06-12-2019, 12:44 PM
శ్రావణి రొట్టెలు చేస్తూ చేస్తూ ‘ఓం నమశివాయ’ అని జపం చేస్తున్నది. విడిగా పూజ కోసం సమయం వెచ్చించటం కుదరట్లేదు పాపం ఆమెకు. అందువల్ల పని చేస్తూ చేస్తూ శివనామాన్ని తలుచుకునేది.
ఇంతలో ఒక్కసారిగా ధబ్బుమని గట్టిగా శబ్దం వచ్చి పెద్దగా బాధాకరమైన అరుపు వినిపించింది. ఆమె ఇంటి ప్రాంగణం వైపు పరుగుపెట్టి చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది... తన ఎనిమిదేళ్ళ బాబు రక్తంతో తడిసి పడి ఉన్నాడు. గట్టిగా అరిచి ఏడవాలి అనిపించింది. కానీ ఇంట్లో ఆమె తప్ప ఎవరు లేరు. ఏడ్చి మాత్రం ఎవరిని పిలవగలదు? ఇటు బాబును కూడా చూసుకోవాలి కదా. పరుగులాంటి నడకతో కిందకు వెళ్ళి బాబుని చూసింది. సగం స్పృహలో “అమ్మ... అమ్మ...” అని కలవరిస్తున్నాడు. ఆమె లోపల మాతృవాత్సల్యం కళ్ళలో నుండి జాలువారి తన అస్తిత్వాన్ని తెలియచెప్పింది.
పదిరోజుల క్రితం చేయించుకున్న అపెండిక్స్ ఆపరేషన్ ను కూడా పట్టించుకోకుండా, ఎక్కడినుంచి అంత శక్తి వచ్చిందో మరి, బాబును భుజాన వేసుకుని, ఆ వీధిలోనే ఉన్న వైద్యాలయానికి పరుగు పెట్టింది. దారి అంతా మనసారా భగవంతుని తిట్టుకోసాగింది.
“ఓ భగవంతుడా! నీకు ఏమి అన్యాయం చేశాను? నా పిల్లవాడికి ఇంత గతి పట్టిస్తావా?” అని ఉక్రోషంతో ధుమధుమలాడింది.
సరే, అక్కడ డాక్టర్ కలిశాడు, వేళకు చికిత్స అందింది. దెబ్బలు ఎక్కువ లోతుగా తగలలేదు. బాబుకి కూడ నయమైపోయింది. అందువల్ల ఎక్కువ ఇబ్బంది కలగలేదు..
రాత్రికి ఇంటిదగ్గర అందరూ టీవీ చూస్తున్నారు. అప్పుడు శ్రావణి మనస్సు ఉద్విగ్నంగా ఉంది. భగవంతుడంటే విరక్తి కలగసాగింది. ఒక తల్లి మమకారం భగవంతుని ఉనికిని ఎదిరిస్తోంది. ఆమె బుర్రలో ఆరోజు జరిగిన ఘటనాక్రమం అంతా చక్రంలాగా తిరగింది.
బాబు ఇంటిముందు ఎట్లా కిందపడ్డాడో- తలుచుకుంటే అంతరాత్మ కంపించింది. నిన్ననే పాత మోటరు పైపు ప్రాంగణం నుండి తీయించివేశారు. సరిగ్గా అదే స్థలంలో బాబు కిందపడ్డాడు. ఒకవేళ నిన్న మేస్త్రీ రాకపోయి ఉంటే? ఆమె చేయి ఒక్కసారి తన పొట్ట దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఆ చోట కుట్లు పచ్చిగానే ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది.! ఆమె 20-22 కిలోల బాబును ఎట్లా అరకిలోమీటరు దూరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది.. బాబు పువ్వు లాగా తేలికగా అనిపించాడప్పుడు. ఆమె బట్టల బొక్కెనను పట్టుకుని మిద్దెదాకా తీసుకొని వెళ్ళలేక పోతుందే మామూలుగా అయితే.!.
మళ్ళీ ఆమెకు గుర్తుకు వచ్చింది--డాక్టర్ గారు రోజూ రెండు గంటల వరకే ఉంటాడు. ఆమె అక్కడకు వెళ్ళినప్పుడు మూడు గంటలు దాటింది. ఆమె వెళ్ళంగానే చికిత్స జరిగింది. ఎవరో ఆయనను ఆపి పెట్టినట్టుగా ఆయన ఉన్నాడక్కడ..
అప్పుడు భగవంతుని చరణాలపై ఆమె తల శ్రద్ధగా వాలింది. ఇప్పుడామెకు మొత్తం ఆట అంతా అర్థమయింది. మనస్సులోనే పరమాత్ముని తన తప్పుడు మాటలకు క్షమాపణ కోరింది. టీవీలో ప్రవచనం వస్తున్నది-
భగవంతుడు ఇట్లా అంటున్నాడు- “నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను. కానీ నీకు దానిని సులువుగా దాటటానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా చేయగలను. కేవలం ధర్మ మార్గంలో సాగుతూ ఉండు. అంతే!"
శ్రావణీ ఇంట్లో దేవ మందిరం వైపు చూసింది- 'శివుడు నవ్వుతున్నాడు.'
సర్వేజనా సుఖినోభవంతు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK