28-12-2019, 09:54 PM
శప్తభూమి
బండి నారాయణ స్వామి.
సాధారణంగా ఏ పుస్తకాన్నయినా చాలా తీరకగా ఉన్నప్పుడు చదువుతా నేను. అలా ఒక పుస్తకం మొదలుపెట్టాక కూడా పూర్తయ్యేవరకూ అదే చదవను. మధ్యలో ఏదో గాప్ వస్తుంది. ఈ లోపు మెదడులో ఇంకేదో తొలుస్తుంది. మళ్ళా ఆ పుస్తకం పట్టుకుంటా. అలా చదువుదామని పట్టుకున్నవి, సగం చదివి పక్కన పెట్టినవి, మళ్ళీ రెండో సారో మూడో సారో, మధ్యలో ఏదో ఒక చాప్టర్ చదవడం కోసం ఉంచుకున్నవీ, వెరసి ఇల్లయితే ఇల్లులా ఉండదు.
కానీ, ఈ పుస్తకం అలా కాదు. మొన్నటిరోజున, నేనున్న ఉద్విగ్నతలన్నీ పక్కన పెట్టి ఏక బిగిన చదివించేలా చేసింది. చాల రోజుల తర్వాత ఆపకుండా చదివించిన పుస్తకం. ఏం కథ ఇది. ఎక్కడ మొదలయ్యింది!! నారాయణ స్వామిగారే అన్నట్లు, ఇది చారిత్రక కథ గా మొదలయి, తర్వాత నవలగా, ఆ తర్వాత దళిత బహుజన చారిత్రక నవలగా పరిణమించింది.
అనంతపురం సంస్థానాధీశుడు, హండే సిద్ధరామప్ప నాయుడు నుంచి ప్రారంభమవుతుంది కథ. వర్షాలు లేని కరువు సీమ అక్కడి ఆర్ధిక వ్యవస్థపై చూపించే ప్రభావం...ఇంకో పక్క, నీలడు ఇమ్మడమ్మల మధ్య ప్రేమ. సమాతరంగా చర్చిస్తారు రచయిత. నాటి సమాజంలో వేళ్లూనుకున్న దేవదాసి వ్యవస్థ, కుల వివక్ష తో పాటు బహుజన వాడలు ఊరికి బయట ఉంచడం తో పాటు మండలాధీశుడైన వీర నారాయణ రెడ్డి మాదిగ స్త్రీలపై చేసే లైంగిక దాష్టీకాలు… నాటి స్థితిని కళ్ళకు కడతాయి. ఒక మాదిగ వ్యక్తిపై పగతో అతనికి పుట్టబోయే కూతురిని దేవదాసినిగా ఉంచాలని శిక్ష వేసి ఆ కూతురు ఎదగడం కోసం ఎదురుచూసిన వైనం అప్పటి థాష్టీకానికి పరాకాష్ట.
ఇవే కాదు, హిందూమతాచారాల ముసుగులో అప్పటిరోజుల్లో జరిగిన దుర్మార్గాలు, బసివిని వ్యవస్థ, తండ్రి ఎవరో తెలియదని హేళన కాబడుతున్నప్పుడు, పద్మసాని కొడుకు క్రైస్తవమతం స్వీకరించడం ఇవన్నీ మనలో చాలా ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.
కాలచట్రంలో పడి తిరిగే మనుష్యుల జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయోకదా. పిల్లలు తండ్రులవుతారు, తండ్రులు తాతలవుతారు. తరాలకి తరాలు మారతాయి. కానీ, పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు వచ్చింది?? ఎన్ని దురాచారాలు. ముఖ్యంగా ‘సతి’ ఎంత వేదనాభరితంగా వుంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొత్తగా పెళ్ళయిన ఒక కులం జంటలు ప్రతీ ఏడూ జరిగే పరసలో గుండు కొట్టించుకుని సున్నం బొట్లు పెట్టించుకోవడం. మనసుని కదిలివేసే ఇలాంటి సంఘటనలెన్నో! సంతానం కలగడంలేదని దేవుడికి మొరపెట్టుకోవడానికి వెళ్ళిన స్త్రీలపై లైంగిక దాడులు జరిపిన పూజారులుఅస్పృస్యత, అంటరానితనం, వెలి వాడలు.. వాళ్ళ గాథలు గుండెల్ని మెలిపెట్టేస్తాయి.
పుస్తకం చదువుతున్నంతసేపూ.. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది.. అని ఎన్ని సార్లు అనుకున్నానో లెక్కలేదు. కన్నీటి చరిత్రని కళ్ళముందు నిలబెట్టిన నారాయణ స్వామి గారికి వేలవేల నమస్కారాలు.