03-09-2021, 11:11 PM
నరసింహుడు యాభై ఏళ్లవాడు. గుబురు మీసాలవాడు. తలమీది వొత్తైన వెంట్రుకల నడుమ సగం నెరిసిన వెంట్రుకలు బంగారం రంగులో మెరిసిపోతుంటాయి. వయస్సుతో పాటు అనుభవం దానంతటదే వస్తుందంటారు. ఆ నరెసిన పసిడి రంగు శిరోజాలు అతని అనుభవానికి ప్రతీకలు. పరిణితి చెందిన మనిషతను. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోగల శక్తి కలవాడు. అంత అనుభవజ్ఞుడు కాబట్టే తన వూర్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ వూర్లో యాభై గడపలు వుంటే నూటయాభై మందికి పైగా జనం వున్నారు. అంతా వొకే కులానికి చెందినవారు. ఐదుగురు కులపెద్దలు. వాళ్ళలో వీడొకడు. పది మందికి మంచి చెప్పి చేయించాల్సిన వాడు, తప్పు చేసిన వాన్ని కులాచారాల ప్రకారం దండించాల్సిన వాడు. వాడే తప్పుల్లో కెల్లా అతి పెద్ద
తప్పయిన దొంగతనానికి పూనుకున్నాడు. కులాచారం ప్రకారం దొంగతనానికి శిక్ష మాసం పాటు వూరి బహిష్కరణ. అది మామూలు దొంగతనానికి శిక్ష. తానిప్పుడు పూనుకున్నది దేవుని ఆభరణాల అపహరణ. దీనికి ఎటువంటి శిక్షో. అయినా తప్పదు కార్యం గడపాలంటే ధనం అవసరం. వున్న తక్కువ సమయంలో అంత ధనం సంపాదించడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. అందుకనే ధైర్యం చేసి ఈ దొంగతనానికి పూనుకున్నాడు.
ముహూర్తం పెట్టుకుని పొద్దుగునుకుతుండగా ఇంటిని వదిలాడు. సుమారు పది మైలీల నడక తరవాత అర్దరాత్రికి ఇంకో గంట వుందనగా గుడి వెనకున్న కొండమీదకు చేరుకున్నాడు. కృష్ణపక్షపు పండు వెలుగులో గుడి ప్రాంగణమంతా వెలిగిపోతొంది. కొండపై నుండి చూస్తుంటే తెల్లటి వెన్నెల వెలుగులోని నిర్మాణుశమైన ఆ దేవాలయం క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటున్న రంగనాథుడు కనిపించాడు నారసింహునికి. ఆ దృశ్యం చూసిన నారసింహునికి గుండెలు జారిపోయాయి. వెన్నెలో వణుకు పుట్టి పక్కనే వున్న రాతికి జారగిలపడిపోయాడు. పంకజ నాభుడు గాడ నిద్రలో వున్న రూపం. మురలి వూదుతూ గోపికలను మాయ చేస్తున్న మాధవుడి రూపం. ఎందుకో ఆ మాయలోనుండి బయటపడటానికి నారసింహునికి ఘడియ కాలం పట్టింది.
ఆ ఘడియ కాలంలో అతని యాభై యేళ్ల జీవితం గిర్రున తిరిగింది. ( నారసింహుని ఎపిసోడ్ "మోహనాంగి" అనే కథలో రాస్తున్నాను.)
తనది ఎంతో పెద్ద కుటుంబం.తనకు ఇద్దరు మేనత్తలు, ఇద్దరు పెదనాన్నలు, ఒక చిన్నాన్న. అతని తండ్రి మద్యముడు అవ్వడం మూలాన అటు తాతకు, నాన్నమ్మకు దగ్గరకాలేదు తను, తన తోడ బుట్టిన వారెవరు. అయినా వారెవరికి ఆ లోటు తెలీకుండా పెంచాడు తండ్రి. తనకు ఐదుగురు తోడబుట్టిన వాళ్లు. వాళ్ళలోతనకే వేట, పశు సంరక్షణ వంటబట్టాయి. 14 యేళ్లు వచ్చేపాటి వూరిమొత్తానికి తన కొట్టం కిందే ఎక్కువ పశువులు కూడాయి. సుమారు నూటికి పైగా గొర్రెలు, అరవై మేకలు, నలభై ఐదు గోవులు, పది జాతులకై పైగా కోళ్లు, బాతులు. వాటి సంఖ్య సుమారు ఇన్నూరు. ఇరవై యెండ్లు కూడా దాటకుండానే పశువుల యాపారంలో దిగిపోయాడు. ఆముదాల గొండికి పది కిలోమీటర్ల దూరంలో కోనాపురం అడువుల మొదట్లో వున్న బుర్రకాయల కోట అనే చిన్నపట్టణంలోని పశువుల సంతలో అతని వ్యాపారం మొదలైంది. సజాతి పశువుల విక్రయంతో పాటు, తన అన్నగార్లు చేసిన చెక్క కళాకృతుల విక్రయించేవాడు. ఎటువంటి వస్తువునైనా సరియైన ధరకు అమ్మడం అతని ప్రత్యేకత.
ఇలా అతని వ్యాపారం, వ్యక్తిగత జీవితం మూడు పువ్వులు ఆరుకాయల్లా నడిచిపోతున్న సమయంలో అతని జీవితంలోకి మోహన ప్రవేశించింది. మోహన అతని చిన్నత్త ఇందిరకు ఒక్కగానొక్క కూతురు. కోరి వచ్చిన మోహనను కాదని తన పెద్దత్త కూతురు లక్ష్మిని పెళ్లాడాడు. లక్ష్మిని మనువాడాక అతని వ్యాపారం మరింత విస్తరించింది. పశుసంపదే కాకుండా అడవిలో దొరికే అమూల్యమైన కలప, విలువైన రాళ్లతో చేసిన బొమ్మలు వస్తువులను బుర్రకాయల కోటలో అమ్మేవాడు. ఈ వస్తువుల తయారీకి అతనికి పనిమంతులైన వడ్రంగుల అవసరం ఏర్పడింది. కోనాపురానికి పడమర వున్న వెంకటరాఘవ వురంలోని నాగరాజు అతనికి కుడిచేయిగా వుండేవాడు.
నాగరాజుకు ఒకడే కొడుకు అతని పేరు పెదరామరాజు. ఇప్పుడతనికి ఇరవై నాలుగేళ్లు.నారసింహునికి యాభై ఆరు యేళ్లు. అతనికి పెళ్లైన సంవత్సరానికి ఒక కూతురు, అది పుట్టిన యేడాది తిరక్కుండానే కొడుకు పుట్టాడు. అంతటితో చాలనుకుని వ్యాపారంపై దృష్టి పెట్టి లెక్కలేనంత సంపాదించాడు. వూరిలో కుల పెద్దగా లెక్కలేనంత పరువు సంపాదించాడు. అతనికి నలభై యేళ్లున్నప్పుడు హఠాత్తుగా ఆయన భార్య లక్ష్మమ్మ గర్భం దాల్చి పండంటి ఆడబిడ్డను కన్నది. అది పుట్టిన వేళా విశేషమేమో అతనికి వ్యాపార పరంగానూ, వ్యక్తిగతంగానూ అపారమైన నష్టం కలగడం మొదలెట్టింది. అది పుట్టిన మూడు నెలలకు అతనికి ప్రాణప్రదమైన అతని తండ్రి పరమావదించాడు. దానికి సంవత్సరం రాగానే అతని పరువు మీద మచ్చ పడింది. అతని ఒక్కగానొక్క కొడుకైన నాగేష్ తన పెదతల్లి మోహనను చెరపట్టి పంచాయితిలో నిలిచాడు. పైగా ఆమె భర్తను చంపి హంతకుడయ్యాడు.
వారసుడు కారాగారం పాలైన బాద తగ్గకనే అతనికి వ్యాపారంలో తేరుకోలేని దెబ్బ తగిలింది. దొంగ సరుకుల రవాణా చేస్తున్నారని అతని చేతివృత్తుల వ్యాపారాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లు మూయించేశారు. పశువులు ఒక్కోక్కటిగా పరలోకం చేరాయి. అతనికి యాభై వచ్చేనాటికి అతనికి మిగిలింది నాలుగు పాడి ఆవులు, అతని కుటుంభం, వూరిలో పలుకుబడి.
చిన్న కూతురికి పెళ్లీడొచ్చింది. పూర్వపు వ్యాపార భాగస్వామి కొడుకుతో పెళ్లి నిశ్చయమైంది. అందుకు డబ్బవసరమైంది. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎందరినో అడిగాడు. ఎక్కడా పైసా పుట్టలేదు. చివరగా దొంగతనానికి పూనుకున్నాడు. అదీ కూడా దేవుని గుడి దొంగతనానికి తను చేస్తున్న ఈ నేరం కొడుకు చేసిన హత్యకంటే మహా ఘోరమైనదని తలుచుకుంటేనే వెన్నులో ఒణుకు పుడుతొంది. జీవిత పర్యాంతం నీతికి న్యాయానికి కట్టుబడ్డ బతుకతనిది. అందుకనే దొంగతనం చేయాలంటే అసహ్యం పుడుతొంది. అడవి ఎలుగునే వట్టి చేతులతో మట్టు పెట్టగలిగే ధైర్యం కలిగివున్నా కనీసం కాపలా గూడాలేని గుడిని దొంగలించడానికి ఒణికి పోతున్నాడు.
సమయం అర్దరాత్రిని సమీపిస్తొంది. ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతూ చల్లటి వెన్నెలను వెదజల్లుతున్నాడు. చల్లటిగాని కోనాపురం కోనల్లో వీస్తొంది. ఆ చల్లటి గాలి ప్రభావానికి అతనిలో భయం చచ్చి కాస్త ధైర్యం కూడగట్టుకుంది.
గుండెల్లో జారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకుని లేచినిల్చున్నాడు. వెన్నెల సంద్రంలో తేలుతున్న రంగనాథుని గుడిని చూశాడు. పాలసముద్రంలో పన్నగశయనుడిగా విశ్రాంతి తీసుకుంటున్న అనంతుడిలా అతనికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనం అతని భయాన్ని పటాపంచలు చేసింది. దొంగతనానికి దేవుడి అనుమతే దొరికినంత ధైర్యంగా కొడదిగాడు. ఆలయాన్ని వుత్తర దిశగా సమీపించాడు. అక్కడే క్షేత్రపాలకుడు ఆంజనేయుని మందిరం లోనికి చొరబడి మందిరమంతా కలయ తిరిగాడు. ముహూర్త కాలానికి అతను వెదుకుతున్న మీట ఆంజనేయుని యెడమ పాదం కింద కనబడింది. ఆ మీట నొక్కి భక్తితో పాదం పట్టుకు లాగగానే ఆంజనేయుడు ముందుకి కదిలాడు. ఆయన పాద పద్మాలున్న చోట సొరంగం వెలువడింది. ఆ ఆనందంలో ముందూ వెనక చూసుకోకుండా లోపలికి అడుగేశాడంతే ఎగిరొచ్చి మందిరం వెలుపల పడ్డాడు. కళ్లు బయర్లు కమ్మాయి. అనంత నక్షత్ర కోటీ అతనికి అనుభవం లోకి వచ్చింది. ఆ నక్షత్ర వెలుగులో వుగ్ర రూప బాలాత్రిపుర సుందరి అతని కళ్ల ముందు దర్శనమిచ్చింది. ఆ వుగ్ర రూపం దాల్చిన మరుక్షణం అతను స్పృహ కోల్పోయాడు.