Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#9
అనిరుద్ర H/o అనిమిష - 3వ భాగం

“నీ ఫ్రెండ్ ని ఉద్యోగం త్వరగా వెతుక్కోమను... నాకు వయసైపోతోంది. నేను చచ్చేలోగా వాడు ఏదోక ఉద్యోగం చేయడం చూడాలి...”

“ఆ విషయం నువ్వే చెప్పొచ్చుగా....”

“ఇప్పుడా?... ఇప్పుడు నా బంగారుకొండ నిద్ర చెడిపోదూ....”

నోరు వెళ్లబెట్టి “అందుకని నా నిద్ర చెడగొడతావా? నీ కన్నా ఇడీ అమీన్ బెటర్ బ్రతికున్న రోజుల్లో మెదళ్లు గుండెకాయలు తిన్నా చచ్చి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వేంటి అంటే నిద్రపోతున్న నన్ను నిద్రలేపి క్లాసు పీకుతున్నావు” కోపం, నిద్ర చెడిపోయిందన్న ఒళ్లు మంటనీ మిక్స్ చేసి అన్నాడు కార్తీక్.

“ఒక్కరోజు నిద్ర పోకపోతే వచ్చే నష్టమేమీ లేదు. రేపట్నుంచి దుప్పటెం ఖర్మ... ఏకంగా పరుపే కప్పుకొని పడుకుందువుగానీ... నేను పోయాక నా పరుపు నీ పేరు మీదే రాసిస్తాలే” బామ్మ అంది.

ఒకసారి బామ్మ వంక పిచ్చిచూపులు చూసి, “రేపట్నుంచి ఇక్కడ పడుకుంటే ఫోర్క్ మాంసం తిన్నంత ఒట్టు” కసిగా అన్నాడు కార్తీక్.

“నువ్వు ఫోర్క్ తింటే నాకెందుకు.... ఎలుగొడ్డు మటన్ ఫ్రై చేసుకుంటే నాకెందుగ్గానీ... ఒరే కార్తీకుడూ... నువ్వూ నా మనవడిలాంటివాడివే కదరా...”

“అబ్బ... సెంటిమెంట్తో ఆయింటిమెంట్ లేకుండా వాతలు పెడతావు కదా బామ్మా.... నీ బాధేమిటో చెప్పు?” అన్నాడు బుద్ధిగా లేచి మంచంలో పద్మాసనం వేసి కూర్చొని.

బామ్మ లేచి నిలబడింది. కురుక్షేత్రంలో కృష్ణుడి విశ్వరూపం కనిపించింది కార్తీక్ కి.

“చెప్పేది... మొత్తుకునేది... చస్తానని బెదిరించేది అంతా నేనే... అది నైన్టీన్ థర్టీసిక్స్...

“ఎ లవ్ స్టోరీనా?” కూసింత ఆసక్తిగా అడిగాడు కార్తీక్.

“కాదు... ఎ ట్రాజెడీ స్టోరీ... మధ్యలో టీవీ సీరియల్ లో చాలాసేపు వచ్చే యాడ్స్ లా డిస్ట్రబ్ చేయకు....”

“సరే బామ్మా... నువ్వు కూడా డైలీ సీరియల్ మాదిరి కాకుండా, ఇంగ్లీష్ సినిమాలా క్లుప్తంగా చెప్పు”.

బామ్మ చెప్పడం మొదలుపెట్టింది.

“మా ఆయన మంచి కళాపోషకుడు.. కంటికి నదురుగా కనిపించిన అమ్మాయిలను పోషించడంలో సకల కళా వల్లభుడే... తండ్రితాతల ఆస్తి. ఉద్యోగమూ సద్యోగమూ లేదు. చేతి నిండా డబ్బు... ఒంటి నిండా బంగారం... ఇంకేం... ఆ రోజుల్లో ఊరి చివర వుండే చిత్రాంగి దగ్గర్నుండి నాలుగూళ్ల అవతల వుండే చింతామణి వరకూ ఆయన పాత ఖాతాలే...

“తాతయ్యకు అంత గొప్ప హిస్టరీ ఉందా? మరి నిశ్శబ్దాన్ని ఛేదించలేదా?. "

“ఏ నిశ్శబ్దం?”

“అదే బామ్మా.. నిశ్శబ్దాన్ని ఛేదించండి.... పులిరాజా వస్తున్నాడు...” బామ్మకు విషయం సగం అర్ధమైంది.

“ఆయన పులిరాజా లాంటివాడే కానీ పులిరాజా కాదు. ఆ రోజుల్లో ఇలాంటి దిక్కుమాలిన జబ్బుల్లేవ్... అయినా స్టోరీ మధ్యలో ఇంటర్ఫియరవ్వకు...” బామ్మ కసురుకుంది. కార్తీక్ అలాగే అన్నట్టు బుద్ధిగా తలూపాడు.

“వీళ్ల తాతని ముద్దుగా మైనర్ బాబు అని పిలిచేవాళ్లు ఊల్లోని ఆడంగులు... తాసిలార్ ఉద్యోగం చేయబోతున్నాడని చెప్పి నా గొంతు కోశారు....” ముక్కు చీది కార్తీక్ చొక్కాకు తుడిచి కొ...న...సా...గిం...చిం...ది.

“అలా అలా ఆ రోజుల్లోనే అంజలీదేవిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. వహీదా రెహ్మాన్ దగ్గరికి వెళ్లి, 'నన్ను పెళ్లి చేసుకోవా?' అని అడుగుతానన్నాడు... చెప్పా పెట్టకుండా మెడ్రాస్ రెయిలెక్కి వెళ్ళొచ్చాడు” .

“వాళ్లు ఒప్పుకున్నారా?” కుతూహలంగా అడిగాడు కార్తీక్.

“చెప్పుచ్చుకున్నట్టున్నారు... తర్వాత వాళ్ల ఊసెత్తలేదు. ఆ తర్వాత మా మన్మధుడు పుట్టుకొచ్చాడు”

“మన్మధుడా... ఏదీ ఆ రతి హజ్బెండ్...”

“స్స్...మీ అనిరుద్దిడి అబ్బరా నీయబ్బ...”

“అంకుల్ పేరు మన్మధరావు కదా”

“ఏదో ఓ రావులే... కొడుక్కి తనలోని కళాపోసన అంతా ఉగ్గుపాలతో పోసి తనంతటోడు కావాలని మన్మధరావన్న పేరు పెట్టాడు. ఆ ముసలోడికి మల్లే వీడికి ఉద్యోగం సద్యోగం లేక, సినిమాల్లో నటిస్తానని మద్రాసెళ్లాడు... జ్యోతిలక్ష్మి, జయమాలినీలని హీరోయిన్లుగా చేయమన్నాడు. ఆ సినిమా పిచ్చితో లక్షలకు లక్షలు హారతులిచ్చేసి వచ్చాక బలవంతంగా మెడలు వంచి పెళ్లి చేస్తే మా అనిరుద్ధుడు పుట్టాడు” బామ్మ చెప్పడం ఆపింది.

“ఆ తర్వాతేమైంది బామ్మా..” ఆవులిస్తూ అడిగాడు కార్తీక్.

“నాకు భయం పట్టుకుంది... మా అనిరుద్ధుడు కూడా వాళ్లలా చెడిపోతాడేమోనని”

“అసలు నీకు అట్లాంటి థాట్ ఎవరు ఇచ్చారు బామ్మా...”

“మా అనిరుద్ధుడు కూడా వాళ్లకు మల్లె ఉద్యోగం చేయనని మొండికేయడం వల్ల.

“ఉద్యోగానికీ చెడిపోవడానికీ లింకేమిటి?”

“ఉందిరా కార్తీకుడు... నా మొగుడు తాసీల్దార్ ఉద్యోగం చేస్తుంటే బుద్దిగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత బుద్ధిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటూ ఉండేవాడు... ఇట్టా చెడిపోయి ఆస్తినంతా గుమ్మడికాయ హల్వా చేసేవాడు కాదు...”

“స్స్...స్స్...స్స్...” అన్నాడు ఏమనాలో తోచక కార్తీక్

“నా కొడుకు మన్మధరావు కూడా తండ్రి దారిలోనే వెళ్లక హాయిగా ఏ ఉద్యోగమో చేసుకున్నా బావుండు... ఏ పనీలేక దిక్కుమాలిన పనులతో ఒళ్లు ఇల్లు గుల్ల చేసుకునేవాడు కాదు... నా కొడుకు కారు యాక్సిడెంట్లో పోతూ పోతూ అనిరుద్ధుణ్ణి చేతిలో పెట్టాడు. వాడికి వాడి తండ్రి తాతయ్యల పోలిక రాకూడదనే నా కోరిక”

“అసలు నీ పాయింటేమిటి బామ్మా...”

“నా మనవడు ఉద్యోగం చేయాలి... చిన్నదైనా పెద్దదైనా... అప్పుడే ఓ దారిలోకి వస్తాడు. ఆ తర్వాత వాడికి మంచి పిల్లను చూసి పెళ్లి చెయ్యాలి. బుద్ధిగా ఉద్యోగాన్నీ, పెళ్లాన్నీ కనిపెట్టుకొని ఒక్కరు లేక ఇద్దర్ని కనిపెట్టి నా చేతుల్లో పెడతాడు.... నేను రుక్మిణీ, సీత అనుకుంటూ...”

“కృష్ణా రామా కదా బామ్మ...” “నేను ఆడదాన్ని, మా జాతి వాళ్లనే తలచుకుంటాను” అంది 'అలాగా' అన్నట్టు చూశాడు కార్తీక్.

“అదిరా సంగతి... అందుకే నా మనవణ్ణి ఉద్యోగం చేయమంటున్నాను. వాడేమో ఉద్యోగం చేయను అంటున్నాడు" దీర్ఘంగా విశ్వసించి చెప్పింది బామ్మ,

“నీ బాధ వెనుక ఇంత పెద్ద మూడు తరాల ఫ్లాష్ బ్యాక్ ఉందా?” సానుభూతిగా అడిగాడు కార్తీక్.

“ఏం చేయమంటావ్రా... ఉద్యోగం చేసుకుంటే బాధ్యతగా వుండి బుద్ధిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటాడనే... ఉద్యోగం వెతుక్కునే వరకు చిల్లిగవ్వ ఇవ్వనన్నాను. దాంతోవాడు నా దగ్గర డబ్బు తీసుకోవడమే మానేశాడు. అయినా ఈ డబ్బంతా చచ్చేటప్పుడు నేను కట్టుకుపోతానా” అంటూ బొడ్లో నుండి పదివేల రూపాయల కట్ట తీసి కార్తీక్ ఇచ్చింది.

“ఇది నీ ఫ్రెండ్ కివ్వు... నేనిచ్చానని చెప్పకు...” అంటూ కళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయింది బామ్మ

“అమ్మ నా బామ్మ... ఎంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ బాకులా గుండెలో పెట్టుకున్నావ్...” అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు కార్తీక్.

***

పొద్దున్నే ఫ్రెషప్ అయి, బయటకు వెళ్తుంటే అనిరుద్రని పిలిచింది బామ్మ. వెనక్కి తిరిగి, 'ఏంటి' అన్నట్టు చూశాడు.

“స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఉంది. నీ కోసం అట్టే పెట్టమని చెప్పాను. వెళ్లి చేరరాదూ” బామ్మ అనిరుద్ర గడ్డం పట్టుకొని అడిగింది.

అనిరుద్ర తన గడ్డం మీద వున్న బామ్మ చేతిని తీసేసి, 'ఎట్లీస్ట్ డైమండ్ ప్లాంట్ తప్ప చేయను... అయినా నీకెన్నిసార్లు చెప్పాలే నేనెవరి కిందా పని చేయనని...”

“పోనీ బిజినెస్ చెయ్... ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తాను”

“టెన్షన్స్.. ఆ టెన్షన్స్ తట్టుకోలేను. బిజినెస్ చేయాలంటే రకరకాల జిమ్మిక్కులు చెయ్యాలి. మోసం చేయాలి. ఎదుటివాడిని పడగొట్టాలి. ఇవన్నీ నాకవసరమా... ఎందుకే నన్నిట్లా చంపుతావ్?”

“అనరా అను నేను నిన్ను చంపుతున్నానా? బుద్ధిగా ఉద్యోగం చేసుకోమంటున్నాను… అంతే కదా”

“నాకు తెలియక అడుగుతా మీ నాన్న అదే మా ముత్తాత నిన్ను ఉద్యోగం చేయమన్నాడా.

ఒక్క క్షణం బామ్మ ఆశ్చర్యంగా చూసి, “లేదు... అయినా నాకు ఉద్యోగం ఎందుకు నా మొగుడే సంపాదించి పెడతాడు. నా మొగుడికి వండి వార్చుతూ ఉంటాను”

“నేనూ అంతేనే... నాకెందుకే ఉద్యోగం... నా పెళ్లానికి మొగుడి ఉద్యోగం , వండి వార్చుతూ ఉంటాను”

అనిరుద్ర మాటలతో ఒక్క క్షణం బామ్మ బిత్తరపోయి, “నారాయణ... నారాయణ, అంది అసంకల్పితంగా, “కాదు అనిరుద్ర... అనిరుద్ర... అను” అంటూ బయటకు నడిచాడు అనిరుద్ర.

****

“అనిరుద్రా... రాత్రి నాకో కల వచ్చింది” చెప్పాడు బీచ్ ని ఆనుకొని వున్న రెయిలింగ్ పక్కనే నడుస్తూ కార్తీక్.

“గ్యాస్ రేట్ తగ్గినట్టు కల వచ్చిందా?” అడిగాడు అనిరుద్ర.

“కాదు”

“హైదరాబాద్ లో హెల్మెట్లు పెట్టుకోవాల్సిన అవసరంలేదని సి.ఎం టీవీలో చెప్పినట్టు కలొచ్చిందా?”

“కాదు... బామ్మ కలలోకి వచ్చింది”

“వ్వాట్... ఈ వయసులో బామ్మతో డ్యూయెట్ పాడుకున్నావా? అయినా నీకు ప్రేమించడానికి బామ్మే దొరికిందా? బ్యాడ్ టెస్ట్ కూల్గా అన్నాడు అనిరుద్ర.

“ఛఛ... నాకా ఉద్దేశంతో కల రాలేదు”

“మరి ఆస్తి అంతా నీ పేరు మీద రాసినట్లు కల వచ్చిందా?”

“అబ్బా... నన్ను చెప్పనివ్వరా... రాత్రి బామ్మ నా మంచం దగ్గరికి వచ్చి నా చొక్కాలో ఐస్ క్యూబ్స్ పోసింది. నేను కెవ్వున అరిచాను. నా చొక్కాలో ఐస్ క్యూబ్స్ ఎందుకు వేశావని అడిగాను. నా మనవడి చొక్కాలో వేస్తే వాడికి జలుబు చెయ్యదూ. అందుకే నీ చొక్కాలో వేశానంది"

“ఒరే కార్తీక్... నువ్వు ప్రొడ్యూసర్ ని ఇంప్రెస్ చేయడానికి రైటర్ కథ చెప్పినట్టు చెప్పకు... మూడే మూడు ముక్కల్లో చెప్పు. ఏ బుర్రున్న ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా క్యాచ్ చేస్తాడు”

కార్తీక్ ఓసారి అనిరుద్ర వంక చూసి చెప్పసాగాడు.

“బామ్మ నీ గురించే బెంగ పడుతుంట. నువ్వు తక్షణమే ఉద్యోగం చేయాలిట. లేకపోతే మీ నాన్న, తాతల్లా ఝనక్ ఝనక్ పాయల్ బాజేట... నీకివ్వమని నాకు డబ్బు కూడా ఇచ్చిందంట...

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... నేను కళ్లు తెరిచే సరికి డబ్బు నా దగ్గర ఉంది”

అనిరుద్ర కార్తీక్ వంక చూసి, “నీకొచ్చింది కల కాదు నిజమే.. ఓవరాక్షన్ మానేసి ఆ డబ్బు బామ్మకు ఇచ్చెయ్” అన్నాడు.

“అదేమిట్రా ఎంతో ప్రేమతో బామ్మ డబ్బిస్తే...”

“ప్రేమతో ఇచ్చినా, కోపంతో ఇచ్చినా ఆ డబ్బు నా కష్టార్జితం కాదు. మనవడిగా నాకు వండి పెడుతోంది అది చాలు. మిగతా ఖర్చులన్నీ నావే...”

“అదేమిట్రా... అంత మాట పట్టింపైతే ఎలా?”

“ఇందులో మాట పట్టింపేమీ లేదు... నువ్వు ఉద్యోగం చేయకపోతే ఆస్తిలో చిల్లిగవ్వ రాదు అంది. అసలు నేను ఉద్యోగం చేయకపోయినా ఆ ఆస్తిలో సగం చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు. నాకు బామ్మ మీద ఏ కోపమూ లేదు. పదేళ్ల కుర్రాడు కూడా పేపర్లు వేసో, పాల ప్యాకెట్లు అమ్ముతూనో డబ్బు సంపాదిస్తున్నాడు. అట్లాంటిది నేను డబ్బు సంపాదించలేనా?” అనిరుద్ర కుండ బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పాడు.

“నిన్ను మార్చడం నా వల్ల కాదుగానీ టిఫిన్ చేయడానికి మన దగ్గర క్యాష్ ఎంతుందేమిటి?”

“ఈడ్చి తన్నినా రష్యా రూబుల్ లేదు. అమెరికా డాలర్ లేదు. ఇండియన్ రూపాయి లేదు” అనిరుద్ర సెటైరిగ్గా చెప్పాడు.

“పోనీ బామ్మ ఇచ్చిన డబ్బు...” అని అనిరుద్ర మొహం వంక చూసి, “అదే అప్పుగా...” అంటూ మళ్లీ అనిరుద్ర ఎక్స్ప్రెషన్స్ చూస్తూ “వద్దులే” అన్నాడు.

సరిగ్గా అప్పుడే అక్కడ చిన్న గొడవ. ఓ వ్యక్తి ఆటో దిగి, ఆటో డ్రైవర్ తో గొడవపడ్డున్నాడు. అనిరుద్ర అటుకేసి నడిచాడు.
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 06:20 AM



Users browsing this thread: 4 Guest(s)