Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మళ్లీ ప్రేమించాను
#1
మళ్లీ ప్రేమించాను
                       -  మౌనవీణ


నా పేరు అమృత. నేను తల్లిదండ్రుల చాటు ఆడపిల్లని. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటానని అందరూ నన్ను హ్యాపీ అని పిలుస్తారు. 21 సంవత్సరాల వయస్సు... డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. 'ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి.... నా కాళ్ళ మీద నేను నిలబడాలి.... దేనికోసం ఎవరి దగ్గరా చేయి చాచకూడదు....' అని కలలు కనేదాన్ని.
 
 ఇంతలోనే ఒక రోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నేను ఇప్పుడే పెళ్లి వద్దంటే వద్దు అని మొత్తుకొన్నాను. నా ఆశలు ఆశయాలు చెప్పాను. కన్నీళ్లతో బ్రతిమాలాను. అయినా నాన్న వినిపించుకోలేదు. పైగా ఆయన నాకే చెప్పారు. "చూడు హ్యాపీ.... కోరి వచ్చిన సంబంధం.... సమాజంలో మంచి పేరున్న కుటుంబం... నువ్వు ఆ ఇంటి కోడలు అయితే మాకు దిగులే ఉండదు... పైగా వాళ్లే నీ చదువుని కూడా కంటిన్యూ చేస్తా అన్నారు... నీ కలలు ఆశయాలు అన్ని నెరవేర్చుకోవచ్చు కూడా... ఇంకా మాక్కూడా నీ చెల్లిని ఒక్క దాన్ని చూసుకోవడం అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు..." అని నాకు మా కుటుంబ పరిస్థితిని గుర్తు చేస్తూ, ఇదే నా భవిష్యత్తు, అంగీకరించక తప్పదు అని చెప్పకనే చెప్పారు.
 
 నాన్న పూర్తిగా నిర్ణయించేశాక ఇంకేం చేయాలో తోచలేదు. నాకు నా మాట ఎవరు వినరు అని అర్థమైంది. మౌనంగానే ఆ పెళ్లి చూపులకు సిద్ధమయ్యాను.
 
 పెళ్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది చాలా సాంప్రదాయబద్ధమైన కుటుంబం అని. పెళ్లి కొడుకు, అతని తల్లి, తండ్రి తో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు. నన్ను తీసుకెళ్లి వాళ్ల ఎదురుగా కూర్చోపెట్టారు. పెళ్లి కొడుకు పేరు యువరాజ్ అంట. పేరుకు తగ్గట్లుగానే ఉంది మనిషి రూపం కూడా. ఎలాంటి అమ్మాయైనా కలలుకనే రాకుమారుడిలా ఉన్నాడు. నాన్న చెప్పింది నిజమే యువరాజు తల్లి మా ఇంట్లో వాళ్ళతో బాగా కలివిడిగా ఉన్నారు. నాకు వాళ్ళ కుటుంబంలో మంచి స్థానమే ఉంటుందనే నమ్మకం బలపడింది. నేనిప్పుడు ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా సిద్ధమయ్యాను.
 
 కాసేపు మమ్మల్ని మాట్లాడుకోమని ఆ హాల్లోనే వదిలి, మిగిలిన వాళ్ళంతా బయటకు వెళ్లిపోయారు
 
 నేను ఏం మాట్లాడాలి... ఆయన ఏం మాట్లాడుతారు.... నేనేం సమాధానం చెప్పాలి.... అని ఆతురతతోపాటు, కొంత భయం, ఒకింత బిడియం అన్ని ఒకేసారి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి.
 
 కాసేపటికి ఏమనుకున్నారో గాని ఆయనే నన్ను పలకరించారు "నీ పేరు ఏంటి...?" అని. నేను చెప్పాను.
 
 మెల్లగా గొంతు సవరించుకుని ఆయనే మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టారు. "మాది పెద్ద కుటుంబం. మేము పల్లెటూరిలోనే ఉంటాం. ఉద్యోగం కోసం బయట ఉన్నా పండగలు, పబ్బాలు మా ఊర్లోనే జరుపుకుంటాం. పల్లెటూరిలో ఉండటం, ఉమ్మడి కుటుంబంలో గడపడం నీకేమైనా ఇబ్బంది ఉందా..." అని అడిగాడు.
 
 అసలు అందులో ఇబ్బంది పెట్టే విషయం ఏముందో నాకర్థం కాలేదు. "నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ పల్లెటూర్లు, ఆ వాతావరణం, పెద్ద కుటుంబాలు అంటే నాకు చాలా ఇష్టం" అని సమాధానమిచ్చాను.
 
 "ఓకే అయితే..." అని ఆయన లేచి పెద్ద వాళ్ళ దగ్గరకు వెళ్లి పోయారు. ఆయన కూడా నాలాగే మొహమాట పడినట్లున్నారు.... సరిగా మాట్లాడలేకపోయారు.
 
 పెళ్లి నిశ్చయమవడం.... పెళ్లి పనులు మొదలవడం.... నా పెళ్లి..... అన్నీ చకచకా జరిగిపోయాయి.
 
 పెళ్లి చూపుల్లోనే ఆయన రూపాన్ని నా మనసంతా నింపేసుకున్నాను. ఆయనతో నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. పెళ్లి కుదిరిన క్షణం నుండే ఆయనన ప్రేమించాను. పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుండి మనసులోనే ఆయనతో రమించాను. అందమైన ఊహలతో, తీయని కోరికలతో, మనస్సు ఉప్పొంగుతుంటే, అడ్డు వస్తున్న సిగ్గుని ఆనందంగా అనుభవిస్తూ తొలిరేయి గదిలోకి అడుగు పెట్టాను.
 
 తీరా నే వెళ్లేసరికే ఆయన నిద్రపోతూ కనిపించారు. ఒక్కసారిగా గా నా మనసు చివుక్కుమంది. మూడు రాత్రులూ అలాగే నిరాశగా గడిచిపోయాయి. ఎందుకలా జరిగిందో అర్థం కావడం లేదు. ఆయనకు నేను నచ్చలేదా...? ఎవరి బలవంతంతోనైనా నన్ను పెళ్లి చేసుకున్నారా...? ఇప్పుడు నేనేం చేయాలి...? ఎవరితో చెప్పుకోవాలి...? ఏమని చెప్పాలి...? ఇలా రకరకాల ప్రశ్నలతో సతమతమవుతుండగానే కొత్త కాపురం పెట్టడానికి ఆయన ఉద్యోగం చేసే ఊరికి వచ్చేసాను. 'ఇక్కడైనా ఏమైనా మార్పు ఉంటుందా' అని ఎదురు చూడడం తప్ప ఏమి చేయగలను....!
 
 
@@@@@@@@
 
 
 నా పేరు యువరాజ్. నేను పేరుకు తగ్గట్టుగానే ఉంటాను. చాలా ఆనందంగా, సరదాగా గడిచిపోతున్న నా జీవితంలోకి ఉప్పెనలా వచ్చి... నా మనసుని అల్లకల్లోలం చేసి నాలుగేళ్లలో నన్నే నేను మరిచేలా చేసి వెళ్ళిపోయింది ప్రేమ..... ప్రేమ అనే అనుభూతి ఎంత వింతగా ఉంటుందో.... ప్రేమతో సావాసంలో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న పరిసరాలే కాదు మనకి మనం కూడా గుర్తురాము. ప్రేమ తప్ప మరేదీ కనిపించదు... వినిపించదు... నాలుగేళ్లు ఆనందంలో ముంచెత్తిన ప్రేమ నేను పల్లెటూరి బైతునని గేళిచేసింది. విదేశాల్లో స్థిరపడాలని అందుకు తగిన వాడిని చూసుకుని వెళ్ళిపోయింది.
 
 నా మనసు కి పెద్ద దెబ్బ తగిలింది. కోలుకోలేక పోయాను. కోలుకునే ఉద్దేశం, అవకాశం కూడా రాలేదు. కన్న వారికి, ఉన్న ఊరికి దూరంగా నన్ను నేను బిజీగా చేసుకుంటూ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను.
 
 అక్కడ పరిచయం అయ్యాడు శ్రవణ్..... ఆడవాళ్ళ కి దూరంగా ఉండాలి అనుకున్న నేను అతనికి ఆకర్షితుడినయ్యాను. నాకు తగిలిన గాయానికి తను మందు అయ్యాడు.... నా ఒంటరితనానికి తోడయ్యాడు.... నా మనసుకి ఇష్టమైన సఖుడయ్యాడు.... అది తప్పని తెలుసు, ప్రకృతి విరుద్ధమనీ తెలుసు. కానీ ఎందుకో అతని చెలిమిలో ఏమి గుర్తు రాలేదు. ఒకవేళ గుర్తొచ్చినా నేను అతని అనురాగం నుండి బయటపడాలని అనుకోవడం లేదు.
 
 ఇంతలో నా జీవితంలోకి అనుకోని కుదుపు. నాన్న నాకు పెళ్ళి నిశ్చయించారు. అప్పుడే పెళ్లి వద్దన్నాను. "ఎందుకు...? ఎవరినైనా ప్రేమించావా...!?" అని అడిగారు. నా పరిస్థితి ఏమని చెప్పగలను....? చెబితే విని తట్టుకోగలరా....? లేదు కదా? అసలు నేను పెళ్లి చేసుకుంటే నా శ్రవణ్ తట్టుకోగలడా....? నా పట్ల నా ప్రియురాలు చేసిన మోసం నేను శ్రవణ్ కి చేస్తే నా ప్రేమకి విలువెక్కడ...? అలాగని కుటుంబ గౌరవాన్ని మంట గలపగలనా....? ఇలా ఆలోచనలతోనే ఎదురు చెప్పలేక నా శ్రవణ్ అనుమతితో పెళ్లి చూపులకు వెళ్లాను.
 
 అమ్మాయి పేరు అమృత. నవ్వు ముఖం... చారడేసి కళ్ళు... అందానికి నిర్వచనం తనే అని చెప్పాలన్నంత అందంగా ఉంది. తన పెద్ద పెద్ద కళ్ళతోనే నవ్వుతూ చూసింది నన్ను. శ్రావణ్ణి మనసంతా నింపుకున్న నన్ను ఆమె అందం ఆకర్షించ లేకపోయింది. కానీ ఆమెని తిరస్కరించేందుకు ఏ కారణం కనిపించలేదు. ఎందుకంటే నాకు పెళ్లి తప్పదు కదా. ఆడదాన్ని నమ్మడం పూర్తిగా మానేసిన నేను అయిష్టంగానే ఒక ఆడ దానికి నా జీవితంలో చోటు ఇవ్వడానికి అనుమతించాను.
 
 పెళ్లి కూతురిగా ముస్తాబై, ఆనందంగా వచ్చి నా పక్కన కూర్చున్న ఆమెని చూసినప్పుడు మాత్రం ఎందుకో అప్పటి వరకు లేని అపరాధ భావం నాలో తొంగి చూసింది. మనసే లేని నేను వట్టి పెదవులతో పెళ్లి ప్రమాణాలు చేసి, అమృత మెడలో తాళి కట్టాను. పరువు కోసం పరితపించి ఆమె చేయి పట్టుకున్నానే గాని అప్పుడు కూడా తన మీద ఎలాంటి భావము కలగలేదు.
 
 తొలిరేయి ఏర్పాట్లు చూసి నాలో తుఫాను చెలరేగింది. ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ నా శ్రవణే నాకు తోడుగా నిలిచాడు. నా చెలికాడు సలహా తోనే ఆమె కలల రాత్రులను కల్ల చేశాను. తప్పించుకున్నాను అనుకునేంతలో కొత్త కాపురం పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
 
 ఇప్పుడు ఆమెను ఎలా ఫేస్ చేయాలి...? ఆమెకు ఏమని చెప్పాలి...? నిజం ఎంత కాలం దాచగలను....? ఇప్పుడే చెప్పేస్తే తట్టుకోగలదా...? అర్థం చేసుకుని మౌనంగా ఉంటే పర్లేదు కానీ అందరికీ చెప్పేసి గొడవ చేస్తే ఏం చేయాలి...? ఏ గౌరవం కాపాడుకోడానికి పెళ్లి చేసుకున్నానో దానికే ఇప్పుడు భంగం కలుగుతుంది కదా...? నో... నో... అలా జరగకూడదు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. తర్వాత నిదానంగా నచ్చచెప్పవచ్చు అనుకున్నాను.
 
 కొత్తింట్లో గృహప్రవేశం అయ్యాక, ఇల్లు వాకిలి చక్కబెట్టి, మా ఇరువురి తల్లిదండ్రులు చుట్టాలు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ఆరోజు రాత్రి మళ్లీ ఏకాంతం... నన్ను భయపెడుతున్న ఏకాంతం... నేను వద్దనుకునే ఏకాంతం....
 
 లాప్టాప్ లో పని చేసుకుంటున్నట్లు నటిస్తున్న నా దగ్గరకు పాలగ్లాసుతో వచ్చింది అమృత. వచ్చిందే కానీ మొహమాటంగా నన్నే చూస్తూ మౌనంగా నిలబడిన తన చేతిలోని గ్లాస్ తీసుకుని, కూర్చున్నట్లు సైగ చేశాను.
 
 అయినా తను కూర్చోలేదు. నేనే చొరవగా తన చెయ్యి పట్టుకుని లాగి, నా పక్కన కూర్చోబెట్టుకుని "అమృత నువ్వు చదువుకోవాలని, జాబ్ చేయాలని అనుకున్నావట కదా... నాకెలాంటి అభ్యంతరము లేదు. ముందు ఆగిపోయిన నీ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం తెచ్చుకో. అప్పటివరకు మనం ఇక్కడే ఇలాగే మంచి స్నేహితులు గానే ఉందాం. ఇంకా చదువులో ఏమైనా సందేహాలు ఉన్నా కూడా నిస్సందేహంగా నన్ను అడగొచ్చు" అన్నాను నాలో ఉన్న అంతర్మధనం బయటపడకుండా.
 
 
@@@@@@@@@@
 
 
 అలా ఆయన చొరవగా నా చేయి పట్టుకొని లాగగానే, నేను నేరుగా వెళ్లి ఆయనకు గుద్దుకొని, ఆయన పక్కన కూర్చున్నాను. తొలిసారి ఆయన స్పర్శతో నా ఒంట్లోని నరాలన్నీ జివ్వున లాగాయి. మనసు ఏదో తెలియని తీరాల్లో విహరించింది. తర్వాత ఆయన ప్రేమగా నా చదువుకి తోడుంటానని చెప్పడం నా ఆనందాన్ని ఇంకా పెంచింది.
 
 అప్పుడే రసాస్వాదన జరగదని చిన్న నిరాశ ఎదురైనా ఆయనకి నా అభిప్రాయాల మీద ఉన్న విలువ చూసి నా అంత అదృష్టవంతురాలు లేనే లేదని పొంగిపోయాను. ఆయన మీద ఉన్న ప్రేమ రెట్టింపయింది. జన్మ జన్మలకి ఆయన్నే నాకు భర్తగా ఇమ్మని ఆ దేవున్ని మనసులోనే కొన్ని వందల సార్లు వేడుకున్నాను.
 
 ఆయన సాంగత్యంలో, ఆయన చెలిమిలో రెండేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. ఎన్నో కొత్త విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రతి విషయం ఎంతో ఓపికగా చెప్పాడు. అనుకున్నట్లుగానే నేను కల కన్నా ఉద్యోగం కూడా వచ్చేసింది.
 
 ఉద్యోగం వచ్చిన ఆనందంలో, ఇక ఆయనకు పూర్తిగా నేను సొంతం కాబోతున్నాను అని ఆశతో, ఇన్నాళ్ల విరహానికి ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వాలని మందిలోనే కలలుగంటూ ఇంటికి చేరాను. ఆరోజు ఎందుకో అప్పటికే ఆయన ఇంట్లో వున్నారు. ఫోన్లో ఎవరితోనో ప్రేమ కబుర్లు చెబుతున్నారు. ఆయన నన్ను గమనించలేదు. కానీ ఆయన మాటలు విన్న నాకు మాత్రం భూమిలోకి కూరుకు పోయినట్టే అనిపించింది. వెంటనే ఆయన్ని నిలదీద్దాం అనిపించింది.
 
 కానీ ఏమని అడగగలను...? చదువుకోవాలని పుస్తకాలు పట్టుకుని నేనే కదా ఆయనను విస్మరించాను.... నా తప్పుకి ఆయనను ఏమని ప్రశ్నించగలను.... చేజేతులా చిదుముక్కున్న నా కాపురాన్ని ఎలా కట్టుకోగలను.... అని ఏడుస్తూ ఎంతసేపు గడిపానో నాకు తెలియదు.
 
 ఆయనకి నచ్చిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనిపించింది. ఆయనతో ఏమి మాట్లాడాలని అనిపించలేదు. నాలో నుండి నా శరీర భాగాన్ని బలవంతంగా ఎవరో తీస్తున్నట్లు బాధ నొప్పి తో సోఫాలో కూలబడి పోయాను.
 
 కాసేపటికి కళ్లు తెరిచిన నేను నా గదిలో మంచం మీద ఉన్నాను. నా ఎదురుగా ఆయన ఎంతో ఆదుర్దాగా నన్నే చూస్తున్నారు. ముందు ఒక క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని "ఎవరా అమ్మాయి...?" అని అడిగాను.
 
 
@@@@@@@@@
 
 
 తన భవిష్యత్తుకి సాయం చేస్తూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నా స్నేహితులగానే ఉన్నాం. అయితే తనతో ఉన్న ఈ రెండేళ్లలో ఆడవారి మీద నాకున్న ద్వేషం అయితే తొలిగింది కానీ తన మీద ఎలాంటి ఆసక్తి కలగలేదు. నేను పూర్తిగా శ్రవణ్ కి అలవాటు పడిపోయాను.
 
 ఆ రోజు తన ఉద్యోగానికి సంబంధించి రిజల్ట్స్ వస్తాయి అని నేను త్వరగా ఇంటికి వచ్చేసాను. తన ఆనందం లో నేను కూడా భాగస్వామిని అవ్వాలనుకున్నాను. ఇంట్లో తను కనిపించకపోవడంతో శ్రవణ్ కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి బయటకు వచ్చి చూస్తే.....
 
 ఎదురుగా సోఫాలో తను నిద్రపోతూ కనిపించింది. తను అక్కడ పడుకుని నిద్ర పోవడం ఏమిటి.... అయినా అసలు ఎప్పుడు వచ్చింది.... అలసి పోయిందా..... అనుకొని లేపాలని ప్రయత్నిస్తే తనలో ఎలాంటి కదలిక లేదు.
 
 కంగారుగా అనిపించి, తన గదిలోకి తీసుకెళ్లి, పడుకోబెట్టి, నెమ్మదిగా నీళ్లు చల్లి లేపాను. ఏమైందని అడిగాను. ఏ సమాధానం చెప్పలేదు. ఎందుకో బాగా ఏడ్చినట్లు అనిపించింది. కళ్ళు ఉబ్బిపోయి విచార వదనంతో ఉంది. బహుశా ఉద్యోగం రాలేదు అనుకుంటా....
 
 మళ్లీ కదిపాను. "హాస్పిటల్కు వెళదామా" అని. దానికి సమాధానం గా వద్దు అన్నట్లు తలూపి "ఎవరామె....?" అంది దుఃఖంతో బొంగురుబోయిన గొంతుతో. నాకు అప్పుడు అర్థమైంది. నేను శ్రవణ్ తో మాట్లాడటం విని నేనెవరో ప్రియురాలితో మాట్లాడుతున్నాను అనుకుని ఇంత దూరం తెచ్చుకుందని.
 
 నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని గ్రహించాను. నిజమే ఇప్పటికీ నిజం దాస్తే తనని ఎలా దూరంగా ఉంచగలను...? ఏం చెప్పి తప్పించుకో గలను...? ఇంకెన్నాళ్లు నటించగలను...? తను నన్ను అసహ్యించుకున్న పర్వాలేదు ఏమైతే అది జరిగింది అని తనకి గతమంతా చెప్పేసాను. శ్రవణ్ తో నాకున్న అనుబంధం తో సహా....
 
 
@@@@@@@@@@@
 
 
 ఆయన తనకు దూరమైన ప్రేమ గురించి చెప్పినప్పుడు బాధ అనిపించినా..... ఎప్పుడైతే మన కొత్త సహచరుని గురించి చెప్పాడో అప్పుడే నాకు ఆ బాధ స్థానంలో కోపం, అసహ్యం వచ్చి చేరాయి.
 
 అసలు ఇలాంటి వ్యక్తి తో రెండేళ్లు కలిసి ఉన్నాను అని గుర్తుకొచ్చి నా మీద నాకే జాలేసింది. మరి అన్నీ తెలిసి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావ్ అని నిలదీశాను.... గొడవ పడ్డాను.... ఏడ్చాను.... ఆయన నన్ను ఆపే ప్రయత్నం చేయలేదు.
 
 కాసేపు చూసి నేను చెప్పాల్సింది చెప్పేశాను తర్వాత నీ ఇష్టం అన్నట్లు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు.
 
 నా దురదృష్టానికి ఏడ్చుకున్నానే గాని ఎవరితోనూ ఈ విషయం చెప్పాలి అనిపించలేదు. కొత్తగా వచ్చిన ఉద్యోగంలో బిజీబిజీగా గడిపేస్తున్నాను. ఆయనతో మాట్లాడాలని కానీ కనీసం ఆయన వంక చూడాలని కానీ అనిపించలేదు. పొరపాటున ఎప్పుడైనా ఎదురుపడినా ఎందుకో నాకు ఒళ్లంతా పురుగులు పాడినట్లు కంపరంగా అనిపించేది.
 
 నాతోనే నేను ఒంటరిగా, విరక్తిగా బ్రతికేస్తుంటే పరిచయమయ్యాడు వంశీ..... ఎప్పుడు చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ, ఎదుటి వారి బాధలను తన బాధలుగా భావించేవాడు. కేవలం ఒక్క చూపుతోనే ఎదుటి వారు ఆనందంగా ఉన్నారో బాధలో ఉన్నారో తెలుసుకోగలడు.
 
 తను ఎక్కడ ఉంటే అక్కడ మనుషులే కాదు, వాతావరణం, ప్రకృతి కూడా తనకి లొంగిపోయినట్లు అనిపించేది. వాటితో పాటు నేను కూడా..... ఆ కృష్ణుడు బృందావనానికి ఎంత ఆనందాన్ని, అందాన్ని ఇచ్చాడో ఇప్పుడు ఈ వంశీకృష్ణ రూపంలో నాకు అర్థమవుతూ వచ్చింది.
 
 అతని మాటలు.... అతని ప్రేమ.... అతని ఆనందం... అతని సాంగత్యం..... నన్ను ఆకర్షించాయి. వంశీకి కూడా నాలాగే ఉందని అతను నాకు తన ప్రేమను వ్యక్తపరచినప్పుడే తెలిసింది. వంశీ నన్ను ప్రేమించాడనే మాట నన్ను ఆనంద డోలికల్లో విహరింపజేసింది. వెంటనే ఒప్పేసుకుని అతని సొంతం అవ్వాలనుకున్నాను.
 
 కానీ నా గతం, నా వైవాహిక జీవితం గురించి అతనికి చెప్పడం నా ధర్మం అనుకున్నాను. పెళ్లి అయిన విషయం, నా భర్త విషయం వంశీ కి చెప్పేశాను. తను దాన్ని కూడా ఎంతో ఓర్పుగా పాజిటివ్ గానే స్వీకరించాడు. నా చెయ్యి అందుకోవడానికి, నాతో జీవితం పంచుకోవడానికి మనస్ఫూర్తిగా సిద్ధపడ్డాడు.
 
 నాకు కూడా నేను తనతో జీవించడానికి ఎవరి అనుమతి నాకు అవసరం లేదనిపించింది.
 
 ఇంట్లో ఒక ఉత్తరం రాసిపెట్టి, నా బట్టలు, సర్టిఫికెట్లు అన్నీ సర్దుకుని, వెళ్లిపోవడానికి అడుగు బయట పెడుతుండగా ఒక ఫోన్ వచ్చింది. అవతలి మాటలు వినగానే చేతిలోని బ్యాగ్ కింద పడిపోయింది. నా అడుగు ముందుకు పడలేదు. పరుగు పరుగున ఫోన్లో వ్యక్తి చెప్పిన హాస్పిటల్ కి వెళ్లాను.
 
 
@@@@@@@@@@@
 
 
 నేను నిజం చెప్పాక అమృత చూసిన చూపు నన్ను నిలువెల్లా దహించి వేసింది. తన మాటల్లోనూ, తన బాధలను న్యాయం ఉంది. అందుకే నా నోరు మూగబోయింది.
 
 గత రెండేళ్లుగా తన స్నేహం అలవాటైన నేను ఇప్పుడు తన ద్వేషాన్ని భరించలేకపోతున్నాను. నిజమే నా వల్లనే తన జీవితం నీరుగారిపోయింది.... నా వల్లనే తన యవ్వనం అడవి కాచిన వెన్నెల అయింది....
 
 నా తప్పుని నేనే దిద్దుకోవాలి అనుకున్నాను. సమాజంలో నేను చులకనైన పర్వాలేదు.... తను కోల్పోయిన జీవితాన్ని తనకు ఇవ్వాలి అనుకున్నాను. దగ్గరుండి తనకి ఒక మంచి వ్యక్తి తో మళ్ళీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. శ్రవణ్ కూడా నా నిర్ణయాన్ని సమర్థించాడు. మళ్లీ పెళ్ళికి తనని ఒప్పించాలంటే నేనొక్కడినే మాట్లాడేందుకు నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే నేను శ్రవణ్ తో కలిసి మా ఇంటికి బయలుదేరాను.
 
 అదిగో అప్పుడే మళ్ళీ నా జీవితానికి ఇంకో అగాధం ఎదురయింది... అనుకోకుండా మా కారుకి యాక్సిడెంట్ అయింది. నా ప్రాణమైన నా చెలికాడు, నా కళ్ళెదుటే నన్ను మళ్లీ ఒంటరిని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. నాకు కూడా శరీరంలో కొన్నిచోట్ల ఎముకలు విరిగిపోయాయని అర్థమవుతుంది. నా ప్రాణం కూడా పోయేలా ఉంది.
 
 చుట్టూ చేరిన వాళ్ళలో ఎవరో నన్ను, నా శ్రవణ్ పార్థివ దేహాన్ని హాస్పిటల్ కి తరలించారు. నా ఫోన్ తీసుకుని అందులోంచే అమృతకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పినట్లు ఉన్నారు.
 
 ఎమర్జెన్సీగా నన్ను ఆపరేషన్ కోసం తరలిస్తుండగా నా కోసం వెతుక్కుంటూ వచ్చింది అమృత..... నేను చేసిన తప్పుల్ని కూడా క్షమించి మానవత్వంతో ఈ సారి తనే నా చేయి అందుకుంది.
 
 ఇప్పుడు నాకు తనని వదలాలని లేదు. నా వలన తనకి ఎలాంటి సుఖం ఉండదు అని తెలుసు. కానీ నేను ఒంటరిని అవుతానని భయం.... నా స్నేహితురాలిగా తను నాతోనే ఉండాలనే స్వార్థం..... ఆ క్షణంలో పూర్తిగా నన్ను ఆవరించేసాయి.
 
 నా శ్రవణ్ బదులుగా నా ప్రాణం పోయిన బాగుండేది.... కనీసం అమృత జీవితం బాగుపడేది.
 
 
@@@@@@@@@@@@
 
 
 రక్త గాయాలతో ఆయన్ని అలా చూడగానే నా మనసు కరిగిపోయింది. ఆయన నా పట్ల చేసిన తప్పుల స్థానంలో పెళ్లైన నాటి నుండి మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గుర్తొచ్చింది..... ఆయనతో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది.... నా పట్ల ఆయన చూపిన బాధ్యత గుర్తొచ్చింది.....
 
 ఆయన కట్టిన తాళిని తీసేద్దాం అని నేను అనుకోగానే ఆయనకిలా జరిగిందంటే మాంగల్యం లోని మహిమ తెలిసింది... ప్రేమంటే మనకోసం మాత్రమే కాదు, స్వార్థంతో కాదు మనం ప్రేమించిన వాళ్ళలోని లోపాన్ని కూడా ప్రేమించాలని తెలిసింది.....
 
 ఆయన ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని బాధలో ఉండి కూడా, నన్ను చూడగానే, నేను వచ్చాననే ఆనందం స్పష్టంగా కనిపించింది ఆయన కళ్ళలో... ఆయన చెయ్యి పట్టుకోగానే ఎప్పటికీ విడవద్దు అనే అభ్యర్థన తొంగి చూసింది మూతలు పడుతున్న ఆయన కళ్ళలో...
 
 ఆయనను అలా చూసిన క్షణమే నా పంతం చచ్చిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆయన్ని ప్రేమించాలని ఉంది. అవును ఆయనను మళ్ళీ ప్రేమిస్తాను. ఇప్పుడు భార్యల కాదు.... అమ్మలా ప్రేమిస్తాను... ఇక ఎప్పటికీ ఆయన్నే ప్రేమిస్తాను.
 
 నాకు తెలుసు వంశీకి నేను ఆశలు కల్పించానని.... నాకు తెలుసు నేను తనని మోసం చేస్తున్నానని.... నాకు తెలుసు తను నన్ను అర్థం చేసుకోగలడని.... నాకు తెలుసు తను నా నిర్ణయాన్ని గౌరవించగలడని.... నాకు తెలుసు తనకి మంచి భవిష్యత్తు వస్తుందని....
 
 అందుకే ఈసారి బలవంతంగా వంశీని నా మదిలో నుండి.... తన రూపాన్ని నా కళ్ళలో నుండి.... తన నంబర్ ని నా ఫోన్లో నుండి.... తీసేసి
 నా భర్త యువరాజ్ క్షేమంగా, సురక్షితంగా బయటకు రావడం కోసం ప్రేమగా ఎదురు చూస్తున్నాను.
----------సమాప్తం-----------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథ చాల అద్భుతంగా ఉంది  yourock

Thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
వావ్ చాలా అద్బుతంగా ఉంది
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#4
Superb ga vundi..story . excellent
Deepika 
[+] 1 user Likes Deepika's post
Like Reply
#5
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply




Users browsing this thread: