20-03-2020, 07:15 PM
షష్ఠ స్కంధము – అజామిళోపాఖ్యానం:
ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు అయినవాడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రామించే స్థితిని కలిగి వున్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామీళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. అజామీళుడు యజ్ఞోపవీతం వుంది సంధ్యావందనం చేసిగాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణము శాంతము.
దాంతుడై ఉన్నాడు. దాంతుడు మనసును గెలవడం. మనస్సు ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనసును ఇంద్రియములను గెలిచాడు. ఇక్కడే మీరొక విషయమును గుర్తుపెట్టుకోవాలి. ఒకరాజు ఒక రాజ్యమును గెలిచాడనుకోండి. ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందనే నమ్మకమేమీ ఉండదు. ఈయనకన్నా బలవంతుడయిన రాజు వచ్చి ఈయనను చంపి ఆ రాజ్యం ఆయన కొల్ల గొట్టవచ్చు. అలాగే ఇంద్రియములను గెలిచినా వాడు మరొక పదినిమిషములు గడిచిన తరువాత పతనమై క్రిందపడి పోవచ్చు. ఆయన మోక్షమును పొందితే ఆయన ఇంద్రియములను మనసును గెలిచినట్లు లెక్క. అవి ఏ క్షణంలో అయినా కాటు వేయడానికి నిరంతరమూ కాచుకుని ఉంటాయి. మంచి యౌవనమును పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై, దాంతుడై ధర్మసంశీలుడై ఉన్నాడు.
శీలము అంటే స్వభావము. అజామీళుడు నిరంతరమూ తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించ గలిగినవాడు. తన ధర్మమును తాను నెరవేర్చిన వాడు. అంతమాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతము తీసుకువచ్చాడు. ఎన్నోమంత్రముల సిద్ధిని పొందాడు. అతని శరీరము మంత్రపూతమయింది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు.
అజామీళుడు సత్యభాషణా నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామీళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు.
భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీళుడి యౌవనం గురించి పోతన గారు అన్ని పద్యములు వ్రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి. దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకో గలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యౌవనము మాత్రమే. ఈ యౌవనమును ప్రధానముగా రెండు భ్రంశము చేస్తాయి. ఒకటి అర్థార్జన. అర్థ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుట యందు నిమగ్నమయిన వాడు, బెల్లపు పరమాన్నమయినా అదే రుచి, పంచదార పరమాన్నమయినా అదే రుచి – ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామినీ పిశాచము పట్టుకుని తన ధర్మపత్ని జంట వుండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించి పోతున్నాడు. ఈ రెండింటి చేత యౌవనము నశించిపోతున్నది. అలా నశించి పోవడం అత్యంత ప్రమాదకరము.
ఇప్పుడు అజామీళుడికి యౌవనం అంకురించింది. మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపు పురుగు నశించి పోతుంది. దీపపు పురుగు దీపమును చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళుతుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపము ఆకర్షించేదానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యౌవనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించి పోయింది.
పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటకాడు రెండు మూడు రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆపాట విని దానికోసం పరుగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది.
చర్మమునకు కండూతి’ అనగా దురద ఉంటుంది. ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగులను పట్టుకునే వారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలయిన పరికరములు అక్కడ పెడతాడు. ఏనుగు అక్కడకు వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుతుంది. ఆ ఊగుకి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈవిధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించి పోతున్నది.
నాల్గవది రసనేంద్రియము – నాలుక. దీనివలన పాడయిపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణ వాయువును తీసుకుని బ్రతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులు అంటే ఎంత ఇష్టమో. ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈవిధంగా రసనేంద్రియం చేత చేప నశించి పోతోంది.
ఇక వాసన. పద్మమునందు సుగంధము ఉంటుంది. ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడినుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వులలో మకరందమును పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్క సారి చీకటి పడి పువ్వు ముకుళించుకు పోతుంది. అది పువ్వులో చిక్కుకు పోతుంది. ఆ సమయమునకు నీళ్ళు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండముతో పీకివేసి నేలమీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ వున్న సీతాకోకచిలుక ఏనుగు పాదము క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది.
ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించి పోతోంది. ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమయినా మిమ్మల్ని కరచి వేయవచ్చు. ఇంద్రియములను త్రిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. ఇప్పుడు అజామీళుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతమును అందరూ వినవచ్చు. కానీ యౌవనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు. ఆయనను తండ్రిగారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు పువ్వులు తీసుకు రావలసినది అని చెప్పారు. తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిధలు కోసి సంతోషంగా ఇంటివైపుకి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కల్లుకుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమయిన జన్మను పొందిన ఒక స్త్రీ, ఆ కల్లును తాను విశేషముగా సేవించి శారీరకమయిన తుచ్ఛమయిన కామమునందు విశేషమయిన ప్రవేశము అనురక్త అయిన ఒక స్త్రీ కళ్ళు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమయిన అభినివేశము ఉన్న వాడితో ఆనందముగా పునః పునః రతిక్రీడ జరుపుతున్నది.
అజామీళుడు ఆ సన్నివేశము చూశాడు. శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. కానీ ఇక్కడ అజామీళుడి మనస్సును ఆ దృశ్యము ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడడం ప్రారంభం అయిపొయింది. అలా నిలబడి తమకముతో ఆ సన్నివేశమును వీక్షించాడు. అనగా ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యము గలవడం ప్రారంభం అయింది. వారిద్దరూ వెళ్ళిపోయిన తరువాత తానూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చి అసుర సంధ్య వేళా సంధ్యావందనమునకు కూర్చున్నాడు. కానీ మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము కాదు. పొదలమాటున తన కన్ను దేనిమీద నిలబడిందో అది కనపడుతోంది. ఇంట ధర్మపత్నియై సుగుణాల రాశియై సౌందర్యవతియైన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. కానీ అతడు చూసిన సన్నివేశము వీటన్నింటిని తొలగదోసినది. ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి, తండ్రికి తెలియకుండా ఆహీనకుల సంజాత అయిన ఆస్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనమును దోచుకున్నాడు. కులట స్త్రీయందు 9మంది బిడ్డలను కన్నాడు.
అతడు చేసిన ఒకే ఒక మంచి పని – ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిద్దడికి ‘నారాయణ’ అని పేరు పెట్టడం. ఆఖరి పిల్లాడు అవడం మూలాన వాడిమీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రామ్మనేది. అందుకుగాను దొంగతనములు చేయడం మొదలు పెట్టాడు. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎవడు మంత్రసిద్ధులను పొందాడో అటువంటి అజామీళుడు ఈవేళ ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేదని అనిపించుకున్నాడు.
ఇంత పతనం ఎక్కడినుంచి వచ్చింది? ఒక్క ఇంద్రియ లౌల్యం వల్ల వచ్చింది. మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియములను గలవడం ఎంతకష్టమో చూడండి.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK