23-10-2019, 11:56 AM
అక్షర శిల్పాలు
కవి చెక్కే అక్షర శిల్పం కావ్యం. విశ్వశ్రేయస్సుకు తోడ్పడేది కావ్యమంటారు పెద్దలు. రుషితో సమానమైనవాడు కవి. ఆయన తన జీవిత సారాన్నంతా అక్షరీకృతం చేస్తాడు. పాఠకులు ఆ గ్రంథం చదవడంతో రచయిత అంతరంగాన్ని దర్శించినవారవుతారు.
బోయవాడు అయిన రత్నాకరుడు దైవానుగ్రహం చేత వాల్మీకి అయ్యాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకొన్న అపూర్వ కవితాశిల్పం రామాయణం. వాల్మీకి బాటలోనే వ్యాస మహర్షి భారతమనే మరో ఇతిహాస శిల్పానికి ప్రాణంపోశాడు. ఈ రుషి కవులు ఇద్దరూ ఆయా గ్రంథాల్లో పాత్రలూ అయ్యారు. కవికి భగవదనుగ్రహం కలుగుతుందని వీరి చరిత్రలు తెలియజెబుతాయి. తరవాతి కాలంలో కాళీమాత కృపచేత మహాకావ్య శిల్పిగా పేరుపొందాడు కాళిదాసు. ఆయన రఘువంశం అన్న కావ్యసృజన చేసి రాముడి వంశకీర్తిని గానం చేశాడు. ఆరంభ శ్లోకంలో శివపార్వతులు వాగర్థాలవంటివారని అర్ధనారీశ్వర తత్వాన్ని రమ్యంగా తెలియజెప్పాడు. కుమార సంభవ కావ్యం ద్వారా తారకాసుర వధ కోసం శివుడు గృహస్థుగా మారిన వైనాన్ని వివరించాడు. సంస్కృతంలోని పంచమహాకావ్యాల్లో చోటు పొందినవి ఈ రెండు కావ్యశిల్పాలు. ఉత్తర రామచరితంతో కరుణరసం ప్రాధాన్యాన్ని చాటిచెప్పాడు భవభూతి. దశకుమార చరిత్ర అనే కావ్య శిల్పం నిర్మించి గద్యంలోని అందాన్ని హృద్యంగా ప్రపంచానికి చాటాడు దండి మహాకవి.
కాళిదాసు, భవభూతి, దండిల ప్రతిభా సామర్థ్యాలను ఒక ఐతిహ్యం తెలియపరుస్తుంది. ముగ్గురు మహాకవుల మధ్య ఎవరు గొప్ప అన్న ప్రశ్న తలెత్తింది. కవి పండితుల్లో తామే గొప్ప అన్న భావన ఉండటం సహజం. దాన్నే ధిషణాహంకారం అంటారు. తమ పాండిత్యాన్ని అంచనా వెయ్యగలిగింది ఒక్క సరస్వతీమాతే అన్న నిర్ణయానికి వచ్చి, వాగ్దేవి ఆలయానికి వెళ్ళారు. తమ తగవును తీర్చమని ప్రార్థించారు. సరస్వతి వాక్కు రూపంలో దండి మహాకవి అంటూ తన మొదటి నిర్ణయాన్ని చెప్పింది. భవభూతిని గొప్ప పండితుడంటూ శ్లాఘించింది. ఆమె నిర్ణయాలు విని కాళిదాసు కోపగించుకున్నాడు. మరి నేనెవరినంటూ ప్రశ్నించాడు. ఆ తల్లి చల్లని చిరునవ్వుతో నీవు నేనేనంటూ సమాధానం ఇచ్చింది. కాళిదాసు పురుషుడి రూపంలో ఉన్న సరస్వతి అవతారమని తేల్చింది. సరస్వతీదేవి మెప్పు పొందిన ఆ కవుల కావ్య శిల్పాలు సాహిత్య చరిత్రలో మణిదీపాలు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన తెనాలి రామలింగడు అమ్మవారి కరుణకు పాత్రుడైన ఘట్టం సుప్రసిద్ధం. కుమార భారతిగా ప్రఖ్యాతుడైన ఆ మహాకవి ‘పాండురంగ మాహాత్మ్యం’ చక్కటి భక్తి ప్రభోదకం. సరస్వతీ కటాక్షం పొందిన మరొక గొప్పకవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. అతడిని మహారాజు నెలరోజుల్లో శాకుంతల కావ్యం రాయమని ఆజ్ఞాపించాడు. ఇరవై తొమ్మిది రోజులపాటు ఘంటం కదల్చలేదు పిన వీరభద్రుడు. చివరి రోజు రాత్రి పూజామందిరం శుభ్రం చేసుకొని కావ్యరచనకు పూనుకొన్నాడు. సరస్వతీ మాత ప్రత్యక్షమైంది. ఎవరూ తనను చూడకుండా తలుపుల్ని వెయ్యమని పిన వీరభద్రుడిని కోరింది. స్వయంగా ఆవిడే ఘంటం పట్టుకుని కవితారచనకు పూనుకొంది. సమయం గడిచేకొద్దీ పిన వీరభద్రుడి అన్న మనసులో ఆందోళన పెరిగింది. తమ్ముడు ఏం చేస్తున్నాడో చూద్దామని తలుపు సందులోంచి తొంగి చూశాడు. బావగారు చూస్తున్నారంటూ పలికి సరస్వతి అంతర్థానమైంది. తక్కిన కావ్యం పిన వీరభద్రుడు పూరించాడు. అనంతర కాలంలో వాణి నా రాణి అంటూ ప్రకటించాడు పిన వీరభద్రుడు.
పై సంఘటనలు నిజం లేదా ఊహాజనితం కావచ్చు. కానీ ఆ మహాకవుల ప్రజ్ఞ తిరుగులేనిది. వారి ఆలోచనా మథనం నుంచి పుట్టిన కావ్య శిల్పాలు మన భారతీయులందరికీ సరస్వతీ సాక్షాత్కారాలు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK