10-11-2018, 03:21 PM
(08-11-2018, 11:03 PM)annepu Wrote: అనిరుద్ర H/o అనిమిష - 2వ భాగం
కార్తీక్ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చాడు. ఆ మిరపకాయ బజ్జీలు వున్న పొట్లం విప్పి యాంకర్ ముందు పెట్టి, “తీసుకోండి... స్పైసీ బట్ టేస్టీ” అన్నాడు అనిరుద్ర.
యాంకర్ ఓ మిరపకాయ బజ్జీని నోట్లో పెట్టుకుంది. కళ్లల్లోంచి నీళ్ళోచ్చాయి.
అనిరుద్ర మిరపకాయ బజ్జీలను ఇష్టంగా తింటున్నాడు. కార్తీక్ కెమెరామెన్ కు మిరపకాయ బజ్జీలు ఇచ్చాడు.
****
“మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. కాకపోతే ఒక వ్యక్తికి రెండు నిమిషాల వ్యవధే కనుక డిటైల్డ్ గా చేయలేకపోయాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరగంటపాటైనా ఇంటర్వ్యూ చేస్తాను...”
“అప్పుడైనా మీ ఛానల్ వాళ్లు రెమ్యునరేషన్ పే చేస్తారా?” నవ్వుతూ అడిగాడు అనిరుద్ర.
“నేనే పర్సనల్ గా పే చేసి ఇంటర్వ్యూ చేస్తాను. బైదిబై అయామ్ ద్విముఖ...” అంటూ స్నేహ పూర్వకంగా చెయ్యి చాచింది.
ఆ చేతిని స్నేహ పూర్వకంగా నొక్కి వదిలాడు అనిరుద్ర..
ఆ పరిచయం గొప్ప మలుపుకు నాంది కాబోతోందన్న విషయం ఆ క్షణం వాళ్లకు తెలియదు.
***
బీచ్ రోడ్ లోని అరోమా కాలనీలోని అయిదో యింట్లో వాతావరణం సునామీకి ఎక్కువ, కత్రినాకు తక్కువగా ఉంది. విశాలమైన ఆ ఇంటి చుట్టూ చెక్కలతో ఫెన్సింగ్ ఉంది. మధ్యలో చెక్కగేటు, ఫెన్సింగ్ చుట్టూ బంతిపూల చెట్లు... మధ్యలో ఇల్లు... ఓవైపు బాదం చెట్టు, ఇంటి వెనుకవైపు జామ, దానిమ్మ చెట్లు... బాదం ఆకులు నేల మీద పడి వింత అందంతో మెరుస్తున్నాయి.
ఆ ఇంట్లో వున్న పెద్ద దిక్కు ప్లస్ ఓనర్ అయిన అరవై రెండేళ్ల సత్యవతమ్మ అనబడే బామ్మ తీవ్రంగా ఆలోచిస్తోంది. మధ్య మధ్య అటు ఇటూ పచార్లు చేస్తోంది. ఓసారి సీలింగ్ ఫ్యాన్ వంక, మరోసారి కిచెన్ రూమ్లో వున్న కూరగాయలు తరిగే చాకు వంక చూస్తోంది.
హాలులోకి వెళ్లింది. హాలులో వున్న ఫేము కుర్చీలో కూర్చొని గోడకు వున్న ఫొటో వంక చూసింది. అనిరుద్రకు తెల్ల వెంట్రుకలు వచ్చి, గుబురు మీసాలు పెడితే ఎలా వుంటుందో ఆ ఫొటోలోని రూపం అలా ఉంది. మొగుడి ఫొటో వంక చూడగానే, ఆ ఫొటోలో మొగుడు బదులు స్టయిల్ గా అనిరుద్ర కనిపించాడు.
బామ్మగా ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఫోన్ దగ్గరికి నడిచింది. ఎయిటీస్ నాటి బ్లాక్ కలర్ టెలిఫోన్ అది... ఓ నెంబర్ డయల్ చేసింది.
అయ్యర్ హోటల్. .
బీచ్ ను ఆనుకొని వున్న అయ్యర్ హోటల్లో నుండి కాఫీ వాసన చుట్టూ పరిభ్రమిస్తోంది. దేవుడికి వెలిగించిన అగరొత్తుల పరిమళం గొప్పగా ఉంది. ఓవైపు వేడి వేడి ఫిల్టర్ కాఫీ కప్పుల్లోకి జారిపోతోంది. ఇంకో వైపు జీడిపప్పు ఉప్మా, వేడి వేడి ఇడ్డేనలు.
“కార్తీక్ నువ్వెన్నైనా చెప్పు... అయ్యర్ హోటల్లో వేడి వేడి జీడిపప్పు ఉప్మా తిని, ఫిల్టర్ కాఫీ ఒకటి లాగించి, కాసేపు బీచ్లో షికారుకొట్టి ఇంటికి వెళ్లి ఆరు బయట మంచమ్మీద పడకేసి మీద పడుతున్న బాదం ఆకులతో మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటే ఆ జీవితమే జీవితం” అనిరుద్ర వేడి వేడి ఉప్మా తిని, కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని చెప్పాడు. . .
అప్పుడే టేబుల్ మీద వున్న అనిరుద్ర మొబైల్ మోగింది. కార్తీక్ కాఫీ తాగబోతుంటే, అనిరుద్ర సీరియస్గా చూశాడు కార్తీక్ వైపు.
“అదేంట్రా... ఫోన్ నీకొస్తే నా వైపు సీరియస్గా చూస్తావేమిటి?”
“ఫోన్ ఎవరికి వచ్చిందన్నది పాయింట్ కాదు... వెంటనే ఎవరు అటెండయ్యారన్నది ఇంపార్టెంట్. నా ఫోన్ నంబర్ తెలిసిన ఏకైక వ్యక్తివి నిన్ను మైనస్ చేస్తే బామ్మనే... చూడు”
కార్తీక్ మొబైల్లో డిస్ ప్లే చూశాడు... మొబైల్ డిస్ప్లే “బామ్మ రాక్షసి” అని ఉంది.
“ఒరే... బ్రహ్మ రాక్షసి నుండి ఫోన్రా” యాంగ్జయిటీగా అన్నాడు కార్తీక్,
“బ్రహ్మ రాక్షసి కాదు... బామ్మ రాక్షసి... 'బ'కు 'బ్ర'కు తేడా తెలియడంలేదు?” సీరియస్ గా అడిగాడు అనిరుద్ర.
“ఆ డిస్కషన్ ఇప్పుడు అవసరమా? అయినా నెంబర్ ఫీడ్ చేసుకున్నాక పేరు రాసుకుంటారుగానీ ఈ బామ్మ రాక్షసి అని రాసుకున్నావేంటి?”
“నా బామ్మ నా ఇష్టం... అయినా అస్తమానం ఉద్యోగమో ఉద్యోగమో అని క్లాసు
పీకుతుంది...”
“సర్లే... ఫోన్ లిఫ్ట్ చేయనా?” అడిగాడు కార్తీక్. “చెయ్... ఆలస్యమెందుకు?” ఓకే బటన్ ప్రెస్ చేసి, 'హలో' అన్నాడు కార్తీక్.
“అది తొమ్మిది రెండు నాలుగు ఆరు రెండు శూన్యం రెండు ఆరు ఒకటి ఆరేనా?” అటు వైపు నుండి బామ్మ గొంతు వినిపించింది.
“కాదు, నైన్ టూ ఫోర్ సిక్స్ టు జీరో టూ సిక్స్ వన్ సిక్స్” చెప్పాడు కార్తీక్.
“బాదం కాయతో కొడితే తలకాయ పగులుద్ది తింగరి సచ్చినోడ... ఫోన్ నీ ఎదురుగా కాఫీ తాగుతున్న సన్నాసోడికివ్వు”
“అరే... అంత కరెక్ట్ గా ఫోన్ లిఫ్ట్ చేసింది నేనే అని ఎలా కనిపెట్టావ్ బామ్మా?”, ఉత్సాహంగా అడిగాడు కార్తీక్.
“తలకు మాసిన వెధవ్వి నువ్వుగాక వాడితో ఎవడుంటాడు నక్షత్రకుడిలా... పనీపాటా పెళ్లి పెటాకులు లేకుండా”
“అరె... ప్రాసలతో భలే మాట్లాడుతావ్ బామ్మా...” “ప్రాసలేగానీ బ్రాసరీలు వేసుకునే వయసా నాది... ముందు నా మనవడికి ఫోనివ్వు”
“ఎనీ సీరియస్ మ్యాటర్?”
“కళ్లలో నుంచి వాటర్ వచ్చే మ్యాటర్... నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మంచం మీద స్టూలు వేసుకుని, సీలింగ్ కు చీర బిగించి, దాన్ని నా మెడకు కట్టుకునే మాట్లాడుతున్నా....”
“బా...మ్మా....” గట్టిగా అరిచాడు కార్తీక్. ఆ అరుపుకు కస్టమర్లు బెదిరిపోయారు.
“ఒరే... ఏంట్రా ఆ అరుపు... నీ అరుపు విని సముద్రపు అలలు కూడా వెనుక్కు పరుగెడుతున్నాయి”
కార్తీక్ అనిరుద్ర వైపు చూసి, “ఈ వార్త వింటే నువ్వు వెంటనే ఇంటికి పరుగెడతావ్?” అన్నాడు వగరుస్తూ..
“అలా ఆయసపడిపోతావేం... ఏదో రన్నింగ్ రేస్లో పరుగెత్తుకు వచ్చినట్లు?”
“సినిమాల్లో సీరియస్ మ్యాటర్ వచ్చినప్పుడు ఇలాగే పరుగెత్తుకొస్తూ చెబుతారుగా... ముందు నువ్వు పద....” కంగారుగా అన్నాడు కార్తీక్.
“ఎందుకు?? తాపీగా అడిగాడు అనిరుద్ర. ..
“ఘోరం జరిగిపోబోతోంది... బామ్మ ఉరేసుకోబోతోంది...” “ఇంకా ఉరేసుకోలేదుగా…”
“ఏంటి వేళాకోళంగా ఉందా... ముందు పద...” అంటూ లేచాడు కార్తీక్.
“ఆగు... కాఫీ తాగనీ... నాలుగు రూపాయల కాఫీకి కాసేపు న్యాయం చేయొద్దూ...”
“అవతల బామ్మ అన్యాయమైపోతోంది...”
“ఓ పని చెయ్... నువ్వెళ్లు... నేను వెనగ్గా వస్తాను”
“ఇద్దరం కలిసే వెళ్తాం” అంటూ హోటల్ బయటకు అనిరుద్రను లాక్కొస్తూ ఆటోను పిలిచాడు కార్తీక్. ఆటో వచ్చి వాళ్ల ముందాగింది.
అనిరుద్ర సీరియస్గా కార్తీక్ వైపు చూసి, “ఆటో ఎందుకురా.... బస్సులో వెళ్లొచ్చుగా”
పెద్ద వెర్రికేక వేశాడు కార్తీక్. ఆ తర్వాత కీచుగొంతుతో, “అవతల లైఫ్ అండ్ హ్యాంగ్ ప్రాబ్లమ్రా” అన్నాడు.
“ఇవతల మనకు మనీ ప్రాబ్లమ్... బస్సు డబ్బులతో కాఫీ తాగాలని డిసైడయ్యాం కదా... ఇప్పుడు పెద్ద పుడింగిలా ఆటో అని పిలిచావ్... డబ్బులేవరిస్తారు? నువ్వా నీ యబ్బా..
కార్తీక్ మెదడుకు బ్యాలెన్స్ కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. అనిరుద్ర ఆటోవైపు తిరిగి డ్రైవర్ తో చెప్పాడు “నువ్వెళ్లు బాబూ” అని.
ఆటో వెళ్లిపోయింది. ఈలోగా కార్తీక్ కు చిన్న డౌట్ ఎవరో తనను తిడుతున్న ఫీలింగ్ ... అప్పుడు గమనించాడు. తన చేతిలోని అనిరుద్ర మొబైల్ ఫోన్... తను ఆ ఫోన్ ఆఫ్ చేయలేదు... అంటే తమ మాటలన్నీ...
కార్తీక్ గుండె గుబేల్ మంది. ఫోన్ ను చెవి దగ్గర ఆన్చుకున్నాడు. అవతల బామ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. అది ఏ భాషో కూడా అర్ధంకాలేదు కార్తీక్ కు.
“బామ్మా” భయంగా అన్నాడు కార్తీక్.
“ఒరే తింగరి సచ్చినోడ... సరిగ్గా... సరిగ్గా పదిహేను నిమిషాల్లో మీరు ఇక్కడ వుండకపోతే నా చావుకు కారణం ఎవరో రాసిపెట్టి మరీ చస్తాను”
“అంత పని చేయకు బామ్మా... అనిరుద్ర ఇబ్బందుల్లో పడతాడు”
“వాడెందుకురా ఇబ్బందుల్లో పడతాడు?”
“మరి నువ్వు నీ చావుకు కారణం ఎవరో రాసి పెట్టి చనిపోతానన్నావ్ గా” అయోమయంగా అడిగాడు కార్తీక్.
“అవును... నేను నీ పేరు రాసి చచ్చిపోతా... నా మనవడు చెడ తిరగడానికి... చెడిపోవడానికి నువ్వే కారణం...” చెప్పి కసిగా ఫోన్ పెట్టేసింది బామ్మ.
***
అనిరుద్ర తాపీగా, కార్తీక్ భయం భయంగా ఇంట్లోకి అడుగుపెట్టారు. మంచమ్మీద కూచొని, మంచం ముందు వున్న స్టూల్ మీద బిర్యానీ ప్యాకెట్ పెట్టుకొని తింటోంది బామ్మ. ఆమె మెడకు చీర వదులుగా బిగించి ఉంది.
అనిరుద్ర లోపలికి వచ్చి మంచమ్మీద కూర్చొని బిర్యానీ వాసన చూసి ముక్కు ఎగబీల్చి, “బిర్యానీ ఘుమఘుమ బాగానే వుంది... ఎక్కడి నుంచి తెప్పించావే?” అని అడిగాడు.
“దాబా నుంచి తెప్పించానురా.... అయినా డిటైల్స్ అవసరమా? తొందరగా తిననీ... తినేసి ఉరేసుకుంటా” అంది బామ్మ. . ,
“అదేంటే... ఎటూ చద్దామనుకుని డిసైడయ్యావ్... బిర్యానీ ఎందుకే వేస్ట్ చేస్తావ్?” అనిరుద్ర అన్నాడు.
బామ్మ కార్తీక్ వైపు తిరిగి, “ఒరే తింగరోడా... నీ ఫ్రెండ్ కు చెప్పు... నా మాట వినని వాళ్లు నాతో మాట్లాడవద్దని...”
కార్తీక్ అనిరుద్ర వైపు చూశాడు.
“ఏంటి... చెబుతావా... చంపేస్తా... నాకు నిద్రిస్తోంది... బామ్మ ఉరి ప్రోగ్రామ్ పూర్తయ్యాక లేపు... మంచి నిద్రలో వుంటే మాత్రం పొద్దున చెప్పు..” అంటూ బిర్యానీ ప్యాకెట్ నుంచి కొద్దిగా బిర్యానీ తీసి నోట్లో పెట్టుకుని “వెరీ టేస్టీ” అనుకుంటూ బయటకు నడిచాడు అనిరుద్ర.
బామ్మ అనిరుద్ర వైపు గుర్రుగా చూస్తూ బిర్యానీ సీరయిస్గా తినసాగింది.
“ఏం ఫ్యామిలీ అండీ” కార్తీక్ తల పట్టుకున్నాడు.
***
అర్ధరాత్రి రెండు కావస్తోంది.
అనిరుద్ర ఓ మంచమ్మీద కార్తీక్ మరో మంచమ్మీద పడుకున్నారు. ఇద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. కార్తీక్ కి అనిరుద్ర ఇంట్లో ఆరుబయట పడుకోవడం చాలా ఇష్టమైన విషయం. నెలలో పదిహేను రోజులకు పైగా అనిరుద్ర ఇంట్లోనే గడుపుతాడు.
బామ్మ హరర్ సినిమాలో డ్రాకులా కళ్లు తెరిచినట్లు ఠపీమని కళ్లు తెరిచింది. ఒళ్లు విరుచుకుని లేచింది. ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి, ఓ బాటిల్ తీసుకుని నీళ్లను గటగట సగం బాటిల్ వరకు తాగేసింది. ఓ చిన్న ఆలోచన కలిగిందావిడకు. వెంటనే ఐస్ క్యూబ్స్ వున్న ట్రేని లాగింది.
అందులోని ఐస్ క్యూబ్స్ ని ఓ గ్లాసులో వేసి వాటిని తీసుకొని బయటకు నడిచింది.
అనిరుద్రవైపు చూసింది. హాయిగా నిద్రపోతున్నాడు. దుప్పటిని మెడ వరకు కప్పి, నుదిటి మీద ముద్దు పెట్టుకొని కార్తీక్ మంచం దగ్గరికి వచ్చింది. దుప్పటిని మునగదీసుకొని పడుకున్నాడు కార్తీక్. ఆ దుప్పటిని పట్టి పీకింది. చలికి వణికిపోతున్నాడు కార్తీక్.
తన చేతిలో వున్న గ్లాసులోని ఐస్ క్యూబ్స్ ఒక్కొక్కటి తీసి కార్తీక్ చొక్కాలో వేసింది.
పెద్ద వెర్రికేక వేసి లేచి, తన చొక్కాలో పడిపోయిన ఐస్ క్యూబ్స్ ని చూసి మళ్లీ కేకవేసి, “బామ్మా ఏంటిది?” అని ఏడుపుగొంతుతో అడిగాడు.
“ఐస్ క్యూబ్స్... ట్రేలో నీళ్లు పోసి డీప్ ఫ్రిజ్ లో పెడితే ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. అప్పుడప్పుడూ మందులోకి వేసుకుంటాను”
“నేనడిగింది ఐస్ క్యూబ్స్ ఎలా తయారవుతాయని కాదు. చలికి వణుకుతుంటే దుప్పటి లాగి... అర్థరాత్రి ఐస్ క్యూబ్లు నా ఒంటి మీద ఎందుకు పోశావని?” ఏడుపు గొంతుతో అన్నాడు కార్తీక్..
Excellent narration sir I made a registration just to make a reply to ur story
Please give daily updates.
Thanks for ur story