12-08-2020, 11:39 PM
(This post was last modified: 18-08-2020, 10:55 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
'కళాప్రపూర్ణ' రావూరి భరద్వాజ (జూలై 5, 1927 - అక్టోబరు 18, 2013) తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడురాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.
తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలు లేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు.
భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉంది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. అనతికాలంలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశారు.
తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖమైన కృషికి కేంద్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారమైన జ్ఞానపీఠ్ ను 2012లో దక్కించుకున్నారు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.
రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది 'పాకుడురాళ్ళు'. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల ఇది. భరద్వాజ దీనికి 'మాయ జలతారు' అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు 'పాకుడురాళ్లు' అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరరావు, ముదిగొండ సుబ్రహ్మణ్యరావుల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని 'పాకుడురాళ్లు' నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.
రావూరి భరద్వాజ గారి కొన్ని రచనలు #1
1) పాకుడురాళ్లు
![[Image: IMG-20200812-222507.jpg]](https://i.ibb.co/17dSdmX/IMG-20200812-222507.jpg)
సినిమా ఓ రంగుల ప్రపంచం. లక్షలాదిమంది తమని తాము వెండి తెర మీద చూసుకోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి. ఇవన్నీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. అనాటి కాలంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశాడు రచయిత రావూరి భరద్వాజ. పాకుడురాళ్ళు నవల, కేవలం మంజరిగా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బెదిరించి పబ్బం గడుపుకునే సినీ విలేఖరి, ఇలా ఎందరెందరిదో కథ ఇది.
డౌన్లోడు లంకె — పాకుడురాళ్లు (2.3 MB)
2) నాలోని నీవు
![[Image: IMG-20200812-232736.jpg]](https://i.ibb.co/23ZJpWN/IMG-20200812-232736.jpg)
కాంతమ్మ నానించి వెళ్లిపోయింది! ఎవరెవరు నాచుట్టూ ఉంటేనేం గాక, ఏవేవి నా చుట్టూ అల్లుకొంటేనేం గాక, ఏ సిరులు, సంపదలు, గౌరవాలు, సనదలు నాకుంటేనేం గాక, వాటిని విని, చూసి, సన్నగా నవి, తన ఆనందాన్నంతా కన్నుల్లోనే చూపే కాంతమ్మ నానించి వెళిపోయాక. నేనిప్పుడు సీతలేని రాముణ్ని. పార్వతిలేని పరమశివుణ్ని. ఎందరెందరెందరున్నా, అందరి మధ్యా వొంటరివాణ్ని.
***
1956 నుంచి భరధ్వాజ డైరీ రాస్తున్నాడు. మా చెల్లాయి కాంతమ్మ గురించిన ప్రస్తకి అనేక వందల పుటలకు విస్తరించి ఉన్నది. ఆమె స్మృతి చిహ్నంగా ఒక చిన్న ప్రచురణను వెలువరించే కార్యక్రమ పరిధిలోకి, ఈ పేజీలన్నింటినీ ఇమడ్చటం సాధ్యం కాదని తేలిపోయింది. అందుకని ఆమె మరణించిన రోజు నుండీ, ఈ తేదీ వరకు డైరీలో ఉన్న విషయాలను ముద్రించుదామనుకున్నాం. ఆచరణలో ఆ ప్రయత్నానికీ అనేక అవరోధాలు ఎదురయ్యాయి. చివరికి 1-8-86 నుండి 31-12-86 దాక, డైరీలో కాంతమ్మను గురించి ఉన్న విషయాలను, తేదీల వారీగా సంపుటీకరించి, "నాలోని నీవు" అన్న పుస్తకం రూపంలో తెస్తున్నాం. — (త్రిపురనేని సుబ్బారావు)డౌన్లోడు లంకె — నాలోని నీవు [స్మృతి#1] (1.2 MB)
3) అంతరంగిణి
![[Image: IMG-20200812-233009.jpg]](https://i.ibb.co/9VtSxwm/IMG-20200812-233009.jpg)
ఆత్మీయుల ఎడబాటు, ఒక రస హృదయాన్ని ఎంత సంక్షుబితపరుస్తుందో, ఈ పుస్తకం కొంత వరకైనా చూపగలదనుకొంటున్నాను. భార్య మరణం, భరద్వాజ మనో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూపడానికి, మూడు-నాలుగు ఉదాహరణలు మాత్రం ఇస్తున్నాను.
“...ప్రభూ! ఈ శరీరం నాకు ఇరుకుగా ఉంది. ఈ పరిసరాలు, నాకు అననుకూలంగా వున్నాయి. వీటిల్లోంచి నన్ను తప్పించు. నన్ను విముక్తం చెయ్యి...” (11-1-87, సోమవారం)
“ప్రభూ! వినమ్రుడనయి నీ ముందు నిలిచేందుకు అవసరమయిన విధంగా, నన్ను నేను మలుచుకొంటున్నాను...” (14-1-87, బుధవారం)
“ప్రభూ! ’అంతా మనసు కల్పించే మాయ’ అంటున్నారు తాత్వికులు. భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు, శత్రువులు, దారిద్ర్యాలు, యుద్ధాలు, -అన్నీ మనసు కల్పించేవే అయితే, నీవు మాత్రం మనసు కల్పించే మాయ కాదా?” (24-1-87, శనివారం) అని అడుగుతున్నాడు భరద్వాజ.
ఇంకా – ఇలాంటి వెన్నెన్నో, ఈ లోపల! దయచేసి ముందుకెళ్ళండి!! — (త్రిపురనేని సుబ్బారావు)
డౌన్లోడు లంకె — అంతరంగిణి [స్మృతి#2] (360 kB)
4) ఐతరేయం
![[Image: IMG-20200812-233144.jpg]](https://i.ibb.co/kGrmgn1/IMG-20200812-233144.jpg)
కాంతమ్మ మరణించిన నాటి నుండి ఆ సంవత్సరం దాక, భరద్వాజ డైరీలో కాంతమ్మను గురించి ఉన్న విషయాలను, తేదీల వారీగా సంపుటీకరించాక, "నాలోని నీవు" అన్న పుస్తకం ప్రచురించబడింది. 1987వ సంవత్సరపు డైరీలోని అంశాలతో, "అంతరంగిణి" అన్న పేరున రెండో పుస్తకం వెలువడింది. ఈ మూడోది "ఐతరేయం". ఇది 1988వ సంవత్సరపు డైరీలోని అంశాలతో కూర్చిన పుస్తకం. — (త్రిపురనేని సుబ్బారావు)
***
‘ఐతరేయం’, కేవలం కాంతమ్మ గారి కథ కాదు, భరద్వాజగారి ఆత్మకథా కాదు. ఇదొక అంతర్మధనం. సృష్టిలోని వైచిత్రికి స్పందించిన ఒక ఆర్ష కథనం. క్రౌంచ మిథునం పొందిన అవేదనతో స్పందించిన ఋషి వలె, ‘కాంతమ్మ మరణం’ అనే ఒక నిమిత్తంతో స్పందించిన ఒక (రస) ఆర్ధ్ర హృదయం నుంచి జాలు వారిన అక్షర స్రవంతి. ఇక్కడ కాంతమ్మ తల్లి, చెల్లి, భార్య, బంధువు, దైవం-అనంతవిశ్వం - కాంతమ్మ కేవలం ఒక సంకేతం, ఇది అర్థం కాకపోతే, ‘ఇదంతా కేవలం భార్యా వియోగ కావ్యం’ (ఎలిజీ)గానే చాలామంది భ్రమించవచ్చు.భరద్వాజగారి కాంతమ్మ, లౌకిక పాఠకులకు, ఒక స్త్రీ. ఒక పెద్దమనిషిగారి ఉత్తమ ఇల్లాలు. కానీ ‘ఐతరేయం’లోని ఆంతర్యం, ఇంకా లోతైనది. అనంత శక్తి స్వరూపానికి, భరద్వాజ తన అన్వేషణలో, పెట్టుకున్న ఒక పేరు కాంతమ్మ!
ఈ దృష్టితో ఈ పుస్తకాన్ని కాదు; ఈ డైరీల పరంపరలో వెనుకటివి కూడా చదవండి. కొత్త లోకాలు కనబడతాయి. — (డా. ముదిగిండ శివప్రసాద్)
డౌన్లోడు లంకె — ఐతరేయం [స్మృతి#3] (680 kB)
5) ఒకింత వేకువ కోసం
ఓ అదృశ్య అవ్యక్త నిశ్వబ్ద ప్రవాహం దూరంగా ఉన్న ఆ గమ్యానికి నన్ను తోసుకు పోతోంది.
ఆ అదృశ్యానికి కాస్త దృశ్యరూపమివ్వడానికీ ఆ అవ్యక్తాన్ని కొంచెం వ్యక్తం చేయడానికీ ఆ నిశ్శబ్దానికి రవంత శబ్దాన్ని తొడగడానికీ
ఆ గమ్యమేదో కచూచాయగా తెలుసుకోవడానికీ ఇప్పుడు నా నిండా ముసిరిన చీకట్లుసఅవరోధం కలిగిస్తున్నాయి.
అందుకే --
ఒకింత వేకువ కోసం... నేనిప్పుడు ఎదురు చూస్తున్నాను (డాక్టర్ రావూరి భరద్వాజ)
డౌన్లోడు లంకె — ఒకింత వేకువ కోసం [స్మృతి#5] (920 kB)
ఆ అదృశ్యానికి కాస్త దృశ్యరూపమివ్వడానికీ ఆ అవ్యక్తాన్ని కొంచెం వ్యక్తం చేయడానికీ ఆ నిశ్శబ్దానికి రవంత శబ్దాన్ని తొడగడానికీ
ఆ గమ్యమేదో కచూచాయగా తెలుసుకోవడానికీ ఇప్పుడు నా నిండా ముసిరిన చీకట్లుసఅవరోధం కలిగిస్తున్నాయి.
అందుకే --
ఒకింత వేకువ కోసం... నేనిప్పుడు ఎదురు చూస్తున్నాను (డాక్టర్ రావూరి భరద్వాజ)
***
భారద్వాజ గారి స్మృతి గ్రంథ పరంపరలో ఇది ఐదవ పుస్తకము.డౌన్లోడు లంకె — ఒకింత వేకువ కోసం [స్మృతి#5] (920 kB)
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK