19-08-2020, 10:11 PM
(This post was last modified: 29-08-2020, 11:53 AM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
రావూరి భరద్వాజ గారి మరికొన్ని రచనలు #4
నవలలు, యదార్ధ, బాలల విజ్ఞాన సాహిత్యాలు
1) భక్త కబీర్
మతాలపైన మఱింత ఆగ్రహం కాదు మనం చూపవలసింది; అదుపు ఆజ్ఞలేని మన మతులపైన నిగ్రహం. మతాలన్నీ మంచనే బోధిస్తాయి. కానీ మానవుడే స్వార్ధంతో మతికి తోచినట్లు చేస్తూ మతాలపై మచ్చలు వేస్తున్నాడు. మన చుట్టూ కనపడేది మతి దౌర్భల్యమే గానీ మత దౌర్భల్యం కాదు. "నీవు హిందు"వని కొందరు; 'నీవు ముసల్మాను'వని ఇంకొందఱు మతాతీతుడైన ఒక మంచి మనిషిని తాళ్ళతో కట్టి బాధించి, భాగీరథిలో పడవేసారు. ఏమి జరిగింది? ఆ మహనీయుని మహిమవల్ల కట్లు తెగిపోయి గంగాభవాని ఒళ్లో అల్లారు ముద్దుగా తేలియాడాడు. చిరునవ్వులు చిందించాడు. విస్తుపోయారు ప్రజలు ఈ విచిత్రోదంతాన్ని చూస్తూ. ఆ మహానుభావుడెవరో తెలుసా?
లోక భీరువు కాని భక్త కబీర్.
డౌన్లోడ్ — భక్త కబీర్
2) కాదంబరి (నవల)
నిస్సందేహంగా ఇది గొప్ప నవల. ఎందుకంటే ఎంతో కశ్మలం వున్న సమకాలిక సమాజంలోనుంచి ఒక వ్యక్తిని ఎంతగొప్పగా నడిపించుకుపోయారు: అతను ”అవినీతి” అనబడే పనులు చేసి ఉండవచ్చుగాక. కాని ఎలా నడుచుకుంటూ వెళ్ళి శిఖరాల నందుకున్నాడన్నది ముఖ్యాంశం. వ్యక్తిలో, సమాజంలో మంచీ- చెడూ రెండూ వుంటాయి. కాని మానవత్వానికి కావలసింది సార్థకత, వ్యక్తి తన చేష్టల ద్వారా కొన్ని విలువల్ని పరిపోషించడము. ఆ విలువలు ఈ నవలలో ప్రస్ఫుటంగా వున్నాయి.
నవల భాషను గూర్చి ఒక్కమాట చెప్పాలి. ఇది నూటికి నూరు పాళ్ళు తెలుగు నవల, తెలుగు పలుకుబడి సహస్ర ముఖాలుగా దర్శనమిచ్చే నవల. మరొక భాష ఏదీ ఈ నవల భాషను లేశమాత్రమైనా ప్రభావితం చేయకపోవడం ఒక విశేషం. అంతేకాక మొత్తం తెలుగు పలుకుబళ్ళన్నీ చోటుచేసుకున్న సాంఘిక నవల ఇది.
- డి.రామలింగం
డౌన్లోడ్ — కాదంబరి
3) కరిమింగిన వెలగపండు
'కరిమింగిన వెలగపండు'లో రావూరి వారు చేసిన ఇంద్రజాలం అత్యద్భుతమైనది. పొగలూ సెగలూ విరజిమ్ముతూనే; మాటలను చాకులూ, బాకులూ చేసి విసురుతూనే; ఆ గాయాల బాధకు గిలగిల్లాడిపోకుండా, కులాసాగా నవ్వుకోగలిగేట్లు చేయడం — నవ్వుకుని ఏకాంతంలో లోలోపలి వికృతా లకు సిగ్గు పడేట్లు చేయడంలో వారు ప్రదర్శించినా నైపుణ్యం అనన్యమైనది.
జీవితంలోంచి హాయి, ఆనందం తప్పుకొన్నాయి. అందుకు భౌతికమైన కారణాలు ఎన్ని వున్నా అంతకుమించిన వేవో కూడా, కొన్ని ఉండాలనుకునేవాడిని. ఆ 'ఏవో ' 'ఏమిటో' ఈ పుస్తకం నాకు తెలియజెప్పింది.
- త్రిపురనేని సుబ్బారావు
డౌన్లోడ్ — కరిమింగిన వెలగపండు4) జీవన సమరం
ఒక విషయాన్ని ఎన్నుకోవడంలోనూ, ఎన్నుకొన్న విషయాన్ని ‘రసగుళిక’గా రూపొం దించడంలోనూ భరద్వాజ అవలంభించే విధానం విశిష్టమయింది. రచనా ప్రారంభం- పఠితలో ఉత్సుకతను రెక్కొలుపని పక్షంలో, పాఠకులు పక్క శీర్షికకు వెడతాడు. ‘అతి’ అనిపించకుండా చూసుకోవాలి. చదవడం పూర్తయ్యాక, ఓ గాఢమైన నిట్టూర్పు వెలువడాలి. కన్నీటి బిందువు పఠిత కన్నుల్లో కదలఈ వ్యవస్థ మీద జుగుప్స కలగాలి. దీన్ని మార్చాలన్న ఆలోచన మెదడులో మెరవాలి. ఇందులో ఏ వొక్కటి లోపించినా ఆ రచన ఆ మేరకు తెటుకు పడినట్లేమరి!
‘జీవన సమరం’ శీర్షికన వెలువడిన ఈ రచనలన్నీ మన సామాజిక జీవనానికి ప్రతిబింబాలు. ఇందులోని వ్యక్తులు - మనకు బాగా తెలిసినవారు. మనతో బాటు మన మధ్యనే జీవిస్తున్నవారు. వీరిని గురించి మనం ఆలోచించం! వీరిని చూసి మనం స్పందించం. ఈ ‘‘అధోజగత్సహోదరు” ల బతుకుల్లోకి తొంగి చూడాలంటేనే మనకు భయం.
శ్రీ భరద్వాజ మనం చేయలేని ఈ పనులన్నీ చేశారు. వారి బతుకుల్లోకి తొంగి చూసి, స్పందించి, మనల్ని స్పందింపజేశారు. వేయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రకు - అచ్చంగా, అట్టడుగు వర్గాల యథార్థ చరిత్రలలో నిండిన తొట్టతొలి గ్రంథాన్ని చేర్చిన ఘనత భరద్వాజకు లభించినందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను.
- చెరుకూరి రామోజీ రావు
డౌన్లోడ్ — జీవన సమరం5) నా గురించి నాలుగు మాటలు
ఈ పుస్తకం చదవడంతో రావూరి గారి గురించి తెలియడమే కాక ఆయన రాసిన పుస్తకాలు వెతికిపట్టుకుని చదవాలనే ఆసక్తి కలుగుతుంది. గొప్ప భావుకులు. తెలుగు కవి, రచయిత. బాలసాహిత్యం లోనూ విశేష కృషి చేసిన రావూరివారు తెలుగు రచనా జగత్తులో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత దక్కించుకున్న నిరాడంబరుడు. "కొంతమంది అదృష్టవంతులుంటారు. తమను గురించీ, తమ పూర్వీకుల గురించీ, గర్వంగా చెప్పుకోదగిన అంశాలు వారికి చాలా ఉంటాయి. ఇంకొంతమంది దురదృష్టవంతులుంటారు. తమను గురించీ, తమ పూర్వీకుల గురించీ, గొప్పగా చెప్పుకోతగిన అంశాలంటూ ఉండవు. సరేగదా, మామూలుగా చెప్పుకోదగిన అంశాలుకూడా ఉండవు" అనే మాటలతో ఈ పుస్తకరచనకు శ్రీకారం చుట్టిన రావూరివారు తమ పెదనాన్న గురించీ చెప్పుకున్న విషయం...ఒకామెను ఆయన పెదనాన్న పెళ్ళి చేసుకుందామనుకుంటారు. అయితే తాననుకున్నామె మరొకరిని పెళ్ళి చేసుకున్నారు. దాంతో ఆయన పెళ్ళే చేసుకోలేదు. అంతేకాదు రావూరివారితో ఆయన తన కోరిక చెప్పారు. తన సమాధిపై ఆమె బూడిదను చిలకరించమన్నదే ఆ కోరిక. ఆ కోరికను రావూరి వారు తీర్చారు.
— యామిజాల జగదీశ్
డౌన్లోడ్ — నా గురించి నాలుగు మాటలు6) ఉడతమ్మ ఉపదేశం (పిల్లల కథలు)
ఇందులోని కథలు—
౧. ఉడతమ్మ ఉపదేశం
౨. కనువిప్పు
౩. విశ్వాసం
౪. పశ్చాత్తాపం
౫. సార్థకం
౬. ఉత్తమ జన్మ
౭. కన్న ప్రేమ
డౌన్లోడ్ — ఉడతమ్మ ఉపదేశం
7) వినువీధిలో వింతలు
(బాలల శాస్త్ర విజ్ఞానం)
మానవజీవితాన్ని మరింత వివేకవంతంగా మలిచేందుకు శాస్త్రవిజ్ఞానం చాలా తోడుపడింది. ఒకప్పుడు ప్రతి దానిలోనూ ‘అద్భుతం’ మాత్రమే చూడగలిగిన మానవుడు, రానురాను, దాని అనుపానాన్ని అవగాహన చేసుకోవడం ప్రారంభించాడు. మెరుపును, ఉరుమును, పిడుగును, నీటిని, నిప్పును, మబ్బును చూసి- ఒకప్పుడు అబ్బురపడిన మానవుడే- నీటి రహస్యాలను తెలుసుకొని, వాటి నుండి ఉపయోగాలు ‘పిండుకోవడం’ ప్రారంభించాడు. ఒకనాటి మానవునికి ‘గాలి’ ఒక దేవుడు. ఈనాడు అదే గాలి, మనిషికి అనేక పనులు చేసిపెడుతున్నది. దీనికి కారణం శాస్త్రవిజ్ఞానం!
నేనైతే శాస్త్రజ్ఞుణ్ని కాదుగానీ, నావంటి సామాన్యుల కోసం, హేమాహేమీల్లాంటివారు రాసిన సుగమ విజ్ఞానశాస్త్ర గ్రంథాలు, అందినవి అందినట్లుగా చదివాను. చదివాక ఇలాంటి పుస్తకాలు తెలుగులో కూడా వుంటే బావుండునని తోచింది. తోచాక, రాయడం ప్రారంభించాను.
‘వినువీధిలో వింతలు’ ముందుగా ‘కృష్ణాపత్రికలో’ ధారావాహికంగా వచ్చింది. 1964లో పుస్తక రూపంగా వెలువడింది. ఆ పుస్తకాన్ని మళ్ళా వేద్దామని అనుకున్నప్పుడు, ఆ పుస్తకాన్ని ఒకసారి సవరించడం మంచిదనిపించింది. 1964కూ, 1982కూ మధ్యన ఖగోళపరిశోధనల్లో అనూహ్యమైన మార్పులు చాలా వచ్చాయి. విశ్వపరిధి విస్తృతమయింది. గ్రహాలను గురించీ, ఉపగ్రహాలను గురించీ, చాలా క్రొత్త విషయాలు బయటపడ్డాయి. దూర దూరాలలోని గ్రహాలకు, వ్యోమనౌకలు ప్రయాణాలు సాగిస్తున్నాయి. కొత్త నక్షత్రమేఘాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.
అయితే, ఎప్పటికప్పుడు, వచ్చి పడుతున్న ఈ సమాచారాన్నంతా పుస్తకంలోకి చేర్చడం- నాకు సాధ్యంకాదు. అందువల్ల ఒక తేదీని నిర్ణయించుకొని- నా ఆ అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా, ఈ పుస్తకంలోకి చేర్చాను. కొన్నిచోట్ల తగ్గించినట్లు, ఇంకొన్ని చోట్ల పూర్తిగా తొలగించినట్లు పాఠకులు సులువుగా కనుక్కోవచ్చు.
ఇందులోనైనా- ఖగోళశాస్త్రం సాధించినవాటి నన్నింటినీ పొందుపరిచానని కాదుగానీ- స్థూలంగానైనా చెప్పడానికి ప్రయత్నించానని మాత్రం మనవి చేస్తున్నాను.
- భరద్వాజ
డౌన్లోడ్ — వినువీధిలో వింతలుచివరగా...
8) డా.|| రావూరి భరద్వాజ సాహితీ ప్రస్తావన (by రావూరి లక్ష్మీకుమారి)
డాక్టర్ రావూరి భరద్వాజ. ఈ పేరు అనేక దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రియులకు సుపరిచితమైనది. ఇంటింటా మారు మోగిన పేరు. జ్ఞానపీఠ్ అవార్డు లభించిన తరువాత శ్రీ భరద్వాజ గారి రచనలు చదవాలన్న ఆసక్తి నేటితరం పాఠకులల్లో రేకెత్తింది. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, మాటలను తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందికి కలిగింది. భరద్వాజ గారి రచనలు వారి మాటలు, జీవితంలోని అమూల్య ఘట్టాలను తెలుగు వారికోసం అందించే చిరుప్రయత్నమే` ఈ ‘‘మామయ్య గారి మాటలు” జీవనచిత్రం. రావూరి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. కడు పేదరికం నుంచి జ్ఞానపీఠం మెట్లను అధిరోహించేంత వరకూ డాక్టరు రావూరి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. కటిక దారిద్య్రం నుంచి, మనలను మనం తీర్చిదిద్దుకుని ఎలా ఎదగాలన్న సందేశం వారి జీవితంలో ఉంది. బాగా ధనవంతులు కూడా సాటిమనిషిని ఎలా ఆదుకోవాలి, మానవత్వం ఎలా ప్రదర్శించాలి అన్న గొప్ప హితబోధలు రావూరి వారి రచనల్లో విస్తృతంగా ఉన్నాయి.
అటువంటి మహనీయుడితో కలిసి ఏళ్లపాటు ఒకే కుటుంబంలో గడపటం వారి కోడలుగా నా అదృష్టం. రావూరి గారి సేవలో ఇన్నేళ్లు గడపటం వల్ల వారి సాహితీ సుమగంధాలను, ఆస్వాదించే అదృష్టం కలిగింది. వారు ఇచ్చిన స్ఫూర్తితోనే, డాక్టరు రావూరి భరద్వాజ గారి జీవితంలో కొన్ని సంఘటనలు, మాటలు సంక్షిప్తంగా వారి రచనలను, పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వారి అనేక రచనల మాదిరిగానే వారి జీవితానికి సంబంధించిన ఈ పుస్తకాన్ని కూడా తెలుగు పాఠకలోకం ఆదరిస్తుందని, ఈ చిరుప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదిస్తుందని భావిస్తూ డాక్టర్ రావూరి భరద్వాజగారి స్మృతులతో....
- రావూరి లక్ష్మికుమారి
డౌన్లోడ్ — 'రావూరి' సాహితీ ప్రస్తావన
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK