Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విశ్వనాథ సత్యనారాయణ (Viswanatha Satyanarayana) గారి పుస్తకాలు
#13
(23-04-2020, 07:48 AM)Kalandar Wrote:
సర్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర పౌరుషము ఉంటే పంపగలరు

అంతర్జాలములో ఇది నాకు లభించినది మిత్రమ...

మీకిది ఏమయినా ఉపయోగపడుతుందేమో చూడండి.
ఆంధ్రపౌరుషము - విశ్వనాథ సత్యనారాయణ

శా.
శ్రీపద్మాకర చామరానిల హృతస్వేదాంబువౌ మేన ది
వ్యాపాంగమ్ముల నీవు లోకముల బ్రోవన్‌ వీణ వాయించుచో
నీపారామ నిరంతరధ్వనిత తంత్రీనాదసంతాన మ
మ్మా! పల్కించగదమ్మ! విశ్వజగదంబా! రాజరాజేశ్వరీ!
1

సీ.
ఒకనాఁడు గలదాంధ్ర యువకులు తూరుపు-కనుమదుర్గముల నేలిన దినంబు
ఒకనాఁడు గలదు శిల్పకళాసరస్వతి-అమరావతిని నృత్యమాడు దినము
ఒకనాఁడు గలదాంధ్ర సకల ప్రపంచమ్ము-కృష్ణాస్రవంతి నూగిన దినంబు
ఒకనాఁడు గలదు నిల్వకపాఱు శత్రుల-నాంధ్ర సైన్యంబు వేటాడు దినము
ఒక్కనా డున్నయది యాంధ్ర యుద్ధభూమి-కత్తివాడికి రిపుల రక్తంబు నదులు
కట్టినదినంబు నేటికిఁ గాలవశత-నస్మదున్నతి తలక్రిందు లయ్యెగాని.
2

ఉ.
కాలముమారి యోడలను కట్టిరి బండ్లకుపైన సింహశా
ర్దూలములున్‌ సృగాలములతో సరిరావు నిరంతరాంబుధా
రా లసితంబులౌ నదులు రమ్యతదక్కి మహాతపాగ్నికిన్‌
గాలువలయ్యె మమ్మెటులఁ గాచెదొ నీవిక నాంధ్రమాతృకా!
3

మ.
మును పంబారులమీదనే తిరిగి తంభోరాశి బంధించి తా
గినవా రెవ్వరు తల్లి! నీయెదుర మూకీభూతులై శాత్రవుల్‌
చనినా రేగిరి గహ్వరంబుల నివాసంబుం బొనర్పంగ నీ
తనయుల్‌ నీతనయుల్‌ రిపూత్కరము సాధింపంగ నాంధ్రావనీ.
4

గీ.
దివ్యవాహిని కృష్ణానదీ స్రవంతి
మోహననినాదగానమ్ము మురువుతఱిగె
తన్మనోహర గానగీతమ్ము మరల
బాడగావలె మృదువుగాఁ బ్రకృతిమాత.
5

మ.
తెలుగుంజాతికిఁ బౌరుషంబుగల దద్రిస్వామికన్యాకృపా
ననలంబుంగల దీదృశంబుగ మహాకష్టంబు లీనాటికిం
గలిగెంగాని కుఠారకృత్తరిపురాట్కంఠ స్రుతాసృఙ్నదీ
జలసంసిక్త జయేందిరాస్యము మహాశౌర్యంబు సామాన్యమే?
6

శా.
ఏమూలం జని డాగెనో తెలియవయ్యెన్‌ గ్రోధవిస్ఫారిత
భ్రూమధ్యంబున మండు మంటలను నీరుంబోలె పాశ్చాత్య సం
గ్రామంపుం దెలివెల్లతేర్చిన మహోగ్రంబైన సత్పౌరుష ప్రా
మాణ్యంబగు మాదు వెల్మదొరలాంధ్రస్ఫీత శౌర్యోన్నతుల్‌.
7

మ.
మును కృష్ణాతటినీజలాంతరమునన్‌ బొంగెత్తి యుద్భూతమై
ననతేనెల్‌ స్రవియింప మ్రోగిన సుధానాదంబు కార్యంబునం
దినదేలో, దెసలన్నియున్‌ జివురులెత్తెన్‌ మున్నుతద్రావమున్‌
విని యీనా డవి వాడి శోకభర మూనెన్‌ కాంతిదూరమ్ముగా.
8

సీ.
రుద్రుడైన ప్రతాపరుద్రదేవుం డోరు-గల్కోట బురుజుపై కాలుమోప
విద్యానగర రాజవీధి పట్టపుటేన్గు-పైఁ గృష్ణరాయలు పాఱఁజూడ
పిడుగు మొత్తము బొబ్బిలికోటపుండరీ-కము పాపరాయడు కన్నులురుమ
చాళుక్య రాట్ప్రతిష్ఠా కీర్తిచోళనా-యకకీర్తితోడ నెయ్యమ్ము నెఱప
పూర్వసంపదలను కాలిబొటనవ్రేల-నలుపు శౌర్యమ్ము లేమూల నక్కెనొక్కొ?
పాడుదౌర్భాగ్యవిధి నిలింపస్రవంతి-నెండఁగట్టెడు కాలమ్ము నెఱిగెగాక.
9

సీ.
ఆంధ్రభూధవుల కార్యాలయాంతఃపుర-ప్రతతి కోతులకు నావాసమయ్యె
రాజకిరీట రారాజన్మణిచ్ఛటల్‌-ప్రతిఫలించెడు చోట్లు పాడువడియె
పట్టపేనుగులు గర్వసమేతముగ నేగు-కడల జిల్లేడుమొక్కలు జనించె
ఆంధ్రపౌరుష మాటలాడుచోటులు శిలా-దృతిని మార్గము నిరోధించి నిలిచె
ఆంధ్రతేజమ్ముగని మోదమంది నట్టి-యాకసముగూడ మాలిన్యమై చెలంగె
కాలమా! నీకృతమ్ములు గలవుగద శ-తమ్ములున్‌ వేలు నేమి ఫలమ్ము చెప్పి.
10

శా.
ఆపద్మాలయ సత్కృపాగరిమమౌరా! యెంత తచ్ఛౌర్య రే
ఖాపాండిత్య మయారె! యెంత! యిపు డొక్కండైన నూహించి సం
తాపం బందునె యేమి పట్టినది, నేత్రంబుల్‌ సబాష్పంబులై
తాపంబందె మనంబు కంఠమతి రుద్ధంబయ్యె నూహించినన్‌.
11

ఉ.
ఆగిరిదుర్గముల్‌ ప్రకృతమం దెటులున్నవొ చూచి, పూర్వపుం
భోగము లూహచేసి కనుపొంతల జాఱెడు బాష్పనీరముల్‌
చేగిలిగించి యెవ్వడు కృశింపడు వాని నరంబులందు శౌ
ర్యాగమవేత్తలైన మన యాంధ్రుల రక్తమె పాఱుచుండినన్‌.
12

గీ.
పోయినది, యాసకుం దాటిపోయినది యిఁ
కెన్నొ దీర్ఘవర్షములు గతించినవి పు
రాప్రధితులైన మారెడ్డిరాజుల సిరి
యున్నయిది చూచి శాత్రవుఁ డోర్వలేడు.
13

సీ.
కోటగోడలనుండి కుప్పించి సింహంబు-లోయన నరులపై నురకలేదొ
కొండయడుగునుండి కొండపైవరకు నూ-గించి తేజీల దూకించలేదొ
కోతతల్పులను డీకొనవచ్చు కుంభికుం-భమ్ముల గ్రుద్ది చంపంగలేదొ
వేనకువేల్‌ శత్రువీరులమధ్య లం-ఘించి వారలను హరించలేదొ
ఆంధ్రవీరులు, వారి శౌర్యంబునెన్న-నేటికది మాయెడన్‌ స్మరణీయమయ్యె
ఆహవక్షోణియందు మా యాంధ్రవీరు-లెంతలెంతలు చేసిరో యెవ్వ డెఱుగు?
14

సీ.
కాపువీరులు ఘోటి కదలించి కృష్ణపా-యలు చంగుచంగున నవతరింప
రెడ్డిరాజులు సమాకృష్యమాణ భ్రూల-తాదీప్తి పరరాజ ధైర్యమడప
కమ్మశూరులు చేతికరవాలము విదల్చి-దిగ్వితానముల దీధితులు నెఱప
ఆంధ్రనియోగివంశార్ణవోద్భవమణుల్‌-కత్తిగంటముల నైక్యంబుసేయ
వైదికులు మత్తమధుకరఫణితిమ్రోయు-వేదరవముల దెసల పుష్పింపజేయ
నొక్కయప్పుడు మా యాంధ్రు లుండిరనెడు-జ్ఞానమొక్కండది మనఃప్రశాంతి నాకు.
15

సీ.
మతికబ్రమగు తృణీకృత దేవగురుమతి-ప్రతిమానదుర్గనిర్మాణ శక్తి
ఆశ్చర్యమగు ధ్వంసమైనప్పటికి నిప్ప-టికి చిహ్నలున్న శిల్పకళ సొగసు
అంతంతఱాళ్లెట్టు లాపైకి నెత్తిరో-దేవతలో యేమొ తెలియరాదు
చూచినంజాలు నచ్చోటి సరోవరం-బులు లోతు నేటికి తెలియరాదు
ఆబలమ్ము, నాపనినేర్పు, నావిలాస,-మెంత యున్నదొ మును చూచునంత నోము
నోచుకొనలేకపోతి మయ్యో చివరకు-నేటికాచోట్లనైన జన్మించలేదు.
16

సీ.
కోపమెత్తిన రక్తకొల్లయ్యె విజయరా-మావనీధవుని వక్షోంతరమ్ము
భ్రూభంగ మొనరింప బొగ్గువోలిక నల్ల-నైపోయె ముగురురాయల యశమ్ము
తరవారి చేఁబూనువరకె హస్తిపురంబు-కోటగోడలు మ్లేచ్ఛఘోటిదూఱె
ఆంధ్రచళుక్యవంశార్ణవం బనినంత-గంగాప్రవాహ ముప్పొంగిపోయె
సై యనినయంతలోన నీజిప్తునుండి-తెలుగుదేశమ్మువరకు కాన్కలు స్రవించె
ఆంధ్రపౌరుషమన మాటలా! రిపూత్క-రముల గుండెలు వినినంత బ్రద్దలయ్యె.
17

సీ.
మఱచిరా! సకల దిఙ్మండలేశ్వరులు కృ-ష్ణారాయపతి కప్పనంబు లిడుట
తలపరా! యోర్గల్ప్రతాపరుద్రుని భుజా-స్థితి ధరాసతి సుఖాసీన యగుట
స్మరియింపరా! రణస్థలి పరాభూతులై-ఆంధ్రశత్రువులు వేటాడబడుట
ఎఱుగరా! ఆంధ్రభూధర శిఖాగ్రముల నాం-ధ్రప్రతా పరధైర్య మపహరించు
టంతలోనె విస్మృతిగల్గెనా! తెలుంగు-జాతి జాతీయగీతికాజనిత దివ్య
మధురమధురససంపూర్ణ మంజులార-వప్రభూత సమ్మోహన ప్రధితకీర్తి.
18

సీ.
ఏమాయె! నొరుగల్లు నేడుకోటలు నాంధ్ర-పృధ్వీపతీపురంధ్రి కళమాసె
మ్రోయదేలా! విశ్వమోహనగీతి వి-ద్యాపురీవరము రోదోఽంతరమున
కొండవీడున మాయగోపాలుగానమ్ము-ప్రణయగీతికలు నిప్పటికిఁ బర్వె
అతిధుల రండురండను పిల్పు వినరాదు-కొండపల్లిపురంబు కోటముందు
తెలుగు విద్యార్థు లమరావతీపురంబు-విమలకృష్ణానదీసైకతములయందు
సాంధ్యకాలమ్ములను శిల్పశాస్త్రగోష్ఠి-సేయమానిరికాబోలునోయి మున్నె.
19

సీ.
సకలజగద్రక్షఁ జన మూడుపుడిసిళ్ళె-పూరింపలేడాయె వారిరాశి
వంచినతల నింతవరకెత్తగా గుండె-యానదు వింధ్యనగాధిపతికి
ఆంధ్రుల పసిపిల్ల లందఱి కడుపులో-తవరజీర్ణించు వాతాపినేడు
'సర్పసర్ప' యనంగ 'సరోభవ' యటన్న-తరుగయ్యె నుపపురందరహఠమ్ము
పూర్వమునఁ దొల్త నాంధ్రుల బొమలు ముడులు-వడినయంతన లోకముల్‌ జడతనొందె
అమిత కరుణాప్రదీప్తి విప్పారినంత -ఎల్లలోకమ్ములకు సంఘటిల్లె శాంతి.
20

మ.
అతడే కుంభభవుండు మౌనివి మతాహుంకార పృధ్వీధరో
ద్ధతి వజ్రాయుధ సన్నిభుండు ప్రథమాంధ్రస్వామి యావీరునిన్‌
మతినూహించి యొకింత యాంధ్రులన నేమాత్రంపువారో తలం
చితిమేన్‌ బ్రస్తుత నీచభావములు రాశీ భూతమై మ్రగ్గెడున్‌.
21

క.
తొలికవి మా యాంధ్రక్ష్మా
తలమందున బుట్టినతడె తద్వరవక్త్రో
జ్వల దివ్యమధునదంబున
జలజాప్తకులంబు పూతసరణి వహించెన్‌.
22

ఉ.
అంతటివారలంట ప్రథమాంధ్రులు నాపయి వారి రాజ్యవి
శ్రాంతికి నాలు మూడు జలరాసులగున్‌ బొలిమేర లాధరా
కాంతులకీర్తికన్యకలు కట్టినమేఖలలయ్యె భూధర
ప్రాంతవిలాసదుర్గములు ప్రస్తుతమందున కాంతిమాసినన్‌.
23

గీ.
అట్టిరాజ్యమ్ము సంపద యట్టిదెల్ల
ఆత్మవిజ్ఞాన మలవడనట్టివారి
కంబుజాక్షుని లోకమ్మునట్లు మూఢ
చిత్తులముగాన మాకు నశించిపోయె.
24

సీ.
రాజ్యాంగతంత్ర నిర్మాణ కౌశలులకు-జంకదస్త్రముల నాశలు జనించె
పరరాజ రక్తప్రవాహమజ్జనులకు-గత్తిగన్గొన భయమెత్తిపోయె
సింహాసనముల నాసీనులౌవారికి-నితరదాస్యపురుచి హెచ్చిపోయె
ఆధ్యాత్మదివ్యవిద్యావేత్తలకును దే-హమున నంతంతకు మమతగలిగె
పెద్దపులి పిల్లియయ్యెను పిల్లి పెద్ద-పులివిధమ్మున విక్రమమ్మును వహింప
మండువేసగియెండల కెండిపోయె-దివ్యవాహిని కృష్ణానదీస్రవంతి.
25

సీ.
మోసెత్తి చిన్నారి మొలకయై బాలద-ళాకారమై పసియాకు విడిచి
దినమొక్కచాయదేరి నిరంతరాంబుధా-రాపోష్యమగుచు సారంబువడసి
అల్లనల్లన ప్రాకులాడి ఱెమ్మలువేసి-నల్గడల్‌ వ్యాపించి నలుపు తిరిగి
చిగిరించి కొంగ్రొత్త లిగురెత్తి గొనబొత్తు-పులకరించిన రాలు పూతపూచి
అంతఁ జంద్రికాధావళ్య మనుకరించు-సూనసంతానములు దిగ్వితానములను
పూచి దెసలందు సౌందర్యమును ఘటించె-ధరణి నాంధ్రయశోలతాంకురము పొలిచి.
26

సీ.
రోమీయులైన వీరులు రెండు కెలకుల-రమ్యమౌ వింజామరలను వీవ
సకలదేశాగతక్ష్మాతలేంద్రులు పద-మ్ముల తలల్‌ మోపి కాన్కల నొసంగ
తన పేరు విని రిపూత్కరముల శిశువులు-భూధరాంతరముల పోరువెట్ట
తనవిలోచన కృపాంబునిధానములగోరి-యఖిలదేవతలు నందంద నిలువ
దక్షిణపదంబునన్‌ బద్మదళమునందు-కనకసింహాసనంబునఁ గాలుమోపి
రాచకార్యంబుల పరీక్ష నాచరించె-రమ్యమోహనాకృతి నాంధ్రరాజ్యలక్ష్మి.
27

సీ.
ఆటపట్టులు నాగులేటిపాములు తూర్పు-వెలిబార పడగలు విప్పుచోట్లు
భోజనమ్ముల రాళ్లపోరాటమునకైన-సాహసింపగచేయు శక్తిదములు
పౌరుషమ్ములు క్రుధాభరితలోచనరాగ-దళితారిసైన్యసంతానములును
అభిమానములు చంద్రికామృతప్రతిమాన-భవ్యాంధ్రకీర్తి నిర్వాహకములు
ఈవిధమ్ముగ పొలిచి యహీనమైన-ఖడ్గమును బూని ఘోరసంగ్రామ భూమి
వృషభవాహనములమీద నెక్కి నటన-సల్పినది యాంధ్ర పల్నాటి శౌర్యలక్ష్మి.
28

సీ.
గోదావరీ పావనోదకంబుల తరం-గాలపై నౌక లుయ్యాలలూచి
అరికంఠరక్తచిహ్నములు పోవుటకునై-పెన్నానదిని కత్తిపొన్ను కడగి
అరినిషూదనకార్యమందు గల్గిన తాప-మడపఁ గృష్ణాపగయందు మునిగి
తుంగభద్రాసముత్తుంగరావము రిపు-శ్రీభేదకముగ ఘోషింపజేసి
మాటిమాటికి దెసలెల్ల మాఱుమ్రోగ-గడగడవడంకి దిక్కు లుగ్రతఁ జలింప
శత్రుల హృదంతరమ్ములు సంచలింప-విశ్వమునదించె నాంధ్రుల విజయభేరి.
29

సీ.
ఆంధ్రదేశస్థ సర్వాపగా భంగత-రంగరంగముల శౌర్యములు నేర్చి
ఆత్మప్రతాప శౌర్యములు తాలిచి, 'సుమి-త్రా బోర్నియో' ద్వీపతతులు గెలిచి
వంగమహారాష్ట్రవార్థులు పరిచయ-స్థలములై వినయమ్ము సలుప మెలగి
ఈజిప్తునుండి కృష్ణాజలమ్ములకు 'బారం-బాటగా' పరాక్రమము జూపి
సకలదీవుల విజయధ్వజములు నాటి-తనదు తెరచాప వార్ధిరాజునకు కట్టు
కోకగాఁ బూర్వ మాంధ్రుల నౌకరాజ్య-మమరజేసిన దేడుసంద్రములమీద.
30

శా.
ఆ శౌర్యమ్ములు నాప్రతాపములు దౌష్ట్యంబేచుకాలంబుచే
మాసెన్‌ సర్వజగమ్ము లేలగల సామర్థ్యమ్ము బందీకృత
మ్మై శోభాగళితంబునై మెలగె కట్టా! యాంధ్రలోకమ్ము స
ర్వాశాజైతృకతావిచారములు దాస్య ప్రాప్తి చేకూర్చెనే.
31

శా.
ఏదేవీపిత యౌటచే హిమధరాభృత్స్వామి కొండంత స
మ్మోదంబందెనొ రాజమౌళి తనకున్‌ ముద్దారు నల్లుండుగాన్‌
ఆదేవీ కరుణాంబుధారలకు నిల్లౌ మాయశోగీతికా
నాదం బీదృశఫక్కి కార్శ్యమును నందన్‌ గారణంబేమొకో.
32

ఉ.
కన్నులనీరు వచ్చిననుగాని హృదంతర మగ్నిసన్నిధిన్‌
వెన్నవిధానగాగ విలపించినగాని తలంచ లాభ మే
మున్నది యెన్నినాళ్ళయినదో మన కృష్ణయు తుంగభద్రయున్‌
బెన్నయు గౌతమీనదియు విశ్వము మ్రోగనదించి యక్కటా.
33

గీ.
పైనియాకులు క్రిందకు పైకి క్రింది
యాకు లీరీతి నిముసమ్ము నాగకుండ
కదలుచున్నది కాలచక్రమ్ము దాని
నాపగలవా డెవండులే డవనియందు.
34

సీ.
ఏనాటిమాటలో భూనాధవంశ దీ-పాయితుండైన కృష్ణావనీంద్రు
డెప్పుడున్నాడొ పృధ్వీశరత్నంబు కా-కతి వంశవీరు డున్నతగుణుండు
ఏమయిరో రెడ్డిభూమీధవులు వారి-యౌదార్యమెల్ల యేమీద చనెనొ
ఎన్నాళులైనట్టు లున్నది బొబ్బిలి-వీరకోటులు స్వర్గవీధికేగి
ప్రాణులకు నెల్ల నెప్పటికైనఁగాని-యవి జరామరణంబు లున్నవియె నిజము
దానికేమి నాశములేని తత్వశిల్ప-కవిత లేమాయెనో యెరుంగంగరాదు.
35

శా.
అంతర్వైరము లుద్భవిల్లినవి యైక్యమ్మంతమున్‌ బొందె నొ
క్కిం తేమూలను డాగియున్నదియొ కానీ! జాతిశిల్పమ్ము వే
దాంతమ్మున్‌ గవనమ్ము తత్వము సమస్తంబున్‌ నశించెన్‌ వృధా
భ్రాంతిన్‌ సర్వము నేటఁ గల్పుకొని రాంధ్రస్వాము లీరీతిగాన్‌.
36

గీ.
నేటి యాంధ్రులు గుడ్డకుఁ గూటి కున్న
చాలుననువారలైనారు చచ్చిపోయె
నేమొ జాతీయసత్వమ్ము కోమలంబు
మల్లికకు నీరులేకున్న మాడిపోదె.
37

గీ.
మూడుమూర్తుల తత్వముల్‌ మొనసి బ్రహ్మ
మందు చివరకుఁ జని లీనమైనయట్లు
ఆంధ్రశిల్పకవిత్వ తత్వార్థములును
ప్రకృతి పురుషుల లీలలోఁ బ్రతిఫలించు.
38

చ.
ఇది యెఱుగంగరాక పరులెల్లరు నాంధ్రకవిత్వ శిల్పసం
పదన పసందు గానరనువారల మాటల నాలకించి వా
రి దయకు పాత్రులై కలవరించుచు వారలు కూయు కూత లి
య్యదనునయందు వీరులగునాంధ్రులు కానరు జాతితత్వమున్‌.
39

సీ.
గోదావరీ పావనోదారవాః పూర-మఖిల భారతము మాదన్ననాడు
తుంగభద్రాసముత్తుంగరావముతోడ-కవుల గానము శ్రుతిఁ గలయునాడు
పెన్నానదీసముత్పన్న కైరవదళ-శ్రేణిలో తెన్గు వాసించునాడు
కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ-శిల్పమ్ము తొలిపూజ సేయునాడు
అక్షరజ్ఞాన మెఱుగదో యాంధ్రజాతి-విమలకృష్ణానదీ సైకతములయందు
కోకిలపుంబాట పిచ్చుకగూండ్లుకట్టి-నేర్పుకొన్నది పూర్ణిమానిశలయందు.
40

సీ.
కృష్ణానదీ రవామృతమన్న మనసయ్యె-విమల కాళిందిపై వెగటుబుట్టి
భూప్రజాపాలనంబునఁ గోర్కి హెచ్చయ్యె-గోపాల కతయన్న కొంకుగలిగి
ఏకపత్నీవ్రతంబే మంచిదనిపించె-కన్యాళిపై విరాగమ్ము గలిగి
సకల భూవలయరక్షా కార్య మనువయ్యె-భూభరమ్ము హరించు బుద్ధి తిరిగి
రమ్యమౌ నాంధ్రభూమి సారంబుగలది-బృందమున కన్నయని మది నెంచినాడు
సుందరమ్మగురీతి రాత్రిందినములు-పాటపాడెను బాలగోపాలమౌళి.
41

గీ.
ఆంధ్రవీరుడు క్రోధరక్తాక్షు డగుచు
నొరవెరికికత్తి ఝళిపించి యుఱికినాడు
నిఖిల దుష్టారికంఠశోణితముబర్వి
శాంతి సమకూరినది ధాత్రిజనులకెల్ల.
42

సీ.
నునుతమ్మిఱేకు విచ్చినయంతలో బాష్ప-మోడ్చనేమిటికి నీలోత్పలమ్ము
మల్లెతీవియఱేకు మడచి మొగ్గ ధరింప-మాడనేమిటికి చామంతిమొక్క
పసిపిందవిడచి క్రొమ్మిసిమి తాల్చిన నింబ-మగుడనేమిటికి క్రొమ్మావికాపు
అమృతమానిన బలాకము చూలు వహియింప-పికకన్యకకు గొంతు బిగియనేల?
ఉత్తమకులంబువార లిట్లూహచేయ-నీచకులములమాట గణింపనేల?
ఆంధ్రులయశంబు దశదిశావ్యాప్తమైన-కుటిలభూపాలురకు గన్ను కుట్టిపోయె.
43

మ.
తలిరాకుఁగొన బొత్తుకొన్నది మృదుత్వంబేది శ్రీహీనమై
ఫలితంబై కనుపట్టె దానికి సమీపంబందునన్‌ బూచి తే
నెలు జార్పంగలయట్టి క్రొన్ననయుఁ గాంతింబాయు పుష్పంధయో
జ్వలనాదామృతధార లేటికొ స్రవింపన్‌ రావ యాచెంగటన్‌.
44

సీ.
ఇవి నందనోద్యాన నవకల్పశాఖులా!-గోచర్మములు కప్పుకొన్నవేల?
ఇవి గాంగనవఝరీ భవతరంగమ్ములా!-పొలసుచేపలకంపు బలిసెనేల?
ఇవి నిరంతముజేయు శివపూజతావులా!-నెత్రుమాంసమ్ములు నిండెనేల?
ఇవి యాగ కార్యోచితేరితఋక్కులా!-సద్విజద్వేషమ్ము సలుపునేల?
హరికృపాదృష్టిచే నక్షయాంబరములు-పొందిన పతివ్రతల జన్మభూములటవె?
యివి యిదేమి విరుద్ధ మిందేమి? కడు న-పాంసులామానభంగరావమ్ము లేమి?
45

చ.
శివసితలింగమూర్తి కభిషేకముజేయు ననంతరంబునన్‌
బువులను బూజసేయు తలపుల్‌ చివురెత్తగ నందనంబునన్‌
దవిలిచరించు నాకవనితామణు లందఱు నింపుకొన్న క్రొం
బువులయొడుల్‌ విభీతలయిపోయి తమంతననజార్చి రేలొకో?
46

సీ.
విప్రసంతతిమ్రోయు వేదరావము లలో-దొరలెనెమో యపస్వర మొకండు
అనరాదు లోపమేదైనఁ గల్గినదేమొ-పరమపతివ్రతాతరుణులందు
నిరతాగ్నిహోత్రముల్‌ నెఱపు బ్రాహ్మణకర్మ-సంతతిసుష్ఠుగా జరుపబడదొ
అఖిలపురాణ శాస్త్రాగమార్ధంబులు-తప్పుచెప్పిరొ యేమొ తత్వవిదులు
ఆంధ్రవిష్ణువు శ్రీకాకుళాధినేత-కనులు కొలకులు కెంపుల గనులుగనెనొ
ఏకతమొ యుండగావలెకాక యున్న-తెనుగు చురకత్తిపదునుకు తిరుగులేదు.
47


సంపూర్ణము.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: విశ్వనాథ సత్యనారాయణ (Viswanatha Satyanarayana) గారి పుస్తకాలు - by Vikatakavi02 - 25-04-2020, 11:45 PM



Users browsing this thread: 1 Guest(s)