ పడుతున్నాడు.
"అదేంటండి ఇలా జరిగింది" అంది వాళ్ళ అమ్మ
"మరి ఏం చేస్తాం మనకి ఆ అమ్మాయి కోడలయ్యే అద్రుష్టం లేదు. మనం ఎంతగా నచ్చ చెప్పినా అభినవ్ వినలేదు. వాళ్ళు కూడా మన అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం దాదాపు గా రెండు నెలలు ఎదురు చూసారు. అమ్మాయి తరపు వాళ్ళు వాళ్లకి మాత్రం కంగారుగా ఉండదా. మనం ఎంత సేపటికి మన నిర్ణయం తెలియ చేయలేదు. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని ఆగుతారు. అందుకే పెద్దలు అంటారు సరైన నిర్ణయాలు సరైన సమయం లో తీసుకోవాలని. ఈ కాలం వాళ్ళకి కాన్వెంట్ లో చదువులు చదివినంత మాత్రాన, చదువులు కాకుండానే ఉద్యోగాలొస్తున్నంత మాత్రాన పెద్ద వాళ్ళమయ్యామనుకోవడానికి లేదు. వాళ్ళకి మనుషులని అంచనా వేయడం కూడా తెలియట్లేదు. ఎంత ఉండి ఏం లాభం మనుషుల గురించి సరైన అభిప్రాయం లేనప్పుడు. ఒక్కొక్కసారి ఈ అవగాహన లోపం వల్ల, క్రుత్రిమమైన అభిమానాలవల్ల రాళ్ళకి విలువ ఇచ్చి రత్నాలని చేజార్చుకుంటున్నారు. వీళ్ళని చూసి జాలి పడడం తప్ప మనం ఏం చేయలేం" అని నిట్టుర్చారు
 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 12 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సరైన నిర్ణయం by Sai Arpita - by k3vv3 - 13-04-2022, 04:16 PM



Users browsing this thread: 1 Guest(s)