Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#15
అనిరుద్ర H/o అనిమిష - 6వ భాగం

ద్విముఖ అలసటతో వచ్చి సోఫాలో కూర్చుంది. “అనిమిషా... ఎక్కడికేల్లోచ్చావ్... నాకు ఒక్క క్షణం భయమేసింది తెలుసా?

“ఎందుకు?” అడిగింది అనిమిష.

“ఎందుకేమిటి... ఆరునెలల్లో యాభై నాలుగు హత్యలు, అరవై ఆరు హత్యాయత్నాలు, ఎనిమిది బందిపోటు దొంగతనాలు, తొంభై దోపిడీలు, నూట అరవై రెండు స్నాచింగ్లు జరిగాయి. ప్రపంచంలో నిమిషానికో రేప్ జరిగే దుస్థితిలో ఉన్నాం. నువ్విప్పటి వరకు రాకపోతే కంగారు 'వేయదా?” అనిమిష రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తూ అంది ద్విముఖ.

“నూటికి పదిమంది మాత్రమే ఇళ్లల్లో ఉంటారు. మిగతా తొంభై మంది రోడ్లమీదో, ఆఫీసుల్లోనో, షాపుల్లోనో, బార్లలోనో ఉంటారు. భయపడుతూ ఎక్కడికీ వెళ్లకుండా ఎలా ఉండగలం?” నవ్వి చెప్పింది అనిమిష.

“అంతేకానీ ఎక్కడికి వెళ్లావో... ఎందుకెళ్లావో... ఎందుకాలస్యమైందో మాత్రం లాభం లేదు. రహస్య కెమెరాతో నిన్ను ఫాలో అయి ఏదో ఓ రోజు ఆ నిజం నేనే తెలుసుకుంటాను అంది ద్విముఖ.

“ఆపరేషన్ ద్రౌపది...” అని పేరు పెట్టు...” నవ్వి సజెస్ట్ చేసింది అనిమిష.

ద్విముఖ అనిమిష వంకే చూస్తోంది. అనిమిష మొహంలో ఏ భావం కనిపించడంలేదు.

“నాకు నిద్ర వస్తోంది... గుడ్ నైట్” అంటూ మంచం మీద అడ్డంగా పడుకుండిపోయింది అనిమిష బలవంతంగా కళ్లు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది.

కళ్లు మూసుకుంటే నిద్ర రాదు. కల వస్తుంది. కలతను వెంట పెట్టుకొని పీడకల వస్తుంది. కళ్లు మూసుకుంటే కనిపించేది యాక్సిడెంట్.

***

“ఏయ్ భావనా... అనిమిష ఇంకా రాలేదుగా” నిఖిత మెల్లగా అడిగింది.

“రాలేదు... అయినా మన బాస్ కు అనిమిష ఎగ్జాంప్సనే కదా... అనిమిషను చూడగానే మన బాస్ మొహం చూడాలి.... దీపావళి రోజు రంగు రంగుల బల్బులతో షాపులు అలంకరిస్తారు చూడు... అలా ఉంటుంది” అంది భావన.

“థర్టీ ప్లస్ అయినా పెళ్లి చేసుకోలేదు. థర్టీకి దగ్గరవుతోన్న నాకు పెళ్లి కావడంలేదు" భావన విచారంగా చెప్పింది.

“పోనీ బాస్ ని ట్రై చేయరాదూ... అప్పుడైతే నేను ఏకంగా మధ్యాహ్నమే వచ్చి సంతకం చేసి వెళ్లొచ్చు” అంది నిఖిత.

“ట్రై చేయడాలు... లైన్లు వేయడాలు నాకు ఇష్టం ఉండదు. అయినా నాకు కన్నో కాలో వంకర అయి పెళ్లికావడంలేదన్న సమస్య లేదు... కేవలం నా హైటే సమస్య...” కాసింత విచారంగా మొహం పెట్టి అంది భావన.

“అవునవును... నీకో విషయం తెలుసా భావనా? బాస్ నీ పక్కన నిలబడితే... నువ్వే హైట్ అనిపిస్తావ్”

“అందుకే హైహీల్స్ మానేశాను. ఫ్లాట్ చెప్పులే వేసుకుంటున్నాను” చిన్నగా నవ్వి అంది భావన.

“అవును నాకో డౌట్... మగవాళ్లు హైట్... ఆడవాళ్లు పొట్టిగానే ఎందుకుండాలి అలాంటివాళ్లనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారా?”

“ఏమో... ఓ నవల్లో చదివిన గుర్తు... ఓ క్యారెక్టర్ నాలాంటి క్యారెక్టరే... దేవుణ్ణి వేడుకుంటుంది. 'దేవుడా... వచ్చే జన్మలో అయినా నన్ను పొట్టిగా పుట్టించు లేదా ఈ మగవాడి మనసులో విశాలమైన భావాలనైనా పుట్టించు' అని, నాలాగే తనకూ హైట్ ఓ ప్రాబ్లెమ్...” భావన అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో విషాదంతో కూడిన జీర ధ్వనిస్తోంది.

“ఇంతకీ ఇంధ్రధనుస్సులు ఎప్పుడు కనిపిస్తాయి?” భావన ఫీలింగ్స్ గమనిస్తూ టాపిక్ ను డైవర్ట్ చేస్తూ అడిగింది నిఖిత.

“అనిమిష రానీ...” భావన నవ్వి అంది.

“సాయంత్రం బాస్ పర్మిషన్ ఇస్తే ఎగ్జిబిషన్ కు వెళ్లాలి” అంది నిఖిత.

“అదేంటి మొన్ననే వెళ్లావుగా..”

“చెన్నై వాళ్లు పెట్టిన ఎగ్జిబిషన్ అది... అందులో ఓ చీర చూశాను. దాదాపు యాభై వేల రంగులున్నాయట... ఆ రంగులన్నీ బాస్ మొహంలో అనిమిషను చూసినప్పుడు కనిపిస్తాయట”

“ఇంకేంటి... కొనేసుంటావ్?”

“లేదు నా దైవాన్ని అడిగాను”

“నీ దైవమా... తిరుపతి వెంకటేశ్వర స్వామా?”

“కాదు... నా ఇంటి దైవం... అదే మా ఆయన్ని అడిగాను. “కావాలంటే రేపే దుబాయ్ వెళ్దాం. సింగపూర్ వెళ్దాం. బోర్గా వుంది వెరైటీ కావాలంటే పాకిస్తాన్ వెళ్దాం. ఎంచక్కా నువ్వు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ ని ఇంటర్వ్యూ చెయ్యొచ్చు. అంతేగానీ పది వేలు పోసి చీర కొంటానంటే నేనొప్పుకోనంతే...” అని జార్జ్ బుష్ లా అడ్డంగా మాట్లాడాడు” కచ్చగా అంది నిఖిత.

. “అంటే పాకిస్తాన్ కు వెళ్లే ఐడియా కూడా ఉందా? ప్రపంచంలో ఇలాంటి వెరైటీ ఐడియాలు మీ ఆయనకు తప్ప మరెవ్వరికీ రావేమో”

“ఏం చేయమంటావ్ భావనా... ఆయనకు ఎక్కడికీ వెళ్లకపోతే తోచదు... ఇంట్లో వుంటే ఎటైనా వెళ్తామని అంటాడనే ఈ జాబ్ చేస్తున్నాను. అయినా నాకు అప్పుడప్పుడూ బోర్ కొడ్తుంది. మన బాసాసురుడు ఇచ్చే జీతం... నా షాపింగులకే సరిపోదు” నిట్టూరుస్తూ అంది నిఖిత.

“క్వయిట్ కామన్... క్వయిట్ నేచురల్... క్వయిట్ ఇంట్రెస్టింగ్...” అంది నవ్వి భావన. హ్యాండ్ బ్యాగ్ తన టేబుల్ మీద పెట్టి బాస్ క్యాబిన్ వైపు నడిచింది.

***

“గుడ్ మాణింగ్ సర్” క్యాబిన్లోకి వెళ్తూనే శోభరాజ్ ని విష్ చేసింది అనిమిష.

“వెరీ గుడ్మాణింగ్... ఏంటీ ఇవ్వాళ కూడా లేటేనా? అయినా మీరు హాయిగా ఓ టూ వీలర్ తీసుకోవచ్చుగా... కంపెనీ లోన్ ఇస్తుంది. పెట్రోల్ అలవెన్స్ ఇస్తుంది” శోభరాజ్ అన్నాడు. "నాకు బస్ లేదా ఆటోనే కంఫర్ట్ సర్... టూ వీలర్ కొని... డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ తీసుకొని... వద్దు సర్”

శోభరాజ్ అనిమిష వంక చూసి, “కాఫీ తాగుతారా?” అని అడిగాడు.

“నో థాంక్స్...” అంది తల వంచుకునే అనిమిష

శోభరాజ్ తన సీటులోంచి లేచాడు. అనిమిష దగ్గరికొచ్చి, “అనిమిషా... నేను పదే పదే మీ వెంటపడ్డం... మిమ్మల్ని 'ఐస్' చేయడానికి ప్రయత్నించడం ఇదంతా మీకు అనిపిస్తోందా? అమెచ్యూర్డ్గా ఫీలవుతున్నారా?”

ఒక్క క్షణం ఆ మాటలతో తడబడింది.

“అదేం లేదు సర్...” అంది. నిజానికి బాస్ ప్రవర్తన ఆమెకు ఇబ్బందిగానే ఉంది.

“చూడండి అనిమిషా... నేను చాలా విషయాల్లో స్టెయిట్... మీ విషయంలోనే స్ట్రెయిట్ ని క్రాస్ చేయాల్సి వచ్చింది. మీరంటే నాకిష్టం. ఓ బాస్గా నేను ఇలా మాట్లాడకూడదు అఫ్ కోర్స్.... నేనిప్పుడు బాస్గా మాట్లాడ్డం లేదు. ఓ మగవాడిగా మాట్లాడుతున్నాను. ఓ అబ్బాయికి అమ్మాయి నచ్చిందనుకోండి అప్పుడా అబ్బాయి ఏం చేస్తాడు? ఐ లవ్యూ చెప్తాడు. రైట్...”

అనిమిష అవుననీ, కాదనీ అన్లేదు.

“కానీ నాలాంటి థర్టీ ప్లస్ అబ్బాయి మాత్రం... సారీ అబ్బాయి అనకూడదు... ఆ వయసు దాటిపోయాను కదూ...” అని ఆగి, “నాలాంటి థర్టీ ప్లస్ వ్యక్తి 'ఐ మ్యారీ యూ' అంటాడు. మిస్... ఐ మ్యారీ యూ... ఐ మీన్ ఇట్...” అన్నాడు శోభరాజ్.

ఒక్క క్షణం కలవరపడింది. ఇన్నాళ్లూ తన పట్ల అతను కన్సర్న్ చూపిస్తుంటే... అతడు తనను ప్రేమిస్తున్నాడన్న విషయం అర్థమైనా దానిని సీరియస్గా తీసుకోలేదు. అతను ప్రేమించుకుంటే తనకేంటి? తను ప్రేమించడం లేదు కదా అనుకుంది. ఇప్పుడు స్ట్రయిట్గా... పెళ్లి ప్రపోజ్ చేశాడు.

“మిస్ అనిమిషా వాడ్డూయూసే... మీ పెద్దవాళ్లతో మాట్లాడడానికి కూడా రెడీ...” అనిమిష ఇబ్బందిగా కదిలి, “నేను వెళ్తాను సర్” అంది.

“మీరు వెళ్లొచ్చు... బట్ నా ప్రపోజల్ ఆలోచించండి” బయటకు వెళ్తాన్న అనిమిషమే చూస్తూ అన్నాడు శోభరాజ్.

***

అనిరుద్ర ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనం కనిపించారు. అందులో ఎక్కువమంది స్త్రీలే వుండడం గమనార్హం.

“అనూ... కొంపదీసి బామ్మ గాయబా? యిట్స్ గానా? పోయిందే నా?” చిన్న ఆ ఇచ్చి క్లారిఫికేషన్ కోసం అడిగాడు కార్తీక్.

“అది పోదు... నా పెళ్ళో... నా కొడుకు బారసాలో చూసికానీ పోదు..." వుండగానే ఓ టీ కుర్రాడు అక్కడికొచ్చాడు.

'ఛాయ్... ఛాయ్... గరమ్ ఛాయ్” అంటూ ఆ మహిళా గుంపును అభిమన్యుడు మల్లె ఛేదించుకొని వెళ్తూ అరుస్తున్నాడు.

అనిరుద్ర ఆ టీ కుర్రాణ్ణి పిలిచి, “బాబూ... ఏంటా హడావిడి...” అని అడిగాడు. ఆ కుర్రాడు ఎగాదిగా చూసి, 'చాయ్ కావాలా?' అని అడిగాడు.

“వద్దు" చెప్పాడు అనిరుద్ర.

“సారీ... ఆ విషయాలన్నీ మీకెందుకు? రెండ్రూపాయలు పెట్టి చాయ్ తాగరుగానీ డీటైల్స్ కావాలి..” అంటూ గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

“వార్నీ వేలెడుకు జానెడంత లేడుగానీ ఎంత డవలప్ అయ్యాడు” బుగ్గలు నొక్కుకున్నాడు కార్తీక్. ఈలోగా ఆ గుంపులోని ఒకావిడ, “అదిగో... పెళ్లికొడుకు” అని కీచుగా అరిచింది.

అందరి దృష్టి అనిరుద్ర మీద పడింది. అప్పుడే బామ్మ ఎంట్రీ ఇచ్చింది.

“రారా అనిరుద్ధుడూ...” అంటూ మనవడ్ని ప్రేమగా లోపలికి తీసుకుపోయింది.

“ఒసే బామ్మా... ఈ సీనేంటి?” చిరాగ్గా అడిగాడు అనిరుద్ర.

“స్వయంవరం... నిన్న టీవీలో నీ ఇంటర్వ్యూ చూసి బందరులో వున్న బండ మామయ్య 'ఒరే ఒరె... మన అనిరుద్ధుడికి అప్పుడే పెళ్లి వయసు వచ్చిందా? నా ఎరికలో నాలుగైదు ఆరేడు సంబంధాలు వున్నాయని చెప్పాడు. వెంటనే ఆ సంబంధాలను కొరియర్ చేయమన్నాను. అలాగే నాకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసి పిలిపించాను. కట్నం ఒక లకారం నుంచి పది లకారాల వరకు పలుకుతుంది. చుడీదార్లు, చీరలు, జీన్స్, మిడ్డీలు... నీ ఇష్టంరా... అన్నట్టు పెళ్లి చేసుకుంటే బోనస్గా ఉద్యోగం ఇప్పిస్తానని కూడా అంటున్నారు” బామ్మ మురిసిపోతూ చెప్పుకుపోతోంది.

ఓసారి బామ్మ వంక కోపంగా చూసి బయటకు వచ్చి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పాడు.

“నన్ను అల్లుణ్ణి చేసుకోవాలని మీరందరూ ఉత్సాహపడిపోతున్నారని మా బామ్మ చెప్పింది. రొంబ సంతోషం... అయితే నాకు కట్నం అక్కర్లేదు... శాలరీ... అదే జీతం కావాలి. నాకెంత జీతం ఇస్తారో ఓ కాగితం మీద రాసి, ఓ కవర్లో పెట్టి... మీ పేరు, అడ్రస్ రాసి...” అని ఆగి ఓ మూలన పడివున్న బిందె తీసి అందులోని నీళ్లు ఒలకబోసి, శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచి, “ఈ బిందెలో వేసి వెళ్లండి. తర్వాత మీ కొటేషన్సును బట్టి నేను ఎవరి మొగుడిగా ఉద్యోగం చేయాలో ఆలోచించి పెడతాను” అంటూ చేతులు జోడించి చూసేసరికి అక్కడ ఒక్కరూ లేరు.

ఎవరికి వారే గొణుక్కుంటూ మాయం అయ్యారు.

ఎప్పుడైతే తను కష్టపడి అనిరుద్ర కోసం ఏర్పాటుచేసిన స్వయంవరాన్ని అనిరుద్ర డిఫ్యూజ్ చేశాడో... అప్పుడే బామ్మ అలిగింది. ఈ నిరసనను వినూత్న పద్దతిలో వ్యక్తపరిచింది. బామ్మ ముందు చికెన్, మటన్, వెజ్ బిర్యానీలు, చపాతీ, బట్టర్ ఖాన్, తందూరీలు... స్వీట్స్ ఉన్నాయి. వాటిని ఓ క్రమపద్ధతిలో కాకుండా తనకు ఇష్టమొచ్చిన రీతిలో తింటోంది.

“ఒరే అనూ... బామ్మ వరస చూస్తుంటే తినీ తినీ పోయేలా ఉంది. అయినా ఇదేం నిరసన?” అడిగాడు భయం భయంగా కార్తీక్..

“జపాన్ స్టయిల్... అక్కడ మన వాళ్లలా పని మానేసి రోడ్ల మీద బైటాయించి స్ట్రయికులు చేయరు. ఉత్పత్తి పెంచేసి తమ నిరసనను వ్యక్తం చేస్తారు. బామ్మ కూడా అంతే. తింటూ నిరసన వ్యక్తం చేస్తుంది”

“పొట్ట పగిలేలా ఉంది” భయంగా అన్నాడు కార్తీక్. .. “అందుకే సోడాలు కూడా పక్కనే పెట్టుకుంది”

“జోకులాపు... ఏదో ఒకటి చేసి బామ్మ వింత నిరసనకు ఫుల్ స్టాప్ పెట్టించు... లేకపోతే తన చావుకు కారణం నేనేనని రాసి పెట్టి చచ్చినా చస్తుంది” మరింత భయం భయంగా అన్నాడు కార్తీక్.

****

“బామ్మా... నేను ఉద్యోగం చెయ్యాలి. బుద్ధిగా పెళ్లి చేసుకోవాలి. ఈ రెండూ చేస్తే నీ ఆత్మ సంతోషిస్తుందా?”

“ఆత్మ కాదు. నేనింకా చచ్చి పూడ్చలేదు. నా మనసు సంతోషిస్తుంది” చెప్పింది బామ్మ “సరే... త్వరలో నీ కోరిక నెరవేరుస్తా. నువ్వీ తిండి నిరసన మానెయ్” “ఒట్టు...” అడిగింది బామ్మ..

“ఒట్టు” అంటూ బామ్మ తల మీద చెయ్యి వేయబోతుంటే తల వెనక్కి తీసుకొని, కార్తీక్ ని ముందుకులాగి “వీడి తల మీద చెయ్యి పెట్టి... వీడు చచ్చినంత ఒట్టు... అని ఒట్టు పెట్టు... పోతే వాడు పోతాడు... లేదంటే నువ్వు బాగుపడతావ్” అంది బామ్మ.

కార్తీక్ బిక్క చచ్చిపోయాడు. బామ్మ వింత నిరసనకు స్వస్తి చెప్పింది.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 02:01 PM



Users browsing this thread: 1 Guest(s)