Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#18
అనిరుద్ర H/o అనిమిష - 7వ భాగం

“ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్?” బీచ్లో తల కింద చేతులు పెట్టుకొని వెల్లకిలా పడుకొని, ఆకాశం వంక చూస్తున్న అనిరుద్రను అడిగాడు కార్తీక్.

“రామ్ గోపాల్ వర్మకు ఓ మాంచి మర్డర్ థ్రిల్లర్ కథ చెప్పాలనుకుంటున్నాను...

“మీకెప్పుడైనా మీ బామ్మను చంపాలనిపించిందా' అన్నది ట్యాగ్ లైన్ చెప్పాడు కామ్గా అనిరుద్ర.

“వ్వాట్... ఏంటీ నేనిక్కడ సీరియస్గా మాట్లాడుతుంటే సెటైర్స్ వేస్తున్నావా? అయినా బామ్మను చంపే ఉద్దేశం ఉందా? తప్పురా... బామ్మపోతే ఆ ఆస్తి అంతా నీకొస్తుందో? లేదో... కనుక్కొని ప్లాన్ చెయ్యరా" చెప్పాడు కార్తీక్.

“ఏంటీ కార్టూన్లా...” అంటూ లేచి కూర్చున్నాడు అనిరుద్ర. రెండు

“నీకో విషయం తెలుసా అనూ... బామ్మ తను చచ్చేలోగా నువ్వు ఉద్యోగం చేయకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా ఆస్తి అంతా అభిషేక్ బచ్చన్ కు ఇస్తుందట”

“అదేంటి? ఎందుకలా?” తాపీగా అడిగాడు అనిరుద్ర.

“చచ్చే ముందు అభిషేక్ బచ్చన్ ని దత్తత తీసుకుంటుందిట... అమితాబ్ ను ఈలోగా సంప్రదించి పర్మిషన్ అడుగుతుందిట. 'మొన్నో రోజు రాత్రి నిద్రలేపి మరీ నాకీ విషయం చెప్పి నువ్వడినా అడగకపోయినా నీకు చెప్పి బెదిరించమని చెప్పింది”

అనిరుద్రకు నవ్వొచ్చింది. బామ్మ చేసే పనులు చాలా వింతగా ఉంటాయి. ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తుందా?

సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయిల గుంపు అటుగా వచ్చి అనిరుద్రను చూసి, కాసేపు వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకొని కన్ఫర్మ్ చేసుకొని అతని దగ్గరకొచ్చారు.

“మీరు డ్రీమ్ టీవీ “ఏం చేయాలనుకుంటున్నారు?' ప్రోగ్రామ్లో వచ్చారు కదూ...” అని అడిగారు.

“సారీ మీరు ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నారో....” అనిరుద్ర అన్నాడు.

“మీ పేరు అనిరుద్ర కదూ...”

“ఏం నేను కూడా బీచ్ లో కనిపించి చచ్చానుగా... నన్నడగొచ్చుగా” పక్కనే వున్న కార్తీక్ కు ఒళ్లు మండి అన్నాడు.

“ఆ అమ్మాయిల్లో జీన్స్ వేసుకున్న ఓ అమ్మాయి అనిరుద్రవైపు తినేసేలా చూస్తూ, “నా దగ్గర పోస్టుంది... అదే మొగుడి పోస్టు చేస్తారా?” అనడిగింది.

అనిరుద్ర ఆ అమ్మాయి మొహంలోకి చూస్తూ, “పార్ట్ టైమా? ఫుల్ టైమా?” అని అడిగాడు. ఆ అమ్మాయి కంగుతిని, “అదేంటి?” అంది.

“పార్ట్ టైమ్కో రేటు. ఫుల్టైమ్ కో రేటు. నైట్ కూడా చేస్తే ఒ.టి ఇవ్వాల్సి ఉంటుంది. అన్నట్టు మీ ఫోన్ నెంబరెంత?” అన్నాడు జేబులో నుండి పెన్ తీస్తూ.

“ఎందుకు?” అనిరుద్రను సరదాగా ఏడిపించాలనుకున్న ఆ అమ్మాయి కంగారుపడిపోయి అడిగింది.

“మీ పేరెంట్స్తో శాలరీ అగ్రిమెంట్ రాయించుకోవడానికి. అన్నట్టు ఏ కాలేజీ?” మళ్లీ అడిగాడు అనిరుద్ర.

“కాలేజీ పేరెందుకు?”

“మీ ప్రిన్సిపాల్ తో ఈ డిటైల్స్ చర్చించడానికి. మీ కాలేజీలో కూడా అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా...” అనరుద్ర కామ్గా చెప్పాడు.

అమ్మాయిల గుంపులో కలకలం. జీన్స్ వేసుకున్న అమ్మాయిలో భయం. ఏదో సరదాగా టీజ్ చేద్దామనుకుంటే అతనే తమకు పాఠం చెప్పేలా వున్నాడన్న భయం పట్టుకుంది. మెల్లిగా అక్కడ్నుంచి జారుకున్నారు.

“అనవసరంగా మంచి బేరం చెడగొట్టావు” కార్తీక్ అన్నాడు.

“వాళ్లేదో సరదాగా మనల్ని ఆటపట్టిస్తున్నారు. మనం ఏం చేసినా సీరియస్గానే పద...” అన్నాడు అనిరుద్ర.

“ఎక్కడికి?”

“ఎక్కడికి?”

“పత్రికలో యాడ్ ఇవ్వడానికి

“యాడా! ఏమని?”

“కావలెను. అందమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకుడికి ‘భర్తగా ఉద్యోగం ఇచ్చే అమ్మాయి కావలెను”

“ఏంటీ ఇలానే ఇస్తావేంటి? సీరియస్సే?” కార్తీక్లో అనుమానం.

“ఇంకా డౌటెందుకు? బామ్మ సమస్యకు, మన సమస్యకు పరిష్కారం ఇదే! అయినా నాక్కూడా లైఫ్ లో సెటిలవ్వాలని ఉంది. హాయిగా మొగుడి ఉద్యోగం చేసుకుంటూ, నెలనెలా జీతం తీసుకొంటూ వుంటే ఆ సెక్యూరిటీనే వేరు. ఎవరి కిందా పని చేయవలసిన అవసరం ఉండదు”

"భార్య కింద పని చేయాలిగా” కార్తీక్ అడిగాడు.

“పని చేయడమేమిటి? నా డ్యూటీ నేను చేస్తాను. కండీషన్స్ వెరీ క్లియర్... ట్రాన్స్పరెంట్...”

“అరే అనూ... మనం కలికాలంలోకి ప్రవేశించాం” అన్నాడు కార్తీక్ “ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్... నేనే కల్కిని. పద” అన్నాడు అనిరుద్ర.

***

స్టాఫ్ అంతా అసెంబ్లీ హాలులో బుద్ధిగా కూర్చున్నారు. పది నిమిషాల క్రితమే అందర్నీ అసెంబ్లీ హాలులోకి రమ్మని అనౌన్స్ మెంట్ చేశాడు శోభరాజ్.

'అసెంబ్లీ హాలులో సమావేశం ఏర్పాటుచేశాడంటే ఏదో విశేషం వుండే ఉంటుంది అన్న థాట్ అక్కడున్న వాళ్లందరికీ కలిగింది. శోభరాజ్ డయాస్ మీద వున్న కుర్చీలో కూర్చున్నాడు. అర్ముగం అందరికీ కాఫీ సర్వ్ చేశాడు.

“మై డియర్ స్టాఫ్... ఈ రోజు నేనో నిర్ణయం తీసుకున్నాను” అని ఆగాడు. ఆ నిర్ణయం ఏమిటో'నని అందరూ ఆసక్తిగా శోభరాజ్వైపు చూడసాగారు.

“మొగుడూ పెళ్లాలు ఉద్యోగం చేసుకుంటూ చన్నీళ్లకు వెడినీళ్లలా కలిసిపోతారు. కాని మొగుడు ఒక్కడే ఉద్యోగం చేస్తే... భార్య ఇంటి పనులు చక్కదిద్దుతూ ఉంటుంది. సంపాదించాలి భర్త ఒక్కడే. హ్... ఎంత కష్టం... అలానే భార్య ఉద్యోగం చేస్తుంటుంది. భర్తకు ఉద్యోగా దొరకదు. అప్పుడెంత కష్టం... భార్య సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం”

ఇదంతా బాస్ ఎందుకు చెప్తున్నాడో స్టాఫ్ కు అర్ధంకాలేదు. అనిమిష బాస్ ఏం చెబుతాడోనన్న క్యూరియాసిటీతో ఉంది.

“నేనో నిర్ణయానికి వచ్చాను. మనకంపెనీలో జాబ్ చేస్తున్న ఎంప్లాయికి మేల్ అయినా ఫిమేల్ అయినా... పెళ్లి అయివుంటే వాళ్ల భర్తకో, భార్యకో ఉద్యోగం లేకుండా వుంటే... వాళ్లకి రెట్టింపు జీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను”

ఒక్క క్షణం అందరూ షాకయ్యారు. వాళ్లకేమీ అర్ధంకాలేదు. శోభరాజ్ స్టాఫ్ వైపు చూసి, “మీరు కన్ఫ్యూజన్లో వున్నారని అర్ధమవుతోంది. ఇందులో కన్ ఫ్యూజన్ ఏమీలేదు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి మాత్రమే ఉద్యోగం వుంటే ఆ కుటుంబం సాగడానికి ఆర్ధికంగా ఇబ్బంది ఉంటుంది. అలా అని నేను ఆ కుటుంబంలోని మరో వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేను. అందుకని నా వంతుగా నా కంపెనీలో పనిచేసే వాళ్లయిన వారికి వాళ్ల పార్ట్నర్ కి ఉద్యోగం లేని పక్షంలో జీతాన్ని రెండింతలు చేస్తున్నాను. పెరిగిన ఆ జీతం నా వంతుగా అఫిషియల్గా ఇస్తాను. నా కానుకగా! వాటికి మీ శాలరీ స్లిప్పు మీద సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఈ కండీషన్ మీ పార్ట్నర్ కి ఉద్యోగం లేనంత వరకే... ఉద్యోగం దొరికితే ఈ సదుపాయం రద్దవుతుంది”

స్టాఫ్ చప్పట్లతో హాల్ మార్మోగిపోయింది. ముఖ్యంగా మగవాళ్లు వాళ్ల భార్యలంతా ఇంట్లో వుంటున్న వాళ్లే. నిఖితకు ఓ డౌట్ వచ్చింది. వెంటనే లేచి క్లారిఫై చేసుకుంది.

“సర్... మా ఆయనకు జాబ్ లేదు. నాక్కూడా డబుల్ శాలరీ ఫెసిలిటీ వర్కవుట్ అవుతుందా?”

“మీ ఆయన ఏం చేస్తారు?

“బిజినెస్”

“ఏం బిజినెస్?” అడిగాడు శోభరాజ్.

“ఫర్నిచర్..” చెప్పింది నిఖిత.

“ఆ బిజినెస్ డీటైల్స్ కనుక్కొని, ఓ క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలు వేసి, మీ ఆయన సంపాదన నెలకు యాభైవేలకు పైగానే వుంటుంది కదా...” అన్నాడు శోభరాజ్.

“ఉంటుంది సార్... కానీ ఆయనకు ఉద్యోగం లేదు కదా” నిఖిత నెమ్మదిగా అంది.

“పొరపాటు నాదే సిస్టర్... చిన్న సవరణ” అని స్టాఫ్ వైపు చూసి, “నా దగ్గర పనిచేసే స్టాఫ్లోని పార్ట్నర్స్ ఏ ఉద్యోగమూ, వ్యాపారమూ లేకుండా 'హౌస్'కే పరిమితమైన వాళ్లకే ఈ రెట్టింపు శాలరీ” అన్నాడు.

తర్వాత నిఖితవైపు చూసి, “థాంక్యూ సిస్టర్... మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు” అన్నాడు శోభరాజ్.

“వెల్కమ్ సర్” కచ్చగా అని కూర్చుంది నిఖిత. "ఏయ్ నిఖితా... ఏంటే సణుక్కుంటున్నావ్?” భావన అడిగింది.

“నాక్కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందేమో. ఆ డబ్బులతో నెలకో శారీ కొనుక్కోవచ్చు అనుకున్నాను” అంది నిఖిత.

“నువ్వే అలా ఫీలయితే నేను... మొన్నో సంబంధం వచ్చింది. అబ్బాయికి ఉద్యోగం లేదు. త్వరలో వస్తుందని... ఉద్యోగం లేని మొగుడు నాకెందుకు? అనుకున్నాను. అతన్ని చేసుకుంటే పోయేది...” ఫీలవుతూ అంది భావన. వాళ్ల మాటలు వింటూ ఆలోచనలో పడింది అనిమిష.

****

భోజనాలు చేసి హాలులో కూర్చున్నారు ద్విముఖ, అనిమిష .

“ఏంటి... మీ ఛానల్ విశేషాలు?” అడిగింది అనిమిష ద్విముఖను.

“నేను చేసిన 'ఏం చేయాలనుకుంటున్నారు?' ప్రోగ్రామ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అనిరుద్ర ఫోన్ నంబర్ కావాలని అడిగారు. మా ఛైర్మన్ పర్మిషన్ తో నేను అనిరుద్రను ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. డిఫరెంట్ ఇంటర్వ్యూ అవుతుంది” ద్విముఖ చెప్పింది.

“నీకు అతడి గురించి డీటైల్స్ తెలుసా?” అడిగింది అనిమిష

“డీటైల్స్... అంటే ఫోన్ నంబర్ తెలుసు. గుర్తుండే నంబర్” అని కళ్లు మూసుకొని టకటకా చెప్పింది. “92462-02616”.

“అతనికిదేం పిచ్చి... మొగుడిగా జాబ్ చేయాలన్న ఆలోచన వింతగా లేదూ” అనిమిష అంది.

“ఇలాంటి వింతయిన విషయాలు రోజూ ఎన్నో జరుగుతున్నాయి. విదేశాల్లో ఇలాంటి వింతలకు కొదవేమీ లేదు. ఆ మధ్య ఓ ప్రకటన వచ్చింది వెబ్ సైట్లో... ఆత్మను అమ్ముతున్నారన్న ప్రకటన అది. విచిత్రమేమిటంటే... ఆ ఆత్మను ఓ శాల్తీ కొనేశాడు కూడా...” ద్విముఖ చెప్పింది.

అనిమిష ఆలోచిస్తోంది. ద్విముఖ అనిమిష మొహం వంక పరిశీలనగా చూసి అడిగింది.

“ఏంటో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏదైనా విశేషం ఉందా? ఉంటే చెప్పు... నాకు చేతనైన సహాయం చేస్తాను”

“అదేం లేదు...” అంది ఏదో ఆలోచిస్తూ అనిమిష.

“నీకు ఇంకో విశేషం తెలుసా? అదీ అనిరుద్రకు సంబంధించిందే...” అంది హుషారుగా ద్విముఖ.

“ఏంటది?” క్యూరియాసిటీతో అడిగింది అనిమిష

“ఇవాళ అతను పేపర్ లో భర్త పోస్టు కావాలని ప్రకటన కూడా ఇచ్చాడు” అంది హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పేపర్ తీసి టీపాయ్ మీద పెట్టి.

అనిమిష ఆ పేపర్ తిరగేసింది. ఆరో పేజీలో ఓ కార్నర్ లో వచ్చిందా ప్రకటన. ఆ ప్రకటన చదువుతుంటే చిన్నపాటి ఉద్వేగం కలిగింది అనిమిషలో.

“ఈ ప్రకటన గురించే మా ఛానల్లో డిస్కషన్.. అందుకే నేనీ వివివిఐపీని ఇంటర్వ్యూ చేయాలనుకుంది” ద్విముఖ చెప్పింది.

ఆ రాత్రి ఒక నిర్ణయానికి వచ్చింది అనిమిష. ఆ నిర్ణయమే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంది. 'తన సమస్యలకు పరిష్కారం దొరకాలంటే ఒకే ఒక మార్గం. ఇప్పుడు బాల్ అనిరుద్ర కోర్టులో ఉంది' అనుకుంది అనిమిష .

* * *

బాదం చెట్టు కింద వున్న మంచమ్మీద కూర్చొని రెండు చేతులూ తల మీద పెట్టుకున్నాడు కార్తీక్. అతని పక్కనే తల కింద చేతులు పెట్టుకొని వెల్లకిలా పడుకున్నాడు అనిరుద్ర. మంచం మీద మొబైల్ ఫోన్. ఆ ఫోన్ ఉదయం నుండి నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది.

****

“అనూ... ఎంత పనిచేశావు? నువ్విచ్చిన యాడ్ ఏమిటోగానీ ఉదయం నుండి సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది. ఫోన్ నంబర్ ఇచ్చినవాడివి నువ్వే మాట్లాడొచ్చుగా. ముందు నన్ను మాట్లాడమంటావ్. అబ్బ... నీ ఐడియా చూశాక నాకు యాడ్ ఇవ్వాలనిపించింది. అయినా మొగుడి పోస్ట్ కు ఇంత డిమాండ్ ఉంటుందా? అయినా ప్రపంచంలో ఎవరికీ రాని ఐడియాలు నీకే ఎలా వస్తాయిరా....” నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే వున్నాడు కార్తీక్.

అప్పుడే మొబైల్ ఫోన్ మళ్లీ మోగింది. కార్తీక్ భయం భయంగా మొబైల్ చేతిలోకి తీసుకొని ఓకే బటన్ నొక్కి మెల్లిగా 'హలో' అన్నాడు.

“నేనూ హలోనే డియర్... మా ఆయన దుబాయ్ లో ఉన్నాడు. టెంపరరీ మొగుడి పోస్టు ఖాళీగా ఉంది. చేస్తావా?” గొంతులో విస్కీ వున్నట్టు హస్కీగా వుంది అవతలి గొంతు.

కార్తీక్ బెదిరిపోయి మొబైల్ ని అనిరుద్రకు ఇచ్చాడు. అనిరుద్రకు విషయాన్ని షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ లో చెప్పాడు. ఫోన్ కట్ చేసి నవ్వుతూ చెప్పాడు అనిరుద్ర.

“ఇలాంటివన్నీ కామన్... కొంతమంది కావాలనే టీజ్ చేస్తారు. మరి కొంతమంది ట్రయ్ చేస్తారు... అన్నట్టు మొత్తం ఇవాళ మన ఫోన్ కాల్స్ ఎన్ని?”

“దీంతో కలిపి వన్ ఫార్టీ టూ” అన్నాడు కార్తీక్.

“అంటే వన్ ఫార్టీ త్రీ... అంటే ఐ లవ్ యూకు ఒకటి తక్కువగా వుందన్నమాట...” అన్నాడు ఆ నెక్ట్ కాల్ అనిమిషదే అవుతుందన్న విషయం తెలియని అనిరుద్ర.

****
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 07:01 PM



Users browsing this thread: 1 Guest(s)