08-12-2019, 08:34 AM
కృతజ్ఞత.....
“కృతజ్ఞత ”అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృజ్ఞత అనేది నాగరిక సంస్కారం...
వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ , కృతజ్ఞశ్చ” అన్నాడు. సీతమ్మను అపహరించుకొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమ సంస్కారం చేశాడు. రావణసంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం.. ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, అక్కడి నదులలో నిరంతరం స్వాదు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.
మహా భారతంలో.. దగ్ధమైన లాక్షాగృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచుకుంటున్నకుంతి , తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో .. “ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం” అంటుంది.
“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”.. అనే చందంగా కాకుండా, మన ఉనికికి , ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే -అతనియందు సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతఘ్నత ఔతుంది. ఈ విషయాన్ని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.
ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆవృక్షం విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. ఆ చెట్టే ఆశ్రయంగా, దానితొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం దానిని వదలలేక దానిమీదనే ఉండిపోయింది. దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి.. "ఓ కీరమా! ఈ వృక్షం బెండువారిపోయింది. ఫలసంపదగల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, ఇంకా దీనినే అంటి పెట్టుకున్నావెందుకు..?" అని అడిగాడు.
అపుడాశుకం "ఈ చెట్టు తాను మధుర ఫలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.ఈ వేళ ఇది ఎండిపోయిందని నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా అనిమిషనాథా!" అంది. తాను మానుషరూపంలో వచ్చినా "పురాకృత సంజనిత విశేషము" చేతనే ఈ మహా శుకం తనను ఇంద్రునిగా పోల్చుకో గలిగిందని ఆశ్చర్య పోయి.. "నీ మాటలకు మెచ్చాను, నీకేంకావాలో కోరుకో" అన్నాడు ఇంద్రుడు. అపుడా మహాశుకం "ఈ వృక్షానికి మేలు చెయ్యి చాలు" అంది. ఇంద్రుడు సంతోషించి అమృత సేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.
ఈ కథవల్ల ఉత్తములైన ఆశ్రితులు, ఆశ్రయ దాత క్షేమాన్ని కోరుకోవాలనీ , కృతజ్ఞత ఉత్తమ లక్షణమనీ తెలుస్తోంది. సజ్జనులు ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)