14-05-2019, 01:25 AM
(This post was last modified: 14-05-2019, 01:33 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
౪
పల్లవి తన చెప్పులు తీస్తూ— "నువ్వూ చెప్పులు తీసేయ్!" అంది నాతో. ఇద్దరం మా చెప్పులని అక్కడే వున్న షెల్ఫ్ లో పెట్టేసి ముఖద్వారం దగ్గరకు వెళ్ళాం. అచ్చం చంద్రముఖి సినిమాలో గది ద్వారంలాగా త్రిశూలం డిజైన్ లో పెద్దగా వుందా ద్వారం. దానికి మధ్యనున్న గెడని పట్టుకొని రెండుసార్లు తట్టింది పల్లవి. ఏదో గంట కొట్టినట్లు ఠంగుమని వచ్చింది శబ్దం. గుండె జల్లుమంది నాకు. క్షణం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. కేరళా సాంప్రదాయక వస్త్రధారణ ఐన 'సెట్ ముండు' (దాన్నలా అంటారని పల్లవి చెప్పింది నాకు) లోవున్న ఒక నడివయస్కురాలు కన్పించింది మాకు.
పల్లవిని చూసి చిరునవ్వుతో — "లోపలికి రండి!" అంటూ మమ్మల్ని ఆహ్వానించింది.
లోపలికి అడుగుపెట్టామిద్దరం.
"బాగున్నావా మణి!"' పల్లవి ఆమెని పలకరించింది.
"మ్... నేను బాగున్నాను పల్లవమ్మ. ఇందాకనే వైష్ణవమ్మ కూడ వచ్చింది!" అని బదులిచ్చిందామె.
"ఓహో... వచ్చేసిందా? అత్తయ్య ఎక్కడా?" అని అంటూ గబగబా ముందుకి నడవసాగింది.
"లోపలున్నారు!" తలుపు గడియ పెట్టి మా వెనకాలే వస్తూ చెప్పింది మణి.
ముగ్గురం లోపలి గదిలోకి ప్రవేశించాం.
అక్కడ గదిలా కాకుండా ఎదురుగా చతురస్రాకారంలో పెద్ద ప్రాంగణంలా జాగా వుండటం చూసి ఆశ్చర్యపోయాను. సినిమాల్లో ఇలాంటివి వుండటం చూశాను. కానీ, ఇలా ఇసుకతో క్రీడా మైదానంలా ఇంత ప్రదేశాన్ని మధ్యలో వదిలేసి చుట్టూ నిర్మించటానికి కారణమేమిటో నాకర్ధం కాలేదు. అదే పల్లవిని అడిగాను.
"ఇక్కడ ట్రెడిషినల్ గా యిళ్ళను నాలుగు భాగాలుగా... అంటే బ్లాక్స్ లా నిర్మించేవారు. ఆ ప్రక్రియని 'నాలుకెట్టు' అంటారు. ఆ నాలుగు భాగాలను కట్టేప్పుడు మధ్యలో ఇలా స్క్వేర్ షేప్ లో ప్లేస్ వచ్చేలా ప్లాన్ చేస్తారు... దీనిని నడుముట్టం అంటారు!" అని చెప్పింది తను.
"నడుం-మ్ముట్టమా... అంటే?" అడిగాన్నేను.
"నడు-ముట్టం...అంటే, ఇంటి మధ్యలోని వాకిలి. మండువా అని కూడా అనొచ్చు. దీనివల్ల ఇంటి లోపలికి గాలి, వెలుతురు బాగా ప్రసరిస్తుంది. దాంతో బయటవైపు కిటికీలు నిర్మించక్కరలేదు. కావల్సినంత ప్రైవసీ. మాయింటిలో కూడ చూశావుగా...!"
"చూసాను కానీ, అక్కడ ఇంత పెద్దదిగా లేదు కదా...! దీన్ని చూస్తుంటే దంగల్ సినిమాలో పహిల్వానులు కుస్తీ పట్టే ప్రదేశంలా అన్పిస్తోంది!"
"హహ్హహ్హా... ఇక్కడా కుస్తీ జరుగుతుందిలే...—" అంటూ కన్నుకొట్టింది పల్లవి.
మా వెనుక ఏదో చప్పుడయింది.
తలత్రిప్పి చూశాను.
మాకు కుడి ప్రక్కన వున్న గదిలోంచి వైష్ణవి బయటకి వచ్చింది. తను ఇందాకటిలా తెల్లని తడి వస్త్రంలో లేదు. ఎర్రని చీరని కట్టుకుని నిండుగా వుంది. ఆమె వెనకాలే మరొకరు బయటకు వచ్చారు—
ఆ వచ్చినావిడని చూసి "అత్తయ్యా...!" అంటూ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరించింది పల్లవి. ఆమె వంగి పల్లవిని పైకి లేపి ఆప్యాయంగా తనని కౌగిలించుకుంది. నేనామెను చూస్తూ నించున్నాను. బాగా వయసైపోయి ఆమెకు శరీరం వడలిపోయినట్లుంది. చర్మం బాగా ముడతలుపడి వుంది. ఊతకోసం చేతి కర్రని ఒక చేత్తో పట్టుకునుంది. కుశలప్రశ్నలయ్యాక పల్లవి నన్ను ఆమెకు పరిచయం చేసింది.
"అత్తయ్యా... తనూ నా ఫ్రెండ్! సెలవుల్ని ఎంజాయ్ చెయ్యటానికి మన వూరికి వచ్చింది."
నేనూ ముందుకెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కరించాను. ఆవిడ నా తలమీద చెయ్యేసి నన్ను దీవించింది.
ఈలోగా ఆ పనివాళ్ళు కుషన్ వున్న మూడు కుర్చీలను అక్కడే మైదానం చివర్న వేశారు. ఇద్దరు కలిసి కూర్చునేటంత విశాలంగా వున్నసయా కుర్చీలు. ఆ పెద్దావిడ వెళ్ళి మధ్యలోనున్న కుర్చీలో కూర్చుని — "రామ్మా...!" అంటూ నన్ను తన ప్రక్కన కూర్చోమన్నట్లు చెయ్యి చూపించింది. నేను వెళ్ళాను. ఆ నేలలో అడుగుపెట్టగానే— 'ఆహా! ఈ ఇసుక ఎంత మెత్తగా వుంది,' అని అనిపించింది నాకు. గచ్చునేలలో నడవటం అలవాటైన నా పాదాలకు ఈ ఇసుక నేలలో నడక సరికొత్త అనుభూతిని ఇచ్చింది.
వెళ్ళి ఆవిడ ప్రక్కన కూచున్నాను.
పల్లవి, వైష్ణవి కూడా వచ్చి మాకు ఇరుప్రక్కలా చెరో కుర్చీలో కూర్చున్నారు.
ఆ పెద్దావిడ నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని, "నువ్వు చాలా అందంగా వున్నావమ్మా!' అంది. ఆవిడ గురించి తెలిసాక ఈ కితాబుని ఏ విధంగా తీసుకోవాలో నాకు అర్ధం కాలేదు. చిన్నగా నవ్వాను.
మణి ఇంకా మరో యువతి మాకోసం ఫలహారాన్ని ప్లేట్లలో సర్ది పట్టుకొచ్చారు.
వాటిని తింటూ అందరం కబుర్లు చెప్పుకున్నాం. నా గురించి, మా ఫ్యామిళీ గురించి ఆవిడ అడుగుతుంటే ఇసుకలో కాళ్ళాడిస్తూ నేను చెప్పాను. చల్లని గాలి అప్పుడప్పుడూ వచ్చి మమ్మల్ని పలకరిస్తున్నది. కాసేపటికి మట్టి పాత్రలలో పొగలు కక్కే వేడివేడి కాఫీలను తీసుకొచ్చారు పనివాళ్ళు. అది కూడ కానిచ్చాక... వైష్ణవి, పల్లవిలను మార్చి మార్చి చూసి—
"ఇంక మొదలెట్టండి!" అందావిడ.
(ఇంకా వుంది)
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK