20-12-2019, 02:25 PM
యమధర్మ రాజుల వారికీ
తప్పలేదు శాపం!
పిల్లలు ఒక వయసుకి వచ్చేవరకూ, వారికి మంచిచెడుల విచక్షణ తక్కువగా ఉంటుంది. అందుకని పెద్దలు చేసే పొరపాటుతో సమానంగా పిల్లల పొరపాట్లనీ చూడలేం. కానీ 'ఎంతవయసు వరకూ ఓ పొరపాటుని బాల్యచాపల్యంగా భావించాలి?' అన్న ప్రశ్నకు మహాభారతంలోని ఓ కథ స్పష్టమైన సమాధానం చెబుతుంది.పూర్వం మాండవ్యుడు అనే ముని ఉండేవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు, వేదవేదాంగాలను ఔపోసన పట్టినవాడు, సకల పుణ్యక్షేత్రాలనూ దర్శించినవాడు. అలా సకలతీర్థాలనూ సందర్శించిన తర్వాత ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మాండవ్యుడు. ఆ ఆశ్రమంలోని ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సుని ఆరంభించాడు.
మాండవ్యుని తపస్సు ఉధృతంగా సాగుతున్న సమయంలోనే అక్కడ రాజుగారి కోటలో దొంగలు పడ్డారు. ధనాగారానికి కన్నం వేసి, ఖజానా మొత్తం ఖాళీ చేసేశారు. ఆపై రాజభటుల నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ మాండవ్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని వెంబడిస్తూ వెంబడిస్తూ రాజభటులు కూడా ఆ ఆశ్రమానికి చేరుకున్నారు.
రాజుగారి ఖజానాను దోచుకున్న దొంగలు ఎటువెళ్లారంటూ, భటులు మాండవ్యుని అడిగారు. మాండవ్యుడు కఠోరమైన మౌనవ్రతంలో, శీర్షాసనంలో ఉండటంతో దొంగల గురించిన జాడని చెప్పలేక మిన్నకుండిపోయాడు. రాజభటులు ఆశ్రమానికి చేరుకోవడం చూసి దొంగలు కాస్తా, అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఇటు మాండవ్యుని దాటుకుని ఆశ్రమంలోకి ప్రవేశించిన రాజభటులకు అక్కడ రాజుగారి సంపద యావత్తూ కనిపించింది.
మాండవ్యుని ఆశ్రమంలో సంపదని చూసిన రాజభటులకు అతను కూడా ఆ చోరీలో భాగస్వామే అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆ సొత్తునీ, మాండవ్యునీ కట్టగట్టి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. మరికొద్ది రోజుల్లోనే మిగతా దొంగలు కూడా రాజభటులకు చిక్కారు. తన కోశాగారాన్నే దోచుకోవాలని ప్రయత్నించిన దొంగలకి రాజుగారు మరణదండనను విధించారు. వారికి సహకరించాడన్న అనుమానంతో మాండవ్యుని మెడలో శూలం గుచ్చి ఉంచమన్నారు.
తనకు శూలదండన విధించినప్పటికీ మాండవ్యుని తపోనిష్టలో ఎటువంటి మార్పూ రాలేదు. కారాగారంలో నరకయాతనను అనుభవిస్తున్న మాండవ్యుని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచో మునులు పక్షుల రూపంలో వచ్చి ఆయనను దర్శించుకోసాగారు. శూలం గుచ్చుకుని కూడా చనిపోకుండా తపోనిష్టని కొనసాగించడం, ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఆయనను దర్శించుకోవడం గురించి విన్న రాజుగారికి... మాండవ్యుడు నిజంగానే ఓ మహాత్ముడు అన్న నమ్మకం కలిగింది.
మాండవ్యుని వెంటనే విడుదల చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. అపార్థంతో తను తలపెట్టిన కష్టానికి క్షమించమని వేడుకున్నాడు. అయితే మాండవ్యుని నుంచి శూలాన్ని తీసే సమయంలో దాని మొన (అణి) మాత్రం ఆయన గొంతుకలో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయనను అణిమాండవ్యుడు అని పిలవసాగారు.
‘ఇదంతా నా ప్రారబ్ధ కర్మ ఫలితమే!’ అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు. యథావిధిగా తన తపోనిష్టను సాగించాడు. కొన్నాళ్ల తర్వాత మాండవ్యుడు, యమధర్మరాజుని కలుసుకోవడం తటస్థించింది.
‘యమధర్మరాజా! నాకు తెలిసి నేను ఏ తప్పునూ చేయలేదు. మరి అంతగా శిక్షను అనుభవించేందుకు నేను చేసిన పాపమేమిటి?’ అని యముడిని అడిగాడు మాండవ్యుడు.
యముడు ‘మాండవ్య మహర్షీ! మీరు చిన్నతనంలో తూనీగల రెక్కలకి ముళ్లు గుచ్చి ఆనందించేవారు. ఆ తప్పుకి ఫలితంగానే శూలదండనని అనుభవించారు,’ అని వివరించాడు యమధర్మరాజు.
ఆ మాటలు విన్న మాండవ్యుడు కోపగిస్తూ- ‘యమధర్మరాజా! చిన్న పిల్లలకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని నీకు తెలియదా! అలాంటివాని తప్పులకు తీవ్రమైన శిక్షలను విధించడం ఎంతవరకు భావ్యం? ఇక మీదట 14 ఏళ్లలోపు పిల్లలు తప్పుచేస్తే దానిని పెద్దమనసుతో క్షమించాల్సిందే! అలా కాదని వారికి పెద్దలతో సమానంగా శిక్ష విధిస్తే.... అలా శిక్ష విధించినవారికే ఆ పాపం చుట్టుకుంటుంది. అంతేకాదు! నేను తెలిసీతెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసినందుకుగాను నువ్వు మానవజన్మనెత్తుదువుగాక!’ అని శపించాడు.
అప్పటినుంచీ హైందవ సంప్రదాయం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు చేసే తప్పులను చిన్నపాటి దండనతో సరిపెట్టమని చెబుతున్నారు. ఇక మాండవ్యుని శాపం వల్ల యమధర్మరాజు, విదురునిగా జన్మించాడు.
నిన్నమొన్నటి వరకూ భారతీయ శిక్షాస్మృతిలో 18 ఏళ్లలోపు వారినే బాలనేరస్తులుగా పరిగణించేవారు. కానీ నిర్భయ హత్య తర్వాత ఆ వయసుని 16 ఏళ్లుగా కుదించారు. అది కూడా సరిపోదనీ.... 14 ఏళ్లు దాటినవారు ఎవరైనా తీవ్రమైన అపరాధం చేసినప్పుడు, కఠినదండనకు అర్హులే అని చాలామంది మేధావులు వాదిస్తున్నారు. కానీ ఎప్పుడో మహాభారతకాలంలో ఎవరు బాలనేరస్తులు, ఎవరు కారు అన్న విషయంలో ఓ స్పష్టత ఉండటం గమనార్హం.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK