Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#54
సప్తమ స్కంధము – ప్రహ్లాదోపాఖ్యానం:

ప్రహ్లాదోపాఖ్యానం పరమపవిత్రమయిన ఆఖ్యానం. అందులో ఎన్నో రహస్యములు ఉన్నాయి. వైకుంఠ ద్వారపాలకులయిన జయవిజయులు ఇద్దరు సనక సనందనాదుల పట్ల చేసిన అపచారం వలన శాపవాశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులయి మూడు జన్మలు ఎత్తిన తరువాత మరల శ్రీమన్నారాయణుడు వారిని తన ద్వారపాలకుల పదవిలోనికి తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు.

హిరణ్యకశిపుడు అంటే కనబడ్డదల్లా తనదిగా అనుభవించాలని అనుకునే బుద్ధి కలవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అను నలుగురు కుమారులు కలిగారు. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సింహిక. సింహిక కుమారుడు రాహువు. ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం క్రింద సూర్య గ్రహణం చంద్ర గ్రహణంలో కనపడుతూ ఉంటాడు. ఆయనే మేరువుకి అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాడు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భముతో ఈ ఆఖ్యానమును ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు, తల్లిగారయిన దితి హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి హిరణ్యకశిపుడు వచ్చాడు. అపుడు హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతమును చూస్తే అసలు ఇతను రాక్షసుడేనా, ఇలా వేదాంతమును ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది. 

హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను, తల్లి చూసి “సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఉత్తమలోకాల వైపుకి వెళ్ళిపోయాడు. అటువంటి వాని గురించి ఎవరయినా ఏడుస్తారా? ఏడవకూడదు" అని ఒక చిత్రమయిన విషయం చెప్పాడు. 

పూర్వకాలంలో సుయజ్ఞుడు చాలాకాలం ప్రజలను పరిపాలన చేసి అనేకమంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అపడు ఆయన ఒక బ్రాహ్మణ కుమారుని వేషంలో అక్కడికి వచ్చి ఒకమాట చెప్పాడు “ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చావు తప్పించుకొని దాక్కున్న వాడెవడూ లేదు. కొన్నాళ్ళు బ్రతికిన తరువాత వెళ్ళిపోవడం అన్నది ఈ ప్రపంచమునకు అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనం ఎక్కడినుండి వచ్చామో అక్కడికి వెళ్లిపోతాము. ఆ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారెందుకు?" అని అడిగాడు యమధర్మరాజుగారు. 

పూర్వకాలంలో ఒక చెట్టు మీద గూటిలో ఒక మగపక్షి, ఒక ఆడపక్షి ఉండేవి. ఒక బోయవాడు అటు వెళ్ళిపోతూ చెట్టుమీద మాట్లాడుకుంటున్న పక్షుల జంటను వాటి వెనకాల ఉన్న పక్షి పిల్లలను చూసి ఉండేలు బద్ద పెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిర తిరుగుతూ ఆ పక్షి కిందపడిపోయింది. అది మరల ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు వంచేసి బుట్టలో పడేసుకొని తీసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాలలోంచి ఆడపక్షి నీరస పడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్తవంక చూస్తోంది. అపుడు భర్త అన్నాడు “మనిద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాము. నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుండి పిల్లలు లేవగానే అమ్మ ఏది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను? ఈ పిల్లలు ఆహరం కోసమని నోళ్ళు తెరచుకుని చూస్తూ ఉంటాయి. నీవు లేని సంసారం ఎలా చేయాను’ అని ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దానినీ కొట్టాడు. అది చచ్చిపోయింది. తాను ఉండిపోతాను అనుకున్న మగపక్షి చచ్చిపోయింది. రెక్కలు వంగిన ఆడపక్షి ఇంకా బ్రతికే ఉంది. కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని ఈశ్వరుని గురించి ప్రార్థన చెయ్యండి అన్నాడు.
ఈ మాటలకు దితి, హిరణ్యాక్షుని భార్యలు ఊరట చెంది అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 10-02-2021, 10:59 PM



Users browsing this thread: 2 Guest(s)