Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
07-08-2024, 12:08 PM
(This post was last modified: 06-09-2024, 07:05 PM by k3vv3. Edited 4 times in total. Edited 4 times in total.)
పద్మనాభం - పదవీ ‘త్యాగం’
చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
పద్మనాభం ఓ మోస్తరు ప్రభుత్వాధికారి. ఒక రోజు పొద్దున్నలేస్తూనే అతడన్న మాటకి చప్పున క్యాలెండర్ వేపు చూసింది శ్రీలక్ష్మి. ''ఇవ్వాళ ఏప్రిల్ ఒకటి అని చూస్తున్నావేమో.. సీరియస్ గానే చెప్తున్నాను. ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నాను', చివరి మాటగా మళ్ళీ చెప్పాడు పద్మనాభం.
''చేసేసి..'', ప్రశ్నర్ధకంగా చూసింది శ్రీలక్ష్మి.
సమాధానం లేక మొహం చిన్నబుచ్చుకున్నాడు పద్మనాభం.
''ఉన్న ఉద్యోగం వదిలేసి వెంటనే మరోచోట వెతుక్కోటానికి మీరేం సాఫ్ట్ వేర్ వాళ్ళు కాదు. ఆర్ట్స్ డిగ్రీ గాళ్ళు. ఏదో ప్రభుత్వ ఉద్యోగం ఉందని మా నాన్న మీకు కట్టబెట్టారు. ఈ ఉద్యోగం మానేస్తే మీరు హాయిగా రోడ్ల వెంబడి తిరుగుదురు గాని... మరి నేనూ, మనవాడూ ఏమైపోవాలి?” అంది. అటుపక్క మౌనం జవాబయ్యింది. “మీ వెర్రి మొర్రి ఆలోచనలూ మీరూనూ.. ఉండండి అవతల బోల్డు పనుంది. పిల్లాడిని కాలేజ్‌కి పంపించాలి..'' అతడి బాధేమిటో పట్టించుకోకుండానే వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి.
గంట తరువాత తయారయ్యి వచ్చి నీరసంగా టిఫిన్ దగ్గర కూర్చున్నాడు పద్మనాభం. టిఫిన్ పెడుతూ అతడి వాలకం చూసి ''ఏవిఁటి నిజంగానే అంటున్నారా..'', అడిగింది శ్రీలక్ష్మి.
''అసలు ఆదిశంకరుల వారు ఏం చెప్పారు?'' తన ధోరణిలో అన్నాడు పద్మనాభం.
''ఏ విషయంలో..'', తికమకగా అంది శ్రీలక్ష్మి.
''కంపెనీ గురించి'', అన్నాడు పద్మనాభం.
''ఆ రోజుల్లో కంపెనీలు గట్రా లేవు కదండీ'', మరింత తికమక పడుతూ అంది శ్రీలక్ష్మి.
''’సత్సంగత్వే నిస్సంగత్వం’ అనలేదూ'', అన్నాడు పద్మనాభం.
''అర్ధమయ్యేట్టు చెప్పండి',' అంది శ్రీలక్ష్మి.
''ఆఫీసులో అంతా పొగరుబోతులు, లేదా లంచగొండి గాళ్ళు. మొదటి రకం వాళ్ళకి పని చేతకాదు కానీ మిడిసిపాటు ఎక్కువ. సెలెబ్రెటీల్లాగా ఆటోగ్రాఫ్ లు చేసి జీతాలు తీసుకునే రకాలు. దేనికి ఎవరి అప్రూవల్ కావాలో ఒక్కడికీ కోట్ చెయ్యడం తెలీదు. ప్రజాధనం దుర్వినియోగం చెయ్యబడుతున్నా ఎవ్వడికీ లెక్కలేదు. అలాంటి వాళ్ళతో గడిపితే మోక్షం ఎలా వస్తుంది. అందుకే సత్సాంగత్యం కోసం..'' పద్మనాభం పూర్తి చేయకుండానే శ్రీలక్ష్మి అందుకుంటూ, "ఉద్యోగానికి రాజీనామా చేసి సన్యాసుల్లో కలుస్తానంటారు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీ నాన్న మీకు ‘సన్యాసిరావు’ అని పేరు పెట్టాల్సింది. గడ్డి తినటం ఎటూ రాదు. బుద్దిగా ఉద్యోగం చేసుకోమని దేవుడు ఓ దారి చూపిస్తే మీరు చేసే నిర్వాకం ఇదా.. దీనికి మీరన్న ఆదిశంకరులు కూడా హర్షించరు'', అని బుజ్జగించి ఆఫీసుకి పంపింది శ్రీలక్ష్మి.
***
ఆఫీసులో పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది పద్మనాభంకి. ఎప్పుడూ సిన్సియర్ అని పేరుండే అతడు ఆ రోజు పనిని మందకోడిగా చెయ్యడం ఆఫీసు మొత్తం గమనించింది. అతని పై ఆఫీసర్ సంగతి కనుక్కుందామని పిలిచాడు. పద్మనాభం మాత్రం గంభీరంగా మొహం పెట్టుకుని, తనయోచనని బహిర్గతం చేశాడు. పై ఆఫీసర్ వెంటనే కంగారు పడిపోయి, టేబుల్ కి ఇటు పక్కకి వచ్చి, పద్మనాభంని ఓదార్చే నిమిత్తం భుజం మీద చెయ్యి వేసి, “ఎలాంటి ఆలోచన చేస్తున్నారు పద్మనాభం గారూ! ఆ పని వెంటనే మానేస్తే మంచిది”, అన్నాడు. తనని, తన ముక్కు సూటి పద్ధతిని ఇష్టపడేవాడున్నాడని సంతోషించబోయాడు పద్మనాభం. కానీ, ఆఫీసర్, “మీలాంటి ‘గడ్డివాము కాడి కుక్క’లుండబట్టే నాలాంటి వాళ్ళకి గీతం ఎక్కువొస్తోందండోయ్. మీరు ఉద్యోగం మానేస్తే ఎలా?” అన్నాడు.
పద్మనాభం అవాక్కయ్యాడు. ‘గడ్డి వాము కాడి కుక్క- అంటే ఆఫీసర్ తనని మెచ్చుకుంటున్నాడా, తిడుతున్నాడా?’ అని ఆలోచిస్తున్న అతని సందిగ్ధాన్ని దూరం చేస్తూ, “అదేనండీ, మీలాంటి వాళ్ళు మా కింద ఉంటే, మాకో ప్రయోజనం ఉంటుంది. నన్ను ఎవరైనా ఫేవర్ అడిగితే, ‘నా కింది ఆఫీసర్ చాలా ముక్కుసూటి మనిషి, ఆయన్ని ఒప్పించడానికి ఎక్కువ శ్రమపడాలి. అందుకని ఎక్కువ ఖర్చౌద్ది’, అని నా వసూళ్లు పెంచుకోవచ్చు. మీరిప్పుడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోతానంటే ఎలా? మీ రిలీవర్ మీబోటివాడు కాకపోతే నా కలెక్షన్లు పడతాయ్”, అంటూ, పద్మనాభం చేతులు పట్టుకుని, “బాబ్బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి.... ఇద్దరాడపిల్లల తండ్రిని. ఈ రోజుల్లో తలమాసిన వెధవలే బోలెడంత కట్నమడుగుతున్నారు. మంచి సంబంధం తేవాలంటే ఖర్చెక్కువ. ఉండండి బాబూ, మీ రాజీనామా ఐడియాని గాలికొదిలేయ్యండి. పైగా, ఇంకో రెండేళ్ళలో నాకు రిటైర్మెంటు కూడా”, అన్నాడు.
పద్మనాభానికి మండిపోయింది. తాను నిజాయితీగా ఉంటూ, తన కింద వారిని నిజాయితీపరులుగా ఉండమని ప్రోత్సహిస్తూ వుంటే, తన పై ఆఫీసర్ దాన్ని తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. ఏది ఏమైనా సరే, మంచి రోజు చూసుకుని రాజీనామా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాడు.
****************
“ఏవండీ! మీ ఆఫీసులో రాజీనామా కబుర్లేమైనా చెప్పారా?” మర్నాడు సాయంత్రం ఇంటికి వెళ్ళీ వెళ్ళకుండానే శ్రీలక్ష్మి కోపపు మాట.
“నిన్న మా పై ఆఫీసర్ కి చెప్పాను. ఏం జరిగింది?” అడిగాడు.
“ఇవ్వాళ మా కిట్టీలో వాళ్ళావిడ నన్ను కించపరిచింది. ‘భగవంతుడు పూర్వ జన్మ సుకృతం వల్ల సర్కారీ ఉద్యోగం ప్రసాదిస్తే, దాన్ని తట్టుకోలేక విడిచిపెట్టే పిరికిపంద’, అని మిమ్మల్ని పరోక్షంగా వెక్కిరించింది. లేడీస్ లో నా పరువు మీ వల్ల పోయేటట్టుంది. మీ ఐడియా వదులుకోండి బాబూ”, అని ఎప్పుడూ లేనిది, చేతులెత్తి నమస్కరించింది.
పద్మనాభం షాక్ తిన్నాడు. పదవీత్యాగం చేద్దామనుకుంటే వీళ్ళు తనకి పిరికిపందీయం అంటగడుతున్నారేమిటో! “నేను ఇప్పుడు ఇంటికొచ్చే ముందు రాజీనామాకి మూడు నెల్ల నోటీసిచ్చాను”, అనే సరికి శ్రీలక్ష్మి తోకతొక్కిన తాచులా చాలా సేపు బుసగొడుతూ, ఆడిపోసుకుంటూ గడిపేసింది. డిన్నర్ వడ్డించేటపుడు భర్తని ముష్టివాడికన్నా నీచంగా చూసింది. అదే సమయంలో పుండు మీద కారం జల్లినట్టు, ఏదో పాటలోని చరణం, ‘పవరు పోయాక పాలేరైనా పలకరించడురా నిన్ను..’ అన్న మాటలు ఆలపించింది. విసుగ్గా టేబుల్ నుంచి లేచి లోపలికెళ్ళాడు పద్మనాభం.
***
ఆ పై నెల పద్మనాభం ఆఫీసులో ఒకాయన రిటైరయ్యారు. ఆ విందులో తరువాత విందు ఎవరిదీ అన్న చర్చ మొదలైంది. పద్మనాభం ఆ గుంపులో లేడు గనుక వాళ్ళలో వాళ్ళు, “ఇంకెవరిది? మన సన్నాసి గారిది”, అని ఒకరంటే, “హుష్... ఇటొస్తే ఈ మాట ఆయన చెవిని పడచ్చు. కానీ, మీరన్నది రైటే. బంగారంలాంటి ఉద్యోగం వదులుకుంటారా? అలాంటి ఆయన్ని సన్నాసి అనడమే సబబు”, అని మరొకరన్నారు.
ఈ మాట ఆ నోటా, ఈ నోటా పద్మనాభం చెవిన పడ్డాయి. ఇక చూడాలి, పద్మనాభం తెగ మథన పడిపోయాడు. తను త్యాగం అనుకుని గొప్పగా ఫీల్ అవుతున్న విషయాన్ని మిగిలిన వాళ్ళు చేతకానితనం లాగ అనుకుని, తనని పనికిమాలినవాడిలా చులకన చేస్తున్నారు. ఎంతటి అవమానం! త్యాగాన్ని, దానికి కావలసిన ధైర్యాన్ని మెచ్చుకునే రోజులు కావివి!
ఏది ఏమైనా, తను చేయబోయిన త్యాగాన్ని అందరూ తూలనాడుతుంటే పాపం, పద్మనాభం డీలా పడిపోయాడు. తను ఎందుకు ఆ త్యాగం చేస్తున్నాడో మరచిపోయి, తను చేస్తున్న ఘనకార్యాన్ని ఎవరూ గుర్తించనందుకు తెగ బాధ పడిపోయాడు. కంటి నిండా కునుకు లేక, నోటినిండా తిండి సహించక రోగిలా తయారయ్యాడు.
***
ఇలాగే మరో నెల గడిచింది. అప్పుడే చాతుర్మాస్యం ముగించుకుని తన ఆధ్యాత్మిక గురువు, బుద్బుదానంద స్వాములవారు, వాళ్ళ ఊరికొచ్చారు. తన గోడు చెప్పుకుందామని వెళ్ళి కలిసి భోరుమన్నాడు పద్మనాభం. ఆయనంతా విని, “ఓరి బాలకా, నీలో ఇంత స్వార్థం దాగుందని నేనెరుగలేదే! నువ్వు నా శిష్యుడనిపించుకునే అర్హత కోల్పోయావు”, అన్నారు. ముందు ఖంగుతిన్నా, వెంటనే ఆయన కాళ్ళ మీద పడి, తన తప్పేమిటో విశదీకరించమని కోరాడు పద్మనాభం.
“చూడు నాయనా! నువ్వు ప్రభుత్వాధికారివి అయిన వెంటనే నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకునే హక్కు కోల్పోతావు. ఇంతకీ, నిజాయితీగానే పని చేస్తున్నావు కదూ?” అని అడిగారు. “సర్వజ్ఞులు, తమకు తెలియనిదేముంది?” అన్నాడు పద్మనాభం.
స్వాములవారు కాస్సేపు అలోచించి, “నాకు తెలుసు, నువ్వు నిజాయితీపరుడివని. నిన్ను పరీక్షించానంతే! కానీ నీ విషయమే నీకు తెలియటం లేదు. నీకు దేవుడిచ్చిన తెలివితేటలు ప్రజల సేవ చేసే నిమిత్తం ఓ పదవిని దక్కించాయి. దాన్ని వదిలేస్తే, ఆ దైవాన్ని, నీ తెలివిని తిరస్కరించి, ధిక్కరించి, కించపరచినట్టే కదూ”, అన్నారు. ఆలోచిస్తూ తలూపాడు పద్మనాభం.
“రెండవ విషయం- అవినీతి పెరిగిపోతున్న ఈ రోజుల్లో నువ్వు పదవీత్యాగం చేస్తే, ఒక నిజాయితీపరుడు పోయి, ఒక లంచగొండి పదవిలోకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందుకని, నువ్వు త్యాగమే గనుక చెయ్యదలచుకుంటే, నీ భావోద్వేగాలను త్యాగం చేసి, ఎన్ని కష్టాలొచ్చినా బాధపడకుండా, నిజాయితీని వదులుకోకుండా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకు. అదే నువ్వు లోకానికి చేసే పెద్ద త్యాగం అవుతుంది”, అని సెలవిచ్చారు స్వాములవారు.
***
ఇవ్విధంబుగా పదవీ త్యాగమునకు నిజమైన అర్థమును తెలుసుకున్న పద్మనాభం, మరుసటి రోజే తన రాజీనామాపై రాజీపడి, రాజీనామా పత్రమును ఉపసంహరించుకున్నాడు. ఇది జరిగిన ఆరు నెలలకి కరోనా వ్యాధి ప్రబలింది. ఎక్కువ మండి వ్యాధిగ్రస్తులున్న జిల్లాకి అతణ్ణి వ్యాధి నిరోధకాధికారిగా పోస్ట్ చేశారు ప్రభుత్వం వారు. కేరళలోని తన స్నేహితుడి సహాయం వల్ల అక్కడ ఎలాంటి నిరోధక చర్యలు తీసుకోబడ్డాయో, ఆ జిల్లాలో అదే పని చేశాడు పద్మనాభం.
అంతే! రెండే రెండు వారాల్లో వాళ్ళ జిల్లా కోవిడ్ రేఖలోని గూనిని పోగొట్టి, ఇంచుమించు సరళ రేఖలా తయారు చేశాడు. ఇంకేముంది, మరి కొద్ది రోజుల్లో రాష్ట్రనికే కోవిడ్ నివారణాధికారిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ మహమ్మారిని పోగొట్టేది మందులకన్నా వ్యాధి నిరోధక శక్తి అని తనకి తెలుసు కనుక మంచి నాణ్యత ఉన్న మందులు తెప్పించి పేదలకి, శక్తి హీనులకి ఇప్పించాడు. డాక్టర్లకి మంచి పిపిఈలు కొనిపించాడు.
ప్రజల్లో క్రమశిక్షణ అలవరచి, సామాజిక ఎడం పాటించడంలో రాష్ట్రం ఉన్నతంగా ఉండేటట్టు చూసుకున్నాడు. 2021వ సంవత్సరంలో ‘ఉత్తమ కోవిడ్ నిరోధకాధికారి’ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. అనుకోకుండా ఓ రెండేళ్ళ క్రితం తనకు వచ్చిన ‘త్యాగ’పు ఆలోచన గిర్తొచ్చి, తన ముఖం మీద చిరునవ్వు తెచ్చిపెట్టింది.
గురువు గారు చెప్పిన మాటలు అప్పుడు అర్థమైనట్టున్నా, దేవుడు తన ద్వారా తలపెట్టిన సత్కార్యాలకి అడ్డు తగులకూడదని గుర్తించిన పద్మనాభం, ఎన్ని కష్టములెదురైనను, చిరునవ్వుతోనూ, నిజాయితీతోను ఉద్యోగమును చేయుచూ ఆనందముగా బ్రతుకనెంచి, తన జన్మను సార్థకము చేసికొనెను.
************
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,353
Threads: 0
Likes Received: 6,812 in 5,171 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
Posts: 1,665
Threads: 3
Likes Received: 2,353 in 1,192 posts
Likes Given: 3,182
Joined: Nov 2018
Reputation:
46
పద్మనాభానికి మంచి గురువుగారు దొరకడం అతని అదృష్టం...
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
అవాంఛిత శిశువు
అంగర వెంకట శివ ప్రసాదరావు
భార్య నిర్మల చెప్పిన విషయం విని ఆనందపడకపోగా కసురుకున్నాడు కార్తికేయ.
“ఇది ఎలా జరిగింది?” అడిగామెని.
“నన్నడుగుతారేం.. మీకు తెలీదా?” ఎదురు ప్రశ్న వేసిందామె.
“అదే.. ఋతువని నీకు తెలుసా?” అడిగాడు.
“నాకు తెలుసు... మీకు అలాగని ఎలా చెప్పను? ఇప్పుడొద్దంటే మీరు వింటారా?” నిలదీసి అడిగిందామె.
“విపులంగా చెప్తే అర్ధం చేసుకునేవాణ్ణిగా... ఎందుకొద్దన్నావో నాకెలా తెలుస్తుంది?” అన్నాడు తన తప్పు కాదని చెప్పటానికి ప్రయత్నిస్తూ.
“సరే.. ఇప్పుడేం చేద్దాం? ఈ కరువు కాలంలో ఒకర్ని పోషించటమే కష్టంగా వుంది. ఇప్పుడే మనకిద్దరున్నారు. మరొకరా?” అంది.
అది సమస్య కాదు.. నేను ఆలోచిస్తుంది మరొకటుంది” అన్నాడు.
“ఏవిటది?” అడిగిందామె.
“చెప్పినా నీకు అర్ధం కాదులే.. నేనే ఏదో ఒకటి అలోచిస్తాను”.
“అదేదో నాకూ చెప్పొచ్చుగా.. అసలు మన సమస్య .. అర్ధికమా? మరేదేనా?” అడిగిందామె.
“రెండూనూ..” అన్నాడతడు ఏదో ఆలోచిస్తూ..
“ఆ రెండోదేది?” రెట్టించి అడిగింది.
“చెప్పాగా.. చెప్పినా నీకు అర్ధం కాదని. ముందు మనం డాక్టరు దగ్గరకు వెళదాం, మరోసారి నిర్ధారణ చేసుకోవటానికి. అవసరమైతే ఆవిడ్నే ఏదో మార్గం చెప్పమని అడుగుదాం” అన్నాడతడు.
“నేను కూడా చదువుకున్నదానినే అన్న విషయం మర్చిపోతున్నారు. నాకూ తెలివుంది. మీలా ఉద్యోగం చెయ్యడం లేదు గానీ అవసరం వస్తే నేనూ మీలా సంపాదించగలను. అంతకంటే ఎక్కువగా” అందామె.
ఆ మాట విన్న తరవాత అతనికి కోపం వచ్చింది. కానీ పెళ్ళినాటి ప్రమాణాలు మర్చిపోయి, రెచ్చిపోయి యుద్ధానికి దిగే వ్యక్తి కాదతడు. ఆమె ఒక మాట తూలిందని తనూ అంటే అక్కడ నిజంగానే యుద్ధం మొదలవుతుంది. ఆ భార్యభర్తల మధ్య వున్న సఖ్యత చెడిపోతుంది. అందుకే తనేం అనకుండా మిన్నకుండిపోయాడు. సమస్యకి పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాడు.
“పోనీ గర్భస్రావం చేయిస్తే...” అడిగాడు.
“విషయం చెప్పకుండా.. ఎందుకలా తెగ ఆలోచిస్తారు?” అందామె తన తొందరపాటు మాటలకి తనలో తనే నొచ్చుకుంటూ.
అప్పుడు చెప్పాడతడు అసలు విషయం. ఆమె అంతా విని “ఓస్.. ఇంతేనా.. దానికోసం అంతలా బాధ పడిపోవాలా..?” అందామె.
“నీకు అంతేనా అనిపిస్తుంది. నా కెరీర్ దెబ్బతింటుంది. ముందు డాక్టర్ దగ్గరకెళదాం పద”.
“అందుకు నేనొప్పుకోను”.
“ఆవిడ దగ్గరకెళ్లాక ఆలోచిద్దాం ఏం చేస్తే బావుంటుందో.. మనలో మనం దెబ్బలాడుకోవడం ఎందుకు?” అని ఆమెని డాక్టర్ దగ్గరకి బైల్దేరదీశాడు.
డాక్టర్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారించింది.
“అది సంతోషకరమైన విషయమేకదా?” అంది డాక్టర్.
“అది ఒకప్పుడు. కానీ మాకు ఇప్పుడది సంతోషకరమైన విషయం కాదు డాక్టర్.. మాకిప్పటికే ఇద్దరు పిల్లలున్నారు” అన్నాడతడు డాక్టర్‌తో.
“మరో పిల్లని మీరు పోషించలేరా?” అడిగింది డాక్టర్.
“అది కాదు మా సమస్య డాక్టర్.. పోనీ గర్భస్రావం చేసేస్తే... మరోలా అనుకోకండి ఇలా అంటున్నందుకు” అన్నాడు.
“మీరిద్దరూ వద్దనుకుంటే అలాగే చేసెయ్యవచ్చు. కానీ ఆమె పరిస్థితికూడా మనం ఆలోచించాలి. ఆమె ఇప్పుడు చాలా నీరసంగా వుంది. ఇప్పుడు కానీ గర్భస్రావం చేస్తే ఆమెకే ప్రమాదం” అంది డాక్టర్.
“మరిప్పుడెలా?” .
“మీరు మరో శిశువు వద్దనుకున్నప్పుడు ముందే జాగర్త పడవలసింది. మీరిద్దరూ చదువుకున్నవాళ్ళే.. దానికి ఎన్నో పద్ధతులున్నాయిగా.. అసలు మీ సమస్య ఏమిటి? అది చెప్పండి” అంది డాక్టర్.
“నేనో కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. అక్కడ ఇద్దరు పిల్లల్తో నేను వేసెక్టమీ చేయించుకుంటే నాకు రెండు ఇంక్రిమెంట్లతో సహా వెంటనే ప్రమోషన్ కూడా ఇస్తారు.. అది నా కెరీర్‌కి ఎంతో ఉపయోగపడుతుంది డాక్టర్” విషయం నెమ్మదిగా చెప్పాడు.
“మరలాంటప్పుడు రెండో పిల్ల పుట్టగానే మీరు వేసక్టమీ చేయించుకోలేకపోయారా?” అంది డాక్టర్.
“నేనప్పుడు ఆఫీసు పని మీద ఫారిన్ వెళ్ళాను డాక్టర్.. వచ్చాక చేయించుకోవచ్చులే అని బద్ధకించాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు.
“మీ కంపెనీ నియమాల కాయితం నాకోమారు చూపించగలరా?” అడిగింది డాక్టర్.
“తప్పకుండా డాక్టర్.. అయినా ఎందుకది?” అడిగాడు.
“అందులో ఏదేనా మార్గం కనిపించవొచ్చేమో చూడాలి” అంది డాక్టర్.
ఆ మర్నాడు అతడు తమ కంపెనీ నియమాల కాయితం తీసుకొచ్చి డాక్టర్కిచ్చాడు. ఆమె ఆ కాయితం కూలంకషంగా చదివింది.
“మీరు వేసెక్టమీ చేయించుకునే నాటికి ఇద్దరు పిల్లలని సర్టిఫికెట్టు కావాలి.. అంతేగా” అని అడిగింది డాక్టర్.
“అవును డాక్టర్. కానీ.. నా భార్య ఇప్పటికే గర్భిణి కదా?” అని సందేహం వెలిబుచ్చాడు.
“మీకెందుకు. నేను మీకు సర్టిఫికెట్ ఇస్తాగా.. దాంతో మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ ఖాయం” అంది నవ్వుతూ.
ఆ మర్నాడు వేసక్టమీ చేయించుకున్నాడు కార్తికేయ ఆమె ఆస్పత్రిలోనే. ఆమె అతను వేసక్టమీ చేయించుకున్నటు, ఆ తేదీకి ఆయనకి ఇద్దరు సజీవ పిల్లలున్నట్లు సర్టిఫికెట్టు ఇచ్చింది.
“మరి నా భార్య గర్భిణి కద డాక్టర్..” అడిగాడు.
“మీరు వేసక్టమీ చేయించుకున్నప్పుడు మీకు ‘టూ లివింగ్ చిల్డ్రన్’. ఆమె గర్భంలో వున్నది లెక్కలోకి రాదు” అంది నవ్వుతూ.
కార్తికేయకి రెండు ఇంక్రిమెంట్లు, ప్రమోషను యిచ్చారు ఆఫీసు వాళ్ళు. అతను ఆఫీసంతటికీ స్వీట్లు పంచాడు. తొమ్మిది నెలల తరవాత కొడుకు పుట్టాడని మళ్ళీ స్వీట్లు పంచాడు కార్తికేయ ఆఫీసులో.
ఆ కంపెనీ నిర్వహణ అధికారులు తమ రూల్స్ మార్చుకున్నారు ఆ దెబ్బతో.
--సమాప్తం--
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,353
Threads: 0
Likes Received: 6,812 in 5,171 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
Posts: 1,665
Threads: 3
Likes Received: 2,353 in 1,192 posts
Likes Given: 3,182
Joined: Nov 2018
Reputation:
46
బావుంది...ఆ డాక్టర్, డాక్టర్ కాక లాయర్ అయ్యుంటే సూపరుండేది క్లాజులతో ఆడేసుకునేది
: :ఉదయ్
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
అచ్చిరాని అతితెలివి
రచనః తిరుమలశ్రీ
జాకీ ఓ ర్యాగ్ పిక్కర్. పదిహేడేళ్ళుంటాయి. పొడవుగా, పీలగా ఉంటాడు. కాంప్లెక్స్ ల నుండి చెత్త కలెక్ట్ చేసుకుని బండిలో తీసుకువెళ్ళే రజని వాడి గాళ్ ఫ్రెండ్. జాకీకి రజని అంటే పిచ్చిప్రేమ. తాను కోరింది ఇవ్వకపోతే ఊరుకోదామె. రోజుల తరబడి వాడితో మాట్లాడడం మానేస్తుంది.
వారం రోజుల్లో వారి అభిమాన నటుల సినిమాలు – ‘అల వైకుంఠపురములో...’, ‘సరిలేరు నీకెవ్వరు’ - ఒకేసారి విడుదలకాబోతున్నాయి. వాటికి తీసుకువెళ్ళమని అడిగింది రజని. పాప్ కార్న్ తింటూ సినిమా చూడడమంటే ఇష్టం ఆమెకు. జాకీ దగ్గర డబ్బులు లేవు.
ఆరోజు నాచారంలో చెత్త ఏరుతున్నాడేకానీ వాడి మనసంతా చికాకుగా ఉంది. ఎలాగోలాగున డబ్బులు సంపాదించాలి. రజనిని సినిమాలకు తీసుకువెళ్ళాలి. లేకపోతే అది తనతో పోట్లాడి విడిపోతుందేమోనన్న భయం.
అదిగో, అప్పుడే…దొరికింది జాకీకి ఆ మనీపర్స్. ఎన్టీయార్ గార్డెన్స్ దగ్గర పేవ్ మెంట్ మీద!
ఆశతో ఆత్రుతగా పర్స్ ను తెరచి చూసిన వాడికి నిరుత్సాహమే కలిగింది. అందులో వందరూపాయల కంటే ఎక్కువ లేవు. పర్స్ విండోలో చేతిరాతతో తెలుగులో ఓ చీటీ ఉంది. జాకీకి తెలుగు చదవడం వచ్చును. అది ఓ ఇంటి చిరునామా. లోపల ఓ ‘గోద్రెజ్’ తాళపుచెవి కూడా కనిపించింది. ఆ చిరునామా ఆ పర్స్ యొక్క యజమానిదయివుంటుందనీ, తాళపుచెవి అతని ఇంటిదయివుంటుందనీ అనిపించింది.
డబ్బులు జేబులో వేసుకుని పర్స్ ని విసిరేయబోయాడు. అంతలోనే బుర్రలో లైట్ వెలగడంతో ఆగిపోయాడు. వాడి మెదడు చురుకుగా పనిచేయనారంభించింది…సాధారణంగా ఎవరూ తాళపుచెవిని అలా పర్స్ లో పెట్టుకుని తిరగరు. బహుశా ఆ వ్యక్తి ఒంటరిగాడయి వుండొచ్చుననిపించింది. ఆ తాళపుచెవిని ట్రై చేస్తేనో? సినిమాకి సరిపడా డబ్బులు దొరకవచ్చును...ఎ.టి.ఎమ్. కార్డ్ ‘పిన్’ తో సహా దొరికినంతగా సంబరపడిపోయాడు.
అంతలోనే భయం వేసింది వాడికి. ఎప్పుడూ దొంగతనం చేయలేదు తాను. కానీ రజని గుర్తుకు రావడంతో భయంపీక నొక్కి, ధైర్యం పుంజుకుని…ఆ చిరునామాని మరోసారి వీక్షించాడు. నాచారంలోని హెచ్.ఎమ్.టి. నగర్ లోనిదది…ఆ కాగితాన్ని, తాళపుచెవినీ తీసి జేబులో వేసుకుని మనీపర్స్ ను విసిరేసాడు. భుజాన ఉన్న గోనెసంచిని డస్ట్ బిన్ వెనుక దాచి, ఆ కాలనీ వైపు నడిచాడు.
అప్పుడు సమయం ఉదయం పది గంటలు దాటి పది నిముషాలు అయింది…
#
హెచ్.ఎమ్.టి. నగర్ లోపలికి వెళితే కాలనీకి ఎడమవైపు చివరగావున్న అపార్ట్మెంట్స్ కు కాస్త దూరంగా ఉంది ఆ చిరునామా. ఓ పాతకాలపు పెంకుటిల్లు. ఓ పక్క ఏదో షెడ్డూ, రెండో పక్క అటువంటిదే ఓ చిన్న ఇల్లూ ఉన్నాయి.
తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ, చెత్త ఏరుతున్నట్టు నటిస్తూ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నాడు జాకీ. వీధి తలుపుకు ఉన్న గోద్రెజ్ తాళంకప్పను చూడగానే వాడి కన్నులు మెరిసాయి. జేబులోంచి తాళపుచెవిని తీసి కప్పలో దూర్చి రెండు త్రిప్పులు త్రిప్పేసరికి తాళం తెరచుకుంది. లోపల ప్రవేశించి, తలుపు మూసేసాడు.
లోపల ఓ హాలు, రెండు గదులు, కిచెను, బాత్ రూమూ ఉన్నాయి. హాల్లో కేన్ సోఫాసెట్టు, రెండు ప్లాస్టిక్ చెయిర్సు, ఓ వుడెన్ స్టూలు, టీవీ, చిన్న డైనింగ్ టేబుల్, వగైరాలు ఉన్నాయి. కిచెన్ తప్ప గదులు రెండూ మూసివున్నాయి.
ఓ గదిలో ప్రవేశించాడు జాకీ. అందులో ఓ సింగిల్ కాట్, రైటింగ్ టేబుల్, కుర్చీ, ఓ స్టీలు కప్ బోర్డ్, ఓ చెక్క బీరువా, బట్టల స్టాండ్ ఉన్నాయి. చెక్కబీరువాలో ఆడ, మగ దుస్తులు ఉన్నాయి…స్టీల్ బీరువా లాక్ చేసివుంది. అందులో డబ్బు, నగలూ ఉంటాయని ఊహించాడు. దాన్ని తెరవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. తాళం పగులగొడితే ఆ చప్పుడుకు ఎవరైనా వస్తారేమోనని భయం వేసింది. కీహోల్ లో పెట్టి త్రిప్పేందుకు షార్ప్ పనిముట్టు ఏదైనా కనిపిస్తుందేమోనని గదిలోను, హాల్లోనూ, కిచెన్ లోనూ వెదికాడు. ఏదీ కనిపించలేదు. ఫ్రిజ్ మీదున్న సెల్ ఫోన్ కంటపడడంతో దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు.
రెండో గది తలుపు తెరచిన జాకీ ఉలిక్కిపడ్డాడు…గది మధ్యగా ఉన్న డబుల్ కాట్ బెడ్ మీద పడుకుని ఉంది ఓ యువతి!
చటుక్కున తలుపు వెనుక నక్కాడు వాడు. ఆమెలో కదలిక కనిపించకపోయేసరికి కొన్ని నిముషాల తరువాత లేచి మెల్లగా ఆమెను సమీపించాడు. నిద్రపోతోందనుకుని ఆమె పైకి వంగి పరీక్షగా చూసాడు.
వెల్లకిలా పడుకునివుందామె. కనుగ్రుడ్లు తెరచుకుని నిశ్చలంగా ఇంటి పైకప్పునే చూస్తున్నాయి. నాలుక బైటకు పొడుచుకువచ్చింది…ఏదో అనుమానం పొడసూపడంతో భయపడుతూనే ఆమె ముక్కు దగ్గర వ్రేలు పెట్టి చూసాడు. శ్వాస ఆడడంలేదు. ఆ యువతి చచ్చిపోయింది…!
హఠాత్తుగా భయం సునామీలా క్రమ్ముకుంది వాణ్ణి. ‘డబ్బుల మాట దేవుడెరుగు! ఎవరూ రాకముందే అక్కడ నుండి బైటపడాలి. లేకపోతే ఆమె చావు నా మెడకు చుట్టుకోవచ్చు…’ అనుకున్నాడు. అంతలోనే ఎక్కడి నుండో సెక్యూరిటీ అధికారి సైరన్ వినిపించింది. వాడిలో కంగారు హెచ్చింది. గుమ్మం వైపు పరుగెత్తి వీధి తలుపు తెరచాడు. గుమ్మంలో – సెక్యూరిటీ ఆఫీసర్లు…!!
#
హతురాలికి పాతికేళ్ళుంటాయి. పేరు అంజలి. చామనచాయ, సాధారణ పొడవు. నైటీలో ఉంది.
కనుగ్రుడ్లు తెరచుకుని, నాలుక బైటకు వచ్చి భయంకరంగా ఉంది. పీక పిసికి చంపబడ్డట్టు ఉబ్బిన మెడను చూస్తే అర్థమయిపోతోంది. మృతురాలు హంతకుడితో పెనగులాడిన సూచనలేవీ కనిపించలేదు.
స్నిఫ్ఫర్ డాగ్ పడగ్గదిలోని అంజలి శవాన్ని వాసన చూసి, అక్కడ నుండి నేలంతా వాసన చూసుకుంటూ హాల్లోంచి దొడ్డివైపు వెళ్ళి వెనుక గుమ్మం వద్ద నిలుచుంది. దగ్గరగా మూసియున్న ఆ తలుపును తెరవగానే బైటకు పరుగెత్తింది. ఇంటి పక్కగా వీధిలోకి దారితీసింది. దూరంగా ఉన్న అపార్ట్మెంట్స్ ఎదుటనున్న పేవ్ మెంట్ దగ్గరకు వెళ్ళి ఆగిపోయింది.
హంతకుడు హత్యచేసి దొడ్డిదారి గుండా వీధిలో ప్రవేశించి రోడ్ మీద పార్క్ చేసిన వాహనంలో పరారయివుంటాడని భావించారు సెక్యూరిటీ ఆఫీసర్లు. అక్కడ ఇసుకలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆనవాళ్ళను బట్టి అది ద్విచక్రవాహనం అయ్యుంటుందనుకున్నారు.
హతురాలి భర్త కరుణాకర్ ఇ.సి.ఎల్. క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఓ కెమికల్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. సెక్యూరిటీ ఆఫీసర్ల కబురు అందుకుని పరుగెత్తుకొచ్చాడు.
కరుణాకర్ వయసు ముప్పై పైనే ఉంటుంది. అయిదడుగుల ఆరంగుళాల దృఢకాయం. ఫెయిర్ గా హ్యాండ్సమ్ గా ఉంటాడు. “స్నేహితురాలికి అబార్షన్ అయిందని తెలిసి మూడురోజుల క్రితం వరంగల్ వెళ్ళింది నా భార్య. ఉదయం ఇంటికి తాళంవేసి ఏడున్నరకు ఆఫీసుకు వెళ్లిపోయాను నేను. అంజలి ఇవాళ సాయంత్రానికి వస్తానని చెప్పింది. ఎప్పుడు తిరిగివచ్చిందో, ఇలా దుర్మరణం పాలయిందంటే నమ్మశక్యం కాకుండా ఉంది…” అంటూ భోరుమన్నాడు అతను.
కరుణాకర్, అంజలిల వివాహమయి మూడేళ్ళయింది. అప్పుడే సంతానం వద్దనుకున్నందున పిల్లలు లేరు. అయితే, ఆమధ్యే నిర్ణయించుకున్నారు నట్టింట్లో ఓ చంటిబిడ్డ పారాడుతుంటే బాగుంటుందని. ఆ ప్రయత్నంలో వారు ఉండగానే ఆ దుర్ఘటన జరగడం దురదృష్టకరం.
“ఒకవేళ మీ భార్య అనుకున్న వేళకు ముందే తిరిగివచ్చినట్లైతే మీకు ఫోన్ చేసేది కాదా?” అడిగాడు ఎస్సయ్. చేసేదన్నాడతను. ఆమె వద్ద డూప్లికేట్ ‘కీ’ ఉందని చెప్పాడు.
“మీ భార్య, మీరు అన్యోన్యంగా ఉండేవారా?” ఎస్సయ్ ప్రశ్నకు తలూపాడు కరుణాకర్. తమకు శత్రువులు ఎవరూ లేరన్నాడు. కరుణాకర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాడు ఎస్సయ్.
అప్పటికి వ్రేలిముద్రల నిపుణులు, ఫొటోగ్రఫర్, వీడియోగ్రఫర్ తమ తమ పనులు ముగించడం జరిగింది. శవాన్ని పరీక్షించి మరణసమయాన్ని ఉజ్జాయింపుగా నమోదుచేసి వెళ్ళిపోయాడు డాక్టర్. అనంతరం శవపంచాయితీ జరిపించి, శవాన్ని అటాప్సీ నిమిత్తం ఆంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించాడు ఎస్సయ్.
#
పట్టపగలే ఇంట్లో ఒంటరిగా వున్న ఓ హౌస్ వైఫ్ దారుణంగా హత్యచేయబడిందన్న వార్తతో అట్టుడికిపోయింది ఆ ప్రాంతమంతా. హత్యాప్రదేశంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జాకీ నుండి సెక్యూరిటీ ఆఫీసర్లు ఎంత ప్రయత్నించినా తనకేమీ తెలియదంటూ ఏడుస్తున్నాడు వాడు. కోర్ట్ వాణ్ణి రిమాండ్ కి పంపింది. ఓపక్క కరుణాకర్ రోజూ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చి ‘హంతకుడు దొరికాడా? వాణ్ణి నా చేతులతో గొంతు నులిమి చంపాలని ఉంది” అంటూ సతాయిస్తున్నాడు. ఇంకోపక్క వారం రోజులయినా కేసును సాల్వ్ చేయలేదంటూ స్థానిక రాజకీయనాయకులు సెక్యూరిటీ ఆఫీసర్లను తప్పుపడుతున్నారు. దాంతో అంజలి హత్యకేసు క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించబడింది…
క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శివరామ్ అంజలి హత్యకేసుకు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ ను, ఫోరెన్సిక్ నివేదికలను, కరుణాకర్, జాకీల స్టేట్మెంట్స్ నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు…హత్య ఉదయం గం.9-20 – 9-35 నడుమ జరిగినట్లు నిర్ధారణ అయింది. హతురాలు గొంతునులిమి చంపబడింది. బలం కొంచెం ఎక్కువగానే ఉపయోగింపబడడంవల్ల ఆమె వెంటనే మరణించింది. హతురాలు ప్రతిఘటన సలపకపోవడానికి కారణం – హంతకుడు ఆమెకు తెలిసినవాడయినా అయ్యుండాలి. లేదా, అందుకు అవకాశం లేకపోయి అయినా అయ్యుండాలనిపించింది. ఆమె సెడెటివిలో ఉన్నట్టు కూడా రిపోర్టులో పేర్కొనబడింది. ‘అంటే, ఆమెకు ముందుగా సెడెటివ్ ఇచ్చి, ఆ తరువాత గొంతు నులిమి చంపివుంటారా? అందుకే ఆమె పెనగులాడలేదా?’ అనిపించింది..
తరువాత వ్రేలిముద్రల రిపోర్ట్ చూసాడు శివరామ్…హతురాలి కంఠంపైన వ్రేలిముద్రలేవీ లేవు! హంతకుడు వ్రేలిముద్రలను చెరిపేసైనా ఉండాలి, చేతులకు గ్లవ్స్ ఐనా తొడుక్కునివుండాలనిపించింది. ఆ దంపతుల వ్రేలిముద్రలు ఇంట్లో పలుచోట్ల లభిస్తే – ఇంటితాళంకప్ప పైన, వీధితలుపు మీద, గదుల తలుపుల మీద, చెక్కబీరువా, స్టీల్ కప్ బోర్డ్ ల పైనా, కిచెన్ లోనూ జాకీ వ్రేలిముద్రలు కూడా ఉన్నాయి. అయితే దొడ్డితలుపు పైన దంపతులవి కాక, మరో వ్యక్తి వ్రేలిముద్రలు ఉన్నాయి. ఆ వ్యక్తి జాకీ కాదు. అవి ఎవరివో సెక్యూరిటీ ఆఫీసర్లు కనిపెట్టలేకపోయారు.
ముందుగా కరుణాకర్ ని పిలిపించి విచారించాడు శివరామ్…అంతకుమునుపు ఎస్సయ్ యాదవ్ కి చెప్పిన సంగతులే చెప్పాడు అతను. ఉదయం 9 గంటలకు కంపెనీ చెక్ ఒకటి డిపాజిట్ చేయడానికి నాచారంలోని స్టేట్ బ్యాంక్ కి వెళ్ళినట్టు, ఆఫీసుకు తిరిగివచ్చిన కొంతసేపటికి సెక్యూరిటీ ఆఫీసర్ల నుండి కబురు వచ్చిందనీ, అప్పుడు ఇంచుమించు పదిన్నర అవుతుందనీ చెప్పాడు. అంతేకాదు, ‘జాకీకి ఇంటితాళం ఎలా వచ్చిందని’ సెక్యూరిటీ ఆఫీసర్లు అడిగేంతవరకు, తన మనీపర్స్ పోయిన సంగతి తాను గమనించనేలేదన్నాడు. ఆ ర్యాగ్-పిక్కర్ కుర్రాడు తాను బ్యాంక్ కి వెళ్లినప్పుడు తన పర్స్ కొట్టేసివుంటాడని భావిస్తున్నట్టు చెప్పాడు.
అతని సెల్ ఫోన్ ని ఇవ్వమంటే, “బిజినెస్ నంబర్లన్నీ ఇందులోనే ఉన్నాయి సార్! ఫోన్ లేకపోతే చాలా ప్రోబ్లెమ్ అవుతుంది నాకు” అన్నాడు కరుణాకర్.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
“డజంట్ మేటర్. రెండు రోజులు ఎలాగో మేనేజ్ చేయండి” అంటూ మొబైల్ ని తీసేసుకున్నాడు శివరామ్. అనంతరం అతని వ్యక్తిగత సమాచారాన్ని కొంత రాబట్టుకుని, అవసరమయితే మళ్ళీ పిలుస్తానని చెప్పి పంపేసాడు.
కరుణాకర్ ఇంటి సమీపంలో సిసి కెమేరా లేదు. దూరంగా ఉన్న అపార్ట్మెంట్స్ వద్ద ఉంది. హత్య జరిగిన నాటికి మూడు రోజుల ముందునుండీ దాని ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నాడు పరిశీలించే నిమిత్తం.
తరువాత సబ్ జెయిల్ కి వెళ్ళి, రిమాండ్ లో ఉన్న జాకీని కలుసుకున్నాడు శివరామ్ …భయాందోళనలతో వణికిపోతున్నాడు వాడు. ఇన్స్పెక్టర్ కాళ్ళమీద పడి, తాను ఏ పాపమూ ఎరుగనంటూ భోరుమన్నాడు. వాడిని చూస్తే పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ లోని అంశం గుర్తుకువచ్చింది శివరామ్ కి… వాడి కంటే హతురాలు వయసులో పెద్దదే కాక, బలమైనది కూడాను. చాలీచాలని తిండితో పీలగా ఉండే ఆ కుర్రాడు అంత సులభంగా ఆమె పీకపిసికి చంపగలగడం సాధ్యమా అనిపించింది.
పైగా, జాకీ ఆ ఇంట్లో చొరబడ్డ కాసేపటికే ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి, ‘ఆ ఇంట్లో దొంగలు దూరినట్టు’ చెప్పారు! అందుకే సెక్యూరిటీ ఆఫీసర్లు వెంటనే వచ్చి వాణ్ణి పట్టుకోవడం జరిగింది…పొలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు??
అక్కణ్ణుంచి ఎన్టీయార్ గార్డెన్స్ కి వెళ్ళాడు శివరామ్. జాకీ చెప్పిన ఆనవాళ్లను బట్టి ఆ ప్రాంతమంతా పరిశీలించాడు. డస్ట్ బిన్ వెనుక ఏదో వస్తువు కనిపించడంతో దాన్ని చేతిరుమాలుతో తీసి జేబులో వేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని సిసి కెమేరా యొక్క సంబంధిత తేదీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నాడు... కరుణాకర్ ఆఫీసు, నాచారంలోని ఎస్.బి.ఐ., వద్దనుండే సి.సి. కెమేరాల ఫుటేజెస్ ని కూడా తెప్పించాడు… అలాగే నాచారం సెక్యూరిటీ ఆఫీసర్లు జాకీ నుండి స్వాధీనం చేసుకున్న అంజలి యొక్క సెల్ ఫోన్ ని కూడా తీసుకున్నాడు…
తన ఆఫీసుకు వెళ్ళి ఆ ఫుటేజ్ లను, సెల్ ఫోన్స్ లోని కాల్ డేటాలనూ పరిశీలించేందుకు పూనుకున్నాడు. ఆ లోపున కరుణాకర్ ఫ్యామిలీ గురించి మరిన్ని వివరాలు సేకరించవలసిందిగానూ, జాకీ గురించి వాకబుచేయమనీ, రజనిని కలుసుకుని వాడు చెబుతున్నది ఎంతవరకు నిజమో తెలుసుకోవలసిందిగానూ…తన సిబ్బందికి పురమాయించాడు.
సిసి కెమేరాల ఫుటేజ్ లను – ముఖ్యంగా, అపార్ట్మెంట్స్, ఎన్టీయార్ గార్డెన్స్ దగ్గరవి - పరిశీలిస్తూంటే అతని ఆశ్చర్యానికి అంతులేకుండాపోయింది…అలాగే, అంజలి సెల్ ఫోన్ లో కాల్ డేటాని చెక్ చేయగా, హత్య జరిగిన ముందురోజు సాయంత్రం 5 గంటలకు ఆమె భర్తకు చేసిన కాలే ఆఖరిదని గుర్తించాడు. కరుణాకర్ సెల్ లోని ఓ ‘వన్-వర్డ్’ మెసేజ్ అతన్ని ఆకట్టుకుంది!
తాను స్వయంగా సేకరించిన సాక్ష్యాధారాలకు తన సిబ్బంది తీసుకొచ్చిన సమాచారాన్ని జోడించి నిశితంగా విశ్లేషించిన శివరామ్ పెదవులపైన మందహాసరేఖ విరిసింది…
#
అంజలి హత్యకేసులో హంతకుడు దొరికాడన్న వార్త ప్రాకడంతో…క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ కి ఎలెక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇన్స్ పెక్టర్ శివరామ్, సెక్యూరిటీ అధికారి కమీషనర్, ఏరియా డి.సి.పి. వేదికనలంకరించారు. కరుణాకర్ తోపాటు ఓ యువకుడు, యువతీ కూడా ప్రవేశపెట్టబడ్డారు. కోర్ట్ అనుమతితో జాకీ కూడా అక్కడికి తీసుకురాబడ్డాడు.
ఇన్స్పెక్టర్ శివరామ్ బ్రీఫింగ్ ఆరంభించడంతో నిశ్శబ్దమయిపోయిందక్కడ… ‘కరుణాకర్ కాలేజ్ లో చదువుతుండగా తన క్లాస్ మేట్ హేమను ప్రేమించాడు. వారి మధ్య రిలేషన్ షిప్ కూడా కొనసాగింది. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అంతలోనే వయసులో తనకంటే బాగా పెద్దవాడైన ఓ కోటీశ్వరుడితో పరిచయమయింది హేమకు. అతన్ని పెళ్ళిచేసుకుని ముంబయ్ వెళ్ళిపోయింది. తరువాత కరుణాకర్ కి అంజలితో వివాహమయింది. అయితే, ఆర్నెల్ల క్రితం అనుకోకుండా హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో కరుణాకర్ కి మళ్ళీ కనిపించింది హేమ. ఎవరో స్నేహితుల ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిందట.
హేమ భర్త కొన్ని నెలల క్రితం ఓ ప్లేన్ క్రాష్ లో మరణించాడు. అతని కోట్ల ఆస్తికి ఆమె వారసురాలయింది. డబ్బు, హోదాల కోసం వయసుమళ్ళినవాణ్ణి చేసుకున్నా, కరుణాకర్ మీది ప్రేమను చంపుకోలేదామె. ఇప్పుడు అతను కనిపించడంతో, దగ్గర కావడానికి ప్రయత్నించింది. ఆమె అందం ఆస్థీ ప్రలోభపెట్టడంతో లొంగిపోయాడు కరుణాకర్. మూణ్ణెల్లక్రితం హైదరాబాద్ కు తాత్కాలికంగా మకాం మార్చింది హేమ. విడాకులకు అంజలి ఒప్పుకోదు. కనుక ఆమె అడ్డంకిని శాశ్వతంగా తొలగించుకునేందుకు హేమ తమ్ముడు కార్తీక్ ప్లాన్ వేసాడు. అందుకు కరుణాకర్ ని ఒప్పించింది హేమ.
అంతలో అంజలి స్నేహితురాలిని చూడ్డానికి వరంగల్ వెళ్ళడం జరిగింది. హత్య జరిగిన ముందురోజు సాయంత్రమే తిరిగి వచ్చేసింది. రాత్రులు అప్పుడప్పుడు భోజనం అయ్యాక గోళీసోడా త్రాగడం అలవాటు దంపతులకు. ఆ రోజు రాత్రి భార్య సోడాలో నిద్రమాత్రలు కలిపాడు కరుణాకర్. అందువల్ల మర్నాడు ఎప్పటిలా ఉదయమే లేవలేదామె. కరుణాకర్ లేచి తన పనులు పూర్తిచేసుకుని, ఇంటికి తాళం వేసుకుని ఏడున్నరకల్లా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. పథకం ప్రకారం ఇంటి దొడ్డితలుపు గెడ తీసేవుంచాడు. తొమ్మిది గంటల ప్రాంతంలో కార్తీక్ స్కూటర్ని ఇంటికి ఎడంగా ఉన్న అపార్ట్మెంట్స్ వద్ద పార్క్ చేసి, కాలినడకను వెళ్ళి వెనుకవైపు నుండి ఇంట్లో ప్రవేశించాడు. చేతులకు గ్లవ్స్ తొడుక్కుని ఏమరుపాటుగా ఉన్న అంజలిని పీక పిసికి చంపేసాడు. వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. చంపగానే గ్లవ్స్ ని తీసేయడంవల్ల దొడ్డితలుపు మీద అతని వ్రేలిముద్రలు పడ్డాయి. అపార్ట్మెంట్స్ వద్దనున్న సిసి కెమేరాలో అతని రూపం, స్కూటర్ నంబర్లు నమోదయ్యాయి. అంతేకాదు, అంజలి భర్తకు ఫోన్ చేసిన సమయంలోనే, గ్రీన్ కలర్ ఆటో ఒకటి కరుణాకర్ ఇంటివైపు వెళ్ళినట్టు కూడా ఆ ఫుటేజ్ లో గోచరమవుతోంది. కరుణాకర్ ఫోన్లో రికార్డైన ‘నేను ఇంటికి వచ్చేసానండీ!’ అన్న అంజలి పలుకులు, ఆమె ముందురోజునే తిరిగివచ్చేసిందన్న నిజాన్ని నిరూపిస్తున్నాయి.
అంజలిని చంపి బైటపడగానే కరుణాకర్ కి వాట్సాప్ లో ‘ఓవర్’ అన్న కోడెడ్ మెసేజ్ ని పంపించాడు కార్తీక్. అది వారి సెల్ ఫోన్స్ ని పరిశీలించగా బైటపడింది. ఆ హత్యను ఇతరుల నెత్తిన రుద్దాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే కార్తీక్ మెసేజ్ అందగానే, కంపెనీ చెక్ ని డిపోజిట్ చేసే నెపంతో ఎస్.బి.ఐ. కి వచ్చిన కరుణాకర్, ఎన్టీయార్ గార్డెన్స్ వద్ద పేవ్మెంట్ మీద తన ఇంటి చిరునామా, తాళపుచెవీ ఉన్న మనీపర్సును ఉద్దేశ్యపూర్వకంగానే, ర్యాగ్ పికర్ కంటపడేలా పడేసాడు. అతను ఆశించినట్టే జాకీ దాన్ని తీయడమూ, ఆ ఇంటికి వెళ్ళడమూ జరిగాయి.
అదంతా చాటుగా గమనిస్తూన్న కరుణాకర్, బ్యాంక్ దగ్గర వున్న పబ్లిక్ బూత్ నుండి ‘ఫలానా ఇంట్లో దొంగలు దూరారు’ అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్పాడు. సెక్యూరిటీ ఆఫీసర్లు వెళ్ళి జాకీని పట్టుకోవడమూ, అంజలి హత్యకు వాణ్ణి అనుమానించడమూ జరిగాయి…కరుణాకర్ కంపెనీ ఎదుటనున్న సిసి కెమేరా, ఎస్.బి.ఐ. వద్దనున్న కెమేరాల ఫుటేజ్ లు అతని మూవ్ మెంట్స్ ను తెలిపితే…ఎన్టీయార్ గార్డెన్స్ వద్దనున్న కెమేరా, అతను మనీపర్సును జేబులోంచి తీసి పేవ్మెంట్ పైన పడేయడము, రోడ్ కు అవతలి వైపున నిలుచుని జాకీ పర్స్ తీయడాన్ని గమనించడమూ, వాణ్ణి అనుసరించి వెళ్ళడమూ నిరూపించింది. తరువాత అతను సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేయడం కూడా బ్యాంక్ వద్దనున్న కెమేరాలో నమోదవడమేకాక, ఫోన్ లోని అతని వాయిస్ ని ఫోరెన్సిక్ టెస్ట్స్ నిర్ధారించాయి. జాకీ విసిరేసిన కరుణాకర్ యొక్క ఖాళీ పర్సు అక్కడే డస్ట్ బిన్ వెనుక దొరికింది నాకు.
పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ ప్రకారం హత్య ఉదయం 9-20 కి 9-35 మధ్య జరిగింది. కార్తీక్ యొక్క మెసేజ్ కరుణాకర్ కి 9-35కి అందింది. అతను పర్సును 9-45 కి పేవ్మెంటుపైన పడేసాడు. 9-55 కి జాకీ దాన్ని తీసాడు. 10-10 కి ఆ ఇంటికి బైలుదేరాడు. కనుక జాకీ కథనం నిజమేననీ, వాడు నిర్దోషియనీ నిరూపితమయింది…క్రైమ్ లో ఉపయోగింపబడ్డ స్కూటర్ యొక్క రెజిస్ట్రేషన్ నంబర్ని ట్రేస్ చేస్తే, అది కార్తీక్ ఫ్రెండ్ దనీ, మూణ్ణెల్లుగా కార్తీక్ దాన్ని వాడుకుంటున్నాడనీ తెలిసింది. ఆ ఫ్రెండ్ ద్వారా కార్తీక్ చిరునామా బైటపడింది. సాక్ష్యాధారాలతో కన్ఫ్రంట్ చేసేసరికి, అంజలిని హత్యచేసింది తానేనని ఒప్పుకోకతప్పలేదు అతను. అందులో పాలుపంచుకున్నందుకు కరుణాకర్, హేమలు కూడా అరెస్ట్ చేయబడ్డారు…తాము చేసిన నేరంలో ఇతరులను ఇరికించాలనుకున్న వారి అతితెలివి అచ్చిరాలేదు…’
ఫొటోగ్రఫర్ల కెమేరా ఫ్లాష్ లు మిరుమిట్లు గొలుపుతూంటే నేరస్థులు తలలు వంచుకున్నారు. జాకీ వదనంలో ఆనందం వెల్లివిరిసింది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,353
Threads: 0
Likes Received: 6,812 in 5,171 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
Posts: 2,271
Threads: 149
Likes Received: 7,525 in 1,496 posts
Likes Given: 4,302
Joined: Nov 2018
Reputation:
566
06-09-2024, 07:02 PM
(This post was last modified: 06-09-2024, 07:04 PM by k3vv3. Edited 2 times in total. Edited 2 times in total.)
జిహ్వచాపల్యం
రచన నీరజ హరి ప్రభల
విశ్వనాథం గారు లెక్చరర్ గా చేసి రిటైరయి భార్య జానకమ్మ తో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎప్పటి నుండో రమ్మంటున్న కొడుకు పిలుపు మేరకు తొలిసారిగా అమెరికాకు పయనమయారు విశ్వనాధం దంపతులు. అక్కడ ఎయిర్ పోర్టుకు కొడుకు రవి, కోడలు సుథ వీళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళారు. స్నాన పాన భోజన కార్యక్రమాలయ్యాక వాళ్ళకోసం తెచ్చిన బట్టలు, వస్తువులు, పచ్చళ్ళు మొ.. వాళ్ళకు ఇచ్చి ప్రయాణ బడలిక తో విశ్రాంతి తీసుకున్నారు విశ్వనాథం దంపతులు.
సుధ ఆ సాయంత్రం అత్తగారికి వంట ఇంటి సరుకులు ఎక్కడ, ఏమున్నాయో చూపించి, స్టవ్, ఒవెన్, ఎలా వాడాలో వివరించింది. వీళ్ళకోసం ఆరోగ్యానికి మంచిదని బ్రౌన్ రైస్ తెప్పించింది సుధ. మరుసటి రోజు ఉదయమే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తిని యథావిధిగా రవి, సుథలు ఆఫీసులకు వెళ్ళారు. జానకమ్మ ఉప్మా చేసి భర్తకు పెట్టి తనూ తిని, వంటచేసే కార్యక్రమంలో పడింది. భోజనాలయ్యాక తెలుగు టీవీ ఛానెల్స్ లో ఏవో ప్రోగ్రామ్ లు చూస్తూ పొద్దు గడిపి సాయంత్రం రవి వాళ్ళు రాగానే వాళ్ళతో కబుర్లలో పడ్డారు.
జెట్ లాగ్ తో రెండు రోజు లు ఇట్టే గడిచాయి. విశ్వనాథం గారికి ఏమీ తోచక, చేసే పని ఏమీ లేక, ఇరుగుపొరుగు మాట్లాడే వాళ్ళు లేక బోర్ కొట్టటం మొదలయింది.
"తన ఊరిలో అయితే సాయంత్రం అరుగుల మీద ఇరుగుపొరుగుతో చేరి పిచ్చాపాటి కబుర్లు, లోకాభి రామాయణం తో హాయిగా గడిపేవాణ్ణి" అనుకోసాగాడు. వీకెండ్స్ కు వీళ్ళని బయటకు తీసుకెళ్లి అమెరికా చూపించేవాళ్ళు రవివాళ్ళు.
రవి, సుధ ఆరోగ్య సూత్రాలు ఎక్కువ పాటిస్తారు. రోజూ కూరగాయల ముక్కలు, బ్రొకోలీ ఆకులు, బ్రెడ్, సూప్స్, సలాడ్స్, పాలు, పళ్ళు, జ్యూస్ లు తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ గా వీళ్ళకు కూడా అదే. జానకమ్మ వంట వీళ్ళిద్దరికే. స్వీట్లు, జంతికలూ, కారప్పూస లాంటి చిరుతిళ్ళు తినటం విశ్వనాథంకు అలవాటు. ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో పంటికింద నలుగుతూ ఉండాలి. ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్, చిరుతిళ్ళు చాటుగా దాచుకుని తినేవాడు. అవి అయిపోయాయి. ఇహ భార్యను పిండి వంటలు చేయమని సణుగుతూనే ఉన్నాడు.
పాపం ఆవిడ కోడలితో చెపితే 'పిండి వంటలు అనారోగ్యము' అని డ్రైఫ్రూట్సు తెప్పించింది సుధ. విశ్వనాథానికి అవి ఏమూలకూ ఆనేవి కావు. జిహ్వ చాపల్యం ఎక్కువ. కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తుంటే అందరూ నిద్రలోకి జారాక నెమ్మదిగా అర్థరాత్రి కిచెన్ లో డబ్బాలు వెతుక్కుని తినేవాడు. భర్త ప్రవర్తనకు జానకమ్మ సిగ్గుతో కుంచించుకు పోతూ కోడలికంట ఎక్కడ పడుతుందో అని భయపడేది.
కిచెన్ లో ఏదో అలికిడి అయితే సుధ కిచెన్ లోకి రాగానే మామగారు డబ్బాలు వెతుక్కుని తింటున్న ద్రృశ్యం కంటబడి ఇంతవయస్సు వచ్చినా ఈయనకు ఇంకా ఈ జిహ్వచాపల్యం ఏమిటి?’ అనుకుని ఆ విషయం మరునాడు రవితో చెప్పింది.
"నాన్నా! పరిమితమయిన డైట్ ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ ఏదన్నా అనారోగ్యం వస్తే మెడికల్ వసతి ఉండదు. ట్రీట్మెంట్ చాలా ఖరీదు. పైగా ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా వెంటనే చూడరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి" అని పెద్ద లెక్చలిచ్చాడు రవి తండ్రికి. అలా చెప్పటం విశ్వనాథానికి అవమానకరంగా అనిపించింది. అప్పుడు ఏమీ అనలేక మిన్నకున్నాడు.
మర్నాడు వాళ్లు ఆఫీసుకి వెళ్ళాక "రాను, రాను అంటే నువ్వే అమెరికా, అమెరికా అంటూ ఎగేసుకుంటూ బయలుదేర దీశావు. నీతో పాటు నన్ను కూడా రమ్మని ప్రాణం తీశావు చూడు, ఇప్పుడేమయ్యిందో, ఇదంతా నీ వలననే" అని భార్య మీద విరుచుకుపడ్డాడు. భార్యే కదా లోకువ.
"బావుంది ఇది మరీ చోద్యం. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు తప్పు మీ వద్ద ఉంచుకుని నన్ను అంటారెందుకు? అయినా రవి చెప్పిన దాంట్లో తప్పేముంది? మీ మంచికే కదా వాడు చెప్పింది. మీ తిండి యావ తగ్గించుకోవచ్చుగా. కోడలి పిల్ల ముందు సిగ్గుతో చస్తున్నాను" అంది జానకమ్మ.
"ఇంక ఇక్కడ ఇలా కడుపు మాడ్చుకుంటూ ఆ బ్రౌన్ రైస్, బ్రెడ్, ఆకులూ, అలాలూ, కీరాలు, డ్రైఫ్రూట్సు తింటూ, మాట్లాడే వాళ్లు లేక ఈ జైలులో ఉండలేను. రవితో ఏదో సాకు చెప్పి టికెట్ మార్చుకుని వెళతాను. నీవు వస్తే రా. లేకపోతే ఇంకా నాలుగు నెలలు ఇక్కడే ఊరేగు" అన్నాడు విశ్వనాథం.
ఒకరోజున రవితో "ఒంట్లో కొంచెం నలతగా ఉంది. ఇంటి మీద బెంగ గా ఉంది. ఇండియాకు వెళ్తామురా" అని రవిని అతికష్టం మీద ఒప్పించి బయలు దేరారు విశ్వనాథం గారు. ఈ ప్రయాణం ఇష్టం లేక పోయినా భర్త వెంట బయలు దేరింది జానకమ్మ.
తన ఊరిని, తన ఇల్లును చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయి ఇల్లంతా చిన్న పిల్లాడిలా తిరిగాడు విశ్వనాథం. వీళ్ళు వచ్చారని గమనించి ప్రక్కింటి పార్వతమ్మ వచ్చి "ఏం వదినా! అమెరికా వెళ్ళి ఆర్నెల్లు ఉంటానని అప్పుడే రెండు నెలలకే వచ్చేశారేం?” అని అడిగింది.
"ఆ ఏం లేదు వదినా! నీకు తెలుసుగా. ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా, మాకెంత ప్రాణమో! ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇంటి మీద బెంగ వచ్చి రవి వాళ్ళను ఒప్పించి బయలుదేరి వచ్చేశాము" అన్న భార్య సమయస్ఫూర్తి మాటలను విని మనసులో మెచ్చుకుంటూ, పేపరు చదువు కుంటున్న విశ్వనాథం గారు నవ్వుతూ, భార్య తన నవ్వును ఎక్కడ పసిగడుతుందోనని గుబురు మీసాల చాటున దాచే ప్రయత్నం జానకమ్మ దృష్టిని దాటిపోలేదు.
"ఎంతైనా మగమహారాజు. భార్యను అంత తేలికగా మెచ్చుకోరు " అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది జానకమ్మ.
.. సమాప్తం ..
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,353
Threads: 0
Likes Received: 6,812 in 5,171 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
|