Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#11
అనిరుద్ర H/o అనిమిష - 5వ భాగం

పది గంటల పది నిమిషాలు.

నిఖిత వగరుస్తూ వచ్చింది. శోభరాజ్ నిఖిత వంక చూశాడు.

“గుడ్ మార్నింగ్ సర్... సారీ సర్” అంది నిఖిత శోభరాజ్వైపు చూసి.

“మొదటిది విష్ రెండోది లేట్గా వచ్చినందుకు అపాలజీ కదూ” అడిగాడు శోభరాజ్.

“నో సర్... యస్ సర్” అంది ఏమనాలో తోచక.

అటెండెన్స్ రిజిష్టర్ ఆమె ముందుకు జరిపాడు శోభరాజ్. రిజిష్టర్లో సంతకం చేసి “లేట్' అన్న కాలమ్ వైపు చూసింది.

మూడు కాలమ్స్ పూర్తయ్యాయి. “ఈ నెలలో ఇది నాలుగో లేట్...” శోభరాజ్ నిఖితవైపు చూశాడు.

“సారీ సర్... సేమ్ రీజన్... బస్సులు దొరకలేదు. ఆటోవాళ్లు మీటర్ చార్జీలు పెంచాలని మళ్లీ స్ట్రయిక్ చేస్తున్నారు” చెప్పింది నిఖిత.

శోభరాజ్ ఓసారి నిఖితవైపు చూసి తలపంకించి, స్టాఫ్ అందరివైపు చూశాడు.

“ఇవ్వాళ సాయంత్రం ఆఫీసు వదిలాక ఇక్కడ చిన్న పార్టీ ఉంది. అందరూ రావాలి... అన్నట్టు ఆ పార్టీ ఇచ్చేది నిఖితే...” అంటూ తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు.

****

భావన ఫోన్ ని క్లీన్ చేస్తుంటే ఇంటర్కమ్ రింగయింది. ఫోన్ లిఫ్ట్ చేసి, 'యస్ సార్' అంది. "

“అనిమిష ఇంకా రాలేదా?” అడిగాడు శోభరాజ్.

“లేదు సర్”

“టైం పదిన్నర దాటింది కదూ...” తనలో తాను గొణుక్కున్నట్టు అన్నాడు.

“యస్ సర్”

శోభరాజ్ ఫోన్ పెట్టేశాడు. భావన రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. నిఖిత భావనవైపు చూసి గుసగుసగా, “ఏమిటి సంగతి?” అని అడిగింది.

“బాస్ ఏడ్చాడు” చెప్పింది భావన అంతే గుసగుసగా. .

“అయితే అనిమిషను రమ్మను... నాలుగేళ్ల క్రితం నుంచీ బాస్ ఇలానే ఏడుస్తున్నాడు” నిఖిత నవ్వి అంది.

ఈలోగా అటెండర్ అర్ముగం ఆ ఇద్దరి మధ్యకు వచ్చి, “ఏమిటి సంగతి?” అని అడిగాడు.

“బాస్ ఏడ్చాడు” అంది భావన నవ్వి. అనిమిష మేడమ్ని రమ్మంటే సరి” అర్ముగం నవ్వి అన్నాడు. ఆ 'ఏమిటి సంగతి?” గుసగుసలా ఆ ఆఫీసులో అలా ఓ రౌండేశాయి. "

ఈలోగా అనిమిష వచ్చింది. వస్తూనే ఆఫీసులో దిష్టిలా వున్న పెద్ద గోడ గడియారం వంక చూసింది. అందులో అంకెలులేవు. అంకెల స్థానంలో శోభరాజ్ తల భాగాలు అతికించబడి ఉన్నాయి.

టైం చూసినప్పుడల్లా తనే గుర్తుకు రావాలని శోభరాజ్ చేసిన ఏర్పాటు అది.

“టెన్ థర్టీ ఫైవ్...” అనిమిష గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఈలోగా అర్ముగం వచ్చాడు.

“అర్ముగం... రిజిష్టర్ వెళ్లిపోయిందా?”

వెంటనే అర్ముగం కుడి చేతి చూపుడు వేలిని నోటి మీద పెట్టుకొని బాస్ క్యాబిన్వైపు తల తిప్పాడు.

అనిమిష బాస్ క్యాబిన్ వైపు నడిచింది. అనిమిష బాస్ క్యాబిన్లోకి అడుగుపెట్టగానే భావన గుసగుసగా నిఖితతో అంది.

“శోభరాజ్ సమర్పించు... 2006 ఎ లవ్ స్టోరీ” వెంటనే అర్ముగం ఆ ఇద్దరి మధ్యకు వచ్చి “ప్రొడ్యూస్ట్ బై అర్ముగం” అన్నాడు.

****

“సారీ సర్... గుడ్మాణింగ్ సర్” అంది అనిమిష శోభరాజ్ అనిమిష వంక చూస్తూ “మొదటిది అపాలజీ... రెండవది విష్ కదూ”

“యస్సార్... ముందు తప్పు ఒప్పుకోవడం మర్యాద” టేకిటీజీ మిస్ అనిమిష... ఈ నెలలో ఇది మరి ముప్ఫయ్యవ లేట్ కదూ” అడిగాడు

శోభరాజ్.

“అవును సర్... ఈ నెలలో వున్నవి ముఫ్పై రోజులే” చెప్పింది అనిమిష.

“లేట్ రీజన్ సేమ్ టు సేమ్ కదూ”

“అవును సర్... ట్రాఫిక్ జామ్... బస్సులు దొరక్కపోవడం” “చేపా చేపా ఎందుకు ఎండలేదు కథ తెలుసా?” అడిగాడు శోభరాజ్.

“చిన్నప్పుడు విన్నాను సర్... అయినా నాకు ఫిష్ అంటే ఎలర్జీ. చికెన్, మటన్. ఫిష్ తినను... దాని మీద పెద్దగా ఆసక్తిలేదు”

“నేను ఫిష్తో ఏ వెరైటీస్ చెయ్యొచ్చో చెప్పడం లేదు... అదో కథ... ట్రాఫిక్ ట్రాఫిక్ ఎందుకు జామ్ అయ్యావంటే... వెహికల్స్ నడిపేవాళ్లని అడగమందిట... వాళ్లను అడిగితే ఇష్టమొచ్చినట్లు వన్ వేలను పెట్టే వాళ్లను, మినిస్టర్లు వస్తున్నారని... ట్రాఫిక్ ఆపే వాళ్లను అడగమందిట... అంతా తిరిగి గవర్నమెంట్ దగ్గరకి వెళ్లిందట కథ చెప్పి నవ్వి అనిమిష మొహం వంక చూశాడు.

“నవ్వు రాలేదు కదూ... జోక్స్ వేయడం... సమయానుకూలంగా సందర్భోచితంగా మాట్లాడడం నాకు తెలియదు”

“నోనో సర్... అలాంటిదేం లేదు... రిజిష్టర్ లో సంతకం...”

“నోప్రాబ్లెం... అయినా నీ ప్రాబ్లెం సాల్వ్ కావడానికి నేనో మార్గం చెప్తాను. హాయిగా వెహికల్ కొనుక్కో”

“సారీ సర్... ప్రస్తుతం లోన్ కట్టే పొజిషన్లో లేను”

“అనిమిషా... నువ్వొక్కదానివే కదా... నీకు వచ్చే శాలరీ నాలుగు అంకెల్లో ఉంటుంది కదా. అంత డబ్బేంచేస్తావ్?” అని అగి, “సారీ అది నీ పర్సనల్ కదూ” అన్నాడు.

అనిమిష సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. శోభరాజ్ రిజిష్టర్ ని ఆమె ముందుకు తోశాడు. రిజిష్టర్ లో సంతకం చేసి ఆమె వెళ్తుంటే, “ఎటో వెళ్లిపోయింది మనసు...” పాటను హమ్ చేసుకోసాగాడు శోభరాజ్.

*****

ఈవెనింగ్ ఫైవ్ థర్టీ.

స్టాఫ్ అంతా అసెంబ్లీ హాలులోకి వచ్చారు. డయాస్ మీద టివిఎస్ స్కూటీ కొత్తది ఉంది. . శోభరాజ్ డయాస్ మీదికి వచ్చాడు. అర్ముగం స్వీట్ ప్యాకెట్ తెచ్చాడు.

శోభరాజ్ గొంతు సవరించుకొని, “డియర్ స్టాఫ్... ఈ కొత్త స్కూటీ చూశారుగా... చాలా బావుంది కదూ... దీనికి ఓనర్ ఎవరో తెలుసా? నిఖిత... గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్" అనగానే, స్టాఫ్ అంతా చప్పట్లు కొట్టారు.

“మిసెస్ నిఖితా... కమ్ హియర్ టేక్ కీస్... నీ ఆలస్యానికి కారణం నీకో వెహికల్ లేకపోవడం... నువ్వు లేట్గా వచ్చే ప్రతి నిమిషం మన సంస్థకు నష్టమే... రేపట్నుంచి నువ్వు లేటుగా రావాల్సిన అవసరం ఉండదు. అలా అని ఈ వెహికల్ కోసం డబ్బు ఖర్చయిపోతుందన్న ఫీలింగ్ వద్దు. నీకు నెలకు బస్సు ఛార్జీలు, ఆటో ఛార్జీలకు కలిపి ఎంతవుతుందో... అంతే అమౌంటిని నెలనెలా మన సంస్థలో లోన్ అమౌంట్ కింద కట్టు. నీకు వెహికల్ వుంది కాబట్టి... పెట్రోల్ అలవెన్స్ కూడా ఎక్స్ట్రాగా అందుతుంది” అన్నాడు శోభరాజ్.

నిఖిత సంతోషం ఆపుకోలేక చప్పట్లు కొట్టింది.

శోభరాజ్ అనిమిష వంక చూసి, “మీలో ఎవరైనా సరే... వెహికల్స్ కావాలనుకుంటే అప్లయ్ చేసుకోవచ్చు. మీరు బస్ ఛార్జీలకు చెల్లించే డబ్బును లోన్ అమౌంట్గా పేచేస్తే చాలు. అంతేకాదు పెట్రోల్ అలవెన్స్ కూడా అందుతుంది” అన్నాడు.

స్టాఫ్ మరోసారి చప్పట్లు కొట్టారు. స్టాఫ్ ఒక్కొక్కరే వెళ్తున్నారు. నిఖిత హుషారుగా స్కూటీని బయటకు తీసింది. సరదాగా తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ తనకు ఈ విధంగా పనికొచ్చినందుకు మురిసిపోయింది.

అనిమిష ఇంటికి వచ్చేసరికి హాలంతా నీట్గా ఉంది. టీపాయ్ మీద చిప్స్ ప్యాకెట్... కాఫీ ఫ్లాస్క్ రెండు కప్పులు ఉన్నాయి. అనిమిషకు సగం అర్ధమైంది. మిగతా సగం బాత్రూంలో నుండి స్నానం చేసి నైటీలో వస్తూ ద్విముఖ చెప్పింది.

“నా ఫేవరెట్ ప్రోగ్రాం వస్తుంది... ఎంత కష్టపడి చేసి వుంటాననుకుంటావ్... కానీ చూసేవాళ్లు చాలామంది అలా ఛానల్ మార్చి ఇలా చూస్తారుగానీ... ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం ఎంత కష్టమనుకున్నావ్?” ఉపోద్ఘాతం లేకుండానే మొదలుపెట్టింది ద్విముఖ.

“నేను కూడా ఫ్రెషప్ అయి వచ్చాక నీ సాధక బాధకాలు వింటాను” అంటూ హ్యాండ్ బ్యాగ్ ని సోఫాలోకి గిరాటేసి బాత్రూంలోకి వెళ్లింది.

పది నిమిషాల తర్వాత మొహం తుడుచుకుంటూ వచ్చి టీవీ ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంది.

“ఇప్పుడు చెప్పు... చిప్స్ తింటూ వింటా” అంది చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ..

“అసలు యాంకర్ జాబ్.. అంటే...” అని చిప్స్ ప్యాకెట్లోని చిప్స్ నోట్లో వేసుకొని, “చిప్స్ బాగున్నాయి కదూ... మొన్నోసారి స్నాక్స్ స్నాక్స్ ప్రోగ్రామ్ కోసం ఓ బేకరీకి వెళ్లి షూట్ చేస్తుంటే ఆ బేకరీ వాళ్లు నన్ను మెచ్చి ఓ పది పన్నెండు చిప్స్ ప్యాకెట్స్ ఫ్రీగా ఇచ్చారు. కెమెరామెన్, శ్వేత, అసిస్టెంట్లు పంచుకోగా మిగిలిన ప్యాకెట్ ఇది...” చెప్పింది ద్విముఖ.

“యాంకర్ అనిపించుకున్నావు... అసలు ఆ దేవుడు వసపిట్టల్ని సృష్టించినప్పుడు... మా డ్యూటీలేమిటని బ్రహ్మని అడిగాయట... మీ డ్యూటీ... టీవీలు వచ్చాక ఎక్కువవుతుంది...

మీ స్నేహితులు మీ దారిలోనే నడుస్తారు.. మీకు యాంకర్లు అనే కొత్త పేరు జత చెప్పాడట” నవ్వి అంది అనిమిష

“సెటైరా? మా యాంకర్ల కష్టాలేం తెలుసు... మొన్న 'ఏం చేయాలనుకుంటున అన్న ప్రోగ్రామ్లో భాగంగా ఓ శాల్తీని ఇదే ప్రశ్న అడిగితే, “అందమైన అమ్మాయిలను చేయాలనుకుంటున్నాను” అని చెప్పాడు. మరో శాల్తీ అయితే నేనేం చేస్తే మీకెందుకు? అని ఇంకొందరు మావైపు హీనంగా చూశారు. టీవీలో కనిపించాలనే ఇంట్రెస్ట్ వున్న వాళ్లను ఇలా ప్రోగ్రామ్స్ పట్ల ఆసక్తి వున్న వాళ్లను పట్టుకోవడం అంత సులభం కాదు”

“చాలామందికి ఓ అనుమానం. మేమే ప్లాన్డ్ గా ముందు మనుషులను ప్లాన్ చేసి ఉంచుతామని. రిహార్సల్స్ చేయిస్తామని. ఏదో ప్రోగ్రామ్! అలా వుంటే వుండొచ్చుగాక. అన్నీ అలా ఉండవు కదా... కొందరైతే మేము షూటింగ్ చేయడానికి వెళ్తే మా వెనకే ప్రపంచ గూఢచారులా ఉంటారు. మేము వెళ్లకముందే అన్నీ చెక్ చేసుకుంటారు”

“అన్నీ చెక్ చేసుకుంటారంటే గుర్తొచ్చింది. మొన్నీ మధ్య మా కొలీగ్ ఒకనాడు ఏదో వంటల ప్రోగ్రామ్ వాళ్ల ఇంట్లో ఏర్పాటు చేసిందట. షూటింగ్ అయిపోయాక చూస్తే దేవుడింట్లో దేవుడి మినీ హుండీ కనిపించలేదంట. కొంపదీసి షూటింగ్ వాళ్లే నొక్కేసి ఉంటారంటావా? డౌట్ గా అడిగింది అనిమిష

“ఛఛ... అలా అయి ఉండదు. అయినా ఆ విషయాలు నేనెలా చెప్పగలను? అన్నింటిలోనూ ఇంటూలు డివైడెడ్ బైలు ఉంటాయి”

“అదేంటి ప్లస్లు... మైనస్లు అంటారు కదా...” అంది అనిమిష ఆశ్చర్యపోయి.

“టీవీ యాంకర్ ని కదా... వెరైటీ కోసం వాడాను....” అంటూ టైం చూసుకుంది.

“టైమైంది... డిస్ట్రబ్ చేయకుండా ప్రోగ్రామ్ చూడు...” అంటూ టీవీ ఆన్ చేసింది.

***

“హలో గుడ్ ఈవెనింగ్... శుభ సాయంత్రం! నమస్కారం! దిసీజ్ ద్విముఖ... యువర్ ఫేవరేట్ యాంకర్... హాయ్...” స్క్రీన్ మీద ద్విముఖ కనిపించింది.

ద్విముఖ ఓసారి అనిమిష వంక చూసింది.

“ఈ రోజు మేము ఓ వెరైటీ ప్రోగ్రామ్తో మీ ముందుకి వస్తున్నాము... దాని పేరే...” స్క్రీన్ మీద ద్విముఖ మాయమైంది.

“ఏం చేయాలనుకుంటున్నారు?” అన్న అక్షరాలు కనిపించాయి. ఆ తర్వాత సినిమా క్లిప్పింగులు... తర్వాత మళ్లీ ద్విముఖ ప్రత్యక్షమైంది.

“వైజాగ్ బీచ్లో... కుర్రకారు నుండి ఓల్టేజ్ సిటిజన్స్ వరకు 'ఏం చేయాలనుకుంటున్నారో వినండి” అంటూ మైకు పట్టుకొని ముందుకు కదిలింది.

అనిమిష బీచ్లో జనం చెప్పే అభిప్రాయాలు వింటోంది. అనిరుద్ర స్క్రీన్ మీద కనిపించగానే సన్నటి ఉద్వేగం కలిగింది అనిమిషలో అప్రయత్నంగా.

అతని మాటలు వింటుంటే గమ్మత్తుగా అనిపించింది.

***

“అనిమిషా... ప్రోగ్రామ్ ఎలా ఉంది?” అడిగింది ద్విముఖ టీవీ ఆఫ్ చేస్తూ.

“బావుంది... అయినా నీకిలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలనే ఐడియాలు ఎలా వస్తాయి?”

“అది మా క్రియేటివ్ హెడ్ చూసుకుంటారు. కానీ నీకో విషయం చెప్పనా? మా ఛానల్ లో చాలామంది మా క్రియేటివ్ హెడ్ లకు 'హెడ్' లేదంటారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారని అందర్నీ అడుగుతాడు. వాళ్లు చెప్పిన ఐడియాలు విని, 'వెరీగుడ్... నేనూ ఇలాగే అనుకున్నాను. నాకు దగ్గరగా వచ్చారు. ప్రొసీడ్ అవ్వండి' అంటాడు” చెప్పింది ద్విముఖ నవ్వుతూ.

***

ద్విముఖ అనిమిష కోసం ఎదురుచూస్తోంది. సరిగ్గా అరగంట క్రితం 'ఇప్పుడే వస్తాను” అంటూ వెళ్లిన వ్యక్తి ఇంకా రాకపోవడతో కాసింత కంగారు కలిగింది. అయితే ఇది ద్విముఖకు కొత్తకాదు. తరచూ ఇలా వెళ్తూ ఉంటుంది. 'ఎక్కడికి?” అని ఎప్పుడు అడిగినా చెప్పదు.

అనిమిష, ద్విముఖ బాల్య స్నేహితురాళ్లు కాదు. కనీసం క్లాస్ మేట్స్ కూడా కాదు. అనుకోకుండా కలిశారు. సిటీలో ఇద్దరు ఆడవాళ్లు ఎవరికి వారు ఒంటరిగా వుండడంకన్నా కలిసివుంటే ధైర్యంగా వుంటుందని ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అనిమిష ఎప్పుడూ తన వాళ్ల గురించి చెప్పలేదు. తనకెవరైనా వున్నారో లేదో కూడా తెలియదు. అనిమిష ఏమీ. చెప్పకుండా అడగడం సభ్యతకాదని ద్విముఖ ఏమీ అడగలేదు.

****
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 11:23 AM



Users browsing this thread: 2 Guest(s)