2. భరతుని చరిత్ర:
మహానుభావుడయిన ఋషభుని కుమారుడే భరతుడు. ఆయన పరిపాలించాడు కాబట్టే మన దేశమునకు భరతఖండము అను పేరువచ్చింది. ఆయన విశ్వరూపుడు అనే ఆయన కుమార్తె ‘పంచజని’ని వివాహం చేసుకుని సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, దూమ్రకేతువు, అను 5గురు బిడ్డలను కన్నాడు. ఆయన భక్తి వైరాగ్యములతో కొన్ని వేల సంవత్సరములు భరత ఖందమును పరిపాలించాడు. ఆయనలా పరిపాలించిన వారు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమునకు ‘భరత ఖండము’ అను పేరు వచ్చింది.
ఆయన ఒకరోజు అనుకున్నాడు “ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను? ఇక్కడి నుండి బయలుదేరి పులహాశ్రమమునకు వెళ్ళిపోతాను. అక్కడ గండకీ నది ప్రవహిస్తోంది. అక్కడ సాలగ్రామములు దొరుకుతూ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను’ అని బయలుదేరి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారు జామునే సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణ దర్శనము తెల్లవారిన తరువాత జరుగుతుందనే ఉద్దేశంతో నదీస్నానం కొరకని చీకటి ఉండగానే వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని జపం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక చిత్రమయిన సంఘటన జరిగింది. అక్కడికి నిండు చూలాలయిన ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతలో అక్కడే అరణ్యంలో సింహం ఒకటి అరణ్యము బ్రద్దలయిపోయేటట్లు గర్జించింది. సింహం అరుపు విని నిండు గర్భిణి అయిన లేడి భయపడిపోయి నీటిలోకి దూకేసింది. వెంటనే దానికి ప్రసవమై ఒక లేడిపిల్ల పుట్టింది. లేడి వరదలో కొట్టుకుపోయింది. దానిని భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పిల్లను తెచ్చాడు. అయ్యో తల్లి మరణించిందే అనుకుని ఈ లేదిపిల్లను ఆశ్రమంలో తనపక్కన పెట్టుకున్నాడు. మెల్లమెల్లగా దానికి లేత గడ్డిపరకలు తినిపించడం కొద్దిగా పాలుపట్టడం దానిని పులో, సింహమో వచ్చి తినేస్తుందని ఎవరికీ దొరకకుండా ఆశ్రమంలో తలుపులు వేసి పడుకోబెట్టడం చేసేవాడు. ఎప్పుడూ లేడిపిల్ల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. జపం మొదలు పెట్టేవాడు. అమ్మో, నేను ఎక్క్వాసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడి ఎక్కడికయినా వెళ్ళిపోతుందేమో ఏ పులో దానిని తినేస్తుందేమోనని దానిని చూసుకుంటూ ఉండేవాడు. రానురాను ఆయన దేనికోసం తపస్సుకు వచ్చాడో అది మరచిపోయి లేడిపిల్లను సాకడంలో పడిపోయాడు.
భరతునికి అంత్యకాలం సమీపించింది. ప్రాణం పోతోంది. కానీ మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను. నా లేడి ఏమయిపోతుందోనని ఆ లేడివంక చూస్తూ కన్నుల నీరు పెట్టుకుని ఆ లేడినే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు. ఈశ్వరుడికి రాగద్వేషములు ఉండవు. ఆఖరి స్మరణ లేడిమీద ఉండిపోయింది కాబట్టి లేడిగా పునర్జన్మను ఇచ్చారు. ‘అయ్యో, నేను లేడిని పట్టుకోవడం వలన కదా నాకీ సంగం వచ్చింది. అసలు నేను ఎవరినీ ముట్టుకొని’ అని వ్రతం పెట్టుకున్నాడు. పచ్చగడ్డి తింటే దానిమీద వున్న క్రిములు చచ్చిపోతాయని ఆ లేడి (భరతుడు) ఎందుగడ్డిని మాత్రమే తినేది. అంత విచిత్రమయిన వ్రతం పెట్టుకుని పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విదిచాడో ఆ పులహాశ్రమమునకు వచ్చాడు. ఆ లేడి లోపల ఎప్పుడూ నారాయణ స్మరణం చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితమును గడిపి అంత్యమునందు భగవంతుడినే స్మరిస్తూ శరీరం విడిచిపెట్టింది. కానీ మోక్షం పొందడానికి మరల మనుష్య శరీరంలోకి రావాలి. ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK