Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#37
3. పృథు చరిత్ర: 

ఒకానొక సమయంలో ఈ దేశమును అంగరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా ధార్మికుడు. కేవలము ధర్మానుష్టానము తప్ప ఎన్నడు అధర్మము చెయ్యని వాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ సందర్భంగా దేవతలను అందరిని పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు. ఆ రోజులలో స్వాహా అంటూ ఆ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని హవిస్సును అగ్ని ముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఒక్క దేవత రాలేదు! ఏ దేవతా రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు. ‘ఎందుచేత ఇలా జరిగింది’ అని ఋషులను అడిగాడు.

అపుడు ఋషులు ‘వేదము స్వరప్రాకటము. మా స్వరమునందు దోషము లేదు. కానీ వారు రావడం లేదంటే వారు నీయందు అప్రసన్నులై ఉన్నారు. అందుకు నీలో ఏదో దోషం ఉంది ఉండాలి. కానీ నీ చరిత్రను పరిశీలిస్తే నీయందు ఎక్కడా దోషం కనపడడం లేదు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి’ అన్నారు. ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకు సంతానం లేదు. అందుచేత యజ్ఞములో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. అపుడు ఋషులు ‘నీకు ఇప్పుడు ఉత్తరక్షణం సంతానం కలగాలి. గతజన్మలో నీవు చేసిన పాపములు ప్రతిబంధకంగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకమును తీసివేయాలి. అందుకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. దానికి మేము యాగం చేస్తాము. ఆ యాగము చేత శ్రీమహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానం కలుగుతుంది’ అన్నారు.

అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతికొరకు యాగం చేశాడు. యాగం పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించ చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండం లోంచి ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ‘అంగరాజా, ఈ పాయస పాత్రలో వున్న పాయసమును నీ ధర్మపత్ని చేత తినిపించు. అపుడు నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది’ అని చెప్పాడు. పాయస పాత్ర తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీథ. ఆవిడ భర్తృ సంగమము చేతనే సంతానమును పొందింది. తేజస్సు అంగరాజు తేజస్సే. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేక పోయింది? అనగా ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలుగకుండా చేసింది. ఇపుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇపుడు సంతానం కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్ర శుద్ధి జరుగలేదు. క్షేత్రమునందు దోషం ఉన్నది. ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావము కలిగినటువంటి వాడు జన్మించాడు. వానికి ‘వేనుడు’ అని పేరు వచ్చింది. జన్మతః వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలాకష్టం. వేనుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గరనుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదు. అతను వేటనుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు. ఆడుకుంటున్న పిల్లలను బడిత పుచ్చుకుని వారు చచ్చిపోయేవరకు కొట్టేవాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఈయన అలా చెపుతుంటే కొడుకు కనుబొమలు ఎగురవేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు. మరల తెల్లవారున లేవడం పాపకృత్యములు చేయడం! ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. ఒకరోజు భార్య, కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు మాత్రం నిద్ర పట్టక ‘నా జీవితమునకు ఏమి సార్ధకత? నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహానమును అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడయినా నన్ను ఉద్ధరించాలి. నాకు ఇంత దుష్దుడు పుట్టాడు. ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత? సింహాసనం ఉంటే ఎంత? రోజూ వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. అనుకుని విరాగియై అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురమును, భార్యను, బిడ్డను విడిచి పెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు. వారు ఆయన తల్లిగారయిన సునీథతో మాట్లాడి వేనుడికి పట్టాభిషేకం చేశారు.

వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ అటు క్రూరుల వైపునుండి బాధ. యజ్నయాగాడి క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు. ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. ‘వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. కాబట్టి నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను’ అంది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు. ఎప్పుడయితే ఓషధీశక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలితం ప్రతి వాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రాదు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగిపోయింది. దొంగతనములు పెరిగిపోయాయి.

ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీ తీరంలో సమావేశం అయ్యారు. రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకోని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. ‘రాజా, నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో’ అని చెప్పారు. అపుడు వేనుడు ‘అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగిరిపోతాయి’ అన్నాడు.

అపుడు ఋషులు ఇక అతడు మారాడు అనుకున్నారు. ‘వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు.’ అనుకున్నారు. అపుడు ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచ్చిపోయాడు. అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీథ గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వేనుడి శరీరమును కాపాడింది. అందుకని ఆశరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు. ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేదు. అప్పుడు ఋషులు అన్నారు ‘ఇప్పుడు మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. ఇపుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానమును తీసుకురావాలి’ అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. కానీ క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు కానీ వారి వాక్కుకు వాడు మాత్రం మారలేదు. ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి తపశ్శక్తితో మథనం చేస్తే పాపము పైకి రావడం మొదలు పెట్టింది. అందులోంచి బాహుకుడు అనబడే ఒక నల్లటి వాడు పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుట్టుతో పుట్టుకొచ్చాడు. ‘నేను ఏమి చేయాలి’ అని ఋషులను అడిగాడు. అపుడు ఋషులు వానివంక చూసి ‘వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకొని నీవేమీ చేయవద్దు అన్నారు. ఇపుడు మరల సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే ‘నిషాదులు’ అని పేరు వచ్చింది.

ఇపుడు ఋషులు ‘స్వామీ, ఒక కొడుకు పుట్టడమును మేము అడుగుట లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము కాబట్టి శ్రీమహావిష్ణువా, నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా’ అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. ‘ఓహో మనం ప్రార్థన చేసిఅట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు’ అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు ‘అర్చిస్సు’ అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు.

ఆయన విష్ణు అంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకువచ్చారు. కుబేరుడు ఆయన కూర్చొనుటకు కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మేడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మేడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కట్టి పెట్టడానికి ఒర కావాలి. పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను ఇచ్చింది. సోముడు గుర్రమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును, ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు. అపుడు పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి ‘మహానుభావా ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది’ అన్నారు.

పార్వతీ దేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. ‘అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను’ అన్నాడు. పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. ‘స్వామీ నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను(నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపొయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉంది. నేను గోరూపంలో తిరుగుతాను. జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు’ అని అడిగింది.

అపుడు పృథు మహారాజు ‘ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు’ అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది. స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి. ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఇపుడు ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలం అయిపొయింది. ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. అందుకని పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది. విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాల సంతోషించారు. భూమిని పృథు మహారాజు పిండితే ‘పృథివీ’ అనే పేరు వచ్చింది. అందుకే జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 12-12-2019, 11:23 AM



Users browsing this thread: 19 Guest(s)