30-01-2020, 07:52 PM
(This post was last modified: 08-02-2020, 09:50 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
పరమౌషధం
అనారోగ్యంతో ఉన్నప్పుడుగానీ ఆరోగ్యం విలువ తెలియదంటారు అనుభవజ్ఞులు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో పడితేగానీ డబ్బు విలువ తెలియదంటారు.
మనిషి అన్నీ బావుంటే నేలమీద నడవడు. నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహిస్తుంది. ఏవి నిషిద్ధమో అవే ఆచరిస్తాడు. ఫలితంగా చిక్కులు తప్పవు.
ఆరోగ్యం, ఆర్థిక పుష్టి మనిషికి రెండు చేతుల్లాంటివి. ఏది బలహీనంగాఉన్నా ప్రగతి కుంటువడుతుంది. ఆరోగ్యం బావుండి ఆర్థిక సమస్యలున్నా, అలాగే ఆర్థికంగా బావుండి ఆరోగ్య సమస్యలున్నా ఆ జీవితంలో సుఖశాంతులుండవు.
మనిషి మనసెప్పుడూ సుఖశాంతులనే కోరుకుంటుంది. అందుకోసం మనిషిని ప్రోద్బలం చేస్తుంది. సుఖశాంతులు శాశ్వతం కాదు. అవి మనిషితో దోబూచులాడుతుంటాయి. మనిషి జీవితంలో అధికభాగం సుఖశాంతుల వేటలోనే గడిచిపోతుంది. సుఖం సిరిసంపదల్లో ఉందనిపిస్తుంది. శాంతి ఆనందంలో ఉంటుందనిపిస్తుంది. కానీ, అవి రెండూ భ్రమలే.
సుఖశాంతులు తృప్తిలో నిక్షిప్తమై ఉంటాయి. రాక్షసుడి ప్రాణం చిలుకలో ఉందన్నట్లుగా తృప్తి అనే నిత్యానందం మనసులోనే ఒక మూల మౌనిలా నిశ్చలంగా ఉంటుంది. దాని ఉనికి తెలియనంతమేరకు మనిషికి తిప్పలు తప్పవు.
తృప్తి అంటే తనకు ఉన్నదానితో సంతుష్టి చెందడం. గొంతువరకు తిని ఇక చాలనుకోవడం తృప్తి కాదు. ఎందుకంటే, కడుపు ఖాళీకాగానే మళ్ళీ అంతకు అంత తినాలని ఆరాటపడతారు.
యుక్తాహార విహారాలే ఆరోగ్యానికి, ఆయుష్షుకు ఆలంబనాలు. అమితాహారం ఆరోగ్యభంగం. ఆయుష్షుకు హాని చేస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉండే శరీరాన్ని అనారోగ్యం పాలుచేసుకుని, ఔషధాలతో గడపడం జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంది.
మన సంప్రదాయంలో వివిధ సందర్భాల్లో ఉపోషాలు పాటిస్తారు. దీనినే ‘ఉపవాసం’ అని వ్యవహరిస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే ‘ఉపవాసం’ దైవ సన్నిధిలో వసించడం. ఆరోగ్యపరంగా చూస్తే ఆయుర్వేదం చెప్పిన ‘లంఖణం పరమౌషధం’గా ఆరోగ్యరక్షణ చేస్తుంది.
ఆహారం నియమిత వేళల్లో, మితంగా తీసుకోకపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. శరీరాన్ని రక్షించినా, శిక్షించినా జీర్ణవ్యవస్థదే ప్రధాన పాత్ర.
శరీరం బావుంటేనే ధర్మాచరణ సాధ్యపడుతుంది. యోగసాధనలన్నీ శరీర రక్షణతోపాటు, మనసునూ బలోపేతం చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనలు మనసులోని తృప్తిని జాగృతం చేస్తాయి. ‘సత్యదర్శనం అయ్యాక పూజలతో పనిలేదు’ అంటారు శ్రీరామకృష్ణులు. మనిషి క్రమంగా ఆ స్థాయికి ఎదగాలి.
‘ఔషధం’ అంటే సాధారణ రుగ్మతలకు వాడేది. ‘పరమౌషధం’ అంటే ప్రాణాంతక వ్యాధులను నివారించేది.
మనిషి స్వయంకృతాలన్నీ ప్రాణాంతక పర్యవసానాలకే దారితీస్తాయి. వాటికి పనికొచ్చే పరమౌషధాలను మనమే వెతుక్కోవాలి!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK