Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#40
ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’ (కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. 
ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. అపుడు ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు.కానీ నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. అపుడు నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. కానీ ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు. 

తరువాత కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమంది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకునే అప్పుడే వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో నాన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తమ భార్యను తలుచుకుంటూ. సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడ ఈకోట శిధిలం అయిపొయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది. 

ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి” అని నారదుడిని అడిగాడు. అపుడు నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పాడడం ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.


గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 19-03-2020, 08:23 AM



Users browsing this thread: 1 Guest(s)